నిష్కల – 3
– శాంతి ప్రబోధ
నలబై ఐదేళ్ల నడివయసు మహిళ , ఇద్దరు పిల్లలున్న మహిళ, భర్తతో విడిపోయి ఒంటరిగా బతుకుతున్న మహిళకు ఆమె పిల్లలే పెళ్లి చేశారట .
ఆ వార్త చూసినప్పుడు చీదరించుకుంది.
ఈ వయసులో ఇదేం పోయేకాలం..
దీని మొహంమండ . ఇంకా పదహారేళ్ళ పడుచుపిల్లననుకుంటుందా .. దీనికిప్పుడు పెళ్లి కావాల్సి వచ్చిందా .. మొగుడు అవసరమయ్యాడా ..
ఛి ఛీ .. సిగ్గులేకపోతే సరి .. ఆడాళ్ళు మరీ బరి తెగించి పోతున్నారని మనసులోనే తిట్టి పోసింది .
ఎదిగిన పిల్లల పెళ్లి చెయ్యాల్సింది పోయి తానే పెళ్ళిపీటల కెక్కింది .
అది చాలక తగుదునమ్మా అంటూ ఆర్భాటంగా పెళ్లి.. ఏమైపోతుందో లోకం .. అంతా కలికాలం మహిమ .. అక్కసుగా తిట్టుకుంటున్నది సుగుణమ్మ.
సరిగ్గా ఆ పెళ్లి వార్తలు చూస్తున్న సమయంలోనే నిష్కల ఫోన్ చేసింది.
అప్పుడే బయటి నుండి వచ్చిన శోభ స్నానానికి వెళ్తూ అత్తగారికి ఫోన్ ఇచ్చింది మనవరాలితో మాట్లాడమని .
సాధారణంగా నిష్కలకి నాయనమ్మతో మాట్లాడడం ఇష్టం ఉండదు . ఆమె అంటే గిట్టదు . అందుక్కారణం చిన్న తనంలో ఎదుర్కొన్న వివక్ష . తన తండ్రిలేని తనానికి, అమ్మ ఒంటరితనానికీ నాన్నమ్మే కారణం అని నమ్ముతుంది. అందుకే,
నాలుగేళ్ళ కింద సుగుణమ్మ శోభ దగ్గరకి చేరిన సమయంలో తీవ్రంగా వ్యతిరేకించింది .
తను పై చదువులకు వెళ్తే ఇంట్లో అమ్మతో మరో మనిషి ఉండడం మంచిదేనన్న ఒక్క ఆలోచన ఇక ముందుకు సాగనీయలేదు. నాన్నమ్మంటే ప్రేమ, గౌరవం ఎప్పుడూ లేదు.
ఈ అమ్మొకటి..ఐదు నిముషాలాగి చెయ్యి అనొచ్చుగా ..
అట్లా కాకుండా నాన్నమ్మ చేతిలో ఫోన్ పెట్టి పోయింది అని మనసులో తిట్టుకుంటూనే నాన్నమ్మని పలకరించింది నిష్కల .
ఏం చేస్తున్నా నాన్నమ్మా అని పలకరించిన మనవరాలి క్షేమ సమాచారాలు అడగడం మానేసి
‘దానీకిదేం పోయే కాలమే ..తల్లీ ..
అంగరంగ వైభోగంగా మళ్ళీ పెళ్లి ‘ అంటూ బుగ్గలు నొక్కు కుంది. ఆ పెళ్లి చేసుకుంటున్నదెవరో మనవరాలికి చెప్పింది సుగుణమ్మ.
‘అదేంటి నాన్నమ్మా ఇంకా నీ చాదస్తం పోలేదా ..
మంచి నిర్ణయం తీసుకుందని మెచ్చుకోవాల్సింది పోయి.. ‘ చిరునవ్వుతో అంటున్న నిష్కలని పట్టించుకోకుండా
‘దీని ముదనష్టం మండి పోనూ .. ఇప్పడీ వయసులో పెళ్లి కావాల్సొచ్చిందటే దానికి. అతనితో సంసారం చేసాక రేపు పిల్లలు పుడితేనో..
మన సమాజంలో ఆడదంటే ఒక విలువ ఉంది . అమ్మంటే ఒక నమ్మకం ఉంది. ఒక గౌరవం ఉంది.
సోగ్గా తయారయి నాలుగుట్లో టింగురంగా అని తిరగడం కాదే ..
రేపు ఆ పిల్లల్ని మీ అమ్మ ఇట్లా .. అట్లా అని ఎవరైనా అంటే ఏం సమాధానం చెబుతుంది?
ఆ మొహం తీసుకుపోయి ఎక్కడ పెట్టుకుంటుంది ?
తన సుఖం తాను చూసుకుంటే సరిపోతుందా ..
తల్లి అన్నాక, కన్నపిల్లల గురించి ఆలోచించక్కర్లా .. ఆ బుద్ది జ్ఞానం ఉండక్కర్లా?
ఈ పాడు లోకంలో ఆ పిల్లలు ఎట్లా తలెత్తుకు తిరగగలుగుతారో ఏం పాడో..
వాళ్ళకి పెళ్లి పేరంటాలు ఎట్లా అవుతాయో, ఎంత క్షోభ పడతారో ..
ప్చ్ .. పాపం పిల్లలు. తన దగ్గరి వాళ్ళకి ఏదో అన్యాయం జరిగిపోతున్నట్లు బాధపడిపోయింది సుగుణమ్మ .
అసలీ పెళ్లి నలుగురికీ ఏం చెబుతున్నట్టే..
ఆ .. చెప్పు.. ఇట్లాటి తల్లులు లోకానికి బరువే .
మన దేశ పరువు మర్యాద గంగలో కలిపేది ఇట్టాటి వాళ్లే.
పిల్లలకింత ఉడకేసి గుట్టుగా కాలం వెళ్లదీయక ఈ పిదపకాలం బుద్దులేంటో..’ అని మనవరాలి కేసి తీక్షణ్ణంగా చూస్తూ
‘ఏవన్నావ్.. పిల్లకాకివి నీకేం తెలుసే.. మెచ్చుకోవాలని నాకే చెబుతున్నావ్ అంటూ మనవరాలి మీద ఒంటి కాలిమీద లేచింది సుగుణమ్మ .
‘నాన్నమ్మా .. నీ బుద్ది పోనిచ్చుకున్నావ్ కాదు .
నాలుగేళ్ల నుంచి మా అమ్మతో ఉంటున్నావ్ .. కానీ ఏం మారలేదు. నువ్వు, నీ తీరు మారదా ..
పుట్టుకతో వచ్చిన బుద్దులు పుడకలతో గానీ పోవంటారు . నిజమేనేమో ? నాన్నమ్మలా ఆవేశ పడకుండా శాంతంగానే అన్నది నిష్కల .
సుగుణమ్మ మొహంలో మారిపోతున్న భావాల్ని పరిశీలిస్తున్నది ఆమె.
పెద్ద చదువులు చదివి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నది కానీ మనవరాలికి ఏమీ తెలియదు. ఒక పద్ధతి పాడు లేకుండా పెంచింది తల్లి అని శోభని మనసులోనే ఆడిపోసుకున్నది సుగుణమ్మ .
వీడియో కాల్ లో నాన్నమ్మ హావభావాల్ని పరికిస్తూ సంస్కారం పుట్టుకతో రాదు. తల్లిదండ్రుల పెంపకం, గురువుల బోధనా , సమాజ తీరును బట్టి మనిషికి అలవడుతుందంటారు.
నాన్నమ్మ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని బట్టి ఆమె ఆలోచిస్తున్నది .
ఆమె తీరుకు ఎప్పుడు దూరంగా ఉన్నది. కానీ మార్చాలని ఏనాడూ ప్రయత్నించలేదు. ఆ దిశగా ఆలోచించలేదు.
ఈ రోజు నాన్నమ్మను అట్లా వదిలేయాలనిపించని నిష్కల, మాట పొడిగించింది.
‘నాకు తెలియక అడుగుతున్నా నాన్నమ్మా ..,
మొదటి పెళ్ళికి ఉన్న గౌరవం విలువ , గుర్తింపు రెండో పెళ్ళికి ఉండవా..
రెండో పెళ్లి చేసుకున్న ఆడవాళ్ళంతా విలువలేని వాళ్ళన్నట్లేనా.. విలువలు వదిలేసినట్లేనా ..
మోడువారిన చెట్టు కూడా చిగురించి పూవులు కాయలు పళ్లతో కళకళ లాడుతూ ఉంటుందే ..
మరెందుకు నాన్నమ్మా.. ఆడవాళ్ళని మోడుగానే ఉంచే ప్రయత్నం చేస్తారు. నువ్వు ఆడదానివై ఉండీ మరో ఆడదాన్ని అంత చులకనగా ఎట్లా మాట్లాడగలిగావ్ ? అన్నది .
కొద్దిక్షణాలు ఆగి మళ్ళీ తానే ‘ మొన్నామధ్య మీ ఆడపడుచు కోడలు చనిపోతే దినకర్మలయినా అవకుండానే నీ మేనల్లుడికి మరో పెళ్లి సంబంధం చూసేసారు . గుర్తుందా .. ‘
‘ఆ… అవును,అయితే ‘
‘అతనికి మరో పెళ్లి ఎందుకు చేశారు ? ‘
‘వాడు మగాడు కదే . ఇంట్లో దీపం వెలిగించి పిల్లలల ఆలనపాలన చూసుకోవడానికి ఇంట్లో ఆడది ఉండొద్దూ .. లేకపోతే మగాడు ఎన్నాళ్లని చెయ్యి కాల్చుకుంటాడు‘
‘ఓ .. పెళ్ళై పిల్లలున్నతని భార్య చనిపోతే కార్యక్రమాలన్నీ పూర్తికాకుండానే అతని పెళ్లి ఆలోచనలు ప్రారంభిస్తారు జనం . పిల్లల కోసం అంటారు . లేకపోయినా అతనికి తోడు ఏర్పరచే పనిలో పడిపోతుంటారు బంధుమిత్రులు.
అదే విధంగా భార్య నుంచి విడిపోయినా అంతే, మరో అమ్మాయిని అతని జీవితంలోకి తెచ్చేస్తారు. దాన్ని అందరూ ఆమోదిస్తారు . హర్షిస్తారు .
అదే భర్త చనిపోయితేనో, ఏవైనా కారణాల వల్ల భార్యాభర్తలు విడిపోతేనో ఆమెకు ఆ వెసులు బాటు ఇవ్వరు ..ఆమెకు గౌరవం ఇవ్వరు . ఆమె ఒంటరిగా బతకాలని సాధిస్తారు . అదే రివాజు అంటారు . సంస్కృతి సాంప్రదాయంఅంటూ ఏవేవో మాట్లాడతారు .
ఆమె జీవితాన్ని నిర్ణయించుకునే అధికారం ఆమెకివ్వరు . ఒక వేళ, ఆమె సమాజం గీసిన చట్రంలోంచి బయటికి వస్తే ఆడిపోసుకుంటారు . ఒక్కొక్కళ్ళు ఒక్కోలా శూలాలతో పొడుస్తారు.
మీ రెండు నాల్కల ధోరణి నాకర్ధం కావడం లేదు నాన్నమ్మా ..
ఇలా ఎందుకని ?
మగవాడికో రూలు , ఆడవాళ్ళకొకటా .. ?
మనసు , శరీరం మగవాళ్లకే కానీ ఆడవాళ్లకుండవా నాన్నమ్మా‘ అంటూ నిలదీసింది నిష్కల.
ఏం చెప్పాలో తెలియక తెల్లమొహం వేసిన సుగుణమ్మను చూస్తూ
‘అయినా వాళ్ళ జీవితం వాళ్ళిష్టం . వాళ్లకు నచ్చినట్లు వాళ్ళుంటారు .
నువ్వో .. నీలాగే మాట్లాడే వాళ్ళో వెళ్లి ఆమెకి అవసర సమయాల్లో అండగా ఉంటారా .. ఉహూ .. ఉండరు .
కానీ , సూదిమొనంత సందు దొరికినా వాళ్ళ జీవితాల్లోకి చొచ్చుకుపోయి మీ ఇష్టమొచ్చినట్టు వ్యాఖ్యానిస్తారు. అది వాళ్ళ వ్యక్తిగతం అని అనుకోరు . వాళ్ళ జీవితం గురించి వారు సరైన నిర్ణయం తీసుకున్నారని అనుకోరు . వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూస్తూ వ్యంగ్యంగానో .. హాస్యంగానో, వెటకారంగానో మరో విధంగానో మసాలా దట్టించిన వార్తలు మాత్రం వండి వార్చేస్తుంటారు . నలుగురికీ వడ్డించి తృప్తి పడిపోతుంటారు .
అసలు, ఆమె బాధ్యతలేవో ఆమెకు తెలియదా ..తన జీవితం గురించి సరైన నిర్ణయం తాను మాత్రమే తీసుకోగలదు.
మీరెవరంట, ఆమె జీవితంలోకి తొంగి చూసి మాటలనడానికి? నీ మోచేతి నీళ్లు తాగుతున్నదా .. లేదే ..
మన జీవితంలోకి ఇతరులు చొచ్చుకొచ్చి ఇట్లాగే మాట్లాడతారని మర్చిపోతారు పెద్దలు .. వెటకారం ధ్వనిస్తున్న మనవరాలిని కొరకొరా చూసింది సుగుణమ్మ .
అయినా నిష్కల ఊరుకోలేదు . అమ్మ అక్కడ ఉంటే నాన్నమ్మని ఏమి అననివ్వదని ఆమెకు తెలుసు.
ఇప్పుడు సమయం సందర్భం కలిసి వచ్చిందని అనుకున్న నిష్కల ‘నీ కొడుకు విషయంలో నీకేమి సంబంధం లేనట్టు వ్యవహరించావ్ .. మా అమ్మ ఉసురుపోసుకున్నావ్. నాకు తండ్రి ప్రేమ లేకుండా చేశావ్ .
ఇప్పుడు ఊళ్ళో వాళ్ళందరి గురించి బాగానే ఆలోచిస్తున్నావే… అంటూ తనని కడిగివేసేస్తున్న మనవరాలి మొహం నిద్రరాని ఆ రాత్రి కళ్ళముందు మెదిలింది సుగుణమ్మకు.
ఉక్కపోతగా అనిపించింది . సీసాలో నీళ్లు ఒంపుకుని తాగింది. మళ్లీ కళ్ళు మూసుకుంది కానీ మూతలు పడడం లేదు .
నెలరోజుల క్రితం తనని, తన పెద్దరికాన్ని నిలదీసిన మనవరాలి సంభాషణ మళ్ళీ చెవుల్లో మారుమోగుతున్నది,
మళ్లీ మళ్లీ ఆమె కళ్ళ ముందు నిలబడి ప్రశ్నిస్తున్నట్టుగా అనిపిస్తున్నది .
‘అసలు , మీలాంటి వాళ్లే అగ్గిపుల్ల అంటించి అవతల పడేస్తారు . అది కాలుతూ పోతూ ఉంటుంది .
అందుకే , భర్తకు దూరమయిన స్త్రీ మళ్ళీ పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించడం చాలా కష్టమైన విషయంగా ఉంది.
దూరమైన వాళ్ళని తలచుకుంటూ , ముక్కు చీదేసుకుంటూ ఎన్నాళ్లని కూర్చుంటారు . ఆ దిగులు లోంచి , ఆ సంక్షోభ,లోంచి బయటికి రావొద్దూ ..
దిగులు అది ఏం ప్రయోజనం ? అవన్నీ ఒదిలి ముందుకు సాగిపోవాలి కదా ..
రకరకాల ఆకర్షణలు , అంతర్యుద్ధాలు , ఆశలు , ఆశయాలు ఇంకా ఎన్నెన్నో ఉంటాయి జీవితంలో ..
పునరుజ్జివనం పొందే మహిళల్ని వాళ్ళ అభిప్రాయాలని మీరు గౌరవించరు . మీ ప్రవర్తన వల్ల వాళ్ళు ఎన్ని ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందో అర్ధం చేసుకోరు.
జీవితం ప్రవహించే నదిలాంటిది . ప్రవాహం ఆగిపోతే ఎట్లా .. అడ్డంకులు చీల్చుకుంటూ సాగాల్సిందే కదా ..
ఆ వాస్తవాన్ని అర్ధం చేసుకున్నది కనుకే ఆమె జీవితం ఆమెకు కావలసినట్టు ముందుకు ప్రవహింప చేసుకుంటున్నది .
మీకేమో ఒంటరి ఆడవాళ్లు అందంగా తయారవడం కూడా తప్పే. అంత చక్కగా తయారయింది . ఎవరికోసమో .. అని ఆరాలు, ఊహాగానాలు, జడ్జిమెంట్లు ..
ఏం .. ఎవరికి నచ్చినట్లు వారు తయారవకూడదా ..
వాళ్లకు వాళ్ళు నచ్చకూడదా .. ఫాషన్ గా ఉండకూడదా ..
ఆమె తయారైందంటే .. మగవాళ్లకోసమేనా ..
ఆమె జీవితం ఆమెది . ఇంకెవరిదో కాదు .
నీలాంటి వాళ్లే ఇలాంటి మాటలతో మగవాళ్ళ కొమ్ములిచ్చేది .
మీ లాంటి వాళ్లందరికీ ఆమెని గౌరవించడం తెలియకపోతే , మగాళ్ళకి ప్రవర్తించడం రాకపోతే అది మీ తప్పు . ఆమెది కాదు . కానీ మీరంతా కల్సి ఆమెకు పనిష్మెంట్ ఇస్తున్నారు . అది ఆమె ఎందుకు అనుభవించాలి . మీ అందరికీ అనుగుణంగా ఆమె ఎందుకు నడుచుకోవాలి?
మీరు చెప్పే బూజుపట్టిన సంప్రదాయాన్ని తీసుకుపొయ్యి తుంగలో తొక్కేయ్యాలి‘ చిరచిరలాడింది .
ఈ మీడియా ఒకటి . ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగతాన్ని పబ్లిక్ చేసేస్తున్నది. పోలీసింగ్ చేస్తున్నది . ఎవరికీ హాని చేయకుండా వాళ్లకు నచ్చినట్లు వాళ్ళు బతికితే వీళ్ళకొచ్చిన నష్టం ఏమిటో కష్టం ఏమిటో .. నా మొద్దు బుర్రకు అర్ధం కాదు .
మనుషుల్ని కట్టడి చెయ్యడం జనానికి బాగా అలవాటైపోయింది .గౌరవాన్నిచ్చి పుచ్చుకోవడం సంస్కారం . కానీ అది నేర్పదు . బాధ్యత లేకుండా మొరిగే మీడియా‘ విసుక్కుంది నిష్కల .
‘చదివేస్తే ఉన్న మతి పోయినట్టుందే నీ వ్యవహారం. ఆ కుటుంబ పరువు ప్రతిష్ట ఏమైపోతాయ్ ..?
ఇన్ని చెబుతున్నావ్ .. మరి మీ అమ్మకీ చేయలేకపోయావా .. ‘ ఎకసెక్కెంగా అన్నది సుగుణమ్మ.
ఒక్క క్షణం స్థాణువై అట్లా నాన్నమ్మనే చూస్తూ ఉన్నది నిష్కల .
‘నాన్నమ్మా .. నువ్వు ఏ ఉద్దేశ్యంతో అన్నప్పటికీ .. , ఆ దిశగా ఎప్పుడూ నేను ఆలోచించలేకపోవడం, ఆ బాధ్యత తీసుకోకపోవడం.. నాకెంతో బాధగా ఉంది.
కాకపోతే, తను ఇష్టపడే విధంగా తన జీవితాన్ని తాను మలుచుకున్నదని , సమస్యల వలయంలో చిక్కుకుని విలవిలలాడే నలుగురికీ ఆపన్నహస్తం అందిస్తున్న అమ్మంటే బోలెడంత ప్రేమ. ఎనలేని గౌరవం నాకు.
లైంగిక సంబంధాలను మించిన ఆనందం, చైతన్యం మానవ సంబంధాల్లో వెతుక్కుంటున్నది అమ్మ.
ఆమెకు డబ్బు సంపాదన ధ్యేయం ఎప్పుడు కాదు . దానికన్నా విలువైన ఆప్యాయతలు , అనుబంధాలు , బంధాలు తన పనిద్వారా ఏర్పరచుకున్నది . తన కన్న బిడ్డనైన నాకు మాత్రమే కాదు మరెంతో మంది తల్లుల బిడ్డలకు కూడా మా అమ్మ అమ్మే. ఆ ఊరి చరిత్రలో తనకొక పేజీ లిఖించుకుంటున్నది అమ్మ .
ఈ జీవితం ఎప్పటి వరకో ఎవరికీ తెలియదు . అమ్మకి ఇష్టమైన వ్యక్తులెవరో .. ఎవరితో ఎక్కువ సమయం గడపడానికి అమ్మ ఇష్టపడుతున్నదో దృష్టి పెట్టాలి .
ఒక వేళ అమ్మని మెచ్చి ఎవరైనా తమ జీవితంలోకి ఆహ్వానించినా , లేదా అమ్మ ఎవరైనా ఇష్టపడి వారిని తన తోడుగా చేసుకుందామనుకున్నా నేనే దగ్గర ఉండి వాళ్ళను జంటగా నిలబెడతాను. ఆమె నడక నలుగురికీ బాట అవుతుంది .
ఆ .. అవునూ .. ఇంతకు ముందు ఏమన్నావూ.. , కుటుంబ పరువు , ప్రతిష్ట అంటున్నావు కదా నాన్నమ్మా ..
ఒక కుటుంబ పరువు , ప్రతిష్ట ఆ కుటుంబ స్త్రీలపైనే ఆధారపడి ఉంటాయా ..
ఓహో .. నీ కొడుకులాగా చేస్తే ఆ కుటుంబ గౌరవం , ప్రతిష్ట పెరిగిపోతాయన్నమాట ‘ లోపల్నుంచి పొంగుకొస్తున్న ఆవేశంతో అన్నది
‘నీ కొడుకు ప్రేమ వ్యవహారాన్ని దాచావు . నీ కొడుకు ఎవరితో జత కట్టాలో నువ్వే నిర్ణయించేశావు .
నీ చావు తెలివి తేటలతో వాళ్ళ పెళ్లి స్వర్గంలోనే నిశ్చయమైపోయిందని ప్రగల్బాలు పలికారు . గొప్పగా పెళ్లి చేశారు…
ఏమైంది . మూన్నాళ్ళ ముచ్చట కూడా తీరలేదు .
నువ్వు రెండ్రోజులు నల్లులు కుట్టినట్టు కుయ్యో మొర్రో అన్నావ్ రాజారాం తాతయ్య ముందు . అంతేగా ..
ఆ తాతయ్య మాత్రం ఏం చేయ గలిగాడు .. నీ కొడుకుని ?
నీ కొడుకు మాత్రం తన మనసుకు నచ్చిన వ్యక్తితో సంతోషంగా ఙివితం గడుపుతున్నాడు .
మీరంతా బాగానే ఉన్నారు . మధ్యలో అన్యాయం అయిపోయింది మా అమ్మ , నేను . అంతేగా ..
నీకళ్ళకు అంతా కనిపిస్తూనే ఉంది . అయినా నీకు అంతా సబబుగానే కనిపిస్తున్నది . అదీ నీ పెద్దరికం ‘ మనసులో మసులుతున్న భావాలు ఆవేశంగా బయటికి పొంగుకొస్తున్నాయి .
చిన్నప్పటి నుండి నిష్కలను నాన్నమ్మ ఎప్పుడూ చేరదీయలేదు.
ఆ ఇంట్లోనే ఉన్నప్పటికీ విసుక్కుంటూ, కసురుకుంటూ ఉండే నాన్నమ్మ అంటే నిష్కలకి ఎప్పుడూ ప్రేమ లేదు. ఆవిడతో అనుబంధం లేదు. మానసికంగా అంత దూరంలోనే ఉండేది .
అట్లాగని ఎప్పుడూ ఎదిరించి మాట్లాడిందీ లేదు.
సుగుణమ్మకీ అంతే, ఆడపిల్ల అన్న చిన్న చూపు .
అసలు తల్లి తెచ్చి తనదగ్గర పెట్టుకోవడం కూడా ఇష్టం లేదని సుగుణమ్మకి తెలుసు. అందుకే,ఎదిగిన మనవరాలి మనసు ఎరిగిన సుగుణమ్మ మనవరాలి నోట్లో నోరు పెట్టదు.
అదెవరు ? సుగుణమ్మ మానవరాలేగా .. మాటకు నాలుగు మాటలు వచ్చేస్తాయి దాని నోటి నుంచి అనుకుంటుంది.
తనని తన పెద్దరికాన్ని నిలదీసిన ఆ మాటలు ఈ నిశి రాత్రి ఆమె ముందు ఎందుకు నిల్చున్నాయి . ఎందుకు ప్రశ్నిస్తున్నాయి ? అర్ధంకాక తరచి ఆలోచిస్తున్నది సుగుణమ్మ .
మనిషి పుట్టుకకు మరణానికి మధ్య ఉన్న కాళీయే కదా జీవితం . ఈ ఖాళీలో ఎన్ని ఆనందాలు ,ఎన్ని సంతోషాలు , ఎన్ని సుఖాలు , ఎన్ని దుఃఖాలు , ఎంత వెలుగు , ఎంత చీకటి ..
ఇవన్నీ ఎవరి జీవితంలోనైనా ఉండేవే .. కానీ శోభ జీవితంలో ఆ పాళ్లల్లో హెచ్చు తగ్గులు చాలా ఎక్కువ .
కన్న బిడ్డ కదా .. తల్లి గురించి ఆ మాత్రం ఆలోచిస్తుంది. అందులో తప్పేమీలేదులే అని నచ్చచెప్పుకుంటున్న సుగుణమ్మకి మానమరాలి మాటలు మళ్ళీ చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి .
‘నాన్నమ్మా .. నీ కొడుకు ఉరికే మనసుకు గిరిగీశావ్..అది నీ పెద్దరికపు హక్కు అనుకున్నావ్ . పెళ్లి చేశావు .
ఆ పెళ్లిని నీ కొడుకు ఎడమకాలితో తన్నేసినప్పుడు నీ కుటుంబ పరువు ప్రతిష్ట పోవాలి .
నీ కొడుకు దేశం కానీ దేశంలో నీ కులం, నీ మతం కాని పిల్లని చేసుకున్నప్పుడు నీ కుటుంబ పరువు పోవాలి .. కానీ అలా జరుగలేదే ..
నీ కొడుకు గురించి మసిపూసి మారేడుకాయ చేసి చాలా చాలా గొప్పలు చెప్పుకుంటావు .
ఠాఠ్ .. నువ్వెంత ? నీ బతుకెంత అన్నట్లుగా ఉంటావ్ మా అమ్మతో.
ఏం .. నీ కొడుకు, నువ్వు చేసిన ఘనకార్యానికి మా అమ్మ మౌనంగా ఉందికదా .. ఎదురు తిరగలేదు కదా .. మీ మీద కేసులు పెట్టలేదు కదా ..
అందుకే , కోడలంటే అంత చులకనయిపోయిందా ..
ఎదురు మొగుడిని కొంగున కట్టుకోవడం చేతకాని చవట అని మా అమ్మనే నిందించావ్ .
బాధితురాలైన మా అమ్మనే దోషిని చేశావు . అది న్యాయమేనా ..? గుండెల మీద చేయి వేసుకొని చెప్పు .
మా అమ్మకు వచ్చిన పరిస్థితే సరళ అత్తకి వస్తే ఇట్లాగే మాట్లాడేదానివా ? ఇట్లాగే అతని వైపు వకాల్తా పుచ్చుకునే దానివా నాన్నమ్మా .. ?
నా చిన్నప్పుడు నువ్వు అన్న మాటలు పడిన మా అమ్మ, అన్న నువ్వు మరిచిపోయారేమో కానీ నేనెప్పుడూ మరచిపోలేదు నాన్నమ్మా .. అవి నా హృదయంలో గాజుముక్కల్లా చాలా సార్లు గుచ్చుకుని బాధ పెడుతూనే ఉన్నాయి .
ఎదుటివారి మనసుని అర్ధం చేసుకోవడంలోనే మా అమ్మ గొప్పదనం అర్ధం అవుతుంది.
ఒంటరితనం మనిషిని ఎంత కుంగదీస్తుందో తెలుసా .. ఒంటరి సాయంత్రాల నిశ్శబ్దం భరించడం ఇంకెంత కష్టమో నీకేం తెలుస్తుందీ .. ఆ హృదయభారం అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది.
నిండు జీవితం తాతయ్యతో సుఖంగా గడిపావుగా.. నీకేం అర్ధమవుతుందిలే …
ఆ ఒంటరితనంలోంచి పుట్టే నిరాశ నిస్పృహలను అమ్మ తనకు తానే పారదోలుకుంది . తోడు లేని లోటును జనంతో కలసి జనంకోసం పనిచేస్తూ తనలోని నిశ్చబ్దతను పోగొట్టుకున్నది. తన ఉనికికి జీవితానికి ఒక పరమార్ధం తనే సృష్టించుకున్నది.
తన కష్టాలు, కన్నీళ్లు మూటగట్టి ఆవల విసిరేసింది. ఏం జరిగిపోతున్న నిండుగా నవ్వుతూ సరదాగా ఉండటం అలవాటు చేసుకుంది అమ్మ.
అది కూడా నీకు పేచీనే . అమ్మ పచ్చగా ఉంటే భరించలేవు . కుక్క కరిచినట్టు అరుస్తుంటావ్ ..
అలగా జనంలో తిరిగి వస్తున్నదంటావ్ .
ఆ జనమే అమ్మకి జీవితం పట్ల ఆసక్తిని , ఉత్సహాన్ని కలిగించేదని నీకు ఎప్పుడు అర్ధమవుతుంది? వారికి సహాయం చేయడంలో అమ్మ సాంత్వన పొందుతున్నదని నీకు ఎప్పుడు బోధపడుతుంది .
నీ గత ప్రవర్తనను మరచి తన మంచితనంతో నిన్ను చేరదీసింది. ఆ అభిమానం లేదు నీకు .
ఏదో నీ కష్టమో , నీ కొడుకు కష్టమో తగలేస్తున్నట్టు , అంతా తగలేస్తున్నావని అమ్మ మీద విరుచుకు పడుతుంటావ్ .
మా అమ్మలాగే నాకు ఆస్తుల మీద ఆశల్లేవ్ . మీ ఆయన ఆస్తి నువ్వేమైనా చేసుకో కానీ మా అమ్మ కోసం రాజారాం తాతయ్య మీ చేతుల్లో పెట్టిన చిల్లి గవ్వ అయినా సరే అది మా అమ్మది. అది ఆమె ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసుకుంటది ‘ ఘాటుగా చెప్పింది నిష్కల .
సంభాషణ ఎక్కడినుంచి ఎక్కడికో పోతున్నదని గ్రహించిన సుగుణమ్మ ‘ శోభా ఇంకా కాలేదా ..’ అరిచింది
‘ నాన్నమ్మా .. అర్ధమయింది . ఫోన్ అమ్మచేతిలో పడేసి తప్పించుకుందామనుకుంటున్నావా .. అదేం కుదరదు .
అసలీ సంభాషణాల్లోకి లాగింది నువ్వే .. నేను కాదు కాబట్టి నువ్వు నా మాటలు వినితీరాల్సిందే… ఖచ్చితంగా చెప్పింది
మా అమ్మ ఎంత ఒంటరితనం అనుభవించిందో మీకు తెలుసా .. శరీరం చేసే తుంటరి తనాన్ని తెంచి వేయగలిగింది కానీ సమాజం నుంచి నీ లాంటి వాళ్ళు , నీలాంటి వాళ్ళ చేతుల్లో పెరిగిన ఆడ, మగ ఎన్ని రకాలుగా వేధించారో తెలుసా ..
అందరి సంగతి వదిలేయ్.
నువ్వు ఏమనే దానివి. లేవగానే అమ్మ మొహం చూస్తేనో , ఏదైనా పనిమీద బయటికి వెళ్ళేటప్పుడు అమ్మ ఎదురైతేనే ఏమనేదానివో గుర్తులేదా నాన్నమ్మా .. ఒక పండుగ పేరంటం లేదు. అన్నీ ఉండి ఏమిలేనట్లుగా అమ్మ , ఎవ్వరూ లేనట్లుగా అమ్మ , అన్నిటికీ దూరంగా, తన చుట్టూ ఉండే సమాజానికి దూరంగా బతికింది. పుస్తకాలే లోకంగా బతికింది. ఆ రోజుల్లో నేనే గనక లేకపోయి ఉంటే, బహుశా మా అమ్మ ఈ లోకంలో ఉండేది కాదేమో ..!
నాన్న ఏడమ్మా అని నేనడిగే ప్రశ్నలకు నన్ను హత్తుకున్న అమ్మ గుండె చప్పుడు, తడిసిన తలగడ అమ్మ లోపలి దుఃఖాన్ని, వేదనని పట్టిచ్చేవి . నా హృదయం విలవిలలాడేది . అమ్మని నేను ఎప్పుడూ బాధ పెట్టకూడదని నాలో నేనే చెప్పుకునేదాన్ని .
మా అమ్మ గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా ఊరుకోను . తెలిసిందా .. ఇప్పటికి ఆ విషయం వదిలేద్దాం ..
మా అమ్మే కాదు ఏ స్త్రీ అయినా ఒంటరిగానే జీవితాంతం గడపాలనుకుంటే, ఉండాలనుకుంటే అట్లాగే ఉంటుంది . లేదంటే మరో బంధంలోకి వెళ్లాలనుకుంటే వెళ్తుంది . అది వాళ్ళ వ్యక్తిగతం .’ దీర్ఘంగా నిట్టూర్పు విడిచింది నిష్కల .
ఆ వెంటనే
‘నిజ్జం నాన్నమ్మా .. నువ్వు చెబుతున్న పెళ్లి గురించి నేనూ విన్నాను .
నా కంటే ఎంతో చిన్నవాళ్లయిన ఆ పిల్లలకు వచ్చిన ఆలోచన రాని మట్టిబుర్ర నాది . అందుకు నేనిప్పటికీ చింతిస్తున్నాను .
అయినా .. ప్రేమకి , సహచర్యానికి వయసుతో పనేముంది నాన్నమ్మా ..
పుట్టిన పసి బిడ్డనుండి కాటికి కాళ్ళు జాపిన వారి వరకు అందరికీ ప్రేమ జీవితావసరం .
సరైన ప్రేమని , సహకారాన్ని పొందే వ్యక్తులు మానసికారోగ్యంతో , శారీరక ఆరోగ్యంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండగలరు . వారి జీవితంలో నిరాశ నిస్పృహాలుండవు .
వారు సంతోషంగా ఉంటూ పరిసర వ్యక్తులకు కూడా రెట్టింపు సంతోషాన్ని పంచివ్వగలరు తెలుసా ..
అయితే , నీలాంటి వాళ్ళ సూటిపోటి శూలాల్లాంటి మాటలే వాళ్ళని ముందు పడనివ్వకుండా భయపెడుతుంటాయి .
మరో పక్క పీక్కు తినే అవకాశం కోసం, అదును కోసం ఎదురుచూసే తోడేళ్ళ లాంటి వారుండనే ఉంటారు .. ‘ .
ఇంకా ఏదో చెప్పబోతున్న మనుమరాలి మాటలకు అడ్డు వస్తూ ‘ఏమోనే తల్లీ .. నీతో మాట్లాడి నేను గెల్వలేనే ..’అని అప్పటికి ఆ సంభాషణ ఆపేసింది సుగుణమ్మ .
అదికాదు నాన్నమ్మా రేపు నేనో , సరళత్త కూతురో , బాబాయి కూతురో మా మొగుళ్ళకు దూరమైతే , మరో బంధంలోకి పోతే ఇట్లాగే మాట్లాడతావా .. అంటూ రెట్టిచ్చింది నిష్కల .
ఆ వెంటనే, నువ్వు మాట్లాడినా మేం పట్టించుకుంటామా ఏంటి? మా జీవితంలో మేముంటాం . నువ్వు కాదు . నీలాంటి వాళ్ళు కాదు.
అర్ధంపర్ధంలేని పిచ్చిమాటలు మాట్లాడకు, పైన తధాస్తు దేవతలుంటారు అని మనవరాలిని కసురుకున్నది.
నిద్దుర పట్టని ఆ క్షణాల్లో ఆ సంభాషణ మదిపొరల్లోంచి బయటికొచ్చి కొబ్బరికాయ చేతికి చిక్కిన కోతిలాగా గెంతులేస్తున్నది .
* * * * *
(మళ్ళీ కలుద్దాం )
నేను వి. శాంతి ప్రబోధ . చదివింది జర్నలిజం అయినా స్థిరపడింది సామాజికసేవా రంగంలో. శ్రీమతి హేమలతలవణం, శ్రీ లవణం నిర్వహణలోని సంస్కార్ సంస్థలో వారితో కలసి ఇరవై ఏళ్ళు నడిచాను. ఆ నడకలోనిజామాబాద్ జిల్లాలోని అనేకమంది గ్రామీణ మహిళల, పిల్లల జీవన పరిస్థితులు అవగతమయ్యాయి. ఆ అనుభవాల్లోంచి రాసినవే భావవీచికలు , జోగిని , గడ్డిపువ్వు గుండె సందుక , ఆలోచనలో …ఆమె . భావవీచికలు బాలలహక్కులపై వచ్చిన లేఖాసాహిత్యం . ILO , ఆంధ్రమహిళాసభ , బాల్య లు సంయుక్తంగా 2003లో ప్రచురించాయి. తరతరాల దురాచారంపై రాసిన నవల ‘జోగిని ” . వార్త దినపత్రిక 2004లో సీరియల్ గా ప్రచురించింది . 2015లో విహంగ ధారావాహికగా వేసింది . ప్రజాశక్తి 2004లో ప్రచురించింది . గడ్డిపువ్వు గుండె సందుక (2017) బాలల నేపథ్యంలో, ఆలోచనలో …ఆమె (2018) మహిళల కోణంలో రాసిన కథల సంపుటిలు . అమర్ సాహసయాత్ర బాలల నవల (2019) మంచిపుస్తకం ప్రచురణ. ఆడపిల్లను కావడం వల్లనే శీర్షికతో వ్యాసాలు ప్రజాతంత్ర వీక్లీ లో కొంతకాలం వచ్చాయి . కవితలు ,వ్యాసాలు ,రేడియో ప్రసంగాలు వగైరా వగైరా ..