నార్ల సులోచన

-ఎన్.ఇన్నయ్య

ఆంధ్రప్రదేశ్ లో కృష్ణాజిల్లా గ్రామం పెడనగల్లు.  కూచిపూడి గ్రామం చెంతగల యీ వూరుకు చెందిన ఆమె సులోచన.  కీ.శే. జర్నలిస్టు నార్ల వెంకటేశ్వరరావు భార్య. బాల్యదశ దాటగానే, ఆమె తల్లిదండ్రులు సులోచనను నార్ల వెంకటేశ్వరరావుకిచ్చి పెళ్ళి జరిపించారు. అప్పుడే యవ్వనంలో అడుగుపెట్టిన సులోచనకు తొలికాన్పుకు పుట్టిన బాబు చనిపోయాడు.  ఆ తరువాత వరుసగా 8 మంది సంతానం కలిగిన వారు, మద్రాసులో పుట్టి పెరిగారు. అప్పట్లో సుప్రసిద్ధ తెలుగు దినపత్రిక ఆంధ్రప్రభకు నార్ల వెంకటేశ్వరరావు సంపాదకులు.  వారికి కలిగిన తొలి సంతానం పుట్టగానే చనిపోవడంతో సులోచనకు చాలా బాధ కలిగింది. అదే సమయంలో తెనాలి నుండి వెలువడుతున్న జ్యోతి పక్షపత్రిక, ఆలపాటి రవీంద్రనాథ్ సంపాదకత్వాన బహుళ ప్రచారంలో వుండేది.  అందులో నార్ల సంపాదకీయంపై  వ్యాఖ్యానిస్తూ యిది నార్ల సంపాదకీయమా? బొక్క బెరడా? అనే రచన వచ్చింది. నార్ల అది చూచి, నా తొలి సంతానం చనిపోయినప్పుడే యిలా బాధ పెట్టాలా అని బాధపడ్డారు. విషయం తెలిసి ఆలపాటి రవీంద్రనాథ్ మద్రాసు వెళ్ళి నార్ల దంపతులకు క్షమాపణ చెప్పారు. 

ఆ తరువాత సులోచన నార్లగార్లకు 8 మంది పిల్లలు కలగడంతో వారందరూ సులోచన గారి పెంపకంతో చదువుకొని, డాక్టర్లు కావడం అమెరికాలో స్థిరపడడం చకచకా జరిగిపోయింది.

సులోచనకు తమిళం రాకున్నా మద్రాసులో నార్లను జాగ్రత్తగా కాపాడుకుంటూ నిలిచారు. అప్పుడే ఆమెకు నార్ల పుస్తకాలను బిడ్డలవలె కాపాడుకోవడం అలవాటైంది. అది జీవితాంతం కొనసాగగా,  నార్ల చివరలో లైబ్రరీలో కాపురం చేస్తారనే వ్యాఖ్య వచ్చింది. 

హైదరాబాద్ లో 3 అంతస్తుల భవనంలో బాత్ రూంతో సహా అంతటా పుస్తకాల మయంగా వుండేది.  ఒక్కొక్క గదికి నార్ల పేర్లు పెట్టి, శివుడి గది, కృష్ణుడి గది అనేవారు. అక్కడ అన్నీ శివుడి తత్వాన్ని గురించిన గ్రంథాలు వుండేవి. 

సులోచనకు చదువు రాకపోయినా ఏ పుస్తకం ఎక్కడుందో బాగా తెలుసు.  సులోచనా 3వ గదిలో ఎర్ర అట్ట పుస్తకం తీసుకురా అంటే, ఆమె అందించేది. అలా జీవితమంతా నార్ల గ్రంథాలయాన్ని పోషించిన సులోచనకు అదే  ఆస్తిగా యిచ్చి పోయారు నార్ల. 

నార్ల చనిపోయన తరువాత ఆ పుస్తకాలను ఏం చేయాలి అనే విషయం రాగా, జయప్రకాశ్ నారాయణ్ జోక్యం చేసుకుని, సులోచన అనుమతితో ఓపెన్ యూనివర్సిటీకి యిచ్చారు. అక్కడ సురక్షితంగా వుండడం చూచి,  సులోచన సంతృప్తి చెందారు. ఆమె సంతానం అంతా అమెరికాలో స్థిరపడగా తరచు వెళ్ళి చూసి వచ్చేవారు. నార్ల గ్రంథాలయంలో జీవించేవారు. సులోచన ఆతిథ్యంలో సేదతీరేవారని సంజీవదేవ్ అనేవారు. నార్లకోసం సుప్రసిద్ధులు యింటికి వస్తుంటే సులోచన వారికి ఆతిథ్యం సమకూర్చేది.

సంతానం అంతా అమెరికాలో స్థిరపడగా, పుస్తకాలే తన సంపానంగా కాపాడిన సులోచన జీవితం గర్వకారణం.

భర్త చనిపోగానే చిత్తు కాగితాలకు అమ్మినవారు తెలుసు. సులోచన అందుకు భిన్నంగా,  ఆదర్శప్రాయంగా విజ్ఞానాన్ని గౌరవించి, ఆదరించింది.

ఇంతకూ సులోచనగారు కాపాడిన గ్రంథాలు ఎన్ని?  30 వేలు మాత్రమే. అందులో అత్యధిక భాగం ఇంగ్లీషు. సులోచనకు ఇంగ్లీషు రాదు. ఏ గ్రంథం ఎక్కడ వుందో ఆమెకు కొట్టిన పిండి. భర్తతోపాటు, విజ్ఞానంపై ప్రేమాదరణలు అలా పెంచుకున్నారు. 

ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీలో ఆన్ లైన్ లో లభిస్తున్న నార్ల గ్రంథాలు సులోచనగారు నిక్షిప్తం చేసిన ఆస్తి.

*****

Please follow and like us:

One thought on “నార్ల సులోచన”

  1. నార్ల వంటి మేధావులకు సులోచన వంటి జీవన సహచరులు లేకుంటే అంత రాణించి ఉండేవారు కాదేమో!సంసార ఈతి బాధలు పట్టి పీడించేవి కదా!దీనికి భిన్నంగా సోక్రటీసు వంటి మహానుభావులు ఉన్నారనుకోండి.

Leave a Reply

Your email address will not be published.