రాగో
భాగం-9
– సాధన
రోజులు గడుస్తున్నయి. చూస్తుండగానే వర్షాకాలం రానే వచ్చింది.
ఓ రోజు రాత్రి చిమ్మచీకటి. కళ్ళు పొడుచుకు చూస్తున్నా ముందు నడుస్తున్న మనిషి ఎంత దూరంలో ఉన్నాడో కూడ తెలవడం లేదు. ముందు నడిచేవారు ఆగితే వెనుకవారు మీద పడి గుద్దుకుంటున్నారు. ముందుండే పైలట్స్ అద్దానికి చేయి అడ్డం పెట్టి టార్చిలైటు వేస్తే చిమ్మచీకట్లో అకస్మాత్తుగా కనపడే వెలుతురుకు కళ్ళు చిట్లించుకుంటూ వెనుక వారంతా గాభరాగా ముందువారి అడుగులో అడుగు లేస్తూ దగ్గరగా రావడానికి ప్రయత్నిస్తున్నారు దారిలో గుంతలు, బొందలుంటే అందులో కాలు దిగబడే వరకు తెలియనే తెలియదు. ఖర్మకాలి ఆ గుంత మరీ పెద్దదైతే అందులో పడి పళ్ళు విరిగినా విరుగుతాయి. ఒక్కోసారి కొన్ని పొక్కల్లో మొలబంటి దిగబడిపోయి డ్రెస్సు తడిసిపోతుంది. అందులో కొత్తవారైతే ఏడుపే తరువాయి. బండలు, మొద్దులు తగిలినా, కొయ్యకుచ్చినా, గుంతలు, బొందలు ఎదురైనా ముందు వారు కనీసం చెప్పరేమని ఉక్రోషం వస్తుంది. వారికి కూడ తగిలితే ఎందుకు చెప్పరనే ఆలోచన కూడ తట్టదు ఆ బాధలో. మన వాళ్ళు వినాయకుని బొడ్లో వేలు పెట్టిన చందంగా ఎన్నడూ చేయరనే ఆలోచన కూడ ఆ వేళకు రాదు.
దళంలో నడుస్తున్న జైనికి అంతా గందరగోళంగా ఉంది. తాను అడవిలోనే పుట్టి పెరిగింది. పద్దెనిమిదేళ్ళయి అడవిలోనే వెసుల్తుంది. అయినా ఇంత చీకటి రాత్రి అడవిలో, వర్షంలో రేఖ (నెత్తిపై పెట్టుకునే ఆకుల గొడుగు) లేకుండా నడవడం తనకు కొత్తే. చీకట్లో ఓ అగ్గి కొర్రాయి కూడ లేకుండా నడిచే అలవాటు ఆదివాసీలకు లేదు. దానికి తోడు భుజానికి తుపాకి, జబ్బలకి కిట్టు అవి గాక తలమించి మోకాళ్ళు వరకు విరిచి కట్టినట్టు మేన్ కప్ (వరకు) ఉండగా జైనికి సరిగా అడుగుపడడం లేదు. ఈ కష్టాలన్నీ ఉంటాయని మొదటి రోజే గిరిజక్క కమాండర్ చెప్పినా ‘అందరికీ లేని ఇబ్బంది నాకేముంది’ అనుకుంది తప్ప ఆనాడు అర్థం కాలేదు.
ఆలోచనలో పడ్డ జైనికి తోవ పై ధ్యాస తప్పింది. ఒరం (పొలం కట్ట)పై అందరూ ఒకరి వెనుకొకరు చాలా జాగ్రత్తగా అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నరు. ఏ కాస్తా పట్టు తప్పినా, ఎత్తయిన మడికట్టపై నుండి కింద బురదలో కూరుకుపోవడమే. సప్పున కాలు జారే వరకు జైనికి తెలియనే లేదు. దబ్బున పడ్డ జైని మోకాళ్ళ లోతుకు బురదలో దిగబడిపోయింది. పడిన చప్పుడు విన్న వెనుక, ముందు పైలట్స్ ఒకేసారి తమ చేతి లైట్లు వెలిగించేసరికి జైనిలో తెలియకుండానే సిగ్గు, బాధ, ఏడుపు ముందుకొచ్చాయి. అందరూ నవ్వేసరికి మరీ కుంచించుకుపోయింది. ముందు నడుస్తున్న రుషి లైటు వెలిగించి “ఎక్కడ ఆలోచించినవు బాయి” అని పలకరించేసరికి తల ఎత్తుకోలేనంత తప్పు చేసినట్టనిపించింది. “మనందరికి ఇది మామూలే” అంటు గిరిజ చేయి అందించి గట్టుమీదికి గుంజింది.
ఒక్కసారి గొల్లుమన్న దళంలో వెంటనే సానుభూతి మొదలైంది. ఆప్యాయంగా పరామర్శిస్తూ తలోమాట అంటున్నారు. వారి అనుభవాలు చెప్పుకొస్తున్నారు. తేరుకొన్న జైని అందరితో పాటుగా మళ్ళీ నడక ప్రారంభించింది.
దళం ప్రవర్తన జైనికి వింతగా తోస్తుంది. దళంలో ఉన్న పన్నెండు మంది ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు. ఎవరిలో ఏ కల్మషమూ కనపడదు. ఎవరు ఎక్కడివారో, ఎవరి భాష ఏమిటో, ఈ దళంలోకి ఎవరెవరు ఎలా వచ్చారో తెలియదు. కానీ అందరూ ఆప్యాయంగా కలసి మెలసి ఉంటారు. కల్లాకపటం లేకుండా మనసులోని మాట బయటకే అనేస్తారు. పొరపాటయితే వెంటనే సర్దుకుంటారు. ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదు. ముంచుకు వచ్చే ప్రమాదం ఎపుడూ పొంచే ఉంటుంది. చావు ఎపుడో, ఎలా ఎదురవుతుందో తెలియదు. ఏదైనా సరే తెలియ రాకుండా అకస్మాత్తుగా జరిగిపోతుంది. ఏమొచ్చినా దళం ఎదుర్కోక తప్పదు. అందుకే కావచ్చు అన్నలు ఏ బాధలు పట్టనట్టు ప్రతి క్షణమూ కులాసాగా నవ్వుతూ నవ్విస్తూ గడుపుతారు అనుకుంటూ నడుస్తుంది జైని.
దళం ఆగింది. కలియచూస్తే ఫర్లాంగు పెట్టులో పొలంలో ఖేతుల్ కనపడింది. ‘దూరపు కొండలు నునుపు’. దగ్గరికి వెళ్ళి చూస్తే గాని ఏ ఖేతుల్ అవతారం అయినా అర్థం కాదు. కొన్నిట్లో సూర్యచంద్రులు కాపురం చేస్తుంటారు. అక్కడక్కడ కొన్ని పగడ్బందీగా ఇల్లు లెక్కనే ఉంటాయి. గడ్డి దొరకడం ఇబ్బంది అవుతున్న కొద్దీ చాలా ఖేతులు కప్పకుండానే వదలివేస్తున్నారు. ఆర్థికంగా ఉన్న వారి ఖేతుల్లకు లేదా మాట చెల్లుబడి అయ్యేవారికి సర్కారీ వారి ప్రాపకంతో బెంగుళూరు పెంకలు అమరుతున్నాయి. దళంలో కొందరు వీటికి ‘శరణార్థి శిబిరాలు’ అని ముద్దు పేరు పెట్టారు. అకాల వర్గాల్లో ఆదుకుంటాయి కదా!
దగ్గరగా పోయి ఆ ఖేతుల్ హాలత్ చూస్తే బాగుండునని ఉంది జైనికి. కానీ కమాండర్ పదే పదే చెప్పే మాటలు గుర్తుకొచ్చి ఆ ఆలోచనను పక్కకు నెట్టేస్తాయి. “మన కోసం వెతికే వాళ్ళు ముందు ఊళ్ళో అడిగి వెంటనే ఖేతుల్ మీదే పడతారు. భేటీ అయితే (తారసపడితే) ప్రమాదం కోరి తెచ్చుకున్నట్టే. సెంట్రీ అలర్ట్ గా లేకపోతే తప్పుకోవడానికి కూడ అవకాశం దొరుకక గూళ్లో కోళ్ళను కమ్మినట్టు అవుతుంది మన పని. ఇవాళ ఖేతుల్ కి అలవాటుపడితే రేపు? ఇప్పటికే పోలీసులు ఇళ్ళు, ఊర్లు, ఖేతులు, పంట పొలాలు ధ్వంసం చేస్తూ, సొట్లు సోదిస్తున్నారని తూర్పు వార్తలు వింటున్నాం కదా! ఒకరి అనుభవాలు మనకు గుణ పాఠం కావాలి. రేపటి గడ్డు రోజులు ఎదుర్కోవడానికి ఇవాల్టి నుండి మనం సిద్ధం కావాలి” అంటూ కమాండర్ పదే పదే గుర్తు చేసే విషయాలు తేలిగ్గా తీసేయడానికి వీలులేదు. అందుకే దళంలో ‘శరణార్థి శిబిరం’ వైపు దృష్టి పోనివ్వరు.
రెండు రోజులుగా ముసురు టి.వి. పేషంటు దగ్గులా సతాయిస్తుంది. విడవకుండా తుంపర్లు, మధ్య మధ్య కాస్తా జోరుగా జల్లులు వస్తూ పోతున్నయి. దళం ఆగగానే రెండు కర్రలు ఎత్తుగా పేర్చి వాటి పై కిట్లు సర్దుతున్నాడు టుగె. వర్షం అధికం అయినా కిట్లు తడవకుండా ఏర్పాట్లు చేస్తున్నాడు. ఆ సర్దిన కిట్లపై, తన కిట్టులో నుండి పెద్ద మేన్ కప్ (వరకు) తీసి కప్పాడు. గాలికి లేవకుండా దానిపై నాలుగు బండలు, కర్రలు బరువు కూడ పెట్టారు. మిగతా వారందరూ ఎత్తుపల్లాలు చూసి ఎవరి స్థలం వారు సెట్ చేసుకుంటున్నారు. ఓపికున్నవారు నాలుగు కొమ్మలు విరిచి, వీపు కిందేసుకొని పట్టకుండా సర్దడం లేనిపోని గొడవ అని రుషి మాత్రం కటిక నేలపైనే తన పార్టీన్ షీటు వేసుకొని నడుంవాల్చాడు. పడుకున్నవారు కప్పుకున్న వరకు సరిచేయమని సెంట్రీకి పోబోతున్న గాండోను బతిమాలుతున్నారు. అప్పుడే గంట గడచిపోయింది. ఒంటి వేడికి పక్క వేడెక్కుతుందనగానే గాండో వచ్చి ‘నా డ్యూటీ అయిపోయింది లేవాలి కామ్రేడ్ మిస్కో’ అంటూ మిన్కో వద్ద నిలుచున్నాడు.
నిద్రలేవడంలో మిన్కో చాలా హుషారని దళంలో పేరు పడింది. ఆ గుర్తింపు ఒక గొప్పగానే ఫీలవుతారు. ఎందుకంటే దళాల్లో నిద్ర పెద్ద సమస్య. ఆదివాసీలు ఎప్పుడో తప్ప రాత్రి ఎనిమిదికే నిద్రపోతారు. ఒకోసారి రాత్రి చాలా సేపు ఎగిరినా పగలంతా నిద్రే. దళాల్లో అధిక శాతంలో ఉండే ఆదివాసీ సభ్యులు చాలా మంది ఇక్కడ నిద్ర సమస్యతో సతమతమవుతున్నారు. అందులో రెండవ డ్యూటీ సెంట్రీ మరీ ఇబ్బంది. నిద్ర పట్టకముందే లేపుతారు. కొందరిని నిద్రలేపితే ఆ మత్తులో ఏం చేసేవారో వాళ్ళకే తెలిసేదిగాదు. నిద్ర లేవడానికి పెట్టే యాతన, అయ్యే ఆలస్యం కూడా అంచనా వేసుకునే సెంట్రీ లేపడానికి టంచన్ గా వస్తారు. మిన్కోకు అయితే ఒక నిముషం చాలు. మిన్కో లేచి సెంట్రీ పోయింది. తెల్లారేసరికి ఆఖరి డ్యూటిలో మూర ఉన్నాడు.
మధ్యలో సెంట్రీకి లేవడానికి మూర మహా అవస్థ పడుతుంటాడు. కమాండర్ మినహా ఎవరు లేపినా మొండికేస్తాడు. చిన్ననాడే తల్లిదండ్రులు చనిపోవడంతో మూరకి ఆ పేరు ఖాయమయ్యింది. తెలంగాణా పల్లెల్లో పిల్లలు పుట్టి దక్కకుంటే, అడ్డమైన దేవుళ్ళకు మొక్కుతూ, దక్కిన పిల్లలకు మొండి, విస్తారి, పెంట, అక్కవ్వ అని పేర్లు పెట్టుకుంటారు. అలాగే ఇక్కడ తల్లి తండ్రి లేనివారిని మూర-మూరీ అంటారు. తొలిచూలు పిల్లలు దక్కని వారిని మయితుర్ తప్పె (మరణించిన శిశువు తండ్రి) అంటారు.
* * * * *
(ఇంకా ఉంది)
సాధన కమ్యూనిస్టు పార్టీ నాయకులు. తెలంగాణ రాష్ట్రలోని కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో జన్మించారు. అడవి కడుపులో ఆయుధంతో అనునిత్యం కత్తి అంచుమీద నడుస్తూనే మిగుల్చుకోవడానికి కాలం వ్యాకోచించదు కనుక క్రమశిక్షణకు లోబడి ఓవర్ టైం పనిచేసి సృజనశీలియైన సాధన రాసిన రెండో నవల రాగో. అడవిలో మనుషులుంటారని, ఆ మనుషులకు అభిమానాలు, అభిజాత్యాలు ఉంటాయని – ఆ మనుషులు, వాళ్ళ మధ్యన మరో ప్రపంచపు మనుషులు కలిసి అనురాగాల, అభిమానాల, ఆదర్శాల ఒక స్వాప్నిక ప్రపంచం కొరకు ఒక కఠోర సాయుధ పోరాటం చేస్తున్నారని సాధన నవలలు ‘సరిహద్దు’, ‘రాగో’ సాధికారికంగా ప్రతిఫలిస్తాయి.