నీలోని అపరిచితుడిని నీకు పరిచయం చేసే కవిత్వం…!
“దుర్గాపురం రోడ్” – దేశరాజు కవితాసంపుటి పై సమీక్ష
-డాక్టర్ చింతపల్లి ఉదయ జానకి లక్ష్మి
“You will love again the stranger who was your self”….
-DEREK WALCOTT
ఈ వాక్యాలు సాహిత్యంలో
(1992) నోబెల్ బహుమతిని అందుకున్న సెయింట్ లూసియానాకు చెందిన ప్రఖ్యాత కవి, నాటక రచయిత, పండితుడు అయిన “సర్ డెరెక్ ఆల్టన్ వాల్కాట్” మాటలు, ఈ మాటలను ప్రేరణగా తీసుకున్న రచయిత దేశరాజు అందించిన కవిత్వమే “దుర్గాపురం రోడ్”.
ఉత్తరాంధ్ర నుంచి తెలంగాణా వరకూ సాగిన జీవనప్రయాణంలో ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకున్న రచయిత సాహిత్యాన్ని ఇష్టపడేవాళ్ళ కోసం ఎవరో దుర్గాపురం రోడ్…., దుర్గాపురం రోడ్…. అని కేకలు వేస్తుంటే, దేశరాజు కవిత్వం జెండా ఊపి ఓల్డన్ ఓల్డన్ అని ఆపి, మనల్ని కవిత్వపురైలు ఎక్కించి,
“నీలోని, నాలోని అపరిచితుడిని నీకు, నాకు పరిచయం చేసి, మళ్లీ నువ్వు ప్రేమించేటట్లు, ప్రేమలో పడేటట్లు” ఈ ప్రయాణంలో తోడ్పడతాడు, ఆ ప్రేమను అందుకునేందుకై సున్నితత్వాన్ని పెంచుకుని, జీవితానికి ఉన్న అన్ని పార్శ్వాలను సావధానంతో పలకరించడానికై దుర్గాపురం రోడ్‌లో
ప్రయాణిద్దామా కవిత్వ ప్రేమికుడైన దేశరాజుతో కలిసి.
దుర్గాపురం రోడ్ నుండి సుదీర్ఘంగా ప్రయాణిస్తున్న కవిత్వపురైలు 77 స్టేషన్లలో ఆగుతూ, సాహిత్య ప్రేమికులను ఎక్కించుకుంటూ, దింపుతూ జీవితపు అంతిమ పరిష్కారం దిశగా ప్రయాణిస్తూ, చుట్టూ కనిపిస్తున్న కొండల్ని, చెట్లని, కాంక్రీటు నిర్మాణాలని
దాటుకుంటూ సాగిపోతుంది ఈ ప్రయాణం, సామూహిక స్వప్నవిష్కరణతో ఈ ప్రేమ ప్రయాణం
సాగుతంది.
ప్రేమికుడైన రచయిత, కలలు కనడం తప్ప ఎరువులెయ్యడం తెలియని
వాడు, ఎర్రలు వెయ్యడం తెలీని వాడు, మలుచుకోవడం తెలియనివాడు, అయినా ముగ్గురు శ్రామికులైన రైతు, జాలరి, కుమ్మరి ని ప్రేమిస్తూ… కలలు కంటూ ఉంటాడు.
కలలు, కలలు…కరిగిపోతూ, కరిగిపోతూ
అలసిపోతూ, సొలసిపోతూ… ప్రేమికుడు
కలలు వాటికవే పిల్లలు పెట్టావుగా?
మరి ప్రేమ కూడా
అం…తే…నా!?
ముగ్గురు శ్రామికులూ…. ఒక ప్రేమికుడు
కవితలో వ్యక్తీకరిస్తాడు ప్రేమికుడైన రచయిత.
కవిత్వం ద్వారా సమాజాన్ని, వ్యక్తిని, ప్రభుత్వాన్ని నిలదీసి, నిగ్గదీసి ప్రశ్నిస్తూనే తన అభిప్రాయాన్ని దృఢంగా వ్యక్తపరిచే కవి దేశరాజు. ఉదాహరణగా చూస్తే “ఫ్రాగ్నెన్సెస్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్”
కవితలోని వ్యక్తీకరణలో శరీరానికి మనసుకు వ్యాయామము, వెలుతురు, ఉపసమనం, రుచులు… కావాలని
కోరుకుంటాడు.
వాకింగ్ చేసేప్పుడు కాళ్లు మాత్రమే కదులుతాయా?
కళ్ళు కూడా –
ఏం?
శరీరానికేనా, మనసుకొద్దు ఆరోగ్యం?
రోడ్డు పక్కనే వెలుగుతాయా దీపాలు? చెక్కిళ్లపై కూడా –
ఏం?
శరీరానికేనా, మనసుకొద్దు వెలుతురు?
కన్నీళ్లు కేవలం ఓదార్పు కోసమేనా?
కౌగిలింతకు కూడా –
ఏం?
శరీరానికేనా, మనసుకొద్దు ఉపశమనం?
అంటూ సాగుతుంది ఈ కవిత.
ఈ కవిత్వసంపుటిలోని కవిత్వం అంతా సమకాలీన-ఆధునిక సరిహద్దులతోనూ, మరికొన్నిసార్లు
ఆ హద్దులు చెరిపేస్తూనట్లుగా సాగుతుంది, సరళమైన భాషతో, జీవితానుభవాలు జోడించి, సార్వజనీనంగా కథనాత్మకగా, కవితాత్మకంగా, ప్రత్యేక శైలితో పాఠకుని ఆకట్టుకుని, తన అనుభవాన్ని పాఠకుని అనుభూతిగా మార్చి అందరిచే
ఆరెంజ్ రాగాను ఆలపిస్తాడు, అక్షరంతో పలవరిస్తాడు, వీధి కుక్క దుఃఖగీతం వినిపిస్తాడు, జీవితం జనరేటర్తోనైనా నడపాల్సిన రోలర్ కోస్టర్ అని ప్రకటిస్తాడు, ఆఖరి సన్నివేశంలో ప్రభుత్వాన్ని వ్యంగంగా ప్రశ్నిస్తాడు, మీకు తెలియంది కాదు కానీ నిజం చెప్పద్దు…అక్షరాల మధ్య వ్యాకరణం మారిపోయింది అంటూ సామూహిక విదూషకత్వం ప్రకటిస్తాడు,
పారిస్పై ద్వేషగీతం ఆలకిస్తాడు, కొత్త ఉపాధ్యాయునిలా పాఠాలు బోధిస్తాడు,
కవిత్వంతో కబాడీఆడి కవిత్వమైలేస్తాడు కవిత్వమై జీవిస్తాడు రచయిత దేశరాజు.
కవిగా, జర్నలిస్టుగా
తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రచయిత దేశరాజు, భాషను వాడుకోవడంలోనూ, వ్యవహారిక భాషతో కవిత్వాన్ని అందించడంలోనూ, కవితా వస్తువును ఎంచుకోవడంలోనూ, విభిన్నధోరణులతో భిన్నంగా వ్యక్తీకరిస్తూ పాఠకుని ఆకట్టుకుంటుంది దేశరాజు కవిత్వం.
ఉదాహరణగా చూస్తే…
“పిట్టలు తిరిగొచ్చే చెట్టుకొమ్మ”…(బతుకమ్మా )
పండుగేదైతేనేం, వేడుకేదైతేనేం
తెప్పలుగా చెరువు నిండినప్పుడు-
పూలైతేనేం, నీళ్లయితేనేం
విరిగపండిన చేలైతేనేం
గౌరమ్మయితేనేం, బొడ్డెమ్మయితేనేం
మహిమలైతేనేమి, దీవెనలైతేనేమి
చితుల హారతుల్లేని వెలుగునింపేటప్పుడు
భూమి, జలం, మానవత్వం మమేకమయ్యేటప్పుడు-
బతుకమ్మా, బతుకమ్మా…
బంగారు బతుకమ్మా
పదిమందికీ మంచి బతుకునీయమ్మా
బతుకమ్మా –
ఎగిరిపోయిన పిట్టలన్నీ తిరిగొచ్చే చెట్టుకొమ్మకావమ్మా…బతుకమ్మా
ఈ కవితలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని వ్యక్తపరుస్తూ, అంతః స్రవంతిగా కనిపించే తాత్వికత అర్థమవుతుంది పాఠకునికి.
నావికుడిగా, స్నేహితుడిగా, ప్రేమికుడిగా, అక్షరాలద్వారా సమాజాన్ని ప్రేమిస్తూ, మానవత్వాన్ని మేల్కొల్పుతూ,
మనిషితనాన్ని నిలబెడుతూ,
అందించిన ప్రతి కవితాఖండిక ప్రత్యేకమైన శీర్షికలతో, తెలుగు, ఆంగ్ల
పదాల మేళవింపుతో దుర్గాపురం రోడ్డుపై
ప్రయాణం కొత్త అనుభూతులు అందిస్తూ సాగుతుంది, ఈ ప్రయాణంలో
పాఠకుడు తనలోని అపరిచితుడునీ పరిచయం చేసుకుని,ఆ అపరిచితుడునీ
ప్రేమిస్తాడు, “దొరికినా దొరకకపోయినా ప్రేమకోసం గాయపడాల్సిందే”…
అని నమ్మే దేశరాజు పాఠకునికి
ఆ ప్రేమ అందించడానికై నిరంతరం గాయపడటానికైనా సిద్ధంగా ఉన్న రచయిత.
ఆధునికతకు అడుగుజాడ, ఆదిమ అనాచారాలకు చరమగీతం పాడిన ఇంటిజాడ గురజాడను దేశరాజు పరోక్ష గురువుగా స్వీకరించాడు కాబట్టే
“రెక్కవిప్పే పిట్ట” కవితలో
ధన్యోస్మి… ధన్యోస్మి….
ఈ జన్మకిక ఇది చాలు,
అవును,
కూతుళ్లున్న తల్లిదండ్రులకిక చావు లేదు.
అని అద్భుతంగా వ్యక్తీకరించాడంటేనే
అర్థమవుతుంది గురజాడగారి ప్రభావం.
ఒక ఆలోచన, ఒక ఉద్వేగం వెరసి ఓ దుఃఖ వాక్యమై ఆడబిడ్డలకొరకై ఆవేదన చెందుతూ నిద్రరాని రాత్రలను కవిసమయంతో పూరిస్తాడు రచయిత. ఉదాహరణగా చూస్తే
నిశ్శబ్దం కవితలోని వ్యక్తీకరణలో
మన పనుల్లో హడావిడీ పడేవేళ
తెల్లారిపోతున్న వారి బతుకుల్లో…
ఏ వెలుగు ప్రసరించదు
నిశ్శబ్దం అలవాటైన మనకు
అలికిడో, ఆర్థనాదమో ఉలికిపాటు కలిగిస్తుంది
నిరంతర రోదనాశ్రువులు మధ్య
నిశ్శబ్దం వారిని భయపెడుతుంది
బిడ్డలను కన్నందుకు
తల్లులు దుఃఖిస్తారు
భయానక భవిష్యత్తును తలంచుకొని
మర్యాద తెలిసిన చెల్లెల్ల
మానాలు కాపాడే అన్నయ్యలు
అప్పుడెప్పుడో అదృశ్యమైపోతారు
వయసు మళ్ళిన తండ్రులు
దుఃఖం పూడుకుపోయిన గొంతుకతో
నిర్లిప్తత ప్రేక్షకులుగా మిగిలిపోతారని
ఉద్వేగాన్ని వ్యక్తపరిచాడు రచయిత.
నావికుడా, కంట నీరెట్టద్దు
కఠినమైనా బింకంగానే ఉండాలి
ఎందుకంటే బేలతనం, నాన్నతనం కాదు
అంటూ “రేంజర్ రాజా” కవితలో
తండ్రి వాత్సల్యాన్ని వ్యక్తీకరిస్తాడు రచయిత.
నేను రెడ్ రేంజర్ కదా అంటే
నేను యెల్లో రేంజర్ ని అన్నా…
అంతలోనే ఎడం చేతిని గాల్లోకి ఎత్తి,
మహోత్సాహంగా మంత్రోచ్ఛాటన చేస్తూ…
గిర్రున వెనక్కి తిరిగి,
పైకి ఎగిరి గాల్లో ఓ తన్ను తంతూ…
నేను ఎస్పీడీ యమర్జెన్సీ అన్నావు…
నిమిషానికి సెకండ్లు అరవై అయితే,
నువ్వు నిమిషానికి ఆరు వేల రకాలుగా మారుతుంటావు-
నావికూడా చిన్నతనం
తుంటరితనం అనుకోకు –
పువ్వు ఒత్తిగిల్లినా మనకే నొప్పిగా ఉంటుంది.
ఉద్దాన ఉద్యమ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నవాడు,యుక్
“దుర్గాపురం రోడ్” … రచయిత దేశరాజు.
దేశరాజు కవిత్వంపై ప్రశంసలతో పాటుగా కవిత్వసంకలనాన్ని పాఠకులకు అందించడానికి ఎక్కువ సమయం తీసుకున్నాడు అనే విమర్శ కూడా ఉంది, పొగడ్తను విమర్శను సద్భావనతో స్వీకరించే రచయిత దేశరాజు. నిషేధాలు, నిర్బంధాలు తొలగించుకుని ప్రయాణిస్తూ… ఎంతైనా భూమ్మీది వాళ్ళం కదా భూమిలాగే సంచరిస్తూ, మన చుట్టూ మనం తిరుగుతూనే మన వాళ్ళ చుట్టూ కూడా తిరగగలగాలి అని నమ్మిన రచయిత దేశరాజు, అందుకే “దుర్గాపురం రోడ్” తన రెండవ కవితాసంకలనాన్ని భార్య ఆశ, పిల్లలు ఆకాంక్ష, అక్షర లకు అంకితమిచ్చి, భ్రమలు తొలగించుకుని మరెన్నో విభ్రమలు సొంతం చేసుకునేందుకై అల్విదా పలుకుతున్నాడు … రచయితకు మనస్ఫూర్తిగా అల్విదా పలుకుతూ అభినందనలు.
డా. చింతపల్లి ఉదయ జానకి లక్ష్మి వింగ్స్ ఇండియా ఫౌండేషన్, అధినేత్రి. ప్రవృత్తి సమాజ సేవ, రచనలు. B.Ed, M.A(Telugu), M.A(S.W), Ph.D చేశారు. అనేక పురస్కారాలు మరియు అవార్డులు, ప్రశంసా పత్రాలు పొందారు. కవితలు, ఆర్టికల్స్ , పుస్తక సమీక్షలు వార్తాపత్రికల్లో, మాసపత్రికల్లో, వార పత్రికల్లో ప్రచురింపబడినాయి. అనేక కవితలు బహుమతి పొందినాయి. “ఉదయ కిరణాలు” యూట్యూబ్ ఛానల్ ద్వారా సాహిత్య సేవ కొనసాగిస్తున్నారు.