యదార్థ గాథలు
శ్రీలక్ష్మి సాహసం
-దామరాజు నాగలక్ష్మి
శ్రీలక్ష్మి చాలా అందమైన అమ్మాయి. పసుపచ్చని మేని ఛాయ, ఏ రంగు చీరైనా ఒంటికి కొట్టొచ్చినట్టు కనిపించేది. ఐదుగురు అన్నలు, ఒక అక్క తరవాత పుట్టడంతో చాలా గారాబంగా పెంచారు. మొండితనం ఎక్కువగా వుండేది. ఇంట్లో అందరూ చాలా భయపడేవారు. పెద్దయిన తర్వాత ఎలా వుంటుందో అనుకునేవారు.
మేనమామ రామారావుకి చిన్నప్పటి నుంచీ శ్రీలక్ష్మి అంటే చాలా ఇష్టంగా వుండేది. పెళ్ళి చేసుకుంటే శ్రీలక్ష్మినే చేసుకుంటాను అనేవాడు. సరే ఇంటి మనిషి కదా అర్థం చేసుకుంటాడని రామారావుకి ఇచ్చి పెళ్ళి చేశారు. శ్రీలక్ష్మికన్నా 8 సంవత్సరాలు పెద్దవాడు రామారావు. అయినా బాగానే చూసుకునేవాడు.
ఇద్దరు మగ పిల్లలు పుట్టారు. శ్రీలక్ష్మికి ఎందుకో రామారావు మంచివాడు కాదేమో అని అనుమానం వచ్చింది. ఒకటి రెండుసార్లు ఇంటికి ఎవరో స్నేహితులని తీసుకుని వచ్చి తాగుతూ వుండేవాడు. వాళ్ళకి ఏదైనా వండి పెట్టమనేవాడు. ఎంత మొండిదైనా శ్రీలక్ష్మి ఇవన్నీ చాలా భయంగా వుండేవి. వద్దని చెప్పి చూసింది. వినలేదు.
ఒకరోజు స్నేహితులలో ఒకతను శ్రీలక్ష్మిని దగ్గిరకి రమ్మన్నాడు. దూరంగానే వున్న శ్రీలక్ష్మి కదలలేదు. మళ్ళీ పిలిచాడు. అయినా వెళ్ళలేదు. అతనే దగ్గిరకి వస్తుండటంతో చపాతీ చేస్తున్న కర్ర అతని మీదకి విసిరింది. అతను గబగబా బయటికి వెళ్ళిపోయాడు. ఇంతలో రామారావు వచ్చి పెద్ద గొడవ చేశాడు. వాళ్ళు రమ్మంటే ఎందుకు వెళ్ళలేదని. అప్పటికి శ్రీలక్ష్మికి భర్త గురించి అర్థమయింది. ఏం మాట్లాడకుండా నుంచుంది. రామారావు కాసేపు ఏదో తిట్టేసి వెళ్ళి పడుకున్నాడు.
మర్నాడు తెల్లారగట్ల శ్రీలక్ష్మి పిల్లలిద్దరినీ తీసుకుని స్టేషన్ కి వెళ్ళి హైదరాబాదు వెళ్ళిపోయింది. తన అందం తనకి శత్రువని అర్థమయ్యింది. అందుకే ఎంతసేపూ అందరి మీదా చిరాకు పడుతూ వుండేది. ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేది కాదు. అందరూ శ్రీలక్ష్మితో మాట్లాడడానికి భయపడేవారు. ఎవరైనా సాయం అంటే మాత్రం వెంటనే వెళ్ళిపోయేది. ఒకే ఒకావిడ కమల మాత్రం శ్రీలక్ష్మికి దగ్గరయ్యింది.
శ్రీలక్ష్మి తన దగ్గరున్న బంగారం అంతా అమ్మి ఒక కిరాణా షాపు పెట్టుకుని, వచ్చిన ఆదాయంతో పిల్లలని బాగా చదివించింది. రవి, గిరీ డిగ్రీలు పూర్తి చేశారు. పిల్లలకి స్వతహాగానే తెలివితేటలు వుండటం వల్ల ఇద్దరికీ మంచి గవర్నమెంటు ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళకి ఉద్యోగాలు వచ్చిన తర్వాత శ్రీలక్ష్మి అందరితోనూ బాగా మాట్లాడేది. తల్లి అంటే రవి, గిరిలకి చాలా గౌరవం. తల్లిని చాలా బాగా చూసుకునేవారు. పిల్లలిద్దరికీ మంచి సంబంధాలు కుదిరి పెళ్ళిళ్ళు అయ్యాయి. ఇల్లు కట్టుకున్నారు. శ్రీలక్ష్మికి చాలా ఆనందం అనిపించింది. తను పడిన కష్టానికి మంచి ఫలితం వచ్చిందని చాలా ఆనందించింది. నేను ఆ రోజు చేసిన సాహసం తనకి ఈ దారి చుపించిందని సంతోష పడింది.
*****