బామ్మ-సైన్ లాంగ్వేజ్
-ఎం.బిందుమాధవి
“సుజనా… పుణ్య క్షేత్రాల దర్శనానికి తమిళనాడు వెళుతున్నాం. అమ్మ ఎప్పటి నించో తంజావూరు, మధురై, కుంభకోణం తీసుకెళ్ళమంటున్నది. గురువారం బయలుదేరుతున్నాం. బట్టలు సర్దు. సుజిత్ కి ఎలాగూ సెలవులే. నువ్వు కూడా నాలుగు రోజులు సెలవు పెడితే శనాదివారాలకి అటు ఇటు కలిపి పది రోజులు కలిసివస్తుంది” అన్నాడు రఘు.
స్కూల్ నించి రాగానే సుజిత్ కి ఈ కబురు చెప్పింది బామ్మ శకుంతల. వాడికి బామ్మతో ప్రయాణం అంటే మహా హుషారు. ఈ సారి అలా వెళ్ళినప్పుడు గుడి ముందు వాడికి బొమ్మలు, ముఖ్యంగా “విల్లంబులు”, “కిరీటాలు” కొనిపెడతానని వాగ్దానం చేసింది. నాన్నైతే బాణాలు కళ్ళల్లో గుచ్చుకుంటాయి అని కేకలేసి కొననివ్వరు. వాడికి ఈ మధ్య టీవీలో “జానకి రాముడు” సీరియల్ చూసినప్పటి నించీ ధ్యాసంతా బాణాలు, గదల మీదే!
ఇక బామ్మా మనవల హడావుడికి అంతు లేదు. వాడు బామ్మ మందులు మాకులు ప్యాకింగ్ చేస్తే, బామ్మ వాడికోసం చేగోడీలు, గవ్వలు, జంతికలు చేసి మూటలుకట్టింది. ట్రైన్ లో ఆడుకోవటానికి “బామ్మా ఈ చైనీస్ చెక్కర్, మామయ్య అమెరికా నించి తెచ్చిన “ట్రబుల్” గేం కూడా పెడుతున్నాను” అన్నాడు సుజిత్. వీళ్ళ హడావుడి చూసి రఘు “ఏంటి బామ్మా మనవలు ఇంటిని పీక్కొచ్చేట్టున్నారు. మనం వెళ్ళేది వారం రోజులకి! సామాను ఎంత తక్కువ ఉంటే ప్రయాణం అంత సుఖంగా జరుగుతుంది” అని గట్టిగా అంటూ…అటు ఇటు చూసి భార్య లేదని నిర్ధారించుకుని “ఊ(: మీక్కావలసినవి సర్దుకోండి. మీ సరదానెందుకు కాదనటం! సందడంతా మీదే! సుజన కోప్పడితే మాత్రం బాధ్యత నాది కాదు” అని నెమ్మదిగా చెప్పి వెళ్ళాడు.
బామ్మా మనవల సరాగం అంటే సరదా రఘుకి!
***
తనకి ఎల్ ఎఫ్ సీ లో ఫ్లైట్ ప్రయాణానికి అవకాశం ఉన్నా కూడా…ట్రైన్ అయితే అనేక ప్రదేశాలు ..రక రకాల మనుషులని, వారి పద్ధతులు..అలవాట్లని దగ్గరగా చూడచ్చు అని, రఘు ట్రైన్ టికెట్స్ కొన్నాడు. ముందుగా చెన్నై చేరి అక్కడి నించి మిని వ్యాన్ బుక్ చేసుకుని మిగిలిన ప్రయాణం చెయ్యాలని నిర్ణయించుకున్నారు.
అనుకున్న ప్రకారం కుంభకోణం, తంజావూర్, మధురై చూసి… తిరుచిరాపల్లి చేరారు. “అమ్మా రేపు తెల్లవారు ఝామునే బయలుదేరి శ్రీరంగం వెళుతున్నాం” అన్నాడు రఘు ముందు రోజు రాత్రి. ఆ రోజు శ్రీరంగం వెళ్ళి దర్శనం చేసుకుని వెనక్కి తిరిగొచ్చి అక్కడ ట్రైన్ ఎక్కే ఏర్పాట్లు చేసుకున్నారు. శ్రీరంగం చేరేసరికి ఉదయం ఎనిమిదయింది. ఊళ్ళో విపరీతమైన రష్. నేలలోంచి పుట్టుకొచ్చినట్టు ఎక్కడ చూసినా ఇసక వేస్తే రాలనంత మంది జనం. ఈ సందడిలో ఎక్కడ తప్పిపోతామో అని రఘు-సుజనలకి ఒకటే కంగారు..భయం! సుజిత్ ని చెయ్యి వదిలితే ఏ బొమ్మల కొట్లకి ఎగబడతాడో అని గట్టిగా పట్టుకున్నారు. దర్శనం క్యూ, గుడి లోపలనించి మెలికలు తిరుగుతూ పామల్లే బయటికి కిలోమీటర్ దూరం సాగి ఉన్నది. రఘు సుజిత్ ని చేత్తో పట్టుకునే, పక్కన నిలబడ్డ ఆయన్ని “ఇంత రషేమిటండి? అసలు ఇవ్వాళ్ళ దర్శనం అవుతుందంటారా?” అనడిగాడు. “ముక్కోటి ఏకాదశి” కదండీ, ఈ రోజు శ్రీరంగనాధుడి దర్శనం చేసుకుంటే సాక్షాత్తు వైకుంఠ నాధుడి దర్శనం చేసుకున్నట్టే! తెలియనట్టడుగుతారేం?” అన్నాడాయన.
సెలవుల్లో ఎల్ ఎఫ్ సి వాడుకుని తమిళనాడు ప్రయాణం అనే హడావుడిలో రఘు మధ్యలో ముక్కోటి ఏకాదశి పండుగ ఉన్నట్టు గమనించలేదు.
ఈ రష్ లో, ఇలా క్యూలో ఎంత సేపు నిల్చోవాలో? తమ వంతు వచ్చి స్వామిదర్శనం అవుతుందా? అన్నీ పూర్తి చేసి, సాయంత్రం ఐదింటికున్న తమ ట్రైన్ అందుకోగలమా అనే సందేహంతో కొట్టుమిట్టాడుతున్న రఘు చెయ్యి వదిలించుకుని సుజిత్ ఎప్పుడు జనంలో కలిసిపోయాడో చూసుకోనే లేదు. సుజిత్ భర్త చేతిలో లేకపోవడం హఠాత్తుగా గమనించిన సుజన “పిల్లాడు ఏడండి? మీతోనే ఉండాలి కదా!” అని కంగారుగా వాడిని వెతుకుతూ వెళ్ళింది.
కోతిని ఆడిస్తున్న వాడి దగ్గర నిల్చుని గంతులేస్తున్న సుజిత్ వీపు మీద ఒక్కటేసి వాడిని చేతబుచ్చుకుని జనాల్లో కలిసిపోయిన రఘు కోసం చూసింది. ఈ సందట్లో బామ్మ శకుంతల ఒక చోట, రఘు ఒక చోట, సుజన..సుజిత్ లు ఒక చోట చేరి ఒకరి కోసం ఒకరు ఆదుర్దాగా వెతకటం మొదలు పెట్టారు. రఘు మైక్ దగ్గరకి వెళ్ళి భార్య..కొడుకు కోసం ఎనౌన్స్మెంట్ చేయించి, పనిలో పనిగా అక్కడి యాజమాన్యం వారితో తమ ట్రైన్ టికెట్ గురించి చెప్పి తమకి త్వరగా దర్శనం చేయించమని విన్నవించుకున్నాడు.
మొత్తానికి క్యూల మధ్యలోంచి దూరి ఎలాగోలా ముందుకెళ్ళి దర్శనం చేసుకొచ్చి చూస్తే, అప్పటికి చాలా సేపటి నించి శకుంతలమ్మగారు తమతో లేదని గుర్తించారు రఘు దంపతులు. అప్పటికి మధ్యాహ్నం రెండు గంటలయింది. ఆకలి నక నక లాడుతూన్నది. కడుపులో ఎలుకలు కాదు..గుర్రాలు పరుగెత్తుతున్నాయి.
రఘుకి కంగారెక్కువయింది. చిన్న వయసులో ఉన్న తమకే ఇంత ఆకలి, నీరసం వచ్చేశాయి. పాపం అమ్మ ఎక్కడైనా శోష వచ్చి పడిపోయిందేమో అని అటు ఇటూ ఆందోళనగా తిరుగుతూ, ‘అమ్మా’ ‘అమ్మా’ అంటూ పిలుస్తూ, ఆవిడ పోలికలు..గుర్తులు చెబుతూ ఎవరైనా ఆమెని చూశారేమో అని అడుగుతున్నాడు.
గుడి వెనక భాగంలో తాపీగా కూర్చుని శకుంతలమ్మగారు ఒక పిల్లవాడితో ఏవో సైగలు చేస్తూ కనిపించారు. “ఏంటమ్మా ఇంత రష్ లో నువ్వేమైపోయావో అని మేం కంగారు పడుతుంటే నువ్విక్కడ కూర్చుని ఆ పిల్లాడితో కబుర్లు చెబుతున్నావా? దైవ దర్శనం చేసుకున్నావా? పద పద మనం ఇక్కడి నించి భోజనం చేసి, తిరుచిరాపల్లి వెళ్ళి సాయంత్రం ఐదింటి ట్రైన్ అందుకోవాలి” అన్నాడు రఘు.
దగ్గరకెళ్ళి గమనిస్తే ఆ పిల్లాడికి కళ్ళనిండా నీళ్ళు. అప్పటికి ఎంత సేపుగా ఏడిచాడో పాపం ఇంకా ఎక్కిళ్ళు పెడుతూనే ఉన్నాడు. కన్నీటి చారికలతో మొహం వాడిపోయి ఉన్నది. రఘుకి జాలేసింది. శకుంతల “పాపం వాడు తప్పిపోయాడు. అమ్మా నాన్నా కనిపించక వెతుక్కుంటుంటే దగ్గరకి వెళ్ళి చూశాను. వాడికి మాటలు రావు. వాళ్ళమ్మ గురించి అడిగితే సైగలతో చెప్పాడు. నేను వెతికి వాళ్ళకి అప్పచెబుతుండగా మీరొచ్చారు” అన్నది.
తప్పిపోయిన తమ పిల్లావాడిని అప్పగించినందుకు ఆ తల్లిదండ్రులు “అమ్మా ఇవ్వాళ్ళ లేచిన వేళ మంచిది. శ్రీరంగనాధుడే ఈ అమ్మ రూపంలో వచ్చి మాటలు రాని మా పిల్లవాడిని మా దగ్గరకి చేర్చాడు. లేకపోతే ఈ రష్ లో ఏమయిపోయేవాడో” అని తమ కృతజ్ఞతలు తెలియజేసి శకుంతల కాళ్ళకి నమస్కారం పెట్టారు.
***
“అమ్మా ఆ పిల్లవాడు చెప్పింది నీకెలా అర్ధమయిందమ్మా! పోనీలే తప్పిపోయిన ఒక మూగ పిల్లవాడిని తల్లిదండ్రుల దగ్గరకి చేర్చి పుణ్యం కట్టుకున్నావు. ఇప్పుడు నిజంగా మన యాత్ర సఫల మైనట్టు” అన్నాడు ట్రైన్ ఎక్కాక తీరుబడిగా రఘు.
శకుంతలమ్మ గారు ప్రతి రోజూ ఉదయం పూజాదికాలు ముగించుకుని కొడుకు కోడలు అఫీసులకి, మనవడు నర్సరీ స్కూల్ కి వెళ్ళాక రెండు రోడ్ల అవతల ఉన్న పార్క్ కి వెళ్ళి నాలుగు రౌండ్లు వాకింగ్ చేసి వస్తూ వస్తూ అక్కడ ఉన్న కూరల దుకాణంలో రెండు కూరలు కొనుక్కుని వస్తారు. అలా వస్తూ ఒక రోజు తమ సందు చివర ఉన్న బధిర విద్యార్ధుల పాఠశాల పిల్లలు, తమ స్కూల్ గ్రౌండ్ లో ఆడుకుంటూ సైన్ భాషలో మాట్లాడుకోవటం ఆసక్తిగా చూస్తూ నిలబడ్డారు. అలా రోజూ నిలబడిచూస్తున్న శకుంతల గారిని ఆ స్కూల్ యాజమాన్యం వారు పిలిచి, మీకు ఆసక్తి ఉంటే మా స్కూల్ కి వచ్చి పిల్లలతో కాసేపు గడపమని సలహా ఇచ్చారు. అతి తక్కువ కాలంలోనే ఆవిడ సైగల భాష నేర్చుకున్నారు.
తను నేర్చుకున్న విద్య ఎదురింటి వంశీ, మనవడు సుజిత్ దగ్గర ప్రదర్శించటం మొదలు పెట్టారు. వంశీ ఏం కావాలన్నా నోటితో అడగకుండా సైగలు చేసి చెబుతుంటే తల్లి కృష్ణవేణి కేకలేసి వాడిని వీళ్ళింటికి రాకుండా కట్టడి చేసింది. సుజిత్ కూడా సరదాగా బామ్మతో సైన్ భాష మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇది చూసిన సుజన, పిల్లవాడు వచ్చిన మాటలు మరచిపోయి మూగవాడిగా తయారవుతాడేమో అని అత్తగారిని ఆ స్కూల్ కి వెళ్ళటం మానిపించింది.
అలా నేర్చుకున్న సైగల భాషే ఇప్పుడు ఆ పిల్లవాడిని, వాడి తల్లిదండ్రులదగ్గరకి చేర్చటానికి ఉపయోగపడింది అని ఆవిడ చెప్పగానే రఘు “అమ్మా నీకు చుట్టూ జరిగే విషయాల పట్ల ఉన్న ఆసక్తి, ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనే తపన ఈ రోజు ఒక కుటుంబానికి పెద్ద ఉపకారం చేసింది” అన్నాడు. సుజన వైపుకి తిరిగి “అప్పుడు నువ్వు అనవసరంగా కంగారు పడి అమ్మని ఆ స్కూల్ కి వెళ్ళకుండా ఆపావు” అన్నాడు. “అత్తయ్యగారు ఈ సైగల భాష నేర్చుకుంటున్న కొత్తలో సుజిత్ చిన్నవాడు. వాడికి అప్పుడప్పుడే మాటలు వస్తున్నాయి. ఇంట్లో సుజిత్ తోను, పక్కింటి వంశీ తోను సైగల భాష మాట్లాడుతుంటే వీళ్ళు కూడా అన్నిటికీ ఆవిడ లాగా సైగలు చెయ్యటం మొదలుపెట్టారు. అందుకే వద్దన్నాను” అన్నది సుజన.
రఘు హైదరాబాద్ చేరగానే వెసులుబాటు చూసుకుని తమ సందు చివర ఉన్న బధిరుల పాఠశాలకి అమ్మతో కలిసి వెళ్ళాడు. వారు శకుంతలమ్మ గారిని చూసి సాదరంగా ఆహ్వానించి కూర్చోమని “ఏమ్మా ఈ మధ్య మాస్కూల్ కి రావట్లేదేం” అన్నారు. రఘు వైపు తిరిగి “మా పిల్లలకి ఈ బామ్మ గారంటే చాలా ఇష్టం. ఈమె వారికి డ్రాయింగ్ నేర్పేవారు. ఆడపిల్లలకి కుట్లు నేర్పేవారు. వారితో ఉంటూ సైగల భాష నేర్చుకున్నారు. త్వరలో కంప్యూటర్ క్లాసులకెళుతున్నానని, నేర్చుకుని వచ్చి పిల్లలకి నేర్పుతానని చెప్పారు” అన్నారు.
“అవునండి! ఈ మధ్య మా అమ్మ మన కాలనీ లో ఉన్న కంప్యూటర్ సెంటర్ కి వెళ్ళి కొన్ని కోర్సులు నేర్చుకుంటున్నారు. అలాగే తప్పక మీ పిల్లలకి నేర్పుతారు” అని వారి దగ్గర సెలవు తీసుకుని ఇంటికొచ్చారు.
*****
నా పేరు బిందుమాధవి. నేనొక రిటైర్డ్ బ్యాంక్ అధికారిని. ఒక స్నేహితురాలి ప్రోద్బలంతో, గత రెండేళ్ళగా కధా రచన చేస్తున్నాను. 2019 జనవరి లో 102 కధలతో “తెలుగు సామెతలు-కధా సంకలనం” అనే పుస్తకం విడుదల చెయ్యటం జరిగింది. నా కధలు “ముఖ పుస్తకం” లోని అనేక బృందాల్లో ప్రచురింపబడుతున్నాయి. కధల్లో ఎక్కువ భాగం తెలుగు సామెతలు, శతక పద్యాలని సమకాలీన సామాజిక అంశాలతో అనుసంధానించి వ్రాయటం జరిగింది.