అభిమానధనం (తమిళ అనువాదకథ)
తమిళంలో: ఎస్. రామకృష్ణన్
తెలుగు అనువాదం: గౌరీ కృపానందన్
1976లో వెలువడిన వాహిని సుబ్రమణ్యం గారి ఆంగ్ల కధా సంకలనం, “కాలం యొక్క స్వరం” లో మా అమ్మ వ్రాసిన ఉత్తరం ఒకటి ప్రచురించ బడి ఉంది అన్న వార్తను అమెరికా నుంచి వేణి వ్రాసింది. నాకు నమ్మ శక్యం కాలేదు.
వేణి నా కూతురు. పెళ్లై అమెరికాలో ఉంటోంది. లైబ్రరీ నుంచి తీసుకు వచ్చిన పుస్తకంలో తను ఆ ఉత్తరాన్ని చూసినట్లు ఈ మెయిల్‍లో వ్రాసింది.
అమ్మ ఎప్పుడు ఉత్తరం వ్రాసింది? అది ఎలా పుస్తకంలో ప్రచురం అయ్యింది? అమ్మ ఎవరికీ ఉత్తరం వ్రాసినట్లు నాకు గుర్తు లేదు? ఏం వ్రాసి ఉంటుందో తెలుసుకోవాలని కోరిక కలిగింది.
ఉత్తరాన్ని స్కాన్ చేసి పంపించమని వెంటనే వేణికి ఈ మెయిల్ పంపించాను. కొన్ని నిమిషాలలో స్కాన్ చేసిన అమ్మ ఉత్తరాన్ని వేణి నాకు పంపించింది. మా అమ్మ పేరు గుణవతి. ఇలా ఒక పేరును చాలా అరుదుగానే పెడతారు. అమ్మ చాలా అరుదైన వ్యక్తి.
అమ్మ ఉత్తరం ఒక వైపు తమిళంలో ప్రచురించ బడి ఉంది. దానిని ఆంగ్లంలో అనువాదం చేశారు. ఆ అనువాదం చేసింది వాహిని సుబ్రహ్మణ్యంగారే.
అమ్మ బ్రతికి ఉంటే దీనిని చూసి సంతోషపడి ఉంటుంది. అమ్మ చేతివ్రాత చూడడానికి చాలా అందంగా ఉంది. నాలుగు లైన్ల నోట్ బుక్‍లో వ్రాసినట్లు అక్షరాలు ఒకే పంధాలో, ముత్యాల కోవలాగా ఉన్నాయి. ఒక్క దిద్దుబాటు గానీ, కొట్టివేత గానీ లేదు. తేదీని చూశాను. 26 జూలై,1974 అని ఉంది.
అప్పుడు నాకు పన్నెండేళ్ళు ఉంటాయను కుంటాను. అమ్మకి ముప్పై లేక ముప్పై ఒకటి ఉండొచ్చు. మేము శ్రీ విల్లిపుత్తూరులో ఉండేవాళ్ళం. పుసకాలు చదవడమన్నది మా ఇంట్లో ఆడవాళ్లకి సహజంగా వచ్చే అభ్యాసం. అమ్మ కూడా మంచి చదువరి. కానీ ఆమెకు నవలలు చదవడం మాత్రమే నచ్చుతుంది. వంట ముగించుకుని, పెరటి వైపు గుమ్మం దగ్గర కూర్చుని ఏదైనా ఒక నవలను చదువుతూ ఉండేది.
అమ్మ చనిపోయి ఆరేళ్ళు ముగిసి పోయాయి. తను చదివిన నవలల్లో కొన్నింటిని ఆమె జ్ఞాపకంగా అలమారిలో పెట్టుకున్నాను. అందులో సగానికి పైగా వాహిని సుబ్రహ్మణ్యం వ్రాసినవి. ఆమె నవలలను అమ్మ ఇష్టపడి చదివేది.
రచయిత్రి వాహిని సుబ్రహ్మణ్యం నాకు బాగానే గుర్తు ఉంది. ఆవిడ ఒకసారి సాహితీ సమావేశంలో మాట్లాడదానికి శ్రీవిల్లిపుత్తూరుకు వచ్చింది. అప్పుడు నేను స్కూల్లో చదువుతుండే వాడిని.
ఆ రోజుల్లో అమ్మ కోసం ప్రభుత్వ గ్రంధాలయం నుంచి రోజూ రెండు నవలలు తీసుకు వచ్చి ఇచ్చే వాడిని. అమ్మ వేగంగా చదివే మనిషి. కానీ తను చదివిన విషయాలను ఎవరితోనూ ఆమె మాట్లాడింది లేదు.
నాన్నగారికి పుస్తకాలు చదవడం అస్సలు నచ్చని విషయం. ఆయన కాఫీపొడి వ్యాపారం చేసే మనిషి. తాతగారికి చదివే అలవాటు ఉండేది. ఆయన చదివేదంతా పెద్ద పురాణం లేకపోతే తిరువాచకం. దానిని ఎప్పుడూ వళ్ళో పెట్టుకుని చదువుతూ ఉంటారు. కొన్ని సమయాల్లో గొంతు విప్పి పాడేవారు కూడా.
వినాయకం చిన్నాన్నకు చదవడంలో ఆసక్తి ఎక్కువ. వికటన్, కల్కి, అముదసురభి లాంటి పత్రికలు కొని తెచ్చేవారు. ఆయన వల్లే అమ్మకు నవలలు చదవడం పరిచయం అయ్యింది.
అమ్మ సొంత ఊరు కుమారకుడి. అక్కడ ఉన్న క్రైస్తవ కాన్వెంటులో ఆరో తరగతి దాకా చదివింది. పెద్దమనిషి అవగానే చదువుకు స్వస్తి చెపాల్సి వచ్చింది. పదిహేనవ ఏట పెళ్లై శ్రీవిల్లిపుత్తూరుకు వచ్చేసింది. పదిహేడో వయసులో మొదటి సంతానం పుట్టి చనిపోయింది. ఆ తరువాత అక్కయ్యా, నేను, నా తమ్ముడు… మొత్తం ముగ్గురు సంతానం.
వారపత్రికల్లో వచ్చే సీరియళ్ళను అందంగా బైండింగ్ చేసి అమ్మ ఇష్టంతో చదవడం చూసి నేను ఆశ్చర్యపడే వాడిని.
కొన్నిసార్లు చదువుతూ ఉన్నప్పుడు పొంగి వస్తున్న కన్నీటిని కొంగుతో తుడుచుకుని, పెద్దగా నిట్టూర్పు విడుస్తూ మళ్ళీ చదవడం మొదలు పెట్టేది. ఎందుకోసం అమ్మ ఏడుస్తుందని అప్పుడు నాకు అర్థం కాలేదు.
వినాయకం చిన్నాన్న మధురైకి వెళ్లి వచ్చినప్పుడల్లా అమ్మ కోసం కొత్త నవలలు కొని తీసుకు వచ్చి ఇచ్చేవారు. ఆ నవలలను అమ్మ మళ్ళీ మళ్ళీ విసుగు లేకుండా చడుతూనే ఉండేది. ఆ విధంగానే అమ్మకు వాహిని సుబ్రహ్మణ్యం నవలలు పరిచయం అయ్యాయి.
‘వాహిని నవలలు చదువుతూ ఉన్నప్పుడు మన పక్కనే కూర్చుని వాహిని చెబుతున్నట్లు అనిపిస్తుంది. వాహిని ఎంత బాగా వ్రాస్తోంది! మనసులో తోచిన దానిని అక్షరాలుగా మార్చడం ఎంత పెద్ద వింత! వ్రాసే స్త్రీలు అందరూ అదృష్టవంతులు’ అని అమ్మ తనకి తానే చెప్పుకునేది.
మా ఊళ్ళో ఒక సాహితీ సంఘం ఉనేది. అందులో మా.పో. సి. నుంచి రచయిత విందన్ దాకా చాలామంది వచ్చి ఉన్నారు. సాహితీ సంఘం కోసం ప్రత్యేకంగా గాంధీ శిల పక్కన ఒక రీడింగ్ రూమ్ ఉండేది. ప్రతి ఏడూ రీడింగ్ రూమ్ ముందు భాగంలో ఒక స్టేజ్ ఏర్పాటు చేసి మీటింగ్ జరుపుతుండే వాళ్ళు.
సాహితీ సంఘం ఏర్పాటు చేసిన వార్షికోత్సవంలో రచయత్రి వాహిని సుబ్రమణ్యం విచ్చేసి కీలకోపన్యాసం చేయబోతున్నారని ఒక రోజు రాత్రి వినాయకం చిన్నాన్న ఇంట్లో చెప్పారు. అమ్మకు నమ్మశక్యం కాలేదు.
“నిజంగానేనా?” అంటూ అమ్మ కుతూహలంగా అడిగింది.
“అవును వదినా. రధ వీధిలో పెద్ద బేనరు పెట్టారు. సైకిల్ మీద వచ్చేటప్పుడు చూశాను” అన్నారు చిన్నాన్న.
ఓరకంటితో చూస్తూ ఉన్న నాన్నగారు తలెత్తి చూసి చెప్పారు.
“నేను కూడా చూసాను. దొరసాని లాగ జుట్టును కత్తిరించుకుని ఒక ఆడదాని బొమ్మ వేశాడు. వీళ్ళకు వేరే ఎవరూ దొరకలేదా? జ్ఞాని కీరన్ లేకపోతే కృపానంద వారియార్ లాటి మనుషులను పిలిస్తే జనం వస్తారు. ఈవిడ మాట్లాడితే ఎవరు వింటారు?”
“నేను వినడానికి వెళ్తాను. వాహిని నవలలు అన్నీ నేను చదివి ఉన్నాను. చాలా బాగా వ్రాస్తుంది” అంది అమ్మ.
నాన్న అమ్మను ఎగాదిగా ఉరుముతున్నట్లు చూస్తూ దుకాణం తాళం చెవిని మేకుకు తగిలించి, పాడుతున్న రేడియోను చటుక్కున ఆపేశారు. నాన్నగారికి పుస్తకాలు చదవడం, రేడియో వినడం లాంటివి ఏవీ నచ్చవు. మా కాఫీపొడి అమ్మే దుకాణం మెయిన్ బజారులో ఉంది. నాన్నా, చిన్నాన్న కలిసే దానిని చూసుకుంటున్నారు. నాన్నకు తెలిసిన ఒకే విషయం రోబస్టా, ఫీబరి, చికరి అంటూ కాఫీపొడి అమ్మకాలు మాత్రమే.
వాహిని నిజంగానే రాబోతుందా అని తెలుసుకోవాలని అమ్మ అనుకుంది. బేనరును చూడడం కోసం నన్ను స్కూల్లో దిగబెడతానని చెప్పి తీసుకుని వెళ్ళింది. ఆడవాళ్ళు ఒంటరిగా ఇంటి నుంచి బైటికి వెళ్ళకూడదు అన్నది ఇంటి కట్టుబాట్లలో ఒకటి.
రధవీధిలో తడికెతో చేసిన బేనర్ పెద్దగా పెట్టి ఉంది. అమ్మ తలెత్తి బేనరును చూస్తూ ఉండి పోయింది. జుట్టును బాబ్ లాగా కత్తిరించుకుని ఉన్న వాహిని కోల ముఖం. చెవులకు, మెడకు ఏ ఆభరణమూ పెట్టుకోలేదు. పెద్ద కళ్ళజోడు పెట్టుకుని ఉంది. ఎవరు వేసిన చిత్రం అని తెలియ లేదు.
అమ్మ ఆ చిత్ర పటాన్ని చూస్తూ నాతో అన్నది.”మన సుబ్బరాజు మాస్టారు కూతురు పోలికలు ఉన్నట్టు లేదూ.”
నాకు అలాంటి ఎవరూ గుర్తు లేక పోయినా ఊరికే తలాడించి పెట్టాను.
నన్ను స్కూల్లో దిగబెట్టి ఇంటికి వెళ్ళేటప్పుడు అమ్మ నిలబడి మళ్ళీ ఆ బేనరును చూసిగానీ వెళ్ళదు అని నాకు అనిపించింది. అలా అందులో ఏముంది అని నాకు అర్థం కాలేదు.
ఒకసారి నన్ను రీడింగ్ రూముకు పంపించి వాహిని ఏ రైలులో వస్తోంది, ఎక్కడ బస చేస్తుంది అని అడిగి తెలుసుకుని రమ్మంది. నాకు కాస్త బిడియంగా ఉన్నందు వల్ల, నేనుగా ఆమె కొల్లం మెయిలులో వస్తోందని, సెంట్రల్ లాడ్జిలో బస చేస్తుందని అబద్దం చెప్పాను.
వాహిని ఇంకో రెండు రోజుల్లో తమ ఊరికి రాబోతోంది అన్న వార్త అమ్మకు చాలా సంతోషాన్ని కలిగించింది. వాహిని ఏ ఉద్యోగం చేస్తోంది, ఆమె భర్త ఎవరు? ఎంత మంది పిల్లలు? ఏ వివరాలూ ఏ పత్రికలోనూ వచ్చింది లేదు. అలా రావడం ఆమెకు ఇష్టం ఉండదని చెప్పుకున్నారు. ఆమె రెండే రెండు ఫోటోలు మాత్రం మళ్ళీ మళ్ళీ పుస్తకాల మీద ప్రచురించ బడ్డాయి. బహిరంగ సమావేశాలలో ఆమె ఎక్కువగా పాల్గొనే మనిషి కాదు. ఏదో ఒక సమావేశంలో అధ్యక్షత వహించిన సీనియర్ రచయిత ఆమెను ఎగతాళి చేసి మాట్లాడారని స్టేజి మీదే చెప్పు తీసి కొట్ట బోయిందని ఎక్కడో చదివింది. కోపం ఎక్కువ కాబోలు లేకపోతే అహంకారం! ఎలా శ్రీవిల్లిపుత్తూరుకు రావడానికి ఒప్పుకుంది? ఒక వేళ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఈ ఊళ్ళో ఉన్నారా? అమ్మ వంట చేస్తూ వాహిని గురించే ఆలోచిస్తూ ఉండి పోయింది.
ఒకవేళ తమ ఊరు ఆమెకు నచ్చకుండా పోతే? ఎవరైనా తేడాగా మాట్లాడి రసాభాసం అయిపోతే? వాహిని గురించి తలచుకుంటే గర్వంగానూ అనిపించింది. అసూయగానూ కూడా అనిపించింది.
ఫంక్షన్ జరిగే రోజు ఉదయం వినాయకం చిన్నాన్న సాహితీ సంఘానికి చెందిన తిరు కుమరన్‍గారితో మాట్లాడినట్లు చెప్పారు. వాహిని మధురైకి వచ్చి చేరింది అని, సాయంత్రం పాసంజరులో శ్రీవిల్లిపుత్తూరుకు వస్తోంది అని చిన్నాన్న చెప్పినప్పుడు, అమ్మకు రైల్వేస్టేషన్‍కి వెళ్లి వాహినిని చూడాలన్నంతగా కోరిక కలిగింది. కానీ దానిని ఆమె బైటికి చూపించుకోలేదు.
వాహిని పాల్గొన బోతున్న సమావేశం కోసం వీధిని బ్లాక్ చేసి స్టేజి ఏర్పాటు చేసారు. అమ్మ ఆ సమావేశానికి వెళ్లాలని ఆశ పడింది. కానీ సమావేశం రాత్రి ఏడుగంటలకి మొదలవుతుందని అన్నారు.
ఆ సమయంలోనే ఇంట్లో రాత్రి వంట తయారు చెయ్యాలి. వంట ముగించడానికి ఎనిమిదిన్నర అవుతుంది. అందరూ భోజనం చేసి, అంట్ల గిన్నెలు తోమడానికి తీసిపెట్టి బయలు దేరే లోపల మీటింగ్ అయి పోతుంది. ఒక్క రాత్రి మాత్రం అందరూ హోటల్‍లో భోజనం చేసేటట్లుగా ఉంటేనే మీటింగ్‍కి వెళ్ళడం సాధ్యం. కానీ ఎవరు అనుమతి ఇస్తారు?
అమ్మ ఆ ఒక్క రోజుకు మాత్రం రాణి అక్కయ్య ఇంట్లో అన్నం వండమని చెప్పి, సగం మీటింగులో తిరిగి వచ్చి పులుసు, కూరా చేసెయ్యవచ్చు అని నిశ్చయం చేసుకుంది.
ఏ చీర కట్టుకుని వెళ్ళాలి, ఎక్కడ నిలబడి ఆమె మాట్లాడేది వినాలి అని అమ్మకు కొంచం జంకు కలిగింది. పట్టుచీర కట్టుకుని వెళ్తే తాతగారికి తెలిసి పోతుంది. అమ్మ తనకు నచ్చిన నిమ్మకాయ రంగు చీర కట్టుకుని, తలలో పూలు పెట్టుకుంటూ, గుడికి వెళ్లి వస్తానని చెప్పి నన్ను కూడా తీసుకు వెళ్ళడానికి బయలు దేరినప్పుడు గంట ఆరు మాత్రమే అయ్యింది.
అమ్మ నడకలో కంగారూ, తొందర కలగలిసి పోయాయి. మేము స్టేజీని సమీపించే సరికి ఇరవై మంది కూడా రాలేదు. అమ్మ ముఖంలో సన్నని చిరునవ్వు కదలాడి మాయమైయ్యింది. దానిని అలాగే దాచుకుంటూ “మీటింగ్ ప్రారంభించే దాకా జోస్యులు గారిట్లో ఉందాం” అన్నది.
నాన్న తరచుగా దండపాణి జోస్యులు గారింటికి వచ్చి సంప్రదించే వారు కాబట్టి అమ్మని చూడగానే ఆహ్వానిస్తూ నాన్నగారి గ్రహ సంచారాలని గురించి చెప్పడం ప్రారంభించారు. అమ్మ నన్ను బైటికి పంపిస్తూ వాహిని స్టేజ్ మీదికి వస్తే వెంటనే కబురు తెలియ జేయమని రహస్యంగా చెప్పింది.
నేను వీధికి వచ్చి స్టేజ్ పక్కనే ఉన్న వకీలు సుబ్బరాయన్ గారింటి అరుగు మీద కూర్చుంటూ వేడుక చూస్తూ ఉన్నాను. వయసు మళ్ళిన వాళ్ళు మాత్రం కొంత మంది వచ్చారు. మీటింగ్ వినడానికి ఒక్క స్త్రీ కూడా రాలేదు.
ఏడు గంటల ప్రాంతంలో ఒక టాక్సీ వచ్చి ఆగింది. అందులో నుంచి వాహిని సుబ్రహ్మణ్యం దిగింది. మా స్కూల్లో ఐదో క్లాసు టీచర్ అన్నలక్ష్మిని గుర్తు చేసే రూపం. మగవాళ్ళలాగా పేంటూ, షర్ట్ వేసుకుని ఉంది. ఆమె జుట్టు కూడా క్రాప్ లాగా కత్తిరించ బడి ఉంది. అలాంటి ఒక స్త్రీని నేను అంతకు ముందు ఎప్పుడూ చూసి ఉండలేదు. ఆశ్చర్యంతో అమ్మ దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చి వాహిని వచ్చేసిందని రహస్యంగా చెప్పాను.
అమ్మ లేచి బైటికి వచ్చే సరికి వాహిని వేదిక మీద కూర్చుని ఉంది. కూడి ఉన్న జనం ఆమెను ఆశ్చర్యంగా చూస్తూ ఉండి పోయారు. వేరే ఏదో పని మీద వచ్చినట్లు, యాదృచ్చికంగా నిలబడి ఉపన్యాసం వింటున్నట్లు అభినయిస్తూ అమ్మ వాహినినే చూస్తూ ఉండి పోయింది వాహిని కూడా అమ్మని గమనింఛి ఉండవచ్చు. సన్నగా నవ్వింది. అమ్మకి ఆ అంగీకారమే ఎంతో తృప్తిని కలిగించింది.
అధ్యక్షుల ఉపన్యాసం, అభినందనలు తెలియ చేయడం అంతా అయ్యాక మైక్ ముందు వచ్చి నిలబడ్డ వాహిని సుబ్రహ్మణ్యం మృదువైన స్వరంతో మాట్లాడింది. వేదిక ప్రసంగాలకే చెందిన ఆర్భాటాలు, హంగులు ఏవీ లేవు. పువ్వులు అమ్మే స్త్రీలు మాట్లాడే విధంగా నిదానంగా, సన్నని గొంతుతో మాట్లాడుతూ ఆమె తనకు ఆ ఊరు బాగా నచ్చిందని చెప్పింది. చాలా అందమైన ఊరు అని కూడా అంది.
అమ్మకు సంతోషం పొంగి పొరలింది. స్త్రీలు బాగా చదువుకోవాలి. వ్రాయాలి. వర్జీనియా ఉల్ఫ్, సీమోన్ థీ పూవా, విల్లా కేతర్ లాంటి రచయితలు ఈ రోజు లోకమంతా చదవబడుతున్నారు. వివాదాలు చెయ్య బడుతున్నారు. తమిళనాడులో కవితను పాడడం కోసం కారైక్కాల్ అమ్మైయారు దెయ్యంలా మారవలసిన పరిస్థితులు ఉండేవి. అవ్వయ్యార్ ముసలిదానిలా రూపం మార్చుకున్న తరువాతే ఊరూరు తిరగడం సాధ్యం అయింది… అంటూ ఆమె ఉపన్యాసం కొనసాగించింది. మీటింగ్ వినడం కోసం వచ్చిన వాళ్ళలో ఎవరికీ ఆమె మాటలు నచ్చలేదని అనిపించింది. కొంత మంది లేచి వెళ్లి పోవడం ప్రారంభించారు. ఒకతను కావాలనే పెద్దగా ఆవలించాడు. ఇంకొకడు విజిల్ వేశాడు.
ఆమె వచ్చిన జనాన్ని చూసి మాట్లాడ లేదు. తనలో తానే మాట్లాడుకున్నట్లు ఉపన్యసించింది. కొన్ని వాక్యాలను పూర్తిగా ఆంగ్లంలోనే మాట్లాడింది. తమిళ భాషకు చెందిన సభలో అలా ఎవరూ ఆంగ్లంలో మాట్లాడి విని ఉండలేదు. ఇరవై నిమిషాల ప్రసంగం ముగిసేటప్పుడు ఆమె అన్నది.
“శ్రీవిల్లిపుత్తూరు ఒక రచయిత్రికి చెందిన ఊరు అన్నందుకు గాను ఈ ఊరుకి రావడానికి ఒప్పుకున్నాను. ఆండాళును తమిళ భాషలో ఉన్నతమైన స్త్రీ కవయిత్రిగా గుర్తించండి. ఆమెను పునీతం చేసింది చాలు.”
ఆమె మాట్లాడి ముగించినప్పుడు అమ్మ ఒక్కర్తి మాత్రమే చప్పట్లు కొట్టింది.
వాహినికి శాలువ కప్పి, అభినంధన పత్రం ఇచ్చేలోగా అమ్మ నన్ను తీసుకుని వేగంగా ఇంటికి వచ్చేసింది. ఆ లోపల రాణి అక్కయ్య అన్నం వండి, తెచ్చి పెట్టి వెళ్లి పోయింది. అమ్మ గబగబా పులుసు, కూరా చేయ సాగింది. అప్పటికీ ఆరోజు రాత్రి వంట ముగిసేటప్పటికి తొమ్మిదిన్నర అయి పోయింది.
నాన్న దుకాణంనుంచి ఇంటికి వచ్చారు. ఆయనకు అమ్మ వాహిని మీటింగ్ వినడానికి వెళ్ళింది తెలియదు. నాన్న కంచంలో అన్నం కలుపుకుంటూ, “అన్నం ఏంటీ ఇలా చిమిడి పోయింది?” అని అడిగారు.
అమ్మ జవాబు చెప్పలేదు.
“దీనిని మనిషి ఎవడైనా తింటారా?” అంటూ కోపంతో కంచాన్ని దూరంగా నెట్టేసి లేచి వెళ్లి పోయారు.
“రాణి ఇంటి నుంచి అన్నం వచ్చింది. నీ భార్యామణి ఊరు మేయడానికి వెళ్లి పోయింది.” తాతగారు అన్నది నాన్నగారి కోపాన్ని ఎగదోసింది.
“అలా ఊరు మేయడానికి ఎక్కడికి వెళ్లి పోయావు?” అంటూ తిట్టారు.
అమ్మకు ఏడుపు ముంచుకు వచ్చింది. ఆమె నాన్నను ఎదురించి ఒక్క మాట కూడా మాట్లాడింది లేదు. తాను కూడా భోజనం మానేసి అన్నంలో నీళ్ళు పోసి తీసి పెట్టి, వంటింట్లోనే పడుకుంది.
రాత్రి పదిన్నర అయిన తరువాత కూడా చిన్నాన్న ఇంటికి రాలేదు. అమ్మ చిన్న బల్బు వెలుతురులో ఏదో నవల చదువుతూ కూర్చుంది. చిన్నాన్న సైకిల్ శభ్దం వినిపించింది. అమ్మ నవలను మూసిపెట్టి లేచి నిలబడినప్పుడు చిన్నన్న వంటింటి గుమ్మం దగ్గర వచ్చి నిలబడ్డారు.
“వదినా! మీరు మీటింగ్‍కు రాకుండా ఉండి పోయారు. వాహిని చాలా బాగా మాట్లాడింది. మన ఊరి జనాల మట్టిబుర్రకు ఏదీ ఎక్కలేదు. నేను వెళ్లి శాలువా కప్పి అబినంధించి, ఆమె నవలలు అన్నీ చదివాను అని చెప్పాను. సంతోష పడింది. ఉదయం మన ఇంటికి అల్పాహారానికి రమ్మని పిలిచాను. వస్తానని చెప్పారు” అన్నారు.
అమ్మకు నమ్మశక్యం కాలేదు. వాహిని తాను తయారు చేసే టిఫిన్ తినడానికి వస్తోందా? నిజమేనా?
వినాయకం చిన్నాన్న ఆమె సంభ్రమాన్ని గుర్తించిన వారిలాగా అన్నారు.
“కేసరి, వడ, ఇడ్లీ, పొంగల్ అన్నీ చెయ్యండి వదినా. వాహిని మన ఇంటికి వస్తానని చెప్పడం అంటే మాటలు కాదు. టిఫినీలు అదిరి పోవాలి.”
అప్పుడే వంట చెయ్యడం మొదలు పెట్టేద్దామా అన్నంతగా ఉద్వేగం అమ్మను ఆవరించుకుంది. ఆమెకు ఆ రాత్రి నిద్ర పోవడం సాధ్యం కాలేదు. తెల్లవారు ఝామున నాలుగు గంటలకే లేచి మినప్పప్పు వడకి రుబ్బి పెట్టింది. బాగా నెయ్యి పోసి కేసరి చేసింది. ఇడ్లీకి కొత్తిమీర చట్ని, పుట్నాల పప్పు చట్నీ చేసింది. మిరియాలు, జీడిపప్పు నేతిలో వేయించి పొంగల్ చేసింది. వాహిని తినడానికి కూర్చున్న తరువాత పొయ్యి మీద పెనం పెట్టి రోస్ట్ గా దోశలు వెయ్యాలని అని నిశ్చయించు కుంది.
ఇవన్నీ సులభంగా చేసెయ్యవచ్చు. కానీ ఇంటికి వెచ్చే వాహినితో ఏమని మాట్లాడడం? ఒక వేళ ఆమెను తన భర్త ఏమైనా కోపంగా అనేస్తే ఏం చెయ్యడం అని లోలోపల భయంగా అనిపించింది.
తన దగ్గర ఉన్న వాటిల్లో చాలా నచ్చిన నేరేడు పండు రంగు చీరను కట్టుకుంది. వాహిని పువ్వులు పెట్టుకుంటుందా అని తెలియదు. కానీ ఆమెకూ కలిపి మల్లెపూలు కొని మాల కట్టింది. ఒకటికి రెండుసార్లు కేసరిలో తీపి సరిగా ఉందా అని రుచి చూసింది.
వినాయకం చిన్నాన్న వాహినిగారిని పిలుచుకుని రావడానికి బయలు దేరేటప్పుడు నాన్నగారు దుకాణం తెరవాలని బయలుదేరి వెళ్లి పోయారు. మంచిదయ్యింది. ఇకమీద ఏ సమస్యా ఉండదు అని అమ్మకు అనిపించింది. ఆరోజు నేను స్కూలుకు వెళ్ళలేదు. ఇంట్లో అమ్మతోనే ఉండి పోయాను.
వినాయకం చిన్నాన్న సైకిల్ కెరీర్ మీద కూర్చుని వాహిని ఇంటి ముందు దిగుతూ ఉండగా ఆ వీధి వీధంతా విడ్డూరంగా చూసింది. ఏం ఆడది ఈమె? కొంచం కూడా బిడియం అన్నది లేదా? సైకిల్ కెరీర్ మీద కూర్చుని వస్తోందే? టాక్సీలో వస్తే ఏమౌతుంది?
వాహిని తెల్ల రంగు టాప్స్, లేత నీలం రంగులో పాంటు వేసుకుని ఉంది. మెడలో ఒక పూసల దండ. వాకిట్లో వేసిన పెద్ద ముగ్గును ఆశ్చర్యంగా చూస్తూ ఆమె వీధి అందాన్ని పరికించి చూసింది. ఆ వీధి చాలా పెద్దది. రెండు వైపులా బాదనారాయణ చెట్లు ఉన్నాయి. పాత కాలపు పెంకుటిళ్ళు. జేగురు రంగుతో ఉన్న అరుగులు.
వాహినికి స్వాగతం చెప్పడం కోసం అమ్మ వాకిట్లో వచ్చి నిలబడింది. వాహిని అమ్మను చూసి నవ్వుతూ, “నిన్న మీటింగులో మిమ్మల్ని చూసాను. యు వర్ ది ఓన్లీ విమెన్” అంది. అప్పుడే వినాయకం చిన్నాన్నకు అమ్మకూడా మీటింగుకు వచ్చిన విషయం తెలియ వచ్చింది.
అమ్మ ఆమెకు నమస్కారం చెబుతూ లోపలికి రమ్మని ఆహ్వానించింది.
వాహిని అమ్మ చేతులను పట్టుకుని, “నైస్ శారీ” అంది. వాహిని చేతులు చల్లగా ఉన్నాయి. ఆమె అలా మొదటి కలయికలోనే చేతులను పట్టుకోవడం అమ్మకి ఎక్కువ సంతోషాన్ని కలిగించింది.
తాతగారు వాహినిని చూసీ చూడనట్లు ఉండి పోయారు. ఆయన పడక్కుర్చీలో నిద్ర పోతున్నట్లు వెనక్కి వాలి పడుకుని ఉండి పోయారు.
హాల్లోకి వచ్చి నిలబడిన వాహిని ఇంటి గోడల మీద వ్రేలాడుతున్న పాత ఫోటోలను చూస్తూ ఉండి పోయింది. దేనినో వెతుకుతున్నట్లు ఆమె కళ్ళు ఫోటోల మీద కదలాడుతున్నాయి.
వినాయకం చిన్నాన్న అమ్మతో టిఫిను వడ్డించమని చెప్పారు. వాహిని వద్దన్నట్లుగా తల ఆడిస్తూ “కొంచం సేపు పోనివ్వండి వినాయకం. ఐ యాం నాట్ హంగ్రీ” అంది.
అమ్మ వాహినికి ఇంటిని చూపించింది. పెరటి వైపు విడిగా కిటికీలు లేని చీకటి గదిని చూసి, “ఇది ఎందుకు?” అని అడిగింది వాహిని.
“ఇంట్లో లేని ఆ మూడు రోజులు ఇక్కడే ఉండాలి. భోజనం కూడా ఇక్కడే” అంది అమ్మ.
వాహిని ముఖంలో రంగులు మారాయి. ఆ చీకటి గదిలో ప్రవేశించి నిలబడింది. తల తగిలే ఎత్తు మాత్రమే ఉంది ఆ గది. తడిలో నానిన గడ్డి మోపు వాసన. జిడ్డుగా ఉన్న గోడలు. గది నుంచి బైటికి వచ్చినప్పుడు వాహిని ముఖం బిగుసుకు పోయినట్లు అనిపించింది.
ఆమె అమ్మను చూస్తూ, “ఈ గదిలో మీ భర్త ఒక్క రోజు గడపగలరా?’ అని అడిగింది. అమ్మ సమాధానం చెప్పలేదు.
తనలో తానే ఏదో గొణుక్కుంది వాహిని. తరువాత అమ్మ ముఖంలో ఉన్న ఆవేదనను పోగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా పెరటి గుమ్మం వాకిట్లో నిలబడి బైట కనబడుతున్న పెద్ద గోపురపు అందాన్ని చూస్తూ, “ఎక్కడి నుంచి చూసినా గోపురం అందం కనబడుతుంది కదా?” అంది.
అప్పుడు ఆమె గొంతు ఒక చిన్నపిల్ల మాట్లాడే విధంగా ఉండింది.
“మా ఊరు మీకు నచ్చిందా?” అని అడిగింది అమ్మ.
“చాలా నచ్చింది. ఇండియాలోనే ఇలాంటి ఒక గుడిని నేను చూసింది లేదు. ఆండాళ్ ఈస్ గ్రేట్!” అంది వాహిని.
“నిన్న మీరు మాట్లాడింది చాలా బాగా ఉండింది. కానీ అర్ధం కాలేదు” అంది అమ్మ.
“అలాగా!” అంటూ నవ్వుతూ అమ్మ చేతులను మళ్ళీ గట్టిగా పట్టుకుంటూ, “మనసులో తోచినదంతా మాట్లాడేస్తాను. ప్రేక్షకులను చప్పట్లు కొట్టించేలా మాట్లాడటం నాకు తెలియదు.” అంది.
అది విన్నతరువాత అమ్మ నవ్వుతూ,”చాలా నెమ్మదిగా మాట్లాడుతున్నారు. మేధావులే అలా మాట్లాడతారు” అంది.
“అలాగైతే నేను మేధావి అని చెబుతున్నారా మీరు?” అంటూ నవ్వుతాలుగా చెబుతూ, “ఈ ఊళ్ళో నా ప్రసంగం వినడానికి వచ్చిన ఒకే ఒక్క మహిళ మీరే. అలాంటప్పుడు మీరు కూడా మేధావియే కదా” అంది.
“నేను మూర్ఖురాలిని. నాకు తెలిసినదంతా నవలలు చదవడం ఒక్కటే” అంది అమ్మ,
“ఎన్ని నవలలు చదివి ఉంటారు?” అని అడిగింది వాహిని.
“నూట యాబై… రెండువందల దాకా ఉంటుంది. చేతికి చిక్కిన ప్రతీదీ చదువుతాను. లైబ్రరీ నుంచి బాబు తీసుకు వచ్చి ఇస్తాడు” అంది అమ్మ.
“మీరు లైబ్రరీకి వెళ్ళరా?”
“ఈ ఊళ్ళో ఏ ఆడదీ లైబ్రరీకి వెళ్ళదు.”
“ఎందుకు? వెళ్తే దయ్యం పట్టుకుంటుందా?”
“వెళ్లాలని నాకూ కోరికగానే ఉంది. కానీ అనుమతి ఇవ్వరు.”
“ఎవరు?”
“ఇంట్లో.”
“ఇల్లు అంటే ఎవరు?”
“ఇంటాయన” అంది అమ్మ.
“ఆయన్ని ఎందుకు అడుగుతున్నారు? ఆయన్ని అడిగే భోజనం చేస్తారా, స్నానం చేస్తారా?” అడిగింది వాహిని.
“ఇంటి నుంచి బైటికి వెళ్ళాలంటే ఆయన అనుమతి ఇవ్వాలి.”
“అలా ఎవరు చెప్పారు?”
“అదే అలవాటు.”
“అది తప్పు. నేను ఎవరినీ అనుమతి అడిగింది లేదు.”
“మీ వారు ఏం చేస్తుంటారు?” కాస్త సంకోచిస్తూ అడిగింది అమ్మ.
“మీ వారేంటీ? ఆయన పేరు స్టీఫన్. అమెరికన్. నేను పేరు పెట్టే పిలుస్తాను.”
“అమెరికనా?” అమ్మ మళ్ళీ అడిగింది.
“బాగా తమిళం మాట్లాడుతారు. సైంటిస్ట్” అంది.
“మీకు పిల్లలు ఉన్నారా?” అని అడిగింది అమ్మ.
“ఇద్దరు అబ్బాయిలు. తండ్రితో అమెరికాలో ఉంటారు. నేను ఆరు నెలలు కలకత్తాలోనూ, ఆరునెలలు అమెరికాలోనూ ఉంటాను”అంది వాహిని.
“ఒంటరిగానా ఉంటున్నారు?” అమ్మ అడిగింది.
“కలకత్తాలో తొమ్మిది లక్షల మంది ఉన్నారు. అందులో నేనూ ఒకర్తిని” అంటూ నవ్వింది వాహిని.
“మీ ఇంట్లో మీరు వ్రాయడానికి ఎవరూ అడ్డు చెప్పలేదా?”
“మా అమ్మ వ్రాయ కూడదు అని బాగా తిట్టేది. నాన్నగారు నీ ఇష్టం వచ్చినట్లు వ్రాయి అని బోలెడు పుస్తకాలు కొని, చదవడానికి ఇచ్చారు. నేను హాస్టల్‍లో ఒంటరిగా పెరిగిన అమ్మాయిని. నాకు స్వతంత్రంగా బ్రతకడం ఇష్టం” అంది వాహిని.
వినాయకం చిన్నాన్న టిఫిన్ కోసం అరిటాకులు కోసుకుని వచ్చారు. అమ్మ వాహినితో, “టిఫిన్ తిందామా?” అని అడిగింది. వాహిని తల ఊపింది. మళ్ళీ ఏదో ఆలోచిస్తూ, “మీ ఇంట్లో టాయిలెట్ ఉందా?” అని అడిగింది.
అమ్మ తల దించుకుని, “లేదు. మేము పొద్దు పొడవక ముందే చింత తోట వైపుకు వెళ్తాము” అంది.
“అంటే యూరిన్ వెళ్ళాలన్నా కూడా చింత తోటకే వెళ్తారా?” అని అడిగింది.
“పెరటి వైపు కూలిన గోడ ఒకటి ఉంది. దాని చాటున పని పూర్తి చేసుకుంటాను. కానీ సిగ్గుగా ఉంటుంది. అందువల్ల మూత్రం వెళ్ళకుండా ఆపుకుంటాను” అంది అమ్మ.
“నాకు ఇప్పుడు యూరిన్‍కి వెళ్ళాలి” అంది వాహిని.
అమ్మ ఆవిడను గోడ చాటుకు వెళ్ళమని చెప్పి, బైట కాపలాగా నిలబడింది. వాహిని మళ్ళీ వచ్చినప్పుడు, ఆమె ముఖం వాడి పోయి ఉంది. ఎండి పోయిన పెదవులను నాలుకతో తడి చేసుకుంటూ అంది.
“ఎలా ఇలా బ్రతుకుతున్నారు? టెరిబిల్!”
అమ్మ ఆమెను తలెత్తి చూడలేక పోయింది. కాళ్ళూ చేతులూ కడుక్కోవడానికి నీళ్ళు తెచ్చి ఇస్తూ, “అలవాటై పోయింది” అంది.
వినాయకం చిన్నాన్న స్టూలు తెచ్చి పెట్టి దాని మీద అరిటాకు పెట్టారు. కూర్చోవడానికి ముక్కాలి పీట ఒకటి వేశారు. వాహిని, “అది వద్దు” అంటూ నేల మీదే కూర్చుని తింటానని చెప్పింది.
“కష్టంగా ఉంటుంది” అంది అమ్మ.
“ఏ కష్టమూ ఉండదు. నువ్వు కూడా వచ్చి కూర్చో. కలిసి తిందాం” అంది వాహిని.
వాహిని తనను నువ్వు అంటూ సంభోదించడం అమ్మకి నచ్చింది.
“నేను దోశలు చెయ్యాలి. మీరు తినండి” అంది అమ్మ.
“అదంతా అక్కర లేదు. వచ్చి నాతో కూర్చో. వినాయకం వడ్డిస్తారు” అంది వాహిని.
అమ్మకు నవ్వు వచ్చింది.
“ఏం? మగవాళ్ళు వడ్డించి, మనం తినకూడదా?” అని అడిగింది.
“అందులో ఏ తప్పూ లేదు. నేను వడ్డిస్తాను. వదినా! మీరు కూడా కూర్చోండి” అన్నారు చిన్నాన్న.
“వద్దు. మొదట ఆవిడ తిననీ” అంటూ వడ, కేసరి, ఇడ్లీ, పొంగల్ అంటూ అన్నీ తీసుకు వచ్చింది అమ్మ.
వాహిని అమ్మ చెయ్యిని పట్టి కూర్చో బెట్టేసింది.”ఒంటరిగా తినడం నాకు ఇష్టం ఉండదు. నాతో కలిసి తిను” అంది.
అమ్మ ఆమెతో కూర్చుంది.
కేసరి తింటూ, “చాలా బాగా ఉంది” అంటూ ప్రశంసించింది వాహిని. అమ్మ కళ్ళల్లో నీళ్ళు తొణికిసలాడాయి.
“ఈ వడ, పొంగల్, ఇడ్లీ…ఇవన్నీ చెయ్యడానికి ప్రొద్దున్న ఎన్ని గంటలకు లేచావు?” అని అడిగింది వాహిని.
“నాలుగు గంటలకు” అంది అమ్మ.
“నేను తినేది రెండు ఇడ్లీలు, ఒక వడ. దానికి ఇంతగానా?” అంటూ నవ్వింది వాహిని.
“అందుకే ఇంత సన్నగా ఉన్నారు” అంది అమ్మ.
“నేను ఎప్పుడూ ఇలాగే” అంటూ అమ్మకు చట్నీ వడ్డించింది వాహిని. వాళ్ళిద్దరూ తినడాన్ని వేడుక చూస్తూ కాస్త ఎడంగా నిలబడ్డారు చిన్నాన్న.
“నేను వంటింటి వైపు వెళ్లి పదేళ్ళు అవుతోంది. ఇంట్లో వంట మనిషి ఉంది. చదవడం, వ్రాయడం మాత్రమే నా పని” అంది వాహిని.
అమ్మ ఆమె కెలుకుతున్నట్లుగా తినడాన్ని చూస్తూ ఉండి పోయింది.
“మీ కధల్లో ఎందుకు విడిపోవడం గురించే వ్రాస్తూ ఉన్నారు? చదువుతూ ఉంటే ఏడుపు వస్తుంది.”
“విడిపోవడం అన్నది మాటల్లో చెప్పలేని తపన, అవస్థ. వియోగం తాలూకు బాధను చాలా అనుభవించాను. ఒంటరిగా కూర్చుని ఏడ్చేదాన్ని. వ్రాసి వ్రాసి ఓదార్పును వెతుక్కోవాల్సి వస్తోంది.”
“తింటున్నపుడు దీని గురించి మాట్లాడి మీ మనసుకు కష్టం కలిగించాను.”
“అదంతా ఏమీ లేదు. ఇద్దరు స్త్రీలు మాట్లాడు కోవడం మొదలు పెడితే వియోగం గురించిన ప్రస్తావన రాకుండా ఎలా ఉంటుంది? మనిద్దరిలోనూ కామన్ విషయం అదే కదా?”
అమ్మా దానిని ఆమోదిస్తూ అంది. “మీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి.”
“అలాగా! మీ ఇంటి హాల్లో ఎందుకు ఒక్క స్త్రీ ఫోటో కూడా పెట్టలేదు?”
“అది అలవాటు లేదు. స్త్రీలను ఫోటో తియ్యనివ్వరు.”
“నువ్వు తీసుకోనే లేదా?”
“ఒకటీ రెండు సార్లు తీసుకున్నాను. కానీ దానిని గోడ మీద వ్రేలాడదీయడం కుదరదు. చూస్తే నవ్వుతారు.”
వాహిని అరిటాకును మడుస్తూ లేచింది. “ మంచి భోజనం. ఇలా తింటే నిద్ర వచ్చేస్తుంది. బరువు పెరుగుతుంది.”
అమ్మ నవ్వుతూ అంది. “అలా గుడి దాకా నడిచి వెళ్లి వస్తే మళ్ళీ ఆకలి వేస్తుంది.”
“వెళ్దామా? నాకు ఏనుగును చూడాలి” అడిగింది వాహిని.
చిన్నపిల్లలాగ ఇదేం కోరిక అనుకుంటూ, “వస్తాను” అంది అమ్మ.
వినాయకం చిన్నాన్న వాళ్ళిద్దరినీ చూస్తూ, ‘స్త్రీలు ఇలా చూసీ చూడగానే సన్నిహితులుగా అయి పోతున్నారు, ఎలా?’ అనుకుంటూ ఆశ్చర్యంతో అలాగే నిలబడి పోయారు.
వాహిని వినాయకం చిన్నాన్నతో అంది. “మీరు ముత్తు మనోహర్ గారితో చెప్పి రాత్రి రైలు టిక్కెట్ కాన్సల్ చెయ్యమని చెప్పండి. నేను కన్యాకుమరికి వెళ్ళ బోతున్నాను.”
వినాయకం చిన్నాన్న తలను ఊపారు. అమ్మ ఎంగిలి ఆకులను తీసి బుట్టలో పడేసి, “త్రాగడానికి కాఫీ కావాలా?” అని అడిగింది.
“వద్దు. గుడి దగ్గిర ఉన్న టీ కొట్టులో టీ తాగుదాం” అంది వాహిని.
“అదంతా అలవాటు లేదు” అమ్మ అంది.
“ఈ రోజు అలవాటు చేసుకుందాం” అంటూ, “ఎందుకో కన్యాకుమారికి వెళ్లాలని అనిపించింది. అందుకే రాత్రి ఇక్కడ బస చేసి ఉదయం సముద్రం చూడడానికి వెళ్తాను” అంది వాహిని.
“తలచుకోగానే మీకు ఏ ఊరికైనా వెళ్ళడం సాధ్యం కదా” అంటూ ఆతురతతో అడిగింది అమ్మ.
“దానికి ఎవరి దగ్గర అనుమతి తీసుకోవాలి?” అంటూ నవ్వింది వాహిని.
వాహినితో గుడికి వెళ్ళేటప్పుడు అమ్మ సంతోషంతో గాలిలో తేలిపోతూ ఉంది. ఇద్దరూ కలిసి ప్రాకారం చుట్టూ తిరిగారు. పాలకోవా కొనుక్కుని తిన్నారు. ఆండాళ్ పాశురం ఒకటి అమ్మని పాడమని అడిగి విని చప్పట్లు కొట్టింది వాహిని.
గుడి ముందు ఉన్న దుకాణంలో తెల్ల శంఖం ఒకటి కొని తన గుర్తుగా వాహినికి బహూకరించింది అమ్మ. దాని తరువాత ఇద్దరూ ప్రాకారాన్ని ఆనుకుని ఉన్న కొట్టులో షర్బత్ తాగారు.
అమ్మ కాస్త సంకోచిస్తూ వాహినిని అడిగింది.
“ఒక్క అనుమానం… అడిగితే కోపగించుకోరు కదా?”
“అడుగు.”
“మీ లాగా వ్రాయడం అందరికీ సాధ్యమేనా?”
“ఎందుకు సాధ్యం కాదు? నువ్వు కూడా వ్రాయొచ్చు. ప్రయత్నించి చూడు. నువ్వు నవలలు బాగా చదువుతావు కదా. బాగా మాట్లాడుతున్నావు. పెద్ద కుటుంబం మీది. ఎన్నో అనుభవాలు ఉంటాయి. నువ్వు తప్పకుండా వ్రాయగలవు.”
అమ్మ నవ్వుతూ, “ఊరికే అడిగాను” అంది. మధ్యాహ్నం దాకా వాళ్ళిద్దరూ ఊరంతా తిరిగి, మరుందీశ్వరుడి గుడికి వచ్చినప్పుడు ముత్తు మనోహర్ కారులో వచ్చారు.
వాహినిని చూడడటం కోసం ప్రిన్సిపాల్ చొక్కలింగం ఎదురు చూస్తున్నారని, ఆమెను తన కారులోనే తీసుకు వెళ్తానని అన్నారు. అమ్మను తనే కారులో ఇంటి దగ్గర దిగబెడతానని వాహిని అంది. కానీ అమ్మ తాను నడుచుకుంటూ వెళ్లి పోగలదని చెప్పింది. వీడ్కోలు తీసుకుంటున్నప్పుడు అమ్మని గట్టిగా కౌగలించుకుంది వాహిని.
“నువ్వు నాకు చాలా నచ్చావు” అంటూ చెయ్యి ఊపుతూ వీడ్కోలు తీసుకుంది.
ఆ రోజు రాత్రి, “ఆ దొరసానిని ఇంటికి పిలిచి ఎందుకు ఆతిధ్యం ఇచ్చారు?” అని నాన్నగారు పెద్దగా గొడవ చేశారు తాతయ్య కూడా కలగజేసుకుని తిట్టి పోశారు.
“మొదట పుస్తకాలు చదివే అలవాటును ఆపాలి. ఈ ఇంట్లో ఇక మీద ఒక్క పుస్తకం కూడా ఉండకూడదు” అంటూ నాన్నగారు అరిచింది మాత్రమే కాక అమ్మ సేకరించి పెట్టుకున్న పుస్తకాలన్నింటినీ తీసుకు వెళ్లి పెరటి గుమ్మం బైట విసిరేసి వచ్చారు.
అమ్మ నాన్నగారి కోపాన్ని లెక్క చేయనట్లు ప్రశాంతంగా పెరటి గుమ్మం దాకా వెళ్లి పారేసిన నవలల్ని మళ్ళీ తీసుకు వచ్చింది.
నాన్నగారి కోపం ఇంకా తగ్గలేదు. మర్నాడు కూడా చాలా దారుణంగా తిడుతూనే ఉన్నారు. వినాయకం చిన్నాన్నఇక మీద తాను నవలలు ఏవీ కొని ఇవ్వనని నాన్నగారి దగ్గర ప్రమాణం చేసారు. నాన్న నన్ను పిలిచి, “నువ్వు వెళ్లి ఇక మీద లైబ్రరీ నుంచి పుస్తకాలు తెచ్చి ఇవ్వ కూడదు” అని అన్నారు. అమ్మ నవలలు చదవడం రెండు నెలలకు ఆగి పోయింది.
దాని తరువాత అలవాటు చొప్పున నేను లైబ్రరీ నుంచి నవలలు తీసుకు వచ్చి ఇచ్చే వాడిని. అమ్మ చదవడం మొదలు పెట్టింది. ఆరునెలల తరువాత ఒక రోజు అమ్మకు వాహిని పంపించిన చిన్న పార్సల్ ఒకటి పోస్ట్ లో వచ్చింది.
అమ్మ పేరు మీద వచ్చిన ఒకే ఒక తపాలు అది ఒక్కటే. అమ్మతో ఏర్పడిన స్నేహాన్ని ప్రశంసిస్తూ వ్రాసిన ఉత్తరం, ఒక చేతి గడియారం ఉన్నాయి. అమ్మ దానిని చదివి ఏడ్చింది. ఆరోజు రాత్రి నాన్న అమ్మతో మళ్ళీ గొడవ పెట్టుకున్నారు.
“నీకు ఎందుకు ఆమె వాచ్ పంపించింది? డబ్బులు ఏమైనా ఇచ్చి పెట్టావా?” అంటూ నోటికి వచ్చినట్లు తిట్టారు. అమ్మకి వచ్చిన ఉత్తరాన్ని చింపి పోగులు పెట్టి గడియారాన్ని పనిమనిషికి ఇచ్చేశారు. అమ్మ దానికి ఎటువంటి వ్యతిరేకత చూపించలేదు,
దాని తరువాత అమ్మకు వాహిని దగ్గర నుంచి ఏ ఉత్తరమూ రాలేదు. అమ్మ కూడా ఆమెను గుర్తు చేసుకోనూ లేదు. తాతయ్య పోయిన తరువాత ఆస్తి పంపకాలు అయ్యాయి. అందులో వినాయకం చిన్నాన్న వాటాగా ఇల్లు చెందడం వల్ల మేము తెన్‍కాశికి వెళ్లి పోయాము. దాని తరువాత అమ్మ వాహిని గురించి మాట్లాడినట్లు నాకు గుర్తు లేదు.
కానీ ఈ రోజు అమ్మ ఉత్తరాన్ని చదివిన తరువాతే ఆమె వాహినికి కృతజ్ఞతలు తెలియ జేస్తూ ఉత్తరం వ్రాసిందని తెలిసింది. ఆ ఉత్తరం ఎలా వ్రాసింది, ఎలా పంపించింది ఏదీ నాకు తెలియ లేదు.
కానీ అమ్మ ఉత్తరంలోని వాక్యాలను చదువుతున్న కొద్దీ నా మనసును తొలిచేస్తున్నట్లు అనిపించింది.
ఉత్తరం ఈ విధంగా వ్రాసి ఉంది.
ప్రియమైన వాహినికి,
ఇలా సంభోదించడం కన్నా, ప్రియమైన స్నేహితురాలు వాహినికి అని వ్రాయాలని నా కోరిక. ఒక్క రోజు సన్నిహితంగా ఉన్నా స్నేహం స్నేహమే కదా. వాహినీ! నీ నవలలను చదివేటప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతావని నేనుగా నీ గొంతును వింటూ ఉండే దాన్ని. ఆశ్చర్యం! అదే గొంతుతో నువ్వు నేరుగానూ మాట్లాడావు.
నవలలు అంటే వట్టి ఊహాజనితం కాదు అని ఆరోజే నాకు అర్ధం అయ్యింది. నీ గురించి నేను చాలా ఊహించుకున్నాను. వేదిక మీద నువ్వు మాట్లాడినప్పుడు కూడా నువ్వు ఎంత మేధావి అనే అనుకున్నాను. కానీ నీతో సన్నిహితంగా మెలిగిన తరువాత నువ్వు కూడా నాలాగే వియోగాన్ని, తీరని ఒంటరితనాన్నిఅనుభవిస్తున్నావని అర్ధం చేసుకున్నాను. నువ్వు కూడా నిరాకరించబడ్డావు. ఎగతాళి చెయ్య బడ్డావు. ప్రేమ కోసం నువ్వు పడుతున్న తపన నాకు అర్ధం అయ్యింది.
వాహినీ! అలవాటై మొద్దుబారి పోయిన నా జీవితం తాలూకు విషాదాన్ని నువ్వు నాకు చూపించావు. ఆ రోజు మా ఇంట్లో మరుగుదొడ్డి లేకుండా ఉన్నందు వల్ల కూలిన గోడకు అవతల నువ్వు పని కానిస్తున్న ఆ నిమిషంలోనే నేను ఇలాంటి ఒక జీవితాన్ని బ్రతుకుతూ ఉన్నందుకు సిగ్గు పడ్డాను. బాధగా అనిపించింది. వాహినీ! నిన్ను చూసినప్పటి నుంచి నేను కూడా వ్రాయగలనా అని ప్రశ్నించాలని అనిపిస్తూనే ఉండింది. కానీ అడగడానికి సంకోచం కలిగింది. నువ్వు బయలు దేరే ముందు కూడా బిడియపడుతూనే అడిగాను. ఖచ్చితంగా వ్రాయగలను అని అన్నావు. వినడానికి చాలా సంతోషంగా అనిపించింది. కానీ ఇంటికి వచ్చిన తరువాతే నేను ఎప్పటికీ వ్రాయలేనని అని అర్ధం అయ్యింది.
నేను వ్రాసిన దాన్ని ఆమోదించడానికి, అర్ధం చేసుకోవడానికి ఇంట్లో ఒక్కరు కూడా లేరు. ఈ ఊళ్ళో ఒక్కరు కూడా దీనిని అర్ధం చేసుకోరు. కవులకు గుళ్ళు కడతారు. దండలు పెడతారు. కానీ ఇంటి ఆడవాళ్ళు కవిత వ్రాయడానికి అనుమతించరు. కడుపున పుట్టిన పిల్లలే అభ్యంతరం చెబుతారు. నువ్వు వ్రాయడానికి పోరాడే మనిషివి. నేను చదవడానికి పోరాడే స్త్రీని. నాలాంటి స్త్రీలు రాయాలంటే ఇంకా నూరేళ్ళు అయినా దాటాలి. వాహినీ! నీలాంటి వాళ్ళు అదృష్టవంతులు. అనుకున్న ప్రదేశాలకు వెళ్ళడం నీకు సాధ్యం అవుతుంది. నేను కాకి లాంటి దాన్ని. ఎక్కువ దూరం ఎగరడం సాధ్యం కాదు. ఇంటికీ చెట్టుకూ మధ్య ఉన్న నూరడుగులే నా జీవితం. అధిక పక్షంగా కాకి ఊరు చివరదాకా వెళ్ళగలదు. సముద్రం దాటి ఎగరడం వాటి వల్ల సాధ్యం కాదు. నా జీవితం అంతే.
నాకు ఇష్టమైన ఒక పుస్తకాన్ని డబ్బు పెట్టి కొనుక్కోలేని పరిస్థితిలోనే ఉన్నాను. కుటుంబ భారం స్త్రీలను వ్రాయడానికి అనుమతి ఇవ్వదు. వ్రాయడం నాకు సాధ్యం కాదు. ప్రేమతో నువ్వు పంపించిన బహుమతిని కాపాడు కోవడం నాకు సాధ్యం కాలేదు. పోగొట్టుకున్నాను. ఇదే నా పరిస్థితి. అందు కోసం రాత్రంతా ఏడిచాను.
నా మీద నిజమైన ప్రేమ ఉంటే ఇకమీద ఉత్తరాలు వ్రాయకు. వీలైతే నీ కధల్లో నన్ను ఒక కధా పాత్రగా చిత్రీకరించు. ఒక నవలలో పాత్రగా జీవించడాన్నే నేను కోరుకుంటున్నాను. అది చాలు నాకు. కధల్లో వచ్చే పాత్రలను ఖచ్చితంగా చాలా మంది ఇష్ట పడతారు. అర్ధం చేసుకుంటారు. కన్నీళ్లు కారుస్తారు. అదే నాకు అనువైన మార్గం. ఇక పైన నువ్వు నాకు అక్కరలేదు. నీ నవలలే చాలు.
ఇట్లు
నీ స్నేహితురాలు
గుణవతి
ఇన్నేళ్ళ తరువాత అమ్మ వ్రాసిన ఉత్తరాన్ని చదువుతూ ఉన్నప్పుడు నాకు తెలియ కుండానే దుఃఖం పొంగి వచ్చింది. ఏకాంతంగా కూర్చుని వెక్కి వెక్కి ఏడిచాను,
వాహిని సుబ్రహ్మణ్యం ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని తెలుసుకుని చెప్పమని నా కూతురికి మళ్ళీ ఒక మెయిల్ పెట్టాను. రెండు వారాల తరువాత జవాబు వచ్చింది. అందులో వాహిని బ్రెస్ట్ కాన్సర్ కారణంగా 2008లో అమెరికాలో మరణించింది అని, వాళ్ళ ఇంట్లో అమ్మ ఇచ్చిన తెల్లని శంఖం భద్రంగా ఉందనీ వాహినీ సుబ్రహ్మణ్యం కొడుకు హెన్రీ తెలియ జేసినట్లు వ్రాసింది.
అమ్మ ఉత్తరాన్ని మళ్ళీ మళ్ళీ చదువుకుంటూనే ఉన్నాను. ఉన్నట్లుండి అనిపించింది. స్త్రీలకు మాత్రం ఎలా అపురూపమైన స్నేహం ఒక్క రోజులోనే సాధ్యం అవుతోంది!
తలచుకున్న కొద్దీ మనసు దుఃఖంతో నిండి పోయింది.
అమ్మ పేరు మీద స్త్రీల కోసం ఒక లైబ్రరీ శ్రీవిల్లిపుత్తూరులో ఎందుకు స్థాపించ కూడదు అని అనిపించింది. తన నవలలో వాహిని అమ్మను ఒక కధాపాత్రగా మలిచిందా అని తెలుసుకోవడానికి వాహిని వ్రాసిన నవలలు చదవాలని కూడా అనిపించింది.
అమ్మ పుస్తకం చదువుతున్నట్లుగా ఒక్క ఫోటో కూడా నా దగ్గర లేదన్నది ఆ నిమిషం తట్టుకోలేని అపరాధ స్పృహను కలిగించింది.
****
1956లో దిండిగల్, తమిళనాడులో జననం. మాతృభాష తమిళం. తండ్రిగారి ఉద్యోగరీత్యా తెలంగాణాలో తెలుగు మాధ్యమంలో విద్యను అభ్యసించారు. బి.కాం. పూర్తి అవుతుండగానే వివాహానంతరం చెన్నైకి వెళ్ళవలసి వచ్చింది. ఆ తరువాతే తమిళ సాహిత్యం చదవడానికి అవకాశం లభించింది. సాహిత్యం అంటే మక్కువ. తెలుగులో తనకి నచ్చిన నవలలు, కధలు తమిళ పాఠకులకు, అలాగే తమిళంలో మనసుకు దగ్గరగా ఉన్న సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు అందించాలనే కోరికతో, ఆశయంతో అనువాద ప్రక్రియను ఎంచుకున్నారు. 1995లో మొదటి అనువాద కధ యండమూరి వీరేంద్రనాథ్ గారి “ది బెట్’ తమిళంలో ప్రచురం అయ్యింది. దాదాపు ఎనబై తెలుగు నవలలు తమిళంలో వెలువడి ఉన్నాయి. (యండమూరి వీరేంద్రనాథ్, యద్దనపూడి సులోచనారాణి, D. కామేశ్వరి, ఓల్గా) తెలుగులో పెరుమాళ్ మురుగన్ గారి “పూనాచ్చి ఒక మేకపిల్ల కధ” ఈ మధ్యే వెలువడింది. 2015లో ఓల్గాగారు “విముక్త” కధా సంకలనానికి సాహిత్య అకాడమి అవార్దు అందుకున్న అదే ఏడాది, విముక్త తమిళ అనువాదం “Meetchi”కి గౌరీ కృపానందన్ సాహితి అకాడమి అనువాద పురస్కారం అందుకున్నారు. మూలానికీ, అనువాదానికీ ఒకే ఏడాది సాహిత్య అకాడమి అవార్డులు రావడం ఇదే తొలిసారి.
అద్భుతమైన కథ. ఈ కథలో ఎన్ని పార్స్వాలు ఉన్నాయి! ఓహ్!
మీ అనువాదము కూడా అంత రసవత్తరంగా సాగింది. గౌరీ కృపానందం గారూ! మీకు నా హృదయపూర్వక అభినందనలు. ఇంత మంచి కథని మాకు పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు.
Beautiful story. Very nice translation. Thank you very much. Expecting more stories from you.
ఎంత మంచి కథ. స్త్రీల జీవితాలలో ఎంత దుఃఖం. ఇంత మంచి కథను పరిచయం చేసినందుకు, ప్రచురించినందుకు ధన్యవాదాలు మరియు అభినందనలు గీతగారు.
గౌరీ కృపానందన్ గారికి నమస్సులు.