ఆగిపోకు సాగిపో
మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో ఎంపికైన ఉత్తమ కథ
-పి.వి.శేషారత్నం
‘హరిణీ! నువ్వు వచ్చే లోగా అందమైన పొదరిల్లు రెడీ చేయాలని ఆఫీసుకు కాస్త దూరమైనా ఇదిగో వీళ్ళు తీసుకున్నాను బాగుందా ? ‘
భర్త అర్జున్ మాటలు వింటూ గేటు లోకి అడుగు పెట్టి ఒళ్లంతా కళ్లు చేసుకుని చూసింది హరిణి.
‘ఆ ఆ..మరదలు పిల్లా! నాకు ఆడపడుచు కట్నం చదివించుకుని కుడికాలు ముందు లోపల పెట్టు‘ అకస్మాత్తుగా తలుపు చాటునుంచి వచ్చి గుమ్మం దగ్గరే హారతి పళ్లెంతో ఎదురుపడిన అమ్మాయిని చూసి ఉలిక్కిపడింది హరిణి.
‘ఇలాంటి పొరుగింటి రాకాసులను చూసి భయపడకు చెల్లమ్మా!చెట్టంత ఈ అన్నగారు నీకు తోడున్నాడు‘ అంటూ శిరీష నెత్తిన మొట్టాడు. ఉల్లాస్.
” హరిణి! ఈ ఇంట్లోకి చేరాక మన పక్కింట్లో మంచి ఫ్రెండ్స్ దొరికారు అని చెప్పానే ! వీళ్లే ఆ జంట. అంటూ వాళ్ళని చూసి పలకరింపుగా నవ్వాడు అర్జున్.
‘ హరిణీ! కొత్త పెళ్లి కూతురివి వచ్చీరాగానే చెయ్యి కాల్చుకోకుండా ఇవాల్టికి మా ఇంటి నుంచి క్యారేజ్ తెచ్చాను . బొంచేసి హాయిగా రెస్ట్ తీసుకోండి .తర్వాత తీరిగ్గా కలుద్దాం సరేనా ? ‘ అప్పగింతలు పెట్టేసి శిరీష ఉల్లాస్ వెళ్ళిపోయారు.
***
ఏమీ తోచక గోడ మీద బల్లిని అది వేటాడాలి అనుకుంటున్న ఆ పురుగుని చూస్తోంది హరిణి.
బల్లి ఎలాగైనా పురుగును పట్టుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది . కానీ చూసి చూసి బల్లి ఒక్క దూకు దూకుతుంటే పురుగు తెలివిగా తప్పించుకుంటూ తన దిశ మార్చేస్తోంది .రెండూ పంతం వదలడం లేదు .
హరిణి మాత్రం మనస్ఫూర్తిగా పురుగు తప్పించుకోవాలని కోరుకుంటోంది.
చిన్నతనంలో హరిణి ఒకసారి పురుగును తప్పించాలని బల్లి ని బెదిరిస్తే బామ్మ కోప్పడింది. ‘ తప్పమ్మా! ఇది ప్రకృతి సహజం .పిల్లికి ఎలక పులికి లేడి ఎలాగో బల్లికి పురుగు అంతే .మనం కలగ జేసుకుంటే పాపం చుట్టుకుంటుంది . బల్లిది ఆహారపు వేట పురుగుడి ఆత్మరక్షణ అనుకుంటే పోలా! ‘
ఆనాడు బామ్మ మీద ఎంత కోపం వచ్చిందో ?
విసుగ్గా టివి ఆన్ చేసి వార్తలు చూస్తున్న హరిణికి ఒంట్లోని రక్తం మరిగి పోవడం మొదలెట్టింది . స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ పిల్లకి 16 ఏళ్ళు ఉంటాయేమో … ఒంట్లో టీబీ వలన బొమికలు బయటకు కనబడుతున్నాయి. ప్రాణాలు కళ్లలోనే ఉన్న ఆ పిల్లని ఆ రూమ్ లో ఇంజక్షన్లు అయిపోయాయి అని చెప్పి వవేరే రూం కి తీసుకెళ్ళి మత్తు ఇంజక్షన్ చేసి …కూడా వచ్చిన వ్యక్తిని రూము బయట కాపలా పెట్టి అత్యాచారం చేశారట ఆ వార్డు బాయ్ … ఆ పిల్ల ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయి మర్నాడు తల్లిదండ్రులకు చెబితే వాళ్ళు ఆసుపత్రి అధికారులు దగ్గర ఎంత గగ్గోలు పెట్టినా పట్టించుకోలేదట . ఇది తెలుసుకున్న మహిళా సంఘాలు ఆసుపత్రి ముందు ధర్నా చేస్తున్నాయి. ఆడదంటే ఎంత అలుసు అయిపోయింది ఈ మగాళ్ళకి ?
‘ ఎవరో చెప్పుకో చూద్దాం ‘ తదేకంగా టీవి చూడటంలో మునిగిపోయిన హరిణి కళ్ళు మూసింది పక్కింటి శిరీష .
‘ తామర తూడుల్లాంటి ఇంత మృదువైన చేతులు మా శిరీష కి కాక ఇంకెవరికి ఉంటాయి ‘ నవ్వింది హరిణి .
‘నిన్ను సస్పెన్స్ లో పెట్టడం కష్టమేనమ్మా . రెండు చేతుల మధ్య బుగ్గలానించుకున్న నువ్వు ఎంత ముద్దొస్తున్నావో ? ‘ కవ్వించింది శిరీష .
హరిణి చిన్న పిల్లల మనస్తత్వం శిరీష కి ఎంత నచ్చిందో శిరీష ముక్కుసూటితనం హరిణి ని అంత బాగానూ ఆకర్షించింది . అందుకే వచ్చిన నెల రోజులకే ఇద్దరూ ఎంతో చేరువై పోయారు .వయసు తారతమ్యం ఎక్కువ లేనందున పేర్లు పెట్టే పిలుచుకుంటున్నారు .
తన పలుకులకు హరిణి ముఖం చిన్న బోవడాన్ని అరక్షణలోనే పసిగట్టినా ఏమీ తెలియనట్టు ఊరుకుంది శిరీష .
‘ఏమిటి అంత సీరియస్ గా చూస్తున్నావు హరిణీ!స్పెషల్ ప్రోగ్రామా ? ‘
‘కాదు న్యూస్ …మానవత్వాన్ని మరిచి పోయిన ఈ మృగాడిని ఏం చేస్తే ఆ పిల్లకి న్యాయం జరుగుతుంది శిరీషా ! అసలు కొన్నాళ్ల తర్వాత ఆ పిల్లకి పెళ్లి అయినా తొలి వైవాహిక జీవన మాధుర్యాన్ని ఏం ఆస్వాదించ కలుగుతుంది ? ‘ ఆవేశం పొంగుకొచ్చింది హరిణికి.
శిరీష గాఢంగా నిట్టూర్చింది. ‘పరాయి మగాడు చూస్తేనే మన శీలం పోయిందననుకునే రోజులు ఎప్పుడో పోయాయి .ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా ఏ ఆడపిల్లయినా పెళ్లికాకముందు గానీ పెళ్లయ్యాక గానీ పరాయి మగవాడు తాకితేనే మైలుపడిపోయామనుకునే పరిస్థితి ఉందా అసలు ?అందుకే పూర్వపు పతివ్రతలతో పోల్చుకుంటే మనసులో ఆత్మన్యూనత కలిగినా ఈ కలికాలంలో పవిత్రతకు నిర్వచనం మార్చుకోకతప్పదు . ‘ శిరీష మాటలకి హరిణి విస్తు పోలేదు. ఆ మాటల్లో ఎంత పరిణతి ఉంది ? ఎంత వాస్తవం ఉంది ?
‘నిజమే శిరీషా ! తొలిముద్దు మాధుర్యాన్ని కట్టలు కట్టలు పద్యాలతో కావ్యాలుగా రాశారు మన పూర్వ కవులు .కానీ ఆడపిల్ల పుట్టిన దగ్గర్నుంచి పెద్దయ్యే లోపల ఎంతమంది వావివరుసల పేరుతో పెద్ద రికపు ముసుగులో ఆ పిల్ల బుగ్గలను అపవిత్రం చెయ్యలేదో ఏ ఆడపిల్లయినా గుండెల మీద చెయ్యి వేసుకుని ధైర్యంగా చెప్పగలదా ? తన శరీరాన్ని ఇటు బస్సుల్లో గాని అటు నిత్యజీవితంలో గాని ఏదో వంకతో ఏ మగాడు తాకలేదని చూడలేదని ప్రమాణం చెయ్యగలదా ఏ స్త్రీఅయినా ? ‘ హరిణి మాటలకు చప్పట్లు కొట్టింది శిరీష .
‘అమ్మో అమాయకంగా కనపడే నీలో ఇంత ఆవేశం ఉందా ? ఆడవాళ్లను ఉత్తేజితుల్ని చేసే రచనలు చేయకూడదా హరిణీ ? ‘
‘నా మొహం !నాకు అంత సీన్ లేదు . నిన్ను నీ ధైర్యాన్ని చూస్తే మాత్రం ఎంత అసూయ గా ఉంటుందో శిరీషా ! ‘
‘అబ్బో నన్ను ఊరికే మునగ చెట్టు ఎక్కిం చేస్తున్నావు ఎందుకు తల్లి ? ‘
‘ఎందుకా ?రద్దీ వంకతో రోజూ ఆడపిల్లలను ఏదో వంకతో ఛాతీ మీద నడుం మీద తాకుతున్న బస్ కండక్టర్ భరతం ఎలా పట్టావని ? ఉపాయంతో ఐరావతం లాంటి లేడీ చెకింగ్ ఇన్స్పెక్టర్ తో వాడి కాలు పచ్చడి చేయించడమే కాకుండా గూబ గుయ్యమనిపించేలా చేశావా లేదా ? అది నా దృష్టిలో ఎంత వీరోచిత కార్యమో తెలుసా ? ‘
‘తలచుకుంటే నువ్వు కూడాచేయగలవు హరిణీ! ఆడపిల్ల ఏడిస్తే బాధ పడితే వచ్చిన సమస్య తీరుతుందా ? రోజూ టీవీలో ….. “అమ్మాయిలపై అత్యాచారాలు ” అనే వార్తలు చూసి అయ్యో పాపం అని కడివెడు కన్నీరు కారిస్తే ఒరిగేదేమీ ఉండదు . వాటిని ధైర్యంగా ఎదిరించాలి హరిణి !’
‘ కానీ కుటుంబాల పరువు ఏమవుతుంది శిరీషా ? ‘హరిణి కంఠంలో కొట్టొచ్చినట్టు దిగులుతోపాటు చిన్న వణుకు …
‘అలా అని చదువుకున్నవారు కూడా భయంతో సిగ్గుతో ఇలాంటి లైంగిక దోపిడీ లను బయట పెట్టకపోతే నేరస్తులు నికృష్టపు పనులు చేస్తూనే ఉంటారు గంటల కొద్దీ సెల్ఫోన్ లతో కాలక్షేపం చేసే చాలామంది ఆడవాళ్లకి ఇలాంటి సమస్యలకు విమెన్ ప్రొటెక్షన్ సెల్ కి ఫోన్ చేయొచ్చు అనే విషయం కూడా తెలియదు . వాళ్ళు సమాచారాన్ని ఏమాత్రం లీక్ చెయ్యకుండానే సమస్య పరిష్కరిస్తారు తెలుసా ? అది సరే గానీ ఏమిటి ఈమధ్య బాగా చిక్కిపోతున్నావునేను మా తమ్ముడు దగ్గర మాట పడాల్సి వస్తుంది సుమా ! ‘
శిరీష ని మాట తప్పిస్తూ ష్లాస్కు లోంచి రెండు కప్పుల్లో టీ పోసింది హరిణి ‘
‘ అవునూ! ఇవాళ నువ్వు ఆఫీస్కి వెళ్లలేదా ? ఇదిగో నీ కోసం స్పెషల్ జింజర్ చాయి. ‘
‘ లేదుగాని హరిణీ! మీ రంగనాథం బావగారు ఉన్నారా వెళ్లిపోయారా ఎక్కడా కనిపించడం లేదు ? ఫ్రండ్ ని కలవడానికి బయటికి వెళ్లారు శిరీషా ! రాత్రికి వచ్చేస్తారు . ‘ ముభావంగా అంది హరిణి .
‘ అర్జున్ కి బంధుప్రీతి ఎక్కువ అనుకుంటాను మీరు కొత్తదంపతులు కదా మీ మధ్య ఆయన రోజులతరబడి ఉండటం ఏమీ ఇబ్బంది గా లేదా నీకు ? ‘ ఆరా తిసింది శిరీష .
‘ఆయన కొడుకులకి తండ్రి అంటే పడదట. భార్య పోయాక తిట్టుకునే ఆ ముగ్గురు పిల్లల మధ్య అటూ ఇటూ తిరుగుతూ ఉంటారట . ‘ శిరీషతో తన ఇబ్బందిని పంచుకుందామని అనుకుని కూడా ఎందుకో ఆత్మాభిమానం అడ్డోచ్చి ఆగిపోయింది .
పెద్దరికం ముసుగులో భర్త దూరపు బంధువైన రంగనాథం అసభ్య ప్రవర్తనని ఎవరికైనా ఎలా చెప్పుకో గలదు ?
మూడో కంటికి తెలియకుండా … తనకు తెలిసినా పై కి చెప్పుకునేందుకు సిగ్గుపడేలా మనసులోని కుమిలిపోయే లాంటి మాటలు విసురుతూ తప్పు చేస్తున్నాడాయన. ఒక ఆడ దానికి పుట్టి ఇంకో ఆడదానికి తాళికట్టి మరో ఆడపిల్లకు తండ్రి అయి మనవల్ని ఎత్తినా కూడా వావివరుసలు మరచి వెంపర్లాడే ఇలాంటి మృగాడిని ఏమనాలి?
తను ఇంకా వైవాహిక జీవితపు తొలి మెట్టు మీదే ఉంది .తనకి బంధువుల పొడగిట్టక అభాండాలు వేస్తోందని ఆయన చుట్టాల లో ప్రచారం చేస్తే అత్తవారింట్లో తన స్థానం ఎంతగా దిగజారిపోతుంది ? ముఖ్యంగా అర్జున్ మనసుని అలా గాయపరిచే సాహసం చెయ్యలేదు కానీ ఎలా భరించడం ? తన అంతరంగ వేదనని బయట ఎవరితో చెప్పుకున్నా పరువు పోయేది తనకే…
అసలు నెల క్రితం ఆయన ఇంట్లో అడుగుపెట్టిన తొలి రోజునే ఆయన పాదాలకు నమస్కరించి నప్పుడు తనని రెండూ జబ్బలు గుచ్చి పట్టుకుని లేపుతుంటేఆ స్పర్శ లో ఏదో అసహజత్వం కనిపించినా తను పొర బడ్డానని సమర్థించుకుంది . వరమో శాపమో తెలియదుగాని సహజంగానే స్త్రీ ఎటువంటి ప్రవర్తనని గుర్తించగలదు .
రోజు ఉదయం స్నానానికి వెళ్ళే ముందు అర్జున్ సోఫాలో కూర్చుని పేపర్ హెడ్లైన్స్ హడావిడిగా చదువుకుంటాడు . అర్జున్ తో బాటే రోజూ ఆయనకి కాఫీ కప్పు అందిస్తుంటే ఆయన తన వేళ్లని నొక్కుతున్నాడు . ఒకటి రెండు సార్లు తను పొరబడ్డాననే అనుకుంది కానీ కొంటెగా నవ్వుతున్న ఆ పులి కళ్ళలోని పిపాసను తన ఆడతనం తేలికగానే గుర్తించింది .
ఆయన నైజం గుర్తించక ముందు అర్జున్ ఆఫీసుకెళ్లిపోయాక తీరిగ్గా స్నానం చేసి తన గదిలో తలుపులేసుకుని బట్టలు మార్చుకుంటూ ఎందుకో గాని అద్దంలో నుంచి … వెనక నుంచి ఎవరో తనని పరి కిస్తున్నట్టు అనుమానం వచ్చి భయంతో బాత్రూం లోకి పారిపోయింది . అప్పటినుండి కట్టుకునే బట్టలు బాత్ రూం లోకి తీసుకు వెళుతొంది.
అర్జున్ క్యారేజ్ తీసుకెళ్తాడు కనుక ఇంట్లో ఉన్న బావగారు తన ఇద్దరు కలిసి తినక తప్పదు అన్నం వడ్డిస్తున్నప్పుడు తన గుండెల కేసి చూస్తుంటే ఒళ్ళు చచ్చిపోతొంది.
ఒక రోజు సాయంత్రం మల్లెపువ్వులు మిఠాయి తీసుకొచ్చాడు ఆయన. తన చేతి కందిస్తుంటే దూరంగా జరిగింది. కానీ అనుకోకుండా ఆ రోజు త్వరగా ఇంట్లోకి అడుగుపెట్టిన అర్జున్ కళ్ళు చెమ్మగిల్లాయి .
‘తీసుకో హరిణి తప్పేముంది ? ఆయన నీకు తండ్రి లాంటి వాడు . ‘
‘ఇవాళ నా పుట్టినరోజు తల్లి ! మా అమ్మాయి దగ్గర ఉండి ఉంటే ఇవన్నీ తనకే ఇచ్చేవాడిని . ‘ ఆయన మాటలకు అర్జున్ కదిలి పోయాడు. ఆయినా కళ్ళు తుడుచుకున్నాడు .
రాత్రి తను మాత్రం ఆ పూలు పెట్టుకోలేదు. అర్జున్ గుర్తు చేస్తే ‘నాకు మల్లెలు పడవు అర్జున్ ! ఎందుకో తెలీదు . పేలుపడతాయి ” అనేసింది .
మర్నాడు ఆయన బజార్ నుంచి సంపెంగలు తెస్తే తను తెల్లబోయింది .
‘ మల్లె పూలు లాగా వీటికి పేలు పట్టవు తీసుకో హరిణి ! ‘ అన్నాడు .
‘ మీకెలా తెలుసు నాకు మల్లెలు పడవని ? ‘ రాత్రి తమ పడక గదిలో మాట్లాడిన మాటలు ఆయనకెలా తెలిసాయి?’
ఆయన తడుముకోలేదు . ‘ పొద్దుటే నీ తలలో పువ్వులు లేకపోతేను … నీకు పడవు ఏమో అనుకున్నాను . అందుకే సంపెంగలు …. ‘అంటూ బలవంతంగా తన చేతిలో పెట్టాడు ఆయన.
‘అసలు నాకు పువ్వులు అంటేనే ఎలర్జీ ‘మొహమాటంగా అనేసి ఆ దండను దేవుడి పటానికి వేస్తుంటే ఆయన మొహం మాడిపోవడం కనుకొలకు ల్లోంచి గమనించింది. మర్నాటి నుంచి పల్లెటూరి మొద్దు లాంటి పనిమనిషి సీతాలుని అడ్డంపెట్టుకుని ఆయన మాట్లాడే ద్వంద్వార్థాల మాటలతో తను ఎంతగా చిత్రహింస పడుతుందో ? ఎవరికీ చెప్పలేని తన నిస్సహాయత చూసి ఆయన పిచ్చి ఇంకా ముదిరి ఇప్పుడు నేరుగానే రంగంలోకి దిగి పోయాడు.
యాభై దాటిన అన్నగారు ఇలా మాట్లాడతాడని చెప్పినా అతను నమ్ముతాడా అర్థం చేసుకుంటాడా ? పొమ్మన లేక తను పొగపెడుతున్నానని భావిస్తే ?
మధ్యతరగతి వారసురాలు తన తల్లి రెక్కలు ముక్కలు చేసుకుని ఎంతో కష్టపడి తనకు చదువు చెప్పించి పెళ్ళి చేసి పంపించింది. తన కాపురం చెడిపోతే అమ్మకి తను జీవితాంతం భారంగా ఉండగలదా ? చిత్రహింస ఎన్నాళ్ళు భరించగలదు ?
***
ఉన్నట్టుండి సీతాలు గొల్లుమన్న ఏడుపుతో తన గదిలోంచి బయటికి వచ్చింది హరిణి.
ఎర్రపడిన కళ్ళు నులుముకుంటూ రంగనాథం కూడా “ఏమిటి గొడవ” అంటూ బయటకు వచ్చాడు .
‘పొద్దుటే స్నానం చేసి హాల్లో టీవీ పక్కనే పెట్టి మరిచిపోయిన నా బంగారు వాచి … గొలుసు తీసింది నువ్వే కదూ ! ‘ ఆఫీసు నుంచి అప్పుడే వచ్చిన అర్జున్ సీతాలుని నిలదీస్తున్నాడు .కోపంతో అతని కళ్ళు నిప్పులా ఉన్నాయి .
‘ఇలాంటి వాళ్లను ఊరికే వదిలి పెట్టకూడదు అర్జున్ ! ఇంకా నయం మా ఇంట్లో ఈ సీతాలు అంట్లు తోముతూ ఒంగున్నప్పుడు జారిపడిన నీ గొలుసును నేను చూసి నీకు ఫోన్ చేశాను కనుక సరిపోయింది . ‘
ప్రక్కింట్లోంచి అప్పటికే అక్కడకు చేరుకున్న శిరీష అంది.
‘ అందుకే అన్నారు పనివాళ్లను నమ్మకూడదని … దీనిని మానిపిం చేయమని నేను చెబుతున్నా విన్నావా హరిణి! ఇంతకీ నావేం కొట్టేసిందో ? ‘ అన్నాడు రంగనాథం . పని మనిషి తనకి పానకంలో పుడకలా రోజు తనకి హరిణిని మధ్య అడ్డు తగులుతొంది అన్న కసి ఉంది అతని మాటల్లో …
‘అమ్మ గారు మీరయినా చెప్పండి నేను దొంగను కాదని … ‘ హరిణి కాళ్ళను చుట్టేసుకుంది సీతాలు .
. ఇది ఇలా వినదు అర్జున్! పోలీసులకి అప్పగిస్తే సరి… వెండి గిన్నెలు గ్లాసులు ఇలా ఎన్ని వస్తువులు కొట్టేసిందో అన్ని బయటికి వస్తాయి ” అంది శిరీష అర్జున్ని రెచ్చగొడుతూ.
రంగనాథం ప్రాణం కుదుటపడింది ఆ మాటతో ” అవును పోలీసులకు ఫోన్ చేయండి “అక్కసుగా అన్నాడు .
‘ వద్దు వద్దు అంటున్న హరిణి మాటకి తెల్లబోయారు అంతా .
‘ దొంగని వదిలేస్తావా అయితే ?శిరీష కంఠంలో కోపం .
‘అది కాదు శిరీషా ! అసలు దొంగ సీతాలో కాదో తెలియకుండా పోలీసుల దాకా పోతే లేనిపోని ఇబ్బంది .. ‘
‘ అయితే ఏం చేద్దాం అంటావు ? పోనీ మీ సీసీ కెమెరా లో చూద్దామా ? ‘ అంది శిరీష .
‘గుడ్ ఐడియా శిరీషా!చాలా పవర్ఫుల్ కెమెరా ఇది . మాటలు కూడా రికార్డ్ అయి ఉంటాయి . సీతాలు నా వస్తువులు తీసి ఉంటే కచ్చితంగా ఇందులో కనిపిస్తుంది . హరిణి ఇంట్లో ఒక్కతే ఉంటుందని ఈఇంట్లో దిగిన వారం రోజులకే బిగించాను నేను. ‘ అంటూ అర్జున్ సీసీ కెమెరాలో దృశ్యాలు చూసేందుకు హాల్లోని కంప్యూటర్ ఎదుట కుర్చి ముందుకు లాక్కుని కూర్చున్నాడు .
రంగనాథం పై ప్రాణాలు పైనే పోయాయి.
‘ఇంట్లో సీసీ కెమెరా ఉందా ? ఓరి దేవుడోయ్ తను వచ్చింది మొదలు చేసిన వికృత చేష్టలు మాటలు ఇవన్ని ఈ కెమెరాలో బయటపెడితే అర్జున్ ఉగ్గ నరసింహ అవతారం తను భరించగలడా ? ‘ రంగనాధానికి చెమటలు పట్టేసి కళ్ళు చీకట్లు కమ్మేస్తున్నాయి.
‘బాగా ఇప్పి మరీచూడండి బాబు ! నాకేటి భయమా ?అసలు నాకు దొంగతనం చేస్తే కదా ! ‘ సీతాలు కంఠంలో ధీమా … అప్పటిదాకా చేష్టలుడిగి పోయినట్టు కూర్చుండి పోయిన హరిణి గబాలున లేచి అర్జున్ చెయ్యి పట్టుకుని ఆపేసింది .
‘వద్దు అర్జున్. వాచీ పోతే పోయింది. శిరీష ఇంట్లో మన గొలుసు దొరికిందని చెప్పిందిగా . అదీకాక పాపం సీతాలు దొంగ అని ముద్ర పడితే మరి ఎక్కడా తనకు పని దొరకదు పదిలెయ్యి “
‘ ఇదిగో ఇలాంటి సానుభూతులు వల్లనే దొంగలు తప్పించుకుంటారు అర్జున్ !బ్యాక్ అప్ చెక్ చేస్తే ఇంట్లో ఇంకెన్ని పోయాయో తెలుస్తుంది .. ‘
శిరీష మాటలకి హార్ట్ ఎటాక్ వచ్చిన వాడిలా నిలువెల్లా చెమటతో తడిసిపోయిన రంగనాథం లోపలి నుంచి తన పెట్టె పట్టుకొని బయటకు వచ్చాడు .
‘అర్జున్ ! చెప్పడం మర్చిపోయాను మా పెద్దవాడికి ఆపరేషన్ అయిందని ఇందాకనే ఫోన్ వచ్చింది నేను వెళ్ళిపోవాలి . వస్తాను మరి.’ అంటూ గాభరాగా పరిగెత్తాడు రంగనాథం .
అయ్యో బస్సెక్కిస్తాను ఆగన్నయ్యా ! ‘ మానిటర్ ముందునుంచి తనూ . లేచి రంగనాథాన్ని అనుసరించాడు అర్జున్ .
వాళ్లిద్దరూ కనుమరుగయ్యాక సీతాలు మెటికలు విరిచింది . ‘ మళ్ళీ రావొద్దు వెళ్ళు ముసలాయనా! ‘
‘ సీసీ కెమెరా చూస్తే ముసలాయన బండారం బట్టబయలు అయ్యేదిగా హరిణీ! మరి ఎందుకు వద్దన్నావ్ ? ‘ శిరీష కంఠంలో కోపం.
‘ అలా చేస్తే ముసలాయన పరువుతోపాటు మా కుటుంబం పరువు కూడా పోయేదే కదా ! అదీగాక అర్జున్ మనసు నొష్పించడం అంటే ??? ‘
‘ఇదిగో ఇలాంటి మొహమాటమే కూడదనేది .. . ఎంత నరకం అనుభవించేవ్ హరిణి ! పోనీలే సీతాలుతో కలిసి ఈ మాత్రం నాటక మాడే సాహసం చేశావ్! నాకూ ఒక పాత్ర ఇచ్చినందుకు చాలా సంతోషం . . ఇది నాంది మాత్రమే.’ శిరీష చనువుగా ఆమె భుజం నొక్కి గొలుసు వాచీ అందించింది .
సీతాలు మాటలకు అక్కడ నవ్వుల పువ్వులు విరిశాయి.
‘ అమ్మగోరూ! నాటకమే అయినా మీరంతా కలిసి దొంగ వని నన్ను తెగ తిట్టేసినారు . నా రెండొందలూ నాకు పడేత్తే మామావా నేను కొత్తసినిమాకి పోతాం . ‘
హరిణి మాత్రం గాఢంగా నిట్టూర్చి అంది . ‘ మొన్న మాటల సందర్భంలో నువ్వు ” మీ ఇంట్లో సీసీ కెమేరా ఉందిగా… దొంగలు రావడానికి భయ పడతారు. ” అనడంలో నాకు ఈ ఐడియా వచ్చింది. అబ్బ …ఇప్పుడు నాకు ఎంత గర్వంగా ఉందో శిరీషా ! నువ్వన్నది నిజం . ఆడపిల్లలు ఇలాంటి నరకాన్ని ఏడుస్తూ భరించ వలసిందేననో లేక ఎవరో వచ్చి కాపాడతారనో ఎదురు చూడకుండా ఎవరికివారే స్వీయ రక్షణావకాశాలు రూపొందించుకుంటే వారి సమస్యలు వారే పరిష్కరించుకోగలరు అనే నమ్మకం ఇప్పుడిపుడే కలుగుతోంది.’
‘ అయితే అక్కడితో ఆగిపోకు . ముందుకు సాగిపో … నీ సాహసానికి ఇది ఆరంభం మాత్రమే..ఆడ పిల్లలకి నిరంతర సాధన పట్టుదల తన మీద తనకి నమ్మకం. పెంచుకునే అమాశం కల్పించు హరిణి! నీకున్న మంచి భావావేశంతో అక్షర సేద్యానికి అక్షరాభ్యాసం చెయ్యి . ‘ అంటూ శిరీష ప్రోత్సాహకరంగా హరిణి చెయ్యి నొక్కింది.
గోడమీది బల్లి అరిచింది పురుగు మళ్లీ తప్పించు కుందన్న అక్కసుతో…
బల్లిలో రంగనాథం మొహం కనిపించిన హరిణి ఆ రోజే రెట్టించిన ఉత్సాహంతో కలం అందుకుంది….
****
ఆర్ట్: జావేద్
నా జన్మస్థలం రాజమండ్రి. విద్యార్హతలు తెలుగు సాహిత్యంలో ఎం.ఎ. జర్నలిజంలో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లమో. నిత్యం పెళ్లి వారిల్లులా కళకళలాడే ఆకాశవాణి హైదరాబాద్ విశాఖపట్నం కేంద్రాల్లో వ్యాఖ్యాత్రిగా 40 ఏళ్ల అనుభవంలో ఎందరో రాజకీయ సంగీత సాహిత్య రంగస్థల సినీ నాటక ప్రముఖులను శ్రోతలకు పరిచయం చేసాను. నేను రచించిన అసంఖ్యాక నాటకాలను రూపకాలను కథలను ప్రసారం చేసి అత్యున్నత గౌరవాన్ని ప్రసాదించింది నా మాతృ సంస్థ రేడియా. న్యూఢిల్లీ ప్రసార భారతి ఆల్ ఇండియా రేడియో వారిచే నా ‘జీవని’ ‘గంగజాతర ‘ నాటకీకరణలకు ప్రథమ బహుమతులు … వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారిచే నా కథ ‘ మాయ సోకని పల్లె ‘ కు ప్రథమ బహుమతి … న్యూఢిల్లీ ఎన్సీఈఆర్టీ వారిచే ‘పలకాబలపం ‘ నాటకానికి ప్రథమ బహుమతి … సైట్ వారి ‘భర్తృహరి – ఏనుగు లక్ష్మణ కవి ‘ -శ్రవ్య నాటకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారం … ‘అక్షరం ‘ నవల ‘పట్టుపురుగు ‘ కథలకు స్వాతి అనిల్ అవార్డులు …సి.పి.బ్రౌన్ అకాడమీ వారితో బాటు ప్రముఖ పత్రికల నుండి దాదాపు 50 కథలకు లభించిన బహుమతులు ఎంతో గుర్తింపు నిచ్చాయి. ఇప్పటి వరకు 10 కథా సంకలనాలు పన్నెండు నవలలు వెలువరించాను. కొన ఊపిరి వరకు రచనావ్యాసంగమే నా అభిమతం. పత్రికలు పాఠకులే నా ప్రియ నేస్తాలు.
ఏప్రిల్ నెచ్చెలిలో ప్రచురించిన కథ మహిత సాహితినెచ్చెలి కథల పోటీలో వుత్తమ కథగా ఎంపికైన పి.వి. శెషారత్నం గారి కథ ‘ ఆగిపోకు సాగిపో” ఈ నాటి మహిళలు ఇంటా, బయట ఎదుర్కుంటున్న లైంగిక వేధింపులని ధైర్యంతోనో వుపాయంతోనొ ఎదుర్కొని బుద్ధి చెప్పాలని సూచించడం బాగుంది. పసిపాపల నుండి ముసలివారి వరకు స్త్రీలకు ఇటువంటి వేధింపులు తప్పడం లేదు. అయితే సంసారం గుట్టు అనుకుంటూ ఆ సంస్కారహీనుడిని వదిలేయడం కన్న శిక్షించి వుంటే బాగుండేది అనిపించింది.
తంగిరాల. మీరాసుబ్రహ్మణ్యం
స్త్రీలు పురుషుల వెకిలిచేష్టల నుండి తమను తాము రక్షించుకోవాల్సిన రీతిని రచయిత్రి బాగా వ్యక్తీకరించారు . చాలా బాగుంది. -వడలి లక్ష్మీనాథ్
రంగనాధం బండారం బయట పెట్టినట్టే రాయాల్సింది మేడం. పరువు అని నోరు మెదపకపోతే ఇలా ఎక్కడన్నా behave చెయ్యడానికి freepass ఇచ్చినట్టే కదా.
చాలా చక్కగా ఇటువంటి సున్నితమైన అంశాన్ని తీసుకుని ఓ కధగా మలిచినందుకు ముందుగా పి.వి. శేషారత్నం గారికి అభినందనలు. ఇలాంటివి కొద్దో గొప్పో ప్రతి ఆడపిల్ల జీవితంలో జరగనే జరుగుతాయి.. వయసుతో నిమ్మిత్తం లేకుండా … బట్టలు కుట్టేవాడి దగ్గరి నుండి యాభైలు దాటిన పక్కింటి, ఎదురింటి తేడా రాయుళ్ళు అడుగడుగునా తారసపడతారు, ఉంటారు అన్నది నిజం. మొత్తానికి చాలా ఆసక్తికరంగా సాగింది రచన.
Excellent 👌 అమ్మా…ఎప్పటిలాగే అద్భుతంగా ఉంది. నాకైతే అన్నిటిలోకి ఈ కథే బాగా నచ్చింది 💖