యదార్థ గాథలు
ఆదర్శవంతమైన లలిత జీవితం
-దామరాజు నాగలక్ష్మి
లలితకి సంవత్సరం తిరక్కుండానే తల్లి జానకికి దూరంమయింది. ఏమీ తెలియని వయసు. తండ్రికి కుదురైన ఉద్యోగం లేదు. రకరకాల ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. జానకి మరణం తర్వాత లలితమ్మని తమ్ముడు రాముడికి అప్పచెప్పి తను ఎక్కడికి వెడుతున్నానో కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు.
లలితకి బాబాయి రాముడు, పిన్ని సరళ అమ్మానాన్నలయ్యారు. అప్పటికే వాళ్ళకి లీల, మాధవి, శ్రీదేవి అని ముగ్గురు ఆడపిల్లలు వుండేవారు. వాళ్ళతోపాటే లలిత అని పెంచారు. కాకపోతే చదివించడానికి వాళ్ళ ఆర్థిక స్తోమత అంతంతమాత్రమే. అక్కలదగ్గర పుస్తకాలు చదివేటంత చదువు నేర్చుకుంది. అందమైన లలితకి 15 సంవత్సరాల వయసు వచ్చేసరికి తన కన్నా 11 సంవత్సరాలు పెద్దవాడయిన గోపాలానికి ఇచ్చి పెళ్ళి చేశారు. సుబ్బారావు మంచితనానికి మారుపేరు. గోపాలం స్కూలు టీచరు. లలితని చాలా బాగా చూసుకునేవాడు. వీళ్ళకి ఇద్దరు మగ పిల్లల తర్వాత ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు.
లలిత ఖాళీ టైములో పుస్తకాలు చదవడం బాగా అలవాటు చేసుకుంది. ఇంకొకళ్ళతో గొడవ పెట్టుకునే అలవాటు లేదు. భర్త స్కూలు టీచర్ అవడంతో రకరకాల ఊళ్ళు తిరుగుతూ వుండేవారు. అందుకని ఎవరితోటీ అంత పరిచయాలు వుండేవి కావు. చివరికి చిత్తూరు దగ్గిర ఒక వూరు వచ్చారు. ఆ వూళ్ళో వుండగా గోపాలానికి ఉన్నట్టుండి కడుపు నెప్పి వచ్చి చాలా బాధపడ్డాడు. ఊళ్ళో వున్న ఆయుర్వేదం వైద్యులని సంప్రదించి ఇంటికి పిలిపించి మందు తయారు చేయించుకుని వాడేవాడు. అయినా ఏమాత్రం తగ్గలేదు.
పిల్లలు చిన్న పిల్లలు కావడంతో దగ్గిరలోనే వున్న గోపాలం తమ్ముడు ఈశ్వర్ కి అప్పచెప్పి, లలిత గోపాలాన్ని తీసుకుని వైద్యానికి పక్కవూరికి వెళ్ళింది. ఈశ్వర్ పిల్లలని తన ఇంట్లో పెట్టుకోకుండా వాళ్ళింట్లోనే వుంచి అప్పుడప్పుడు పలకరించేవాడు. పాపం పిల్లలు బిక్కు బిక్కుమంటూ వుండేవారు.
ఎన్ని వైద్యాలు చేయించినా గోపాలానికి ఆ జబ్బు తగ్గలేదు. ఇది కొన్ని సంవత్సరాల నాటి విషయం. అప్పట్లో వైద్యం సరిగా అభివృద్ధి కాలేదు. డాక్టర్లు ఏమీ చెయ్యలేక ఇంటికి పంపించేశారు. ఇంట్లోనే వైద్యం తీసుకుంటున్న గోపాలం చిన్న కొడుకు రవితో ఏదో చెప్పాలనుకుని చెప్తూ కన్నుమూశాడు. ఇక లలితకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. పిల్లలని తీసుకుని మళ్ళీ బాబాయి పంచన చేరింది. బాబాయి దగ్గరలోనే ఒక ఇల్లు చూసి పిల్లలలో పెద్దవాడైన వాసుకి, చిన్నవాడైన రవికి చిన్న చిన్న ఉద్యోగాలు చూపించాడు.
వాసు ఒక ప్రైవేటు కాలేజీలో ప్యూనుగా చేరాడు. అక్కడి వాళ్ళ సహకారంతో ఇంటరు, డిగ్రీ చదివాడు. మెల్లగా క్లర్క్ గా ప్రమోషన్ వచ్చింది. కాలేజీని కూడా ప్రభుత్వం తీసుకుంది. జీతం పెరిగింది.
రవికి కూడా ఒక పెద్ద ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అక్కడే కంప్యూటర్ మీద పనిచేయడం నేర్చుకున్నాడు. రవికి కూడా జీతం పెరిగింది.
పొద్దున్న వెళ్ళి రాత్రికి తిరిగి వచ్చి వాళ్ళు ఇచ్చిన డబ్బులతో లలిత సంసారం నడిపేది. తను ఖాళీగా వున్నప్పుడు విస్తరాకులు కుట్టి డబ్బులు సంపాదించేది. ఏ మాత్రం మానసిక అధైర్యాన్ని పొందేది కాదు. పిల్లలకి ధైర్యం చెబుతూ వుండేది. తోచనప్పుడు చిన్న కథల పుస్తకాలు చదువుకునేది.
అన్నదమ్ములు ఇద్దరూ కలిసి చెల్లెళ్ళకి పెళ్ళి చేశారు. మెల్లగా వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకుని సొంత ఇల్లు కట్టుకున్నారు. మొత్తానికి సంసారం ఒక దారిన పడింది.
కోడళ్ళు ఇద్దరూ అత్తగారిని తల్లిలా చూసుకునేవారు. తమకి తెలియని పనులన్నీ ఆవిడ దగ్గిర నేర్చుకున్నారు. లలిత కూడా కోడళ్ళని బాగా చూసుకునేది. ఈ రోజు అందరూ చాలా ఆనందంగా వున్నారు. లలితకి 90 సంవత్సరాలు దగ్గిరపడినా ఇంకా పుస్తకాలు చదువుతూనే వుంటుంది. ఎవరి విషయాల్లోనూ అతిగా కల్పించుకోక పోవడంతో లలితకి జీవితం సాఫీగా జరిగిపోతోంది. కోడళ్ళు కూడా ఇప్పటికీ లలితకి ఇష్టమైన పుస్తకాలు కొనిపెడుతుంటారు.
లలితలాంటి వారు ఎంతో ఆదర్శనీయులు అనిపిస్తుంది.
*****