షర్మిలాం “తరంగం”

ఒక్కరోజు సెలవు!

-షర్మిల కోనేరు 

ఇంటెడు చాకిరీ చేసి పిల్లల ఆలనా పాలనతో అలసిన గృహిణి ఒక కల కంటూ వుంటుంది.
సోఫా లో కూర్చుని ఏ చింతా లేకుండా కూర్చుని టీవీ చూస్తుండగా ఎవరన్నా ఒక కప్పు కాఫీ తెచ్చిస్తే !
లేదా వేడిగా ఏ ఉప్మానో దోశలో ఇస్తే ఎంత బాగుండునో అనిపిస్తుంది.
ఎవరో అదృష్టవంతులకి అలా జరుగుతుందేమో!
నేను చూసే కుటుంబాలలో గృహిణులెవరూ ఇంత భాగ్యానికి నోచలేదు.
ఉద్యోగస్తురాలిగా ఏనాడూ ఆ సౌఖ్యానికి నోచుకోలేదు.
మనం ఒక్కళ్ళమే స్త్రీ హక్కులూ గట్రా అని ఉపన్యాసాలిస్తే కుదరదు.
అవతలి వాళ్ళకీ ఆ ఆలోచన రావాలి.
అందుకేనేమో ఆడపిల్లకి పుట్టింటి మీద అంత మమకారం.
అక్కడ మహారాణి భోగాలు జరుగుతాయ్!
అమ్మ లేదా వదినో మరదలో కూర్చోబెట్టి అన్నీ చేతికి అందిస్తారు.
మా ఆయన ఎప్పుడు మా పుట్టింటికి వెళ్ళినా ఫోన్ చేసి బాగా తిన్నావా ! ఎంజాయ్ చెయ్యి అని అడిగేవారు.
ఆ సౌఖ్యాలన్నీ ఇంట్లో కూడా దొరికితే పుట్టింటి మాట ఎత్తుతారా ఆడాళ్ళు?
కమల్ హాసన్ మేనిఫెస్టోలో ఆడాళ్ళ పనికీ డబ్బులిస్తామంటున్నాడు డబ్బులెందుకు గానీ వారానికో రోజు సెలవిమ్మని మొగుళ్ళకి రూల్ పెట్టమంటే సరి.
ఈ మధ్య ఓ వీడియో వైరల్ అవుతోంది.
అందులో ఆడాళ్ళు ముఝే భీ ఏక్ రవివార్ చాహియే ! ( నాకూ ఒక ఆదివారం కావాలి )
అని విన్నపాలు చేస్తారు.
అందరూ హాల్లో కూర్చుంటే వంటింట్లో పనుల్లో మునిగిపోయే ఆడాళ్ళకి ఒక రోజు సెలవు …
పిల్లల హోం వర్క్ లు చేయించి, బట్టలు ఉతికి మడతేసి, వాళ్ళకు తిండి పెట్టి అలసిన తల్లి బాధ్యతలకు ఒక్క రోజు సెలవు…
ఉద్యోగం చేస్తూ వాటితో పాటు సవాలక్ష పనులు చేసే మహిళకి ఒక్కరోజు సెలవు … ఇవ్వమని విన్నపం చేసుకుంటున్నారు.
వారానికో నెలకో ఒక్క రోజు వాళ్ళ కోసం వాళ్ళని బతకనివ్వండి.
విన్నపాలు పోరాటాలుగా హక్కుల కోసం ఆరాటాలుగా మారకముందే మేల్కోండి!
అమ్మలకీ ఓ ఆదివారం ఇవ్వండి.
అమ్మల్నీ గుండెల నిండా ఒక్క రోజు స్వేచ్చా వాయువులు పీల్చుకోనివ్వండి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.