రాగో

భాగం-8

– సాధన 

“నీ పేరు ఏందక్కా?” అంటూ మరో ప్రశ్న వేసేసరికి రాగో తత్తర పడింది. వెనుకనున్న మిన్కో వెంటనే “జైని” అంటూ అందించింది.

“ఆఁ! అచ్చం జువ్వి రాగో తీరుగుంటే అడిగినక్క కళ్ళల మసకలు. మనిషిని పోల్చలేము” అంటూ ముసలమ్మ కదిలింది.

“అబ్బా! కొత్త పేరు పెట్టుకోవడమే మంచిదయింది” అనుకుంటూ రాగో ముందుకు సాగింది.

చివరింటి ముందు దళం ఆగింది. కిట్లు దించారు. వాకిట్లో వాల్చిన మంచాలపై దళ సభ్యులు కూచున్నారు.

కర్రె ఆపు పొదుగు తీరుగా ఆకాశంలో మబ్బు కమ్మింది. గుడ గుడాంటు ఉరుముతుంది. ఇంకా పూర్తిగా చీకటి పడకపోయినా తళుక్కున మెరుపు మెరిసే సరికి కళ్ళు జిగేలుమంటున్నాయి. ఇంటికొచ్చిన పశువులను కొట్టాల్లోకి తోలడానికి పిల్లలు తంటాలు పడుతున్నారు. పందిర్లుమీద ఆరబోసిన ఇప్పపూలు ముల్లెకట్టి ఇంట్లో సర్దుతున్నరు మగాళ్ళు. మొర్రి పళ్ళు, తునికి పళ్ళు నానితే పురుగులు పడతాయని ఆడవాళ్ళు బుట్టలో సర్ది ఉట్ల పైకి ఎక్కిస్తున్నారు. పెద్ద వర్షమే గుమ్మరించబోతున్నట్టు మబ్బులు తరుముకొస్తున్నాయి. పిల్లలు మాత్రం బజార్లో గంతులేస్తున్నారు.

క్రమంగా గాలి మొదలయింది. ఎక్కడో వాన కురిసి వెలిసినట్టు గాలి తడిగా వీస్తుంది. దాని జోరు కూడ పెరుగుతుంది. కొమ్మలు బుయ్… బుయ్… అంటూ ఊయాల లూగుతున్నాయి. బయట దుమ్ము రేగుతుంది. పాతబడ్డ గుడిసె కప్పులు ఈ గాలికి ఆగేట్టులేవు. నెగళ్ళుంటే కొంపలంటుకుంటయని ఇళ్ళ ముందు ఎక్కడి కక్కడే నెగళ్ళు చల్లారుస్తున్నరు.

“అబ్బా! అదృష్టం ఇంట్లో పడ్డం” అంటున్నడు సంతోషంతో కర్ష.

“జంగల్ నడుముండగ కొట్టాలె వాన, ఇగ చూడు” అంటూ గొంతు కలిపాడు డుంగ.

ఆ అనుభవం గుర్తుకొచ్చి ఒక్కసారి ఒళ్ళు జడత ఇచ్చింది గిరిజకు. అడవి మధ్యలో నడుస్తుండగా అకస్మాత్తుగా మొదలైంది వర్షం. వానకి గాలి కూడ తోడై కప్పుకున్న మేన్ కప్ డా ఎంత ఆపినా అందరూ తడిసి ముద్దయ్యా రు. అంతలో ఆగినా మేలే. గచ్చకాయలంతేసి వడగళ్ళు పడడంతో చెట్టుకింద ఆగినా కూడ ఆ రాళ్ళ దెబ్బలకు ఒళ్లు వాచిపోయింది. మేన్ కప్- ఎంత దగ్గరగా చుట్టుకున్నా బండలు విసిరినట్టు ఆ రాళ్ళ దెబ్బలు ఎవరిని నిలవనివ్వలేదు. ఆ అవస్థ గుర్తుకు వస్తేనే గిరిజకు రోమాలు లేచి నిల్చున్నయి. ‘అబ్బా’ అనుకుంటూ ‘ఆ అమ్మ పగవాడి క్కూడవద్దు’ అనుకుంటున్నంతలోనే కమాండర్ పిలుపు వినపడింది.

“జైనితో మాట్లాడుదాం అక్క” అంటూ రుషి ఇంటి చూరుకింద విడిగా ఉన్న చాప వైపు దారి తీశాడు.

గాలి హోరును మించి గొంతు పెంచి జోరుగా పాటలు ప్రాక్టీసు చేస్తున్న దళ సభ్యుల్లో కూచున్న జైని కూడ గిరిజ పిలుపుతో లేచి వచ్చింది.

ఇలా పిలిచి విడిగా కూచోబెట్టేసరికి ఏం మాట్లాడుతారోనని జైని మనసులో ఆందోళన మొదలయ్యింది.

“బాతా అక్కా! బహమంత” (ఏం అక్కా! ఎట్లుంది?) అంటూ రుషి గొంతు సవరించుకున్నాడు.

“బేషే దాదా” (మంచిదే దాదా) – జైని ఠక్కున చెప్పేసింది.

“ఆఁ! నీతో మాట్లాడేది ఉందక్కా. నువ్వు దళంతో తిరగబట్టి వారం రోజులు దాటింది గదా. ఇప్పుడేమనుకుంటున్నవు? ఇక్కడ నీకెట్లుంది?” అంటూ రుషి నెమ్మదిగా మొదలుపెట్టాడు.

“నాకు బేషే దాదా! నేను చాలా రోజుల నించే అన్నల్లో కలువాలనే వెతుక్కుంటూ మీలో కలిసిన” అంటూ జైని ఇంకా దీని గురించి ముచ్చట ఎందుకన్నట్టు మధ్యలో ఉన్న గిరిజవైపు చూసి తలదించుకుంది.

“అది సరే అక్కా. నువు ఏం కావాలనుకొని దళంలో చేరావు? వారం రోజులు తిరిగావు కదా. ఇక్కడంతా మంచిగనే ఉందా. మాతో పాటు ఈ కష్టాలు పడగలవా? నువ్వేమనుకుంటున్నావ్! అంతా బేషని ఒక్కమాటంటే సరిపోదు కదా” అంటూ గిరిజ మాటలు పొడిగించింది.

జైని ఒక్కసారి కళ్ళెత్తి గిరిజను, రుషిని చూసి చూపులు నేలకు దించేసింది.

ఓ క్షణం ఎవరూ మాట్లాడలేదు. మళ్ళా రుషే అందుకున్నాడు.

“అది కాదక్కా – ఇక్కడి పద్దతులను చూస్తున్నావు కదా! అడిగిందానికి తెలిసిన కాడికి మాట్లాడ్డానికి సిగ్గుపడకూడదు. జంకులేకుండా చెప్పాలి. తెలియనిది అడిగి నేర్చుకోవాలి” అంటూ “నువ్వు ఏం కావాలనుకొని దళంలోనికి వచ్చావు? మనం ఊరి దాదలతో ఈ వారం రోజులుగా మాట్లాడుతున్న ముచ్చట్లు వింటున్నవు కదా! నీకెంతవరకు సమజయింది” అని జైనిని నీకు తెలిసిందే చెప్పమని ప్రోత్సహించాడు.

కాసేపు తటపటాయించి “అది నాకు వాహో (రాదు) దాద” అంటూ మొదలెట్టింది జైని.

“మా మాడియాల్లో ఇష్టంలేని పెళ్ళి కట్టబెట్టి, మేం వెళ్ళం అంటే తన్నులు గుద్దులు చేసి బాధలు పెడుతున్నారు. దూరంగా పారిపోయి కూలి జేసుక బతుకుతుంటే ‘కేర్లే కేర్దే’ అంటూ ప్రతి ఊర్లో వెంటబడతరు. అలా మొండిగ బ్రతికే కంటే అన్నల్లో చేరి మంచిగా పని చేస్తే బాగుంటుందని వచ్చిన. మీరయినా మా ఆదివాసీల కోసమే గదా ఇన్ని తిప్పలు పడుతున్నరు” అని గొంతు పూడకపోయినట్టు ఆగిపోయింది.

“బాగా చెప్పావ్. నీ తిప్పల పోవాలని నువ్వు దళంలోనికి వచ్చినవ్. కేర్లే లెక్క తిరుగుడు వద్దనీ, ఆ కష్టం పోవాలనీ వచ్చినవ్. మంచిదే, కానీ దళంలో కూడ కష్టాలు ఎక్కువే ఉంటాయి. అన్నానికి, నిద్రకు, సెంట్రీకి, నడకకు అలవాటు పడాలి. తుపాకి ఫైరింగ్, డ్రిల్లు మంచిగ నేర్చుకోవాలి. పోలీసులెదురైతే కొట్లాడాలి. నీ కోసం అయ్యను, అవ్వను పోలీసులు బాధ పెడితే ఓర్చుకోవాలె.”

“నీ లెక్క బాధలు పడేది ఒక్క అక్కలేనా ఆలోచించు. పేపరు మిల్లు బాబులు, టేకేదార్లు అన్ని తీర్ల మనల్ని దోచుకుంటున్నారు. హాటుం (సంత)లో షాహుకార్లు మన ఆదివాసీలను దోచుకొని మరింత బలసిపోతూన్నారు. పూటకు గతిలేక, మందు మాకు లేక, చదువు లేక గిట్టుబాటు కూలి లేక మన అయ్య, అవ్వలు, దాదలు, అక్కలు ఎన్ని తీర్ల బాధలు పడుతున్నరో నీకు తెలుసు.

దున్నుకోను భూమి లేదు. ఉన్న భూమి మీద మనకు హక్కు లేదు. అడవిలో చెట్టు కొట్టినా, గడ్డి కోసినా, పండు తెంపినా, తిండి కోసం వేట చేసినా జంగలోల్లు మీద పడి హరి ఘోస పెడతారు.

ఈ తిప్పలన్నీ పోవాలనీ, ఎవల రొషూ లేకుండా మన బతుకులు మనం బతుకాలనీ, బాగుపడాలనీ మనం కొట్లాడుతున్నం. గీ లాఢాయి చేసుకుంటునే మన అన్నలు ఎంతో మంది ప్రాణమిచ్చిండ్రు. ఈ కొట్లాట గెల్వకుండ, మనల్ని చంపాలని పోలీసులు మన జాడకోసం తిరుగుతరు. వాళ్ళకు దొరక్కుండా తిరుగుతూ మనం లోకులందరిని జమ చేయాలి. మనందరం కలసి కొట్లాడి ఈ రాజ్యం గెలిస్తే గానీబాధలు పోవు. ఇది నాల్గురోజుల్ల అయ్యే పనిగాదు. ఇవన్నీ విచారం చెయ్యాలి. బుద్ధి నేర్వాలి. ఇవన్నీ మన జనాలకు చెప్పాలి. అంతేగాని నాలుగు రోజులు తిరిగి దళం విడిచి ఎవరిదో ఇల్లు చొస్తానంటే కలువదు. మంచిగ అర్థం చేసుకొని ఉండాలి. ఇదే నేను చెప్పేది” రుషి ముగించాడు.

“మేము కూడ ఇవన్నీ విచారం చేసి వచ్చినం అక్కా, మనం కొట్లాడకుంటే మన కోసం ఇంకెవరో కొట్లాడరు. దళంలో చదువు నేర్చుకొని, బుద్ధి మాటలు నేర్చుకొని అందరితోని కలసి మెలసి ఉండాలక్కా ఎవరేమన్నా, నీకు ఏం లేకున్నా, ఏం కావాలన్నా కమాండర్‌కు చెప్పాలక్కా” అంటూ జైని వంతుకు చెబుతున్నట్లే గిరిజ మళ్ళీ నొక్కి చెప్పింది.

చెప్పుతున్నదంతా జైని శ్రద్ధగా వింది. వింటున్నంతసేపు ఆమెలో ఎన్నో ఆలోచనలు. తాను ఎన్నటికీ మళ్ళీ కేర్దేగా తిరగలేదు. వీరితోనే ఉండాలి. కానీ చెప్పినవన్నీ రాలేదని వీళ్ళు పొమ్మంటే? ఎవని పంచనో చేరి సంసారం చేయాలా? మళ్ళీ ఆ పాత బతుకుతో రోతలో కుళ్ళి చావడమేనా? ఏమైనాసరే, వీళ్ళను విడిచి పెట్టవద్దనే గట్టిగా అనుకుంది.

ఏదో చెప్పాలని చెప్పలేక జంకుతున్నట్టు కొంత ఇబ్బందిగా కదలి సర్దుకొని కూచుంది జైని.

అప్రయత్నంగా గిరిజ చెయ్యి తన చేతిలోకి తీసుకొంది.

“ఇంగో” అంటూ గొంతు సవరించుకొని, “ఇల్లు బొర్రాలనే ఆశ లేదక్కా. ఇక్కడే ఉండి అన్ని నేర్చుకుంటా, కొట్లాడి ఇక్కడే చస్తా” అంటూ ఇక మాట పెగలనట్టు ఆగిపోయింది. రాలిన కన్నీటి చుక్క గిరిజ ముంజేతి మీద పడ్డం రుషి గమనించకపోలేదు.

“సరే అక్కా! రేపట్నించి గిరిజక్క దగ్గర చదువు నేర్చుకో. పట్టుదలగా నేర్చుకుంటే అన్నీ వస్తాయి” అంటూ “మన దగ్గర పలక, బలపం ఉన్నాయి కదా” అని “ఇక ముగిద్దాం” అన్నట్టు గిరిజవైపు చూశాడు.

గాలి వీచి మేఘాలు చెదిరిపోయాయి. నక్షత్రాలు మెరుస్తున్నాయి.

“గాటోరడీ! మేం తింటున్నాం” అంటూ గాండో, సీదోలు ముక్తకంఠంతో నినదించడంతో ముగ్గురూ లేచారు.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.