డయాస్పోరా తెలుగుకథ-మొదటి సంకలనం & డయాస్పోరా తెలుగు కవిత-మొదటి సంకలనం-రచనలకి ఆహ్వానం
-ఎడిటర్
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా & నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక
సంయుక్త ఆధ్వర్యంలో
డయాస్పోరా తెలుగు కథ-మొదటి సంకలనం & డయాస్పోరా తెలుగు కవిత-మొదటి సంకలనం
రచనలకి ఆహ్వానం
మిత్రులారా,
భారత దేశం నుంచి ఉత్తర అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, దక్షిణ ఆఫ్రికా, సౌదీ అరేబియా, యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్ మొదలైన అనేక పరాయి దేశాలకి వెళ్ళి, స్థిరపడిన తెలుగు వారిలో మంచి రచయిత(త్రు)లు చెప్పుకోదగ్గ సాహిత్య సృష్టి చేస్తున్నారు. అటువంటి వారి కృషిని గుర్తిస్తూ, గౌరవిస్తూ ఆయా దేశాల డయాస్పోరా కథా సంకలనం, కవితా సంకలనం ప్రచురిద్దామని వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా & నెచ్చెలి అంతర్జాల మాస పత్రిక వారు సంకల్పించారు. ఈ సంవత్సరం…అంటే 2021 లో విడుదల కానున్న “డయాస్పోరా తెలుగు కథ-మొదటి సంకలనం”, “డయాస్పోరా తెలుగు కవిత-మొదటి సంకలనం” అనే ఈ రెండు గ్రంథాలలోనూ ప్రచురణకి విదేశాల రచయితల కథలూ, కవితలూ ఆహ్వానిస్తున్నాం.
భారత దేశం ఎల్లలు దాటి విదేశాలలో నివసిస్తున్న లేదా ఇది వరలో నివసించిన రచయిత(త్రు)లకి మా విన్నపం, సూచనలు, నిబంధనలు.
- భారతదేశానికి వెలుపల నివసించే ప్రవాసాంధ్రులందరూ రచనలు పంపడానికి అర్హులే.
- ఒక్కొక్కరు ఒక కథ,ఒక కవిత మాత్రమే పంపాలి.
- రచన సొంతమని,మరి దేనికి అనువాదం, అనుసరణ కాదని హామీ పత్రం జతపరచాలి. హామీ పత్రం లో తమ ప్రస్తుత నివాసం పోస్టల్ చిరునామా (ఇంటి నెంబర్, వీధి పేరు, నగరం, దేశం) వివరాలు విధిగా పేర్కొనాలి.
- రచనతో బాటూ ఒక ఫోటో,ఐదు-పది పంక్తులకి లోబడి క్లుప్తంగా తమ జీవిత వివరాలు పంపాలి.
- నాస్టాల్జియా రచనలు…అంటే మాతృదేశ జ్ఞాపకాల మూస కథలూ, కవితలూ ఆమోదించబడవు.
- రచనా వస్తువు నాస్టాల్జియా కాకుండా ఆయా దేశాల్లోని స్థానిక జీవితాల్ని,సంస్కృతుల్ని, సంప్రదాయాల్ని, సమస్యల్ని ప్రతిబింబించేదిగా ఉండాలి. స్థానికులు అంటే ఆ దేశ జాతీయులు కానీ, అక్కడ నివసిస్తున్న భారతీయులు, తెలుగు వారి సమాజం, ఇతర దేశాల నుంచి అక్కడకి వలస వచ్చిన వారు… ఇలా ఆ దేశం లో నివసిస్తున్న వారు ఏ జాతికి చెందిన వారు అయినా కావచ్చును.
- రచన అప్రచురితం మాత్రమే కానవసరం లేదు. ఇదివరకు ప్రచురితమైనా స్వీకరించబడుతుంది. ప్రచురణ వివరాలు కథ/కవిత చివర తెలియబరచాలి. కొత్త రచనలు కూడా స్వాగతిస్తున్నాం.
- రచనలు వర్డ్/గూగుల్ డాక్యుమెంటుగా యూనికోడ్ లో మాత్రమే పంపాలి.
- కథల నిడివి వర్డ్ లో10 పేజీలకు మించకుండా, కవితలు 30 లైన్లకు మించకుండా ఉండాలి. .
- రచనలు చేరవలసిన చివరి తేదీ-ఏప్రిల్ 30,2021.
- ఎంపికైన రచనలు నెచ్చెలి అంతర్జాల మాస పత్రికలో ప్రత్యేకంగా ప్రచురింపబడతాయి.
- ఈ ఏడు (2021)నిర్వహించబడే 12వ అమెరికా తెలుగు సాహితీ సదస్సులో ఈ రెండు గ్రంథాలూ ఆవిష్కరించబడతాయి. వివరాలు త్వరలోనే తెలియజేస్తాం.
- ఎంపిక అయిన రచనలలో అన్నింటికీ కాని,కొన్నింటికి కాని సముచితమైన పారితోషికం ఆయా దేశాల నగదులో బహూకరించబడుతుంది.
- ఈ గ్రంథాలకి డా. కె. గీత,శాయి రాచకొండ, వంగూరి చిట్టెన్ రాజు సంపాదకులుగా వ్యవహరిస్తారు. కథలు, కవితల ఎంపిక, నగదు బహుమతి మొదలైన అన్ని విషయాలలోనూ సంపాదకులదే అంతిమ నిర్ణయం.
మరొక్క సారి..
డయాస్పోరా కథలూ, కవితలూ మాకు అందవలసిన ఆఖరి తేదీ: ఏప్రిల్ 30, 2021.
రచనలు పంపించవలసిన సంపాదకుల ఈ-మెయిల్ చిరునామాలు: ఈ-మెయిల్ సబ్జెక్ట్ లో “డయాస్పోరా కథ/కవిత సంకలనం- 2021- వంగూరి ఫౌండేషన్ & నెచ్చెలి పత్రిక” అని తప్పని సరిగా వ్రాయాలి.
ప్రపంచవ్యాప్తంగా తెలుగు సాహిత్య పురోభివృద్ధికి కృషి చేస్తున్న రచయితలకి అభినందనలతో-
భవదీయులు,
వంగూరి చిట్టెన్ రాజు (అధ్యక్షులు), శాయి రాచకొండ (గౌరవ సంపాదకులు)
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
డా. కె. గీత (వ్యవస్థాపక సంపాదకులు)
నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక (California, USA)
*****