కథాకాహళి- 18
తెలుగు సాహిత్యంలో మహిళల జైలుజీవితాన్ని చిత్రించిన బి. అనురాధ కథలు
– ప్రొ|| కె.శ్రీదేవి
బెల్లపు అనూరాధ 21 అక్టోబర్ 1963 పశ్చిమ గోదావరి జిల్లా జన్మించారు. సెయిట్ థెరీసా కాలేజీ ఏలూరులో బి.కామ్. చదువుకున్నారు. 1984 నుండి 1996 వరకూ హైదరాబాదులో సిండికేటు బ్యాంకులో ఉద్యోగం. స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, రాజకీయ జీవితంలోకి ప్రవేశించారు.1990-1993 ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘంలో కార్యకర్తగానూ, 1994 లో హైదరాబాదు కేంద్రంగా ఏర్పడిన మహిళా చేతన (మహిళా సంఘం) వ్యవస్థాపక కార్యదర్శిగా పనిచేశారు. 1995 లో రాష్ట్ర వ్యాప్త మహిళా సంఘం ఏర్పాటులో భాగంగా చైతన్య మహిళా సంఘంలో, మహిళా చేతన కార్యాచరణలో భాగం అయ్యాక రాష్ట్ర కార్యదర్శితో సహా 2005 వరకూ వివిధ బాధ్యతల్లో పనిచేశారు. 2006 నుండి 2009 వరకూ జార్ఖండ్ విప్లవోద్యమంలో భాగంగా ఉంటూ నారీ ముక్తి సంఘ్ (మహిళా సంఘం) లో పనిచేశారు. 2009 అక్టోబర్ నుండి 2013 ఆగస్ట్ వరకూ జార్ఖండ్ లోని హజారీబాగ్ జైల్లో రాజకీయ ఖైదీ గా జీవించారు. అనంతరం హైదరాబాదులో నివాసం. 2019 ఫిబ్రవరిలో హిందూత్వ ఫాసిస్టు దాడి వ్యతిరేక ఫోరం ఏర్పాటులో భాగస్వామ్యం. ఆ కారణంగా మళ్ళీ 12నవంబర్, 2019 న అరెస్టై, హైదరాబాదులోని చంచలగూడ మహిళా జైలులో 2020 జులై వరకూ జైలు జీవితం అనుభవించారు. చైతన్య మహిళా సంఘం తీసుకువచ్చే పత్రిక ’మహిళా మార్గ” లో 1995 నుండి 2005 వరకూ సంపాదక వర్గ సభ్యురాలిగా పనిచేశారు. 1992 నుండీ రచనా వ్యాసంగం మొదలైంది. అనేక వ్యాసాలు, నివేదికలు, స్పందనలు పుస్తక సమీక్షలు ప్రధానంగా చేసిన రచనా వ్యాసంగం. సంపాదకీయాలతో ఈమె సాహిత్య జీవితం ప్రారంభమైంది. మొత్తంగా ఇప్పటి వరకూ (2021 ఏప్రిల్) రాసిన 29 కథల్లో 21 కథలు జైలు నేపథ్యంలోనివి. 8 కథలు ఇతర అంశాల గురించి. అన్ని కథల్లోనూ మహిళలే ప్రధాన పాత్రలు. మహిళల సమస్యలు, పోరాటాలు, వారి జీవితాల్లోని ఘర్షణ మార్పు వైపు ప్రయాణం గుర్తించినవే. ఇందులో 11 జైలు కథలు ఆంధ్ర జ్యోతి ఆదివారంలో వచ్చాయి. మరో ఐదింటిని కలిపి తరవాత విరసం సంకలనంగా వేసింది. ఈ సంకలనం త్వరలో ఇంగ్లీషులో రాబోతోంది. రత్నబుక్స్ వారు ప్రచురిస్తున్నారు. ‘ఒక పారో కథ’ ఇంగ్లీష్ లోనూ బెంగాలీ లోనూ ప్రచురితమయ్యాయి. మరో నాలుగు కథలు హిందీలో ‘దస్తక్ నయీ దునియా కీ’ పత్రికలోనూ, భోర్ పత్రికలోనూ, అచ్చయ్యాయి. “వంటరిగా లేం మనం”- కథ తమిళంలో పెణ్ణురిమై పత్రికలో సీరియల్ గా వచ్చింది. వ్యాసాలు కొన్ని అనువాదం చేసినప్పటికీ పుస్తకాలుగా వచ్చినవి నాలుగు. 1. మా బతుకులు – బేబీ కాంబ్లే ఆత్మ కథ (బేబీ కాంబ్లే అంబేడ్కర్ ప్రభావంతో పనిచేసిన దళిత కార్యకర్త) మలుపు ప్రచురణ. 2.అభాగ్యజీవులు – ఫ్రాంజ్ ఫనాన్ – తన సహచరుడు రవితో కలిసి అనువాదంచేశారు, విరసం ప్రచురణ. 3. శ్రమ సంబంధాల మహిళీకరణ – వనమాల – మహిళామార్గం ప్రచురణ. 4. ఫెమినిస్టు అంబేద్కర్ – మహిళల గురించిన అంబేద్కర్ వ్యాసాలు –హైదరబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ.
తెలుగు సాహిత్యంలో మహిళల జైలు జీవితాన్ని చిత్రించిన మొట్టమొదటి కథకురాలు బి. అనురాధ. మరో ముఖ్యమైన విషయం, త్రీ ఎస్టేట్స్ ను మొట్టమొదటిసారి పరిచయం చేసిన రావిశాస్రి, పతంజలి కథల తరువాత అనురాధ తన రాజకీయ జీవితంలో ప్రత్యక్షంగా చూసిన సంఘటనలు ఆమె కథాస్ఫూర్తిగా మారాయి.అలా అవి అసాధారణ అనుభవాలుగా, తృణీకరించేందుకు వీలులేని వాస్తవాలు గా మన ముందు నిలబడతాయి. ఇవి రాజ్య స్పృహను అందించేందుకు రాసిన కథలుగా కాకుండా కేవలం ఒక అనుభవాన్నితన స్నేహితులతో పంచుకున్నట్లుగా, క్యాజువల్ గా ముచ్చటిస్తున్న అంశాలుగా వుంటాయే తప్ప మనకు తెలియని ఒకానొక గంభీరమైన జీవితసత్యాలను విప్పిచెబుతున్నట్లుగా వుండవు. స్పష్టంగా చెప్పాలంటే, పాఠక స్పృహతో రాసినట్లుగా వుండవు. ఆలంకారిక స్పృహతో చెప్పాలంటే, ఈమె కథలు మిత్రసమ్మితాలు.
హజారీ భాగ్ మహిళా జైలులో తన చుట్టూవున్న మహిళల జైలుజీవితంలోని అపసవ్యతలను ఒక విప్లవోద్యమ కార్యకర్తగా అనురాధ నిర్భందిత స్త్రీలు, పిల్లల జీవన గాధల్ని, గమనాన్ని ప్రత్యక్షంగా చూసి, విని వాళ్ళకోసం చదువును, అవగాహనను వాళ్ళకు అందించారు. పనిచేసేవారు అడవుల్లోవున్నా, మైదానాల్లోవున్నా, జైల్లోవున్నా పనిచేస్తూనే వుంటారనడానికి బెల్లం అనురాధ జీవితం నిదర్శనం. ఈవిషయం ఆమె ”ఏది నేరం” కథాసంకలనమే వ్యక్తంచేస్తుంది. కానీ ఈవిషయం ఈమెను జైల్లో పెట్టకముందు పాలకవర్గాలకు తెలిసివుండదు. ఏదిక్కూలేని మహిళా బందీలకు ఒక ఆప్తురాలిగా, ఒక దీదీగా వాళ్ళ బాధల్ని పంచుకున్నారు. వాళ్ళకోసం ఉత్తరాలు, పిటీషన్ లు రాసిపెట్టే లేఖకురాలిగా మాత్రమేకాక, అధికారుల్ని ప్రశ్నించి, మెరుపుధర్నాలు ఛేయించే నాయకురాలిగా మారారు.(అందుకే కాబోలు శకున జాలిపడింది.) నిర్బంధిత స్త్రీల విలాపాగ్నులను అక్కడ వుండి వినడం ఒక ఎతైతే, జైలునుండి విడుదలైన తరువాత ఆ అనుభవాలు ఈమెను వెంటాడిన, వేదన నుండి విముక్తమవ్వడం కోసం కథనం చేసి, సాహితీ గౌరవం అందించడం మరోఎత్తు. రాజ్యం ఆచరిస్తున్న అమానుష వున్మత్త వైఖరిని బయటి ప్రపంచానికి తెలిపేంతవరకు ఆమెకు విశ్రాంతి నివ్వలేకపోవడం ఈకథల నేపధ్యం. వారి విశాదాశ్రువులకు అక్షరరూపమిచ్చి పారోను, లాఠీ బుడియాను, మున్నీని, ఛాందిని, రోషిణి, పుల్ మనీని మన సహవాసులుగా చేశారు. ఈ కథల్లోని పాత్రలు నేరం చేసి శిక్ష అనుభవిస్తున్నవాళ్ళు కాదు. రాజకీయ దురంతాలకు బలైపోయిన అమాయక స్త్రీలు. నేరం మోపబడినవాళ్ళంతా పేద, దళిత, గిరిజన సామాజిక వర్గానికి చెందిన స్త్రీలే. రచయిత్రి కూడా హజారీబాగ్ జైల్లో రాజకీయఖైదీగా శిక్ష అనుభవిస్తూ తనతోటి స్త్రీల జీవితాలలోని నిస్సహాయత, నుండి బయటపడే మార్గంకోసం వారితోపాటు పరితపించారు, ప్రత్యక్షంగా “ఏది నేరం?” కథాసంకలనంలో కథలన్నీ నిర్బంధిత స్త్రీల వాస్తవ జీవనశకలాలు.
సాధారణంగా జైల్లో మూడు రకాల ఖైదీలుంటారు. అందులో మొదటి వాళ్ళు విచారణ జరిగి సాక్షాధారాలతో నేరం రుజువై శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు, రెండవవారు విచారణలో ముద్దాయిలుగా వున్నవాళ్ళు. వీళ్ళు నేరం చేశారా లేదా అన్న సందిగ్ధంలో, నేరం చేసుంటే తప్పించుకోకూడదనే వుద్దేశ్యంతో జైల్లో వుంచినవారు. వీళ్ళని అండర్ ట్రైల్స్ అంటారు. వీళ్ళకు బెయిల్ వుండదు, విచారణ లోకొనసాగుతూ.. జుడీషియల్ రిమాండ్ లో వున్నవాళ్ళు. సాధారణంగా వీళ్ళే ఎక్కువ సంఖ్యలో వుంటారు. మూడవరకం అక్రమంగా నేరారోపణ మోపబడిన వాళ్ళు. వీళ్ళకు చదువు వుండదు. కనీస చట్టాల పరిజ్ఞానం లేని వాళ్ళు. రాజకీయ అగాయిత్యాలకు అన్యాయంగా బలైనవాళ్ళు. వీళ్ళకు తాము ఏం నేరం చేశారో ఎందుకు జైల్లో వున్నారో కూడా సక్రమంగా తెలియనివాళ్ళు. తమవాళ్ళకి వీళ్ళు ఎక్కడున్నారో కూడా తెలీదు. బెయిల్ మీద విడిపించుకోవచ్చు అని తెలిసినా, బెయిల్ ఎలా పొందాలో కూడా తెలియని వాళ్ళు,. బెయిల్ కోసం ఖర్చు పెట్టుకోవడానికి కూడా డబ్బు లేక పేదరికంలో మగ్గుతున్నవారు, ఇలాంటి వాళ్ళను చూడటానికి కుటుంబ సభ్యులు కూడ రారు. వస్తే తమని కూడా ఎదో నేరంతో ఖైదీలుగా చేస్తారన్న భయంతో జైలు ఛాయలకు కూడా వెళ్ళని బడుగు బలహీన వర్గాల వాళ్ళు. వీళ్ళంతా అనురాధ జైలు కథల్లో ప్రధాన పాత్రధారులు.
‘ఒక పారో కథ‘లో పారో జైలుకు వచ్చినప్పుడు ఆమె పెద్ద కూతురికి ఐదుసం॥లు. ఆ పాపను తన తోడికోడలు దగ్గర వదిలి, చిన్న కూతురు మున్నీతో జైలుకు వచ్చింది. మున్ని రెండేళ్ళ వయస్సు నుండి తన తల్లితోపాటు నిర్బంధంలో దాదాపు పన్నెండేళ వయస్సు వరకు జైల్లో గడిపింది. ఆ తరువాత స్వచ్ఛంద సేవకులైన మిషనరీలు పారోదేవిని అతికష్టం పైన ఒప్పించి, దాదాపు బలవంతంగా మున్నీని తీసుకెళతారు. గార్డియన్ గా వుంటామని హామీపత్రం కూడా రాసిస్తారు. తీసుకెళ్ళిన కొద్దిరోజులకే పారో కూతురు మున్నీ రేప్ కి గురైంది. మున్నీని ఎక్కడ వుంచాలో తెలియక మళ్ళి రిమాండ్ కు పంపుతారు. ఆ విషయం తెలిసిన పారో రాజకీయఖైదీగా వచ్చిన కథకురాలు సహకారంతో తన బిడ్డకు ఉత్తరం రాసింది. అందులో “పోట్లాడాలె బిడ్డా అని కూతురికి ధైర్యం చెప్తుంది”. పారోదేవి తనజీవితంలోని విషాదా న్ని వేదనను స్థిరచిత్తంతో అధిగమించడమే కాక అందరికీ ధైర్యం చెప్పగలిగేంత మనోనిబ్బరం గల పాత్రగా పాఠకుల మనసులపై బలమైన ముద్ర వేస్తుంది .
పుట్టిన రెండేళ్ళకే సమాజానికి దూరంగా జైలు జీవితం అనుభవించిన మున్నీ పదునాలుగేళ్ళ తరువాత సమాజంలో అడుగుపెడితే, ఆమె మానసిక స్థితి ఎంత అలజడికి గురవుతుందోనని కథకురాలు కంగారు పడుతుంది. గతంలో రోషిణి పడిన భయాందోళనలను ఈసంధర్భంగా మననం చేసుకుంటుంది. రోడ్డుపై పరుగెడుతున్న బస్సు పడిపోతుందేమోనని భయంతో గడ్డకట్టుకుపోయిన రోషిణి స్థితిని రచయిత్రి చెప్పడంలో, అతి సామాన్యమైన విషయాలలో కూడా సభ్యసమాజ గమనానికి దూరమైన చిన్నపిల్లలుగా ఆపాత్రలు అనుభవించే సంఘర్షణ, అయోమయానికి వుదాహరణగా తీసుకుంది. అయితే, అంత అమాయకురాలు ఈ సమాజంలో ఎలా మనగలుగుతుందోనని పాఠకులు అనుకునేలోపే, మున్నీ మరో బీభత్సానికి (రేప్) గురై రిమాండుకు వెళ్ళాల్సి వచ్చింది. మున్నీకి జరిగిన నష్టానికి బాధ్యత వహించే వాళ్ళెవరనే ప్రశ్న పాఠకుల మెదళ్ళలో మొలుస్తుంది.కానీ జైల్ లోవున్న రచయిత్రికిగానీ, కథనడిపే కథకురాలికి గానీ తెలియదు. కానీ ఆవిషయంలో వీళ్ళ పిటీషన్ కు సమాధానం ఇవ్వాల్సిన రిమాండ్ హోమ్ అధికారులుగానీ, జైల్ అధికారులు గానీ వివరించలేదు. అలా వివరించక పోవడంవల్ల బతికిపోయింది రేప్ కేస్ లోని ముద్దాయా? అలాంటి వర్గాన్ని గుప్తంగా సంరక్షించే వ్యవస్థదా? అన్న వివరణ లేకుండానే కథ ముగిసిపోవడం వల్ల ఈ ప్రశ్నలు పాఠకుల్ని నిశ్శబ్దంగా వెంబడిస్తాయి. ఈ కథలో ప్రదానంగా గమన్నించాల్సింది నేరం చేసిన వాళ్ళకు బదులు నేరానికి గురైన వాళ్ళను నిర్బంధంలో పెట్టడంలోని అసంబద్ధత.
అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా కీర్తించబడుతున్న దేశంలో, లిఖిత రాజ్యాంగ సంరక్షక బాధ్యత వహిస్తున్న న్యాయస్థానాల లక్ష్యం ‘వందమంది దోషులైనా తప్పించుకోవచ్చు కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్షపడకూడదు’. కానీ “ఒక పారో కథ” లో మున్ని మాత్రం ఏ నేరం చేసి, జీవిత ఖైదీలా శిక్ష అనుభవించింది? మున్ని విషయంలో ఈలక్ష్యం ఏమైందనిపిస్తుంది. కానీ పారో ఒక తల్లిగా నా బిడ్డ ఏనేరం చేయకపోయినా నాతోపాటు ఎందుకు శిక్ష అనుభవించాలి? అని ప్రశ్నించాల్సింది పోయి, నాబిడ్డను కూడా నాతోపాటు వుండనిమ్మని అధికార్ల కాళ్ళుపట్టుకొని బతిమాలడడంలోని అసంబద్ధత మనదేశ సర్వసత్తాక, ప్రజాస్వామిక సమగ్ర ముఖచిత్రం ఏమిటో పాఠకులకు అవగతమవుతుంది.
ఆలోచిస్తే, మిషనరీ బాద్యుల మాటలు నమ్మి 12 సంవత్సరాల తరువాత జైలు నుండి బైట సమాజంలోకి వెళ్ళిన మున్నికి ఎలాంటి సంరక్షణ ప్రజాస్వామ్యమిక సమాజం కల్పించిందో పారో ముందే ఊహించిందా? అని పాఠకులు పారో అవగాహనకు ఆశ్చర్యపడతారు. మున్నీ రేప్ కు గురైన సంఘటన రచయిత్రి పారో, మున్నీ పాత్రలపట్ల సానుభూతినో, పాలకవర్గాల అలసత్వాన్ని అర్థం చేయించేందుకో లేక మిషనరీల పనితీరును బట్టబయలు చేసేందుకో కల్పించిన సంఘటన కాదు. వాస్తవంగా పారో తరుపున ఎన్నో పిటీషన్లు పెట్టి అధికారులను బెదిరించి, బతిమాలి, విన్నవించి, స్వయంగా రాబట్టిన సమాచారం. జైలు శిక్ష అనుభవిస్తున్న నేరస్తుల పిల్లలు. నేరస్తులు కాని నేరస్థులుగా జైల్లోనే వున్న వీళ్ళు ఏకోవకు చెందిన నేరస్తులో కథకురాలు ప్రశ్నించడం పాఠక మిత్రులను ఆలోచింపచేస్తుంది.
పారోను జైళ్ళో పెట్టిన ప్రభుత్వ యంత్రాంగం ఏ మర్డర్ చేయని ఆమె కూతురులాంటి పిల్లలకు కూడా అంతే శిక్ష అమలు చేయడమేంటి? వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఎవరిది?అసలు ప్రశ్న మిషనరీల సంరక్షణలోవున్న మున్నీ, నేరస్తులను శిక్షించడం చట్టం విధి అయినప్పుడు నిర్దోషులను కాపాడటం, వారి భవిష్యత్తును కాంక్షించడం ఎవరి విధి? రేప్ కు గురైన మున్నీ, మళ్ళీ రిమాండ్ కు పంపడమేమిటి? మిషనరీల సంరక్షణలో వున్న మున్నీని రేప్ చేసిందెవరు? గార్డియన్లుగా నియమింపబడిన మిషనరీ నన్స్ రేప్ జరిగిన తరువాత ఎందుకు బాధ్యత తీసుకోలేదు?. వాళ్ళను న్యాయమూర్తులు ఎందుకు విచారించలేదు?. పద్నాలుగేళ్ళ మున్నీని మహిళా శిశుసంరక్షణ శాఖలు నిర్వహిస్తున్న స్టేట్ హోమ్ కు ఎందుకు పంపలేదు?. అన్న ప్రశ్నలతో పాఠకుల మెదళ్ళు ఆలోచనల పుట్టలవుతాయి. ఇవన్నీ జవాబులేని ప్రశ్నలుగానే రచయిత్రి ఎందుకు వదిలేసింది. కథకురాలితో పాటు పాఠకులను కూడా విస్మయానికో,అయోమయానికో గురిచేయడానికి మాత్రంకాదు. పాలనావ్యవస్థ నిర్వహణ బాదితుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వుందో చెప్పడమే “ఒక పారో కథా”లక్ష్యం.
మొదట కథ చదవగానే చాలా గందరగోళంగా అనిపిస్తుంది. కానీ కథ చదవడం పూర్తయిన తరువాత ఎన్నోప్రశ్నలు మనల్ని వుక్కిరిబిక్కిరి చేస్తాయి. అందుకే మళ్ళీ మళ్ళీ కథను చదవకుండా వుండలేకపోతాం. కథ పేరు “ఒకపారోకథై”నా ఆమె, ఆమె చుట్టూ వుండే ఖైదీలు, జైలు తిండి, లోపలి కెళ్ళే వేళలు, పిల్లలు వాళ్ళ ఆటలు, పిల్లుల ఆగడాలు, పిర్యాదులు, అధికారుల మనస్తత్వం, వీటన్నిటితో పాటు రాజ్యాంగ యంత్రాంగంలో ప్రధాన భూమిక పోషిస్తున్న త్రీ ఎస్టేట్స్ స్వభావాన్నిఅనురాధ పారో విషాద జీవితంతో మమేకం చేసేక్రమంలో ఒక సన్నివేశం నుండి మరో సన్నివేశంలోకి కథ సునాయాసంగా మలుపులు తీసుకుంటూ సాగిపోతుంది.
కథ ప్రారంభ ఎత్తుగడలో రచయిత్రి ప్రయత్నపూర్వకంగా చెప్పిందో లేక అప్రయత్నంగా చెప్పారో కానీ పిల్లుల ఆగడాలతో మొదలవుతుంది. పారో గురించి కాకుండా నారో నేకెడ్ గా కథాంశాన్ని ఎన్నుకోవడంద్వారా ఏం సాధించాలనుకున్నారు? అని ఆలోచిస్తే, పిల్లుల ఆలనాపాలనలో పారో చూపించే శ్రద్ధ, బాధ్యత నుండి ఆమె తన బిడ్డలపట్ల ఎంత స్పృహతో వుంటుందో పాఠకులకు స్పష్టంగా పోశ్చరైజ్ అవుతుంది. ఈమె పిల్లుల పెంపకం విషయంలో చేసిన ఈమె కథాకథనంలోని కదలికల్లో (నారేటివ్ స్టైల్) మళయాళీ రచయిత వైకం మహమ్మద్ బషీర్ “పాత్తూమ్మా మేక” కథను గుర్తుచేసింది.
పారోలోని మానవీయకోణం, కరుణ ఆర్ద్రతలు, అన్యాయం జరిగినపుడు అపరకాళికలా విజృంభించడం, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి ఉపన్యాసం విని పారో చేసిన సుదీర్ఘ వుపన్యాసం ఒక సాధారణ నిరక్షరాస్య మహిళల్లో దాగిన నిద్రాణశక్తికి ప్రతిరూపంగా పారో పాత్రచిత్రణ జరిగిందని పాఠకులకు ద్యోతకమవుతుంది. మున్నీపై జరిగిన అత్యాచారం విన్నపుడు, కూతురికి ఉత్తరం రాసేటపుడు ఆమె అందించిన భరోసా, ఆత్మస్తైర్యం జాగ్రత్తలను మించి వుండటం పాఠకుల దృష్టిపథం నుండి తప్పుకోదు.
‘చంమామను చూడని వెన్నెల‘ కథలో చందమామతో బంధం ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్రత్యేకమైందే. అలాంటి చందమామని చూడని, చూడలేని జీవితం చాందినీది. చందమామ ఎక్కడా అని అడిగితే మాటలురాని పసిపిల్లలు కూడా ఆకాశంవైపు చూస్తారు. కానీ ఈకథలో చాందిని చందమామ ఎక్కడ అని అడిగితే టి.వి.వైపు చూపిస్తుంది. కారణం ఆఅమ్మాయి జైల్లో పుట్టింది. అక్కడే పెరుగుతూంది కాబట్టి. ఆకాశంలో చూసే అవకాశం నాలుగు సంవత్సరాల వరకు ఆపాపకు రాలేదు. అందువల్లె వాళ్ళమ్మ చందమామని టి.వి.లో చూపించింది. ఇలాంటి పరిసరాలలో పెరిగే పిల్లల మానసిక స్థితి, వాళ్ళు పెద్దపిల్లలుగా బయటకు వెళితే జరిగే అనర్థాలకు కారణం పిల్లల తల్లిదండ్రులా లేక సమాజమా? చాందినీ తల్లి కిడ్నాప్ కేసు కింద జైలుకు వచ్చింది. జైలుకు వచ్చిన తరువాత జైల్లో పుట్టిన పాప చాందిని. ఇలాంటి పిల్లల్లో అంటే ఏనేరం చేయకుండానే జైలుశిక్ష అనుభవిస్తున్న పిల్లలు తమ హక్కుల్నితెలుసుకొని, తమంతకు తామే అధికారులను అడుగుతారు. రాజకీయఖైదీలతో పాటు వుంటూ, వాళ్ళు జైలులో ఆచరిస్తున్న స్నేహపూరిత, మానవీయ అంశాలే. అందుకే ఐదేళ్ళ పిల్లలు కూడా అధికారుల్ని ప్రశ్నించి సాధిస్తారు. ఖైదీల విధినిర్వహణలు ఏకోవలో వున్నాయో రోషిణి పాత్ర ద్వారా రచయిత్రి తెలియజేస్తుంది.
‘బేబీస్ డే అవుట్‘ కథలో జైల్లో ఖైదీలుగా వున్న మహిళల పిల్లలు నేరం చేయని ఖైదీలు. వీళ్ళ జీవితం జైల్లో గడుపుతూ బాల్యం పొగొట్టుకున్న నేరస్తులు. వీళ్ళల్లో రోషిణి ఐదు సంవత్సరాల వయస్సు గలది. అమ్మ జుబేదా భాను, తన పాపను తీసుకొచ్చి “నాకు, నాపాపకు చదువు నేర్పిస్తారా?” అని రాజకీయఖైదీగా వచ్చిన కథకురాలిని అడుగుతుంది. ఎత్తైన గోడల మధ్య జైలుజీవితం తప్ప ఏమీ తెలియని వాళ్ళు, నేరస్తులు కాని నేరస్తుల పిల్లలు. వీళ్ళకు తెలిసిన అతిపెద్ద జంతువు పిల్లి అంటే వాళ్ళ మానసిక స్థాయి ఏస్థాయిలో వుందో వూహించలేని విషయం కాదు. రోషిణి టి.వి.లో కోళ్ళు చూపించి, ఎంటన్నప్పుడు కోడి అని చెప్పింది. ఎక్కడ చూశావు అన్నప్పుడు తన పుస్తకంలో చూపించింది. ఈ పిల్లలు ఆటలు కూడా జైలు చుట్టూనే నడుస్తాయి. పిల్లలు ఊహలకు, కళలకు జైలే ప్రపంచం. ఈ చిన్న ప్రపంచం హద్దుకాదని మరో ప్రపంచం వుందని పిల్లలకి తెలియాలన్న ఆలోచన చేసినప్పుడు జైల్లో వున్న పిల్లలకి వారానికొకసారి బైటికి తీసుకెళ్లొచ్చనే నియమం ఒకటుందని ఆమె ద్వారా అర్థమైంది. ఎలాగైనా జైలర్ని అడగాలని నిర్ణయించుకున్నారు పెద్దలు. అడగగానే ఒప్పుకోవడం జరిగింది. ఇది విన్న పిల్లలు ఆనందానికి అవధులేవు. వాళ్ళకి నిద్ర కూడా పట్టడంలేదు. వాళ్ళకు తెలియని ఒక ప్రపంచాన్ని చూడటానికి ఆరాటపడతారు. వాళ్ళ హక్కుని వాళ్ళు కాపాడుకోవడంలో పిల్లల అడుగు ముందుంది. హక్కుల్ని ప్రసాదించమని దేబిరించట్లేదు వీళ్ళు, అన్వేషించారు. అధికారుల వెంటపడి సాధించుకుంటారు. అందరిలోకి పెద్దపాప ఒక అడుగు ముందుకేసి జైలర్ తోనే “మమ్మల్ని కానీ తీసుకుపోకపోతే ఛాయ్ కూడా ముట్టుకోం దూధ్ రోటీ, ఖానా కూడా తీస్కోం! ….హా…. నహీలెంగే, నహీలేంగే…. “అని కోరస్ గా అరుస్త్తారందరూ. జూలీ ముందుకొచ్చి మా అమ్మ వాళ్ళని కూడా తీస్కోనివ్వం” అటుంది. ఇలా వాళ్ళ హక్కులన్ని పోరాటం చేసి పొందగలుగుతారు.. ఆచిన్ని పోరాట యోధుల్ని చూసి కథకురాలు చాలా సున్నితంగా, సమీప భవిష్యత్తుని తెలియజేస్తుందీ కథలో. “మాకే నాయకత్వం వహిస్తున్నారు జాగ్రత్త మరి” అని వాళ్ళలా జీవించడానికి కారణమైన వారిని హెచ్చరిస్తుందీ కథ.
పోరాడి తమ హక్కును సాధించుకొని జైలునుంచి బయటికి వెళ్ళిన పిల్లలకి, ఎత్తైన గోడలు తప్ప దేన్ని చూడని వాళ్ళకు చూసిన ప్రతీదీ ఒక వింతలా కనిపించింది. వాళ్ళకి కుక్క కాటుక పెట్టుకుందని, బావిలో నీళ్ళు కదలట్లేదని, సైకిల్ పై వెళ్తున్న బాలుడు కింద పడలేదని, పంది గురుర్ అంటోందని మేక వూరుకోమంటే వూరోకోలేదని చెత్తకుప్పల్ని కన్వర్లను చూశానని రోపిణి ఆనందాన్ని అమాయకత్వాన్ని చూపించాడంలో ఏ ఆనందానికీ పరిసరాల జ్‘ఇనానికి ఎన్ని రోజుల నుండి దూరమయ్యారో రచయిత ఎవరికీ తెలియని, వూహకు కూడా అందని ఒక కొత్త ప్రపంచాన్ని తెలుగు పాఠకులకు అనురాధ పరిచయం చేసింది. ఇలాంటి పిల్లలకి బైట జీవితం, జైలు జీవితం రెండింటిని తులనాత్మకంగా చూపించి ఈ పిల్లల్ని జైల్లో బంధించి ప్రభుత్వ యంత్రాంగం తనని తాను కాపాడుకొంటోందని, విముక్తి చేయాల్సిన చట్టాలే ఖైదీలను తయారు చేస్తోందని కథకురాలు భావిస్తుంది.
నేరస్తుల పిల్లల్ని చూసుకోవడానికి, పెంచుకోవడానికి, మంచి భవిష్యత్తు ఇవ్వడానికి నేరస్తుల కుటుంబ సభ్యులు కూడా చట్టప్రకారం పొందవచ్చనే కనీస పరిజ్ఞానం లేని అమాయకులు. అందుకే రోషిణి తండ్రి భార్యా పిల్లల్ని చూడటానికి కూడా రాడు. కారణం జైలుకు వెళ్తే తనని కూడా జైల్లో వేస్తారనే భయంతో భార్యా పిల్లల్ని వదిలి మరో పెళ్ళి కూడా చేసుకున్నాడని రోషిణి తల్లి చెప్తుంది.
‘బేబిస్ డే అవుట్‘ కథలో ఇలాంటి బాధితులకి రక్షణ చట్టాల గురించి అవగాహనను కల్పించాల్సిన యంత్రాంగం ఏ చట్టం వాళ్ళని నేరస్తులుగా భావించి శిక్షలు వేస్తుందో, అదే చట్టం తాను చేయాల్సిన పనిని చేయటంలేదని ఈకథ గుర్తుచేస్తుంది. నేరం నిరూపణ అయ్యి ఖైదీలుగా జీవిస్తున్న ఖైదీలకు శిక్షలు పడితే బాధపడాల్సిన అవసరం లేదు. తాము ఎందుకు జైలుకు వచ్చామో కూడా తెలియని వాళ్ళను విచారణ కింద జైల్లో పెట్టి నేరస్తులన్న ముద్రవేసి బెయిల్ కూడా ఇవ్వకుండా ఖైదీలుగానే బలైన ఒక ఖైదీ జీవిత గాథే “సత్ర సి.ఎల్. (మావోయిస్టు).”ఈకథ పేరు. ఇది ఖైదీల నేరాలను సూచించే కోడ్.
అమాయకులైన ఆదివాసీ అమ్మాయి ఫుల్ ముని పై కేసుపెట్టి జైలు పాలుచేసిన పోలీసు మాంత్రికుల ఇంద్రజాల విద్యను ఈకథలో చూస్తాం. ఆమె మేకలు మేపుకోవడానికి అడవికి వెళ్ళినప్పుడు, తన మేకలు ఇంటికి వెళ్బాయో లేదో అని ఆలోచిస్తున్న ఆమెను మావోయిస్టు అని తెచ్చి జైల్లో వేస్తారు. జైలు నుండి ఉత్తరం రాయవచ్చు అని కూడా తెలియని అమ్మాయి. రాజకీయ ఖైదీల సాహచర్యంలో చదువులోనూ, ఇతర పనుల్లోనూ చురుకైన నైపుణ్యం గల అమ్మాయిగా తయారవుతుంది.
పోలీసులు అడవి కూంబింగ్ లో కనిపించిన అమ్మాయిని మేకలు మేపుకొంటూ ఇప్పపూలు, పుల్లలు ఏరుకురావడానికి అడవికి వెళ్ళిన పులుమనీని “గంటలో పంపిస్తాం” అని చెప్పి జైలుకు తీసుకొచ్చారు. ఆమె తల్లికి మతిస్థిమితం లేదు. తండ్రి చనిపోయాడు. అన్న, తమ్ముడు కూలి పనికి పోతారు. ఇంట్లో వాళ్ళకి ఆమె ఏమయ్యిందో కూడా తెలియదని పుల్ మనీ మాటల్లో అర్థమవుతుంది. ఇంటికి ఉత్తరం రాయాలనే ఆలోచన వచ్చి, ఆ ఉత్తరంలో పులుమని జైలుకు ఎలా రావాలి? బయట గేటు దగ్గర ఏమి నిబంధనలుంటాయి? గుర్తింపు కార్డు ఎందుకు తెచ్చుకోవాలి వగైరా అన్నీ విషయాలతోనూ ఉత్తరం రాస్తుంది. “ముఖ్యంగా భయపడొద్దు, నిన్ను అరెస్టు చెయ్యరు అన్న విషయం మూడుసార్లు రాసింది”. జైలు నుండి మూడున్నర సంవత్సరాలకు ఉత్తరం రాస్తే, జైలుకు వాళ్ళు నాలుగో సంవత్సరం మొదలైనప్పుడు తన కుటుంబ సభ్యులు వచ్చారు. ఫులోమని అల్లిన అల్లికలతోనే సంపాయించిన డబ్బుతోనే బెయిల్ కోసం ప్రయత్నిద్దామన్న కథకురాలు సహకారంతో బెయిల్ మీద రిలీజ్ అవుతుంది ఫుల్ మనీ.
ఆమాయక గిరిజనస్త్రీల అరెస్టులు మామూలు సమాజానికి తెలిసే అవకాశం లేని అంశాలను రచయిత్రి అడ్రస్ చేశారు. అందుకే అనురాధ హజరీబాగ్ జైలు గాధలు తెలుగు కథాసాహిత్యానికి అదనపు విలువను కలిగించాయనడానికెలాంటి సందేహం అవసరం లేదు.
*****
కె.శ్రీదేవి ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పంలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. స్వస్థలం కడప. 12 పుస్తకాలు రాశారు. మూడు పుస్తకాలు ఎడిట్ చేశారు. ఆరు అవార్డులు అందుకున్నారు. 112 ఆర్టికల్స్ రాశారు.
అనురాధ గారి కథలను చాలా చక్కగా విశ్లేషించారు శ్రీదేవి గారు.. కథల నేపథ్యాన్ని, అనురాధ గారి ఉద్యమ జీవితాన్ని కూడా బాగా పరిచయం చేశారు.. అభినందనలు.