జ్ఞాపకాల ఊయలలో-3

-చాగంటి కృష్ణకుమారి

విజయనగరంలో రాజునాన్నగారింట్లో‘ ‘రాజునాన్నగది’కి ఆనుకొనివున్న సావిట్లో  రేడియో వుండేది.  న్యాయపతి రాఘవరావుగారు కామేశ్వరి గార్ల  పిల్లల “ ఆటవిడుపు”  కార్యక్రమానికి “ రారండొయ్ రారండోయ్… పిల్లల్లారా రారండోయ్” పిలుపుని అందుకోవడానికై ఆసావిట్లో మునుముందుగానే అందరూ సమావేశమయ్యేవారు. ఈ రేడియో అన్నయ్యాఅక్కయ్యా  “మొద్దబ్బాయీ , చిట్టిబావా , పొట్టిమరదలూ” తో  కలసి  ఎంత సందడి చేయించే వారో అంతకు పదింతల సందడిని  ఈ రెండు కుటుంబాల పెద్దలు ప్రతీవారం చేసేవారు. ఒకసారి వీళ్ళుచేసిన  సందడి ఇంతా అంతాకాదు ! అదేమిటంటే  ఆరోజు నాపుట్టినరోజు.రేడియో అన్నయ్యా అక్కయ్యలు పుట్టినరోజుపండగ చేసుకొంటున్న కృష్ణకుమారికి  జేజే లు చెప్పమంటె అందరూ జేజేలు చెపతారన్న మాట! అదీసంగతి! ఇటువంటి  పనులు చేయడం  చిన్నక్క  తులసికి సరదా.అప్పటికి ఆమెది కౌమారదశ.ఆకాశవాణికి నాపుట్టినరోజు వివరాలతో ఓ కార్డు  రాసి  పడేసిందన్నమాట! అదీ సంగతి! అలాగే ధుం ధుం గాడి  తొలి పుట్టినరోజునాడు, ఆతరువాత మరికొన్నాళ్లకి  మాతమ్ముని  తొలి పుట్టినరోజున కూడా ఆపసిపిల్లల పేర్లు చెపుతూ , వారిని ఉద్దేశిస్తూ  పలికిన జెజేలను  పెద్దలందరూ వింటూ పరవశించిపోయారో లేక  మరేమయ్యారో  నాకు తెలియదుగానీ  బాగా గోల చేసారని మాత్రం ఇప్పుడు చెప్పగలను.చెప్పానుగా, ఈ సరదాలకి  ముందుగా కార్డులు రాసి చిన్నాక్కే పోస్ట్ చేసేదని! నాకూ, ధుంధుం గాడికీ  మాతమ్ముడికీ  ఫొటో స్టూడియోలో  ఫొటో తీయించినది కూడా తనే! నిలబడ్డం రాని మాతమ్మున్ని అతికష్టం మీద  నేను కూర్చున్న  కుర్చీ కాలు పట్టుకొని ఓ అరసెకను నిలబడేటట్టు  తంటాలు పడ్దారు.కుర్చీకి అటువైపు కాలిదగ్గర ధుం ధుం గాడు ఎంచక్క నిలుచున్నాడు . 

ఆతరువాత కొన్నాళ్ళకి  మేము  పట్టణం నుండి  పల్లెకు  వలసపోవడంవల్ల   రేడియోలో  మొద్దబ్బాయీ, చిట్టిమరదలూ,  పొట్టిబావలకీ, ధుంధుం గాడికీ నేను దూరమయ్యాను.

లచ్చమ్మ పేటకి విజయనగరం నుండి  మా పాలనారాయణ  ఒకరోజు వచ్చాడు . పాలనారాయణ అంటే మాకు మాగేటులోకే గేదెని తీసికొచ్చి పాలు పితికి  పోసేవాడన్నమాట! వారి గేదెలు , వారిల్లు మాఇంటికి  ఓఇంటి దూరంలోనే వుండేవి.ఇతని భార్య పేరు పెద్దమ్మన్న, పెద్దకూతురు పేరు  చిన్నమ్మన్న.వీరు మాఇంటి సభ్యులే అన్నట్టు వ్యవహరించేవారు. సోయయాజులు బాబు గేటులో ఖాళీ స్థలం, ముందు వరండా  అందరిదీ!  ఎందుకో ఎలాగో మరో సందర్భంలొ చాకలి నారాయణ గురించి చెప్పేటప్పుడు  చెపతాను . పెద్దమ్మన్న  కాళ్లకి  బాగా దళసరిగావున్న పెద్ద   వెండి కడియాలతో , దుడ్డైన వెండి  మట్టెలతో  రెండుముక్కుకన్నాల మధ్యనుండీ పైపెదవిమీదదాకా వ్రేలాడుతూ  ఎర్రని పొడి వున్న  బంగారు బులాకీతో జుత్తు పైకెత్తి  ఓప్రక్కగా  ఉత్తరాంద్రావారికి మాత్రమే   ప్రత్యేకమైన కొప్పుతో  ,ఎర్రగా నుదుటినిండా పెద్ద కుంకుమ బొట్టుపెట్టుకొని  మంచికళగా, ఠీవిగా వుండేది. ఆమె కంఠం మూడు వీధులవతలకు కూడా వినిపించేటంత  బిగ్గరగా ఖనీగావుండేది .  తట్టనిండాతౌడు నింపి ,గేదే పెయ్యని గేదెని అదిలిస్తూ  తెల్లగా తోమిన  గుండు గిన్నే లో   నీళ్ళు తీసుకొచ్చేది . గిన్నేని తమాషాగా  గుండ్రంగాతిప్పుతూ ఎంతో నేర్పుతో   పొదుగు మీద నీళ్లు జల్లి  కడిగేది. ఆతరువాత గిన్నేని ఒంపి నీళ్ళులేవని నాకు చూపించాలన్నమాట!మా అమ్మ నీళ్లు అడుగున వుండిపోతాయే! గిన్నెని మంచి వాటం గాతిప్పుతూ  వంపినట్టే చూపెడుతుందనేది. !  మాప్రయోగశాలలో  శాంకవకుప్పె (conical flask)లో ని ద్రవమిశ్రమాన్ని కుప్పెకఠం దగ్గరపట్టుకొని ఈమెలాగే తిప్పుతూ  మిశ్రమాన్ని కలుపుతూ అంశమాపన ప్రయోగాలు (titrations) చేసేవారం. ఎవరి నైపుణాలు వారివి!  కొంతమంది మొఖాలూ, హావభావాలూ కంఠాలూ గుర్తుండిపోయేలావుంటాయి . ఆకోవకి చెందిన నాయురాలు ఈమె!    

పాలనారాయణతో  నన్ను విజయనగరం పంపించారు.నేను ధుం ధుం గాడికోసం, కాంతంపిన్ని, రాజునాన్నలకోసం  బెంగపెట్టు కొన్నానట! నిజమే కావచ్చు . ఎందుకంటె  అక్కడ నేను ఆడుకొనేపిల్లలతో నాకో తమ్ముడు విజయనగరంలొ వున్నాడనీ వాడి పేరు ధుం ధుం అని  తరచూ కబుర్లు   చెపుతూ వుండడం  గుర్తుంది.  

నన్ను రాజునాన్నగారింటికి తీసికొ చ్చి అప్పచెప్పదానికి  రైలుస్టే షన్ కి  వత్తుగా చెవులకిందదాకా వ్రే లాడుతున్న నల్లని గిరజాలజుత్తుగల  నారాయణబాబు వచ్చాడు. ఈయన వేరేవరో కాదు. ‘రుధిరజ్యోతి’   శ్రీరంగం నారాయణబాబు కవి.  స్టేషన్ నుండి  ఇంటికి తీసికొస్తూ  ఉమ్మిరామన్న  కిళ్లి  కొట్టుదగ్గర ఆగి నాకో చాక్ లెట్ కొనిచ్చాడు.  అలా కొనిచ్చి చిక్కులో పడ్డాడు. అదేలాగంటె  రాజునాన్న ఇంటికొచ్చి ఓరోజు నన్ను  అయ్యకోనేరు గట్టుకి  తీసికెళ్లాడు . ఒక పిపర్ మెంట్ పట్టుకొచ్చిచ్చాడు.  అక్కడున్న చప్టా మీద కూర్చున్నాడు . అలాతీసికెళ్లిన  పాపానికి ,ముందొక  చాకెలెట్ కొనిచ్చిన పాపానికి ఆయనని  పాపం   పెద్దచిక్కులోనే  పడేసాను.  పిప్పర్ మెంట్టొద్దు,  ముందు  కొనిచ్చిన  లోపల తీయని ముద్దకూడా వుండె చాకలెట్ కావాలన్నాను. కొంత మారాం చేసినట్టె వున్నాను. అతను కొనివ్వలేదు! అందుకు కవిగారి  ఖాళీ జేబే  కారణమనీ  వేరొండు కాదనీ  ఇప్పుడు  తెలిసిపోయిందిగా!

                                                               

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.