అనుసృజన
నిర్మల
(భాగం-16)
అనుసృజన:ఆర్. శాంతసుందరి
హిందీ మూలం: ప్రేమ్ చంద్
కాలం గడుస్తోంది.ఒక నెలరోజులు గడిచినా తోతారామ్ వెనక్కి రాలేదు.ఆయన రాకపోతే ఎలా అనే విచారం నిర్మలని ఇరవైనాలుగ్గంటలూ పట్టి పీడిస్తోంది.ఆయన ఎలా ఉన్నాడో, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో,ఆరోగ్యం బాగుందో లేదో అన్న ఆలోచనే లేదామెకి.తన గురించీ,అంతకన్నా ఎక్కువ తన కూతురి గురించే ఆందోళన ఆమెకి.ఇల్లెలా గడుస్తుంది?జీవితం గట్టెక్కేదెలా? పిల్ల భవిష్యత్తు మాటేమిటి? పైసా పైసా జోడించి దాచిన కాస్తంత డబ్బూ కొద్ది కొద్దిగా కరిగిపోతోంది!ఒక్కొక్క రూపాయీ ఖర్చు పెడుతూంటే నిర్మలకి తన ఒంట్లోని రక్తం ధారపోస్తున్నంత బాధ కలుగుతుంది.చేసేదేమీ లేక భర్తని తిట్టుకుంటుంది.కూతురు ఎందుకైనా ఏడిస్తే, పాపిష్టిదానా, శనిగ్రహంలా దాపురించావు ! అని కసురుకుంటుంది.అంతే కాదు,రుక్మిణి ఇంట్లో ఉండటం భరించలేకపోతోంది.మనసు రగిలిపోతూ ఉంటే మాటలు కూడా నిప్పురవ్వలు చిందిస్తాయి !
ఒకప్పుడు నిర్మల చాలా తెయ్యగా మాట్లాడేది.కానీ ఇప్పుడు గయ్యాళిలా తయారైంది.నోరు తెరిస్తే తిట్లూ,శాపనార్థాలూ.ఆమె మాటల్లో మృదుత్వం ఎక్కడ మాయమైందో ! పనిమనిషి చాలా సహనం ఉన్న మనిషి.ఎన్నో ఏళ్ళుగా ఆ ఇంటినే అంటిపెట్టుకున్న మనిషి.అలాంటిది రోజూ నిర్మల తిట్టే తిట్లు,సణుగుడూ భరించలేక పని మానేసి వెళ్ళిపోయింది.నిర్మల తన కూతుర్ని ప్రాణంగా భావించేది.ప్రస్తుతం దానిమీద విసుక్కోవటం, కసరటం, ఒక్కోసారి చెయ్యిచేసుకోవటం కూడా మొదలెట్టింది.కూతురిమీద ఆమెకి ద్వేషం ఉందేమో అన్నంతగా ఆ చిన్నారిని బాధపెట్టసాగింది.అది బావురుమంటూ ఏడుస్తూంటే రుక్మిణి తన ఒడిలోకి తీసుకుని, బుజ్జగించి ఏడుపు మాన్పించేది.ఆ పాపకి ఆవిడ దగ్గర మాత్రమే ప్రేమ దొరికేది.
ప్రస్తుతం నిర్మలకి నచ్చేది ఒకటే,సుధతో కబుర్లు చెప్పటం.పరిచయంగా మొదలైనది కాలంతో పాటు గాఢమైన స్నేహంగా మారింది.ఆమెని కలిసేందుకు అవకాశం కోసం చూస్తూ ఉంటుంది నిర్మల.సుధతో మాట్లాడుతూంటే తను కూడా ఒక మనిషినే అనిపిస్తుంది నిర్మలకి.ఆ కాసేపూ తన కష్టాలన్నీ మర్చిపోతుంది…తాగుబోతుకి తాగితే కలిగే సుఖం లాంటిదే.సుధ ఇంట్లో ఆమెని చూసినవాళ్ళు నిర్మలని ఆమె ఇంట్లో చూస్తే గుర్తుపట్తరు.అంతగా మారిపోతుందామె.ఎప్పుడూ విసుక్కుంటూ,కసురుతూ,అరుస్తూ ఉండే నిర్మలకీ సుధతో నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పే నిర్మలకీ పోలికే ఉండదు !సుధ దగ్గరకెళ్ళేప్పుడు చక్కగా అలంకరించుకుంటుంది.పొరపాటున కూడా తన కష్టాల ప్రసక్తి తీసుకురాదు,కనీళ్ళు కార్చదు.సుధ దగ్గరకి నవ్వుతూ గడిపేందుకే వస్తుందామె.
కానీ పాపం ఆమె నొసట్న ఆ కాస్త సంతోషం కూడా రాసిపెట్టినట్టు లేడు ఆ బ్రహ్మదేవుడు.మామూలుగా మధ్యాన్నమో, చీకటి పడేలోపునో వచ్చే నిర్మలకి ఆ రోజెందుకో మనసంతా చికాగ్గా ఉండి ,పొద్దున్నే సుధని చూడాలనిపించింది.ఆమె సుధ ఇంటికి చేరుకునేసరికి అక్కడ సుధ లేదు.లోపలెక్కడో పనిలో ఉండి ఉంటుందనుకుంది.నిర్మల చనువుగా సుధ గదిలోకి వెళ్ళి కూర్చుంది.కొంతసేపు ఎదురుచూసింది.సుధ ఇంకా రాకపోయేసరికి గూట్లో ఉన్న పత్రిక తీసుకుని, మంచం మీద వాలి పేజీలు తిరగెయ్యసాగింది.ఇంతలో డాక్టర్ ఏదో పనిమీద ఆ గదిలోకొచ్చాడు.తన కళ్ళజోడు కోసం వెతుకుతూ అక్కడికొచ్చిన ఆయనకి మంచం మీద నిర్మల కనపడింది.నిర్మల ఆయన్ని చూసి ఉలిక్కిపడి లేచి కూర్చుని తలమీద కొంగు కప్పుకుంటూ మంచం మీంచి దిగి నిలబడింది.ఆయన గుమ్మం బైటికి వెళ్ళి, ” క్షమించు నిర్మలా, నువ్విక్కడున్నావని నాకు తెలీదు. నా గదిలో కళ్ళజోడు కనిపించలేదు.ఇక్కడ పెట్టి మర్చిపోయానేమోనని వచ్చాను,”అన్నాడు.
నిర్మల మంచం తలవైపున్న గూటికేసి చూసింది.కళ్ళజోడు పెట్టె కనబడింది.దాన్ని తీసి తలవంచుకుని, సంకోచిస్తూ అతని చేతికిచ్చింది.అతను ఆమెని ఇంతక్రితం ఒకటి రెండు సార్లు చూశాడు.కానీ ఇప్పుడు అతని మనసులో కలుగుతున్న అలజడి మునుపెన్నడూ కలగలేదు.మనసులో ఇన్నేళ్ళుగా దాచుకున్న జ్వాల ఒక్కసారిగా ఎగసిపడింది.కళ్ళజోడు కోసం అతను జాపిన చెయ్యి సన్నగా వణకసాగింది.కళ్ళజోడు తీసుకున్నాక కూడా అతను బైటికి పోలేదు.నిర్మలకి గాభరా వేసి,”సుధ ఏదీ,కనిపించదేం?” అంది.
“తను నదీస్నానానికి వెళ్ళింది.వచ్చేస్తుంది.”అన్నాడే కాని అక్కణ్ణించి కదల్లేదు.
“ఎప్పుడొస్తుంది?” అంది నిర్మల.
“ఈ పాటికి దారిలో ఉంటుంది,” అన్నాడు డాక్టర్ నేలవైపు చూస్తూ.
అతనింకా కదలకపోవటం చూసి ,” అట్నించటే ఎక్కడికైనా వెళ్ళిందేమో.నేనిక వెళ్తాను,”అంది నిర్మల.
డాక్టర్ తలెత్తి ఆమెకేసి చూస్తూ ప్రేమ ఉట్టిపడే గొంతుతో,”వెళ్ళద్దు నిర్మలా.ఆమె వచ్చేస్తుంది.రోజూ సుధ కోసం వచ్చి కూర్చుంటావు.ఈరోజు నాకోసం ఉండు.ఎప్పటివరకూ ఈ బాధలో కాలిపోమంటావు? నిజం చెపుతున్నాను నిర్మలా…”
ఆపైన ఏమీ వినలేదామె.నేలంతా గిర్రున తిరుగుతున్నట్టనిపించింది.శాలువా కప్పుకుని త్వర త్వరగా అక్కణ్ణించి బైటికెళ్ళిపోయింది.ఆమెని ఆపే ధైర్యం లేక డాక్టర్ ఏడుపు మొహంతో చూస్తూ ఉండిపోయాడు.
వీధిగుమ్మం దగ్గరకి రాగానె సుధ టాంగా దిగుతూ కనిపించింది కానీ నిర్మల ఆమెని పలకరించకుండా పరిగెత్తినట్టు బైటికి నడిచింది.సుధ నివ్వెరపోయింది. నిర్మల ఎందుకలా వెళ్ళిపోయిందో అర్థం కాక తెల్లబోయింది.లోపలికెళ్ళి భర్తని అడిగింది,”నిర్మల ఎందుకలా వెళ్ళిపోయింది? ఎవరైనా ఏమన్నా అన్నారా?”
“లేదే?” అన్నాడతను.
“ఈ గదిలోకొచ్చిందా?”
“ఆఁ, వచ్చింది,”అన్నాడతను జంకుతూ.
“అయితే మీరిక్కడ ఉన్నారని వెళ్ళిపోయుంటుంది. అయినా మీరేమైన అన్నారా ఆమెని?”
అతని గుండె గుబగుబలాడింది,”నేనెందుకంటాను సుధా?అంత బైతునా?”
“తను గదిలోకి రావటం చూసి కూడా మీరు బైటికెందుకెళ్ళలేదు?”
*****
(ఇంకాఉంది)