నా జీవన యానంలో- రెండవభాగం- 20

దగా  – కథానేపధ్యం

-కె.వరలక్ష్మి

 

1988లో మేం శ్రీరామ్ నగర్ లో కొత్త ఇంటి గృహప్రవేశం చేసాం. అప్పటికి ఈ కాలనీలో అక్కడొకటి ఇక్కడొకటి వేళ్ళమీద లెక్క పెట్టేటన్ని ఇళ్ళుండేవి. మా ఇంటి ఎదుట ఒక చిన్న తాటాకిల్లు వుండేది. రోడ్లు చిన్నవి కావడం వలన ఆ ఇంటి వాళ్ళు వాకిట్లో మంచాలేసుకుని పడుకుంటే మా వాకిట్లో పడుకున్నట్టే వుండేది. ఆ ఇంటికి ఆనుకుని దక్షిణంవైపు 500 చదరపు గజాల ఖాళీస్థలం వుండేది. దానికి వాళ్ళు చుట్టూ దడి కట్టి కొన్ని పశువులి, మేకల్ని కట్టేసేవారు. ఓ పెద్ద గడ్డిమేటు కూడా వుండేది. ఆ ఇంటావిడ ఆ స్థలం వాళ్ళదేనని చెప్పేది.

నాలుగేళ్ళ తర్వాత ఒక ఆదివారం నాడు ఓ తల్లి కూతురూ కోనసీమ నుంచి ఆ స్థలాన్ని వెతుక్కుంటూ వచ్చారు. ఎండన పడి వచ్చారేమో నన్ను మంచినీళ్ళు అడిగి మా గుమ్మంలోనే చతికిలపడ్డారు. ఎదురింటివాళ్ళు, వీళ్ళూ ఆ స్థలం మాదంటే మాదని వాదించుకున్నారు. ఎదురింటి వాళ్ళు రిజిస్ట్రేషను కాయితాలు తెచ్చి చూపించారు. కూతురు చదువుకున్నది కావడం వలన కొంత ధీమాగా మాట్లాడుతోంది. తల్లి మాత్రం డీలా పడిపోయి ఏడ్చేస్తోంది. ఇంతకీ సంగతేవిటంటే పదిహేనేళ్ళ క్రితం ఆవిడ భర్త ఈ వూళ్ళో ఎలిమెంటరీ స్కూలు టీచర్‌గా పనిచేసాడట. అప్పట్లో చవకగా వస్తున్న ఆ స్థలాన్ని భార్య పేరున కొన్నాడట. అప్పటికి బడిపంతుళ్ళ జీతాలు చాలా తక్కువ కాబట్టి కూతురు ఎదిగాక ఆ స్థలాన్ని అమ్మి పెళ్ళి చెయ్యాలి అనుకున్నారట. అప్పటికి రిజిస్ట్రేషను ఎవరి పేరున అవుతోందో వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం వుండేది కాదు. ఇప్పట్లో అమ్మేవాళ్ళవీ, కొనేవాళ్ళవీ ఫోటోలు పెట్టే పద్ధతి కూడా లేదు. ఆ లొసుగును వుపయోగించుకుని అప్పట్లో వాళ్ళాయన్తో పరిచయంగా మసలి, ఈ స్థలం కొన్నప్పుడు వెంట వున్న మా ప్రాంతపు మినిస్టరు కారు డ్రైవరొకడు ఒక గోల్ మాల్ వ్యవహారం నడిపి ఆ స్థలాన్ని అమ్మేసుకున్నాడు.

ఈ సంఘటన జరిగేనాటికి అతను వేషం మార్చి మడత నలగని తెల్లబట్టలేసుకుని తిరుగుతూ మినిస్టర్లచేత పనులు చేయించిపెడతానని, వుద్యోగాలేయిస్తానని, సినిమాల్లో వేషాలిప్పిస్తానని జనం దగ్గర డబ్బులు కాజేసి హైదరాబాద్, వూరికీ తిరుగుతూ వుండేవాడు.

కథకు బలం కోసం కొనుక్కున్న వ్యక్తిని డబ్బున్నవాడిగా చూపించడం జరిగింది. ఈ కథలోని రంగారావు కేరెక్టర్ ని నేను స్వయంగా చూసి, ఎరిగి వున్నాను. నిజంగా మేకవన్నెపులే అతను.

ముందేం జరగబోతోందో అప్పటికి తెలియక ఆ కథనలా ముగించి ‘దగా • అని పేరు పెట్టానుకానీ, బాగా చదువుకుని ఏదో వుద్యోగం చేస్తున్న వాళ్ళ అమ్మాయి పట్టుపట్టి కోర్టుకెళ్ళి తమ స్థలాన్ని సాధించుకుంది. అప్పుడు మా ఎదురింటి వాళ్ళు దగా పడ్డారు. వాళ్ళ డబ్బు వాళ్ళకి తిరిగి ఇచ్చెయ్యమన్న కోర్టు మాటని రంగారావు ఖాతరు చెయ్యక అప్పట్లో ఇది నాకు చాలా పెద్ద దగా వ్యవహారంలా కనిపించింది. తర్వాతి కాలంలో భూముల రేట్లు పెరిగాక ఎన్నెన్ని దగా వ్యవహారాలు. వ్యక్తి ఒంటరిగానే కాదు సమూహంగా కూడా ఇలాంటి దగాకోరుల్ని ఏమీ చెయ్యలేక పోతున్నారనడానికి ఓ ఉదాహరణ: హైదరాబాద్లోని మింట్ కాంపౌండులో పనిచేస్తున్న వుద్యోగులంతా కలిసి బవరంపేట విలేజ్ లో ఇళ్ళస్థలాలుగా కొనుక్కున్న కొన్ని ఎకరాల భూమి ఓ రాజకీయనాయకుడు ఆక్రమించుకోవడం. వాళ్ళంతా కలిసి కోర్టుకెళ్ళినా ఇరవై యేళ్ళుగా ఏమీ చెయ్యలేకపోతున్నారు. తమాషా ఏమిటంటే ఆ భూమి ఇప్పటికీ కొనుక్కున్న వాళ్ళ పేరుతోనే వుంది. వాళ్ళ బలప్రయోగాలకి ఝడిసి వీళ్ళు నిస్సహాయంగా చూస్తున్నారు. ఇలాంటి దగాకోరు వ్యవహారాలు ఎన్నెన్నో!

***

దగా

సుబ్బలక్ష్మి గుండెలో కొండ పేలినట్టైంది.

నిలుచున్న మనిషి నిలువునా కుప్పకూలిపోయింది. పెనుగాలికి చిగురుటాకులా కంపించిపోయింది. నలభై ఏళ్ళ జీవితంలోనూ ఆమె అనుభవించిన కష్టాలన్నిటికన్నా ఇదే పెద్ద కష్టం అనిపించి దామెకి. ఇంతవరకు ఏ కష్టానికైనా భర్త అనే మగ తోడొకడుండడంతో ఆ కష్టం తాలుకు బాధని సగం మాత్రమే అనుభవించేదామె. నేనున్నానని ఓదార్చే భర్త పోయాక మొదటిసారి ఒంటరిగా ఎదుర్కోవాల్సిన పెను సమస్య ఇది.

సుబ్బలక్ష్మి కంటివెంట నీటి చుక్క రావడంలేదుకానీ, ఆమె హృదయం మాత్రం వెక్కి వెక్కి ఏడుస్తోంది.

ఒక్కసారిగా మరో పదేళ్ళు మీద పడినట్లైంది.

కొందరి జీవితాలు కష్టాలకీ, కన్నీళ్ళకీ అంకితాలెందుకో.

ఎనిమిది మంది అక్కలకి, ఒక అన్నయ్యకి ఆఖరి చెల్లెలుగా పుట్టిన సుబ్బలక్ష్మి పుట్టింట ఏ ముద్దూ ముచ్చటలకీ నోచుకోలేదు, సరికదా.. కడుపునిండా తిండైనా దొరికేది కాదు. పౌరోహిత్యం చేసే తండ్రి, పుట్టగానే తల్లిని మింగేసిందని సమయం దొరికినప్పుడల్లా సుబ్బలక్ష్మిని తిడుతూ వుండేవాడు. ఊహ తెలియనప్పుడేమోకానీ, ఇంగితం తెలిసాక సుబ్బలక్ష్మి తండ్రి తిట్టినప్పుడల్లా ఇంటి వెనకాల కాలవ గట్టుమీద కూర్చుని కాలువలోకి రాళ్ళు విసురుతూ గొంతెత్తి ఇలా అరుచుకునేది. “పాపం మహానుభావుడు, ఆవిడ బతికుంటే ఈసరికి మరో నలుగుర్ని కనేవాడు. ఆ ఛాన్స్ పోయిందని నామీద కసి”

ఒకసారి ఆ పిచ్చవాగుడంతా వాళ్ళ పెద్దక్క విని వీపుమీద రెండంటించింది.

సుబ్బలక్ష్మి అక్కలందర్ని ఆమె తండ్రి దొరికిన వాడికల్లా ముడి పెట్టేసాడు. ‘కులం వాడైతే చాలు, యాయవారం చేసుకున్నా ఫర్లేదు’ అనుకున్నాడాయన, అదే పద్దతిలో సుబ్బలక్ష్మి పెళ్ళి జరిగిపోయింది.

పదిహేనేళ్ళ వయసున్న ఆమెని ముప్పై అయిదేళ్ళ శంకరం చూసుకోడానికొచ్చినప్పుడు ఆ ఇంట్లోంచి బైటపడితే చాలనుకుంది.

కానీ పెనలోంచి ఎగిరి పొయ్యిలో పడిందని భర్తవెంట అతనింటికి వెళ్తేకానీ అర్ధంకాలేదు.

పుట్టింటివాళ్ళకి పెచ్చులూడిపోయిన ఓ పాత పెంకుటి కొంపైనా వుంది, శంకరానికదీలేదు. అయ్యవారి నట్టిల్లులాంటి ఓ చిన నిట్రాడి పాకలోకి ఆమెని కాపరానికి తీసుకెళ్ళాడు శంకరం. ఒంటిమీది బట్టలు తప్పితే మరో జత లేవతనికి. ఇంట్లో ఓ కంచం, గ్లాసు రెండు సత్తు తపేలాలు తప్ప మరేం లేవు. చింకి చాపపరచి ఆమెని కూర్చోమన్న భర్తని కళ్ళింతంత చేసుకుని నిశితంగా చూసింది సుబ్బలక్ష్మి. అతను అర్ధం అయినట్టు తలదించుకుని భూమిలోకి చూస్తూ కూర్చున్నాడు. కొంతసేపటికి సుబ్బలక్ష్మి లేచి వెళ్ళి అతని తలమీద చెయ్యివేసి నిమిరింది. ఆ కాస్త ఆదరణకే అతను కరిగిపోయి వెక్కి వెక్కి ఏడ్చాడు.

దారిద్ర్యం మనుషుల్నెంతగా క్రుంగదీస్తుందో శంకరాన్ని చూస్తే తెలుస్తుంది. సన్నగా గడకర్రలా సగం వంగిపోయి వున్నాడతను. సగం సగం తెల్లబడిపోయిన వెంట్రుకలు అతన్ని వయసుకన్నా పెద్దవాణ్ణి చేసాయి.

ఆ వూళ్ళో అందరూ అతన్ని శంకరం మేస్టారు అంటారు. నిజానికతనికి ఏ పాఠశాలలోనూ వుద్యోగం లేదు. ఎస్సెల్సీ పాసైనప్పటినుంచీ వుద్యోగార్హత కోల్పోయే వయసువరకూ కాలికి బలపం కట్టుకుని, ఏ చిన్న వుద్యోగమైనా దొరక్కపోతుందా అని తిరిగాడతను. ఆశ నిరాశ కాగా పదిమంది పిల్లలకి ప్రైవేట్లు చెప్పుకుని పొట్టపోసుకోవడం అలవాటు చేసుకున్నాడు.

సుబ్బలక్ష్మి తండ్రికి విచిత్రంగా తగిలాడతను.

బాగా డబ్బున్న అనాధ ప్రేతానికి శవవాహకుడిగా వెళ్ళాడు శంకరం. అప్ప టికి వారం రోజుల్నుంచి టీ నీళ్ళతో గడిపేస్తున్నాడు. పాతిక రూపాయలిస్తారు. కడుపునిండా భోజనం పెడతారని తెలిసి మూడుమైళ్ళకవతలున్న వూరికి నడుచుకుంటూ వెళ్ళాడతను.

శవాన్ని స్మశానానికి మోసుకెళ్ళేసరికి ఇచ్చినట్లయింది. అక్కడున్న చెట్టు మొదట్లో పడి నిద్రపోయాడు. కర్మకాండ కొచ్చిన సుబ్బలక్ష్మి తండ్రి అతన్ని లేపి పిల్చుకెళ్ళాడు.

భోజనాలయ్యాక క్రమంగా అతని వివరాలు కనుక్కున్నాడు. కాస్త వయసు పెద్దదైనా అవివాహితుడు కాబట్టి తన ఆఖరి కూతురికి మొగుడు దొరికినట్టే అనుకున్నాడు.

పెళ్ళి ప్రసక్తి వినగానే శంకరం కంగారుపడిపోయి తల అడ్డంగా వూగించాడు. తను దూరడానికే కంతలేదు మెడకోడోలెందుకన్నాడు. స్వతహాగా మెత్తని వాడైనా పెళ్ళి విషయంలో అతనికి నచ్చచెప్పడానికి ముసలాయనకి తలప్రాణం తోకకొచ్చింది.

అప్పటికి పొద్దువాటారింది. ‘చీకట్లో పొలం గట్లమ్మట పురుగూ పుట్రా వుంటాయి, పొరుగూరికేం వెళ్తావులే’ అని తన ఇంటికి పిల్చుకెళ్ళాడాయన. మధ్యాహ్నం పీకల్దాకా తిన్నదెప్పుడరిగిపోయిందోకానీ, సుబ్బలక్ష్మి వడ్డించిన వేడివేడి అన్నం, తిరగమోత వేసిన చారు, చింతకాయ పచ్చడితో మొహమాట పడుతూనే మారడిగి మరీ తిన్నాడు.

కడుపునిండా తిని, వీధరుగుమీద చల్లగాలిలో పడుకున్న అతనికి మసిబారిన వంటింట్లో కిరసనాయిలు దీపం వెలుతురులో పచ్చగా పసిడి బొమ్మలా మెరిసిపోయిన సుబ్బలక్ష్మి కళ్ళలో కదిలింది. ఎన్నడూ లేని విధంగా ఒళ్ళంతా గిలిగింతలు పెట్టినట్టయింది. ఇన్నేళ్ళ జీవితాన్ని నిరర్ధకంగా గడిపేసినట్టనిపించింది. తనకీ ఒక ఆడతోడుంటే ఇంతకాలం తనెందుకూ పనికిరాని వాడనుకున్నాడు. కానీ, పిలిచి పిల్లనిస్తానని ముసలాయనంతటి వాడన్నాడంటే తనకీ ఓ విలువ వుందన్నమాట. ఎంతయినా మగాడు తను గర్వంతో అతని గుండె పులకరించింది. ఎన్నో ఏళ్ళ తరువాత నిద్ర అతన్ని హాయిగా పలకరించింది.

మరో వారం రోజుల్లో మంచి ముహూర్తానికి సుబ్బలక్ష్మి, శంకరం దంపతులయ్యారు.

ఒక విధంగా శంకరం అదృష్టవంతుడని చెప్పాలి. సుబ్బలక్ష్మి చిన్న పిల్లయినా అతన్ని అర్థం చేసుకుని తల్లిలా ఆదరించింది. ఆమె సాంగత్యంలో శంకరం కష్టాలన్నీ మరచిపోయాడు.

ఆ కాస్త ఇంటినీ అలికి ముగ్గులు పెట్టి అందంగా తీర్చిదిద్దింది. చదరంత వాకిట్లో కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టింది. వున్నదేదో తిని హాయిగా నవ్వుకునేవారు.

సుబ్బలక్ష్మి వచ్చిన వేళా విశేషమో ఏమో శంకరంలో కొంత చురుకుదనం పెరిగి పిల్లలకి పాఠాలు బాగా చెప్పేవాడు. ఆ విషయం తెలిసి అతని దగ్గరకి నలుగురు పిల్లల్ని పంపించడం మొదలుపెట్టారు. క్రమంగా అతను ట్యూషన్లతో బిజీ అయ్యాడు.

పెళ్ళైన మరుసటేడే పండంటి పాపాయిని కన్నది సుబ్బలక్ష్మి. భార్యాభర్తలిద్దరూ కూడబలుక్కుని తమ ఆదాయానికి ఒక్క బిడ్డ చాలనుకున్నారు.

తిండికీ బట్టకీ లోటులేకుండా గడిచిపోతోంది. స్వతహాగా సుబ్బలక్ష్మి పొదుపరి కావడంతో భర్త తన చేతికిచ్చిన డబ్బులోంచి తృణమో పణమో వెనకేస్తూ వుండేది.

పదేళ్ళపాటు అలా కూడబెట్టిన డబ్బుతో వూరవతల ఇళ్ళ స్థలాలమ్ముతున్నారని విని, నాలుగువందల గజాల స్థలం భర్తచేత కొనిపించింది. అప్పటికది పల్లె. పట్నం కాని వూరవడంతో స్థలం చవకగానే వచ్చింది, రెండువేల ఐదువందలకి. భార్య అంత డబ్బు వెనకేసిందని విని మొదట శంకరం ఆశ్చర్యపోయాడు. ఆమె దాచుకున్న డబ్బు కాబట్టి స్థలం ఆమె పేరుతోనే రిజిస్ట్రేషన్ చేయించాడు.

అప్పటికి శంకరానికి నలభై ఐదేళ్ళొచ్చాయి. వయసతన్ని లొంగదీసుకోవడం ప్రారంభించింది. అతని సంపాదన కొంత వెనకబడింది. ఎలాగో ముగ్గురూ కడుపు నింపుకోవడానికి మాత్రం సరిపోయేది.

ఆ సంవత్సరమే సుబ్బలక్ష్మి కూతురు తులసి హైస్కూల్లో ఆరవ తరగతిలో చేరింది. భర్తకి సాయపడే వుద్దేశ్యంతో సుబ్బలక్ష్మి ఎవరో పాత కుట్టుమిషను అమ్మేస్తుంటే నెలనెలా కొంత ఇస్తానని బ్రతిమిలాడి ఆ మిషను తీసుకుంది.

ఎనిమిదో తరగతిలో వుండగా తులసికేదో వింత జబ్బు వచ్చి హాస్పిటల్లో చేర్చాల్సి వచ్చింది. ఆ పిల్లకి విపరీతమైన జ్వరంతో బాటు ఆకలి, నిద్రలేకుండా పోయాయి. తిరిగి కోలుకునే సరికి కొన్ని నెలలు పట్టాయి. అప్పుడు కూడా సుబ్బలక్ష్మి స్థలం అమ్మనివ్వలేదు. ఎలాగో భర్తా తనూ తినో తినకో అమ్మాయికి మందులిప్పించారు.

తన కూతురు పెళ్ళి తన పెళ్ళిలాగా అనామకంగా ఏ సందడి లేకుండా జరగకూడదని ఆవిడ కోరిక. ఆడపిల్ల పెళ్ళంటే ఖర్చుతో కూడుకున్న పనికదా! అందుకే వూరు పెరుగుతూ, వూరితో బాటు స్థలాల రేట్లు కూడా పెరుగుతూ వుంటే సంతోషించేది. స్థలం అమ్మి ఆ డబ్బుతో తన కూతురి పెళ్ళి ఘనంగా చెయ్యాలని సుబ్బలక్ష్మి ఆలోచన.

తులసి స్వతహాగా పెద్ద చురుకైన పిల్లకాదు. చదువులోను అంతే, పదవతరగతి ఫెయిలై చదువుకి స్వస్తి చెప్పింది. తండ్రి పోలికలో పీలగా వుండే ఆ అమ్మాయికి వరుణ్ణి వెదకడం చాలా కష్టమైంది.

పాతికేళ్ళోచ్చాక ఏదో అంతంతమాత్రపు సంబంధం ఒకటి కుదిరింది, పెళ్ళికొడుక్కి కట్నం ఇరవైవేలు.

పాతిక వందలకి కొన్న స్థలం పాతికవేలు పలికింది. మిగిలిన అయిదువేలూ పెళ్ళి ఖర్చులకి వుంటాయి అని సంబరపడ్డారు. సంబరపడినంతసేపు పట్టలేదు. దుఃఖాలు పరంపరగా ముంచుకురావడానికి. అరవై ఏళ్ళ శంకరంగారు కూతురు పెళ్ళి చూడకుండానే గుండె ఆగి మరణించాడు.

ఆ దుఃఖం నుంచి సుబ్బలక్ష్మి ఇంకా కోలుకోలేదు. పులిమీద పుట్రలా ఈ కబురు.

మోకాళ్ళలో తల పెట్టుకుని కడుపులోని ప్రేగులు కదిలిపోయేలా కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది సుబ్బలక్ష్మి,

ఎన్నాళ్ళుగానో ఆమె నిర్మించుకున్న ఆశాసౌధాలు కూలిపోయినట్లనిపిస్తోందామెకి.

తులసి భయపడుతూ తల్లి దగ్గరకొచ్చి పక్కన కూర్చుంది. తండ్రిపోయాక తల్లిని పలకరించడానికి భయపడుతోంది. ఆ అమ్మాయి. మొదట్నుంచీ తండ్రి దగ్గరున్నంత చనువు తల్లి దగ్గరలేదు.

నెమ్మదిగా భుజం మీద చెయ్యేసి “ఏడవకే అమ్మా” అంది జాలిగా.

సుబ్బలక్ష్మి తలపైకెత్తి తదేకంగా రెండునిమిషాల పాటు కూతురి ముఖాన్ని చూసి బావురుమంటూ కావలించుకుంది. “అయిపోయిందే తల్లీ, అంతా అయిపోయిందే నీకు పెళ్ళెలా చేస్తానే ఇక ఈ జన్మలో..”

“ఏమైందమ్మా?” అంది తులసి తనుకూడా ఏడుస్తూ.

తులసి ఏడుపు చూసాక కొంత నిభాయించుకుంది సుబ్బలక్ష్మి, తనతోపాటు పిల్లనికూడా గాభరా పెట్టెయ్యడం మంచిది కాదనిపించింది. గబగబా కళ్ళు తుడుచుకుంది.

కూతురి తలమీద చెయ్యేసి నిమురుతూ వుంటే ఆమె కళ్ళు మళ్ళీ చెమర్చటం మొదలుపెట్టాయి. “ఏంలేదులే, నువ్వెళ్ళి పడుకో” అంది ముఖం పక్కకి తిప్పుకుంటూ.

తులసి తల్లి ముఖంలోకి నిశితంగా చూసి ఆమె ముఖాన్ని తనవేపు తిప్పుకుంది.అమ్మా! నేనింకా నీ దృష్టిలో చిన్నపిల్లనేనా? నాకు నువ్వూ నీకు నేనూ తప్ప మనకెవరున్నారు చెప్పు. అంత దుఃఖాన్ని నువ్వే భరించకపోతే నాకూ కొంచెం పంచచ్చుకదా!అంది.

సుబ్బలక్ష్మి ఆశ్చర్యంతో కళ్ళింతంత చేసుకుని చూసింది కూతుర్ని. ఆవిడ దృష్టిలో కూతురు ఇంతవరకూ వుత్త వెర్రిబాగుల్డి.

“తన కూతురేనా ఈ మాట్లాడేది?’ అనుకుంది.

అలా చూస్తున్న తల్లిని చూస్తుంటే తులసికి కొంత సిగ్గుతో బాటు అంతులేని అనురాగం పెల్లుబికింది.

తండ్రి పోయినప్పటినుంచీ తన తల్లి రూపమే మారిపోయింది. తామిద్దరూ వెళ్తుంటే అక్కా చెల్లెళ్ళు అనుకునేవారంతా. అలాంటిది, గుర్తుపట్టలేనంతగా పీక్కుపోయింది. కళ్ళింతంత లోతు గుంతలు పడ్డాయి.

“పోనీలేమ్మా, నాకిప్పుడు పెళ్ళికాకపోతే వచ్చిన నష్టమేమీలేదు. నీతోబాటు వుండిపోతాను. నిన్నొక్కదాన్ని వదిలి నేను ఎక్కడికీ వెళ్ళలేను.”

ఆ ఆప్యాయతకి కరిగి నీరై మళ్ళీ కన్నీరు మున్నీరైంది సుబ్బలక్ష్మి. ఆమె దుఃఖం అణగారాక సుబ్బలక్ష్మి తనంత తనే గొంతు విప్పింది.

“మన స్థలం మనకింకలేదు”

ఉలిక్కిపడింది తులసి. తల్లి ఏమంటోందో అర్థం కావడానికి కొంత టైం పట్టింది.

“అదేవిటి, అదిమనదేకదా, మనం కొనుక్కున్నదేకదా”

“అవును”

“మరి?”

“మీ నాన్నగారు అమ్మేసారుట”

“నిజంగానా?”

“ఏమో మరి”

“అమ్మా! నాన్నగారెప్పుడైనా నీకు చెప్పకుండా ఏ పనైనా చేసెరుగుదురా?”

“అవునుకదా” అనిపించింది సుబ్బలక్ష్మికి. ఇంతసేపు తనకీ విషయం తట్టనేలేదు. తన దుఃఖస్రవంతిలో పడికొట్టుకుపోయింది. పైటకొంగుతో కళ్ళు తుడుచుకుంటూ లేచి కూర్చుంది.

స్థలం ఎవరి పేరుతో వుంది?” అడిగింది తులసి.

నా పేరుతోనే

మరి అలాంటప్పుడు నీ సంతకం లేకుండా నాన్నగారు ఎలా అమ్మేస్తారు?”

నా సంతకం ఎందుకు? కొనేటప్పుడు కూడా నేను వెళ్ళలేదేఅంది సుబ్బలక్ష్మి,

 “కొనేటప్పుడు కొనుక్కునే వ్యక్తి వుండక్కర్లేదు. అమ్మేవ్యక్తి మాత్రం తప్పనిసరిగా వుండాలితన కూతురికంత పరిజ్ఞానం ఎక్కణ్ణుంచొచ్చిందా అని ఆశ్చర్యపోయి చూస్తోంది సుబ్బలక్ష్మి.

ఖాళీ సమయాల్లో అదేపనిగా పుస్తకాలు చదువుతూంటే కోప్పడేది తను. ‘ఆ చదువేమైనా కూటికా గుడ్డకా’ అని విసుక్కునేది. ఎప్పుడూ నోరు విప్పి ఖణేల్మని మాట్లాడని పిల్ల ఈ రోజెంత ఆరిందాలా మాట్లాడుతోంది. మన పిల్లలు మనకంటికి చిన్నవాళ్ళుగా కనిపిస్తారు కానీ, అంతరంగంలో వయసుతో బాటు ఎదిగిపోతారన్నమాట.

“ఏంటమ్మా, అలా చూస్తూ వుండిపోయేవ్!” అంది తులసి చిన్నగా నవ్వుతు.

“ఆహా, ఏం లేదు” అంది తల విదిలించుకుంటూ సుబ్బలక్ష్మి.

“అలా అయితే, నేను సంతకం పెట్టకపోతే అమ్మినట్టు కాదన్నమాట, ఎంత చల్లని మాట చెప్పావే, తులసీ, నీ నెత్తిన పాలు పొయ్యాలి” అంది తనూ నవ్వుతూ.

“అంత పని చెయ్యకే, నేను మళ్ళీ తలంటుకోవాలి”

“చాల్లేవే, మరీ బడాయి”

“ఇంతకీ ఎవరంటా మన స్థలం కొనుక్కున్నామంటున్న వాళ్ళు?”

“మన స్థలం పక్క పెద్ద మేడలేదూ.. సోమరాజో.. నాగరాజో ఏదో పేరు”

“ఆ మహానుభావుడా? అతనికి వున్న ఆస్తి సరిపోలేదు కాబోలు, పక్కనున్న మనలాంటి వాళ్ళని కూడా కలుపుకుంటేగాని. అసలేం జరిగిందో నే వెళ్ళి కనుక్కొస్తానుండు”

“ఏవిటీ, పెళ్ళికాని ఆడపిల్లవి ఒక్కదానివీ వెళ్తావా?” ముఖం చిట్లించుకుంది సుబ్బలక్ష్మి.

“ఏమ్మా వెళ్తే? వాళ్ళేమైనా రాక్షసులా, మనుషుల్ని కొరుక్కు తినేస్తారా? మన వ్యవహారాలు మనం చక్కబెట్టుకుంటే తప్పేం లేదు. ఈ పల్లెటూళ్ళో వుండిపోయి మనం ఎదగడం లేదుకాని, ఒక్కసారలా బయటికి చూడు” గర్వంగా ఇంకేదో చెప్పబోయి పేపర్లో చదివిన అత్యాచారపు సంఘటన ఏదో గుర్తొచ్చి ఆపేసింది.

“సర్లే నువ్వూ, నేనూ వెళ్లాం, సరేనా?” అంది.

గేట్లోంచి లోపలికి వెళ్తూనే ఆ బిల్డింగ్ నీ, అందమైన పూలతోటనీ, రెండు కాళ్ళనీ చూసి సుబ్బలక్ష్మి కళ్ళలోకి ఒక విధమైన అణుకువ భావం వచ్చేసింది. పైట చెంగు రెండో భుజం చుట్టూ తిప్పి నిండుగా కప్పుకుంది. చల్లని ఆ వాతావరణంలో ఆమెకు చిరుచెమట పట్టింది. గొంతు ఎండిపోతున్నట్టు తోచింది.

తులసి క్రీగంట డబ్బుచేసే మాయల్ని తల్లి ముఖంలో చూస్తోంది.

నాగరాజుగారు వీళ్ళని బాగా పలకరించాడు. శంకరంగారు పోయినందుకు సానుభూతికూడా ప్రకటించాడు. ఆయన్ని అట్టే చూసాక గుర్తొచ్చింది సుబ్బలక్ష్మికి.

పదేళ్ళ క్రితం కాబోలు ఒకసారి కారులో తమ ఇంటివైపొచ్చాడీయన. కారు దిగకుండానే తన భర్తతో ఏదో మాట్లాడి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక తను అడక్కముందే చెప్పాడు తన భర్త – “ఆయనకి పెద్ద బిల్డింగ్ కట్టుకోవడానికి మన స్థలం అడొస్తోందట. దాన్ని అమ్మేస్తారా, కొన్నరేటుమీద కొంత ఎక్కువిస్తాను” అంటున్నాడని.

“వద్దు వద్దు” అంది సుబ్బలక్ష్మి కంగారుగా. “డబ్బుని మనం దాచలేం. స్థలమైతే అలా పడివుంటుంది. మన తులసి పెళ్ళికెదిగేవరకూ దాని మాటే తలపెట్టవద్దు.”

“నేను కూడా ఆ మాటే చెప్పానే” అన్నాడాయన.

“మా స్థలాన్ని మీరు కొనేసుకున్నారంటున్నారు దాన్ని మీకెవరమ్మారో చెప్తారా బాబుగారూ?” అంది సుబ్బలక్ష్మి నేల చూపులు చూస్తూ, వీలైనంత అణకువుగా.

ఆయన వెంటనే వాచీ చూసుకుంటూ “వ్యవహారాలన్నీ మా గుమస్తా చూస్తాడు. నాక్కొంచెం అర్జంటుపనుంది. మీరు గుమస్తాతో మాట్లాడండి” అంటూ లేచి వెళ్ళిపోయాడు.

ఆ గుమస్తా ఎక్కడుంటాడో అర్థంకాక కొంతసేపు అక్కడే నిలబడిపోయారిద్దరూ. “మనుషుల్లో ఎంత ఆషామాషీగా ప్రవర్తిస్తారీ డబ్బున్నవాళ్ళు ‘ అని ఆశ్చర్యపోతోంది తులసి.

కొంతదూరంలో కారు తుడుస్తున్న డ్రైవరు దగ్గరకెళ్ళి అడిగి తెలుసుకుంది గుమస్తా ఈ టైంలో ఫేక్టరీలో వుంటాడని. కొంత దూరంలో పొగగొట్టం కనిపిస్తున్నదే వాళ్ళ పేక్టరీ అనికూడా చెప్పాడు.

వీళ్ళు నడుస్తూ వుండగానే నాగరాజు కారు ఫ్యాక్టరీ వైపు దూసుకెళ్ళింది.

కారు రేపిన ఎర్రని దుమ్ము ఎగిరొచ్చి కళ్ళలో పడింది.

ఫ్యాక్టరీ రణగొణధ్వనుల్లో గుమస్తా ఓపికగా అరగంటసేపు వివరించి చెప్పాడు. స్థలం కొన్న అయిదేళ్ళకి శంకరంగారు దాన్ని అమ్మిన రంగారావు అనే వ్యక్తికే తిరిగి అమ్మేసాడని అన్నారనీ, ఆ రంగారావు దగ్గర్నుంచీ తమ అయ్యగారు ఈ మధ్యనే ఏభై వేలకి కొన్నారనీ, కావాలంటే డాక్యుమెంట్స్ యిపిస్తానని అన్నాడు.

అంతా విన్నాక సుబ్బలక్ష్మి కళ్ళు తిరిగినట్లయి ముందుకు తూలి పడబోయింది. తులసి తల్లిని పడిపోకుండా పట్టుకుని స్థంభం పక్కనే కూర్చోబెట్టింది. దూరంగా కుండలో వున్న మంచినీళ్ళని ప్లాస్టిక్ గ్లాసుతో ముంచి తెచ్చి తల్లి చేత తాగించబోయింది. మురికి పట్టివున్న ఆ ప్లాస్టిక్ డొక్కును ఏవగింపుగా చూసి దూరంగా పెట్టేసిందావిడ.

తులసి మళ్ళీ గుమస్తా దగ్గరకెళ్ళింది. “ప్లీజ్ సరిగ్గా చూసి చెప్పండి. మా నాన్నగారలాంటి వారు కారు. పోయిన ఆయన మీద ఎందుకండీ ఇలాంటి అబద్ధాలు కల్పిస్తారు?” అంది కళ్ళలో నీళ్ళూరుతుండగా. ఆ ముసలాయన జాలిగా చూశాడు తులసిని.

వీలైనంత గొంతు తగ్గించి చెప్పాడు – “అమ్మా! శంకరం మాష్టార్ని నేను బాగా ఎరుగుదును. ఈ పెద్దవాళ్ళతో వ్యవహారాలు చిక్కుముళ్ళలాంటివి. మనలాంటి వాళ్ళం విప్పాలని ప్రయత్నించిన కొద్దీ అవి బిగుసుకుపోతాయ్. మరో వ్యక్తి నుంచి కొనుక్కున్నాడు కాబట్టి మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకి లేదని ఒక్క ముక్కలో తేల్చేయవచ్చు ఈ నాగరాజుగారు. మీరు ఆ రంగారావుని కలిస్తే మంచిది. వాడిని, మీ నాన్నగారు తిరిగి తనకి అమ్మినట్టున్న డాక్యుమెంట్స్ ని సాక్ష్యాధారాలతో చూపించమనండి. మీ అమ్మగారు తను సంతకం చెయ్యలేదంటున్నారు కాబట్టి వాడు చూపించలేకపోవచ్చు. ”

“అతనలా చూపించలేకపోతే మా స్థలం మాకొచ్చేస్తుందా?”

“పిచ్చితల్లీ! ఏభైవేలకి అమ్మిన ప్లాట్ వ్యవహారం అంత తెలివితక్కువగా సాగిస్తాడా? అన్నీ ముందే జాగ్రత్తపడి వుంటాడు. శంకరంగారు పోగానే, మీ తరపున అడిగేవాళ్ళు లేరని, వ్యవహారాలు చక్కబెట్టగల డబ్బూ మీ దగ్గర లేదని అవతలి వ్యక్తికి తెలుసు. అందుకే ఇంత ధైర్యం చేశాడు.”

”రంగారావుగారు పదేళ్ళ క్రితమే కొన్నాడంటున్నారు?”

“పదేళ్ళేం ఖర్మ, పాతికేళ్ళ క్రితం కొన్నట్టు రుజువులు చూపించగలరు డబ్బుంటే.”

“మరిప్పుడెలా, బాబాయ్ గారూ!” అంది తులసి బేలగా.

తల్లి దగ్గరెలాగో ధైర్యంగా మాట్లాడేసింది కానీ, ఈ మతలబులన్నీ వింటుంటే ఆ అమ్మాయికి మతిపోయినట్టుంది.

ఒక నిముషం ఆలోచించి అన్నాడాయన “ఒక పని చేద్దాం. మరో పది రోజుల్లో రంగారావేదో పనిమీద పట్నం నుంచి ఇక్కడికి వస్తున్నాడు. వచ్చేటప్పుడు మీ నాన్నగారు అమ్మారనే పాత డాక్యుమెంట్ ని తెమ్మని రాస్తాను. వాటిని చూశాక నిర్ణయిద్దాం ఏం చెయ్యా లో.”

“మనం అడిగినంతట్లోనే అలా చూపించాలని రూలేం లేదుకదండీ. తెస్తాడంటారా?”

“నిజానికి అలాంటి రూలేం లేదు. లాయర్ నోటీసు ఇస్తే తప్ప పాత డాక్యుమెంట్స్ చూపించాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే అవి నాగరాజుగారి దగ్గరున్నా వుండవచ్చు.”

“పోనీ, లాయరు నోటీసు ఇప్పిద్దామా?” ఆశగా కళ్ళు మెరుస్తుండగా అంది తులసి.

ఆశ్చర్యంగా చూసాడాయన తులసిని, ఆగి నెమ్మదిగా అన్నాడు “పది పదిహేను వేలు ఖర్చు పెట్టగలరా?”

తులసి గుండెలమీద చేతులు వేసుకుంది “అన్నివేలే?”

“ఆ… కోర్టులూ లాయర్లు అంటే ఏమిటనుకున్నావ్? కేవలం డబ్బుతో పని నోటీసిచ్చాక అంతటితో ఆగదు. ప్రొసీడవ్వాలి.” నిస్సహాయంగా తలదించుకుంది తులసి.

“మేమింక వెళ్ళొస్తాం, బాబాయ్ గారూ” నీరసంగా వెనక్కి తిరిగి తల్లికి చేయందించింది తులసి. అడుగు తీసి అడుగు వెయ్యలేనంత నిస్సత్తువుగా వున్న తల్లిని జాగ్రత్తగా పొదుపుకుని నడిపించుకెళ్ళింది.

రంగారావొచ్చాడని గుమస్తా పాపయ్య కబురు పెడితే వెళ్ళారు తల్లీ, కూతురూ.

రంగారావును చూసిన వాళ్ళెవరూ అతను దగా చేసాడంటే నమ్మరు. తెల్లగా మెరిసిపోయే లాల్చీ షరాయిల్లో అతి సాత్వికుడిలా వున్నాడతను. “మేక వన్నె పులులిలాగే వుంటాయి కాబోలు” అనుకుంది తులసి.

రెండడుగులు ముదుకొచ్చి “రండ్రండమ్మా, పాపయ్యగారు రాసేవరకూ మీకింత కష్టం వచ్చిందని నాకు తెలీనే తెలీదు” అన్నాడు రంగారావు గొంతులో గద్గదత పలికిస్తూ.

ఎందుకైనా మంచిదని లాయర్ గారిని వెంటబెట్టుకొచ్చేశాను సరాసరి. వ్యవహారాల దగ్గర అనుమానాలుండకూడదుకదాఅన్నాడు రంగారావు. టేబుల్ దగ్గర కుర్చీలో నాగరాజు పక్కన కూర్చున్నాయన లాయరని అర్థమైంది తులసికి.

“మొదలు పెట్టండి, లాయర్ గారూ! ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అవతలివాళ్ళు ఇద్దరూ మొగదిక్కులేని ఆడవాళ్ళు. ఆర్థికంగా పేదవాళ్ళు. వాళ్ళకెట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకూడదనే విషయం గుర్తుపెట్టుకోండి” అంటున్నాడు రంగారావు.

“నాకాట్టే టైం లేదు తొందరగా తేల్చేస్తాను” అన్నాడు లాయరు గొంతు సవరించుకుంటూ.

“ఆగండాగండి లాయర్ గారూ ముందొక్క విషయం చెప్పండి. సుబ్బలక్ష్మిగారు కోర్టుకెళ్ళిందనుకోండి, ఆవిడ ఏవేం రుజువు చేయాల్సి వుంటుంది?” అడిగాడు రంగారావు.

లాయర్ నవ్వాడు గట్టిగా “రుజువు చెయ్యాల్సింది ఆవిడ కాదండీ బాబు, మీరు, మీరు కొన్నప్పటి డాక్యుమెంట్స్ మీది సంతకం ఆవిడదేనని రుజువు చెయ్యాలి”

అందరి పెదవుల మీదా చిన్నగా నవ్వు పారాడింది, తులసికి తప్ప.

“క్షమించాలండీ, నాకీ కోర్టులూ వ్యవహారాలు అంతగా తెలీవు, ఏదో ముక్కుకి సూటిగా పోయే ముండావాణ్ణి అన్నాడు రంగారావు తనూ నవ్వుతూ. మనోమాట, కోర్టుకి ముందుగా ఎవరు వెళ్ళాల్సి వుంటుంది?”

“ఇంకెవరు, సుబ్బలక్ష్మిగారే, తనకి అన్యాయం జరిగిందని ఆవిడ అంటున్నారు కదా!

“ఇంకొక్క ప్రశ్న, ఇదొక్కటీ చెప్పెయ్యండి, అసలు ఏ మాత్రం ఖర్చవుతుందంటారు కోర్టుకెక్కినవాళ్ళకి?”

“మీరడిగిన ప్రశ్న చిన్నదేకానీ జవాబు పెద్దదండీ. ఈ కేసుని సివిల్ లా ప్రకారంగాని, క్రిమినల్ లా ప్రకారంగానీ సాగించవచ్చు. సివిల్ లా ప్రకారం పోయి గెలిస్తే ఆస్తి తిరిగి వస్తుంది. క్రిమినల్ లా ప్రకారమైతే ఆస్తిరాదుకానీ, అవతలి వ్యక్తికి అంటే మీకు..” సంశయిస్తూ ఆగిపోయాడాయన.

“చిత్తం చిత్తం, చెప్పండి, సంశయం వద్దు”

”శిక్ష పడుతుంది, అందుకని రెండు ‘లా’ల ప్రకారం పోవాల్సి వుంటుంది. అంటే మరి ఖర్చుకి వెనకాడకూడదు. దానికి తోడు కోర్టుకెక్కిన కేసు ఎన్నాళ్ళకి తీర్పుకొస్తుందో ఎవరూ చెప్పలేరుకదా! అన్నాళ్ళూ పిలిచినప్పుడల్లా వాయిదాలకి తిరుగుతూ వుండాలి. అబ్బో వ్యవహారం చాలా క్లిష్టమైందిలెండి, ఎందుకడుగుతారు. సుబ్బలక్ష్మిగారు ఖర్చు పదుల సంఖ్య మీదే వుంటుంది.”

“అంటే వేలా?”

“మరి? వందలనుకున్నారా? ” ఎగతాళిగా నవ్వాడాయన.

సుబ్బలక్ష్మి ముఖం వివర్ణమైపోయింది. జరుగుతున్న నాటకం ఆవిడకి అర్ధం కావడంలేదు. అలాగని పూర్తిగా అర్థం కాకుండానూ లేదు. “నాకాట్టే టైం లేదు, తొందరగా తేల్చేస్తాను” అన్నాడు లాయర్ మళ్ళీ వాచీ చూసుకుంటూ.

”రంగారావుగారూ ముప్పై రెండు నెంబరు గల సదరు ప్లాట్ ని మీరు శంకరంగారి భార్య సుబ్బలక్ష్మిగారికి ఎప్పుడు అమ్మారు?” చెప్పాడు రంగారావు.

“అప్పుడు సుబ్బలక్ష్మిగారిని చూసారా?”

“లేదండి ప్లాట్ కొనుక్కునే వ్యక్తి రిజిస్ట్రార్ ఆఫీసుకి రావాల్సిన అవసరం లేదు కాబట్టి సుబ్బలక్ష్మిగారిని నేను చూడలేదు. ఆవిడ తరపున శంకరం గారొచ్చారు.”

“తిరిగి ఆయన దగ్గర్నుంచి ఆ స్థలాన్ని మీరు ఎప్పుడు కొన్నారు?”

“అయిదేళ్ళ తర్వాత”

“రేటు పెంచారా?”

“ఆ… రేటు బాగా పెరిగిందండి. సుబ్బలక్ష్మిగారి స్థలాన్ని కొన్న మరుసటి సంవత్సరమే ఇది ఇండస్ట్రియల్ ఏరియాగా గుర్తించబడింది, అందుకని ధర పెరిగింది. ఆయన చెప్పినంత రేటూ ఇచ్చి, అంటే ఇంచుమించు ఇరవైవేలిచ్చి కొన్నాను.”

“ఇరవైవేలే, తనకి తెలీకుండా తన బర్త ఇరవైవేలు ఖర్చుపెట్టి వుంటాడా?” సుబ్బలక్ష్మి మనసులో అనుకుంటోంది. అన్నివేలు కాదుకదా, అన్ని వందలు కూడా సొంతానికి ఆయనెప్పుడూ కళ్ళజూసి వుండడు.

“స్థలాన్ని తిరిగి కొనుక్కునేటప్పుడు సుబ్బలక్ష్మిగారిని మీరు చూసారా రంగారావుగారూ?” లాయర్ ఆగకుండా ప్రశ్నలు వేస్తూనే వున్నాడు.

“ఆ….చూసానండి”

“ఆవిడే ఈవిడా?”

“కాదండి” కొంత తటపటాయిస్తూ అన్నాడు రంగారావు.

“ఈరోజు ఈవిడని చూసేవరకూ ఈవిడే సుబ్బలక్ష్మిగారని నాకు తెలవదండి. ఆ రోజు రిజిస్ట్రార్ ఆఫీసుకి ఇంకొకావిడెవర్నో వెంటబెట్టుకొచ్చారండి శంకరంగారు, ఆవిడే సుబ్బలక్ష్మి అని ఆయనంటే ‘కాబోలు’ అనుకున్నానండి”

“హరిహరీ” రెండు చెవులూ మూసుకుని గట్టిగా అరిచింది సుబ్బలక్ష్మి. ఆ గదిని నిశ్శబ్దం ఆవరించుకుంది. లేని ఓపిక తెచ్చుకుని గద్గదమైన గొంతుతో ఇలా అంది సుబ్బలక్ష్మి,

“బాబూ! మీకో నమస్కారం. మాకే స్థలాలూ లేవు. ఏ ఆస్తులు లేవు, మమ్మల్ని వదిలేయండి, చచ్చి స్వర్గాన వున్న ఆ ముసలాయన మీద ఇలాంటి అభాండాలు వెయ్యకండి. ఇంత పనిచేయిస్తున్నందుకు నాకిక పుట్టగతులుండవ్”

లేచి కూతురి చెయ్యందుకుని మూర్తీభవించిన విషాదంలా బైటికి నడిచింది సుబ్బలక్ష్మి.

తల్లి వెంట నడుస్తున్న తులసి చెవుల్లో శ్రీశ్రీ ‘ చేదుపాట ‘ ప్రతిధ్వనిస్తోంది.

“వెనుక దగా ముందు దగా

కుడి యెడమల దగా దగా!”

ఒక్కసారిగా ఆగి తల్లి భుజం మీద చేయివేసి ఇలా అంది. “మనకి డబ్బులేకపోవచ్చు కాని.. గుమస్తా బాబాయ్ లాంటి మంచితనం మనవెనుక వుంటుంది. నువ్వేం అధైర్యపడకమ్మా.”

(1992 జూన్ 24-30 ఆంధ్రప్రభ వీక్లీ)

(వచ్చేనెలలో మరోకథ)

 

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.