ముసురు
అనుభవాలు – జ్ఞాపకాలు – ఆలోచనలు
(ముదిగంటి సుజాతారెడ్డి ఆత్మకథ)
-అనురాధ నాదెళ్ల
ఈనెల మనం మాట్లాడుకోబోతున్న పుస్తకం ఒక ఆత్మకథ. ఉన్నత చదువులు చదివి, డాక్టరేట్ పొంది, అధ్యాపక వృత్తిని ఎంతో ఇష్టంగా నిర్వర్తించి, అసోసియేట్ ప్రొఫెసర్ గా పదవీ విరమణ చేసిన శ్రీమతి ముదిగంటి సుజాతారెడ్డి గారి ఆత్మకథ ‘’ముసురు’’ చాలా చాలా ప్రత్యేకమైనది. ఆమె పదిలంగా దాచుకున్న జ్ఞాపకాలు, జీవితం పొడవునా చూసిన అనుభవాలు, అవి రేకెత్తించిన ఆలోచనలు పుస్తకమంతా విస్తరించి ఉన్నాయి. వీటన్నింటిని తెలంగాణా మాండలికపు గుబాళింపుతో కమ్మగా చెప్పిన అరుదైన కథ ఇది.
ఆత్మకథ అంటూ తన జీవితాన్ని మాత్రమే ఆవిష్కరించటం కాక తాను పుట్టి పెరిగిన దొరల కుటుంబ వ్యవస్థ గురించి, తెలంగాణా సామాజిక జీవనాన్ని, భర్త శ్రీ గోపాల్ రెడ్డి గారితో కలిసి జర్మనీలో గడిపిన జీవితం గురించి, తిరిగి వచ్చాక తాము వదిలివెళ్లిన గడ్డపైనున్న సామాజిక ఆర్థిక పరిస్థితుల గురించి ఎన్నో విషయాలను పాఠకులతో పంచుకున్నారు.
శ్రీకాసుల ప్రతాపరెడ్డి ముందు మాటరాస్తూ రచయిత్రి జీవితంలో రెండు ప్రధానమైన కాలాలున్నాయని చెప్పారు. తెలుగు సమాజంలో జరిగిన తెలంగాణా సాయుధ పోరాటం, స్వాతంత్రం వచ్చిన తరువాత జరిగిన ఉద్యమాలు కూడా ఆమె కుటుంబాన్ని ప్రభావితం చేసాయి.
ఈ నవల 2010 సంవత్సరంలో ప్రచురణ పొందింది. అంతకంటే ముందుగా ‘’ప్రజాతంత్ర’’ పత్రికలో ధారావాహికంగా ప్రచురించబడింది.
సుజాతారెడ్డి గారు తెలంగాణా ప్రాంతంలో నల్గొండ జిల్లాలో భూస్వాముల ఇంట పుట్టారు. మగబిడ్డ పుడతాడన్న ఆశతో ఉన్న తల్లి నిట్టూర్పు విడిచినా, తాతమ్మ, నాయనమ్మలు మాత్రం సుజాతను గారంగా పెంచారు. ఆమె అన్నింటిలో తానే అధికంగా ఉండాలనుకుంటుందనీ, ఆమె పైనున్న వాళ్ళు పైకి రారని, వారికి కీడని ఆమె జాతకం చూసి చెప్పడంతో, ఆ జోస్యాన్ని ఆమె తల్లి గాఢంగా నమ్మేరట. ఆమె నమ్మకం మరింత గట్టిపడేలాంటి అనుభవం ఒకటి చెబుతారు రచయిత్రి.
సుజాతారెడ్డి గారి అన్న ఆటలలో ప్రావీణ్యత ఉండి, మిలటరీలో చేరాలన్న కలలను లోలోపల కనేవారట. కానీ మిలటరీలో చేరటమంటే మృత్యుముఖంలోకి ప్రవేశించటమని భావించే రోజుల్లో తన కలను తల్లిదండ్రులతో చెప్పే ధైర్యం చెయ్యలేక తనంత తానుగా ప్రయత్నించి విఫలమై, ఆ కారణంతోనే ఏపనీ చెయ్యలేక వ్యవసాయం చేస్తానని ఊరిలోనే ఉండిపోయారట. కొడుకు స్థితికి సుజాత పుట్టుకే కారణమన్నది ఆ తల్లి మనసులో నిశ్చయ పడింది. తమ కుమారుడు మిలటరీలో చేరాలన్న ఆశను వ్యక్తం చేసినపుడు తల్లిగా తానూ అడ్డుచెప్పానని, తన భర్త మాత్రం కుమారుడిని ప్రోత్సహించి ఆర్మీలో చేరాలన్న అతని ఆశయాన్ని తీర్చారని సుజాతాదేవిగారు చెప్పారు.
ఈ సంగతి ప్రస్తావిస్తూ ప్రస్తుత విద్యావిధానం ఎంత నిస్సారంగా ఉందో సుజాత గారు వివరించారు. తల్లిదండ్రుల ఆశలను తీర్చేవిధంగా పిల్లలు ఇంజనీరో, డాక్టరో చదవవలసిన ఒత్తిడి నేటి పిల్లల మీద ఎక్కువైందని, దానికి తగినట్టుగానే కోచింగ్ సెంటర్లు డబ్బు చేసుకుంటున్నాయని, పిల్లల ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా తల్లిదండ్రులు పిల్లల పట్ల నేరం చేస్తున్నారని చెబుతారు. పిల్లలు స్వంత ఆలోచనలతో, స్వేచ్ఛగా పెరిగే వాతావరణం మనకు లేదని, ఇది మన విద్యావిధానంలో ఉన్న ప్రథమ లోపమన్నది అందరూ ఎప్పటికి గుర్తిస్తారో అని రచయిత్రి ఆవేదన వ్యక్తం చేసారు.
మన వైద్య విధానం గురించి కూడా రచయిత్రి స్పష్టమైన ఆలోచనలను కలిగి ఉన్నారు. పూర్వం రోగి నాడిని చూసి రోగనిర్ణయం చేసేవారని, ఇప్పుడు రోగికి అనేక రకాల పరీక్షలను చేయించి వాటిని కంప్యూటర్లో ఫీడ్ చేసి దానిద్వారా రోగం నిర్ధారణ చేస్తున్నారని డాక్టర్ల విచక్షణకు అక్కడ చోటు లేకుండా పోతోందని చెప్పారు. ఈవిధంగా యంత్రాల మీద ఆధారపడుతున్న మనిషి మేధకి పనిలేకుండా పోతున్నదని, కోతి నుంచి ఎదిగే దశలో అవసరం, ప్రయోజనం లేక ఏవిధంగానైతే తోక జారిపోయిందో మనిషి నుంచి బుధ్ధి కూడా అలాగే జారిపోతుందేమో కొంతకాలానికి అంటారు రచయిత్రి. నిత్యం అన్ని చోట్లా ప్రతి చిన్న లెక్కకి కాలిక్యులేటర్ వాడుతున్నారు. రచయిత్రి పూర్వకాలంలో ఆయుర్వేదం, యోగాభ్యాసం అనేక రకాల రుగ్మతలను ఎంత చక్కగా పరిష్కరించేవో చెబుతారు. అంతేకాక తమ ఆలోచనకు అందని రోగ నివారణకు భూతవైద్యాలను ఆశ్రయించేవారని కూడా చెబుతారు.
సుజాతాదేవిగారి తండ్రి రాంరెడ్డి కృష్ణాష్టమినాడు మూలా నక్షత్రాన పుట్టారని, ఆ కారణంగా తండ్రినో, మేనమామనో మింగుతాడన్న నమ్మకం ఉండేదని, పుట్టిన పిల్లవాడు గొండ్ల్యాలు పట్టుకుని నిలబడే వయసు వచ్చేనాటికి అలాటి ఉపద్రవం తప్పదని జాతకంలో చెప్పిన్నట్టుగానే తన తాతయ్య టి.బి.తో ఇరవై యేళ్ల వయసులో మరణించారని చెబుతారు. అప్పట్లో టి.బి.కి మందు తెలియదు.
‘’గొండ్ల్యాలు’’ అన్న పదం లాగే అనేక పదాలు మనకు తరచు తారసపడనివి ఈ పుస్తకంలో చూస్తాము. ఉదాహరణకి, పావురం (గారం), మొంటె (పిల్లలు ఆడుకునే చిన్న చాట), మెరిగెలు (వడ్లగింజలు), కచ్రం (గూడుబండి), కుచ్చి (చిన్న గుడిసె), గవిసెన (దిండు), కసీదా (వస్త్రం మీద పువ్వులు, లతలు కుట్టటం) వగైరా అనేక అందమైన పదాల వాడుకను చూస్తాము. తన తాతమ్మ తనను ‘’గార్వం’’గా చూసుకునేదని చెబుతారు. కచ్రం బండి, ఎయిలవారంగ లేచి తయారవటం వంటి ప్రయోగాలు ప్రయాణాల సమయంలో ఉపయోగించారు.
దేవుడు, మతం గురించి ప్రస్తావిస్తూ సృష్టిలో ప్రతిచోటా కార్యకారణ సంబంధం చూస్తున్నాం అని చెబుతారు. ఆధునిక కాలంలో వివేకానందుడు మానవసేవ, సమాజ సేవ వంటి మానవతను ప్రచారం చేసాడని చెబుతారు. హిందూ మతంలో స్వేఛ్చ ఎక్కువని అందువల్లనే వ్యక్తి మోక్షానికున్న ప్రాధాన్యత సామూహిక చైతన్యానికి లేదని, మానవత్వం, ధ్యానం, శాంతి, స్వచ్ఛమైన ఆధ్యాత్మికత ఉన్న మతం మనకు కావాలని చెబుతారు. దేవుడిని అనేక రూపాల్లో పూజించటం కాక ఏకేశ్వరోపాసన, కర్మకాండలకు దూరంగా జరగటం అవసరమని చెబుతారు.
చిన్నప్పుడు మగపిల్లలతో చేరి గిల్లీదండా, గోలీలు, కబడ్డీ వంటి ఎన్నో ఆటలు ఆడేదాన్నని చెబుతూ ఎప్పుడూ బయట ఆడటం చూసి తల్లి తనను ‘’మగరాయుని లెక్క తిరుగతది, దీనికి పెండ్లి కాదు’’ అని తిట్టేవారని చెబుతారు. అంత చిన్నవయసునుంచే ఆడపిల్ల పెండ్లి గురించిన చింత ఉండేది. పిల్లలు తమకు ఇష్టమైన ఆటలు ఆడనియ్యకుండా పిల్లల సృజనాత్మకత, మేధస్సులను అణచివేసేలా పెద్దలు ఆంక్షలు విధించేవారని చెబుతారు.
సుజాతారెడ్డిగారు తమ బాల్య స్మృతులను తలుచుకుంటూ తాము సృజనాత్మకత ఉన్న ఆటలెన్నో ఆడేవారమని చెబుతారు. ఉదాహరణకి అగ్గిపెట్టెలతో టెలిఫోన్ ఆట ఆడుకోవటం. వేసవి కాలం రాత్రుళ్ళు ఆరుబయట వాకిట్లోమంచాలమీద, డాబాలమీద పడుకుని నీలాకాశంలో చుక్కలు లెక్కించటం వంటి మధురానుభూతులు ఇప్పటి పిల్లలకి ఊహకి కూడా అందదంటారు.
తమ చిన్నతనంలో అగ్గిపెట్టెలు లేని కాలంలో వంటింట్లో పొయ్యి ఎప్పుడూ మండుతూనే ఉండేదని చెబుతూ మన దేశంలోకి అగ్గిపుల్లలు, సబ్బుబిళ్లలు ఎప్పుడు వచ్చాయో పరిశోధించాలని అంటారు రచయిత్రి.
ఆ కాలంలో ఇంట్లో గంపెడు పిల్లలుండాలన్న కోరిక అందరిలో ఉండేదని, కానీ అనారోగ్యకర వాతావరణంలో పురిటి గదులు ఉండటం కారణంగా చాలామంది పిల్లలు పురిటిలోనే చనిపోయేవాళ్లని, బతికిన పిల్లలు కూడా కొందరు తర్వాత వ్యాధులతో చనిపోయేవాళ్లని చెబుతారు. ఆకాలంలో ఆడపిల్లల్ని పెళ్లిచేసి పంపేప్పుడు దగ్గర ఊర్లలోని వాళ్లతోనే సంబంధం కలుపుకునేవారని చెబుతారు. ప్రయాణ సౌకర్యాలు అంతగా లేని కాలం కావటంతో వార్తలను బంధువులకు పంపాలంటే చాకలి, మంగలి, వెట్టి మాదిగలను పంపేవాళ్లు. దాసరివాళ్ల వంటి సంచార జాతులు క్షేమసమాచారాలను మోసుకొచ్చేవాళ్లట. అత్తింటిలోని ఆడవాళ్ల మంచిచెడుల గురించిన వార్తలను, పెండ్లి సంబంధాలను కూడా చేరవేసేవారని, 1950ల తరువాత మాత్రమేపోస్టులో ఉత్తరాలు రావటం చూసినట్టుగా రచయిత్రి చెబుతారు.
ప్రయాణాలు చాలా కష్టాలతో కూడి ఉండటంతో దారిలో ఉన్న బంధువుల ఇండ్లలో లేదా గ్రామాధికారుల ఇండ్లలోనో రాత్రి బస చెయ్యటం, లేదా చెట్లనీడలో వంటలు చేసుకుని, రాత్రులందు పెద్ద మేడల అరుగుల మీద విశ్రాంతి తీసుకునేవారు. అందువల్లనే ఒకసారి ప్రయాణమై వెళ్తే నెలల తరబడి ఉండిపోయేవారని చెబుతారు. అప్పటి ఫ్యూడల్ వ్యవస్థలో మగవాడు ఏమి చేసినా చెల్లేది. భార్య పుట్టింట్లో ఉన్నప్పుడు మరొకస్త్రీని వుంచుకోవటమనేది ఉండేది. అది పురుషత్వానికి అలంకారంగానూ, పురుషాహంకారానికి చిహ్నంగానూ భావించేవారు. అదీకాక ఫ్యూడల్ వ్యవస్థలో కుటుంబమంతా ఒకరి పెత్తనం కింద జరిగేది, దానితో ఇంట్లో ఉన్న చాలామంది మగవాళ్లకి బాధ్యతలు, పనులుండేవి కావు. ఆధునిక కాలంలోనూ మగవాళ్లు కొందరు రెండుమూడు వివాహాలు చేసుకుంటున్నారు. దానికేం కారణాలు చెబుతాం అని రచయిత్రి ప్రశ్నిస్తారు.
తాము చిన్నప్పుడు ప్రయాణించిన కచ్రం బండ్లు తేలిగ్గా ఉండేవని, మన సినిమాల్లో కనిపించే బరువైన రథాలు యుధ్ధాలలో ఎంతవరకు ఉపయోగపడతాయి? దీనిగురించి పరిశోధన చెయ్యాలని రచయిత్రి అభిప్రాయపడతారు. దొరలు, దొరసానులు కచ్రం బండ్లలో ప్రయాణం చేస్తున్నప్పుడు బండి ముందుగానీ, వెనుకగానీ, పక్కన గానీ చాకలివాండ్లు ఉరకటం ఉండేది. ఇప్పటి మన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల కార్ల పక్కన, ముందు, వెనుక పరుగెత్తే రక్షకభటులను చూస్తే ఏకాలంలోనైనా అధికారం చేతిలో వున్నవాళ్లు తమ అధికారాన్ని పూర్తిగా ఉపయోగించుకోవటానికి తమకింద వాళ్లను అణచి ఉండటం ఉంటుందేమో అనిపిస్తుందని సుజాతాదేవి అంటారు.
1970 దశకంలో కూడా తమ ఊరికి వెళ్లాలంటే నకిరేకల్లు వరకు మాత్రమే బస్సు వెళ్లేదని, ఆపైన బండిలో ప్రయాణించేవారమని చెప్పారు. వారి ఊరికి 1980 దశకంలో బహుశా బస్సు వచ్చిందని చెప్పారు. అదే సమయంలో కరెంటూ కూడా వచ్చిందట. ఇప్పటికీ కారులో పోగలిగేంత మంచి రోడ్డు లేదంటారు. శ్రావణమాసంలో వనభోజనం అనే పండుగను జరుపుకునే తెలంగాణా ప్రజలు దానిని ‘’చెట్లల్లకు పోవటం’’ అనే అందమైన పదబంధంలో చెబుతారు. అలాగే ఇండ్లల్లకు పోవటం (కొత్త ఇంటి గృహప్రవేశమని అర్థం), బాటలు కాస్తున్నది (ఎదురుచూస్తున్నది) అన్న అచ్చతెలుగు పదబంధాలు వాడుకలో ఉండేవని చెబుతారు.
1940ల్లో తెలంగాణా పోరాటం కమ్యూనిస్టు ఉద్యమం జోరుగా సాగి, నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భూస్వామ్య ఫ్యూడల్ వ్యవస్థ అంతరించింది. అప్పటికింకా ఉత్తర తెలంగాణా పాంతంలో నక్సలైట్ ఉద్యమ ఛాయలు లేవు. అందువల్ల 1950 తర్వాత కూడా ఉత్తర తెలంగాణా దొరల ఇండ్లలో ఆడబాపల వెట్టిచాకిరీ నడుస్తోనే ఉండేది. 1970 దశకంలో ఉత్తర తెలంగాణా ప్రాంతంలో భూస్వాములను కొందర్ని నక్సలైట్లు చంపటంతో మిగిలిన వారు హైదరాబాదుకు, పట్నాలకు పారిపోయి రాజకీయాల్లోకి, వ్యాపారాల్లోకి దిగారు. డబ్బును సంపాదించారు. అలా వారు ఫ్యూడల్ వ్యవస్థనుంచి బూర్జువా వ్యవస్థలోకి అడుగుపెట్టారు. ఏ వ్యవస్థ అయినా మనిషికి మరో మనిషి మీద అధికరం పెత్తనం చలాయీంచాలన్న నైజం పోదేమో!
తమ చిన్నప్పుడు ఆడపిల్లల్ని బడికి పంపాలన్న ఆలోచన, తొందర ఎవరికీ ఉండేది కాదని చెబుతారు. 1946-47 ప్రాంతాల్లో బడికి వెళ్ళిన గుర్తు ఉందనీ, అక్షరాలైనా నేర్చుకోకుండానే ఒక రాత్రి కొందరు కర్రలతో తమ బంగ్లాలోకి రావటం, అప్పుడు తండ్రి, ఇంకా పెదతాత, చినతాత కొడుకుల ముఖాల్లో కనిపించిన విచారం అస్పష్టంగా తన జ్ఞాపకాల్లో ఉందని చెబుతారు. దస్తర్లు, రికార్డ్లు, తల్వార్లు అన్నీ ఆ వచ్చినవారి ముందు పరచటం తాను నిద్రకళ్లతో చూసానని చెబుతారు.
ఆ తర్వాత తమ కుటుంబ పరిస్థితి ఎప్పుడూ మునుపటిలా వైభవంగా లేదని రెండు తరాలుగా కలిసి ఉన్న కుటుంబాలు ఎవరికి వారుగా విడిపోయారని చెబుతారు. అక్కడే ఉంటే కమ్యూనిస్టులతో, రజాకార్లతో భయం! ప్రాణభయం! దోపిడీలు, మానభంగాలు, హత్యలు సులభంగా జరిగిపోతున్నాయి. కుటుంబంలోని పెద్దలకు ఈ పరిస్థితుల పట్ల ఎంతవరకు అవగాహన ఉందో తెలియని స్థితి. భూస్వామ్య కుటుంబాలు వలస వెళ్లటం ప్రారంభమై, సుజాతాదేవి కుటుంబం గుంటూరు జిల్లాలోని అద్దంకికి చేరారు. చిన్న ఇల్లు కిరాయికి తీసుకున్నారు. భూస్వాములైనా భూములూ, నగలూ బంగారం ఉండేది కానీ చేతిలో డబ్బు ఉండేది కాదని, ఇలాటి పరిస్థితిలో కిరాయికి ఇల్లు తీసుకోవటం, బియ్యం, పప్పులు అన్నీ కొనుక్కోవటం చాలా కష్టంగా ఉండేదని, అలవాటు లేనివిధంగా అన్నిపనులనూ ఇంట్లోని స్త్రీలే చేసుకోవలసి రావటం, కొత్త ప్రాంతంలో కొత్త మనుషుల మధ్య జీవితం ఎన్నో కష్టాలను చూబించిందని, చిన్నపిల్లలుగా తమకు అవన్నీ తెలిసేవి కావని రచయిత్రి రాసారు. నిజాం రాష్ట్రంలో డబ్బు ‘’కల్దారు’’ అంటారని, బ్రిటిషు ఇండియా డబ్బు ‘’హాలీ’’ అని ఉండేదని డబ్బును కల్దారు నుంచి హాలీకి మార్చుకుని ఆంధ్రప్రాంతానికి వెళ్లవలసి ఉండేదని చెబుతారు.
అద్దంకి నుంచి కొంతకాలానికి నరసరావుపేటకు మకాం మార్చారు రచయిత్రి కుటుంబం. నిజాం వాళ్లకు ఇళ్లు అద్దెకు దొరకటం కష్టంగా ఉండేదట. అదీకాక వీరివల్లనే కిరాయిలు పెరిగేయని స్థానికుల ఆగ్రహం చూపేవారట. సామాన్య ప్రజలకు నైజాం పరిస్థితులు తెలియక అక్కడనుంచి వచ్చిన వారి పట్ల సానుభూతి ఉండేది కాదు. రెండో ప్రపంచ యుధ్ధం ఖర్చు భారతదేశం పై పడి ఆర్థికంగా దేశం దెబ్బతిని వస్తువుల ధరలు పెరిగాయన్న అవగాహన లేక నైజాం ప్రజల వలస వలన ఇలా జరిగిందని ఇక్కడివారికి కోపంగా ఉండేది. మారిన జీవన పరిస్థితులతో కుటుంబాల్లో ఘర్షణలు ఏర్పడుతుండేవి.
1948లో సెప్టెంబరు 17 న నైజాం రాజ్యానికి విముక్తి కలిగింది. కొంత ప్రశాంతత ఏర్పడింది. సుజాతాదేవి కుటుంబం తిరిగి నైజాం చేరారు. నిజాంను గద్దె మీద ఉంచేందుకు అతని సైన్య సహాయంతో రజాకార్లు పోరాటం చేసారు. ప్రజలు సాయుధులై దానిని ఎదుర్కొన్నారు. నైజామంతా యుధ్ధభూమిగా తయారైంది. నిజాం లొంగిపోయినా, కమ్యూనిష్టులు సాయుధపోరాటాన్ని సాగించారు. వల్లభాయి పటేల్ ఆదేశంతో ‘’పోలీసుచర్య’’ జరిగేంతవరకు పగలంతా రజాకార్ల దౌర్జన్యాలు, రాత్రి కమ్యూనిష్టుల వేధింపులు జరుగుతుండేవి. నల్లగొండ జిల్లా అల్లకల్లోలంగా ఉండటంతో వెంకటాద్రి పేటలోని తాతగారింట సుజాతాదేవి కుటుంబం ఉండేది. ఆసమయంలోనే రచయిత్రి వీధిబడికి వెళ్లారు. నల్లగొండలో ఆమెను నాల్గవ తరగతిలో 1950లో చేర్చారు. 1950లో వెల్లోడి ప్రభుత్వంలో తెలంగాణాలో ఉర్దూ మీడియం పోయి తెలుగు మీడియం వచ్చింది. స్కూళ్లల్లో టీచర్లు కొరత ఏర్పడి, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చారు.
ఆకాలంలో వ్యవసాయం మీద ఆధారపడే జీవించేవారు. అతివృష్టి, అనావృష్టిలతో పంటలు నష్టపోయేవి. ఊర్లో తిండిగింజలు అవసరం ఉన్నవాళ్లకు డబ్బును వడ్డీకి ఇచ్చినట్టుగా ధాన్యాన్ని ఇవ్వటం జరిగేది. పంటలు పండిన తరువాత బదులు తీసుకున్నవాళ్లు రెండింతలు ధాన్యం కొలిచి ఇచ్చేవాళ్లు. ప్రజలు కొలిచే ధాన్యంతో ఎప్పుడూ దొరల గరిసెలు నిండుగా ఉండేవి. కమ్యూనిష్టు ఉద్యమం, పోలీసు చర్య తరువాత భూస్వాముల జీవితాలే మారిపోయాయి. భూములను కౌలుదార్లు స్వంతం చేసుకున్నారు. కౌలు కొలవటం బందయింది.
తెలంగాణా విమోచనోద్యమం తరువాత ఉమ్మడి కుటుంబాలు విఛ్చిన్నం అవటం, ఆడపిల్లల జీవితాల్లో వివాహం, చదువు విషయంలో చైతన్యం రావటం వంటి ముఖ్యమైన మార్పులు జరిగాయి. ఆకాలంలో నైజాం రాష్ట్ర గ్రామాల ప్రజలు తమ తగాదాలను గ్రామంలోనే పరిష్కరించుకునేవారు.
భూస్వాములను విలన్లుగా చూపేందుకు సాహిత్యంలో వారికి స్త్రీవ్యామోహాన్ని అంటగట్టి ఉంటారేమో! వేరేవిధంగా వారిలో చెడును చూపలేక ఇలా చూపుతారేమో అంటారు రచయిత్రి. అయితే మనకున్న సాహిత్యం, సినిమాలు కూడా తెలంగాణా ప్రాంతపు దొరలను స్త్రీ వ్యామోహం కలవారిగానే చూబిస్తాయి. స్త్రీవాదంలో స్త్రీల అణచివేతను కేవలం లైంగిక రాజకీయాలుగా చూపేవాళ్లు కూడా తమ పాత్రల్లో భూస్వాములకు ఇటువంటి అవలక్షణాలను అంటగడ్తుంటారు. వట్టికోట ఆళ్వారుస్వామి తెలంగాణా పోరాటాన్ని చిత్రించే ‘’ప్రజల మనిషి’’ లో అక్రమ సంబంధాలు లేవు.
కేవలం తెలంగాణేతరులు రాసిన తెలంగాణా పోరాటాలను చెప్పే నవలల్లో మాత్రం భూస్వాముల్లో స్త్రీవ్యామోహం గురించి, బహు భార్యాత్వం గురించి అవాస్తవాలు కన్పిస్తాయంటారు. అభ్యుదయ వాదుల్లోనూ, విప్లవవాదుల్లోనూ కనిపించే బహుభార్యాత్వం గురించి ఎందుకు మాట్లాడరో అని ప్రశ్నిస్తారు రచయిత్రి. దొరలు తమ కుటుంబం, కుటుంబ గౌరవం, తాహతుల గురించి ఆరాటపడేవారేకాని స్త్రీవాంచలతో స్త్రీలవెంట పరుగెత్తేవారు కాదు. అసలు వేరే ప్రాంతాల్లో అన్ని వర్ణాలు, వర్గాల్లో ఫ్యూడల్ సమాజంలో వేశ్యలను ఉంచుకోవటం గౌరవంగా చూడబడినా, తెలంగాణాలో వేశ్యలనుంచుకోవటం వంటివి లేవని రచయిత్రి చెబుతారు.
రష్యా తరువాత భూస్వాములనెదిరిస్తూ రైతులు కమ్యూనిష్టుల మద్దతుతో తెలంగాణాలోనే భూపోరాటం చేసారు. కానీ యుపి, బీహార్, బెంగాల్ వంటి ప్రాంతాల్లోనూ, ఇంకా జమిందారీలు, సంస్థానాలు ఉన్న ప్రాంతాల్లో ఇలాటి పోరాటాలు ఎందుకు రాలేదన్నదానికి చరిత్రకారులు కారణాలను పరిశోధించాలని రచయిత్రి రాసారు.
తెలంగాణాలో నిజాం పాలన విధించిన ఆంక్షలవల్ల ప్రజలకి తమ భాషను, సాహిత్యాన్ని అభిమానించే అవకాశం లేకపోయింది. అందుకే మొదటగా మాతృభాషాభిమానం రూపంలో గ్రంథాలయోద్యమం ఆరంభమై, తెలంగాణా ప్రజల్లో మాతృభాషపట్ల మమకారాన్ని రగిలించింది.
నైజాం కాలంలో ముస్లిం జనాభా పెరగాలనే భావజాలంతో మతాంతీకరణ కార్యక్రమాలను నిర్వహించేవారు. డబ్బును, ఉద్యోగాలను ఎరగా చూపి ముస్లింలుగా మార్చేవారు. ఇది చదువుతుంటే మన దేశంలో ఇప్పటికీ కొనసాగుతున్న వివిధ మతాంతీకరణలు మనసులో మెదలక మానవు.
హెచెఎస్సి పూర్తయ్యాక సుజాతాదేవి పై చదువుల విషయంలో ఇంట్లో పెద్ద యుద్ధం జరిగిందని, ఊర్లో కాలేజీ లేనందున హైదరాబాదు పంపి ఖర్చు భరించి చదివించటం, ఆపై ఖర్చు పెట్టి పెళ్లి చెయ్యటం అనేవి సమస్యలుగా కనిపించాయట. కనీసం పెళ్ళి కుదిరేవరకు చదివిస్తామన్న ఆలోచనతో హైదరబాదులోని రెడ్డి ఆడపిల్లల కాలేజీలో చేర్పించారు. ఇంగ్లీషు మాధ్యమంలో విద్య, పట్నవాతావరణం, అక్కడి కాన్వెంటు చదువులు చదివిన సహచరుల మధ్య ఆమె ఉక్కిరిబిక్కిరి అయ్యారని చెబుతారు. ఇంగ్లీషు సబ్జెక్ట్ లో మిల్టన్, షెల్లీ వంటివారి కవితలు, ప్రోజ్ లో స్టీవెన్ సన్, గార్డెనర్ వంటివారి వ్యాసాలుండేవని, ఆ రచయితల, ప్రాంతాల నేపథ్యం తెలియక ఏమీ అర్థం అయేదికాదని చెబుతారు. అలాటి పాఠాల వలన విద్యార్థులు, ముఖ్యంగా గ్రామాల నుంచి వచ్చినవారు ఎంతగా పరాయీకరణకు గురవుతారో కదా అని దిగులు పడతారు. ప్రపంచ చరిత్ర, సైన్స్ పాఠాలు హై స్టాండర్డ్ లో పాఠ్యాంశాలుండేవని చెబుతారు. ఇలాటి అధికమైన, కఠినమైన సిలబస్ ఇప్పటికీ పిల్లలపై ఒత్తిడిని పెడుతోంది. నల్లగొండలో కాలేజీ పెట్టాక అక్కడే డిగ్రీలో చేరారు. తనకి ఇష్టమైన తెలుగు సాహిత్యాన్ని తీసుకున్నారు.
వివిధ భాషలలో పదాల పుట్టుక గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను రచయిత్రి చెబుతారు. ఉదాః కలకత్తా నుంచి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు దిల్లీలో జనావాసాలకు దూరంగా పెద్ద మేడల్లో ఉండేవారని, వారిని గురించి చెప్పేప్పుడు దిల్లీవారు ‘’బంగ్లా’’ అని చెప్పేవారు. క్రమంగా వారుండే మేడకు బంగ్లా పర్యాయపదంగా మారింది. బంగ్లా పదం ఉర్దూ నుంచి వచ్చి చేరింది. ఆంధ్రాలోకి వచ్చేసరికి అది బంగళా గా మారింది. అలాగే ఇంగ్లీష్ లోని ‘’కర్రీ, రైసు’’ అనే పదాలు తెలుగు పదాలైన కూర, అరసు అనేవాటికి రూపాంతరాలే. నైజాం వాళ్లు పైసలు అనే పదం పోర్చుగీసు పదం ‘’పెసట్టో’’ నుంచి వచ్చిందని, ఆంధ్రలో వాడే డబ్బు అనే పదం ‘’డబ్’’ పదం నుంచి వచ్చింది.
రాజనీతి శాస్త్రం పాఠాలు చదువుకునేప్పుడు మ్యాకియవల్లి ని చాణక్యునితో పోల్చే విషయంలో చాణక్యుడు క్రీ.పు. నాల్గవ శతాబ్దం వాడు కనుక మాకియవల్లినే ‘’మాడర్న్ చాణక్య’’ అనాలని, అలాగే కాళిదాసు, షేక్స్పియర్ ల పోలిక కూడా చెప్పాలంటారు. చరిత్రలో కనిపించే పక్షపాత ధోరణులను మనం పునర్న్ర్మించుకోవాలని, పునరాలోచన అవసరమని చెబుతారు.
పెళ్లి సంబంధాలు చూసేప్పుడు చదువుకున్న వారిని చేసుకోవాలన్న ఆశ తనలో ఉండేదని, అలా అయితేనే తాను ఉన్నత చదువులు చదువుకునే అవకాశం ఉంటుందని అనుకున్నారట. ఆర్యసమాజీకులైన మామగారి ఆదర్శానికనుగుణంగా కొంతవరకు ఆర్యసమాజ పద్ధతిలోనే పెళ్లి జరిగింది. ఈ విషయం చెబుతూ రచయిత్రి ఇప్పటి వివాహాలలో చూస్తున్న ఆడంబరాలను నిరసించారు. పెళ్ళిలో చెప్పే కన్యాదానం అనేపదానికి దానం అన్న అర్థం కాదని, ‘’giving away of the bride’’ అని అర్థం చెబుతారు.
ఆమె జీవితభాగస్వామి శ్రీ గోపాల్ రెడ్డి గారు ఆమెను ఉన్నత చదువులవైపు, ఉత్తమ సంస్కారం వైపు నడిపించారు. వారి వైవాహిక జీవితం ఆదర్శవంతమైనదని చెబుతారు. ఇద్దరూ సమాన విద్యా, వైదుష్యాలున్న వ్యక్తులు. మామగారు కొండల్ రెడ్డిగారు ఆర్య సమాజ ప్రభావంతో కులభేదాన్ని, వివక్షను ఎదిరించారు. ఆయన కౌలుదార్ల హక్కులకోసం పోరాడేవారు. అలాటి ఒక సందర్భంలో హత్యకు గురయ్యారు.
ప్రాచీన కాలంలో శాస్త్ర విద్య, వృత్తివిద్య అని రెండు రకాల విద్యలకు విలువ ఉండేది. వృత్తి విద్య కూడా విద్యయే అన్నది క్రమంగా విస్మరించాం. కానీ కర్రపని, కుండలు చెయ్యటం, వడ్రంగి పని, బట్టల నేత అన్నింటిలోనూ ఎంతో లెక్కలు, రేఖాగణితం, సృజనాత్మకత ఉన్నాయి. ఇనుము పనుల్లో కెమిస్ట్రీ ఉంది. మన వాతావరణానికి సంబంధించి వ్యవసాయం, ఎరువులు, పంటల గురించిన విజ్ఞానం ప్రతి రైతుకీ ఉంటుంది. వృత్తి విద్యల్లో తరాలుగా ఇలాటి శాస్త్రీయత భారతీయుల్లో జీర్ణించి ఉంది. దీనిని మనం గుర్తించాలంటారు.
భర్త గోపాల్ రెడ్డి జర్మనీ వెళ్లే అవకాశం రావటంతో సుజాతాదేవి కూడా జర్మనీ వెళ్లటం, టుబింగన్ పట్టణంలో తమ జీవన విధానం, అక్కడ లైబ్రరీలో ఓరియంటల్ విభాగంలోని ఇండాలజీ సెక్షన్లో పనిచెయ్యటం, క్రమంగా జర్మన్ భాషను నేర్చుకోవటం గురించి చెబుతారు. మన భారతీయ భాషల్లోలాగే జర్మన్ భాషలో లిపికి చదవటానికి సంబంధం ఉంటుంది.
పాశ్చాత్య దేశాల్లో కనిపించే నైతికత, క్రమశిక్షణ గురించి చెబుతూ వారు జర్మనీలో ఉండగా దేశానికి ఛాన్స్ లర్ గా ఉన్న ‘’విల్లీ బ్రాంట్’’ కొడుకు కి తగిన వయసు లేకపోవటంతో మొదటి తరగతి లో చేర్చుకోలేదని, తన పదవిని అడ్డుపెట్టుకుని పిల్లవాడిని చేర్చే ప్రయత్నం చెయ్యకుండా విల్లీబ్రాంట్ పిల్లవాడిని కింది తరగతిలోనే చేర్చటం ఆదర్శప్రాయమని చెబుతారు. మన దేశంలో రూల్స్ తోసిపుచ్చటమనేది నాయకుల నుంచి ప్రారంభమై ప్రజల వరకూ కనిపిస్తుంది. అదే ఓరియంటల్ మైండ్, వెస్టర్న్ మైండ్ ఆలోచనావిధానంలో ఉన్న ప్రాథమిక వ్యత్యాసమని రచయిత్రి నిజాయితీగా చెబుతారు.
జర్మన్లు సమయపాలన విషయంలో కచ్చితం. అలాగే కుటుంబవిలువల విషయంలో వారి నిబధ్ధత మనకి ఆశ్చర్యం కలిగిస్తుంది. రెండో ప్రపంచ యుధ్ధం తర్వాత జర్మన్లు చిత్తశుధ్ధితో పనిచేసి, ఆ సంస్కృతితోనే అభివృధ్ధి బాట పట్టారు. జర్మనీలో ఉండగానే ఫ్రాన్స్, ఇటలీ,ఇంగ్లండు, స్పెయిన్ వంటి అనేక దేశాలను సందర్శించారు రచయిత్రి. ఆయా సమాజ తీరుతెన్నులను, ప్రజల అలవాట్లను విపులంగా చెప్పారు. సోమరితనం, లంచగొండితనం వంటి మన దేశీయుల లక్షణాలు ఇటాలియన్లలోనూ కనిపిస్తాయంటారు.
‘’స్త్రీవాదం’’ స్త్రీ స్వేఛ్చ, అస్తిత్వాలను గురించి పోరాటం చేసినంతగా మన సమాజానికి పరిమితమైన ఆడపిల్లల పెళ్లిళ్ల సమస్యను పట్టించుకోలేదని రచయిత్రి అభిప్రాయపడతారు. ఎనభయ్యో దశకం నుంచి ఆడపిల్లలకు సాంకేతిక విద్య పట్ల ఉన్న ఆసక్తిని ప్రోత్సహించటం జరిగిందంటారు. కుమార్తె వాసవిక ఇంజనీరింగు చదువును కోరుకున్నప్పుడు తాను మొదట ఆశ్చర్యపోయానని, కానీ ఆమె పట్టుదలతో చదువుకుని, అమెరికాలో పెద్ద చదువులకు వెళ్లిందని చెబుతారు. ఇప్పటి కాలానికి స్త్రీ మేధకు, సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తున్నప్పటికీ అది మరింతగా పెరగాలంటారు. తనకేది మంచిదో నిర్ణయం తీసుకునే దిశగా ఎదిగి, సాధికారతను పొందటమే స్త్రీవాదం. పురుషుని అణచివెయ్యాలని కాక పురుషునితో సమానంగా స్వేఛ్చా, సమానావకాశాలను పొందాలంటారు.
‘’వైదిక మతాధ్యయనం’’ మత శాస్త్రానికి, ప్రపంచంలోని మతాల తులనాత్మక పరిశీలనకు దారితీసినట్టే, ‘’సంస్కృత భాషాధ్యయనం’’ భాషల తులనాత్మక అధ్యయనానికి పునాదివేసింది. ఎక్కువ సమాచారాన్ని తక్కువ మాటల్లో భద్రపచే మన ప్రాచీన సూత్ర వాగ్మయం కంప్యూటర్ విషయవిజ్ఞానాన్ని భద్రపరచేందుకు ఉపయోగపడుతోంది. టుబెంగన్ లైబ్రరీలో సంస్కృత పుస్తకాలను విషయప్రధానంగా కేటగిరీలను తయారు చేసే ఉద్యోగ ధర్మంలో రచయిత్రి అనేక గ్రంథాలను చదవటం జరిగింది. సంస్కృత సాహిత్య చరిత్రలను, పరిశోధనా గ్రంథాలను చదువుతూ వాటిలోని విషయాల్ను తెలుగులో తెలుగు పాఠకులకు చెప్పలన్న ఆలోచన కలిగింది. ఆ ఆలోచనలతో తయారుచేసుకున్న నోట్స్ 1975లో ‘’సంస్కృత సాహిత్య చరిత్ర’’ పుస్తకం రాసేందుకు తోడ్పడిందని చెబుతారు.
రచయిత్రి చదువుకునే రోజుల్లో కాలేజీ మ్యాగజైన్ కు రెండు కథలు రాసిన నేపథ్యమున్నప్పటికీ 1985 వరకూ సృజనాత్మక రచనల వైపు మళ్లలేదు. ఆమె రాసిన ‘’విసుర్రాయి’’ కథా సంపుటిలో కథలన్నీ పత్రికలనుండి వెనక్కి వచ్చినవంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆ సంపుటి వచ్చాక అనేక అవార్డులను గెలుచుకుంది.
తెలంగాణా జీవితం సుసంపన్నమైంది, సంస్కృతి విలక్షణమైందని, ఇది దక్కను పీఠభూమిలో ఉండటంతో గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాలతో ఎక్కువ ఆదానప్రదానాలు కలిగి ఉండేదంటారు. వారి నగలు, దుస్తులు కూడా ఆయాప్రాంతపు ప్రజల తీరులో ఉంటాయి. తెలంగాణా ప్రాంతపు గ్రామాల్లో ఇండ్లు మట్టిగోడలతో ఉండి, పండుగలకు, పెళ్లిళ్లప్పుడు గోడలను ఎర్రమట్టితో పూసి, సున్నంతో పట్టీలను అలంకారంగా గీయటం, చిన్న చిన్న ముగ్గులు, పక్షుల బొమ్మలు గీయటం కనిపించేది. ఇలాటి మట్టీగోడల ఇళ్లు, అలంకారం గుజరాత్, రాజస్థాన్ లో చూస్తాము. గుజరాత్, రాజస్థాన్ లలో జరుపుకునే పండుగనుంచే సామూహికంగా కోలాటం నృత్యాలతో పాటలతో బోనాలు, బతుకమ్మ పండుగలు తెలంగాణాలో వచ్చాయని రచయిత్రి చెబుతారు.
1969లో జర్మనీ నుంచి వచ్చినప్పుడు రచయిత్రి ఇక్కడి అభివృధ్ధి రాహిత్యం చూసారు. 1990 తరువాత మన దేశంలో వస్తు సమృధ్ధిని చూస్తున్నామని, ఇలాటి అభివృధ్ధి ఏభై ఏళ్ల క్రితమే పాశ్చాత్య దేశాల్లో చూసామంటారు రచయిత్రి. ఉదారవాద ఆర్థికవిధానాలు, స్వేచ్ఛా వాణిజ్యంతో వస్తువులు అన్ని దేశాల మధ్యా ప్రయాణం చేస్తున్నాయి ప్రస్తుతకాలంలో. పోటీ, అభివృధ్ధి, డబ్బు సంపాదన, వ్యక్తి పెరుగుదల, దేన్నైనా సాధించాలన్న తపన వంటివి, వస్తు వ్యామోహం పైనా, సుఖ జీవనంపైనా వ్యామోహాన్ని కలిగిస్తున్నాయి. జీవితాల్లో ఆర్ద్రతను కోల్పోతున్నామంటారు. పాశ్చాత్యులు ఎప్పుడైనా మొదట సమాజ క్షేమాన్ని ఆలోచిస్తారు. మనలో వ్యక్తి ఎదుగుదల, కుటుంబ క్షేమం ఆలోచించే తత్త్వం వల్ల సమాజం, దేశం కూడా అభివృధ్ధి జరగటంలేదు.
సంస్కృత భాష గొప్పదనం చెబుతూ సంస్కృత ధాతువుల పధ్ధతి, శబ్దనిర్మాణ పద్ధతి పాశ్చాత్యులకు అపూర్వంగా గోచరించిందంటారు. సంస్కృతంలో పతి పదానికి అర్థాన్ని వివరించవచ్చు. ప్రపంచంలో మరే భాషలోనూ ఇలాటి అర్థనిర్ణయ సౌకర్యం, అర్థాలు చెప్పటం లేదు. ఉదాహరణకు, ఇంగ్లీషులో ‘’డాటర్’’ పదం, జర్మనీలో ‘’తోఖ్తర్’’, పర్షియన్ లో దుఖ్తతర్’’, సంస్కృతంలోని ‘’దుహితర్’’ పదానికి ఉన్న అర్థం ఒక్కటే అని తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది.
శ్రీ గోపాలరెడ్డి ‘’సంస్కృతాంధ్ర వ్యుత్పత్తి పదకోశం’’ అనే అపూర్వ పదకోశాన్ని తయారు చేసారు.
ఆంద్రభారతి తెలుగు నిఘంటువులో అర్థాలను వెదకబోతే శ్రీ గోపాలరెడ్డిగారి పద కోశం కనిపిస్తుంది.
సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులను వివరిస్తూ, భౌగోళిక ప్రాంతాల మధ్య ఉన్న సామ్యాలను చెబుతూ తను పుట్టి, పెరిగిన తెలంగాణా ప్రాంతాన్ని అన్ని కోణాలనుండి స్పృశిస్తూ తన జీవితంలోని ముఖ్య ఘట్టాలను తలుచుకుంటూ సుజాతాదేవి గారు ఒక విస్తృతమైన ఆత్మకథను చెప్పుకొచ్చారు. క్రోనలాజికల్ గా కాక తన ఆలోచనాధార వెంట నడుస్తూ భారతదేశ చరిత్ర, ప్రపంచ చరిత్ర గురించి అవసరమైన విషయాలను ఎన్నింటినో చెప్పారు. తన తాతమ్మ, నానమ్మ, అమ్మల తరంలో వారి జీవితాలు ఏవిధంగా ఉండేవో, తన తరంలో వచ్చిన మార్పులు ఎలాటివో తడబాటు లేకుండా చెప్పారు. దేశ, విదేశాల్లోని సమాజాలను క్షుణ్ణంగా పరిశీలించి మంచివన్న వాటిని మనసారా అభినందించారు. మనం నేర్చుకోవలసిన నైతికత, క్రమశిక్షణ, పని సంస్కృతి గురించి నిర్మొహమాటంగా చెప్పారు.
ఇన్ని విషయాలను అలవోకగా చెప్పుకొచ్చిన రచయిత్రి అధ్యయనం, విజ్ఞానం పుస్తకంలోని ప్రతి పుటలోనూ కనిపిస్తాయి. తెలంగాణా పట్ల సాహిత్యంలోనూ, సినిమాల్లోనూ వచ్చిన కొన్ని చెడు సంప్రదాయాల గురించి ఖండిస్తూ, వాటి గురించి నిజానిజాలు తెలుసుకున్నప్పుడే వాటిని రాయవలసి ఉందని తెలంగాణేతర రచయితలకు సూచనగా చెప్పారు.
పుస్తకం పూర్తయ్యేసరికి దిగులు వేస్తుంది. చిన్నారి సుజాత పుట్టుక, ఆటపాటలు, చదువు కొనసాగించటంలోని ఇబ్బందులు, పెళ్లి, స్నేహితుడిలాటి భర్తతో కలిసి చేసిన జీవన ప్రయాణం, తన పిల్లల ఎదుగుదల, అన్నింటినీ చెబుతూ, భర్త ఆఖరి క్షణాలను చెప్పటం మనసుని కష్టపెడుతుంది. రచయిత్రే చెప్పినట్టు మనిషి పుట్టుక, చావులు అనంతమైన సృష్టిలో జరిగే పరిణామాల్లో అంతర్భాగాలేనేమో?! సమాజపోకడలను కాలానుగుణంగా పరిశీలిస్తూ తనవైన అభిప్రాయాలను కచ్చితంగా చెబుతూ, సమాజ హితం కోరుతూ, అన్యాయాలను నిలదీస్తూ తన ప్రశ్నలను కూడా ఆత్మకథలో చేర్చారు రచయిత్రి.
పంతొమ్మిదివందల యాభై దశకాల నుంచి నేటి వరకు ప్రపంచమంతా అన్ని రకాలుగా వస్తున్న మార్పులను చూడాలంటే ఈ అపురూపమైన పుస్తకం చదవాల్సిందే. చదువుతున్నంతసేపూ రచయిత్రి చెప్పిన ప్రతి విషయం చెప్పేయ్యాలన్న తొందర, ఆశ నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ పుస్తకం చదవటం ఒక ప్రత్యేక అనుభవం. తనదైన పరిమళాన్ని నింపుకున్న ఆత్మకథ.
సుజాతాదేవిగారు చేసిన సాహిత్య సృష్టి ‘’సంస్కృత సాహిత్య చరిత్ర’’, ‘’ఆంధ్రుల సంస్కృతి- సాహిత్య చరిత్ర’’, ‘’నాటక లక్షణాలు’’, ‘’తెలుగు నవలానుశీలనం’’ వంటి అనేక గ్రంథాలు తెలుగు సాహిత్యానికి విలువైన చేర్పులు.
*****
నా పేరు నాదెళ్ల అనూరాధ, నా గురించి చెప్పాలంటే పుస్తకాలు, పిల్లలు, సంగీతం ఇష్టమైన విషయాలు. పిల్లల మీద ఉన్న ఇష్టం నన్ను ఎమ్మే,బియెడ్ చేయించి టీచర్ని చేసింది. గత ఏడు సంవత్సరాలుగా విజయవాడలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకపడిన పిల్లలకోసం సాయంకాలం పాఠాలు చెబుతున్నాను. ఈ ప్రయాణం ఎన్నో పాఠాల్ని నేర్పుతోంది. నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది.
Thank you for liking the article.
Anuradha
Could peep into the lives of people of Telangana,and the social conditions prevalent during those days.. As mentioned by Anuradha garu this book is not only restricted to Sujatha gari lifestory but a detailed version of the society in those days. A sincere thanks to both the ladies!!
Thanks for a wonderful book review! More than an autobiography, it’s filled with interesting facts and world view. Thanks to Sujatha garu and Anuradha garu for such an enriching reading experience.