డా. పరిమళా సోమేశ్వర గారి ఇంటర్వ్యూ

-మణి కోపల్లె

మానవీయతా  దృక్పధం  

పుస్తకాలే ప్రధాన వినోదం, విజ్ఞానం, వికాసం పంచే పందొమ్మిదివందల అరవై నుంచి డెభై దశకాల్లో పత్రికల్లో విశేషంగా ఆకర్షించే కథలు రాసే రచయిత్రులలో ప్రముఖురాలు డా. పరిమళా సోమేశ్వర్ గారు. ఆ రోజుల్లో పుస్తకాలు చదివే ప్రతి వారు ఆభిమానించే రచయిత్రి శ్రీమతి పరిమళా సోమేశ్వర్ గారి కథలు, నవలలు ప్రముఖ పత్రికలలోనూ, మాస పత్రికలలోనూ సీరియల్స్ గా వచ్చేవి. యువ మాస పత్రికలో వీరి రచనల కోసం  పాఠకులు ఎదురు చూసేవారు.  

పాఠకుడు ఒక కథ కానీ, నవలకాని, కవిత,వ్యాసం చదివాడంటే  ఆ రచన చదివిన అనంతరం కూడా కొద్ది సేపు ఆ రచన గుర్తు పెట్టుకునేలా మనసుకు హత్తుకునే రచనలు ఉంటే ఆ రచయిత సక్సెస్ అయినట్లే!  ఆ రోజుల్లో ఒక పత్రికలో ఏదైనా సీరియల్ వచ్చినపుడు పాఠకుడు ఉత్కంఠ తో తరువాతి భాగం కోసం ఎదురు చూసేలా  రచనలు చేసిన  వ్యక్తి డా. పరిమళా సోమేశ్వర్  గారు. అటు అధ్యాపక  వృత్తిలో కొనసాగుతూ ఇటు రచనలు చేస్తూ అశేష పాఠకులను ఆకట్టుకునేవారు. ఆనాటి రచయిత్రి తన రచనలలో కొన్ని ప్రసిద్ది చెందిన కధలు, నవలల నేపధ్యం గురించి చెప్పారు. 

డా. పరిమళా సోమేశ్వర్ రచనల నేపాధ్యాంతరంగం…..      

  డా. పరిమళా సోమేశ్వర్  తెలుగు సాహిత్యంలో   పేరు పొందిన రచయిత్రి. అప్పటి తరనికే కాదు నేటి తరానికీ  తన  రచనలు అందిస్తూ  ప్రజాభిమానం పొందిన సీనియర్ రచయిత్రి. 

కుటుంబ నేపధ్యం :  విజయవాడ దగ్గర కేలప్రోలు గ్రామంలో వ్యవసాయ నేపధ్య కుటుంబంలో 1942 లో జన్మించారు. ఇద్దరు అన్నలు, ఇద్దరు అక్కలు, ఒక చెల్లి మధ్య అపురూపంగా పెరిగారు.  ఆరోజుల్లోనే వీరి తండ్రి గారు చదివింది పదవ తరగతి  అయినా మంచి   పదజాలంతో  ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడేవారు. ఆంగ్ల భాష మీద మంచి పట్టు వుండేది. వీరి బాబాయి ప్రొ. పాటిబండ్ల మాధవ శర్మ గారు. పేరు పొందిన యూనివర్సిటీ ప్రొఫెసర్. 

  చిన్నతనం నుంచే ఇంట్లో సాహిత్య వాతావరణం నెలకొని వుండి,  ఇంట్లో ఎప్పుడూ ఇంగ్లీషు, తెలుగు పుస్తకాలు వుండటంవల్ల తెలుగు రచనల పై అభిలాష కలిగింది. పదేళ్ళ వయసులోనే కవితలు రాసారు. కాలేజీలో  చదువు తున్నప్పుడు మాగజైన్స్ కి కధలు రాస్తూండేవారు. 

విద్యాభ్యాసం విజయవాడ లో డిగ్రీ చదివిన తరువాత   వారి అక్కగారి  ఫామిలి, అన్నగారి ఫామిలి  మధ్య ప్రదేశ్ లో ఉన్నప్పుడు ఎం. ఎస్సీ చేశారు. తరువాత పి.హెచ్.డి చేసి డాక్టర్ పట్టా అందుకున్నారు. చదువు పూర్తి అవుతూనే సిటీ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్ గా చేరారు.  ఉద్యోగంలో చేరిన కొత్తలో “మిస్ సుధారాణి” అనే కథను రచించారు. ఇది యువ మాస పత్రికలో అచ్చయింది.  ఇక అప్పటి నుంచి వీరి రచనలు ఆగకుండా ప్రతి పత్రికలలో వచ్చాయి. ప్రజాదరణ పొందాయి. 

దాదాపు  22 నవలలు, 260 కధలు రచించిన ప్రముఖ రచయిత్రి నవలలు, కధల  నేపధ్యం గురించిన అనేక విశేషాలు వెల్లడించారు. వాటిల్లో కొన్ని విశేషాలు.  +++

కధల నేపధ్యం: -పరిమళా సోమేశ్వర్ గారు తను రచించిన కథల్లో “క్రోటన్ మొక్కలు” అనే కథ నచ్చింది  అంటారు. వీరి చిన్నతనంలో ఆడపిల్లలకు ఆరు-ఎనిమిది ఏళ్ల వయసులోనే వివాహం చేసేవారు.  సమాజంలో అలా  పెళ్లి కాని  పిల్లలని చూసి ‘క్రోటన్ మొక్కల్లా’ పెరిగారు అని అనేవారు. చిన్నప్పుడు విన్న ఆ మాటలు మదిలో నాటుకు పోయాయి.  ఆ తరువాత పెద్దయ్యాక  ఉద్యోగంలో చేరాక ఆ అంశం పై కథ  రాశారు.. ఈ కథ ఎంతగా ప్రాచుర్యం పొందింది అంటే  వీరి కథను తమిళంలో తర్జుమా చేసి పుస్తకం (కల్కి) (cover page ) అట్ట మీద ఆ కథ బొమ్మనే వేశారు. హిందీ, ఇంగ్లీష్, తమిళ మొదలైన  మొదలైన పది భాషలలోకి అనువదించ బడింది. నాటకంగా కూడా వచ్చింది. 

  ‘అన్నదమ్ములు’ కథ హిందూ ముస్లిం మత కల్లోలాల నేపధ్యం గా రాసినది.  

పందొమ్మిదివందల అరవై, ఢెభై దశకాల్లో హైదరాబాద్ పాత నగరంలో ప్రతి నెలా ఎక్కడో ఒక చోట మత కల్లోలాలు జరుగుతుండేవి. కొద్ది రోజుల పాటు కర్ఫ్యూ విధించటం, పాఠశాలలు,  కళాశాలలు, దుకాణాలు మూసివేయబడటం,   సిటీ బస్సులు, ఆటో రిక్షాలు రోడ్డు మీదకు రాకపోవటం అన్నీ జరుగుతుండటం వల్ల జన జీవితం స్తంభించి పోయేది. తీరా అంతా సద్దుమణిగేకా విచారిస్తే ఆ ఘర్షణలకు మూల కారణం మామూలు వ్యక్తులేనని, ఏ చిన్న మాటకో వాగ్వాదాలు జరిగి, చిలికి, చిలికి విజృభించి కత్తిపోట్ల దాకా వెళ్ళేది వ్యవహారం. అలాటి ఘటనలను అదునుగా తీసుకుని అసాంఘిక శక్తులు చెలరేగి మత  ఘర్షణలుగా రూపాంతరం చెంది విధ్వంసక కార్యకలాపాలు సాగించేవారు. . 

అంతా అయిపోయాక మామూలు మనుషులందరూ సఖ్యతగా కలిసే వుండేవారు. అంతా చూస్తే నిజానికి మత  విద్వేషాలు సామన్య  ప్రజలలో ఏమీ లేవని, అరాచక వ్యక్తుల వల్ల రాజకీయ కుట్రల వల్లనే యిలాటి సంఘటనలు జరుగుతున్నాయని తెలిసేది. అలాటి సంఘటన ఒక దానిని తీసుకుని వ్రాసిన కధే ‘అన్నదమ్ములు’.  

ప్రాణస్నేహితులైన ఇద్దరు రిక్షా కార్మికులు తప్ప తాగి వాదులాడుతూ,  చివరికి ఒకరు కత్తితో పొడిచి స్నేహితుడిని చంపటం, అతనికి ఉరిశిక్ష పడటం జరుగుతుంది. వారిరువురి పిల్లలు అనుకోని సంఘటనలు చూసి బేజారెత్తిపోయి ఒకరినొకరు కౌగలించుకుని ఏడుస్తూ ‘మన తండ్రులు చేసిన  తప్పులు మనం చేయవద్దు. ఇద్దరం అన్నదమ్ముల్లా కలిసి జీవిద్దాం’ అనుకుంటారు. ఇదీ క్లుప్తంగా అన్నదమ్ముల కధ గురించిన వివరాలు తెలియ చేశారు రచయిత్రి. 

‘ఉరి’ కధ ఉరి తీసే వ్యక్తి భావాలతో రచించిన కధ ఇది.  డా. పరిమళా సోమేశ్వర్ గారి కధలలో ఇంకొక కధ ‘ఉరి’   గురించి ఇలా అన్నారు. “ఢెభై దశకంలో యువతరంలో వామ పక్ష భావాలకు గాఢంగా ఆకర్షితులవుతున్న రోజులవి. సినారె అన్నట్లు వారి మార్గం నచ్చకపోయినా వారి దమ్మును మెచ్చుకునే మానసిక స్థితిలో ఉన్న నేను ఒక వ్యక్తికి  ఉరిశిక్ష విధిస్తే అతను చేసిన సేవలను,  అతని త్యాగాలను గురించి విన్న హాంగ్ మాన్ (తలారి) అతనిని  ఉరితీయటానికి వెనకాడుతాడు. కానీ వృత్తి ధర్మంతో ఉరితీయక తప్పలేదు. లోకంలో పేద్ద మనుషులుగా చెలామణి అవుతూ ఎన్నో హత్యలు చేసిన వారు, అత్యాచారులు ఇళ్ళల్లో సుఖంగా ఉంటే, ముక్కుపచ్చలారాని ఒక యువకుడు ఆదర్శం కోసం పొరుబాట బట్టి సమాజ శ్రేయస్సు కోసం ఉరికంబం ఎత్తటం హాంగ్ మాన్ ని ఎంతో బాధిస్తుంది. అతనిని ఉరి తీస్తూనే వికలమైన మనస్సుతో యింటికి వెళతాడు. 

సమాజానికి సేవ చేసే వ్యక్తి ఉరి తీయబడే సమయంలో జైలరు పడిన మనో వేదన ఈ కథాంశం   హాంగ్ మాన్  పాయింట్ లో రాసిన ఈ కధ చీఫ్ జుస్టిస్ శ్రీ ఆవుల సాంబశివరావు గారు కూడా మెచ్చుకున్నారు. 

నవలల అంతరంగం :

డా. పరిమళా సోమేశ్వర్ గారు తాను రాసిన నవలల నేపధ్యం గురించి ఆనాడు సమాజంలో వున్న పరిస్తితుల గురించి ఇలా వివారిచారు. 

‘చేదు నిజాలు’ నవల నేను వ్రాసిన నవలల్లో మొట్ట మొదట పుస్తక రూపంలో వచ్చిన నవల. దానిని ఎమెస్కో వాళ్ళు ప్రచురించారు. దానికి నేను పెట్టిన పేరు ‘అసమర్ధుడి ఆదర్శం’ ఒక మధ్య తరగతి బ్రాహ్మణ యువకుడు ఒక క్రిష్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకుని తరువాత వచ్చే కష్ట నష్టాలను భరించలేక ఎన్నో అపోహాలతో, అసమర్ధతతో తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. ‘ఆదర్శాలు విన్నంత మాత్రాన సరిపోదు. ఆచరణలో వాటిని పాటించడం, నిభాయించుకోవటం ముఖ్యం’ అనే సందేశాన్ని యిస్తుందా నవల. 

‘గాజు పెంకులు’ అనే నవల   నేపధ్యం గురించి చెబుతూ ప్రతిరోజూ “బస్సులో కాలేజీకి వెడుతుంటే సోమాజీగూడాలో ‘గాజుపెంకుల’ ప్రహరీతో ఒక పెద్ద ఇల్లు చూస్తూండేదాన్ని. అది ఒక పెద్ద పారిశ్రామిక వేత్త ఇల్లు. ఆ ప్రహరీ లోపల వ్యక్తుల  మనస్త తత్త్వం  ఎలా వుంటుందో అని  వూహిస్తూ పెట్టుబడిదారీ వ్యవస్థ మీద రాసిన నవల అది” అని చెప్పారు. 

‘లేడీస స్పెషల్ ‘  నవలా నేపధ్యం ..  రచయిత్రి ఆ నవల అనుభవాలు వివరిస్తూ .. “మెహబూబ్ నగర్ కి తుంగభద్ర ఎక్స్ ప్రెస్  రైల్ లో వెళ్ళే వాళ్ళం. ఆ రైల్లో రెండు బోగీలలో  పూర్తిగా ఎంప్లాయీస్ వుండేవారు. రకరకాల  మనస్తత్వాలు గల వ్యకులు  ఎక్కేవారు. ఆ ఉద్యోగినుల్లో ఉన్నత స్థాయి ఉద్యోగం నుంచి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే మహిళలు వుండేవారు. లేడీస్ బోగీలో ఉద్యోగినుల సంభాషణాల్లో వ్యక్తమయ్యే వారి జీవిత గాధల ఆధారంగా  ‘లేడీస్ స్పెషల్’ నవల రాశాను. అలా ఆ రైల్లో  నాలుగేళ్ళు ప్రయాణించాను.‘వార్త’  లో వచ్చింది ఈ నవల.” అని అన్నారు.  

“తెల్ల కాకులు” నవల మతాంతర వివాహం మీద రాసింది. తెల్లకాకులు’ అనేది  మతాంతర వివాహం చేసుకున్న ఒక యువ జంట కథ. ఒక కాకుల గుంపులోకి రెండు తెల్ల కాకులు వస్తే తమకన్నా భిన్నంగా ఉన్న వాటిని తరిమి తరిమి కొడతాయా కాకులు. అవి కనుక ధైర్యం గా నిలబడితే మెల్లగా వాటిని తమలో ఒకరిగా స్వీకరిస్తాయి. మనుషులు కూడా సామాజిక నియమాలకు విరుద్ధంగా ఏదైనా పని చేస్తే మొదట అందరూ విస్తుపోతారు. నిరసిస్తారు. కానీ వారు విమర్శలకు లొంగకుండా ఆదర్శప్రాయం గా నిలిస్తే, సమాజమే వారి వెంట నడుస్తుంది. వారిని గౌరవిస్తుంది’ అని తెలిపే నవల ఇది. 

“పిల్లలతో ప్రేమ యాత్ర” “  నవల గురించి చెబుతూ “నా నవలల్లో అశేష జనాదరణను పొందిన వాటిల్లో  ఈ నవల ఒకటి. ఆ రోజుల్లో ఆంధ్ర పత్రిక సచిత్ర వార పత్రికలో సీరియల్ గా వచ్చిన యీ నవల చదవని పాఠకులు లేరంటే అతిశయోక్తి కాదు. 

ఒక జంట పెళ్ళయిన వెంటనే ‘హనీమూన్ కి వెళ్లాలనుకుంటే సెలవులు దొరక్క పోవటం వల్లను, ఆర్ధిక కారణాల వల్లను, పిల్లలు వెంట వెంటనే పుట్టటం వల్లను వెళ్లలేక పోతారు. చివరకు ఇద్దరు పిల్లలు పుట్టాక, కొంత ఆర్ధికంగా వేసులు బాటు వచ్చేక పిల్లలతో కలిసి ప్రేమ యాత్రకు బయల్దేరతారు. సౌత్ ఇండియా టూర్లో వాళ్ళు పొందిన అనుభవాలు, పిల్లలతో వాళ్ళు పడ్డ అవస్థలు అన్నీ శృంగార, హాస్య రసాలను మేళవించి వ్రాసిన నవల ఇది. 

‘తప్పటడుగు’ లక్నోలో జరిగిన యాదార్ధ సంఘటన ఆధారంగా రచించిన నవల   

‘అంతరంగ తరంగాలు’  అనే నవల   సచివాలయంలో పనిచేసే ఎల్.డి.సి. శర్మ ఒకరోజు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్ర పోయెవరకు  అనుభవించిన అనుభవాలను చూపెట్టే నవల ఇది. 

పరిమళా సోమేశ్వర్  గారు  చాలా వరకు స్త్రీల దృష్టి కోణం నుంచి రచించారు. . ముఖ్యంగా స్త్రీ , పురుష సంబంధాలలోని మానవీయత  చుట్టూ అల్లుకున్న రచనలు! వీరు అప్పట్లో అరసం (అభ్యుదయ రచయితల సంఘం) ప్రెసిడెంట్ గా వుండేవారు. పరిమళా సోమేశ్వర్ గారి రచనలలో అభ్యుదయ భావాలు కనిపిస్తాయి. 

స్త్రీలు కూడా ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అంటూ ఎన్ని కబుర్లు చెప్పినా వాళ్ళు  ఇప్పటికీ సెకండ్ క్లాస్ సిటిజన్లు గానే పరిగణింప బడుతున్నారు. చాలా మంది దృష్టి లో స్త్రీల వెనకబాటు తనానికి, అణచి వేతకు కారణాలు వారికి ఆర్ధిక స్థితి లేకపోవటమేనని, స్త్రీలు పురుషులతో పాటు సంపాదించే స్థితిలో వుంటే   “సమానత్వం” దానంతట అదే వస్తుందనుకుంటున్నారు. వారి వారి విద్యార్హతలను బట్టి వివిధ రంగాలలో ఉద్యోగాలూ చేస్తున్నారు. అంత మాత్రాన స్త్రీలకు “ఆర్ధిక స్వాతంత్ర్యం వచ్చినట్లేనా?” అని అంటారు రచయిత్రి. లేడీస్ స్పెషల్ కధల పుస్తకంలో .. 

 కొలీగ్ అయిన డా. సోమేశ్వర్ గారితో 1965 లో వివాహం జరిగింది. వీరి పెద్దబ్బాయి పేరు  డా. మనోజ్. డెంటిస్ట్.  రెండో అబ్బాయి కిరణ్. సాఫ్ట్ వేర్ ఇంజనీర్.  అమ్మాయి  డా. అజంత. అమెరికాలో వుంటారు. 

పరిమళా సోమేశ్వర్ గారు లెక్చరర్ గా సిటీ కాలేజ్, హైదరాబాదులో మొదలు పెట్టి, ప్రిన్సిపల్ గా మెహబూబ్ నగర్ కాలేజీ నుంచి  రిటైర్ అయ్యారు.  

‘బెస్ట్ టీచర్’ అవార్డులు అందుకున్న వీరు అనేక సంస్థల సన్మానాలు అందుకున్నారు.  అనేక సభలకి ముఖ్య అతిధిగాను హాజరయ్యేవారు. 

1975 లో ప్రపంచ తెలుగు మహాసభల కమిటీ మెంబర్ గా వున్నారు. 

సాహిత్య అకాడమీ వారి అడ్వైజరీ  కమిటీ ఎక్జిక్యూటివ్ మెంబర్ గా వుండి, ప్రముఖుల అవార్డుల విషయంలో  ఫైనల్ జడ్జిమెంట్  ఇచ్చేవారు. 

కథ, నవలలే కాకుండా కవితలు, వ్యాసాలు కూడా రచించేవారు. నుమాయిష్ (ఎక్సిబిషన్) లోను, ఇతర సాహితీ సభల కవి సమ్మేళనాలలోనూ  పాల్గొనే వారు,  అమెరికాలో ఉన్నప్పుడు కవితలు ఎక్కువగా రాసేవారు. రెండు నవలలు ఇంగ్లీష్ లోకి అనువదించారు. 

 ‘భర్తను లొంగదీసుకోవటం ఎలా?’,  యువతరం శివమెత్తితే, లౌ మారేజీ కధలు.,   అపార్ధం, ఆదర్శాలు-అనుభవాలు, పరాజితుడు, సాహిత్యాధ్యాయనం,  సుగంధి, ఇలా ఎన్నో కధలు ప్రసిద్ధి చెందినవి ఉన్నాయి. ప్రతి కధా వస్తువూ భిన్నమైనదే! 

1965-1985 మధ్య కాలంలో పరిమళా సోమేశ్వర్  గారి రచనలు ఆంధ్రప్రభ, ఆంధ్ర పత్రికం యువ, జ్యోతి, భారతి, ఆంధ్ర జ్యోతి వనిత మొదలైన ప్రత్రికలలో వచ్చాయి. 1975 లో విజయవాడ లో జరిగిన సప్తమ రచయిత్రుల మహా సభలలో వీరు ఆనాటి నవలా సాహిత్యం గురించి చెబుతూ “నవలా సాహిత్యం అంతా మధ్య తరగతికి అంకితమై పోయి వుంది. నవలా సాహిత్యం లోని ఇతివృత్తాలు, వాటిని సృష్టిస్తున్న రచయితలు, ప్రచురిస్తున్న పత్రికాధిపతులు, ఆదరించి అభిమాణిస్తున్న పాఠకులూ కాస్త అటూ ఇటుగా ఆ  పరిధి లోని వారే అవటం వల్ల తెలుగు నవల ఆ పరిధిని దాటి రావటానికి తెగించటం లేదు. కానీ కొన్ని  కొన్ని నవలా వస్తువులోనూ, శిల్పం లోనూ, టెక్నిక్ లోనూ కొన్ని ప్రయోగాలూ జరిగాయి .. ఆనాటి ప్రముఖ రచయిత ఉన్నవ లక్ష్మీ నారాయణ గారి “మాలపిల్ల”, ఆ తరువాత వచ్చిన మురళీధర  రామ మోహనరావుగారి  “రథ చక్రాలు, శ్రీ వట్టికోట ఆళ్వారు స్వామి గారి “మట్టి మనిషి”, “గంగు”, దాశరధి రంగాచార్య గారి “చిల్లర దేవుళ్ళు మొదలైనవి వున్నాయి” అని ఆనాటి సమాజంలో  నవలా నేపధ్యం గురించి, నవలల పై రచయిత్రి చక్కటి విశ్లేషణ చేశారు.  

పరిమళా సోమేశ్వర్ గారి కధల సంపుటాలపై చక్కటి సమీక్షలు కూడా వచ్చాయి. 

చివరిగా ప్రస్తుతం రాస్తున్న రచయితల గురించి చెబుతూ “అందరూ బాగా రాస్తున్నారు. కొత్త కొత్త అంశాలతో వైవిధ్యంగా రాస్తున్నారు” అని అంటారు డా.పరిమళా సోమేశ్వర్  గారు.  తిరిగి రచనలు కొనసాగిస్తున్న వీరి కలం నుంచి మరిన్నిరచనల కోసం ఎదురు చూస్తోంది పాఠకలోకం.,  .. 

ఆనాటి సమాజం లోని మహిళల స్థితిగతులు, స్త్రీల  అంతరంగం,  గృహిణిగా, ఉద్యోగినిగా, ఆన్ని కోణాల్లోనూ ఆవిష్కరించిన డా. పరిమళా సోమేశ్వర్ గారి రచనలు మానవీయతా  కోణం లో నిండి వుంటాయి. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.