ప్రముఖ నవలా రచయిత్రి డా. సి. ఆనందారామం గారికి నివాళి!
-మణి కోపల్లె
ప్రముఖ రచయిత్రి డా. సి. ఆనందారామం గారు ఫిబ్రవరి 11, 2021 న ఈ లోకాన్ని విడిచి పెట్టారు. వారి గురించి తెలియని తెలుగు పాఠకులుండరు. తెలుగు సాహిత్యంలో నవల, కథా రచయిత్రిగా, వ్యాసకర్తగా, విమర్శకురాలిగా ఆన్ని ప్రక్రియలలోనూ పేరు పొందారు.
1935 ఆగస్టు 20 న ఏలూరులో జన్మించిన (ఆనంద లక్ష్మి) ఆనందారామం గారి చదువు ఏలూరులోనే సాగింది. తొలి కధ ‘ఆటుపోటు’ అనే కధ ఆంధ్రప్రభ పత్రికలో అచ్చయింది.. ఆతరువాత ‘అందమైన ట్రాజెడీ’ అనే కధ కాలేజీలో చదివేటప్పుడు రాశారు. బి. ఏ. వరకు చదువుకున్న వీరికి పై చదువులు చదవాలని వున్నా, చిలకమర్రి రామం గారితో వివాహం (1957) జరగటం తో ఆపేయాల్సి వచ్చింది. కానీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం తో తిరిగి చదువు కొనసాగించారు.
డా. ఆనందా రామం గారు పి.హెచ్. డి చేసి డాక్టరేట్ పట్టా సంపాదించారు. లెక్చరర్ గా హోమ్ సైన్స్ కాలేజీలోనూ, నవజీవన్ కాలేజీలోనూ, కొంత కాలం చేసి తరువాత సెంట్రల్ యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా ఉద్యోగంలో చేరారు.
ఆనాటి సమాజంలో స్త్రీలు డిగ్రీల వరకే చదివి, గృహిణులుగా ఇంటికే పరిమితం అయ్యేవారు. రాను రాను మహిళల ఆలోచనలల్లో మార్పు ప్రారంభం అయి స్వాతంత్రాన్ని కోరుకునేవారు. తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి అనుకునేవారు.
ఆ రోజుల్లో సమాజంలో వచ్చిన మార్పుల గురించి చెబుతూ “మారిన పరిస్థితుల కారణంగా స్త్రీలు ఉద్యోగాలు చేస్తూ, ఇల్లు చక్కదిద్దుకుంటూ ఆర్ధిక సమస్యలలోనూ సలహాలు, సంప్రదింపులు చేస్తూ ఆర్ధికంగా చేయూతనిచ్చేవారు. తమకూ హక్కులు కావాలి అని అనుకోవటం మొదలయ్యింది” అని అన్నారు
ఆనందారామం గారి రచనలలో ‘శారద’ నవల ఎక్కువ ప్రసిద్ధి చెందింది. 1974 ఉగాది నవలల పోటీల్లో మూడవ బహుమతి పొందిన ఈ నవల పేరు మొదట
‘‘నా నృషి: కృషితే కావ్యం’’ ఇందులో బలహీనురాలయిన రచయిత్రి కధానాయిక ఎలా విజయం సాధించిందో తెలిపే నవల ఇది.
తెలుగు సాహిత్యంలో అరవయ్యో దశకం నుంచీ మార్పులు చోటు చేసుకున్నాయి. మహిళా రచయిత్రుల సాహిత్యం మొదలయ్యింది. తరువాత ‘తులసీదళం’ ను అనుసరించి క్షుద్ర సాహిత్యం వచ్చింది. ఆతరువాత స్త్రీ వాద సాహిత్యం మొదలయింది. ఆ తరువాత అదీ కనుమరుగయిపోయి స్తబ్దత ఏర్పడింది. ప్రస్తుతం తక్కువ నిడివిలో ఆలోచింప చేసే రచనలు రావాలి అంటూ మారిన సాహిత్యాన్ని గురించి చెప్పారు
ఆరోజుల్లో వీరి నవలలు సినిమాలుగా వచ్చాయి. ‘‘మమత కోవెల” ఆధారంగా ‘జ్యోతి’ చిత్రాన్ని నిర్మించారు. అది అప్పట్లో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. మద్రాసులో ‘కళాసాగర్’ అవార్డు నందుకుందీ చిత్రం.
ఎంతో జనాదరణ పొందిన ‘‘త్రిశూలం’’ చిత్రం ‘‘జాగృతి’’ నవల ఆధారంగా వచ్చింది. అనిత (ప్రేమ దీపాలు), ప్రేమ సూత్రం (జీవితం,) ఆత్మ బలి (సంసార బంధం) మొదలైన నవలలు సినిమాలుగా వచ్చాయి.
‘ఆత్మ బలి’ నవల ‘జీవన తరంగాలు’ అనే పేరుతో టీవి లో సీరియల్ గా వచ్చింది. మైసూరు యూనివర్శిటి విద్యార్ధులకు వీరి రచనలు తెలుగు పాఠ్యాంశాలుగా వచ్చాయి.
‘వర్షిణి’ తాజా నవల గోదాదేవి ఇతివృత్తంగా సాగిన రచన. వీరు హనుమంతుని పాత్ర గురించి విశ్లేషించారు.
ఈ రచయిత్రి పురాణ గాథలలోని పాత్రలతో ఇంద్ర సింహాసనం, భారతం లోని కీచకుని పాత్ర ని పొలుస్తూ సమాజంలోని వ్యక్తులను సృస్టిస్తూ భారతం ఈనాటికీ నిలిచే వుంది అని తన రచనలలో చూపించారు.
‘‘తెలుగు నవలలో కుటుంబ జీవన చిత్రణము’’ – అనే అంశంపై గురువుగా డా. సి. నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో పరిశోధించి పి హెచ్ డి. తీసుకున్నారు.
ఎంతో విలువైన సాహిత్యాన్ని సమాజానికి అందించిన ఈ రచయిత్రి భౌతికంగా లేక పోయినా వారి రచనలు ఎప్పటికీ పాఠకుల మదిలో నిలిచి పోతాయి. వారికి నివాళులర్పిస్తూ ఈ చిన్న వ్యాసం ….
ఆనందారామంగారి సాహిత్యం గురించి, వారి మనోగతం గురించి ఎంత చెప్పినా ఇంకాఎన్నో విశేషాలు మిగిలి పోతాయి.
వీరి కలం నుంచి 61 నవలలు, వందకు పైగా కథలు, పరిశోధనాత్మక గ్రంధాలు, 3 కథా సంపుటాలు వెలువడ్డాయి.
“సమాజ సాహిత్యాలు” అనే పరిశోధనాత్మక గ్రంధం,(1989) “ప్రాగ్రూప తులనాత్మక సాహిత్యం నవలా ప్రక్రియ, వ్యవస్థాగత దృక్పధం” అనే పరిశోధనాత్మక గ్రంథాలు, “తెలుగు నవలా విమర్శ” అనే విమర్శనాత్మక గ్రంధం రచించారు.
వీరి సాహిత్యం పై పరిశోధన చేసి ఎందరో విద్యార్ధులు ఎం. ఫిల్ ., పిహెచ్ డి డిగ్రీలు పొందారు.
అవార్డులు :….
- “గృహలక్ష్మి స్వర్ణ కంకణం’’ మద్రాసు కేసరి కుటీరం వారిచే .. – 1972
- “ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు” – 1979 (తుఫాన్ నవలకు)
- “మాదిరెడ్డి సులోచన బంగారు పతకం” – 1987
- “తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాలు” – రెండు పర్యాయాలు(“సమాజ సాహిత్యాలు”. 1989 .. సాహితీ విమర్శకి, ఉత్తమ రచయిత్రి అవార్డు – 1991-92 )
- చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి మెమోరియల్ షీల్డ్, 1991
- సుశీలా నారాయణరెడ్డి 1997
- గోపీచంద్ పురస్కారం 2000
- అమృతలత జీవన సాఫల్య పురస్కారం – 2013
- మాలతీ చందూర్ స్మారక అవార్డు -2013
- లండన్, కౌలాలంపూర్, న్యూయార్క్ మొదలైన విదేశీ తెలుగు అసోసియేషన్ వారిచే సత్కారాలు పొందారు.
- లేఖిని సంస్థ వారిచే సత్కారంతో పాటు ఎన్నో సన్మానాలు, సత్కారాలు అందుకున్నారు.
చరిత్రలో డా. సి. ఆనందారామం గారి సాహిత్యం చిరస్థాయిలా ఎప్పటికీ నిలిచి వుంటుంది.
***
డా. ఆనందారామం గారితో నా పరిచయం..
చదువుకునే రోజుల్లోనే వారి నవలలు చదివి వారంటే అభిమానం ఏర్పడింది. వారి నవలలు సినిమాలుగా మారి, చిత్ర కథ, పాటలు అన్నీ జనాదరణ పొంది విజయ వంతం అయ్యాయి. నా వివాహం తరువాత నేను బి. ఏ. ఫైనల్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మాకు ఇన్విజీలేటర్ గా వచ్చినప్పుడు వారిని దగ్గర నుంచి చూడటం జరిగింది. ఆ తరువాత చాలా ఏళ్ళకి వారు డా. వాసా ప్రభావతి గారి ‘లేఖిని’ సంస్థ లో సభ్యురాలిగా చెరినపుడు చాలా మంది రచయిత్రులతో పరిచయాలు ఏర్పడ్డాయి. ప్రముఖ రచయిత్రి డా. ప్రభావతి గారితో పాటు జాయింట్ సెక్రటరీ గా ఉన్న నేను కూడా అనేక కార్యక్రమాలలో పాల్గొన్నాను. డా. ప్రభావతి గారు ప్రోత్సహించి నన్ను డా. సి. ఆనందారామం గారి ఇంటికి ఇంటర్వ్యూ తీసుకోవటానికి వెళ్ళాను. వారు చాలా ఆప్యాయంగా మాట్లాడారు. వారి ఆతిధ్యం కూడా మరువలేనిది. దాదాపు మూడు గంటల సమయం గడిపాను వారితో. రామం గారిని, వారి కుటుంబ సభ్యులని కూడా కలుసుకున్నాను.
ఆ తరువాత ‘లేఖిని’ సమావేశాలకి ఆనందారామం గారు కూడా వస్తుండేవారు. ఒకసారి ఆనందారామం గారితో ముఖా ముఖి కార్యక్రమం కూడా ఆంధ్ర మహిళా సభలో ఏర్పాటు చేయటం జరిగింది.
కొన్నేళ్ల క్రితం తీసుకున్న ఇంటర్వ్యూ లోని కొన్ని విశేషాలు నా జ్ఞాపకాలుగా అందరితో పంచుకుంటూ నా నివాళి ని తెలుపుకుంటున్నాను.
*****
మణి కోపల్లె పుట్టింది గుంటూరులో. చదివింది ఎం ఏ, (ఇంగ్లీష్) , ఎం సి జె (జర్నలిజం). కోపల్లె మురళినాథ్ సతీమణి గా ఇద్దరు పిల్లల తల్లిగా, గృహిణి గా వున్నారు. రచయిత్రిగా అన్ని ప్రక్రియల్లో వున్నా ఎక్కువగా జర్నలిస్ట్ గానే వీరి ఆర్టికల్స్ వచ్చాయి. కలం పేరు మణినాథ్ కోపల్లె . ప్రవృత్తి ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. టీచర్ గా, స్క్రిప్టర్ గా, డిటిపి ఆపరటర్ గా చేసిన అనుభవం.