చిత్రలిపి

ఓ కోయిలా… ఒక పాట పాడు!

-మన్నెం శారద

పాటఒకటి పాడమని 
పదే పదే అడుగుతుంటాను నేను !
నీ పాట వినడానికి  మరిగిన 
ప్రాణం కదా మరి నాది !
 
“పాడాలని వుంది  నాకూ …
ఎక్కడకూర్చుని రాగం తియ్యమంటావు 
కొమ్మేది ….రెమ్మేది  …..
చిగురేది ….చేట్టేది ? “
అంటూ 
ఎండు కొమ్మలమీద ఎగిరెగిరి  గెంతి 
చిందులేస్తుంటే  నువ్వు 
నిస్సహాయంగా  నిలబడి పోతాను  నేను !
 
ఏప్రిల్ వస్తుందంటేనే 
వెన్నులో పామొకటి 
జరాజరా పాకిన భ్రాంతి !
 
 పుట్టనీకుండానే వసంతాన్ని 
కబళించే గ్రీష్మామొకటి  మున్ముందుకు దూకి 
కర్చీఫు వేసి మరీ కబ్జా చేసేస్తున్నది 
 
పచ్చబడకుండానే  ఎర్రని చివుళ్లు ..
విచ్చకుండానే మల్లెమొగ్గలు ..వాడి నేలరాలుతున్నాయి 
 
వడగళ్లవానొకటి దుండగుడిలావచ్చి 
మామిడిపూతని .కాయని రాల్చేసి 
రైతు కన్నీరు చూసి  పకపక లాడి పారిపోతుంది 
 
వాడి రాలిన పూతని వడికెత్తుకుని 
“తోటపాడయిపోలేదు   ఓ వసంతమా ..వదలిపోవద్దని 
మరీ మరీ వేడుకుంటున్నాను నేను !
 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.