“నెచ్చెలి”మాట 

ఉగాదులు-ఉషస్సులు

-డా|| కె.గీత 

హయ్యో ఈ 2021 ఉగాదికి ఎన్నెన్ని సమస్యలు!!

అలా వీథులంట పోయే పిల్లలెవరినైనా కాస్త చెట్టెక్కి వేపపూత దులపమందావంటే ఈ కరోనా ఒకటి వచ్చి చచ్చింది! 

ప్చ్! ఈ సంవత్సరం ఉగాది పచ్చట్లోకి కనీసం ఎండు వేపపువ్వయినా  దొరుకుతుందో లేదో! 

మామిడికాయలు వర్షాలకి పూతరాలి ప్రియమయ్యాయి

వేపిన సెనగ పప్పు వరదలకి ముక్కిపోయింది 

హెన్నెన్ని బాధలు!!! 

ఇంకెక్కడి ఉగాదీ- 

ఓ పక్క అప్పుడప్పుడూ మెడకి ముసుగు తగిలించుకున్నా ఇంకా రోజూ చస్తా ఉంటే!

గుర్తొచ్చినపుడు సబ్బెట్టి చేతులు కడిగినా కరోనా చావనిదే!

హయ్యో-

ఆరంగుళాల దూరం పాటిస్తూనే ఉన్నాం 

ఒకళ్ళ మీదొకళ్ళు పడుతూ లేస్తూ గుళ్ళకి గోపురాలకి తిరుగుతూనే ఉన్నాం 

అయినా 

ఏవీ తగ్గనిదే- 

టీకా వేయించుకుంటే కన్నూమిన్నూ గానకుండా జొరం వస్తా ఉందట  

సెకండ్ సర్జ్, థర్డ్ సర్జ్… వందో సర్జ్ అయినా సరే 

టీకా వేయించుకుని చచ్చేది లేదు 

అయ్యో! 

ఎన్నెన్ని బాధలు పాపం!!!

ఉగాది మాటలాఉంచండి- 

ఇన్నేసి బాధలున్నా 

అడుగడుగునా గండాలున్నా 

భూమ్మీద మనుషులం 

బతికి బట్టకడుతున్నాం కదా 

అంగారకుడి మీదా యంత్రాలతో 

ప్రయోగాలు చేస్తున్నాం కదా 

అయినా ఉషస్సు లేకపోవడం ఏవిటి?

ఇంకా ఈ ప్రపంచంలో అణచివేతలేవిటి? 

ప్రపంచాన్ని శాసించగలిగీ ఆవేశపూరిత నిర్ణయాలేవిటి?

జీవించడానికి ఒక్క చిన్న అర్థం కనబడకపోవడం ఏవిటి?

దీపాళీ చవాన్ లు ఏవిటి?

ఏ రోజు మనం జీవనసార్ధకత్వాన్ని అర్థం చేసుకుంటామో అదే ఉగాది-

ఏది మనల్ని చైతన్యవంతం చేస్తుందో అదే ఉషస్సు – 

*****

Please follow and like us:

2 thoughts on “సంపాదకీయం-ఏప్రిల్, 2021”

  1. ఏది మనని చైతన్యవంతం చేస్తుందో అదే ఉషస్సు. అంతే. అదే ప్రధానం

Leave a Reply

Your email address will not be published.