షర్మిలాం “తరంగం”

వెంటాడే రుచులు

-షర్మిల కోనేరు 

గడిచిపోయిన క్షణాలు జ్ఞాపకాలై ఎప్పుడూ మనవెంటే వుంటాయి.
అవి తలుచుకుంటే బడికెళ్ళేటప్పుడు అమ్మ ఇచ్చిన భోజనం క్యారేజీలా కమ్మగా వుంటాయి.
స్కూళ్ళకి వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళే భోజనం క్యారేజీలు గొప్ప సామ్యవాదం నేర్పేవి.
పేదాగొప్పా తేడాల్లేని స్కూల్ రోజులవి.
స్కూల్ లంచ్ బెల్ మోగగానే బిలబిల లాడుతూ బయటికి వచ్చి డైనింగ్ హాల్ కి. వెళ్ళి బుద్దిగా మేం రోజూ కూర్చునే స్థలాల దగ్గర నేప్కిన్ లు పరుచుకుని కూర్చునే వాళ్ళం.
స్వర్ణలత, ఫాతిమా, వాసంతి, సుధ,మాధవి,పద్మజ,నేనూ ఒక దగ్గర .
ఒక్కో క్యారేజీది ఒక్కో రుచి.
వాసంతి తెచ్చే ఎండు చేపల కూర , సుధా మాధవీల పప్పు , మా అమ్మ చేసే బెండకాయ వేపుడు , ఫాతిమా తెచ్చే పచ్చడి అన్నీ అందరం తలో కొంచం రుచి చూస్తూ తినేవాళ్ళం.
నిజంగా వీళ్ళల్లో వాసంతి మళ్ళీ కనిపించింది గానీ ఇంకెవరూ ఇప్పటికీ కనిపించలేదు.
కానీ వాళ్ళతో పంచుకున్న భోజనం గుర్తొస్తే కడుపు నిండినట్టుంటుంది.
కాస్త పెద్దయ్యాక ఇంటర్లో కాలేజీకి ఇంటికి దూరమని అమ్మ మనిషితో మూడు గిన్నెల క్యారేజీ పంపేది.
కాలేజీకి దగ్గరలో వున్న ఒక ఆంటీ ఇంట్లో తినేవాళ్ళం.
మా అమ్మ లేత అరటి గెల కోయించి చేసే అరటికాయ వేపుడు, బెల్లం వేసి చేసే చింతపండు చారు తింటూ లొట్టలేసే నన్ను విచిత్రంగా చూసేది ఆవిడ.
“ఏదో కోడికూర తిన్నట్టు సంబరంగా తింటుందేంటి !” అని నా స్నేహితుల దగ్గర వెటకారం చేసేది.
ఆ వెటకారం సంగతి ఏమో గానీ మా అమ్మ మమకారం కలిపి చేసేదో ఏంటో గానీ …నన్ను ఆ రుచి వెంటాడుతూనే వుంటుంది.
ఇక ఉద్యోగం చేసేటప్పుడు వార్త ఆఫీసులో రాత్రి డిన్నర్ అందరం కలిపి కూర్చుని తినేవాళ్ళం.
మా పని వత్తిడిలో ఆ అరగంట మాకు వరం.
మా ఆఫీసులో పై అంతస్తు ఖాళీగా టేబుల్స్ కుర్చీలు వేసి వుండేవి.
రాత్రుళ్ళు వేరే ఊళ్ళ నుంచి వచ్చిన ఫీల్డ్ సిబ్బంది కొన్ని టేబుల్స్ మీద నిద్ర పోయేవారు.
9 గంటలకి మా జిల్లా ఎడిషన్ల నుంచి వచ్చే వార్తల ఉధృతి తగ్గినాకా భోజనాలకి బయల్దేరే వాళ్ళం.
కొందరు అప్పటికే తినేసి వచ్చే ఏకాకి బ్యాచ్ లు కింద డెస్క్ పనులు చూసుకునేవారు.
రాజేశ్వరరావు గారు , శ్రావణ్ గారు , నేనూ, సుగుణ, సిద్ధు, నరసింహ మూర్తి భోజనాలకి కూర్చునే వాళ్ళం.
ఇవటూరి రాజేశ్వరరావు క్యారేజీ విప్పి పైన చిన్న గిన్ని నిండా నూనె కలిపి తెచ్చిన కంది పొడి తీసేవారు.
అది ఓ అంత తీసుకుని అన్నంలో కలిపి తింటే ఆ రుచి ఎక్కడికో తీసికెళ్ళిపోయేది.
మా సుగుణ వాళ్ళ పెద్దమ్మ చేసే పకోడీల పులుసు పరమాద్భుతం.
శ్రావణ్ వాళ్ళ ఆవిడ ఏం చేసినా బ్రహ్మాండం.
నరసిమ్హమూర్తి మూర్తి టమాటా బరబాటీ కూర తింటారా ? అని మొహమాటంగా అడిగితే అదీ కాస్త వేసుకుని “బాగుందండీ “అని కబుర్లు కూడా కాసిని కలుపుకుని కమ్మగా తినే వాళ్ళం.
ఇప్పుడు అవన్నీ గుర్తొస్తే నోట్లో కాదు కంట్లో నీళ్ళూరతాయి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.