కవిత్వం ఎలా ఉండాలి?
-చెళ్లపిళ్ల శ్యామల
కవిత్వానికి చేతులు ఉండాలి
పక పక నవ్వే పాల బుగ్గలని
ఎంగిలి చేసిన కందిరీగలని
తరిమి కొట్టే చేతులుండాలి
కిలకిల నవ్వుల పువ్వులని
కాలరాసే కాల నాగులని
ఎదురించే చేతులుండాలి
తలరాతని తల్లకిందులు చేసే
తోడేళ్లని మట్టుబెట్టే చేతులుండాలి
ఆపదలో అండగా నిలిచి
అన్యాయాన్ని ధైర్యంగా ఎదురించే
చేవగల చేతులు ఉండాలి
కవిత్వానికి కాళ్ళు ఉండాలి
కన్నీటి కథలని కనుక్కుంటూ
మట్టి బతుకులని తెలుసుకుంటూ
గూడేల వెతలని వెతుక్కుంటూ… కాళ్ళు
మైదానం నుంచి మట్టిలోకి
మట్టి లోంచి అరణ్యంలోకి
నడుచుకు పోవాలి
కవిత్వానికి చూపు ఉండాలి
వాస్తవాలను వెతికి పట్టుకో గల
నేర్పు ఉండాలి
గతాన్ని పరిశోధించి
వర్తమానాన్ని పరిశీలించి
భవిష్యత్ ను అంచనా వేయగల
లోచూపు ఉండాలి
కవిత్వానికి నోరు ఉండాలి
అణగ దొక్కబడ్డ గొంతులను శృతి చేసి
మేలు కొలిపే గళముండాలి
దాచి పెట్టిన గాయాల్ని
గేయాలుగా మార్చి
గొంతెత్తి వినిపించాలి
నొక్క బడ్డ నోళ్లని తెరిపించి
వాస్తవాన్ని వినిపించగల
గొంతు ఉండాలి
కవిత్వానికి చెవులు ఉండాలి
నిశీధి చాటున జరిగే
రాక్షస క్రీడల గాటుకి
గిలగిల మంటున్న
నిశ్శబ్ద మౌన రాగాల్ని
వినగలగాలి
కవిత్వానికి హృదయం ఉండాలి
మౌనంగా నాల్గు మాట్లాడి
మనిషిని హత్తు కో వాలి
వెంటాడే జ్ఞాపకమై
మనసుని తట్టి లేపాలి
గుండె కొమ్మన
వసంతమై చిగురించాలి.
*****
చాలా బాగా చెప్పారు . కవిత్వం ప్రశాంతం గా పారుతున్న నదిలా ఉండాలి , మనుషుల్లో కి దూసుకుపోయే బుల్లెట్టు లాగా కూడా ఉండాలి . కవిత్వం వల్ల అన్నీ రెకాలా ఉపయోగాలను , కవిత్వం తీరును చాలా బాగా వివరించారు . ఇంత మంచి కవిత రాసినందుకు ధన్యవాదాలు .