కొత్త అడుగులు – 20

రూపా రుక్మిణి

– శిలాలోలిత

రహాస్యాల్లేని నీడల కవిత్వం

కవిత్వం రాయటం అంటే నిన్ను నీవు ధ్వంసం చేసుకొని కొత్తగా నిర్మించుకోవటం లాంటిది. అందుకే ఒకసారి కవిత్వానికి అలవాటైన వాళ్ళంతా మొదట సొంత ఆనందాన్నో, బాధనో చెబుతూ కవిత్వాన్ని రాయడం మొదలు పెడతారు.

ఎప్పుడు, ఎలా మారామో అర్థం కాకుండానే పక్కవాళ్ళ బాధల్లో, సంతోషాలకి కూడా స్పందించడం మొదలు పెడతారు. నెమ్మది నెమ్మదిగా స్వరం పెరుగుతుంది. స్పష్టత పెరుగుతుంది. కవులు తమ గొంతుకలను సామూహిక స్వరం చేస్తారు. ఇదిగో ఎట్లా మొదలైందో గానీ కొత్త స్వరం ఇప్పుడు అదే దారిలో వుంది. రూపా రుక్మిణి అనే పేరును తెలుగు సాహిత్య ప్రపంచంలో ఇంతకుముందు ఎందురు విన్నారోగానీఇకముందు మాత్రం ఎక్కవమందే వింటారు.

నా అడుగుల చప్పుడు కూడా నన్ను గుర్తించనంతగా 

శబ్దమో.. రాగమో.. వినపడనంత దూరం 

కొండవాలుగా జారే జలపాతం

 అంతలోతుగా గగనంలోకి జరిపోవాలి 

గాలి చొరబడకుండా 

ఇప్పుడేదైనా కప్పేసుకోవాలి 

అంటూ సాగిన కవితచివరిలో 

నాలోని ఒంటరితనాన్ని 

మేల్కొ లిపి… 

చెదిరిన నవ్వులకు ఆపన్న హస్తం

అయ్యే మార్గాన్ని వెతికి 

పట్టుకోవాలి… 

మనిషి తనాన్ని గుర్తించాలి

అంటూ ముగించిన కవిత 

ఒక్కసారి గమనిస్తే తెలుస్తుంది

నిశ్శబ్దంగా ఉండటం అంటే 

మరింత బలంగా అన్వేషణ 

సాగించడం కోసమని.

 “జలపాతం అంత లోతుగా, గగనంలోకి, జారిపోవడం” 

విరోధా బాసలోనూ ఒక ఆశ ధ్వనించే లాగా రాయటం.

పట్టుబడే విద్యకాదు. అదొక కవిత్వ మూడ్, కవిత్వం ఆవహించినట్టుగా ఉన్న ఒకానొక స్థితి. అప్పుడు రాయబడేది, రాస్తున్నామనుకునేది అక్షరాలు కాదు. కేవలం భావం మాత్రమే. అందుకే అంత వ్యతిరేక అర్థాలున్న పదాలు కూడా సవ్యంగా ఒకచోట చేరిపోయాయి. ఇది కవితను అల్లడం కాదు. కవిత్వాన్ని అనుభవించడం, కలవరించడం. పలవరించడం. పలకరించడం.

అమ్మకోసం, నాన్నకోసం రాసుకున్న కవితల్లోనూ సమాజ చిత్రణ, వ్యక్తిగతం అనిపించే అనుభూతి వెనక చుట్టూ వున్న జీవితాల్ని ప్రతిఫలించిన తీరు, కవిత్వాన్ని మరింత బలంగా తయారు చేసాయి. రైతుల కష్టాన్ని, ఎంచుకున్న, బాల్యాన్ని వస్తువుగా తీసుకున్నా మూస పద్ధతిలో లేని ఒక కొత్త వ్యక్తీకరణను రూప కవిత్వంలో గమనించొచ్చు. స్త్రీల రాతల్లో ఉండే నిస్సహాయత లేదంటే విపరీతమైన తెగింపో ఎక్కువగా వుంటాయనే అభిప్రాయం ఇప్పటికీ చాలామంది దగ్గర వుంది.

ఇప్పుడీ కవిత్వం అపోహలను బీటలు పడేట్లు చేసింది.

స్వేచ్ఛను ఎరగని స్వేచ్ఛాజీవి ఆమె” – అంటూ స్త్రీల చుట్టూ వుండే కనిపించని సంకెళ్ళని చూపించిన ఒకే ఒక వాక్యం .

ప్రతి తరంలోనూ స్త్రీల తరుపున నిలబడేందుకు కొన్ని బలమైన గొంతుకలు కావాలి. కొన్ని బలమైన ప్రతీకలు కావాలి. మారుతున్న కాలంలో కనిపించకుండా స్త్రీలని కమ్ముకుంటున్న కొత్త తరహా వివక్షలని ఎండగట్టడానికి, ఎదుర్కోవడానికి ఇలాంటి స్వరాలు మరిన్ని ముందుకు రావాల్సిన రోజులివి.

స్త్రీవాదం చర్చించిన, విపులీకరించిన, ప్రశ్నించిన అనేక అంశాలను కవిత్వం చేసింది. అదే కవిత్వ ప్రత్యేకత. చాలా సూటిగా, నిర్మలంగా, నిజాయితీగా గాయాలలోతులన్నింటినీ కవిత్వమంతా విత్తనాల్లా చల్లుకుంటూ పోయింది. పరుషపదాల్లేవు. స్త్రీ పురుషులు ఏకజీవులుగా కలిసి జీవన ప్రయాణాన్ని కొనసాగించాలన్న తపన వుంది. సమాజం జీవితాల్ని సమాధులుగా చేసినా మట్టిని పెళ్ళగించుకొని వచ్చి, నిజాల మూటను విప్పిన కవిత్వ స్వరమాయేది.

ఎప్పుడు ఎక్కడ కొత్త కవయిత్రి పుట్టినా తృప్తిగా వుంటుంది నాకు. ఆమె ఇక జీవించగలదు అనే నమ్మకం ఏర్పడుతుంది. ఇన్నేళ్ల నిశ్శబ్దపు కొండల్ని, ప్రశ్నల ఆయుధాలతో చైతన్యాన్ని కలిగించే దిశగా సాగే వీరు సమాజానికి కావాల్సిన వారు. దృక్పథాల్లో సైతం మార్పు తీసుకొచ్చారు.

ఈమె కవిత్వాన్ని గురించి రజా హుస్సేన్ గారు అద్భుతమైన విశ్లేషణ చేశారు. రూపా రుక్మిణిని పూర్తిగా సరైన రీతిలో అర్థం చేసుకోవడానికి వుపయోగపడుతుందది.

వేదాంత ఛాయలు, జీవనావగాహన , సూటైన ప్రశ్నలు ఈమె కవిత్వ ఆయుధాలు

ఒంటరితనాన్ని, నిశ్శబ్దాన్ని మేల్కొల్పి, మనిషితనం కోసం రూప చేసిన అన్వేషణ సారం ఇదంతా

మార్పు పుట్టుకనిలా చెప్పింది

మార్పు మనలోనే మనతోనే అని

ఒక్క క్షణం ఆలోచించేద్దాం”. 

ఇంకొక చోట

నిజం తెలిసినా, ఆశను వీడని సీతాకోకచిలుకలా ఎదురుచూపు అంటుంది.

 “తండ్రి అయ్యే సారం నీలోనే లేదని తెలిపే పదమే లేని భాషలోవున్నాయంటుంది

గొడ్రాలు

గొడ్రాలుడు, గొడ్డుమోతుదిగొడ్డు మోతోడు ఎలా భాషా ద్రోహం కూడా జరిగిందో ఆలోచించండి అంటుంది.

తమ కోసం తామె కాకుండా, అందరి కోసం బతకాలన్న, ఆలోచించాల్సిన అవసరాన్ని గుర్తెరిగి రచనలు చేయడం తక్షణ ప్రేరేపణలుగా కనిపిస్తున్నాయంటుంది.

 ‘ఆమెను గురించి రాస్తూ కూడి కలలో తీసివేతను 

వెన్నీళ్లకు చన్నీటిని కాలమెరుగని చక్రాన్ని

అలుపెరుగని అవిశ్రాంతని 

అన్నీ తెలిసిన మౌనాన్ని అని తీర్చేస్తుంది.

కరోనామీద రెండు, మూడు కవితలు రాసింది. వలసపక్షుల ఆకలి ఉద్యోగుల కడగండ్లు, రోడ్లపాలైన ఆత్మాభిమానాలు గుండెను తొలిచేలా రాసింది.

చాలా లోతైన అర్థాన్ని విప్పిన కవితనిశ్శబ్దనవ్వు‘ 

గువ్వ పిట్ట చేప్పే కబుర్ల పంజరంలో 

మనసుకి వేసుకున్న సంకెళ్ళలోని నిశ్వబ్ద నవ్వునై‘.

రూప కవిత్వంలో సంస్కృత భాషపై మోజు ఎక్కువగా కన్పిస్తోంది. అది అలవాటై అప్రయత్నంగా రావటం, కొంచెం జాగ్రత్త తీసుకుంటే కవిత నడక తెలుగు పదాలతో మరింత బాగుంటుందనిపించింది.

మౌనంస్త్రీలనెలా ఆవరించుకుంటుందో చెప్పిన మంచి కవితమాటలేవి”. ‘రంగుల గాయాన్నుంచి, ప్రేమకో వాక్యం వరకూ 51 భావాల సంచలనాల్ని పుస్తకం మనముందు పరిచింది.

ఒక మంచి కవిత్వాన్ని, ఆలోచనాత్మకమైన కవిత్వాన్ని, అనుభూతించాల్సిన కవిత్వాన్ని, కొత్త లేత మామిడి చివురు లాంటి కవిత్వాన్ని చదువుతున్న తృప్తిని కలిగిస్తుంది.

రూపా రుక్మిణికి పుస్తక రూప స్వాగతం.

*****

Please follow and like us:

One thought on “కొత్త అడుగులు-20 ‘రూపా రుక్మిణి’”

Leave a Reply

Your email address will not be published.