వివియన్ ఈ ఫోటో ను ఎలా తీసారన్నది మన ఊహకు అందని విషయం. దీనిలో ఎన్నో ఎంతో పొందికగా … చక్కగా అమరాయి.. ఫోటోలో reflection, silhouette, exposure, అన్నీ కలిసి ఉన్నాయి. పైగా అన్నీ కలిసి దీన్ని ఒక సృజనాత్మక ‘సెల్ఫీ ‘ గా చూపిస్తున్నాయి. ఇంకొన్ని అంశాలను గమనార్హం. షాప్ లోపల కూర్చున్న వ్యక్తులు .. గ్లాస్ విండో ముందు నిల్చుని తమని ఎవరో ఫోటో తీస్తున్న సంగతి గమనించినట్లు తెలుస్తోంది. అంటే ఫోటో తీస్తున్న ఆమె ..కంపోజ్ చెయ్యడానికి, సెట్టింగ్స్ ను సరిచేసుకోడానికి కొంత సమయం తీసుకున్నదన్న మాట .
నిజంగా చక్కని షాట్ ను వివియన్ కంపోజ్ చేసింది. ఆమె ఒక విలక్షణమైన ఫోటోగ్రాఫర్. తాను తీసే ఫోటోలలో తాను కూడా ఉండాలని అనుకుంటుంది. (హిచ్ కాక్, రామానాయుడు తమ సినిమాల్లో ఏదో ఒక చిన్న వేషంలో కనిపించేవారు) , బహుశా తన ఫోటో లలో తరచూ తను ఉండేటట్టు చూసుకోవడంలో, ఆమె ఉద్దేశం – ‘ఇది నా ప్రపంచం, దీనిలో నేను కూడా ఒక భాగమే ‘ అని ఢంకా బజాయించడం కావచ్చు. నిజమే, ఆమె ఫోటోలు ఆమెకే సొంతం! ఈ ప్రపంచంలో మన ప్రతిబింబాలు – మరొకరి దృష్టికోణంలో మనం ఎవరం అని తెలియజేసేవే కదా! సెల్ఫీ ల మోజులో ఫేస్ బుక్ కోసం తీసేవాటిని పక్కన పెడదాం, ఏ ఫోటోగ్రాఫర్లు అయినా ఎంత తరుచుగా వాళ్ళ వాళ్ళ ఫోటోలను – ప్రపంచం వాళ్ళని వీక్షించినట్లు .. ప్రతిబింబం రూపంలో – తీసుకుంటూ చూసుకుంటూ ఉంటారు? మనలో చాలామంది తరచూ అపరిచితుల ఫోటోలను సహజ పర్యావరణంలో తీస్తూoటారు , సహజ పర్యావరణంలో మనం ఫోటో లలో ఎలా ఉంటామో మనం ఎప్పుడైనా చూసుకున్నామా? ప్రపంచం మనల్ని ఎలా చూస్తోందన్న విషయాన్ని పట్టించుకున్నామా?
ఎన్నో అద్భుతమైన ఫోటోలు తీసిన వివీయన్ మైయర్ డబ్బు మనిషి కాదు. ‘నానీ ‘ గా పనిచేస్తూ ముగ్గురిని పెంచింది. తను తీసిన ఫోటో లను ఎవరికీ చూపించలేదు. ఆమె మరణం తర్వాత ఆమె బాక్స్ లో లక్ష రోల్స్ నెగటివ్ లు దొరికాయి. ప్రపంచాన్నే తన కాన్వాస్ గా చేసుకుంది ఆమె. తాను నివసించిన నగరాలు న్యూ యార్క్ చికాగో లను ఒక కొత్త కోణం నుంచి చూసింది. చిన్న చిన్న విషయాలే ఆమెను ఆకర్షించేవి. వీధి ఫోటోగ్రాఫర్ గా తనల్ని ఏది ఆకర్షిస్తే దాన్ని ఫోటో తీసేది. అర్థ శతాబ్దం పాటు ప్రతి రోజూ తను తీసిన ఫోటోల గొప్పతనం ఆమె మరణం తర్వాత గుర్తింపు పొందింది. అందులో ప్రాముఖ్యత పొందినవి ఆమె స్వీయ చిత్రాలే, చాలా వాటిల్లో ఆమె ప్రతిబింబాన్ని ఇంటి కిటికీ అద్దాల్లో, నేల మీది నీటి మడుగుల్లో చూడవచ్చు. ఆమె ఆలోచనలను వాటిలో అధ్యయనం చేయొచ్చు.