“ఉమ్రావ్ జాన్ అదా”

   -పి.జ్యోతి

ఉర్దూ లో రాయబడిన మొదటి నవల తెలుగు అనువాదం “ఉమ్రావ్ జాన్ అదా”

“ఉమ్రావ్ జాన్ అదా” ఉర్దూ భాషలో రాసిన మొదటి నవల. దీని రచయిత మిర్జా హాదీ రుస్వా. ఈ నవల మొదట 1899 లో ప్రచురించబడింది. లక్నో లో పందొమ్మిదవ శతాబ్దపు మొదట్లో జీవించిన ఉమ్రావ్ జాన్ అనే ఒక వేశ్య జీవిత కథ ఇది. పాకిస్తాన్, భారత్ రెండు దేశాలలో కూడా చాలా మంది ఉర్దూ భాషీయులు ఇష్టపడి చదివిన నవల ఇది. దీన్నిఇప్పటిదాకా నాలుగు సార్లు హిందీ భాషలో సినిమాగా తీసారంటే ఈ నవల కున్న పేరు అర్ధం అవుతుంది. ఎన్నో చోట్ల స్టేజీ నాటకంగా కూడా ఇది ప్రదర్శింపబడింది. నిజ జీవిత కథ ఆధారంగానే ఈ నవల రాయబడింది అని చెప్తారు. అయితే ఈ నవల ఇంత పేరు సంపాదించుకోవడానికి కారణం, ఇది ఉత్తమ పురుషలో రాయబడడం. రచయిత ఒక ముషాయిరాలో ఉమ్రావ్ ను కలిసి ఆమె జీవిత కథ తెలుసుకోవాలనే ఉత్సాహాన్ని చూపితే ఉమ్రావ్ అతనికి తన కథ వినిపించిందట. ఈ నవల కూడా అదే పద్దతిలో రచయితకి ఉమ్రావ్ కథ చెబుతున్నట్లుగానే రాసారు.

గతి తప్పిన స్త్రీ జీవితం గురించి తెలుసుకోవాలని సమాజానికి ఎంతో ఆసక్తి. ఆ స్త్రీ అనుభవాలు వినాలని అందరూ కోరుకుంటారు. సహజమైన అటువంటి ఆసక్తే ఈ కథ ప్రాముఖ్యతకు మరో కారణం కావచ్చు. ఈ పుస్తకాన్ని ఇప్పుడు చర్చించుకోవడం ఎందుకు అన్న ప్రశ్న అనవసరం. ఎందుకంటే బజారులో స్త్రీ శరీరంతో వ్యాపారం చేసే సంస్కృతి ఈ రోజుల్లో కూడా ఉంది. అయితే  మనం గమనించవలసింది, ఆ రోజుల్లో ఒక వ్యవస్థగా ఈ విధానం ఉన్నప్పుడు స్త్రీకి కొంత రక్షణ ఉండేది. దేవదాసీలు, జోగినీలు ఈ రోజుల్లో వేశ్యల కన్నా కొంత రక్షణ ఉన్న వ్యవస్థలో జీవించారు. స్త్రీ తో జరిగే వ్యాపారాన్ని మన ఆధునిక సమాజం నిర్మూలించలేకపోయింది. పైగా ఇప్పుడు ఆ వ్యాపార పరిధి పెరిగింది. కాని నాగరిత, నైతికత పేరుతో వచ్చిన చట్టాలు అ వృత్తి చేసుకునే స్త్రీల కున్న అప్పటి కనీస రక్షణను కూడా లేకుండా చేసాయి. సమస్యను పరిష్కరించాలి అంటే దాని మూలాలలోకి వెళ్ళాలి. అది ఈ సమస్య పట్ల జరగలేదు కాబట్టే ఈ రోజుకీ వేశ్యావృత్తి నడుస్తూనే ఉన్నా వేశ్యల పరిస్థితి అప్పటి కన్నా అత్యంగ హీనమైన స్థితిలో ఉంది. ఆ వృత్తిని నిర్మూలించలేకపోవడం వెనుక ఎన్నో కారణాలున్నాయి. ఆ మూల కారణాల మీద పని చేసే వారే లేరు కాని అ పేరుతో వచ్చిన అన్ని సంస్కరణలు ఆ స్త్రీల జీవితాలను ఇంకా అద్వానం చేసినవే.

దేవదాసి వృత్తి లాగే ఉత్తర భారతదేశంలో తవాయిఫ్ లు ఉండేవారు. వీరిలోకొందరు ఈ వృత్తి వారసత్వంగా స్వీకరిస్తే మరి కొంత మంది బలవంతంగా ఇందులోకి ఈడ్చబడ్డారు. అయితే వీరు కేవలం వేశ్యలుగా జీవించలేదు. సంగీత నృత్య, రచన లలో ఆరి తేరారు. ఒక అమ్మాయిని తవాయిఫ్ గా చేయాలంటే కొన్ని సంవత్సరాలు పట్టేది. వారికి ఎన్నో విషయాలు నేర్పించేవారు. పాట, ఆట, చిత్రలేఖనం, కవిత్వం, ఇన్నిటిలో ధీటూగా తయారు చేయించి వారిని నాట్యగత్తెలుగా మార్చేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే అది ఒక వృత్తిగానే భావించి ఆ వృత్తి కోసం వారిని తీర్చిదిద్దేవారు. అందుకే అప్పట్లో ప్రతి ధనవంతుని పెళ్ళిలో శుభకార్యాలలో వీరి ఆటా పాటా ఉండేవి. చాలా హోదాతో వారు జీవించేవారు. సమాజంలో వివాహిత స్త్రీల హోదా వీరికి లేకపోయినా, వీరికి డబ్బు, రక్షణకు లోటు ఉండేది కాదు. వయసు ఉడిగిపోయిన తరువాత వీరి స్థితి హీనమయిన సందర్భాలున్నా అవి వీరు డబ్బును నిలుపుకోలేకపోవడం వలన జరిగేవి. వీరి వద్దకు వచ్చే విటులు కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు వీరితో కలిసి జీవించే వారు. సంగీత, నాట్య, రచనా పోటీలలో వీరు పాల్గొని, తమ విద్వత్తుతో గౌరవం కూడా పొందేవారు. కొన్ని దశాబ్దాల పాటు లలితకళలు వీరి కారణంగానే బ్రతికాయని చెప్పవచ్చు. పాట, ఆట అంటే ఇప్పట్లోలా చిల్లరగా ఉండేవి కాదు. కళాత్మకంగా చాలా ఉన్నతమైన స్థాయిలో వీరి ప్రదర్శనలు ఉండేవి. అంత విద్వత్తు కూడా వారు తమ జీవితకాలంలో సంపాదించేవారు. దాని కోసం శ్రమించేవారు. మన దక్షిణభారతంలో త్యాగయ్య కృతులకు అమరత్వం తీసుకువచ్చినది బెంగుళూరు నాగరత్నమ్మ అన్న ఒక దేవదాసీ అన్నది మర్చిపోవద్ధు.

వీరు నగరంలో ఒక ముఖ్య భాగంలో జీవించేవారు. భోగభాగ్యాలతో వారి వీధులు నిండి ఉండేవి. అయితే క్రమంగా ఆ వ్యవస్థల పై  నిషేధం వచ్చిన కారణంగా వేశ్యలు సమాజంలో కోల్పోయింది ఆ ఉన్నతమైన జీవితాన్ని. వారిని ప్రతివారికీ అందుబాటులోకి తెచ్చి, ప్రతి రోజు కొత్త విటుడి కోసం వెతుక్కోవలసిన పరిస్థితి వారికి కల్పించి ఎన్నో కొత్త సమస్యలు ఆధునిక జీవితంలో సృష్టించబడ్డాయి. ఇక్కడ నేను వేశ్యా వృత్తిని సమర్ధిస్తూ, తవాయిఫ్ ల జీవితాలన్నీ గొప్పవి అని చెప్పడం కోసం ఇది రాయట్లేదు. వేశ్యావృత్తి దోపిడి సమాజ సృష్టి. అయితే ఆ దోపిడిలో కూడా ఒకనాడు వారికున్న రక్షణ, ఆదరణ నేడు లేకుండా పోయిందని గమనించమంటున్నాను.  వేశ్యా వృత్తి మాత్రం ఇప్పటికీ నడుస్తూనే ఉంది. ఒక వర్గపు మగవారికి మాత్రమే అందుబాటులో ఉన్న స్త్రీ ఇప్పుడు ప్రతి మగాడి సొత్తుగా మారి మరింత దోపిడికి గురి అవుతున్నదన్న సంగతి గుర్తించాలి.

ఈ నవలలో ఉమ్రావ్ తన జీవితం గురించి చెబుతూ పరిస్తితులు ఒక స్త్రీ ని ఎలా బజారు దానిలా తయారు చేస్తాయో, తన రక్షణ కు ఆమె ఎలా తనను తాను పరిస్థితులకు అనుకూలంగా మరల్చుకుంటుందో  తన కథ ద్వారా చెబుతుంది. ఫైజాబాద్లో ఒక మధ్యతరగతి ఇంట జన్మిస్తుంది ఉమ్రావ్. ఆమె తల్లి తండ్రులు పెట్టిన పేరు అమీరన్. తండ్రి సిపాయి. ఇంటి పక్కన ఉండే ఒక దొంగ దిలావర్ ఖాన్ చట్టానికి పట్టుపడితే అతన్ని గుర్తించి, అతనో దొంగ అని సాక్ష్యం చెబుతాడు అమీరన్ తండ్రి. అప్పటికే ఆ నాటి సాంప్రదాయం ప్రకారం అమీరన్ పెళ్ళి నిశ్చయిస్తాడు తండ్రి. పెళ్ళి చాలా గొప్పగా చేయాలని అతని కోరిక. పగతో రగిలిపోతున్న దిలావర్ ఖాన్ అమీరన్ ను తస్కరిస్తాడు. బలవంతంగా బండి పైకి ఎక్కించుకుని మరొక దొంగ సహాయంతో లక్నో తీసుకువస్తాడు. ఆమెను ఒక ఇంట్లో బంధిస్తాడు. ఆమెలాగే రామ్ దాయి అన్న మరో అమ్మాయినీ తీసుకువస్తారు. రామ్ దాయి చాలా అందమైనది. ఒక డబ్బున్న నవాబు గారి భార్య ఎక్కువ డబ్బు ఇచ్చి రామ్ దాయిని కొంటుంది. అమీరన్ అంత అందమైన పిల్ల కాదు. ఆమెను నూట యాభై రూపాయలిచ్చి  ఖానుమ్ జాన్ అనే ఒక వేశ్య కొనుక్కుంటుంది. ఖానుమ్ లక్నౌ లో ఒక పెద్ద పేరున్న వేశ్య. ఇప్పుడు తన క్రింద కొందరి వేశ్యలకు తర్ఫీదు ఇచ్చి ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటుంది. ఆమె ఇల్లు చాలా పెద్దది. భోగభాగ్యాలలో నిండి ఉంటుంది. ఆమెకు ఇద్దరు కూతుళ్ళూ. వారితో పాటు అమీరన్ కూడా పెరుగుతుంది. ఆమె పేరు ఉమ్రావ్ గా మారుస్తారు. అక్కడే ఉన్న మరో వేశ్య ఉమ్రావ్ ను పెంచుతుంది. తల్లిలా ప్రేమగా చూసుకుంటుంది.

అయితే బయట సమాజంలో ఆడపిల్లలు, ఇక్కడి ఆడపిల్లలకు చాలా విషయాలలో తేడాలున్నాయి. ఉమ్రావ్ కు సంగీతం, నాట్యం, రచన, చదువు, ఇవన్ని నేర్చుకోవడానికి గురువులను నియమిస్తుంది ఖానుమ్.  మొదటి నుండి అన్ని లలితకళలో ఆసక్తి చూపి శ్రద్ద పెట్టి నేర్చుకుంటుంది ఉమ్రావ్. ఖానుమ్ కూడా సంగీతంలో అఖండురాలు. ఆమె నియమించిన గురువుల మధ్య కళల పట్ల ఆరాధనతో పెరుగుతుంది ఉమ్రావ్. లలితకళలతో పాటు మగవారిని ఆకర్షించి వారి ద్వార ధనాన్ని సంపాదించే విద్యలో కూడా ప్రావీణ్యం సాధిస్తారు ఈ తవాయిప్ లు. ఆ వాతావరణంలో పెరిగి ఉమ్రావ్ తాను కూడా పేరు సంపాదించికోవాలని ఆ కళలన్ని నేర్చుకుంటుంది. మగవారిని ఆకర్షించడానికి ప్రేమ నటించడం, ఆ నటనలో జీవించడం, వారి వద్ధ గొప్ప విలువైన బహుమతులు అందుకుని ఖానుమ్ కు కూడా తెలియకుండా భద్రపరుచుకోవడం లో ఉమ్రావ్ ఆరితేరుతుంది. 

ఖానుమ్ ఉమ్రావ్ కు జోడి నిర్ధారించే ముందే ఉమ్రావ్ గౌహర్ మిర్జా అనే తన చిన్ననాటి స్నేహితుడితో సంబంధం పెట్టుకుంటుంది. గౌహర్ ఒక వేశ్య కొడుకు. అక్కడే పెరుగుతాడు. ఆ కోఠా లోని వాతావరణం వారిద్ధరిని కలుపుతుంది. తరువాత కూడా ఉమ్రావ్ గౌహర్ ను ఎన్నో రకాలుగా ఆదుకుంటుంది. కాని ఆ వాతావరణంలో పెరిగిన గౌహర్కు స్నేహం లాంటి పదాలకు అర్ధం తెలీదు. ఉమ్రావ్ తో తన అవసరాలు తీరుతున్నంతవరకూ ఆమెని అంటిపెట్టుకుని ఉంటాడు. అతని వద్ద ప్రేమ దొరకదని ఉమ్రావ్ కు ఎప్పుడొ అర్ధం అయిపోతుంది. తరువాత ఉమ్రావ్ రచనలను పాటలను విని ఆకర్షితుడవుతాడు నవాబ్ సుల్తాన్. అతన్ని ఉమ్రావ్ కూడా ప్రేమిస్తుంది. అతనితో ఉండిపోవాలని కోరుకుంటుంది. కాని నవాబ్ వివాహం చేసుకుని వెళ్ళిపోవలసి వస్తుంది. తరువాత ఆమె జీవితంలో ఫైజ్ అలీ అనే ఒక దొంగ వస్తాడు. ఇతన్ని ఉమ్రావ్ ప్రేమించదు. తన వృత్తి నేర్పించిన విద్యతో ఆకర్షించి కట్టిపడేస్తుంది. అతని వద్ద నుండి ఎన్నో నగలు ఎంతో ధనం బహుమతులుగా పొందుతుంది. అతను తనతో ఉమ్రావ్ ని వచ్చేయమని కోరతాడు. ఉమ్రావ్ కూడా ఖానుమ్ నుండి పారిపోవాలనుకుంటుంది. ఫైజ్ అలీ తో వెళ్ళిపోతుంది. కాని ఫైజ్ సిపాయిల చేతికి చిక్కడం వలన ఎవరూ పరిచయస్తులు లేని నగరంలో ఒంటరి అయి అక్కడ కూడా తన వృత్తి చేసుకుంటూ ఉండిపోతుంది ఉమ్రావ్. అక్కడే ఒక నవాబ్ భార్య ఆమెను తన ఇంటికి పాట పాడడానికి ఆహ్వానిస్తుంది. ఆమె తనతో పాటు దిలావర్ ఖాన్ అమ్మేసిన రామ్ దాయి అని తెలుసుకుంటుంది. ఆమె పెళ్ళి చేసుకుంది తాను అంతకు ముందు ప్రేమించిన నవాబ్ నే అని అర్ధం అవుతుంది. ఒక నవాబ్ భార్య్ ఆమెను కొని కొడుకు కిచ్చి వివాహం జరిపించడం వలన రామ్ దాయి జీవితం చాలా గొప్పగా గౌరవంగా ఉండడం, వేశ్య ఇంట అమ్మివేయబడ్డ కారణంగా ధనం ఉన్నా తెలివి, గొప్ప కళాకారిణి అయినా సమాజంలో గౌరవప్రదమైన స్థానం తనకు లేకపోవడం ఉమ్రావ్ కి అర్ధం అవుతుంది. 

ఇలా ఆమె జీవితం ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని మళ్ళీ ఖానుమ్ దగ్గరకే చేరుతుంది. ఖానుమ్ కూతుర్లలో ఒకామె ఒక నవాబును నిజంగా ప్రేమిస్తుంది. వేశ్యగా ఉండడానికి ఆమె ఇష్టపడదు. కాని ఆ నవాబు వివాహం కోసం అతని తల్లి ఖానుమ్ ను తన బిడ్డను తనకు వదిలేయమని కోరగా ఖానుమ్ ఒక నాటకమాడి అతన్ని ఇంటి నుండి పంపించివేస్తుంది. మనసు విరిగి ఆమె కూతురు ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. మరో కూతురు తనను ప్రేమించిన ఒక వ్యక్తిని నిర్దయగా వదిలించుకుంటే అతను నదిలో మునిగి ఆత్నహత్యకు పాలడతాడు. ఇలా చిత్ర విచిత్ర ఆడ మగ సంబంధాలను అనుభవిస్తుంది ఉమ్రావ్. రాజకీయ కారణాల వలన ఒక సారి ఉమ్రావ్ తాను పుట్టిన ఊరు వెళ్ళవలసి వస్తుంది. తన తల్లిని కలుసుకుంటుంది. కూతురును గుర్తుపట్టినా ఆ తల్లి ఆమెను నలుగురి ముందు పలకరించలేకపోతుంది. తమ బిడ్డ చనిపోయినా బాగు కాని ఇలా వేశ్యగా మారిందని నలుగురికి తెలియడానికి ఆ తల్లి ఇష్టపడదు. చిన్నప్పుడు తాను పెంచిన తమ్ముడే ఆమెను ఇంటికి రావద్దని ఆ ఊరు వదిలి వెళ్ళిపొమ్మని బెదిరించినప్పుడు మనసు పగిలి ఉమ్రావ్ నగరానికి వెళ్ళిపోతుంది. ఫైజ్ అలి తనకు ఇచ్చిన బంగారమే ఆమె వద్ద ఉండిపోతుంది. ఖానుమ్ మరణించిన తరువాత అందరూ దూరమవుతారు. యవ్వనం ఒడిలి ఉమ్రావ్ అప్పుడప్పుడు వచ్చే కచేరీ అవకాశాలతో, ఫైజ్ అలీ వద్ద తీసుకుని దాచుకున్న ధనంతో తన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. వేశ్య జీవింతం ఆఖరిలో ఇంతే అని, ఆమె ఎవరినీ ప్రేమించలేదని, ఎవరూ ఆమెతో పాటు చివరి దాకా ప్రయాణించరని, తమ జీవితాలలోని చివరి ఘట్టాలు ఒంటరిగానే గడవాలని ఇదే నిజం అని మిర్జా రుస్వాకు చెబుతుంది ఉమ్రావ్. 

తల్లి తండ్రుల వద్దకు వెళ్ళడం అసంభవమని చిన్నతనంలోనే గ్రహించి తన జీవితానికి అలవాటు పడుతుంది ఉమ్రావ్. ప్రతి ప్రేమ మాటున స్వార్ధం తప్పకుండా ఉంటుందని ఆమె అనుభవాలు ఆమెకు చెబుతాయి. అలాగే తాను చూసిన మనుషులను గమనించి చెడ్డవారిలోనూ  మంచి ఉంటుందని, ఎంతటి చెడ్డవారయినా ఎవరో ఒకరితో మంచిగా ఉంటారని, మంచి అనేది లేని జీవితమే ఉండదని అందరికి చెడు అయినవాడు కూడా ఎవరిలో ఒకరిని తనవారిని చేసుకుంటాడు అని గ్రహిస్తుంది. అలాగే సమాజంలో భార్యలకెప్పుడూ గౌరవ స్థానమే ఉంటుందని ఉండాలనీ కూడా చెబుతుంది. మగవారికి వయసులో ఉన్నప్పుడు, డబ్బు చేతినిండా ఉన్నప్పుడు కేళీవిలాసాలు బయటి స్త్రీలకు, కాని దరిద్రంలోనూ, ముసలితనంలోనూ వెంటఉండేది భార్యలే. వారే అన్ని కష్టాలు పడతారు. అందువలన వారు గర్వంతో ఉంటారు. ఆ గర్వంతోనే వేశ్యలను నీచంగా చూస్తారు.  ఆ భార్యలు తమ భర్తలను ఎంతో ప్రేమిస్తారు. అందువలన వేశ్యలు మందులతో మంత్రాలతో తమ మగవారిని దూరం చేస్తున్నారని వారిని అసహ్యించుకుంటారు. తమ భర్తలను ఏ స్థితిలోనూ ద్వేషించలేనంతగా వారు ప్రేమిస్తారు కాబట్టి వారి కోపాన్ని వేశ్యలు సహించవలసిందే అని చెబుతుంది. ప్రేమ పేరుతో ధనం లేని వారిని దక్కరకు రానివ్వడం వృత్తిపరంగా తమకు తాము చేసుకునే హాని అని అందుకే వేశ్యలు ఆ పని చేయరని చెబుతుంది కూడా. 

మరో చోట ఈ వేశ్యల వద్దకు వచ్చే గ్రామీణ ధనికులు పూర్తిగా మితిమీరి అన్ని పోగొట్టుకోవడం గురించి చెబుతూ, ఈ అనుభవాలకు దూరంగా ఉండే గ్రామీణులు ఒక్క సారి వీటి రుచి చూస్తే మితిమీరిపోతారు. నగరాలలోని జనం అలా కాదు. వారికి అన్నీ తెలుస్తుంటాయి. అందువలన అవి అంతగా వారిని ఆకర్షించవు. గ్రామీణ ధనవంతులు మాత్రం వేశ్యల వద్దకు వచ్చి చాలా పోగొట్టుకుంటారని ఈ మత్తు నుండి బైటకు చాలా కాలం దాకా రాలేరని చెబుతుంది.  సౌందర్యం స్త్రీ పురుషులను పరస్పరం ఆకర్షిస్తూనే ఉంటుందని దాని ఆధారంగానే ఆకర్షణలు పుట్టుకొస్తాయని చెబుతూ ఆ అకర్షణ లేకపోతే తమ జీవితం బిచ్చగత్తెలవలే గడుస్తుందని, లక్నోలొ చాలా మంది ముసలి బిచ్చగత్తెలు, ఒకప్పుడు పడుపు వృత్తి చేసిన వారేనని చెప్తూ, ఇన్ని తెలిసినా పరదాలలో తానుండలేనని, పరదాలలో ఉండేవారి మాంగల్యాన్ని రక్షీంచమని తన అల్లాను ప్రార్ధిస్తూ తాను పర్ధా ఇవతల మాత్రమే జీవిస్తానని అలాగే పరదా అటువైపున ఉన్న స్త్రీలు సురక్షితంగా ఉండాలని కోరుకుంటానని చెబుతుంది.

ఉమ్రావ్ పుటుకతో వేశ్య కాదు. కాని వేశ్య అవడానికి చిన్నప్పటి నుండి శిక్షణ తీసుకుంది. ఒక ప్రముఖ రచయిత్రి అన్నట్లు “ఈ సమజంలో స్త్రీలు తయారు చేయబడతారు” . నిజంగా ఇది ఉమ్రావ్ జీవితాన్ని పరిశిలిస్తే అర్ధం అవుతుంది. స్త్రీలను సంసారులుగా, సానులుగా తయారు చేసి వారిలోని ఆ భావజాలాన్ని పెంపొం దించేది సమాజమే. పతివ్రతలైన స్త్రీల భావజాలం కూడా సమాజం చేసే కండిషనింగ్ తో ఏర్పడ్డదే. అలాగే వేశ్యల నైపుణ్యం కూడా వారికి సమాజం నేర్పీంచించే. అన్ని తెలిసినా అటు వంటి జీవితాన్ని వదిలి మరోలా బ్రతకలేని స్థితిలో ఉమ్రావ్ ఉండి పోవడానికి కారణం, ఆమె అలా బ్రతకడానికే తయారు చేయబడిన స్త్రీ కాబట్టీ. పతివ్రతలుగా గౌరవం పోందిన స్త్రీలు, వెలయాలుగా తయారు చేయబడిన స్త్రీల జీవితాలలో కూడా వారి సొంత ప్రమేయం తక్కువ, సమాజ ప్రమేయమే ఎక్కువ. రామ్ దాయి స్థానంలో ఉమ్రావ్ అమ్ముడు పోయి ఉంటే ఆమె నవాబు భార్య గా గౌరవం పొంది ఉండేది. ఉమ్రావ్ స్థానంలో ఖానూమ్ వద్దకు రామ్ దాయి చేరినట్లయితే ఆమె ఉమ్రావ్ లాగే బ్రతకవల్సి వచ్చేది. వీరి ఇద్దరి జీవితాలనూ ప్రభావితం చేసింది సమాజంలోని రెండు రకాలైన వ్యవస్థలు. ఎవరు ఏ వ్యవస్థలో నెట్టివేయబడితే ఆ వ్యవస్థ ప్రతినిధులుగా మారతారు. ఇదే లోక రీతి. 

స్త్రీ జీవితంలోని ఈ కండీషనింగ్ ను గొప్పగా చూపించిన నవల ఇది. ఉర్దూ నుండి ఈ నవలను దాశరధి రంగాచార్య గారు అనువదించారు. మొదట ఈ తెలుగు ప్రతి 1971 లో ప్రచురించబడి 1990 దాకా ఎన్నో సార్లు రీ ప్రీంట్ అయ్యింది. సాహిత్య అకాడమీ ప్రచురించిన ఈ పుస్తకం భారతీయ సాహిత్య ప్రపంచంలో ఒక ఆణిముత్యం. అనువాదం ఉర్దూ వచ్చిన వారికి అంతగా రుచించకపోవచ్చు. కారణం ఉర్దూ లోని కవిత్వాన్ని, షేర్ షాయరీని ఆ స్థాయిలో మరో భాషలోకి అనువదించడం కష్టం. ఆ ప్రయత్నాన్ని దాశరధి రంగాచార్యగారు గట్టివారు కాబట్టి చేయగలిగారు కాని ఇప్పటి పరిస్థితులలో ఈ స్థాయి అనువాదం చేయడం కష్టం. అందువలన కూడా ఇది తప్పకుండా దాచుకోవలసిన పుస్తకం. 

****

Please follow and like us:

One thought on ““ఉమ్రావ్ జాన్ అదా” పుస్తక సమీక్ష”

  1. పాఠకులను, ప్రేక్షకులను అలరింప చేసిన తొలి ఉర్దూ నవల ఉమ్రావ్ జాన్ అదాను అందించిన రచయిత మీర్జా హాదీ రుస్వా గారికి, రచన పాఠకులకు చేరువకావాలని ప్రచురించిన నెచ్చెలి మాసపత్రిక యాజమాన్యానికి అభివందనం.

Leave a Reply

Your email address will not be published.