నా జీవన యానంలో- రెండవభాగం- 20

పెద్ద మామయ్య – కథానేపథ్యం

-కె.వరలక్ష్మి

విపుల మాసపత్రిక కథల పోటీలో కొద్దిలో మొదటి బహుమతి తప్పిపోయిన ‘పెద్దమామయ్య • నాకిష్టమైన నా కథల్లో ఒకటి నిజానికి ఆ మామయ్య నా సొంత మామయ్య కాదు పోల్నాడులోని రైతుకుటుంబానికి చెందిన ఆయన, మా వెనక వీధిలో వున్న మోతుబరి రైతుకి ఇల్లరికపుటల్లుడిగా వచ్చాడు. సాత్త్వికుడు, అందమైనవాడు. పొలమారు ఖద్దరు పంచె, పొడవు చేతుల కళ్ళలాఫారం, భుజం మీద మడత విప్పని జరీకండువా, నుదుటిపై తిరుచూర్ణంతో దిద్దిన నిలువుబొట్టు, పాపిడి తీసి దువ్వుకున్న జుట్టు, నాకు ఊహ తెలియని రోజుల్లో ఆ బండి వెనకాల వీధి మలుపువరకూ పరుగెత్తేదాన్ని, తర్వాత మానేసినా ఆ ఎద్దుల మువ్వల చప్పుడుకి వీధిలోకి పరుగెత్తుకొచ్చి బండి కనుమరుగయ్యేవరకూ చూసేదాన్ని. మోటారు బైక్లూ, కార్టూ అంతగాలేని ఆ రోజుల్లో సవారీబండి సంపదకు చిహ్నంగా వుండేది. ఒకర్నొకరు వరసపెట్టి పిల్చుకునే రోజులు వాళ్ళ పెద్దబ్బాయి నా క్లాస్ మేటు, చదువులో కొంత వెనకబడి వుండేవాడు ‘చూడమ్మా కోడలా, నీ చదువు కాస్త మా వాడికి కూడా అబ్బేలా చూడు” అనేవారాయన వాళ్ళ పెద్దమేడ కడుతున్నప్పుడు గుట్టలు పోసిన ఇసకలో ఆడుకోడానికి వెళ్తే.

నేనీ కథ రాసేనాటికి పదహారుమంది పిల్లలకు తండ్రి ఆయన, ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకుంటూ వచ్చేసరికి సంపదల రాశులు, సవారీ బళ్ళు మాయమైపోయాయి అందరిచేతా కాళ్ళకు మొక్కించుకున్న ఆయన మీద కొడుకులే తిరగబడే రోజులొచ్చాయి ఆయన సాత్త్వికత ఆయన్ని దూరం జరిగేలా చేసింది. ఈ కథలో కొంత కల్పన వున్నా జరిగిన సంఘటనల సమాహారం మాత్రం అదే ఓడలు బళ్ళు – బళ్ళు ఓడలు అవుతాయనే సామెత నా చిన్నప్పుడు తరచుగా వినేదాన్ని. అందుకు నిదర్శనం ఆయన జీవితం ఇప్పుడాయన ఈ భూమిపైన లేరు. కానీ, ఈ కథా నేపథ్యం రాస్తూ వుంటే ఆయన రూపం నాకళ్ళ ముందు కదులుతోంది.

పెద్ద మామయ్య

అమ్మ రాసిన ఉత్తరం రెండు లైన్లో అయినా నన్ను వెన్నాడుతోంది. ఎప్పుడూ పెద్ద ఉత్తరాలాసే అమ్మ రెండు లైన్లు గీసి పడేసింది. ‘పెద్దమావయ్య పరిస్థితేం బాగాలేదు, ఒక్కసారి నువ్వొచ్చి చూసి వెళ్తే బావుంటుంది.’ అని. మొన్న మొన్న సంక్రాంతి నాటికి నిక్షేపంలా వున్న పెద్దమావయ్యకి ఉగాది నాటికేమైంది? నా వూహకందడం లేదు. పోనీ, విషయాన్ని వివరంగా రాయొచ్చుగా అమ్మైనా.

చీటికీ మాటికీ రాజధాని నుంచి సెలవు మీద వెళ్ళడమంటే మాటలా? సెలవు దొరకడమొక ప్రోబ్లమైతే, అనుకున్నప్పుడు ట్రయిన్లో రిజర్వేషను దొరకడం మరో ప్రాబ్లెమ్. ఇక, తరిగిపోయిన రూపాయి విలువా, పెరిగిపోయిన ఆర్టీసీ వారి చార్జీలూ – రైల్వే వారి వడ్డింపులూ తడిసి మోపెడవుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ రోడ్డుమీద దిగి, రిక్షా దొరక్కపోతే డొంక దారిన పడి నాలుగైదు కిలోమీటర్లు నడక గొప్ప ఘోరమైంది. వర్షం వస్తే ఎక్కడ మునిగిపోతామో అనిపించేంత పెద్ద గోతులూ, మిగిలిన రోజుల్లో పిల్లతెమ్మరకి కూడా పైకి లేచిపోయి ఊపిరి తిత్తుల్లో దట్టంగా పేరుకుపోయే దుమ్మూ ధూళీ భయపెట్టేస్తూ వుంటాయి. ఒక్కొక్కప్పుడు ముద్దుగా పడకెక్కిస్తాయి కూడా. నిజం చెప్పుకోవాలంటే ఇక్కడికి రాకముందు ఆ వూరు స్వర్గధామం నాకు. హాస్టల్లో వుండి చదువుకోడానికి వెళ్ళి ఎన్నిసార్లు కాలేజి ఎగొట్టి వూరు చేరుకోలేదు. అమ్మ మీది బెంగ కూడా వీగిపోతోందిప్పుడు. రాజధాని రమణీయత అల్లాంటిది.

అదృష్టం బాగుండి వెంటనే సెలవు దొరికింది, గౌతమిలో రిజర్వేషన్ కూడా. పెద్ద మావయకేమైందోననే ఆందోళనతో సరిగా నిద్రపట్టనేలేదు. తెల్లవారు ఝామునెప్పుడో మెలుకువొచ్చేసింది.

రిక్షాలో వూరు చేరేసరికి రేడియోలో సుప్రభాతం వస్తోంది. తిన్నగా పెద్దింటికెళ్ళి మావయ్యని చూసి వెళ్లామనుకున్న ఆలోచన మార్చుకుని ముందుగా అమ్మ దగ్గరకే వెళ్ళాను. దట్టంగా కళ్ళాపి చల్లిన పచ్చని వాకిట్లో గొంతుక్కూర్చుని ముగ్గులేస్తోంది చిట్టెమ్మ. రెండు వేళ్ళ సందునుంచి పిండిని సన్నని ధారగా పోస్తూ అప్పటికే వాకిలంతా లతలు లతలుగా ముగ్గులు పెట్టింది. రిక్షా ఆగిన అలికిడికి తలెత్తి చూసి, చేతిలోని ముగ్గు చిప్పనక్కడే వదిలేసి, “పెద్దమ్మగారూ, కవితమ్మగారొచ్చేసేరు” అంటూ లోపలికో కేక వేసి, రిక్షా దగ్గరకి పరుగెత్తుకొచ్చింది. ముగ్గంటిన చేతుల్ని పరికిణీకి తుడిచేసుకుని సూట్ కేస్ అందుకుంది. నేను రిక్షాకి డబ్బులిచ్చి వెనక్కి తిరిగేసరికి చిట్టెమ్మ మాయమైంది. అమ్మ లోపలెక్కడో వుంది కాబోలు, దీనికేక వినపడిందో లేదో, బైటికొస్తున్న అలికిడి లేదు.

చెప్పులు గుమ్మంలో విడిచి లోపలికి వెళ్ళేసరికి గుమ్మపాల చెంబు మీద కొంగు కప్పి లోపలికి తెస్తోంది. ఒక్క గెంతులో అమ్మ దగ్గరకి చేరుకుని నడుం చుట్టూ చెయ్యివేసి “అమ్మా బాగున్నావా?” అన్నాను.

“ఉండుండవే, పాలు ఒలికి పోగలవ్, ఉత్తరం అందగానే నువ్వొస్తావని తెలుసు. నీ కిష్టమని ఇవేళ పరవాన్నం చేద్దామని పాపం ఆ తువ్వాయి ముండకి ఒక్క చుక్కన్నా మిగల్చకుండా పితుక్కొచ్చాను” అంటోంది అమ్మ.

సూట్ కేసు పుచ్చుకుని పశువుల కొట్టంలో కెళ్ళిపోయినట్టుంది చిట్టమ్మ అమ్మ వెనకే వస్తూ మురిపెంగా నవ్వుతోంది.

“పరవాన్నాలూ గిరవాన్నాలూ తర్వాత కానీ ముందు నాక్కొంచెం కాఫీ నీళ్ళియ్యి, ఒక్క క్షణంలో మొహం కడుక్కొచ్చేస్తాను” అన్నాను.

ఎందుకో ఈ వాతావరణంలోకి, ఈ ఇంట్లోకి, అందునా అమ్మ దగ్గరికి రాగానే బాల్యంలోకి వెళ్ళిపోయినట్టుంటుంది. “కాఫీ నీళ్ళేం కర్మండి, గుమ్మపాలతో చిక్కటి కాపీ తాక్క” అని నవ్వుతోంది చిట్టి. “అఘోరించావులే నోర్మూసుకో” అంటోంది అమ్మదాన్ని ముద్దుగా మందలిస్తూ.

నోట్లోంచి బ్రష్టునోసారి బైటికి తీసి “అవునే అమ్మా, పెద్దమవయ్యకి ఒంట్లో బాగా లేదన్నావు కదా, నువ్వు ఇక్కడుండి పోయేవేం, దగ్గరుంటే బావుండేది కదా” అన్నాను.

“ఒంట్లో బాగోలేక పోవడమేంటే?” అంది అమ్మ ఆశ్చర్యార్థకంగా, ఈసారి బిత్తరపోవడం నావంతైంది. “అదేవిటే, మరేం రాసావు నువ్వు వుత్తరంలో, పెద్దమావయ్య పరిస్థితేం బాగాలేదని రాయలే!” “అవునూ, అలాగంటే ఇలాగనా?” “మరింకేవిటి, అయ్యో అనవసరంగా నా చేత సెలవు పెట్టించేసావు కదా” అన్నాను విసుగ్గా, “వెధవ వుద్యోగం నువ్వూను కాసేపు ఆ గోలాపు. అంటే ఆరోగ్యం చెడిపోయి మనిషి మంచమెక్కితేనే బాగా లేనట్టా? మనసు ముక్కలైపోయి కుమిలిపోతూంటే బాగానే వున్నట్టు లెక్కన్నమాట” అంటోంది అమ్మ. ఆ తిరకాసేంటో అర్ధంకాక “ముందు కాఫీ ఇవ్వు” అని పీట వాల్చుకుని కూలబడ్డాను.

అమ్మ కాఫీ తొరిపిచ్చింది. ఒక్క గుక్క తాగగానే ప్రాణం లేచొచ్చింది. ఎక్కడికెళ్ళినా, ఎంత డబ్బు పోసినా అమ్మ చేతి కాఫీలాంటి రుచికరమైన కాఫీ దొరకదు.

అప్పుడిక అమ్మ విషయాన్ని క్లుప్తంగా చెప్తూ “అక్కడికీ నేనన్నాను, ‘నేను చచ్చేననుకున్నావ ట్రా అన్నయ్యా, ఈ ఇల్లు నీది కాదా’ అని, వెర్రి నవ్వొకటి నవ్వేసి ఊరుకున్నాడు. చిట్టిచేత బియ్యం పప్పులూ పంపిస్తే వెనక్కి పంపించేసాడు. అసలు వాడి వుద్దేశమేంటో నాకర్ధం కావడంలేదు. వాడితో బాటు ఆ నోరూ వాయీలేని పిల్లని కూడా పస్తులుంచుతున్నాడు” అని కళ్ళెత్తుకుంది. స్నానం చేసి, కొంచెం రిలాక్సై చిట్టిని తీసుకుని వూరి బైటి కోవెల తోటవైపు నడిచాను.

“అల్లదేనండి పెద్దమావయ్యగారేసుకున్న గుడిసె” అని వేలితో చూపించింది చిట్టి. గోదారి లంకల్లో దొరికే రెల్లు గడ్డి మూపురం కనిపిస్తోంది. కోనేటి గట్టెక్కేసరికి క్రమంగా కుటీరం రూపు కట్టింది. ఎప్పుడు పెంచారో కానీ ఇంటి చుట్టూ మొక్కలకి పూలు విరగబూసి వున్నాయి. చిరుగాలి కోనేటి నీళ్ళకి గిలిగింతలు పెట్టి చిన్ని చిన్ని అలల్ని సృష్టిస్తోంది. నాచుమీది తేటనీళ్ళు ఉదయపు టెండలకి మిలమిల మెరుస్తున్నాయి. ‘శోభిల్లు సప్తస్వరా’ అంటున్న పెద్దమావయ్య గళం గాలి అలల మీద దూరం నుంచి తేలి తేలి వస్తోంది. త్యాగరాజ స్వామి కీర్తనలు మావయ్య గొంతునుంచి భావస్ఫోరకంగా వినడం అలవాటే మాకందరికీ. ఈ రోజెందుకో జగన్మోహినీ రాగంలో కాస్తంత విషాదాన్ని మిళాయించి పాడుతున్నట్లుంది. రూపక తాళానికి అనుగుణంగా పడుతున్నాయి నా అడుగులు. పెద్ద మావయ్య కృషివల్లే మా కుటుంబాల్లో ఆసక్తి వున్న వాళ్ళందరికీ కాస్తో కూస్తో స్వరజ్ఞానం అబ్బింది. మావయ్య శిష్యగణంలో ఆయన అభిమానాన్ని పూర్తిగా సంపాదించింది నేనే.

“మేనమామ వారసత్వంగా గాత్రం దీనికబ్బింది. మా అన్నయ్య పిల్లలెవరికీ రాలేదు సుమండీ” అని అమ్మ గర్వంగా అనడం చాలాసార్లు నేను విన్నాను.

“ఓరి ఓరి, దూరానికిన్ని రంగుల్లో అంపడతన్నాయాండీ, తీరా చూస్తే బిళ్ళగన్నేర్లూ, కనకాంబరాలు, చంద్రకాంతపూలూను, అన్నీ వాసనలేని పూలే” అంటోంది చిట్టి. దాని మాటలకి నా ధ్యానం చెదిరేసరికి కుటీరం ముందున్నాం.

“అవును పెద్దమావయ్య ఎప్పుడూ వాసనలేని పూల చెట్లనే పెంచుతూ వచ్చాడు” పెద్ద మావయ్య ఇంటిని తేరి చూడ్డానికి మెడనొప్పెట్టే అవసరం లేదిక. నా తల కన్నా జానెడు ఎత్తుందేమొ కుటీరం, అంతే.

వంగి లోపలికి చూసాను. కుటీరం మధ్యలో చిరు చాపమీద బాసింపట్టు వేసుక్కూచుని కళ్ళుమూసుకుని పాడుతున్నాడు మావయ్య.

కుడి చెయ్యి ఆయన తొడమీద తాళనర్తనం చేస్తోంది. ఆ చెయ్యి పైకి లేచినపుడల్లా కప్పుకున్న పై పంచె చిరుగులోంచి పక్కటెముకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బంగారంలాంటి ఆయన మేనిఛాయ ఏమైందో తెలీదు, రాగి రంగు అద్దుకున్నట్టుంది శరీరం. వీణ లేకుండా గొంతెత్తడానికి ఇష్టపడని మావయ్య ఈ రోజు ఒంటరిగా కూర్చుని పాడుతున్నాడు. గళాన్ని ఎంత గొప్పగా విప్పగలడో అంత గొప్ప వైణికుడు మావయ్య.

చిట్టిని మాట్లాడొద్దని సైగచేసి, వాకిట్లో బకెట్లో నీళ్ళని ఓ చెంబెడు కాళ్ళమీద నెమ్మదిగా ఒలకబోసుకుని లోపలికి అడుగుపెట్టాను. తెచ్చిన పళ్ళని చిట్టిచేతుల్లోంచి అందుకుని ఆయన ముందుంచి నెమ్మదిగా చాప చివర కూర్చున్నాను.

మావయ్య వెనక రెండు పుస్తకాల బీరువాలు, ఒక బీరువా మీద ఎప్పటిదో పాతకాలం నాటి సరస్వతీ విగ్రహం తప్ప మరేం లేవు ఆ గదిలో. అడ్డుగా కట్టిన తడిక దాటుకుని వంటిల్లు కాబోలు అటు నడిచింది చిట్టి. మరుక్షణం ప్రతిమ తడి చేతుల్లో పరుగెత్తుకొచ్చి నన్ను వాటేసుకుంది. దాని ముఖంలో ఆనందమో, దుఃఖమో తెలీని భావం. కళ్ళు మాత్రం నీటి చెలమల్లా వున్నాయి.

ఈ సందడికి కళ్ళు విప్పిన పెద్దమావయ్య సంభ్రమంగా చూస్తూ “అరె, కవితొచ్చింది. ఎప్పుడొచ్చేవమ్మా?” అంటున్నారు. ఆయన ముఖంలో ఆనందం తాండవించింది. “ఇవన్నీ ఏమిటి?” అన్నారు పళ్ళవైపు చూస్తూ.

“ఏం లేదులే మావయ్య, మీ కిష్టమని వస్తూ వస్తూ కిస్ మిస్ పళ్ళు తెచ్చాను. నగరంలో పుష్కలంగా దొరుకుతాయని. ఇక ఇవి, వీటిని కర్భూజా పళ్ళంటారు, మనకిటువైపు దొరకవు. కోసిన ముక్కల్లో పంచదార అద్దుకుని తింటే చాలా బావుంటాయి.”

“ఆహా!” అని నావైపు ఆదరంగా చూస్తూ “పిచ్చిపిల్లా! అంత దూరం నుంచి ఇంత బరువు మోసుకొచ్చావా?” అంటున్నారు. నెరిసిన చెంపలూ, మాసిన గడ్డంలో మొలుచుకొచ్చిన తెల్లవెంట్రుకలూ. పెద్దమావయ్య ఎవరో కొత్త వ్యక్తిలా వున్నాడు. ఆ దైన్యం ఆయన రూపంలోకి నిజంగా చొరబడిందా, నేనూహించుకుంటున్నదా? ఎప్పుడూ మడత నలగని ఖరీదైన పొందూరు ఖద్దరులో కడిగిన ముత్యంలా కనిపించే మావయ్య అమ్మకన్నా చిన్నవాడిగా అనిపించేవాడు. పెద్దమావయ్య అని పిలవడమే కానీ, నిజానికి చిన్న మావయ్య ఇంకెవరూ లేరు. అమ్మమ్మకి మావయ్య, అమ్మ ఇద్దరే సంతానం. అమ్మమ్మ, తాతయ్య ‘పెద్దాడా’ అని పిలవడం వల్ల అమ్మకి ‘పెద్దన్నయ్యా ‘ అని పిలిచే అలవాటైందట. దాన్నందుకుని చిన్నప్పటినుంచి నాకూ పెద్దమావయ్య అని పిలిచే అలవాటు.

అమ్మమ్మ వాళ్ళది మధ్య తరగతి కుటుంబం. తాతయ్యకున్న ఎకరం లోంచి అరెకరం మడిచెక్క కట్నంగా ఇచ్చి బడిపంతులుగా ఈ వూరి కొచ్చిన మా నాన్నగారికి అమ్మనిచ్చి పెళ్ళి చేసారట. అప్పటికి అమ్మకి పధ్నాలుగేళ్ళు, మావయ్యకి పదహారేళ్ళూనట. ఎందుకో తెలీదు మావయ్య మద్రాసులో తప్ప చదవనని హఠం పట్టుక్కూర్చున్నాడట. నాన్న ఇంటికి అల్లుడిగా కాకుండా పెద్ద కొడుకులా నిలబడి మావయ్యని స్కూల్ ఫైనల్ తర్వాత చదువు కోసం మద్రాస్ పంపించారట, అక్కడ మావయ్య దృష్టి చదువు మీద కన్నా లలితకళల మీద ఎక్కువగా లగ్నమైంది. ఫలితంగా ఇంటర్మీడియట్ ఎలాగో అత్తెసరు మార్కులతో పాసై, డిగ్రీ వెళ్ళగొట్టి ఇంటికి తిరిగొచ్చాడట. పచ్చని పసిమి ఛాయతో దగ్గర దగ్గర ఆరడుగులుండే మావయ్యది కన్ను చెదిరిపోయే అందం. దానికితోడు నగర నాగరికతని ఒంటబట్టించుకుని వచ్చాడేమో, వూరికల్లా మోతుబరి, రెండు వందలౌకరాలకధిపతి సీతారామయ్య గారి దృష్టినీ, ఆయన ఏకైక పుత్రిక దమయంతి దృష్టినీ ఇట్టే ఆకట్టుకున్నాడు.

తాతయ్య అభిప్రాయంలో మావయ్య రూపం తప్ప తెలివి ఏ మాత్రంలేని అమాయకుడు. మనసూ శరీరమూ మృదువైనవాడు. అలాంటి వాళ్ళకి పుష్కలంగా జరుగుబాటుండాలి. కష్టానికి ఏ మాత్రం పనికిరారు. అదంతా ఆలోచించి ముందు చూపుతో తాతయ్య మావయ్యని సీతారామయ్యగారికి ఇల్లరికపుటల్లుణ్ణి చేసాడు. ఉన్న వూళ్ళోనే కాబట్టి ఎవ్వరికీ ఇబ్బంది లేకపోయింది.

మొదలే దమయంతత్త అందగత్తెకాదు. ఇద్దరు బిడ్డల తల్లయ్యేసరికి మరీ మావయ్య పక్కన దిష్టిబొమ్మలా కనబడేది. సహజంగానే కళల మీద ఆసక్తి వున్నవాళ్ళు మృదుహృదయులై వుంటారంటారు. మావయ్య మృదుత్వం మరి శృతిమించి వుండేది. నగర జీవనానికి ఐదేళ్ళు అలవాటుపడిన ఆయనకి పల్లెటూళ్ళో ముళ్ళమీద నిలబడినట్లుండేది. తరచుగా జేబుల్లో డబ్బు నింపుకొని ఆయన మద్రాసులో కొన్నాళ్ళుండి వస్తుండేవాడు.

ఆ ఇంటివరకు మాత్రం ఆయన కేవలం నిమిత్తమాత్రుండు. పెత్తనం అంతా ఆయన అత్తమామల చేతుల్లో వుండేది. దాంతో ఆయనకి మరింత వెసులుబాటుగా వుండేది. ఆ రాకపోకల రోజుల్లోనే మావయ్య తంజావూరు వీణాకటి కొన్నాడట. ఆయన సంగీత సాధనంతా మద్రాసులో జరిగింది. హఠాత్తుగా సీతారామయ్య గారు మరణించగానే ఆయనకా జీవితం మీద మొహం మొత్తిందెందుకో, నిజమెంతో తెలీదు కానీ మావయ్యకి సంగీతం మీద ఆసక్తి కలిగేందుకు కారణమైన గొప్ప విద్వాంసురాలొకావిడ, మావయ్యకి అతి సన్నిహితురాలు అమెరికా వెళ్ళిపోవడమే అందుక్కారణమని అమ్మ చెప్పింది. ఆవిడలా వెళ్ళిపోవడానికి కారణం దమయంతత్తా, వాళ్ళమ్మా కల్సి మద్రాసెళ్ళి ఆవిడతో పోట్లాడ్డమేనని కూడా చెప్పింది. ఏ సమస్యైనా మనం చూసే విధానం మీద కూడా ఆధారపడి వుంటుందనుకుంటాను. అమ్మకి అమాయకత్వంలా కనిపించిన మావయ్య వ్యక్తిత్వం దయమంతకీ, వాళ్ళమ్మకీ మరోలా కనిపించింది.

మావయ్య మద్రాసు విడిదిని ఖాళీ చేసి వచ్చేటప్పుడు ఒక వేన్ నిండా పుస్తకాలే వచ్చాయట. పెద్ద మేడలో వున్న నల్లచేవ కర్రతో చేసిన అపురూపమైన ఫర్నీచర్ కూడా అక్కణ్ణించే వచ్చిందట.

కొబ్బరి తోటలూ, మావిడి తోటలూ, పంటపొలాలు చూడాల్సిన బాధ్యతంతా మద్రాసు నుచి వస్తూనే మావయ్య మీద పడింది. మావయ్య గొప్ప సౌందర్యాధికుడు. ఆయన ఇంటినుంచి బైటికెళ్ళి రావడానికి చాలా అందమైన సవారీ బండొకటి తయారు చేయించుకున్నాడు. స్వయంగా బండికి కట్టే గుర్రాన్ని బలిష్టమైన దాన్నిగా చూసి మద్రాసునుంచి తెప్పించుకున్నాడు. ఆ గుర్రం పోషణ చూడ్డానికి, మాలిష్ చెయ్యడానికి ప్రత్యేకమైన పనివాడొకడుండేవాడు.

నాకు వూహ తెలిసేనాటికి మావయ్య అలా మహారాజులాగా సవారీ బండిలో ఎక్కి పొలానికి వెళ్తూ వుండేవాడు. తిరిగొచ్చేటప్పుడు తప్పకుండా రోజూ ఆ బండి మా ఇంటిముందు ఆగేది. తను తెచ్చిన పండో ఫలమో నా చేతిలో పెట్టి, నన్నెత్తుకుని ముద్దుచేసేవాడు మావయ్య. నాకు కవిత అని పేరు పెట్టింది ఆయనేనట, మా అమ్మకి కాన్పు ఆలస్యం కావడంతో నేను బాగా వయసుముదిరేక పుట్టాననే చెప్పాలి. నా చిన్నతనంలో నాన్నగారు కాలం చేసారు. అమ్మమ్మ, తాతయ్య నేను పుట్టకముందే పోయారు. ఇక నాకు అమ్మ, అమ్మకి నేనూ, మాకు మావయ్య మిగిలేం. రాతకోతల అవసరాలేం లేకుండానే అమ్మమ్మగారిల్లు, పొలం మాకు ఇచ్చేసాడు మావయ్య. ఆ అన్నాచెల్లెళ్ళ ఆప్యాయతలు చూస్తూంటే ‘అయ్యో, నాకూ ఓ తోబుట్టువు లేకపోయాడే’ అని బాధ వేసేది.

తల్లి ముసలమ్మగారి కోరిక మేరకి ఆరుగురు బిడ్డల తల్లయ్యింది దమయంతత్త. నలుగురు మగసంతు, ఇద్దరాడపిల్లలు. పెద్దాడు సీతారాముణ్ణి ముసలమ్మగారు దత్తత చేసుకుంది. సీతారాముడి తర్వాతి వాడు కిష్టుడు. పెద్దవాళ్ళ ప్రమేయం లేకుండా తనకి నచ్చి పిల్లని పెళ్ళి చేసుకుని దుబాయ్ కాబోలు వెళ్ళిపోయాడు. తర్వాతిది మృదుల. లక్షల కట్నం ఇచ్చి మృదుల పెళ్ళి చాలా ఘనంగా చేసారు. అలకపాన్పు మీద అల్లుడికి కారు కొనిచ్చింది. ముసలమ్మగారు. తర్వాతివాడు శ్రీనివాసరావు వాణ్ణి శ్రీశ్రీ అని పిలిచేవాడు మావయ్య. ఉత్తదుందుకుడు స్వభావి. పద్నాలుగేళ్ళ వయసులో ట్రాక్టరు నడపబోయి చెట్టుకు గుద్దేసి చచ్చిపోయాడు. ఆ తర్వాతి వాడు శరత్, తర్వా తిది ప్రతిమ.

శ్రీశ్రీగాడి మరణం దమయంతత్తని బాగా కృంగదీసింది. అదేం రోగమో, ఆర్నెల్లు మంచం పట్టి ఆవిడా ఇహలోకాన్ని విడిచిపెట్టేసింది. అంతవరకు ‘దిగిరాను దిగిరాను దివినుండి భువికి’ అంటూ భావనాలోకాల్లో విహరించే మావయ్యలో ఏదో మార్పొచ్చింది. కొబ్బరి చెట్లల్లో, మావిడి తోపుల్లో గంధర్వుడిలా విహరించే మావయ్య క్రమంగా ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఆ మార్పు మొదటిసారిగా నాకే తెల్సింది. అంతవరకు నాకు నేర్పిస్తున్న లలితగీతాల స్థానంలో త్యాగరాయకృతులూ, భక్తిపదాలు చోటు చేసుకున్నాయి. నా సంగీత సాధన పూర్తిగా సాగనే లేదు. చదువూ, ఆ తర్వాత వుద్యోగం అంటూ వూళ్ళు పట్టుకుని వెళ్ళాల్సివచ్చింది. కానీ, మావయ్య ధర్మమా అని ఏ రాగమేదో, ఏ తాళానికి ఏ లయో కొద్దిగా పట్టుబడింది.

“ఏంటమ్మా అంత దీర్ఘాలోచన?” అంటూ నవ్వుతున్నాడు మావయ్య. నవ్వుతో పెదవి సాగినప్పుడు ఎప్పట్లాగే బుగ్గమీద సొట్టపడింది. కానీ పెద్ద సైజు ముత్యాలు పేర్చినట్లున్న ఎడం పక్క పలువరుసలో ఒక పన్నులేదు. పెద్ద మావయ్యని వయసు బలవంతంగా ఆక్రమించుకుంటోంది.

ఎన్నో ఒడిదుడుకులతో వెంటనే ఓ పరిష్కారాన్ని సృష్టించుకుని నలగకుండా నిలబడిన మావయ్య ఈసారి ఓటమికి తలవంచేసాడు. ఆ విషయం స్పష్టంగా తెలుస్తోంది.

“ఇదంతా ఏవిటి మావయ్యా? ఆ రాజభవనంలోంచి ఆ వూరి చివరి కుటీరానికి ప్రస్థానమేవిటి? రాజ్యం పోగొట్టుకున్న రారాజులా ఈ రూపమేంటి?” అడగాలనుకున్న ప్రశ్నల్ని దుఃఖం పొంగివచ్చి గొంతులో అణి చెయ్యగా ఒక్కసారిగా లేచెళ్ళి మావయ్య భుజానికి తల ఆన్చి బావురుమన్నాను. ప్రతిమ ముందే వెక్కెక్కి పడుతోంది. మెత్తగా పూలదిండులా వుండే మావయ్య భుజంలో బొమికలు గుచ్చుకుంటున్నాయి.

“అరే, ఏంటిది కవితా! ఇప్పుడేం జరిగిందని ఈ దుఃఖం? ఊరుకోమ్మా, ఊరుకో, నిజానికి మన కళ్ళకి కనిపించని అంతర్యామి ఏదో మనల్ని నడిపిస్తూ వుంటుంది. ఈ లోపల మనం మూడుల్లా కష్టాలకి దుఃఖపడిపోయి, సుఖాలకి ఆనందపడిపోతూ వుంటాం” నేను ఆశ్చర్యంగా తల ఎత్తి మావయ్య ముఖంలోకి చూడబోయాను. ఆయన ముఖం అటు తిప్పుకున్నాడు. ఆ కళ్ళల్లోని కన్నీళ్ళు నా దృష్టిని తప్పించుకోలేక పోయాయి.” ప్రతిమ పెళ్ళాక్కటీ జరిగిపోతే ఇంకంతా నిశ్చింతే. ఆ పెళ్ళి నిశ్చయం చేసుకోకుండా వుంటే ఇదంతా వచ్చేది కాదు. కానీ, దానికి పెళ్ళీ చెయ్యక, చదువూలేక ఎలా ఎలా?” స్వగతంలాగా ప్రశ్నించుకుంటున్నాడు మావయ్య.

“అయినా, బావ మీ కన్నకొడుకు కదా, వాడితో పంతాలేవిటి మావయ్యా రెండు చెంపలు వాయించి నోరుమూయించక” అన్నాను. తెలీకుండానే నా గొంతులో కోపం తొంగి చూసింది. మావయ్య ఇటు తిరిగి ‘ఎంత అజ్ఞానం ‘ అన్నట్టు చూసాడు.

చిన్నగా నవ్వుతూ “నీ బిడ్డల్ని అలా పెంచుదువుగానిలే, నాకది సాధ్యం కాలేదు” అన్నాడు. “అన్నట్టు ప్రతిమా వడ్డించమ్మా భోజనాలు కానిద్దాం” ప్రతిమ ఏదో ఇబ్బందిని దాచుకోడానికి ప్రయత్నిస్తూ లేచింది. ”అమ్మగారు, నేనెలా మీరెనకాలొస్తారని అమ్మగారికి చెప్తా” అంది చిట్టి.

వంటింట్లో మూడు ఆకుల్లో వడ్డించిన అన్నాన్ని చూసి ‘అరరే’ అని లోలోపలే నొచ్చుకున్నాను. ఇద్దరికి వండిన అన్నాన్ని ముగ్గురికి పంచింది ప్రతిమ. గోడపక్కన అన్నం గిన్నెలో నీళ్ళు పోసేసి వున్నాయి. చిట్టి పిడతలో కాస్త వూరగాయ, చిన్నిగిన్నెలో కాసిన్ని మజ్జిగా మాత్రం వున్నాయక్కడ. వంచిన తల ఎత్తకుండా కూర్చుంది ప్రతిమ. అన్నీ సవ్యంగా జరిగుంటే మొన్న మాఘంలో పెళ్ళికూతురై ఈ సరికి అత్తవారింట్లో వుండాల్సిన పిల్ల. పెట్టిన ముహూర్తం తప్పిపోయింది. ఈ పిల్ల లేకపోయుంటే ఈ పరిస్థితుల్లో మావయ్య ఏమై వుండేవాడో.

చూపుడు వేలితో దాని చుబుకాన్ని పైకెత్తి, దాని కళ్ళల్లోకి చూడ్డానికి ప్రయత్నించాను, కాని అది వంచిన కళ్ళెత్తలేదు.

“అమ్మపోయినప్పుడు నాన్నగారు కోవెలకి అయిదెకరాల మాన్యం ఇచ్చారు. దేవుడి ప్రసాదం అంటూ రోజూ ఇన్ని బియ్యం పంపిస్తున్నారు ఆచారిగారు” అంది నెమ్మదిగా.

మావయ్య కాళ్ళు కడుక్కుని వస్తున్న అలికిడై కొంచెం వూరగాయ వడ్డించుకుని గబగబా అన్నం కలుపుకున్నాను. మావయ్యొచ్చి ఆకు ముందు కూర్చున్నాడు గిన్నెలోని, మజ్జిగ రవ్వంత అన్నంలోకి వంపుకుని, మిగతా మేరకి నీళ్ళు పోసుకుని అన్నాన్ని కలుపుతున్నాడు పెద్దమావయ్య. నాకు కళ్ళెత్తి ఆయనవైపు చూసే ధైర్యం లేకపోయింది ఆయన పనివాళ్ళు కూడా అలాంటి తిండి తిని ఎరగరేనాడు. ఉప్పైనా వేసుకోకుండా చప్పిడి అన్నాన్ని ఆయనలా తింటూ వుంటే నా కడుపులో ఎవరో చెయ్యి పెట్టి కెలికినట్లైంది. ప్రతిమ కళ్ళనించి రెండు కన్నీటి చుక్కలు టప్పుమని ఆకులో పడ్డాయి. అది గమనించి “ప్రతిమా! ఈ మాత్రం తిండికి కూడా నోచుకోని వాళ్ళెందరో వుంటారు తెల్సా” అంటున్నాడు మావయ్య మందలిస్తూ “ఈ వయస్సులో వుప్పూకారం తినకూడదమ్మా నేను”

“శరత్ మాటేమిటి మావయ్యా!” అన్నాను నేను విషయాన్ని మళ్ళిస్తూ.

“వాడి గురించి బెంగలేదు. సరస్వతీ కటాక్షం వాడికబ్బింది. మెరిట్ స్కాలర్ షిప్పొస్తోంది. ఆ చదువైపోతే ఆ తర్వాత వాడి దారి వాడే చూసుకుంటాడు.”

“ఎప్పటెప్పటి పుస్తకాలో పని కట్టుకుని వెంట తెచ్చుకున్న మీరు వీణనెందుకు అక్కడొదిలేసారు. అది మీ ఆప్తనేస్తం కదా, మీటేవాళ్ళు లేని చోట ఎందుకది?”

“ఈ పుస్తకాలైన నాన్నగారు తెచ్చుకోలేదు. హాల్లో వెక్కిరించినట్టున్నాయట. అందుకని వాళ్ళే పంపేసారు. వీణకి మాత్రం సుడులు మంచివట. అందుకని వుంచేసుకున్నారు” అంది ప్రతిమ.

వేసవి ప్రవేశిస్తున్న సూచనగా మధ్యాహ్నం ఎండ తీవ్రతని సంతరించుకుంటోంది. పైన రెల్లు గడ్డి వెయ్యడం వలన చాలా చల్లగా వుంది. ప్రతిమ పక్కనే చాపమీద మేను వాలిస్తే ప్రాణం ఎక్కడికో పోయింది. మెలుకువ వొచ్చేసరికి సంధ్య వాలుతోంది.

సంధ్యార్చన ప్రారంభమైనట్టుంది, కోవెల గంటలు మోగుతున్నాయి. కోవెలమంటమలోంచి మామయ్య గళం ‘నగుమోము గనలేని నా జాలి దెలిసీ.’ అంటూ ఆర్థంగా అంటోంది.

మళ్ళీ రేపొస్తానని ప్రతిమకి చెప్పి బైటికొచ్చాను.

కోనేటి గట్టు దిగుతూ వుంటే ‘జగమేలే పరమాత్మా ఎవరితో మొరలిడుదూ? ‘ మావయ్య గొంతులోని ప్రశ్న తారాస్థాయిలో తరంగితమౌతూ వెన్నాడుతోంది. నా ఒళ్ళు గగుర్పొడిచింది వూళ్ళోకల్లా వున్నతంగా కనిపిస్తోంది మావయ్య వాళ్ళ పెద్దమేడ. ఈ టైంలో సీతారాముడు ఇంట్లోనే వుండచ్చు. అటు రావి చెట్టు పక్కనించి మళ్ళీ ఆ వేపు నడిచాను.

సీతారాముడు ఇంట్లోనే వున్నట్టున్నాడు. పోర్టికోలో కారుంది. అటు నైరుతి మూలలో వేప చెట్టుకింద మావయ్య సవారీ బండి రంగులు వెలసిపోయి, వైభవాన్ని కోల్పోయి, పక్షుల రెట్టల గుట్టలో దీనంగా తలదించుకుని వుంది. గుర్రానెప్పుడో అమ్మేసారు. ఇటు పక్క పెద్ద దొడ్డిలో నాలుగు ట్రాక్టర్లు నిలిపి వున్నాయి. పశువులింకా ఇంటికొచ్చినట్టులేదు. నాలుగైదు లేగదూడలు గెంతడం ఆపి ఆత్రంగా తల్లులొచ్చే దిశవైపు మోరలెత్తి చూస్తున్నాయి.

హాల్లోనే సోఫాలో శేషతల్పశాయిలా పవళించి వున్నాడు సీతారాముడు. అతని భార్య ధనం అతని తలవైపు కూర్చుని వుంది. ఒళ్ళంతా నగలన్నీ అలంకరించుకుని సగం మోడరేట్ గానూ, సగం సనాతనంగానూ వుందావిడ. పక్కనే టీపాయ్ మీద పెద్ద టిఫిన్ ప్లేటులో సగం ఖాళీ అయిన కారప్పూస వుంది.

మావయ్య పుస్తకాల బీరువా స్థానంలో ఐరన్ సేఫొకటీ, ఫ్రిజొకటి, వున్నాయి. సరస్వతీ విగ్రహం వుండేచోట లక్ష్మీ విగ్రహం వుంది. ఆ బొమ్మ చేతిలోంచి బొమ్మకాసులు రాసులుగా రాలున్నాయి. కొత్తగా కట్టించిన షోకేసులోంచి వీణ నిస్సహాయంగా చూస్తోంది.

ట్రాక్టర్లు నడిపేవాళ్ళు కాబోలు చేతులు కట్టుకుని సీతారాముడితో ఏదో వ్యవహారం మాట్లాడుతున్నారు. వాళ్ళు వెళ్ళాక నావైపు చూసి “అబ్బో అబ్బో, ఎప్పుడూ పట్నం నించిరాక?” అన్నాడు సీతారాముడు పళ్ళన్నీ కనిపించేలా నవ్వుతూ. వాడిది వాళ్ళమ్మ పోలిక. “మా మరదలికి టిఫిన్ పట్రావే” అని వాళ్ళావిడికి హుకం జారీ చేసాడు. ఆవిడ అలవోకగా కారప్పూస పళ్ళాన్ని ముందుకు జరిపింది.

“ఏంటి సంవత్సరాది పండక్కొచ్చేవా?” “కాదు, నీతో పనుండొచ్చాను”

“ఏంటి నాతోనే, వారెవ్వా” అని కన్నుగిలికాడు. చిన్నప్పట్నుంచి వాడు వెకిలి వేషాలు వెయ్యడం, వాటిని తేలిగ్గా తీసుకోవడం అలవాటే కానీ, ఈ రోజు ఒళ్ళుడికిపోయింది.

“ఎవరైనా మినిస్టరుకి చెప్పి ప్రమోషనేవైనా ఇప్పించాలా? ” అంటున్నాడు సీతారాముడు.

“అదేం కాదులే దత్తుడూ” అన్నాను నేను. దగ్గిరవాళ్ళంతా వాణ్ణలాగే పిలుస్తారు. నాకు మాత్రం ‘బావ’ అని పిలిచే అలవాటు. ఈ రోజు వాణ్ణలా పిలవబుద్ధి కావడం లేదు. ‘దత్తుడూ ‘ అన్న నా కొత్త పిలుపుకి బిత్తరపోయి చూసాడు వాడు.

“పెద్దమావయ్యనలా బైటికి పంపించడం ఏమైనా బావుందా?” అన్నాను నేను గొంతులోకి వీలైనంత మృదుత్వాన్ని తెచ్చుకుని.

“ఓహో, అదా సంగతీ, రాయబారానికొచ్చేవా? ఆయన్నింట్లోంచి బైటికి పొమ్మని నేనేం అన్లేదే, కావాలని ఆయనే పోయి చెరువు గట్టున కాపరం పెట్టి నన్నిలా వీధిలో పెడుతున్నాడు.”

“ఆఁ ఎంతమంది నౌఖర్లు పడి తినడం లేదు రోజూ” అని అందించింది ధనం. నేనావిడవైపు చూడకుండా “ఆయన నీ కన్నతండ్రిని గుర్తుందా అసలు నీకు?” అన్నాను.

“గుర్తుండబట్టే ఇంతకాలం భరించాను. వున్నదంతా ఆర్పేస్తానంటే ఎవడు మట్టుకు వూరుకుంటాడు. మాకూ పిల్లా జిల్లా కలగరా, వున్నదంతా ఆయన పిల్లలకే అవజేసేస్తే.”

“అరే ఏంటలా మాట్లాడతావు మరీ లోభిలా, తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్థికదా మీది. ఎప్పుడో నీకు పుట్టబోయే పిల్లలకోసమని తోడబుట్టిన దాని పెళ్ళి ఆపేస్తావా?”

దత్తుడి మొహం జేవురించింది. ఈ

”ఎవరు నాకు తోడబుట్టినవాళ్ళు. నన్ను చిన్నప్పుడే మా అమ్మమ్మ దత్తత తీసుకుంది. ఈ ఆస్థంతా నాది. నాకు తెలిసీ తెలీని వయసులో నన్ను మభ్యపెట్టి లక్షలు తగలేసి పెద్ద కూతురి పెళ్ళి చేసారు. దానికోసం యాభై ఎకరాలమ్మేసారు. మా అమ్మమ్మ వారపు నగల్లో సగం దాని మొహాన్నేసారు. మిగిలిన సగం ఈ చిన్నదాని మొహాన్నేస్తానంటున్నాడు. అయిదు లక్షల కేష్ రెడీగా లేదంటే కొబ్బరితోట అమ్ముదామంటాడా, అసలీయనెవడు నా తోటలు దొడ్డూ అమ్మడానికి? ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికెగిరిందని ఆ డాక్టరు సంబంధం చూడ్డమెందుకు, ఏదో గంతకు తగ్గ బొంతకి కట్టబెడితే పోలా?”

నా నోటివెంట మాట రాలేదు. డబ్బు మనుషుల చేత ఇలా పలికిస్తుందా? రక్తసంబంధాలూ, కష్టసుఖాలూ ఏవీ గమనించనీయదా?

కొంత తేరుకుని “ఇంత జరిగాక ఇప్పుడా సంబంధం వదిలేస్తే మరో సంబంధం కుదరడం ఎంత కష్టం. అయినా నీకన్న ముందు మీ అమ్మ మీ అమ్మమ్మకి కూతురుకదా, స్వయంగా ఆవిడ కడుపున పుట్టింది, ఆవిడ తర్వాతే నువ్వు” అన్నాను.

“అవును మా అమ్మ మా అమ్మమ్మకి కూతురూ, ఆవిడ మొగుడు అల్లుడూను, దత్తత ప్రకారం నేను కొడుకునయ్యాక ఆవిడ ఈ ఇంటి ఆడపడుచు మాత్రమే. ఆవిడకి స్త్రీ ధనంగా మేమివ్వాల్సిందేమైనా వుంటే అదాయన గారి మద్రాసు లీలలకి ఖర్చైపోయింది. అంతకు మించి అయ్యిందేమో కూడా. ఆయన పిల్లలకీ జెల్లలకీ తరతరాలుగా తినబెట్టడానికి ఇక్కడ అప్పనంగా వచ్చిన కొండలేం లేవు. కూర్చుని తింటే కొండలైనా ఆగుతాయా?”

“ఆయనేం కూర్చుని తిన్డేదే, మీ తాతగారి తర్వాత ఈ ఆస్తులన్నిటినీ కాపాడిందెవరు? పంట, సాగు వెయ్యికళ్ళతో చూసుకున్నదెవరు పెద్దమావయ్య కాదా?” నాకు తెలీకుండానే ఆవేశంగా అరిచాను. దత్తుడు వ్యంగ్యంగా నవ్వాడు “అవును అవన్నీ మీ పెద్దమావయ్యే చూసాడు. అందుకు ప్రతిగా మేం ఆయన కుటుంబాన్ని పోషించాం. మామూలు పోషణ కాదు. తిండీ, బట్టా, దర్జాలూ, దానధర్మాలు సమస్తం మా డబ్బుతోనే జరిగాయి. చివరికి ఒక కూతురి పెళ్ళికూడా”

ఈ దుర్మార్గుడితో ఎంత వాదించినా చెవిటివాడి ముందు శంఖం వూదినట్టే తిప్పి తిప్పి సంభాషణని అక్కడికే తెస్తున్నాడు. పెద్దమావయ్య ఇంట్లోంచి కట్టుబట్టలో ఎందుకు దూరంగా వెళ్ళిపోయాడో నా కర్ధమౌతోంది. ఈ మూర్ఖుడు ఆయన ముందు కూడా ఇలాగే వాగి వుంటాడు.

నేను హతాశురాలినయ్యాను. నిస్సహాయంగా దిక్కులు చూసాను. కన్నీళ్ళతో నిండిన పెద్దమావయ్య జాలి ముఖం నా కళ్ళల్లో కదలాడింది. ‘జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడను? ‘ అంటున్న ఆయన ఆర్ధస్వరం నా చెవుల్లో ప్రతిధ్వనించింది.

లేచి నిల్చుని చేతులు జోడించాను. “దత్తుడూ, పోనీ అవన్నీ వదిలెయ్, ఒక అనాధ పిల్లకి పెళ్ళి చేస్తున్నాననుకుని ప్రతిమ పెళ్ళి జరిపించు. పెద్దమామయ్యకి శాంతి కలిగించు”

“ఏం పెద్దమావయ్య మీద అంత ప్రేమ ఒలికిపోతూంటే మీ ఆక్రమణలో వున్న ఆయన ఇల్లూ పొలం ఆయనకిచ్చెయ్యొచ్చుగా తన వరకూ వస్తే ధర్మపన్నాలు దూరంగా పోతాయి కాబోలు” దత్తుడు కళ్ళు చికిలించి క్రూరంగా చూస్తున్నాడు.

ఏం వింటున్నానో కొంతసేపటి వరకు నా కర్ణంకాలేదు.

నేను నిరుత్తరనయ్యాను.. ఉక్రోషంతో నా కళ్ళలోకి నీళొచ్చాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఎక్కడలేని ఆవేశం ఆవహించింది నన్ను “సరే అయితే ఆ ఇల్లూ పొలం నీకే ఇచ్చేస్తాను ప్రతిమ పెళ్ళి నిర్విఘ్నంగా జరిపిస్తావా?”

“బుర్రలేని వాడెవడికైనా చెప్పు ఇలాంటి కబుర్లు. ఆ పాత మట్టి మిద్దెకీ, బోడి ఎకరం పొలానికి కట్నంలో నాలుగోవంతుకూడా రాదు, మీ నాన్న పి.ఎఫ్ డబ్బుతో చవకలో కాలవకింద అయిదెకరాలు కొని కొబ్బరి మొక్కలేయించింది చూడు మీ అమ్మ అదికూడా కలిపితే కానీ పనికాదు” కవ్వింపుగా చూస్తున్నాడు సీతారాముడు.

అమ్మ ఈ ప్రపోజల్ ఖచ్చితంగా ఒప్పుకోదు. ఒప్పించడం నాకు సాధ్యమూ కాదు. మరింకే గత్యంతరమూ లేదు. ఇంకేం ఆలోచించదల్చుకోలేదు.

“సరే” అన్నాను.

ఈ సమాధానాన్ని ఊహించి ఉండడు బహుశా. దత్తుడు వెలవెలపోయాడు. ధనం ఎందుకో నా వైపు నిరసనగా చూసి విసవిసా నడిచి లోపలికెళ్ళిపోయింది. దత్తుడేదో అనబోయి ఆగిపోయాడు.

నాకర్థమైంది, పైకనకపోయినా వాళ్ళనాలనుకున్నదిదీ ‘అంతా పెద్దమామయ్య కోసం ధారపోస్తే రేపు నిన్నెవడు పెళ్ళాడతాడు?” అని. నా పెళ్ళికి మూలం ఆస్తిపాస్తులే అయితే అలాంటి పెళ్ళినాకొద్దు.

“నాకు సెలవాట్టేలేదు. ఎల్లుండి మధ్యాహ్నానికల్లా రాతకోతలు ముగిసేలా చూడు. ఆపై మాట తప్పొద్దు. పెళ్ళి జాగ్రత్తగా జరగాలి, ఆ తర్వాతే రిజిస్ట్రేషను. మరో విషయం ఇదంతా మా అమ్మకి తెలియనీవద్దు” అన్నాను బైటికి నడుస్తూ.

మర్నాడు మావయ్యకి ప్రతిమ పెళ్ళి జరిపించడానికి దత్తుడు ఒప్పుకున్నాడని మాత్రమే చెప్పాను. మిగిలిన వివరాలేవీ చెప్పలేదు. మామయ్య అనుమానంగా చూడబోతుండగా కళ్ళు తిప్పుకుని వచ్చేసాను. అమ్మని నాతోపాటు హైదరాబాదు వచ్చేలా ఒప్పించడానికి నా తాతముత్తాతలు దిగి వచ్చారు. మొత్తానికెలా అయితేనేం ఒప్పుకుంది.

పెద్దమావయ్యతో చెప్పడానికెళ్ళినప్పుడు “అన్నయ్యా, ప్రతిమ పెళ్ళైపోయాక నువ్వు కూడా మా దగ్గరికి వచ్చెయ్యాలి” అంది అమ్మ.

విరాగిలా నవ్వాడు పెద్దమావయ్య. ” జానకీ, మనిషెప్పుడూ తనకోసం తను బతకడు. బాధ్యతలు తీర్చుకోడానికి ఇతరుల మెప్పుపొందడానికీ బతుకుతాడు. స్వార్థపరుడు కూడా, ఇతరుల మెప్పుకోసమే ఆస్తుల్ని పెంచుకుంటాడు. నిజానికి ఈ పొట్టకి గుళ్ళో ప్రసాదం గుప్పెడూ,

కోనేటి నీళ్ళు దోసెడూ చాలవంటావా? శరీరాన్ని కప్పడానికి ఒక్క వస్త్రమూ చాలదా?” అన్నాడు. కోవెల తోటలో ఎక్కడో కోయిల విషాద రాగం పలుకుతూండగా పెద్దమావయ్య నుంచి వీడ్కోలు తీసుకున్నాం అమ్మా నేను.

గోదావరి ఎక్స్ ప్రెస్ పట్టాల మీద నిరాఘాటంగా పరుగెడుతోంది. బెర్త్ పరుచుకుని పడుకోబోయే ముందు అమ్మ “కవితా! పెద్దమావయ్య మాటలు వింటే నాకు భయమేసిందే, ఎంత విరాగిలా మాట్లాడాడో చూసావా” అంది.

అమ్మ కాళ్ళమీద దుప్పటి కప్పేనెపంతో ఆమె పాదాల్ని ఓసారి తాకి ఆ చేతిని కళ్ళమీదుంచుకుంటూ “అమ్మా, ఆడపిల్లకంత చదువెందుకని ఎందరు నిరోధించినా లక్ష్యపెట్టక నన్ను చదివించావు. ఈ జన్మంతా నీకు ఋణపడి వుంటానమ్మా” అన్నాను.

“నీకేమైందే?” విస్తుపోతూ అమ్మలేచి కూర్చుంది.

“నిజానికి మనిషి బ్రతకడానికి గుప్పెడు అన్నమూ, కట్టుకోడానికో బట్టా వుండడానికో గూడూ చాలవూ? అంతకన్నా స్వార్థంం అనవసరం కదా” అన్నాను దుప్పటిని ముఖం మీదికంటా కప్పేసుకుంటూ.

(మే 1995 విపుల పోటీలో బహుమతి) 

 

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.