చాతకపక్షులు (భాగం-2)
(తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని చిత్రించిన నవల)
– నిడదవోలు మాలతి
అదివో అల్లదివో శ్రీహరి నివాసమూ అన్నాడు హరి మూడంతస్థులమేడ చూపించి, గీత టాక్సీలోంచి దిగి అటువేపు చూసింది. వరసగా నాలుగు కిటికీలు. అతను చూపిస్తున్నది ఏకిటికీవో అర్థం కాలేదు. సరేలే లోపలికెళ్లేక అదే తెలుస్తుందని వూరుకుంది.
అప్పటికి రాత్రి తొమ్మిదయింది. కొత్తకోడలు అత్తారింట అనగా భర్తగారింట అడుగెట్టింది.
తలుపుమీద “వెల్కమ్ హోమ్” అట్టముక్క స్వాగతం చూసి చిన్నగా నవ్వుకుంది. హరి తలుపు తీసి, సామాను గోడవార పెట్టి, “ఇదీ మన స్వర్గసీమ. ఆదుగో ఎదురుగా కనిపిస్తున్నది వంటగది. దానికి ఎడమవైపు రెండున్నర అడుగులదూరంలో వున్నది బాతురూము. దాన్నానుకుని బెడ్రూము. ఇది మన భోజనశాల” అన్నాడు ఎదురుగా వున్న బల్లదగ్గరికి గీతని నడిపిస్తూ.
బల్లమీద చిన్నకుండీ, అందులో ముందురోజు హరి స్నేహితులు అమర్చిన పువ్వులు. వంటింట్లో గిన్నెలూ, కాఫీమగ్గులూ చక్కగా ఫాన్సీషాపులోలాగ పేర్చి వున్నాయి. లివింగురూంలో వున్న ఒకే ఒక కిటికీకి వేసిన తెరకీ కాఫీరంగుసోఫాకి వర్ణసఖ్యత బాగానే కుదిరింది. గీత కిటికీవేపు రెండడుగులేసి, తెర తీసి బయటికి చూసింది. కింద అక్కడా అక్కడా ఒకరిద్దరు సైకిళ్లమీద వెళ్తూ కనిపించేరు. కాలి నడకన వెళ్లే జనాలు తక్కువే.
హరి గబుక్కున ఆమెచెయ్యి పుచ్చుకుని, “నో, నో, అది తీయకు” అంటూ అడ్డుకున్నాడు.
“ఏం?” అంది గీత.
“అది తీస్తే, మనం నడివీధిలో వున్నట్టుంటుంది. మనంవిక్కడ జాగ్రత్తగా వుండాలి” అన్నాడు తమ ఇంటిపరిసరాలు చూచాయగా వివరిస్తూ. అంతకంటె ఎక్కువ మాటాడితే, ఆఅర్భకురాలు ఝడుసుకుని ఇప్పుడే తిరుగుటపా కట్టేస్తుందేమో అనిపించిందతనికి గత పధ్నాలుగ్గంటల్లోనూ ఆవిడవాలకం చూసింతరవాత.
నిజానికి గీతకి కొత్తపెళ్లికూతురు అత్తవారింట అడుగెట్టినట్టు లేదు. సరదాగా శలవులకి ఏదో వూరెళ్లి ఓ హోటల్లో దిగినట్టుంది.
ఆఇల్లు రెండుతరాలకి ముందు ఒక సాధారణకుటుంబం కాపురమున్నది. ఇటీవల కుర్ర యజమానికి హక్కుభుక్తం అయింతరవాత, అతను బాత్రూంలో ఓ స్టవ్వూ, వంటింటిలో టాయిలెటూ, మరో బెడ్రూంలో మరో స్టవూ, టాయిలెటూ, .. ఇలా మార్పులూ, చేర్పులూ చేసి మూడు ఎపార్టుమెంటులుగా మార్చేసి అద్దెలకిచ్చేడు.
“బావుందా?” అన్నాడు హరి అర్థాంగితో.
గీత తలూపింది బావుందని సూచిస్తూ. గీతకింకా అయోమయంగానే వుంది. మెదడు పని చేయడం మానేసి మూడ్రోజులయింది. ఆలోచనలనేవి పుట్టేచోట నీలినీడలు దట్టంగా పరుచుకున్నాయి. ఆవిషయం హరిదృష్టి దాటిపోలేదు. ఇరవైనాలుగ్గంటలలో భూగోళానికి ఆచివరినుండీ ఈచివరికి ఒక్కపెట్టున విసిరేసినట్టు వచ్చి పడితే, ఎవరికి మాత్రం గందరగోళంగా వుండదు? నిన్న పడుకున్న మంచానికీ ఇవాళ పడుకోబోయే మంచానికీ మధ్య రెండు సముద్రాలు, పదివేల మైళ్లదూరం. ఎటు చూసినా గుర్తెరగని మొహాలూ, పుట్టి బుద్ధెరిగిన తరవాత ఏనాడూ కనని వస్తుసంచయం, వినని మాండలీకం …
ఫోను రింగురింగుమంది.
గీతని పడుకోమని చెప్పి, ఫోను తీసుకున్నాడు హరి.
ఊళ్లో పదేళ్లుగా పాతుకుపోయి, ఊరందరికీ పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్న భాగ్యంగారు పిలిచారు, “అమ్మాయి వచ్చేసిందా? ప్రయాణం బాగా జరిగిందా? ఏమైనా కావాలా?”
గీత సోఫాలో వాలి, అతనిమాటలనిబట్టి అవతలివారి మాటలు ఊహించుకోడానికి ప్రయత్నిస్తోంది. … ఆతరవాత మరో రెండుగంటలసేపు హరి ఫోనుమీదే వున్నాడు. సగంమంది తనగురించి తనప్రయాణంగురించి అడుగుతున్నట్టే వుంది. మిగతా సగం నిక్సను రాజీనామా చేసేశాడు, తరవాత దేశం గతేంకానూ వంటి చర్చల్లోకి దిగేరు. హరి ఫోను పెట్టేసి, “ఇహ ఫోర్డు పొడిచేసేదేమిటో చూడాలి” అన్నాడు. గీతవేపు తిరిగి. గీతకి మగతగా నిద్రపడుతోంది.
“అలిసిపోయినట్టున్నావు. రా. అన్నం తిని పడుకుందువుగానీ. హాయిగా నిద్దర పడుతుంది.”
గీత లేచి బల్లదగ్గరికి వస్తూ, “ఎవరు చేసేరు వంట?” అంది.
“ఏం? నాకు వంట రాదనుకున్నావేమిటి?”
“మామూలుగా అమెరికాలో ఏడాదిపాటు వున్నవాళ్లందరూ పెళ్లి చేసుకుంటాం అంటూ హడావుడిగా ఇండియా రావడానికి కారణం వంట రాకపోవడమే అంది మా సత్యం” అంది గీత నెమ్మదిగా ఉడికిస్తున్నట్టు.
హరి ఫక్కున నవ్వేడు “గట్టిదానివే. మెత్తగా నంగనాచిలా కనిపిస్తావు కానీ,” అన్నాడు మొహంలోకి మొహంపెట్టి కళ్లలోకి చూస్తూ. గీత కళ్లు చికిలించి తలూపింది వెక్కిరిస్తున్నట్టు.
తింటున్నంతసేపూ “అదెలా వుంది, ఇదెలా వుంది” అంటూ హరి ఒహటే గొడవ చేసేడు.
ప్రతిసారీ, “బావుంది,” “చాలా బావుంది” “ఫరవాలేదు” “ఇదేమిటీ, తోటకూరా? బచ్చలికూరలా వుందే, నువ్వులపొడి వేసి చేస్తే బావుంటుంది” అంటూ గీత జవాబులు చెబుతుంటే, హరి మహ ముచ్చట పడిపోయేడు. ఒక్కపూటలోనే గీతలో ఎంత మార్పు వచ్చేసింది అనుకుని ఉబ్బిపోయేడు. భవిష్యత్తంతా బంగారం!
“ఫరవాలేదులే. నెమ్మదిగా అదే అలవాటయిపోతుంది. అన్నీ బాగానే వుంటాయి.” అన్నాడు ఏవిషయమో స్పష్టం చెయ్యకుండా.
గీతకి కూడా మనసు స్థిమితపడింది. ఆక్షణాన అతడు జననాంతరబంధువులా తోచేడే కానీ ఇటొచ్చి పెళ్లాడేసి అటు ప్లేనెక్కేసిన ఎన్నారయ్లా అనిపించలేదు. ప్రయాణపుబడలిక కూడా కాస్త తగ్గినట్టే వుంది. మంచం ఎక్కితే నిద్దర రాను కాక రానని మొండికేసింది.
జట్లాగన్నాడు హరి ఇదే కాబోలు. శరీరం అమెరికా చేరినా శరీరతత్త్వం ఇంకా తెలుగుదేశం వదలనంటోంది. పన్నెండు దాటింది. తెల్లవారుతుంటే చిన్న కునుకు పట్టింది.
బాగా తెల్లారింతరవాత లేచి. మొహం కడుక్కుని వచ్చేసరికి, హరి కాఫీ పెట్టి వుంచాడు.
గీత చిన్నగా నవ్వుతూ, “అమెరికాజీవితం ఇంత సుఖం అనుకోలేదు” అంది.
“ఇంకా ఇప్పుడే ఏం చూశావు?” అన్నాడు గీత కళ్లలోకి చూస్తూ.
ట్రింగుమంటూ ఫోను …
“తెల్లారిందీ ఫోనులకి? ఇంత పొద్దున్నే ఎవరూ అలా ఫోనులు చెయ్యరన్నారూ …”
“అమెరికనులు చెయ్యరు. మనవాళ్లకలాటి పట్టింపులు లేవు. తొలికోడి కూస్తూనే పిలుపులు మొదలయిపోతాయి” అన్నాడు హరి ఫోను అందుకుంటూ.
అతనన్నమాట నిజమే. అవతల్నించి మాధవ్ పిలిచాడు. తనూ రాధా మరో గంటలో రావచ్చా గీతని పలకరించి, స్వాగతం చెప్పడానికి అని.
“అప్పడే ఏమిటండీ ఈ అభ్యాగతులు?” అంది గీత. తనకింకా అసలు అమెరికా చేరినట్టే లేదు.
“వాడు అభ్యాగతుడు ఏమిటి? ఇంటివాడికిందే లెక్క. వాడూ నేనూ ఒకే బళ్లో చదువుకుని, ఒకే పంతులిచేతిలో బెత్తపురుచులు చూసినవాళ్లం. నువ్వేం తయారవఖ్కర్లేదులే. రెండునిముషాలు చూసి పోతారంతే. ఈదేశంలో మన మొహాలు ఎక్కడయినా కనిపిస్తాయా అని ఆవురావురుమని ఎదురుచూస్తుంటాం. నీకే తెలుస్తుందిలే క్రమంగా. వాళ్లు వస్తాం అంటే రావద్దని ఎలా చెప్పను?” అన్నాడు హరి గుక్క తిప్పుకోకుండా.
* * * * *
(ఇంకా ఉంది)
చిత్రకారుడు: ఆర్లె రాంబాబు
👌
ఆ ఇమోజీకి అర్థం నాకు తెలీదు కానీ చదువుతున్నందుకు ధన్యవాదాలు.
Chaala ruchi karam ga vundi kaani mari koncheme vaddisthunnaru
మీ ఆదరపూర్వకవ్యాఖ్యకి ధన్యవాదాలు.
అప్పుడే అయిపోయిందా అనిపించేలా చిన్నది గానె ఉన్నారు విషయాలు చెప్పీ చెప్పకుండా చాలానే చెప్పారు.నిన్న టికీ ఇవాళ్టికీ రెండు సముద్రాలూ,పదివేలమైళ్ళూ అన్నారు, అమెరికా వచ్చిన ఏడాది కే తిరిగి వచ్చి హడావుడి గా పెళ్ళి చేసుకోవటం లోని అంతరార్థం,శరీరం అమెరికా చేరినా శరీరత్వం తెలుగు రాష్ట్రాల్లోనే ఉండిపోవడం.ఇలా చిన్న మాటల్లో బోలెడు విషయాల్ని ఇమిడ్చి చెప్పటం మాలతి గారి రచనా విశేషం.తర్వాతి భాగం కోసం ఎదురుచూస్తూనే మీకు అభినందనలు మాలతి గారూ
ధన్యవాదాలు సుభద్రదేవిగారూ. మావ్యాఖ్యలలో విషయచర్చ నాకు చాలా ఆనందదాయకం. అమెరికా సౌభాగ్యాలే చాలామంది మాటాడతారు కానీ మనలాటివారి అంతర్మథనం చాలామంది చెప్పరు తెలీకో, ఎవరేమనుకుంటారో అన్న పిరికితనమో మరి. ధన్యవాదాలు.
అప్పుడే అయిపోయిందా. మళ్ళీ నెల వరకు ఉండా లా
ధన్యవాదాలు
కొత్తపదం అభ్యాగతులు మొదటిసారి వింటున్నా
ధన్యవాదాలండి. సుమారుగా అభ్యాగతుడు అన్నది భోజనవేళ అనుకోకుండా వచ్చిన అర్థంలో వాడుక నాకు తెలిసినంతవరకూ.
అతిధి కి అభ్యాగతుడికి తేడా వుంది.. అభ్యాగతుడు మన ఇంటి గేట్ బయట నిలబడి, మనం పెట్టేది స్వీకరించేవాడు… అతిధి మన ఇంట్లో కూర్చుని మనతో కలిసి భోజనం చేసేవాడు..
ధన్యవాదాలు.