వినిపించేకథలు-2
వర్క్ ఫ్రమ్ హోమ్ (డా||కె.గీత కథ)
గళం: వెంపటి కామేశ్వర రావు
సూర్య ఆఫీసు నుంచి పెందరాళే వస్తున్నాడు. వచ్చే సరికి నేను, పాప గుర్రు పెట్టి నిద్ర పోవడం చూసి “చింటూ! టీ పెట్టు” అని లేపాడు.
ప్రేమగా “చింటూ” అని పిలిచి పని చెబ్తావేంటి? ఆ టీ ఏదో కాస్త నువ్వు పెట్టరాదూ! అన్నాను మళ్లీ ముణగ దీసుకుంటూ.
“అదేం కుదరదు- నిన్నిలా వదిలేస్తే ఇక ఎప్పటికీ ఇండియా టైమింగ్స్ నే ఇక్కడా పాటిస్తావ్ ఇలా పగలంతా నిద్రపోతూ- “
“అబ్బా!” అని విసుక్కుంటూ లేచి ఫ్రిజ్ వరకూ వెళ్లి “అన్నట్లు, పాలయిపోయాయి వెళ్లి తీసుకురా” అని మరలా ముసుగు వెయ్యబోయాను.
“నువ్వూరా ఇద్దరం వెళ్దాం”
“పాలకి నేనెందుకు?”
“ఇదేమైనా ఇండియా అనుకుంటున్నావా! రేపట్నుంచి సరుకులు ఏవి అయిపోయినా నువ్వే తెచ్చుకోవాలి. ప్రస్తుతం నాకేదో కాస్త పని వత్తిడి తక్కువ ఉంది కాబట్టి ఆఫీసు నుంచి త్వరగా వస్తున్నా. నడు నడు..”
ఇక తప్పేటట్లు లేదు. అద్దం ముందు దీక్షగా కూచున్న నా ముఖం లోకి చూస్తూ “హలో! ఈ సరికి వెళ్లొచ్చే వాళ్లం. అయ్యిందా తమరి తయారీ” అన్నాడు.
“అబ్బా కాస్త కాంపాక్ట్ రాసుకోనివ్వవు, లిప్ స్టిక్ వేసుకోనివ్వవు.” అయినా నీకెందుకంత నవ్వొస్తూంది? అన్నాను.
“ఏమీ లేదు. ఇంతవరకూ ఉన్న నిద్ర అంతా ఎక్కడికి పోయిందా అని” గొణిగాడు.
నేను “ఆ..” అనగానే “ఏమీ లేదులే అన్నాడు.”
నిధి హుషారుగా నడుస్తూంది. పది నిమిషాల్లో “అదిగో అదే వాల్ మార్ట్” అన్నాడు.
మాకు రెండు మూడు సిగ్నళ్ల దూరం లో కనిపిస్తూంది.
ఇక్కడ పాలు గాలన్ల చొప్పున పెద్ద ప్లాస్టిక్ టిన్నుల్లో అమ్ముతారు. వాల్ మార్ట్ పాల నించి టీ.వీ ల వరకూ అమ్మే అతి పెద్ద సూపర్ మార్కెట్. అయినా బయట ఇతర స్టోర్ ల కంటే ఇక్కడ కాస్త చవకగా దొరుకుతాయి అన్నీ. ఇక్కడ కనబడేటంత మంది ఇండియన్సు ఇంకే స్టోరు లోనూ కనబడరట తెలుసా!..” సూర్య చెప్పుకుంటూ పోతున్నాడు.
పని లేకపోయినా నీకు చూపిస్తాను దా ఎక్కడేం ఉంటాయో అంటూ మాల్ అంతా తిప్పేడు. షాపింగంటే నాకు భలే ఇష్టం. అయినా “మనం పాల కోసం వచ్చేం.” అన్నాను చిరు కోపం నటిస్తూ-
“ఆ… టీ ఇవేళ్టికి మానేద్దాం. కాస్సేపు షాపింగు చేసి..” అంటూ ఎంట్రెన్సు దగ్గరున్న మెక్ డోనాల్డ్స్ వైపు చూపించేడు. “తినేసి వెళ్లిపోదాం” అనగానే ఒప్పుకున్నాను.
నేనేదో పిల్లల బట్టల దగ్గర చూస్తూ నెమ్మదిగా నడుస్తున్నాను. సూర్య ముందున్న ఎలక్ట్రానిక్స్ డిపార్ట్ మెంటు దగ్గరకెళ్ళేడు.
“కొత్తగా వచ్చేరా” అని ఇండియన్ యాక్సెంటు ఇంగ్లీషు లో వినబడింది.
తలెత్తి చూసేను. రాక్స్ మధ్య లో నుంచి ఒకామె బహుశా పాతికేళ్లుంటాయేమో. పంజాబీ డ్రెస్సు వేసుకున్న అమ్మాయి పలకరించడం తో ఉబ్బితబ్బిబ్బయ్యాను.
ఇంతలో సూర్య నా వైపే వస్తూ చేతిలో కార్డ్ లెస్ ఫోన్ చూపించేడు. ఆ అమ్మాయికి పరిచయం చేసేను.
ఆ అమ్మాయి పక్కకు తిరిగి “సూర్యా” అని పిలిచింది. వాళ్లాయన చప్పున వస్తూనే చెయ్యి ముందుకు చాపి తనని పరిచయం చేసుకున్నాడు.
ఆ అమ్మాయీ, నేనూ నవ్వుకున్నాం. ఇద్దరి పేర్లూ ఒక్కటే అయినందుకు.
తన పేరు బబిత అనీ, వాళ్లు ఒరిస్సా నించి అమెరికాకు వచ్చి నాలుగేళ్లు అయ్యిందనీ చెప్పింది.
“మీరేం కంపెనీ” అంటూ మగవాళ్లిద్దరూ మాటలందుకున్నారు.
“మీరూ వర్క్ చేస్తారా!” అడిగింది బబిత.
“లేదండీ, ఇండియాలో టీచర్ గా చేసేను” అన్నాను.
“నేనూ ఇండియా లో ఉన్నప్పుడు బేంకులో పనిచేసాను.” అంది.
“ఇక్కడ మీరూ నాలానే అన్నమాట” అన్నాను.
తల అడ్డంగా ఊపి “ఉహూహూ- వర్క్ ఫ్రం హోం” అంది.
“అదెలా?” అన్నాను.
ఇంతలో వాళ్లాయన “ఏమీ అనుకోకండి. మేం కాస్త త్వరగా వెళ్లాలి.” అన్నాడు.
ఆ అమ్మాయి “మరలా తప్పకుండా కలుద్దాం “అని నా ఫోన్ నంబరు అడిగి తీసుకుంది.
మర్నాడు సాయంత్రం సూర్య వస్తూనే
“నిన్న కలిసిన అతన్నించి ఫోన్ వచ్చింది, మీకేమైనా వ్యాపారం చేసే ఉద్దేశ్యం ఉందా అనడిగాడురా” అన్నాడు.
“వ్యాపారం అంటున్నావ్, డబ్బులెక్కడున్నాయ్? కారు కొనుక్కోవడానికే అడ్వాన్సుగా జీతంలో సగం తీసుకున్నాం కదా!” అన్నాను.
“అవన్నీ చెప్పేను, అయినా పెట్టుబడితో పని లేదన్నాడు.”
నేను ప్రశ్నార్థకంగా చూసేను.
నాకూ ఏమీ అర్థం కాలేదు. అసలదేమిటో చూద్దాం. ఈ ఆదివారం మధ్యాహ్నం భోజనాలయ్యేక ఒక గంట వచ్చి వెళ్తామంటే సరేనన్నాను”. అన్నాడు మళ్లీ.
“అయ్యో, భోజనానికే రమ్మనక పోయావా!” అన్నాను.
అన్నానే గానీ చింత పట్టుకుంది. ఇంటికి వచ్చిన వాళ్లు కూర్చోవడానికి కుర్చీ కూడా లేదు మా దగ్గర. నాలుగు సూట్ కేసుల్తో వచ్చాం. చిన్న అపార్ట్ మెంట్. దానికే నెల జీతంలో సగం పోతుంది. ఆ నెల జీతం వస్తే గానీ ఏవీ కొనుక్కునే పాటి డబ్బుల్లేవు మా దగ్గర.
వస్తూనే చాలా పరిచయంగా నిధిని ముద్దాడింది బబిత.
టీ పెడుతూంటే వంటింట్లో నిలబడింది. “ఇండియాలో స్కూల్ టీచరుగా పనిచేసి ఇక్కడ బోరు కొట్టడం లేదూ” అంది.
“ఇంకా కొత్త కదా కాస్త రిలాక్స్డ్ గా ఉంది” అన్నాను.
“టీ తీసుకోండి” అన్నాను అతనికి కప్పు అందిస్తూ. వాళ్లిద్దరూ బాగా సీరియస్ డిస్కషన్ లో ఉండడం చూసి బబిత ని లోపలికి తీసుకెళ్లేను. నిధి ఫోటో ఆల్బం తెచ్చి చూపించడం మొదలు పెట్టింది.
గంట సేపు చాలా త్వరగా గడిచిపోయినట్లయ్యింది.
వాళ్లు వెళ్తున్నప్పుడు “ఏమీ అనుకోకండి, కింద కూచోబెట్టినందుకు” అన్నాను.
“ఈ దేశానికి వచ్చిన కొత్తలో అందరి ఇళ్లూ ఇలాగే ఉంటాయి. మీరు అపాలజీలు చెప్పక్కర లేదు, ఇక మనం పార్ట్ నర్ లం, త్వరలో మీరూ అన్నీ కొనుక్కోగలుగుతారు, ఏం సూర్యా!” అన్నాడు నవ్వుతూ.
బదులుగా తలూపేడు.
వాళ్లు వెళ్లగానే “ఏమిటది?”అన్నాను కుతూహలంగా.
“అతను “వ్యాపారం” ఏమిటో చెప్పనే లేదు ఉన్నంత సేపు. పైపెచ్చు రేపు సాయంత్రం రాజ్ ను తీసుకుని వస్తాను, అతను నా హెడ్డు. అతను మీకు విషయం చెపుతాడని చెప్పాడు.” అని/
“ఏమిటిది సస్పెన్సు గా, విచిత్రం గా” అన్నాడు మళ్లీ.
“నన్నడిగితే నేనేం చెబ్తాను? మనుషులు చూస్తే చాలా మంచి వాళ్లలా ఉన్నారు, అయినా వివరాలు తెలుసుకో ముందే ఎందుకైనా మంచిది.” అన్నాను సాలోచనగా.
సూర్య “ఏం ఫర్వాలేదులే, అతను చాలా మంచి కంపెనీ లో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. లైటు గా తీసుకో.” అన్నాడు.
బబిత నిధి తో బాగా కబుర్లు చెప్పింది. మంచి స్నేహితురాలైపోయింది. వాళ్లు వెళ్లగానే “బబిత ఆంటీ మళ్లీ ఎప్పుడొస్తుంది” అని అడిగింది నిధి.
నేనే నెగటివ్ గా ఆలోచిస్తున్నానేమో అని నన్ను నేను తిట్టుకున్నాను.
అన్నట్లు “బబిత కూడా పీజీ వరకు చదివిందట నాలాగే. ఇక్కడ పేరెంట్స్ నించి దూరంగా ఉండడమే కాస్త బాధాకరమనీ ఏవేవో విశేషాలు చెప్పింది. ఇక్కడ తను “వర్క్ ఫ్రం హోం ” చేస్తుందట. వారానికి రెండు మూడొందల డాలర్ల వరకు సంపాదిస్తుందట. ఇదేదో బానే ఉన్నట్టుంది” కదూ అన్నాను. ఆలోచనలో పడ్డ సూర్య ని కుదుపుతూ.
“వారానికి రెండు మూడొందలంటే ఇండియాలో పది, పదిహేనువేలు. నెలకు ఈజీగా యాభై అరవై వేలు. అంటే ఇండియాలో మనకున్న హౌసింగ్ లోన్లు తీర్చగలిగిన డబ్బు నెల నెలా ఇంటి నించే సంపాదించొచ్చు.” అన్నాను మళ్లీ.
రియల్ ఎస్టేట్ మంచి బూం లో ఉన్నపుడు ఇల్లనీ, స్థలమనీ సాఫ్ట్ వేర్ ఉద్యోగం కదా అని ధీమాతో లోన్ లు తీసుకుని కొనేసాం. అక్కడి బూం, రేట్లు తగ్గిపోయినా కట్టాల్సిన ఇన్ స్టాల్ మెంట్లు, వడ్డీలు ఆగవుగా. నెలకు అవే దాదాపు యాభై వేలై కూచున్నాయి.
“వర్క్ ఫ్రం హోం ” అంటే అన్నాడు సూర్య.
“అదేమిటి నువ్వేమీ ఈ విషయం మాట్లాడలేదా అతనితో, నీకు అన్నీ తెల్సనుకున్నాను.” అన్నాను పెద్ద ఆరిందాలా.
“అతనెన్ని సార్లు ఆ ప్రస్తావన తెచ్చినా చెప్పనే లేదు. అసలేంటట” అన్నాడు.
“వర్క్ ఏమిటో నేను అడగలేదు.” చప్పున నాలుక్కరుచుకున్నాను. అంతలోనే సర్దుకుని “ఏదో కంప్యూటర్ వర్క్ అనుకుంటా, అయినా కంప్యూటర్ విషయాలు నాకెలా తెలుస్తాయి “అని దబయించడానికి ప్రయత్నించాను.
“ఓహ్! కమాన్ ప్రియా, ఇంత చదువుకున్నావు. కంప్యూటర్ వర్క్ అంటే సరిపోతుందా! లక్షా తొంభై కంప్యూటర్ వర్క్స్ ఉంటాయి.”
“చూసావా! అసలన్ని రకాల కంప్యూటర్ వర్క్స్ ఉంటాయనే నాకు తెలీదు”. అని గొడవ పెట్టబోతున్న నా వైపు ఏడవ లేక నవ్వే చూపొకటి విసిరాడు.
“అయినా సరేలే అతను మళ్లా రేపు వస్తానన్నాడుగా. అప్పుడు వివరాలు అడుగుదాం.” అన్నాడు.
సూర్య ఆఫీసు కెళ్లగానే కంప్యూటర్ ముందు కూచుని “వర్క్ ఫ్రం హోం” అని సెర్చ్ కొట్టేను.
ఒక చోట నా ఈ-మెయిల్ తో రిజిస్టెర్ చేసేను కూడా. సూర్య చెప్పింది నిజమే. అబ్బో లెక్కలేనన్ని ఉన్నాయి. ఇందులో ఆ అమ్మాయి చేసేదేమిటో అనుకున్నాను. మధ్యాహ్నానికల్లా నాకో పది పదిహేను ఈ-మెయిల్స్ వచ్చ్చాయి. అందులో ఒకటి ఆకర్షణీయంగా కనిపించింది.
సాయంత్రం సూర్య ఇంటికి రాగానే చెప్పాను. “నాకు మరో ఆపర్ట్యునిటీ కూడా వచ్చింది. “అని గర్వంగా.
నా మాటలు విని తల పట్టుకున్నాడు. “అలా ఎక్కడ పడితే అక్కడ అడ్డదిడ్డంగా నీ ఈ- మెయిల్ ఇవ్వకూడదు.” అని “అయినా ఏమిటో అది “అన్నాడు.
“పేద్ద కంప్యూటర్ వర్కు ప్రపంచంలో ఇతనికొక్కడికే తెలుసు…” మనసు లో తిట్టుకుంటూ “నేనేమీ తెలివి తక్కువగా చెయ్యలేదు. అయినా అతను ముందే చెక్కు పంపిస్తున్నాడు. అడ్వాన్సుగా. ఆ తర్వాతే పని మొదలు పెట్టేది “అన్నాను గొప్పగా.
గబుక్కున నా పక్కన చతికిలబడి “ఏదీ ఈ- మెయిల్ చూపించు ” అన్నాడు.
లండను లో ఒక ఆర్టిస్టు తన ఆర్టు లు అమెరికా లో ఎవరికో విక్రయిస్తున్నాడు. తీసుకున్న ఆర్డర్లు ప్రతి ఒక్కరికీ విడి విడిగా అక్కడి నించి పంపాలంటే పోస్టల్ ఛార్జీలు ఎక్కువ అవుతాయి కాబట్టి బల్కుగా మనకు పంపుతాడు. మనం ఇక్కడ వాటిని సంబంధిత వ్యక్తులకు పోస్ట్ చెయ్యాలి. ఇందుకు గాను ప్రతీ ఆర్డరులో 10% కమీషనుగా మనకు ఇస్తాడు. ఇదంతా నమ్మడం కోసం అతను ఇప్పటికే ఆర్డరు పూర్తి చేసిన వ్యక్తి నుంచి అందుతున్న పేమెంటు చెక్కు మనకు పంపిస్తున్నాడు. మనం అందులో $100 మన దగ్గర అడ్వాన్సుగా అట్టే పెట్టుకొవచ్చు. మిగతాది అతనికి వైర్ ట్రాన్స్ ఫర్ ద్వారా పంపాలి. అతన్ని నమ్మడం కోసం మనం పని మొదలు పెట్టక ముందే డబ్బులు అడ్వాన్సుగా మనకు ఇస్తున్నాడు. అదీ ఆ మెయిల్ సారాంశం.
“పోన్లే గుడ్డిలే మెల్ల, నా పేరు, వివరాలు ఇవ్వలేదతనికి. కొంపదీసి ఎకవుంట్ నంబర్లు ఇచ్చేవా?” అన్నాడు భయంగా.
“లేదు. నా పేరు, అడ్రసు మాత్రం ఇచ్చేను” అన్నాను.
కాసేపు ఆలోచించి “సరే, నిజంగా చెక్కు వస్తే అప్పుడు చూద్దాం లే.”అన్నాడు.
మర్నాడు సాయంత్రం బబిత, సూర్య – రాజ్, లక్ష్మి లను వెంటబెట్టుకొచ్చేరు. కొత్తగా వచ్చిన వాళ్లు తెలుగు వాళ్లు.
మొదట అందరం ఇంగ్లీషులోనే మాట్లాడుకున్నాం.
నేను మధ్యలో పాప తో తెలుగు మాట్లాడడం విని “ఏమిటండి ఇక్కడింకా ఎవరైనా తెలుగు వాళ్లున్నారా?” అని అడిగింది లక్ష్మి.
మాట్లాడిన ప్రతి మాటకూ “అండి” చేరుస్తూండడం తో “ఎక్కడి నుంచి వచ్చారు మీరు?” అనడిగాను.
తన సమాధానం విని నా సంతోషానికి అవధులు లేవు.
“మాదీ ఆ పక్కనేనండి. మీ ఊరి నుంచి బాగా దగ్గర” అన్నాను.
అది విని రాజ్ “అయ్యో చెప్పేరు కారేం! ఆ ఊర్లో కరణం గారమ్మాయి పెళ్లికి పెళ్లికొడుకు స్నేహితుడిగా వెళ్లాను. నంది వీధి, సెంటర్లో కాజాల దుకాణం అలాగే ఉన్నాయాండీ” అన్నాడు.
“అబ్బే మీరిప్పుడెళితే పోల్చ లేరు ఆ ఊరిని. ఫ్లై వోవర్ వచ్చాక స్వరూపమే మారిపోయింది” అన్నాను.
“అయినా నేను చెప్పింది పదేళ్ల కిందటి మాటలెండి… “అని ఇంకేవేవో ఊరి విశేషాలు మాట్లాడుకున్నాక- “ఇంకేం మనం బంధువులం కూడా అయ్యాం” అన్నాడు.
ఆ అమ్మాయి ఫాషనబుల్ బట్టలు వేసుకుని, మంచి మేకప్ తో ఉత్తరాది నుంచి వచ్చిన సినిమా ఏక్టరులా నాజూగ్గా ఉంది. ఆమెని తెలుగమ్మాయని పోల్చుకోలేకపోయాను మాట్లాడేవరకు.
“ఇక అసలు విషయానికొద్దాం. పెన్ను, పేపర్ ఇవ్వండి.” అని మా ఇద్దరినీ చూడమన్నాడు.
కాగితం రెండు భాగాలయ్యేట్టు నిలువుగా ఒక గీత గీసి, ఒక వైపు సామాన్యులు, మరో వైపు అసామాన్యులు అని రాసేడు.
“జాగ్రత్తగా వినండి. అమెరికాకి మనం ఎందుకొచ్చేం? ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం. డబ్బు సంపాదించడానికే కదా. ఇక్కడ డబ్బు సంపాదించే వాళ్లు రెండు రకాలు. ఒకటి ఈ కోవలోకి, రెండవది ఈ కోవలోకి అంటూ రెండు విభాగాలనీ చూపించేడు.
“సామాన్యులు చాలా కష్ట పడి 20 సంపాదించేదాన్నే అసామాన్యులు 5 సం.రాల్లోనే సంపాదించగలుగుతారు.” అని ఇంకాస్సేపు అటు తిప్పీ ఇటు తిప్పీ వీళ్లకీ, వాళ్లకున్న భేదాలు అరగంట వివరించేడు.
“ఇప్పుడు అసలు విషయానికొద్దాం” అని, అయితే మీకో ప్రశ్న రావొచ్చు. “రిస్కు లేకుండా అసామాన్యులు కావడం కష్టం కదా” అని. కానీ అదేమీ పెద్ద కష్టం కాదు. మీరు మాతో కలిస్తే రిస్కు లేకుండానే సంపాదించొచ్చు.
“మీరు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కు వెళ్లడానికి…” అంటూ మళ్లీ మరో అరగంట అసామాన్యులు కావడానికి ఎలా ప్రయత్నాలు చెయ్యాలో వివరించేడు.
మా ఇద్దరికీ అసలతను ఏం చెబుతున్నాడో గంట నుంచీ అర్థం కాలేదు. ఎంత సేపటికీ అసలు “వ్యాపారం” ఏమిటో చెప్పనే లేదు.
ఇక ఉండబట్టలేక అడిగేను “ఇంతకీ ఏమి చెయ్యాలో కాస్త సూటిగా చెప్పండి”.
“మంచి ప్రశ్న వేసారండీ.” అని, “కాసిన్ని మంచి నీళ్లు మళ్లీ ఇస్తారా?” అనడిగేడు.
నేను టీ, స్నాక్స్ తెచ్చేను అందరికీ.
“మీరిద్దరూ రేపు సాయంత్రం రెడీగా ఉండండి. బే ఏరియా మొత్తానికి శానోజే లో మీటింగ్ జరుగుతూంది. అక్కడికి వందలాది మంది పార్ట్ నర్లు వస్తారు. మీకు నేనింత వరకు చెప్పింది పూర్తిగా అవగాహనా అవుతుంది, ఇతర వివరాలు కూడా అక్కడ ప్రెసిడెంట్ చెప్తాడు.” అన్నాడు.
మా సందేహపు మొహాలు చూసి “భయపడకండి. మనం మనం ఒక ప్రాంతం వాళ్లం. ఇందులో రిస్కు వంద శాతం లేదు. రేపు మీకే అర్థం అవుతుందిగా” అని
“ఆ – సూర్య, వీళ్లకు ఇంకా ఈ చుట్టుపక్కల ఏరియా తెలీదు కదా -నువ్వు పికప్ చేసుకుని తీసుకొచ్చేయ్” అని
“వస్తానండీ ఇంకా చాలా పనుంది” అని వచ్చినప్పట్లా షేక్ హాండు కాకుండా చేతులు జోడించి నమస్కరించాడు.
లక్ష్మి “మీ అమ్మాయి భలే కబుర్లు చెపుతోందండీ” రేపు కలుద్దాం. మీరూ, మీ వారూ విధిగా అఫీషియల్ డ్రెస్సులు వేసుకోవాలి సుమా. చాలా పెద్ద కాన్ ఫరెన్స్ అది ” అంది.
మర్నాడు 5 గంటల కల్లా ఇండియానించి తెచ్చుకున్న మాంచి లేడీస్ సూట్, మంచి హై హీల్సు వేసుకుని నేను తయారైపోయేను.
సూర్య ఆఫీసు నుంచి వచ్చి రాగానే ” ఓహో! ఏమిటండోయ్ విశేషం అన్నాడు. నేను చెప్పగానే “ఆ -అవును కదూ అతను మరలా ఇందాకే ఫోన్ చేసేడు. అయినా ఈ సూట్లు, అవతారం నాకు నచ్చదు. నేనిలాగే వస్తాను” అన్నాడు.
మరో అరగంట లో బబిత వాళ్లు వచ్చి పికప్ చేసుకున్నారు.
ఫ్రీవే మీద పది మైళ్లు పది నిమిషాల్లో చేరేం. మేమెప్పుడలా డ్రైవ్ చేస్తామో అని అనుకున్నాం. మంచి ఫైవ్ స్టార్ హోటల్ లో పెద్ద లాబీలోకి ప్రవేశించాం. పాపని తను చూస్తానని బబిత బయటే ఉండిపోయింది. నిధి ఆనందంగా ఒప్పుకుంది.
మమ్మల్ని ముందు వరుసకి తీసుకెళ్లేరు. అప్పటికే కొందరిని “సక్సెసర్లు” గా స్టేజీ మీదకు పిలుస్తున్నారు. ఒకో జంట స్టేజీ మీదకు వెళ్లి అందరికీ అభివాదం చెప్పి వస్తున్నారు.
రాజ్ మధ్యలో వచ్చి “ఇదేమిటండీ మిమ్మల్ని ఎలా పరిచయం చెయ్యాలి మీ ఆయన అలా వచ్చేసేరు?” అన్నాడు.
నేను “ఆయనంతే నండీ. సూట్ కు వ్యతిరేకి” అని “అయినా మమ్మల్ని పిలవడం ఎందుకు స్టేజీ మీదకు అన్నాను ఆశ్చర్యంగా”.
“ఓకే. మళ్లీ సారి..” అని హడావిడిగా వెళ్లిపోయేడతను.
ఇంతలో పెద్ద గొంతుతో చప్పట్ల మధ్య స్టేజీ మీదకు వచ్చి ఒక మధ్య వయసు వ్యక్తి మాట్లాడడం ప్రారంభించేడు.
” పీపుల్ ఆర్ టూ టైప్స్” అని.
తర్వాత ఏవిటో నేను చెప్తాను “సామాన్యులు, అసామాన్యులు” అని సూర్య నా చెవిలో చెప్తూండగానే సరిగ్గా అదే డైలాగు వినిపించింది.
ఇద్దరం నవ్వుకున్నాం. సరిగ్గా గంట తర్వాత కూడ అతను అదే విషయాన్ని అటు తిప్పీ ఇటు తిప్పీ ఉపన్యాసం ఎవరికీ అర్థం కాకుండా ఇచ్చేడు.
కానీ మధ్య మధ్య జోకులతో అందరినీ అలరించడం వల్ల సభలో ఉన్న వాళ్లంతా బానే విన్నారు.
“సభలో ఉన్న విద్యార్థులారా” అని చివరగా సంబోధించాడతను.
అప్పుడు చూసాను దాదాపు సభలో సగం మంది ఇండియా నుంచి చదువుకోవడానికి వచ్చినట్లున్న కుర్రకారే.
అందరినీ భాగస్వాములు కమ్మని అప్లికేషన్లు తెచ్చి ఇచ్చారు. ఇక మేమిద్దరం లేచి బయటికి వచ్చేసాం. మాకు అర్థమైందేమిటంటే విషయం ఏమీ తెలీకుండానే మేం సభ్యులం కాబోతున్నాం.
రాజ్ ఎదురొచ్చాడు “ఏమిటండీ, ఎక్కడికి?” అంటూ.
నేను ఖరాఖండీగా చెప్పెయ్యమని సూర్యకి చెప్పేను. అయినా సూర్య మొహమాటం గా ఏదో అనబోతూండగా
“సూర్యా! మీరు ఇప్పుడు కడుతున్నది కేవలం రెండు వందలు మెంబరు షిప్పు మాత్రమే. మీకు ప్రోడక్ట్స్ అమ్మే కొలదీ నెలలోనే మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. అక్కడి నుంచి మీకు అంతా లాభమే కదా.” అన్నాడు.
“ప్రోడక్ట్సు ఏమిటి? అన్నాడు సూర్య వెర్రి మొహం పెట్టి.
“నేను మీకు రేపు లింకు పంపిస్తాను. ముందు మీరు మెంబర్ షిప్పు కట్టెయ్యండి” అన్నాడు.
ఇక సూర్యతో లాభం లేదని నేను “రాజ్, ఇదంతా మాకేమీ అర్థం కాలేదు. అయినా కొత్తగా వచ్చేం, మేం ఇంతేసి మెంబర్ షిప్పులవీ కట్టలేం” అన్నాను.
“పోనీ సగం కట్టండి. సగం మరో రోజు” అని
నేను తల అడ్డంగా ఊపడం చూసి “యాభై, పోనీ పాతిక”అన్నాడు.
“మేం ఇంటికెళ్లి తర్వాత మీకు ఫోన్ చేస్తాం” అతని వైపు చూడకుండా గబగబా అనేసి నా చెయ్యి పట్టుకుని లాబీ వైపు నడిచేడు సూర్య.
పాపాయి నెత్తుకుని బయట పడ్డాం. తొమ్మిది గంటల వేళ ఇంటికి ఎలా వెళ్లాలో కూడా తెలీదు. ఇక్కడసలే బస్సులు అన్ని రూట్లనీ కలుపుతూ ఉండవు. ఆటోలు అసలే ఉండవు.
ఇంతలో వెనకే బబిత పరుగెత్తుకొచ్చింది. “ఉండండి. డ్రాప్ చేస్తాం. ఇక్కడి నించి మీ ఇంటికి ఈ టైం లో వెళ్లడం కష్టం. ట్రాన్స్ పోర్టేషన్ ఉండదు” అంది.
అదీ నిజమే. వాళ్ల మీద ఆధార పడడం తప్ప మరో మార్గం లేదు.
దార్లో ఎవ్వరం మాట్లాడుకోలేదు. నిధి నిమిషంలో నిద్రపోయింది.
కారు దిగేటప్పుడు “ఈ ఆదివారం….” అని అతనేదో అనబోతూండగా
“మేం ఇంట్లో ఉండడం లేదు” అని మర్యాదగా చెప్పేను వాళ్లకి.
మర్నాడు నిజంగానే వాళ్ల ప్రోడక్ట్స్ అంటూ లింకు పంపేరు. అందులో ఉన్నవి బయట ఎక్కడా అమ్మరు. వాటిని ఎవరు కొంటారో తెలీదు. ఇది కేవలం మెంబరు షిప్పుల చెయిన్ బిజినెస్ మాత్రమే అని అర్థం అయ్యింది.
ఈ కథని కాస్త మర్చి పోవడానికి ప్రయత్నిస్తూండగా ఇంతలో మరో వారం లో నా పేరుతో 500 డాలర్లకు చెక్కు వచ్చింది.
సూర్య కు ఫోన్ చేసి చెప్పేను.
“కొంపదీసి ఎకవుంట్ లో వేసెయ్యకు. ఇదంతా ఓ పెద్ద ఫ్రాడ్ అట తెల్సా” అన్నాడు.
ఇంకా వివరంగా ఆ సాయంత్రం ఆన్ లైన్ లో చాలా మంది ఇలా ఫ్రాడ్ లకు గురైన వాళ్ల అనుభవాల్ని చదివి వినిపించేడు.
“ఇలాంటి చెక్కులు ఎకవుంట్ లో వేసుకుని మొత్తం మోసపోతాం” అన్నాడు సూర్య.
“అంటే నాకు అర్థం కాలేదు “ అన్నాను అయోమయంగా.
“మనం మనకొచ్చిన $500 డాలర్లు ఎకవుంట్ లో వేసుకుంటాం. డబ్బులు మన ఎకవుంట్ లోకి క్లియర్ కాగానే, మనకు అడ్వాన్సుగా తీసుకోమన్న $100 మినహాయించుకుని మిగతా $400 అతనికి వైర్ ట్రాన్స్ ఫర్ చేస్తాం. వైర్ ట్రాన్స్ ఫర్ అంటే అతనికి డబ్బులు స్వయంగా కలిసి ఇచ్చినట్లే. అతనికి డబ్బులు చేతిలో పడగానే చెక్కును విత్ డ్రా చేసుకుంటాడు.
“అదెలా – మనకు చెక్కు క్లియర్ అయ్యేక?” అన్నాను ఆశ్చర్యంగా.
“అక్కడే ఉంది కిటుకు- బ్యాంకులు సాధారణంగా చెక్కులను పూర్తిగా వెరీఫై చెయ్యకుండానే పేమెంటు చేసేస్తాయి. కానీ “ఫాల్సు చెక్కు” అని పంపిన వ్యక్తి చెక్కు వెనక్కి తీసుకుంటే, డబ్బులు డ్రా చేసుకున్న వాళ్లని పెనాల్టీతో సహా తిరిగి బ్యాంకుకి కట్టమంటాయి. కానీ వైర్ ట్రాన్స్ ఫర్ తో డబ్బు అందుకున్న వాడికి ఎటువంటి సమస్యా ఉండదు. ఒకసారి పేమెంటు చేసేమంటే ఇక డబ్బు వెనక్కి రాదు.అంటే ఈ మొత్తం ట్రాన్సాక్షన్లో మన దగ్గర్నుంచి చక్కగా డబ్బును సంపాదించి అవతలి వాడు తప్పుకుంటాడు. చివరికి మనకు శఠగోపం మిగులుతుంది. “
నాకు తల తిరిగినట్లయ్యింది. డబ్బు సంపాదన కోసం మనుషులు ఎంత దిగజారిపోతున్నారో! అయినా వాటిని నమ్ముతున్న నా లాంటి వాళ్లు పెద్దగా కష్టపడకుండా డబ్బు సంపాదిద్దామని ఆశించడం వల్లే కదా ఇలాంటి వాళ్లు సులభంగా మోసం చెయ్యగలుగుతున్నారు! వ్యవస్థలో సౌలభ్యం కోసం టెక్నాలజీ ఉపయోగపడ్తుందనుకుంటే దాన్ని కూడా మోసానికి ఉపయోగించుకుంటున్నారు కొందరు!!
ఇలాంటి మోసానికి ఆస్కారం ఇచ్చినందుకు కొంత బాధగా ఉన్నా, పూర్తిగా మోసపోక ముందే తెలుసుకున్నందుకు కాస్త ఊరట గా కూడా అనిపించింది.
“ఇలాంటి ఫ్రాడ్ ల లిస్టు లో చెయిన్ మార్కెటింగ్ కూడా ఒకటి. ఆ సభ్యులకు రెండు విధాలుగా మాత్రమే వాళ్ల డబ్బులు వాళ్లకు వెనక్కు వస్తాయి. ఒకటి ప్రోడక్ట్సు అమ్మితే, రెండు సభ్యుల్ని చేర్చితే. మొదటిది ఎవరూ చెయ్యలేరు కాబట్టి కనీసం మరో అయిదారుగుర్ని సభ్యులుగా చేర్చితే వాళ్ల కమీషను గా వాళ్లు కట్టిన సభ్యత్వ రుసుము వాళ్లకు వచ్చేస్తుంది. అందుకే ఇలా రెండో మార్గంలో మన లాంటి వాళ్లని చేర్చేందుకు ప్రయత్నిస్తారన్న మాట.” సూర్య చెప్తూనే ఉన్నాడు కానీ నాకేమీ వినబడడం లేదు.
ఆ తర్వాత వాళ్లు మరో రెండు వారాలకి మళ్లీ ఫోను చేసేరు. “లాస్ ఏంజిల్స్ వెళుతున్నాం. రెండు టిక్కెట్లు ఖాళీ, వస్తారా!” అని.
“ఎందుకైనా మంచిది, వీళ్లతో కాస్త దూరం గా ఉందాం.” అన్నాను.
ఆ మర్నాడు ఇండియా ఫోన్ చేసినప్పుడు బంధువులాయన అడిగేడు.
“అమెరికా లో “వర్క్ ఫ్రం హోం” చేసి బోల్డు సంపాదిస్తారటగా.” అని.
దాని అర్థం వేరైనా సూర్య వెంటనే సమాధానం చెప్పలేక పొలమారినట్లు దగ్గుతూ నెత్తి కొట్టుకున్నాడు.
చెత్త బుట్టలో నేను చింపిపడేసిన చెక్కు సూర్య కంటపడకుండా కాలితో పక్కకు జరిపేను.
సాయంత్రపు ఎండ ఏటవాలుగా పడ్తూంది. ఏడైనా బాగా వెల్తురుగానే ఉంది.
“అలా వాకింగుకి వెళ్లొద్దాం” అన్నాను.
ఒకళ్లూ ఇద్దరూ బైట నడుస్తూ ఉన్నారు. మమ్మల్ని దాటుకుని వెళుతూ అపరిచితులైన అమెరికన్లు ఒకరిద్దరు నవ్వుతూ “హలో” అని పలకరించారు.
“ఇక్కడి వాళ్లు ఎంత బాగా పలకరిస్తారో! ఇండియన్సు కొత్త వాళ్లని చూసి ఇక్కడి వాళ్లలా పరిచయ హాసం చెయ్యరెందుకో” అన్యాపదేశం గా అన్నాడు సూర్య.
“ఎలా నవ్వుతార్లే. ఇలాంటి చేదు అనుభవాలెదురవుతున్నపుడు” అన్నాను.
*****
(“వాకిలి”జూన్ 2013 ప్రచురణ )
(“వాకిలి”జూన్ 2013 ప్రచురణ )
వెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన వీరు తమ విశ్రాంత జీవితం లో తమకిష్టమైన అభిరుచులకు మెరుగులు దిద్దుకుంటున్నారు.ఆకాశవాణి లో casual news reader,auditioned drama artist. గతంలో దూరదర్శన్ లోనూ న్యూస్ రీడర్ గా ఉన్నారు.వివిధ రంగస్థల,దూరదర్శన్, ఆకాశవాణి నాటికల్లో పాల్గొన్నారు. Stage ప్రోగ్రామ్స్ కి వ్యాఖ్యతగా బహు ప్రశంసలు పొందారు.ఫోటోగ్రఫీ,వీడియోగ్రఫీ వారి హాబీలు. ఓల్డ్ మెలోడీస్ వినడం అంటే మక్కువ ఎక్కువ.