కొత్త అడుగులు – 19
‘విజయ సాధించిన కవిత్వ విజయం‘
– శిలాలోలిత
అలల అంతరంగం
విజయ మొదటి సంపుటి 1984లో వచ్చిన ‘దీపిక.‘ 93, 94 ప్రాంతాల్లో అనుకుంటా విజయను కలవడం. ‘భూమిక‘ ఆఫీస్లో రచయిత్రుల మీటింగ్ కు రెగ్యులర్ గా వస్తుండేది. ఎంతో బిడియస్తురాలిగా వుండేది. చాలా ఉత్సాహంగా శ్రద్ధగా వింటూ వుండేది. అలా పరిచయమైన విజయ కలిసిన ప్రతిసారి ఆప్యాయంగానే మాట్లాడుకొనే వాళ్ళం. 2016 వచ్చే సరికి సమాజాన్ని పరిశీలించే శక్తి ఎక్కువై తక్షణ స్పందన లెక్కువైనందున, సుమారు 32 సంవత్సరాల ‘తడియారని దు:ఖాన్ని‘ మోసుకొచ్చింది. ఇంత సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత రెండేళ్ళకు ఈసారి ‘అలల అంతరంగాన్ని‘ విడమర్చేందుకు కవిత్వమై పలకరించింది.
స్త్రీల ఆకుపచ్చని అలల కలల్నీ, అంతరంగాల శబ్ద ధ్వనినీ పదే పదే కవిత్వమై పలవరించింది. పలకరించింది. ఇందులో 67 కవితలున్నాయి. రోజు రోజుకీ కనుమరుగువుతున్న మానవీయ విలువల్ని, కోల్పోతున్న స్త్రీల జీవితాలే విజయ కవితా వస్తులయ్యాయి.
విజయ కవిత్వంలో ప్రత్యేకంగా గమనించాల్సిన అంశం తక్షణ స్పందన. ఒక వార్తో ఒక విషయమో, ఒక చర్చో, ఒక సంఘటనో ఆమెను తాకితే, అల్లకల్లోలం చేస్తే వెంటనే అది కవిత అయ్యేంత వరకు ఆగదు. ఈ వేగం ఒక్కోక్కసారి మంచిదే అన్పించినప్పటికీ, కొన్ని కొన్ని సందర్భాల్లో కవిత్వపు చిక్కదనం తగ్గడానికి కారణమౌతుంది. వచనానికి ఆ ఇబ్బంది లేదు. కానీ కవిత్వ విషయానికొచ్చేసరికి సాంద్రతను కొంతమేరకు కోల్పోవాల్సి వస్తుంది.
సిరియా శరణార్థుల దయనీయ స్థితి, మతం వెంట సృష్టించబడుతున్న దారుణాలు, బాల్యమే కోల్పోతున్న జీవితాలు, వృద్ధుల దయనీయ స్థితి, అవకాశవాదులు, అసమ సమాజ దుర్నీతి, సాధారణ మహిళలను సైతం ఊబిలోకి నెట్టబడుతున్న అమానవీయ సమాజాన్ని ప్రశ్నిస్తూ, ధిక్కరిస్తూ చాలా కవితలున్నాయిందులో.
సాహిత్యం ద్వారా సమాజంలో మార్పును, చైతన్యాన్ని తీసుకురావొచ్చన్న బలమైన భావన విజయ. అందుకే పదేపదే తన కవితలన్నీ తిరగేసినా ఇవే అభిప్రాయాలను కలిగిస్తూ వుంటాయి.
కన్నీళ్ళు ఇలా కూడా వస్తాయి:
ఎవరి బాధలనైనా పంచుకోవడానికి
ఏ… అనుబంధాలూ అవసరం లేదు
దు:ఖపు విలువలు తెలిసిన
మనసున్న మనుషులైతే.. చాలు!
ముదిగొండ ‘శివకౌముది‘ రాసిన స్మృతిగీతం కూడా ఆర్ద్రతను నింపుకొని మనసును తడిచేస్తుంది. ఒక్కొసారి విజయ స్టేట్మెంట్ల రూపంలో కవిత్వాన్ని రాస్తూ పోతుంది. ప్రేమకు ప్రేమను అందివ్వడంలో కన్నా ద్వేషాన్ని కూడా ప్రేమించేగలిగితే మనిషి మనసుతో మిగుతాడు. మాయమైన మానవత్వం పరిమళిస్తుంది.
నిజం నిప్పై రగులుతున్నప్పుడు
నీడ నివురు గప్పిన శత్రువైనప్పుడు
ఎవరి యుద్ధం వారే చేసుకోవాలి.
– ‘దారులు మార్చిన దు:ఖం‘
‘చిట్ట చివరి లేఖ‘ ఆడపిల్లలపై జరుగుతున్న లైంగిక దాడుల గురించి భగభగమండే హృదయంతో రాసింది. కరుణతో రాసింది. కన్నీళ్ళతో రాసింది. కసిగా రాసింది. భార్యాభర్తల బంధాల్లోని బోలుతనాన్ని పురుషుడి అహంకారాన్ని స్త్రీల సర్దుబాటుల జీవితాల్ని, పిల్లలు సంకెళ్ళయిన తీరును, స్త్రీలు పెనుగులాడుతున్న, యుద్ధం చేస్తున్న తీరును కవిత్వంలో ప్రతిఫలించేట్లుగా చేసింది. పరువు హత్యల గురించి, నీవు.. నేను కూడా వేరే! నిజంగానే, కలల పడవ, మరియా ఇపలిస్ డయాస్, తేడా ఇలాంటి కవితలెన్నో వున్నాయి.
విజయ కవితలు కాలక్షేపపు బఠానీలు కావు. ప్రేమోపాసనతో దొర్లిపడేవి కావు. పేరు కోసం ప్రయత్న పూర్వకంగా తెచ్చి పెట్టుకున్నవి కావు. ఆమె మనసు అలల్నించి ఎగిసిపడ్డ అంతరంగపు హోరు ఆమె కవిత్వం. అందుకే నిజాయితీ వుందందులో. నిజాలున్నాయి. సమాజాన్ని చైతన్య పర్చాలన్న తపన వుంది. మార్చగలనన్న నమ్మకం వుంది. పోరాట దిశగా వేస్తున్న పాదముద్రలే ఆమె కవిత్వం. కవిత్వపు పాలు కొంతమేరకు తక్కువైందని అభిప్రాయపడ్డా కొందరు. జీవితాన్ని ఉన్నదున్నట్లుగ ప్రదర్శిస్తున్న క్రమంలో ఇది తప్పక పోవచ్చు.
ఇటీవలి కాలంలో నాకు ఎంతో నచ్చుతున్న విషయం సాహిత్య రంగంలో స్త్రీల సంఖ్య పెరగడం విలువైన ఎన్నో రచనలు వెలుగు చూడటం. స్త్రీలు సాగిస్తున్న ఈ సాహితీ ప్రయాణంలో విజయ సైతం కలిసి అడుగులేయడం అభినందిచదగ్గ అంశం. విజయ కవిత్వానికి చదివిన తర్వాత అందరం ‘ఫిదా‘ కాక తప్పదు.
*****