ఒక భార్గవి – కొన్ని రాగాలు -13
రక్తి రాగం – ఖమాస్
-భార్గవి
శంకరాభరణం సినిమాలో లో శంకర శాస్త్రి చెప్పినట్లు “బ్రోచే వారెవరురా” అనే మైసూర్ వాసుదేవాచార్
కీర్తనలో ఆర్తీ ఆర్ద్రతా తొంగిచూడటానికీ,
“డోలాయాంచల డోలాయ” అనే అన్నమయ్య పదంలో భక్తి భావం పొంగి పొర్లడానికీ
“సీతాపతే నా మనసున” అనే త్యాగ రాజ కీర్తనలో వేడుకోలుకీ
“అపదూరుకు లోనైతినే” అనే జావళీలో శృంగార రసం చిప్పిల్లడానికీ
“ఎందుకే నీకింత తొందరా ఓ చిలుక నా చిలుక ఓ రామచిలుక” అనే సినిమా పాటలో విరహపు వలపుతో నిండిన ఆశా భావం వర్థిల్లడానికీ పూలదండ వెనక సూత్రం లా భాసిల్లే ఖమాస్ రాగమే కారణమంటే ఆశ్చర్యంగా అనిపించ వచ్చు ,కానీ నిజంగా ఆ రాగం చేసే మాయాజాలం వరసగా ఆ రాగం లోని పాటలు వింటుంటే కానీ అర్థం కాదు.
ఖమాస్ రాగాన్ని ,కమాచి అని కూడా అంటారు. ,హిందూస్థానీ సంగీతంలో దీనికి సమానమైన రాగం ఖమాజ్ .ఇది 28వ మేళకర్త అయిన హరికాంభోజి రాగము నుండీ జన్యము.
ఆరోహణలో ఆరు స్వరాలూ,అవరోహణలో యేడు స్వరాలూ వుంటాయి ,అందుకే షాడవ వక్ర సంపూర్ణ రాగము అంటారు.
ఆరోహణ—-సమగమ పదనిస
అవరోహణ –సనిదప మగరిస
సాధారణంగా జనక రాగంలో ఉండే స్వరస్థానేలే ఇందులో కూడా పాడుతూ వుంటారు,అలా జనక రాగంలో స్వరాలే వుండటం వల్ల దీనిని ఉపాంగ రాగము అంటారు,అయితే అప్పుడప్పుడూ జావళీలలోనూ అక్కడా అన్య స్వరమైన కాకలి నిషాదం వాడటం కూడా కనపడుతుంది ,అలా వచ్చినప్పుడు దానిని భాషాంగ రాగము అంటారు.
ఖమాస్ రాగంలో యే రసమైనా బాగా పండుతుంది అందుకే దానిని రక్తి రాగం అంటారు. సాధారణంగా శృంగార రసం వ్యక్తపరిచేందుకు ఈ రాగాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ వుంటారు.
త్యాగరాజ స్వామి రచించి స్వరపరచిన కీర్తనలలో “సుజన జీవనాఅన్నదీ,సీతాపతే నా మనసున “అన్నవి బాగా ప్రసిధ్ధి పొందినవి.
మైసూర్ వాసుదేవాచార్ గారి “బ్రోచే వారెవరురా నిను వినా”అనేది కూడా బాగా ప్రాచుర్యంలో వున్నదే, ఆ మధ్య “శంకరాభరణం” సినిమాలో వినబడటం వలన అందరికీ మరింత తెలిసింది.
ముత్తుస్వామి దీక్షతర్ “షడాననే సకలం అర్పయామి “కీర్తన ఖమాస్ లో వుంది.
హరికేశ నల్లూరి ముత్తయ్య భాగవతార్ రచించి స్వర పరచిన “మాతే మలయధ్వజ పాండ్య సంజాతే” అనే దారు వర్ణం వింటుంటే యెంత మధురంగా వుంటుందంటే ,ఒళ్లు పరవశంతో పులకరిస్తుంది ముఖ్యంగా సుధారఘునాథన్ గొంతులో వింటుంటే.అంతే కాదు ఖమాస్ రాగ స్వరూపం కళ్లముందు సాక్షాత్కరిస్తుంది.
అన్నమయ్య పదం “డోలాయాంచల డోలాయ ” యం.యస్ .సుబ్బలక్ష్మి నోట వింటుంటే మనసు నిజంగా వుయ్యాల లూగుతుందనడంలో సందేహం లేదు.
చాలా జావళీలూ,పదాలూ ఖమాస్ రాగంలో వుండడానికి కారణం ,అవి శృంగార ప్రధానంగా వుండడం,ఆ రాగం లో శృంగారం బాగా వ్యక్తమవుతుందనే వుద్దేశం.
పట్టాభిరామయ్య గారి “అపదూరుకు లోనైతినే” అనే జావళీ బాగా పేరు పొందినది,”అంతలోనే తెల్లవారే అయ్యో యేమి చేతునే”అనే జావళీ కూడా ఖమాస్ లోనే వుంది.ఈ జావళీని “ముద్దుబిడ్డ” సినిమాలో పెండ్యాల నాగేశ్వరరావు గారి సారథ్యంలో పి.సుశీల బహుచక్కగా పాడింది,అభినయించింది నటుడు సాయికుమార్ తల్లి కృష్ణజ్యోతి.
సినిమాల విషయానికొస్తే చాలా సినిమా పాటలు ఈ రాగంలో వున్నాయి.నృత్యగీతాల లోనూ,వీణపాటలలోనూ,విరహగీతాలలోనూ విరివిగా వాడబడిన రాగంగా చెప్పుకోవచ్చు.
“మల్లీశ్వరి” చిత్రంలో భానుమతి నోట మధురంగా వినబడే “ఎందుకే నీకింత తొందరా” అనే దేవులపల్లి కృష్ణ శాస్త్రి విరచిత విరహ గీతం ఈ రాగానికి చిరునామా గా చెప్పవచ్చు.మహా కవి శ్రీశ్రీ కూడా ఈ పాటంటే తనకిష్టమని చెప్పారొక చోట.అన్నట్టు ఈ పాటకి స్వరకర్త యస్ .రాజేశ్వరరావు.
“విప్రనారాయణ ” చిత్రంలో యస్ .రాజేశ్వరరావు,భానుమతుల కాంబినేషన్ లోనే సిధ్ధించివ ఇంకో మధురమైన పాట “నను విడనాడకురా ” అనేది.
“చరణ దాసి “సినిమాలో “ఈ దయ చాలునురా” అనే నృత్య గీతానికి కూడా స్వర రచన యస్ .రాజేశ్వరరావుదే.
“డాక్టర్ చక్రవర్తి” లో రెండు వీణ పాటలున్నాయి ,రెండు పాటలూ పాడింది పి.సుశీల.అవి “పాడమని నన్నడగవలెనా,పాడమని నన్నడగ తగునా “అంటూ సాగుతాయి .ఇవిరెండూ బాగా పాప్యులర్ అయ్యాయి వీటికి బాణీకట్టింది కూడా యస్ .రాజేశ్వరరావే ,ఇవన్నీ పరిశీలిస్తే ఆయనకీ రాగమంటే మక్కువ యెక్కువేమో అనిపిస్తుంది.
“అర్థాంగి” సినిమాలో బి.యన్ .ఆర్ అని పిలవ బడే బి.నరసింహారావు సంగీత సారథ్యంలో ఆకుల నరసింహారావు పాడిన “రాధను రమ్మన్నాడు” అనే పాట లో ఖమాస్ తో పాటు ఇతర రాగ ఛాయలు కూడా వినపడతాయి.
హిందీ సినిమాలలో కూడా చాలా పాటలు కూర్చబడ్డాయి ఈ రాగం ఆధారంగా….
హిందుస్థానీ సంగీతంలో అన్యస్వరమైన కాకలి నిషాదంకూడా ప్రయోగింపబడుతుంది,
ప్రధానంగా రాత్రి రెండోజాములో పాడే రాగం గా పరిగణిస్తారు.ప్రేమకీ ,వియోగానికీ,శృంగారానికీ ప్రాధాన్యత వున్న ఠుమ్రీలలో యెక్కువగా వాడే రాగం.
“వైష్ణవ జనతో “అనే మహాత్మా గాంధీ గారికి అతి ఇష్టమయిన భజన్ వినపడేది ఈ రాగంలోనే
శంకర్ జైకిషన్ “ఆమ్రపాలి” లో లతా తో పాడించింన పాట “జావోరే జోగి తుమ్ జావోరే” కి ఈ రాగమే ఆధారం.
యస్ .డి బర్మన్ “బంబయీ కాబాబు “లో ఆశా ,రఫీ ల చేత పాడించిన యుగళం “దీవానా మస్తానా హువా దిల్ “కీ, “గైడ్ ” లో లతా చేత పాడించిన “పియా తోసే నైనా లాగేరే ” కీ
“అభిమాన్ “సినిమాలో “తెరీ మేరీ మిలన్ కీ యే రైనా” అని కిషోర్ ,లతా ల చేతపాడించిన పాటకీ కూడా ఖమాజ్ రాగమే ఆధారం.
ఆర్ .డి .బర్మన్ “అమర్ ప్రేమ్ “లో కిషోర్ తో అద్భుతంగా పాడించిన పాట “కుఛ్ తో లోగ్ కహేంగే లోగోంక కామ్ హై కెహనా “
“అర్చన” సినిమాలో మన్నాడే తో అతి దివ్యంగా పాడించిన “ఆయో కహాసే ఘనశ్యామ్ ” కూడా వున్నదీ రాగంలోనే
సలీల్ చౌధురీ “పరఖ్ “లో లతా చేత అత్యంత మధురంగా పలికించిన “ఓ సజనా బరఖా బహార్ ఆయీ”అనే పాట
సంగీత దర్శకుడు రోషన్ “ఆర్తి” లో లతా ,రఫీ ద్వయంతో అతి సుందరంగా పాడించిన”బార్ బార్ తొహె క్యా సమఝాయె పాయల్ కీ ఝంకార్ ” అనే పాటా కూడా ఖమాజ్ రాగానికి వుదాహరణ లే
ఇంకా చాలా పాటలున్నాయి చెప్పాలంటే ,మరులూరించే ఖమాస్ రాగంలో మీ మది ఈ పాటికే డోలలూగుతూ వుంటుందని భావిస్తూ
*****
వృత్తి వైద్యం—-MBBSDA
ప్రవృత్తి—–సంగీత సాహిత్యాల పట్ల ఆసక్తి,అభిరుచి
బదరీ పబ్లికేషన్స్ తరుఫున ప్రచురించిన పుస్తకాలు
1.ప్రముఖ సినీ సంగీత విశ్లేషకులు వి.ఎ.కె. రంగారావుగారి వ్యాస సంకలనం “ఆలాపన”
2.కస్తూరి నరసింహ మూర్తి గారి ఉమర్ ఖయ్యా మ్ రుబాయీల తెలుగు అనువాదం “మధుకన్య”
3.టాగూర్ “గీతాంజలి”కి తెలుగు అనువాదం,ప్రఖ్యాత చిత్రకారుడు రాయన గిరిధర్ గౌడ్ వర్ణ చిత్రాల సహితంగా——స్వీయరచన
4.వివిధ విషయాల గురించి రాసిన వ్యాస సంకలనం “ఒక భార్గవి”—స్వీయ రచన
5.అమెరికా,గుజరాత్ ల ప్రయాణవిశేషాలను వివరించే “ఒక భార్గవి-రెండు ప్రయాణాలు”—-స్వీయ రచన