చాతకపక్షులు  (భాగం-1)

(తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల)

– నిడదవోలు మాలతి

తొలిపలుకు 

గత మూడున్నర దశాబ్దాలలోనూ అమెరికాలో ఉంటున్న తెలుగువారి ఆచారవ్యవహారాల్లో, ప్రవర్తనలలో చాలా మార్పులు వచ్చేయి. డెబ్భైవ దశకంలో వచ్చినవారికి తగిలినంత కల్చర్ షాక్ ఇప్పటివారికి లేదనే నేను అనుకుంటున్నాను. ఇది కేవలం స్త్రీలకే పరిమితం కాదు. అమెరికాకి వచ్చిన మగవారు ఇక్కడి సంస్కృతిలో నిలదొక్కుకుని, అనేక వత్తుడులని తట్టుకుని తమ ధ్యేయాలని సాధించడానికి పడిన అవస్థలు సామాన్యమయినవి కావు. అదే కారణంగా ఇంట్లో ఆడవారిఅవస్థలని మగవారు గమనించలేదు అనడంలో అతిశయోక్తి లేదు. 

ఆడవారు ఎదుర్కొన్న వివిధసమస్యలు కొన్నివేల కథల్లో ఆవిష్కరించడం జరిగింది. ఇక్కడ నేను ఆవిష్కరించడానికి ప్రయత్నించింది స్త్రీల అంతర్మథనం.

నేను ఈనవల 80వ దశకంలో మొదలు పెట్టేను కానీ సాగలేదు. తిరిగి 2004లో తీసి పూర్తి చేశాను, అప్పట్లో కొత్తగా పరిచయమయిన కల్పన రెంటాల, ఎపీవీక్లీ.కాం సంపాదకుడు ఇవటూరి సురేష్ ఇచ్చిన సూచనలు ఆధారంగా కొన్ని మార్పులు చేసినతరవాత 2004 అక్టోబరులో ధారావాహికంగా ఎపీవీక్లీ లో ప్రచురించారు.  కల్పనకీ, సురేష్ గారికీ ధన్యవాదాలు.

2007లో తెలుగుతూలిక బ్లాగు మొదలు పెట్టినతరవాత పాఠకుల స్పందనలు నాకు గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చేయి. నా శైలి కూడా మరింత పరిణతి సాధించింది అనే అనుకుంటున్నాను. ఆ కారణంగా ఈ నవల మరొకసారి  క్షుణ్ణంగా పరిశీలించుకుని, శిల్పం దృష్ట్యా విస్తృతమయిన మార్పులు చేసి నా బ్లాగు, తెలుగు తూలిక  (www.tethulika.wordpress.com) లో ప్రచురించాను. ఈ ప్రతికీ ఎపీవీక్లీలో ప్రచురించిన ప్రతికీ మధ్య చెప్పుకోదగ్గ మార్పులే వున్నాయి.  

తెలుగుతూలిక పాఠకులని నేను అభిప్రాయాలు అడిగినప్పుడు, కొందరు ‌”మాకేం తెలుసండీ, పిల్లకాకులం” అంటారు. నిజానికి ఈపిల్లకాకులే నాకు ప్రేరణ. ఈనాటి పిల్లకాకులే రేపటి కోకిలలూ, పీకాకులూను (peacocks) అని నేను మనసారా నమ్ముతాను. 

ఇప్పుడు మళ్ళీ నెచ్చెలి అధినేత, సంపాదకులు, డా. కె.గీత గారు తమ నెచ్చెలి పత్రిక లో ధారావాహికంగా ప్రచురించడానికి  పూనుకోవడం నాకెంతో ఆనందం కలిగించింది. ముఖ్యంగా తమకి తామై పిలిచి గీత గారు అడగడంతో నారచనకి ప్రత్యేకమైన గౌరవం ఆపాదించినట్టయింది. పరిచయస్తులు ఆమోదించడం వేరు, కేవలం నా సాహిత్యం చదివి, ఆమోదించి ఆ రచనని ఆదరించడం వేరు. ఈ రెండోస్థాయిలో నిజంగా నారచనకి సార్థకత చేకూరినట్టనిపిస్తుంది. డా. గీత గారికి మనఃపూర్వక ధన్యవాదాలు. 

-నిడదవోలు మాలతి,
మార్చి 16, 2021

***

చాతకపక్షులు-1 

కొత్త పెళ్లికూతురు గీత నల్లపూసలసౌరుతో, మేలిమి బంగారు గాజుల మెరుపులతో, కొనగోళ్ల వెలవెలబోతూన్న గోరింటాకుతో న్యూయార్క్ airportలో దిగి చుట్టూ  చూసింది. మనసూ, మెదడూ కూడా గందరగోళంగా వున్నాయి. “నేనిప్పుడు అమెరికాలో వున్నాను” అని ముప్ఫైమూడోసారి తనకి తనే చెప్పుకుంది. నమ్మశక్యం కావడం లేదు కానీ అది నిక్కచ్చి నిజం.

అసలు తనపెళ్లే హరితో అంత హడావుడిగానూ జరిగిపోయింది. అమెరికాలో వున్న హరి ఆదరా బాదరా రెండువారాలు శలవు తీసుకుని, ఇండియా వచ్చి, వధూసెర్చి చేసి, గీతని చూసి, వెంటనే ఆఅమ్మాయిని చేసుకుంటున్నానని ప్రకటించేసేడు బంధువర్గంలో. అప్పటికి అతను తీసుకున్న రెండువారాల్లో పదిరోజులు అయిపోయాయి. లక్ష్మింవారం పెళ్లి. శుక్రవారం తిరుగుప్రయాణం …. అంతా కలలోలాగ జరిగిపోయింది. ఆతరవాత రెండు నెలలపాటు గీత “నాపెళ్లి అయిపోయింది” అని తనకి తనే కొన్నివందలసార్లు చెప్పుకుంటూ వచ్చింది. రెండునెలల్లో వీసా వచ్చేసింది.  

న్యూయార్కు airportలో గీత మరోసారి చుట్టూ చూసింది యంత్రవతుగా ముందుకి సాగుతూ.  తనని తోసుకుపోతున్న జనాలతోపాటు ప్రవాహంలో కలిసిపోయి, కన్వేయరు బెల్టు దగ్గరకొచ్చింది. బెల్టుమీద విలాసంగా జారివస్తున్న సూట్ ‌‌కేసులనీ, వాటికోసం ఆత్రంగా చూస్తున్న ప్రయాణీకులనీ, సామాన్లబండీలు వెతుక్కుంటున్నవాళ్లనీ, పోర్టర్లనీ చూస్తూ, ఇటు తిరిగేసరికి, తన సూట్  ‌కేసులు చాలా ముందుకి వెళ్లిపోయాయి. “అయ్యో, నాసూట్‌కేసులు” అంటూ గీత తనముందున్న జమాజెట్టీల్లాటి ఇద్దరు ఆసామీలనీ తోసుకు ఒక్క వుదుటున ఎగిరి అందుకోబోయింది. ఆమెచే అలా  తోయబడిన ఇద్దరిలో ఒక అమెరికను నవ్వి, ఫరవాలేదు, ఆపెట్టె ఓచుట్టు చుట్టి మళ్లీ వస్తుందని హామీ ఇచ్చి ఆమెని శాంతపరిచేడు. ఆతరవాత ఆ పెట్టె తిరిగి రాగానే, అతనే అందుకుని, గీతకి అప్పజెప్పాడు. గీత కళ్లనిండా కృతజ్ఞతలు నింపుకుని థాంక్స్ అంది. అతను “యూ ఆర్ వెల్కం” అన్నాడు. గీతకి మళ్లీ ఏం అనాలో తెలీక వూరుకుంది. ఆతరవాత మళ్లీ జనప్రవాహంలో కలిసిపోయి, ముందుకి సాగి, ‘కస్టము’ల కౌంటరుదగ్గరకి చేరుకుంది. అక్కడ పది వరసలున్నాయి. ఏవరస చూసినా హనుమంతుడి తోకలా అంతూ పొంతూ కనిపించడంలేదు. కనీసం గంట పట్టేట్టుంది అక్కడినుండి బైట పడడానికి.  కానీ తాను చెయ్యగలిగిందేమీ లేదు. మత్తేభయానంతో నెమ్మదిగా కౌంటరుదగ్గరకి చేరింది. అక్కడ కష్టములవాడికి తాను తెచ్చిన కందిపొడీ, కారప్పొడీ, చింతకాయపచ్చడీ, అల్లప్పచ్చడీ ఇత్యాదులు ప్రమాదకరమైన బాంబుపొడులు కావనీ, edible అనీ, preservatives added అనీ నచ్చచెప్పి, ఆ కర్మకాండ అయిందనిపించుకునేసరికి మరో మూడు గంటలు పట్టింది. ఒకొకరే తమకోసం వచ్చినవారిని పట్టుకుని వెళ్లిపోతున్నారు. గీత నెమ్మదిగా తన చక్రాలపెట్టెలు ఈడ్చుకుంటూ తనకోసం వచ్చిన హరిగారు చెప్పిన పీటర్ ఎవరై వుంటారా అని చూస్తోంది.

గీత బయల్దేరడానికి రెండురోజులముందు హరి అమెరికానించి ఇండియాకి ఫోను చేసేడు గీతపక్కింటివాళ్లకి. గీతఇంట్లో ఫోను లేదు. అత్యవసరం అయితే పిలవొచ్చని పక్కింటివారి నెంబరు ఇచ్చింది. ఆ ఇంటాయన అర్థరాత్రి గీతని పిలిచి మీఆయన పిలుస్తున్నాడంటూ చెప్పేరు. గీతకి చచ్చేంత సిగ్గేసింది ఆయన తనచేతికి ఫోనిచ్చి ఆగదిలోనే కాస్త దూరంగా సోఫోలో కూచోడం చూసి. ఏం మాటాడడానికీ తోచలేదు. హరి చెప్పినమాటల సారాంశం, తనకి అనుకోకుండా పెద్ద పని తగిలిందనీ, గీత న్యూయార్కులో దిగేరోజుకి airportకి రాలేననీ, తన ప్రాణస్నేహితుడూ, తెలుగు తెలిసినవాడూ అయిన పీటర్ వచ్చి రిసీవు చేసుకుంటాడనీ… గీత సరేనంది. కొండగుర్తుగా అతను తెల్లగా వుంటాడనీ, పొడుగ్గా వుంటాడనీ, పోల్చుకోడం తేలికేననీ చెప్పేడు. 

సరేనంది గీత. 

గీత airportలో మరోసారి కలియచూసింది చుట్టూ. ఆజనాల్లో అందరూ తెల్లగానే. పొడుగ్గానే కనిపించేరు గీత కళ్లకి. వారిలో ఎవరు పీటర్ అయివుండొచ్చో ఎలా తెలుస్తుంది? 

గీత తికమకగా తనని దాటిపోతున్నవారిమొహాలు ఒకటొకటే చూస్తుండగా వెనకనించి “నమస్కారమండీ” అని వినిపించింది. 

గీత వులిక్కిపడి, తెలుగుపలుకు వినిపించినదిక్కు చూసింది. ఆంజనేయుడిలా రెండుచేతులూ జోడించి, చిరునవ్వుతో, చికిలికళ్లతో నిలుచున్నాడతను. గీతకి ప్రాణం లేచొచ్చింది. దేశం కాని దేశంలో ముక్కూ మొహం ఎరగని ఆ పీటర్ సాక్షాత్తు అలనాడు కరీంద్రుని కాపాడిన శ్రీహరివలె తోచాడు ఆ క్షణంలో.

 “షమించాలి. తొరగానే బయల్దేరేను కానీ మద్యలో చిన్న ప్రమాదము జరిగినది. కాప్సుని పిలిచి, రిపోర్టు ఇచ్చేపటికి ఆలస్యమయినది” అన్నాడు గబగబా, బట్టీ పట్టిన పాఠం అప్పచెపుతున్నట్టు. 

గీత తలకెక్కింది యాక్సిడెంటు అన్నమాట ఒక్కటే. గుండె దడదడలాడింది ఓనిముషం. 

తరవాత పీటర్ గీతచేతిలో పెట్టెలు అందుకున్నాడు. గీత ఐ విల్ ఐ విల్ .. అంది కానీ అతను వినిపించుకోలేదు. గీతకి ఇండియాలో చాలామంది స్నేహితులు అంపకాలవేళ గట్టిగా చెప్పేరు అమెరికాలో ఎవరిసామాను వారే మోసుకుంటారని. ఆ విషయం తనకి తెలుసని అతనికి తెలియజేయడానికి తెగ ఆరాటపడింది కానీ ఆతను కూడా తనకి ఇండియాలో ఆచారాలు అంత బాగానూ తెలుసని ఋజువు చేసే యత్నంలో వున్నాడు. 

“మీదేశంలో ఆడవారిచేత సామాను మోయించడము అపచారము కదా”. 

గీత నవ్వింది ఏంచెప్పాలో తెలీక. 

“ఒక రూపాయి ఈండి మేడమ్” అన్నాడు అతనే మళ్లీ. 

బయటికొచ్చేక, తనని ఓవార నిలబడమని చెప్పి కారు తీసుకురావడానికి వెళ్లేడు. అతను తీసుకొచ్చిన కారు చూసింతరవాత గీత మరింత గాభరా పడింది.  అది చాలా గాలివానలకి తట్టుకు నిలబడిన పెంకుటిల్లులా వుంది. పోనీ టాక్సీలో పోదాం అంటే అతనేం అనుకుంటాడో అని భయం. మామూలుగా ఇండియాలోలాగ వెనకసీటులో కూర్చుందాం అనుకుంటూ కారుపక్కన నిలబడింది. పీటర్ పెట్ల్టెలు ట్రంకులో పెట్టి, తిరిగొచ్చి ముందుసీటు తలుపు తీసి పట్టుకు నిలబడ్డాడు. గీత మాటాడకుండా సీటులో కూర్చుంది, అమ్మనీ, నాన్ననీ, తోబుట్టువులనీ, ప్రాణమిత్రురాళ్లందరినీ తలుచుకుంటూ, రెండోసారి అంపకాలవేళలాగ అనిపించింది ఆక్షణం ఆ అమ్మాయికి. 

అతను చుట్టుతిరిగి వచ్చి డ్రైవరుసీటులో కూర్చుని, సీటుబెల్టు పెట్టుకుంటూ, గీతని కూడా వేసుకోమన్నాడు. గీత సరేనంటూ లాగి దాంతో కుస్తీ మొదలుపెట్టింది. పీటర్ నవ్వుతూ కొంచెంసేపు చూసి, మే ఐ అంటూ అందుకుని లాగి, తగిలించేడు ఆ ఆభరణం. ఆమరుక్షణంనించీ గీతకి ఆబెల్టు మెడమీద గీసుకుంటూ, గుండెలమీద బలంగా వత్తుకుంటూ మహ చిరాకు పెట్టసాగింది.  ఏమిటో ఇది గొడ్డుని కట్టి పడేసినట్టు అనిపించింది.  ఆ సీటుబెల్టు వెనక గీత గింజుకుంటుంటే పీటర్ ‌కి చూడనట్టు నటించడం కష్టంగా వుంది. 

“తప్పదాండీ?” అంది గీత ఆతను తనవస్థ గ్రహించేడని.

“తప్పదు. మీరు పెట్టుకోకపోతే, నాకు ఇస్తారు బహుమానం,” అన్నాడతను. 

దారి పొడుగునా అతను ఏవో చెపుతూనే వున్నాడు, హరి తనకి ప్రాణమిత్రుడుట, తాను హైదరాబాదులో రెండేళ్లుండి కర్ణాటకసంగీతం నేర్చుకున్నాడు, అప్పుడు హరి పరిచయం అయేడు. హరి పరిచయం కాకపోతే హైదరాబాదులో తాను ఎంతో బాధ పడివుండేవాడో … ఇంకా తనకి తెలుగుదేశం ఎంతగా నచ్చిపోయిందో, అక్కడ జనాల మర్యాదలూ, సాంఘికధర్మాలూ, ఎంత గొప్పగా వున్నాయో ,.. చెప్పుకుపోయేడు. 

గీత చదువుకున్నఇంగ్లీషు అతని అమెరికనుయాస అర్థం చేసుకోడానికి పనికిరాలేదు. ఊఁ కొడుతూ, కిటికీలోంచి చూస్తోంది. రాత్రే అయినా పట్టపగ్గల్లా వుంది మిరుమిట్లు గొలిపే దీపాలవెలుగులో. ఆకాశంలో చుక్కలు కనిపించడంలేదు. మెడ రిక్కించి చూసినా. భవనాలకి కప్పులు ఎక్కడున్నాయో తెలీడంలేదు. రోడ్డుమీద రంగు రంగుల కార్లు దూసుకుపోతుంటే ఎవడు ఎవడికి పెట్టేస్తాడో అనిపించినా, అందరూ ఏదో ఓ పద్ధతి ప్రకారం పోతున్నట్టు కూడా అనిపిస్తోంది. ట్రాఫిక్ దీపాలు తమధర్మాన్ని నిర్విరామంగా నిర్వర్తిస్తున్నాయి. 

“ఆదీపాలు ఒక్కసారిగా ఆరిపోతే ఈకార్లగతి ఏమిటో,” అంది సాలోచనగా. 

“హైదరాబాదులో ఆటో రిక్షాలకంటే అన్యాయమా?” అన్నాడు పీటర్.

ఇల్లు చేరేసరికి మూడున్నర అయింది. కారు దిగుతుంటే, సూసన్ వచ్చి తలుపుదగ్గర నిలబడి హాయ్ అంది. పీటర్ సూట్‌‌కేసులు తీసుకుని, తనవెనక నిలబడితే గీతకి ఎబ్బెట్టుగా అనిపించింది కానీ తాను చేయగలిగింది ఏమీ లేదు. 

సూసన్, “ఇది బాత్రూము, ఇది నీగది” అని రెండడుగులు అటూ ఇటూ వేస్తూ ఇల్లు చూపించేసింది. తరవాత, “ఏమైనా తింటారా?” అని అడిగింది. 

గీతకి మాచెడ్డ మొహమాటంగా వుంది. “ఏం వద్దు” అంది. 

“సరే పడుకోండి. తరవాత చూద్దాం.” అన్నాడు పీటర్. 

“దాదాపు తెల్లారిపోయింది. ఇప్పుడు నాకు నిద్ర రాదు” అంది గీత.

“కాఫీ తాగుతారా?” సూసన్ అడిగింది.

“ఇప్పుడేం వద్దండీ” అంది మళ్లీ, ఎవరేనా ఓకప్పు మంచి కాఫీ పోస్తే బాగుండు నన్నమొహం పెట్టి.

పీటర్ నవ్వేడు. “మీరు అలా మొహమాట పడితే లాభం లేదిక్కడ. మాకిక్కడ వద్దు అంటే వద్దనే అర్థం” అన్నాడు.

“కావాలి కదూ” అంది సూసన్ కూడా నవ్వుతూ. 

గీత ఇబ్బందిగా మొహం పెట్టి అవునన్నట్టు తలూపింది.

“కాఫీ రెడీగానే వుంది. మీరు కాస్త చన్నీళ్లతో మొహం కడుక్కు రండి” అంది బాత్రూంవేపు చూపుతూ.

గీత మొహం కడుక్కు వచ్చేసరికి మూడు మగ్గుల్లో కాఫీ పోసి, పాలూ, పంచదారా, బల్లమీద సిద్ధం చేసింది సూసన్.

అప్పటికి టైం ఐదున్నర. విజయవాడలో వుంటే ముగ్గులు పెట్టేవేళ. 

“కాస్త రెస్టు తీసుకోండి” అన్నాడు పీటర్. 

గీత సరేనని చెప్పి, తనకి నిర్ణయించిన గదిలోకి వెళ్లింది. మంచంమీద కూర్చుని చుట్టూ కలియజూసింది. గదినిండా ఊపిరాడకుండా సామానూ, పెచ్చులూడిన గోడలూ, పగుళ్లేసిన గోడలమీద బొద్దెంకలూ, గీతకి వికారంగా వుంది. తాను ఊహించుకున్న అమెరికాకీ చూస్తున్న దృశ్యానికీ సహస్రాంతం తేడా. సూట్‌‌కేసులోంచి మరోచీరె తీసి, మార్చుకుంది. మంచంమీద వాలగానే నిద్ర ముంచుకొచ్చేసింది. 

కళ్లు తెరిచేసరికి హరి ఎదురుగా నిలబడి వున్నాడు తనవేపే తదేకదృష్టితో చూస్తూ, నవ్వులు విరజిమ్మే మొహంతో .

 “అయిందా నిద్ర” అన్నాడు మంచం అంచున కూచుంటూ. 

“ఎంతయిందేమిటి టైము?” అంది గీత గబుక్కున లేచి కూచుని. 

“ఫరవాలేదులే. కావలిస్తే కొంచెంసేపు పడుకో. ప్రయాణం బాగా జరిగిందా? మరేం ఇబ్బంది అవలేదు కదా. నిన్ను బొంబేలో ఎవరు ప్లేనెక్కించేరు?” అంటూ ప్రశ్నలమీద ప్రశ్నలు గుప్పిస్తూంటే గీతకి నవ్వొచ్చింది. పడుకో అన్నాడే కానీ వాలకం చూస్తే తనని పడుకోనిచ్చేట్టు లేడు.

“మీప్రశ్నలన్నిటికి జవాబులు చెప్తూ కూచుంటే, ఇవాళే కాదు మరో వారంరోజులవరకూ నిద్ర ఆశ లేనట్టే నాకు.” 

“నిద్దరోడానికా ఏమిటి మరి నిన్నింత హడావుడిగా రప్పించుకున్నది,” అన్నాడు హరి మరింత దగ్గరికి జరుగుతూ. 

“ష్ష్ ఉండండి” అంటూనే అతనిచేతుల్లో ఇమిడిపోయింది గీత. 

ఇద్దరూ లేచి లివింగ్రూంలోకి వచ్చేరు. సూసన్ బల్లమీద వాళ్లకి breakfast, కాఫీమేకరులో కాఫీ సిద్ధం చేసి ఆఫీసుకి వెళ్లిపోయింది. హరి breakfast చేసేడు. గీత కాఫీ మాత్రం తీసుకుంది. తరవాత ఇద్దరూ airportకి బయల్దేరేరు. పీటర్ అంతకుముందే వాళ్లకి టాక్సీ ఏర్పాటు చేసి వెళ్లిపోయేడు.

“కొంచెం ముందే లేచి వుండేదాన్ని వాళ్లు వెళ్లిపోతారని తెలిస్తే” అంది గీత నొచ్చుకుంటూ. 

“ఫరవాలేదులే. ఇక్కడ బతుకులింతే మరి. ఒకే పంచనున్నా ఎవరిబతుకులు వారివే. ఎవరిపనులు వాళ్లవే. లేకపోతే ఏ పనీ అవదు.”

airport చేరేసరికి పదకొండయింది. వాళ్ల ఫ్లైట్ పన్నెండుంబావుకి. సూట్‌‌కేసులు చెక్ చేసేసి, పచార్లు చేస్తూ హరి గీతకి ఇక్కడి ఆచారాలూ, అలవాట్లమీద పాఠాలు మొదలుపెట్టేడు. “నువ్విక్కడ కూచో, రెండు నిముషాల్లో వస్తాను” అని గీతకి ఓ కుర్చీ చూపించి ఓ చిన్న దుకాణంవేపు వెళ్లేడు. 

గీతకి హఠాత్తుగా చెప్పలేనంత నీరసం ముంచుకొచ్చింది. ఉరుకులు, పరుగులుగా అటూ ఇటూ పరుగులెడుతున్న అంతమంది జనాలమధ్య తాను ఏకాకిని అన్న భావం ఉవ్వెత్తుగా పొంగుకొచ్చి తలమునకలైంది రెండునిముషాలపాటు. ఇప్పుడే వస్తానంటూ వెళ్లిన హరి పావుగంట తరవాత తిరిగి వచ్చేడు ఇద్దరికీ చెరో కప్పు కాఫీతో. అతన్ని చూసేసరికి, హమ్మయ్య అంటూ ఊపిరి తీసుకుని, అతని చెయ్యి గట్టిగా పట్టుకుంది. ఇంతటి విశాలప్రపంచంలో తనకి ఆత్మీయుడు అతనొక్కడే! 

హరి కూడా అది గ్రహించినట్టు, గీతభుజంచుట్టూ చెయ్యేసి, దగ్గరికి తీసుకున్నాడు. ఆఅమ్మాయి తనమీద అంత గొప్ప నమ్మకం పెట్టుకోవడం అతనికి ఎనలేని ఆనందాన్ని ఇచ్చింది. ఇసుమంత జాలి కూడా కలిగింది. “ఫరవాలేదు, నేనున్నాను కదా” అన్నాడు కళ్లతోనే. అవునన్నట్టు తృప్తిగా నిట్టూర్చింది గీత. 

* * * * *

(ఇంకా ఉంది)

చిత్రకారుడు: ఆర్లె రాంబాబు

Please follow and like us:

10 thoughts on “చాతకపక్షులు నవల-1”

  1. ఆరంభం కొత్తపెళ్ళికూతురులా సహజంగా అందంగా ఉంది

  2. ఎంత తాజాగా అనిపిస్తోందో !నిజమే డెబ్బైవ దశకంలో అమెరికా వెళ్లిన భారతీయులు ఏవో ఊహించుకుని , వాస్తవం వేరయ్యేసరికి దానికి అలవాటు పడడానికి ఇబ్బంది పడతారు ,అందులోనూ మొహమాటస్తులైన కొత్త పెళ్ళి కూతుళ్ళ మాట చెప్పాలా?ఆసక్తికరంగా మొదలైంది మాలతిగారూ .సీరియల్ చదివే అనుభూతి కొత్తగా ఉంది .

  3. మీ చాతక పక్షుల్ని బ్లాగు పెట్టిలో బంధించి లింక్ తాళం ఇచ్చి ఊరుకోకుండా నెచ్చెలి ద్వారా అందరికీ అందేలా ఎగరేస్తున్నందుకు ధన్యవాదాలు మాలతి గారూ

  4. ఎంత బావుందో.next part కూడా ఇప్పుడే ఇచ్చేస్తే బావుండు అనిపించింది. భలే పద ప్రయోగాలు (బాంబు పొడులు ,సీట్ బెల్ట్ /ఆభరణo (seat belt)😊😊

Leave a Reply

Your email address will not be published.