చిత్రలిపి
ధరిత్రికే ధరిత్రివి నీవు !
-మన్నెం శారద
నిజమే నీవు ….
పాతాళానికి తొక్కినప్పుడల్లా
గోడకి కొట్టిన బంతిలా …
ఆకాశానికి తారాజువ్వలా ఎగసేవు ..
అమ్మా అన్నా ..అమ్మవారన్నా
జననీ అన్నా జగదాంబా అన్నా
నీకు ఒరిగిందేమీ లేదు
మనసుకి ఊరట కలిగిందీ లేదు !
గుడిలో పెట్టినా … వంటగదిలో పెట్టినా
నీ మనసు తాళాలు మరొకరి చేతిలోనే ఉంటాయి
కొంగున ముడివేసుకున్నోడు …కొంగు పట్టుకుని తిరిగినోడూ
ఎవరిదన్నా అవకాశవాదమే !
దేవుడనేవాడు ఉండివుంటే ..
.పాపం మంచోడే …కాళ్ళూ చేతులు
మనసూ మమతా
దుఃఖమూ ప్రేమా సంతోషం అన్నీ సమంగానే ఇచ్చాడు
మధ్యలో మనిషికేమాయ్యిందో మాయరోగం
నీ మనసుతో పని లేదన్నాడు
నీ దుఃఖం అక్కరలేదన్నాడు
న్యాయం రంగులు మార్చుకుంటున్నది
ధర్మం దగాపడుతున్నది
నిన్ను ఘోరం గ అవమానించిన వాడికి సతి కావడం కన్నా
సతీసహగమనం వేయిరెట్లు మేలు !
ఎక్కడమారిందీ లోకం !
ఏదీ చైతన్యం !అన్నిరోజులూ నీవేకదా
మరి ఎందుకొకరోజు నీకు ప్రత్యేకం !
ఎపుడు ఆగింది నీ పయనం !
ముళ్ళని ఏరుతూ మున్ముందుకు సాగుతూనేవున్నావు
ధరిత్రికే ధరిత్రివి నీవు !
ధరణిని మోసే మహా శక్తివి నీవు !
*****