ఆత్మ వినాశనం
-దుర్గాప్రసాద్ అవధానం
మరణం కాలరాసిన
శకలం గతం
గతమెప్పుడు
మనోభావాల లోతుల్లో
మిగిలిపోయే ముల్లు
తలపోసే కొద్ది
తలంపునొప్పుల్లో రచ్చ
పెద్దల తీర్పుల చర్చ
అడుగు తర్వాత అడుగు
వివాదం తర్వాత వివాదం
పగటి రాత్రికి మధ్య
ప్రతీకార వాంఛల పగలో
ఉత్కంఠ ఉత్సుకత
ఊపిరి తీసుకోలేని భయం భయం
రాజకీయ సంకేతంలో
తీర్పు ఓ మృత్యువు
హింస విరామంలో
మరోయుద్ధచ్ఛాయ తీర్పు
గిరగిరా తిరుగుతూ
పెను చీకటి బానిసత్వం
కనుగుడ్డును కమ్మేస్తూన్న కాలం నీడ
చూస్తుండగానే
బతుకు జీవచ్ఛవమై
భయానక బీభత్స దృశ్యంలో
కత్తులు చూస్తున్న నెత్తుటి వాసన
ఆకలితో పేగులు అరుస్తున్న
దరిద్రం రోదన
జననానికి ముందే
మాతృగర్భంలోనే కూల్చబడ్డ
మందిరాలు మసీదులు చర్చీలు
వర్ణాలు వర్గాలు కులాలు కన్నీళ్ళు
అనేకానేక మాంస ఖండాలుగ
తెగిపోయిన జీవన కళాఖండం
గిరగిరా తిరుగుతూ
పెనుచీకటీ బానిసత్వం
కాలంనీడై కనుగుడ్డును కుమ్మేస్తూ…
చిద్రం తర్వాత కొత్త చట్టం
చట్టం తార్వాత మరో చిద్రం
మృత్యు విపత్తును
ముందే పసిగట్టలేని
కుట్రల్లో కళ్ళను కప్పేసుకున్న కపటంలో
విధ్వంసం తర్వాతే
చట్టాలు తీర్పులు
ప్రభుత మంతనాలు
తలలు పగిలింతర్వాతే
కలలు చిట్లింతర్వాతె
చేతులు తెగింతర్వాతే
రాజకీయం
తీర్పుల సంకేతమై
హింస విరామంలో
మరో యుద్ధప్రేతమై ఆవలిస్తూ..
అంతా ఆత్మ వినాశనం
*****
(ఇంకా ఉంది)