బతుకు చిత్రం-4

– రావుల కిరణ్మయి

సెప్పు ..,ఈంది ఏ ఊరు?అయ్యవ్వలు ఏంజేత్తరు?ఫోన్ సుత లేకుండ ఈ మనిసిని ఈడెట్ల ఇడిసిపెట్టిండ్రు ?నీ కాడ వాళ్ళ నెంబరుంటది గదా!ఫోన్ జేసి పిలిపియ్యి అన్నడు వరయ్య.

ఇగో అట్నే ఈ పొల్ల అయ్యను సుత పిల్సుకురాండ్రి.అన్నడు పోలయ్య వైపు చూస్తూ.

పూజారి మునేశ్వరయ్య జాజులమ్మ వైపు చూపిస్తూ …

వరయ్య గారూ !ఒక్కసారి ఆ పొళ్ళను సూడుండ్రి.పాపం …బేలగా భయంతోనూ,సిగ్గు తోనూ ఎలా వణికిపోతుందో..!ఇది పాడి గాదు.వీళ్ళ అయ్యవ్వను ఎలాగూ పిలిపించామన్నరు గదా..!వాళ్ళ నాయన పానం బాలేదని ముందుగాల్నే సెప్పె.జరిగిన ఇషయం గూడ చెప్పింది గదా..!పాణం బాలేని మనిషని పోలయ్య గూడ చెప్తాండు గదా..!ఇడిసి పెట్టున్ద్ద్రి .అని చెప్పగానే ..,

జాజులమ్మ అమాంతం ఏడ్చుకుంటు వచ్చి,మునేశ్వరయ్య పాదాల మీద పడి దేవుని పూజ చేసి  …చేసీ ..మీరే దేవుడైనట్టున్నరు.నా మీద ఇంత జాలి సూపెట్టిండ్రు.

అయ్యా..!మీరు ధర్మప్రభువులు.గుడి లోని దేవుని సేవ చేసే మీ పాదాలంటి ,మీ పాదాల సాచ్చిగా నేను సెప్పిందంతా పొల్లు పోకుండా అచ్చర సచ్చెం.అని ఏడవసాగింది.

మునీశ్వరయ్య రెండడుగులు వెనుకకు వేసి,లేవనెత్తి ,

పిచ్చిపిల్ల ..! లే..లే..నన్ను దేవుడంట వేంది?తల్లీ ..!నిన్నూ ..నన్నూ ..అందర్నీ రెండు కళ్ళలా సమానంగా సూసేటోడు భగవంతుడొక్కడే.మనుసుల రూపం లో సాయం చేస్తూ తానున్నానని చాటుకుంటాడు.అని కన్నీళ్ళు తుడిచి జనం వైపు తిరిగి,

వీళ్ళు చేసింది తప్పని ఏడ రుజువు లేదు.మనం ఇట్లా అనుమానించి పొద్దేక్కుతున్నా వీళ్ళకు ఇన్ని మంచినీళ్ళన్న ఇయ్యకపోవడం మర్యాద కాదు.ఒగరు నీతి లేని వాళ్ళు ,మర్యాద తెలియని వాళ్ళయితే మనమూ అలాగే ఉందామా ..?

అయితే ఏం జెయ్యమంటరు?మీరు సెప్పేది ఇంటాంటే భాజాభజంత్రీలు మోగించుకుంటతొలక పోయి సింహాసనం మీద కూచోబెట్టి రాచ మర్యాదలు జెయ్యాల్నా?ఏంది?అదేమీ గుదరదు.ఇద్దరు కూడబలుక్కునే యవ్వారం నడిపించినట్టున్నరు.అది తేలేదాంక వీళ్ళు ఉపాసమైన పండాలె.అన్నాడు చంద్రం .భుజం మీది తువాలు దీసి గట్టిగ దులుపుకుంటూ.

ఆగయ్యా చంద్రం .!ఆవేశం అన్నిట్ల మంచిది గాదు.పూజారి గారన్నట్టు వీళ్ళు తప్పు చెయ్యలేదని రుజువైతే మనం తప్పుజేసిన వాళ్ళమైతం.ఇక పోతే అపకారికైనా ఉపకారం చేసే మనూరువాళ్ళు సుత పూజారి గారన్నదే సరైన్దంటరు.అన్నట్టుగా జనాలకేసి చూసి ,

మీలో ఎవరన్న వీళ్ళకు గిన్నన్ని పాలో,చాయో తెచ్చిత్తే సంతోషం అన్నాడు.

ఎవలో ఎందుకు?మీరే తీస్కరాండ్రి .అన్నాడు చంద్రమ్ మళ్ళీ.

ఆ మాట నువ్వంటవనే అనుకుంటాన.మావోళ్ళు ఎవ్వరు లేరు.అందుకే ఎవలన్నా అన్న.అన్నాడు వరయ్య.

మీరు ఊర్కోండి.నేను మా ఇంట్ల నుండి పంపిస్తా.ఇంతలకు జానయ్య తో వాళ్ళ అమ్మా నాయన లను రప్పియ్యున్డ్రి.అవార్దాంక వీళ్ళను ఎవ్వరేమడుగకున్డ్రి.అని అక్కడి నుండి కదిలాడు.

వరయ్య మహానుభావుడు ..,అని ఆయన కదిలిన వైపే చూస్తూ దండం బెట్టి ,ఇక ఎవరిన్డ్లకు వాళ్ళు నడువుండ్రి.వాళ్ళు ఈడనె ఉంటరు.వాల్లోళ్ళు వచ్చినంక మాట్లాడుకుందం.అని జేబులో నుండి ఓ పది రూపాయలు తీసి పళ్ళ పొడి పొట్లం తెమ్మని ఓ పిలగానికిచ్చి పంపాడు.

జానయ్యా..!నువ్వుండు.అని తన ఫోన్ తీసి నెంబర్ చెప్పమని కలిపిండు.

తరువాత జానయ్యకే ఇచ్చి మాట్లాడమన్నాడు.

హలో …!అన్నాడు 

అట్నుండి రాజయ్య ఎత్తి ,హలో…!అన్నాడు.

అయ్యా..!నేను జానయ్యను.నిన్న మీరు మా పొళ్ళను జూడటానికచ్చిండ్రు.అన్నాడు.

యాదున్నది లేవయ్యా..!నెంబర్  నీ దానిలెక్కలేకుంటే గుర్తు పట్టలే.అయితమాయే గని,పోలగాడు నచ్చినట్టేగదా..!పెట్టుపోతలు,వరదచ్చిన ఎంతిచ్చుడు గిట్ల అనుకోను మాటముచ్చటకు ఎన్నడు రావాలే?అయ్యగారికి సూపిచ్చినవా?అని అడుగుతనే ఉండగా …

అయ్యా ..!ఇది నా ఫోను గాదు.నేను జేసింది గూడ అందుకు గాదు.ఇంకో ముఖ్యమైన ముచ్చటు న్నది.అంటుండగానే ,

ఇంతకంటె ఇంకా ముఖ్యమైన ముచ్చట ఏందయ్యా?నీకూ,నాకూ.నువ్వేమన్న పాలోనివా?పంపోనివా ?అంటున్న రాజయ్య మాటలు విని,ఈర్లచ్చిమి ఫోన్ అందుకొని ,

అయ్యా ..! మీరెవలు?ఏమిటికి జేసిండ్రు?అన్నది నిమ్మళంగా.

అమ్మా ..! నేను ..జానయ్యను.

అయ్యా ..! అంత మంచేగదా?అన్నది మర్యాదగా.

అంత మంచేగని,జరనన్నుసెప్పనియ్యున్డ్రి.అన్నాడు. 

అయ్యో ..!ఎంత మాట.సెప్పుండ్రన్న.అన్నది.

అన్నెందుకులే తల్లి ..! ఏమన్న ఇయ్యమందుకునేదున్నదా?అన్నాడు.

అయ్యో ..!గట్లనవడితివే?అందుకుంటేనే అన్నవ్ గని …లేకుంటే గాదానె?మాట వరుసకన్న గని ,ఏందో,ఇగ నువ్వే జెప్పు అన్నది.

నిన్న మీరు పొళ్ళను సూసిపోయినంక మేము సుత రేపీపాటికి ఫోన్ జేసి మాట ముచ్చటకు ఓ రోజు చూసి రమ్మందామనే అనుకున్నం…,కని,ఇప్పుడు అద్దనుకుంటానం.అన్నాడు.

ఈ మాటినంగానే ఈర్లచ్చిమికి నెత్తిన పిడుగు వడ్డట్టయింది.,

అదే ..,ఇప్పుడెందుకు వద్ధనుకుంటాండ్రు?అన్నది .

అది సెప్పాల్నంటే ముందుగాల మీ కొడుకేడున్నడో అది జెప్పుండ్రి….

మా కొడుకు …మాకొడుకు …అని ఆలోచిస్తున్నట్టుగా అనేసరికి ,

మీరు సెప్పలేరుగని,అని చెప్పబోతుండగా..రాజయ్య ఫోన్ గుంజుకొని ,

ఏందయ్య ..?ఎమో ..!మా లావు ప్రశ్నలేత్తానవ్?పోల్లనియ్యనోనివి వాడేడ బోతె నీకెందుకు?అని జానయ్య మీదికే కోపానికస్తుండగా..,ఈర్లచ్చిమి తీసుకోని …,

అయ్యా …!అయ్యా..!నీ తాన అబద్ధమెందుకుగని,మా వోడిట్ల లేడు. ఎటో బొయిండు.గని ,నువ్వు ఫోన్ జేసినా ముచ్చట జెప్పు.అవుతల నాకు ఏగిరమున్నది.అన్నది .

అమ్మా ..!అంతకన్నా ఏగిరంగా నువ్వొక్కదానివే మా ఊరికి రా..!మీ సైదులు దొర ఈడనే ఉన్నడు. అనంగనే ,

నా నెత్తిన పాలు పోసినవే.నీ కడుపు సల్లగుండ.వాడేడ బోయిండోనని రాత్తిరిలి కంటి మీద కునుకు లేక గలుమట్లనే కాపు కాసిన.వాని దగ్గర పైసలు సుత ఉన్నయో !లెవ్వో !జరంత నీ కొడుకసొంటో డనుకొని ఇటు తోలిచ్చే ఉపాయం జెయ్యే.నీ పైసలు నీకు ఎట్లనన్న ముట్ట జెప్త ,అన్నది ఈర్లచ్చిమి.                        

తాగి ఒళ్ళు తెల్వకుంట బాతెమ్మతి పడిపోయ్యేసొంటి కొడుకు నాకే ఉంటే ఈ పాటికి సంపి ఉప్పు పాతరేద్దును.ఎందుకమ్మ ?ఇసొంటోడు ?ఉసురు తియ్యటానికి కాకుంటే ?ఇంకా సక్కదనం సాలదని లగ్గం జేత్తనని తిరుగుతానావ్?నీ ఇంటికిచ్చేకంటే ఇంటెనుకబాయిలేసుకున్నది.నయ్యం,ఆడిపొళ్ళను.

నా పొల్ల రాత,నా రాత మంచిదాయేపట్టికే మీ వోని బాగోతమంత బైటవడ్డది.దేవుడు నా దిక్కుఉండపటికే సరిపోయిందిగని,లేకుంటే మీ మేర్మాను మాటలకు లొంగి పోయి సేసుకుంటే అగ్గిల బడ్డట్టే  ఉండు ..,అని అంటాంటే ఈర్లచ్చిమి కి కళ్ళళ్ళ కన్నీళ్ళ తోని చెరువులైనయ్.తల్లి గుండె కొడుకును అన్ని తీర్ల మాటలంటాంటే తట్టుకోలేక..అదే దుక్కం తోని ,

అయ్యా ..!నీ దండం బెడుత.నువ్వు తోలియ్యకుంటమాయేగని,ఇట్లాంటోడని గుచ్చి గుచ్చి సెప్పుకుంట సంపకు.నీ పొల్ల నచ్చినా ఇవరంగ చెప్పే చేద్దును గని,దాసి ఒడ్డేక్కాలనుకోలె.నేనేవత్త  ఇగుండు.,అన్నది ఫోన్ పెట్టేయ్యబోతు.

ఉన్న మాటంటే ఊర్లున్డనీయరన్నట్టు,ఎందుకమ్మ గంతగనంఇదయితున్నవ్?ఈడికే గింత గుంజుకుంటానవ్,ఇంక అసలు ముచ్చటఎరుకైతే ఇంకేమైతవో గని,ఒక్కదానివే రా…ఎన్కమల్ల మీ ఆయనను తీస్కరాకు. ఎంత తొందరగత్తే అంత మంచిది.అన్నాడు.

అయ్యోగట్లంటానవ్,పానానికేమన్న ఆపతాయ్య?అన్నది మరింత దుక్కం తోని.

లేదమ్మా..!గాబరాపడకు,గని రా.అని ఫోన్ పెట్టేసిండు.

రాజయ్య ఫోన్ తీసుకొని మళ్ళీ ఆ నెంబర్ కు చెయ్యబోయాడు.ఈర్లచ్చిమి వారించింది.ఏమిటికి జేత్తానవ్?ఇంటివిగదా?కొడుకని,మొగోడని,నీ బిశానేన్దని మాట్లాడనియ్యక,పోరన్ని ఆన్నే ఇడిసిపెట్టి వత్తె ,ఏంజేసిండో ,ఏం పాడో..!ఏగిరంగ రమ్మని సెప్పవట్టే.ఎంతటి మగోడైనా అప్పుడో..ఇప్పుడో ఆడోళ్ళమాట ఇనాలె.తల్లినైనందుకు ఎన్ని మాటలు ఇనవలసి వచ్చింది.ముక్కు మొగం తెల్వనోనితోటి ఎన్ని మాటలు ఇన్న.అని బాధ పడుకుంటనే బొడ్ల సంచి అందుకొని,పైకి చెక్కిన చీరచింగులు కిందికి విడిచి పెట్టి చెప్పులేసుకొని బైటికి వస్తుంటే,రాజయ్య..,

ఏడికే,ఒక్క దానివి పొయ్యేది?నేన్సుత వత్త,పా…!రావద్ధనటానికి వాడెవడు?ఏమన్న వాని తతగిన ముగ్గువోసి కట్టిండా?ఆ ఊరు?అనుకుంటూ దండెం మీది తువాలు తీసి భుజం పై వేసుకొని వెనుక రాసాగాడు.

అయ్యా..!నీ బాంచెను,నీ దయ గని,జరా నువ్వు ఈన్నేఉండు.ఆడ ఏమైందో నేను వోయి అర్సుకొని,వాన్నెంబడి వెట్టుకత్తగని,నువ్వచ్చి ఇంకింత యవ్వారం పాడు జెయ్యకు అన్నది.దండం బెట్టుకుంట.

ఏందే,,?నేనుబోవాల్సిన కాడికి నువ్వు పోతానని అనుడే కాకుంట,గాజులేసుకున్న ఆడదాని లెక్క ఇంట్ల గూసోనానే?కావాల్నంటే నువ్వుండు.అన్నాడు.

నీ పనితనం ఊరు దాటింది గనుకనే ఆ జానయ్య ఒక్కదానివే రామ్మా..!అన్నడు,ఆడికి.గందుకే పెద్దోళ్ళు తప్పుజెప్పలే.జారిన మాట,వేసిన బాణం ఎన్కకు రావని.మాట్లాడేటప్పుడే జాగర్తగ మాట్లాడాలని.అన్నది.

సరే,ఈ తాపకు నువ్వు చెప్పినట్టే ఇంట గని,పా..!ఏం జరిగిందో ఎందోనని నాకు మాత్రం లేదంటావె?ఆడ నేనేం మాట్లాడ.అక్కెరవడితే తప్ప.అన్నాడు.ఇంటికి తాళం వేసుకుంటూ.

ఈర్లచ్చిమి,భర్త రాజయ్య మాటలు కాదనలేకపోయింది.నిజమే కదా..!ఎంతైనా కన్నతండ్రే గదానుకొని ఇగ ఏం మాట్లడలే.

అట్లిట్ల బాటెంట అడిగెటోల్లందరికి,ఆ..ఊ..అనుకుంట ఏడికి అంటే,గీడికే అనుకుంట దాటేసుకుంట,దాటేసుకుంట వచ్చి,పిలిచినట్టే వచ్చిన బస్సు ఎక్కి కొంచే నిమ్మలపడ్డారు.

ఈడ వరయ్య,జానయ్య మీద కోపంచేశాడు.

ఏం మనిసివయ్య ?పొల్లనియ్యకుంటే ఇయ్యకపోయినవ్ గని,ఆడి మనిసి తోని,అండ్ల కన్నతల్లి తోని గాన్ని మాటలంటవా?తల్లి మనసెంత ఉసూరన్నదో..!అన్నాడు బాధపడుకుంటూ.

మల్ల,లేకున్టేందయ్యా ..!బండెడు .బండెడు .పొల్లగాళ్ళను కనంగానే సరా..!ఆళ్ళను బుద్ధిమంతుల లెక్క తయారు చెయ్యద్దా?ఇట్ల దేవునావోలె ఇడిసి పెడితే ఆళ్ళు చెడిందే కాక ,సుట్టుముట్టున్నోళ్ళను సుత పాడు జేత్తరు.ఇదే మాట రేప్పొద్దుగాల నా పిల్లలు తప్పు జేస్తే నన్నెవలన్నన్న బాజాప్తుగవడ్త.అన్నాడు జానయ్య.

వరయ్య,జానయ్యలు మాట్లాడుకుంటున్నదంతావింటున్న సైదులుకు కొంచెం లోపల బాధ లెక్కనే అనిపించింది.అన్నేమోగని,తన తల్లిని అంటే ఏ మాత్రం అస్సలు ఊరుకోలేడు.కానీ,ఇప్పుడున్న పరిస్థితి కాళ్ళు చేతులు ఇరగొట్టి కట్టేసినట్టున్నది.ఇంత నరకంగా ఉంటదా?తప్పుచేసినోన్నే కాక..,కన్నందుకు ఆళ్ళను కూడ కండ్ల ముంగట్నే ఎన్నడు మంచినీళ్ళు,ఉప్పునీళ్ళు పొయ్యనోడు,మాసిపోయిన బట్టసొంటోడు..గవాడు ..గవాడు ..గా ..జానయ్య గాదు మాట్లాడ్తడా..?అని లోపల కోపం తోని కుత కుతలాడుతాండు గని ,పైకి మాత్రం సైమం గాదని ఓపిక పడుతున్నాడు.సైదులు మనసు ఇట్లుంటే..,

జాజులమ్మకు ,

అయ్య లేశిండు గావచ్చును.ఇండ్లల్ల పనికి వోయిందని అనుకుంటాండేన్డాల.పుల్లలు వేట్టేతోలేవాలన్న ఈ పాటికే చెవులేసిన్డ్రో ..!ఏమో..!పోలయ్యకు పోంగ జెప్పకనన్నపోతిని.నాయనకు తెల్వనీయకని.నిప్పు గుప్పిట్ల దాత్తే దాగుతదా?ఎలుకలు బోనుల వడ్డట్టు మేం ఇద్దరం ఈడ ఇరుక్క పోతిమి.సూసేటోళ్ళకు కోతి కి కొబ్బరి చిప్ప దొరికిన లెక్కల్నేఉండే.పూజారి,పెద్దమనుసులు తప్ప ఎవ్వరు దొంగలను సూసినట్టు జూడవట్టిరి.పున్నానికి పోతే పాపం ఎదురాయే.నా కర్మ కొద్దీ సద్దామని బైల్దేరితే గిట్లాయింది గదా! ఏది జరిగినా మంచికనుకోవాలన్నట్టు సావు తప్పింది గని కన్ను లోట్టవాయె అన్నట్టాయే గదా!అని కుములుకుంట సైదులును చూసింది.

సైదులు,గింతాంత మొకం తోని దీనంగా చూస్తున్నట్టు అనిపించిందామెకు.మనిసి మంచోల్నెక్కనే ఉన్నాడు,లేకుంటే గిన్ని తీర్ల తలావోమాటంటాంటే ఉలుకుత  లేడు  పలుకుతలేడు. తాగుడు మీద మన్నువడ ..గదే గదా..!,పాపం ..ఈ మనిషిని,నన్ను ఇట్లా బజారు పాల్జేసింది.అయినా,గట్టిగ వీల్లందరినీ ఎదిరిచ్చి ఈనె దారిన ఈనె పోతే తల దీసి మొలేత్తరా?ఈయన సుత నా లెక్కల్నే కూసో పోతే నాల్గు మాటలు మాట్ల్లడచ్చుగదా!అనుకోసాగింది.

సైదులు అటిటు చూస్తూ ..జాజులమ్మ తననే చూస్తుండడంతో సిగ్గు తో తలదించుకున్నాడు.

పైసలు లేక ఇట్లున్ననన్న సంగతి ఆమెకు తెలిస్తే బాగుండు.ఆమె సుత ఎంత తిట్టికున్టాందో..!లోపల.వీని వల్లనే ఇట్లైన అని తల్లదిల్లుకుంట ఆమెను జూత్తే జాజులమ్మ ఇంకా ఆయననే చూస్తుండడంతో తల దిప్పుకున్నాడు.               

*****

ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.