చెట్టునీడలో ప్రాణదీపం

(మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

-డా.రమణ యశస్వి

 

మధ్యాహ్నం మూడు గంటలు.  గుంటూరు ఎండ ప్రతాపం చూపిస్తున్నవేళ. డాక్టర్ దీప ఇంటికొస్తున్న వేళ కూడా అదే. పైన సూరీడు  మంటలు లోపల ఆకలిమంటలు . ఇంతలో ఎవరో మూలుగుతున్న శబ్దం వచ్చినవైపు చూసింది స్కూటీ పక్కన పెడ్తూ .ఆ వీధిలో చెట్టు నీడఉన్న ఇల్లు తమదే .  ఆ చెట్టు కింద పడిపోయి మూలుగుతున్న ఆడకూతుర్ని చూసి ఒకింత చలించిపోయింది .ఒకపక్కన ఆకలి ఒక పక్కన సాయం చెయ్యాల్సిన దీనురాలు .

దగ్గరకు పోయి అడిగింది ఏమైందీ ? అని .

పక్కన కడుతున్న అపార్టుమెంటులో ఇటుకలు మోస్తుంటే కళ్ళు తిరిగి  పడిపోయిందిట. కరోనా నేమో అనే అనుమానంతోటి ఎవరూ చుక్క నీళ్ళుకూడా ఇవ్వడానికి సాహసించలేదట. చిన్నగా

లేచివచ్చి ఈ చెట్టు నీడలో పడుకుండిపోయిందట . ఇంట్లో కెళ్ళి చల్లని నీళ్లు తెచ్చి   ఇచ్చింది. కొంచెం ఓపిక వచ్చినట్లుంది .

లేచి చిన్నగా వారగా కూర్చొని అమ్మా నువ్వు తిన్న తర్వాత నాక్కూడా కొంచెం బువ్వపెట్టమ్మా లోపల

పిండం గిర్రున తిరుగుతున్నట్లుంది . తల్లి ప్రాణం లోపల పిండం గురించి కూడా తల్లడిల్లిపోవడం చూసి కాన్పుల డాక్టరమ్మకే ఆశ్చర్యం వేసింది. రేపు పుట్టేవాళ్ళు తల్లి కి పిండం కూడా పెట్టరని తెలిసీ  తల్లడిల్లుతుంటారు.  తల్లులు అనుకుంటూ లోపలికెళ్ళి పళ్లెంలో అన్ని  పదార్ధాలు వడ్డించి తెచ్చి పెట్టింది పెద్ద చెంబు నీళ్లు పక్కన పెట్టి తాను తినడానికి లోపలికి వెళ్ళింది. పిల్లవాడు పెట్టుకొని తిని  నిద్రపోతున్నాడు.

డాక్టర్ దీప ప్రభుత్వ ఆస్పత్రిలో స్త్రీ వైద్య నిపుణురాలు. ఒక వేళ ఆ మహిళ తిన్నతరవాత కూడా లేవకపోతే   ప్రభుత్వాసుపత్రికి తీసుకెళదామనుకుంటూ చెయ్యికడుక్కుని బైటకు వచ్చింది.అప్పటికే లేచినుంచుంది ఆ అపఱిచిత గర్భిణీ. సుమారు ఆరునెలల గర్భం అనుకుంటూ అదే విషయం అడిగింది.

‘ఆరోనెల పెట్టిందమ్మా మొన్ననే. మూడో కాన్పు ,మగోడికోసం ఆగాము’.

మగోడి కోసం కాదు ఒక తాగుబోతు కోసం ఒక రేపిస్టుకోసం, ఒక  శాడిస్టు కోసం  అని చెప్పాల్సిన రోజులు వచ్చాయి ఇద్దరు ఆడపిల్లలు చాలరా మీకు.  మీ ఆయన ఏమిపని చేస్తాడు ?

ఒట్టి  తాగుబోతమ్మా మీరు కరెస్టుగా చెప్పారమ్మా. తాగి పక్కింటామె చెయ్యిపట్టుకుంటే రెండునెలలు జైల్లో వుండొచ్చినా బుద్దిరాలేదమ్మా.

‘తాగిన మైకంలో  తెలీక పొరపాటు పనిచేసాను అని జడ్జి గారికి మొరపెట్టుకుంటే తక్కువ శిక్షతో బైటపడ్డాను. తాగుడు వల్ల ఎంత ఉపయోగం ఉందో  చూడవే’ అంటూ ఇంకా పెంచాడు తాగుడు. ఇది జరిగిన తర్వాత ఆ ఊళ్ళో ఉండలేక ఇదిగో ఇలా వలస వచ్చాము ఈ పట్నానికి .

ఇంతలో లాకుడౌన్ మొదలు . పిల్లల్ని మా అత్త మామలదగ్గర ఊళ్ళోనే దిగబెట్టొచ్చాము. మా ఆయన ఎప్పుడూ తాగిపడిపోయి ఉంటాడు నేను ఎప్పుడూ పని చేస్తూ ఉంటాను. గల గల మాట్లాడుతూనే ఉంది ‘గంగ’ ప్రవాహంలా. మాటల్లో తన పేరు గంగ అని చెప్పింది. 

తను ఇప్పటిదాకా  మాట్లాడుతోంది  ప్రభుత్వాసుపత్రి కాన్పుల డాక్టరమ్మ అని తెలుసుకొని మురిసిపోయింది.

‘ అమ్మా మీ చెట్టు నీడిచ్చింది ఈ కాన్పు అయ్యేదాకా మీ ఇంట్లో కూడా నీడివ్వండమ్మా’. ఎండల్లో ఇటుకలు మోసే పనులు చెయ్యలేకపోతున్నానమ్మా   అని దీనంగా వేడుకుంది గంగ. చూద్దాంలే ముందు ఇంటికెళ్లి రెస్టు తీసుకో పో అని గంగని పంపేసింది .

చెట్టు నీడ ఎంతమంచి  పనిచేసింది అని ఆశ్చర్యపోతూ  లోపలికెళ్ళి అలసటతో మంచంపై వాలిపోయింది. నిద్ర పట్టకపోగా ఆవేదనతో కూడిన ఆలోచనలు ముసురుకున్నాయి.

మధ్య తరగతి ప్రైవేటు ఉద్యోగం చేసే తల్లి దండ్రులకు మూడో కూతురుగా పుట్టిన దీప  చదువులో చురుకుగా ఉండటం ఫ్రీ ఎంబీ బీఎస్,  గైనికాలజీ సీట్లు రావడం చదువయ్యేసరికి ముప్పయ్యేళ్లు నిండటం, ప్రభుత్వ ఉద్యోగం రావడానికి రెండేళ్లు పట్టడంతో 32 ఏళ్ళ పెళ్లికూతురు అయ్యింది దీప.  ఈ లోపు అక్కలిద్దరికీ పెళ్లిళ్లు చేసేసరికి అమ్మానాన్నలు కొవ్వొత్తుల్లా కరిగిపోయారు . బ్యాంకు బాలన్స్ కూడా తరిగిపోయింది . దీప ఉద్యోగ0 వారికి ఒయాసిస్సులా కనిపించింది . చామనఛాయగా ఉండటం, ముప్పయిలు దాటడం వలన పెళ్లి సంబంధాలు కుదరటం లేదు. పెద్ద చదువు పెద్ద ఉద్యోగం పెద్ద వయసుతో  చదువులు రాని, ఉద్యోగాలు లేని  పెళ్లికొడుకులను చేసుకోవడానికి మనస్కరించక మంచి సంబంధం కోసం చూస్తున్నప్పుడు ఇదిగో ఈ పెళ్లికాని 39 ఏళ్ళ ప్రసాదు మ్యాచ్ వచ్చింది.

అబ్బాయి లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడు . వాళ్ళ అక్కలిద్దరికీ పెళ్లిళ్లు చేసి ఇతనికి చేద్దా మనుకునేసరికి ముదురు పెళ్ళికొడుకు అయిపోయాడు . వీళ్ళింట్లో మగపిల్లోడి కోసం ఆగితే మూడో సంతానంగా అక్కలిద్దరి తర్వాత ప్రసాద్ పుట్టాడు. దీప వాళ్ళింట్లో మూడో సంతానంగా మళ్లీ ఆడపిల్ల దీప పుట్టింది.

లాయర్ సంబంధం అనేసరికి దీపకి ,కొంచెం భయం వేసింది. డాక్టర్ కీ లాయర్ కీ ఉప్పు నిప్పు లాగా ఉంటుంది సమాజంలో. అదే జీవితంలో కూడా కొనసాగితే ..ఆలోచించింది.  లక్కీగా  తన   క్లాసుమేట్ , ఆమె  భర్త లాయర్లుగా కోర్టు లో ప్రాక్టీస్ చేస్తున్నారని గుర్తొచ్చి ఫోన్ చేసి ప్రసాద్ గురించి విచారించింది. ఎలాంటివాడు , వ్యసనాలు ఏమైనా ఉన్నాయా, పెళ్లి ఎందుకు ఇంత లేట్ అయింది లాంటి విషయాలు అడిగింది. 

వాళ్ళు మంచి విలువైన  సమాచారమే ఇచ్చారు. ఒక సమయంలో ప్రసాద్  జులాయిగా   తిరుగుతుంటే  వాళ్ళ మేనమామ దగ్గరకి చేర్చి లా చదివించాడుట, తన కూతుర్ని చేసుకుంటాడనే  చిన్న స్వార్ధంతోటి. ప్రసాద్ కూడా సరేనన్నాడుట. పెళ్లిమాటలు మాట్లాడుకుందామనుకునేసరికి తాను మరెవర్నో ప్రేమించినట్లు చెప్పి ప్రసాద్ ని  కాదన్నది .అప్పటినుండి ఆడవాళ్లంటే అనుమానాస్పదంగా చూడటం, పెళ్ళికి సుముఖంగా లేకపోవడంతో మానసికంగా కుదుట పడినతర్వాత పెళ్లి చేద్దామని కుటుంబ పెద్దలు ఆగారుట. కోర్టుకెళ్లి ప్రాక్టీస్ చేస్తున్నాడు ఒక సంవత్సరం నుండి  అని మళ్ళీ పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పారు ఆ

లాయరు దంపతులు. అతనికి వ్యసనాలు ఏమీలేవని కూడా చెప్పారు.

కక్కొచ్చినా కళ్యాణమొచ్చినా ఆగదన్నట్లు , ఇద్దరికీ ఒకరికొకరు నచ్చడం,ఇరు వర్గాలు మాట్లాడుకోవడం, పెళ్లి అయిపోవడం చెకచెకా జరిగిపోయాయి.

సంవత్సర కాలంలో ప్రసాద్ ని అర్ధం చేసుకోవడానికి చాలా ప్రయత్నించింది . ఆ అంతుచిక్కని మనస్తత్వం అర్ధం కాలేదు. ఒక డాక్టర్ గా మనస్తత్వం అర్ధం చేసుకునే అలవాటు ఉండటం వలన కొంతవరకు  విశ్లేషించుకో గలిగింది. అబద్ధాలు,అనుమానాలు ఎక్కువ మనిషికి. ఒక రకంగా అబద్ధాల పుట్ట, అనుమానాల తేనెతుట్టె అనిపించేలా ఉంటాడు. ఎప్పుడెలా ఉంటాడో, ఎలా ప్రవర్తిస్తాడో వూహించలేకుండా ఉంది. మొత్తానికి ఒక బుడతడు పుట్టుకొచ్చాడు . వాడితోనే తీరికలేకుండా ఐదేళ్లు గడిచిపోయాయి .

ఇంతలో ప్రసాద్ కి ఒక అనుమానం పుట్టుకొచ్చింది. ఈ పిల్లవాడు నాకు పుట్టాడా ?అంటూ నిజం చెప్పమని  వేధించడం మొదలుపెట్టాడు. ఇరు కుటుంబాల పెద్దలముందుకు వచ్చింది విషయం. అందరికీ దీప ఎంతమంచిదో, పద్ధతిగలదో తెలుసు. ప్రసాద్ కి నచ్చచెప్ప చూసారు.  నైట్ డ్యూటీ లు చేసేవాళ్లను నేను నమ్మను అని మూర్ఖపు సమాధానం చెప్పాడు. మరి ఐదేళ్ల తర్వాత  అనుమానం దేనికొచ్చిందని అడిగితే అనుమానం ఎప్పుడైనా రావచ్చని తెగేసి చెప్పాడు. సరే ఇప్పుడు ఏమిచెయ్యమంటావు? అని అడిగితే సీత లాగా అగ్నిప్రవేశం చెయ్యక్కర్లేదు సింపుల్ గా ‘డీ యెన్ ఏ’  చేయించుకుందాము అని పట్టు పట్టాడు. ఆరునెలల పాటు  పోరు పెట్టాడు . పెళ్ళాన్నీ, పిల్లాడినీ దగ్గరకురానీలా,మాట్లాడనీయలా.  సంసారం ఆగం అయిపోకుండా ఉండాలంటే పరీక్ష చేయించుకోవడమే ఉత్తమం అని కుటుంబ ,సభ్యులు శ్రేయోభిలాషులు, స్నేహితులు చెప్పినమీదట దీప కూడా ఒత్తిడి తట్టుకోలేక ఒప్పుకుంది. మొత్తానికి టెస్టులో పిల్లాడు వాళ్లకి పుట్టినవాడేనని తేలింది.

అలా అనుమానాలు, పట్టుదలలు అబద్ధాలతో మరో ఐదేళ్లు గడిచిపోయాయి .

ప్రసాద్ కష్టపడటం, సంపాదించడం  చేతకాని పని గండం మనిషి అని కూడా దీపకి

అర్ధం అయిపోయింది. కోర్టుకెళతాడు వస్తాడు. అందరితో గొడవపడుతూ ఉంటాడు. ఉద్యోగం ఇంటి పని, డబ్బులావాదేవీలు తానే చూసుకుంటుంది. లోన్ పెట్టుకొని ఇల్లు కట్టించింది. ఇంటి విషయంలో తాను అసలు పాలుపంచుకోలేదు కట్టేటప్పుడు కూడా. పిల్లవాడు బాగా చదువుకుంటున్నాడు దీప కు అదే ఆశ . పిల్లావాడన్నా ప్రయోజకుడైతే బాగుండు అని . కోరుకొండ సైనిక్ స్కూల్ లో సీట్ వచ్చింది.  హాస్టల్లో చేర్పించి వచ్చింది . ముఖ్యంగా తండ్రి మనస్తత్వం, బుద్ధులు రాకుండా చేయడానికి ఇది ఒక మెట్టుగా భావించి పిల్లవాడ్ని మనసు చంపుకొని దూరంగా పెట్టింది.

ఈ లోపు దీపకు గుంటూరు బదిలీ అయింది . తను ‘నేను రాను నువ్వే వెళ్ళు, పెళ్ళప్పుడు       నీది బదిలీ అయ్యే జాబ్ అని చెప్పకుండా దాచిపెట్టావు, ఇప్పుడు నీతో నేనేందుకు వస్తాను’ అని మూర్ఖంగా పిడి వాదన చేసాడు. దీపకు దుఃఖం ఆగలా . పిల్లాడు ఒక చోట ,మేమిద్దరం చెరొక చోట.

ఉద్యోగం వదిలేసే పరిస్థితీ కాదు. గుంటూరు లో జాయిన్ అయి ఇల్లు అద్దెకు తీసుకొని ఒక్కతే ఉంటోంది . చుట్టూ గార్డెన్ ,చిన్న కుక్కపిల్ల , ఉద్యోగం,ఫోన్లో పిల్లవాడితో మాట్లాడుకోవడమే తన లోకం అయిపోయింది ఇప్పుడు.

ఇంతలో కరోనా వచ్చింది . పిల్లాడ్ని హాస్టల్ నుండి తెచ్చేసుకుంది.

రోజూ కరోనా వచ్చిన గర్భిణీ స్త్రీలకు  ఆపరేషన్లు చేసి పిల్లల్ని బయటకు తీయడం వలన పిల్లవాడ్ని వేరే గదిలో ఉంచి జాగ్రత్తగా చూసుకుంటోంది.

ప్రసాద్ అక్కడ అందరికీ  ‘నా డాక్టర్ పెళ్ళానికి , కొడుక్కి కరోనా వచ్చిందని ప్రచారం చేస్తున్నాడుట. నా అత్తగారు అదే విషయం  ఫోన్ చేసి అడిగింది. దేవుడి దయ వల్ల ఇప్పటివరకు కరోనా   మాకు  రాలేదు అని చెప్పాను .

మరుసటి రోజు పొద్దున్నే మళ్ళీ  గంగ వచ్చింది . ఆస్పత్రికి తీసుకెళ్లి కరోనా పరీక్ష చేయించి నెగటివ్ అని తేలిన తర్వాత ఇంట్లో పని మాస్కుపెట్టుకొని చెయ్యడానికి ఒప్పించింది . రాత్రిళ్ళు బయట వరండాలో పడుకుంటోంది . రెండు నెలలు గడిచాయి . ఇప్పుడు ఆరోగ్యంగా  బాగుంది గంగ.

ఒకరోజు నేను ఆస్పత్రి డ్యూటీ లో ఉన్నప్పుడు తాగిన మొగుడు వచ్చి కొట్టుకుంటూ గంగ ని తీసుకుపోయాడని భయపడుతూ మా  బాబు చెప్పాడు. గంగ సెల్ కి  ఫోన్ చేస్తే   స్విచ్ ఆఫ్ అని వచ్చింది . ఏమిచేయాలో పాలుపోక దిగాలుగా కూర్చుండిపోయింది . కరోనా నా బాబుని నా దగ్గరకు రప్పించింది, మరో మనిషిని సాయ పడమని పంపింది  అని ఆనందపడేలోపే గంగ అనుకోకుండా వెళ్ళిపోయింది . ఆ తాగుబోతు మొగుడు ఏమి ఇబ్బందులు పెడుతున్నాడో  ఏమోఅనుకుంటుంది  గంగ డెలివరీ డేట్  గుర్తొచ్చినప్పుడల్లా . 

గంగ మొగుడు ఒక రోజు పొద్దున్నే  ఇంటికొచ్చాడు .  ‘ అమ్మా  గంగ కి కరోనా జబ్బు  వచ్చింది, ఆరెంపీ డాకటేరు పయ్యేటు ఆస్పత్రికి తీస్కెళ్లిండు  వాళ్ళు ఆపరేశాను చేసి బిడ్డను తియ్యాలంటే రెండు లచ్చలు అడుగుతుండ్రు కొంచెం సాయం చెయ్యమ్మా’అంటూ తాగిన  మైకంలో పదేపదే బతిమాలుతున్నాడు .

 తాగుబోతులు నిజం చెపుతారంటారు . నా మొగుడు తాగుబోతైనా బాగుండేది నిజం

చెప్పేవాడు అని మనసులో  నవ్వుకుంటూ ‘ గంగకి ఫోన్ కలుపు ఆమెతో మాట్లాడి కానీ సాయం చెయ్యను’  అన్నాను .  నా కాడ పోన్ లేదమ్మా అని కింద పడి ఏడుస్తున్నాడు .

 ‘బాబూ నా దగ్గర  అంత డబ్బు లేదు   గంగని గవర్న మెంటు ఆస్పత్రికి తెస్తే రూపాయి ఖర్చు లేకుండా చేసిపెడతా ‘ అని చెప్పాను .

 ‘గవర్నమెంటు ఆస్పత్రిలో బాగా చెయ్యరంటమ్మా  ఆరెంపీ డాకటేరు చెప్పిండు. నీ డబ్బు నేను,  గంగ సాకిరీ చేసి తీరుత్తాము.

‘ నా మొగుడు తాగుబోతైతే పెళ్ళాం పిల్లల గురించి   ఆలోచించేవాడేమో  అనుకుంటూ ‘ డబ్బివ్వలేను అక్కడికి తీసుకురా పో ‘ అంటూ నేను బాబు లోపలికెళ్ళి తలుపేసుకున్నాము. 

తర్వాత ఏమయ్యాడో ఏమో   తెలీదు ఒక గంట తర్వాత తలుపు తీసి చూస్తే బయట లేడు.

రెండు రోజుల తర్వాత దీప నైట్ డ్యూటీ చేస్తున్న సమయంలో  పీజీ వచ్చి ‘మేడం సీజర్ పోస్ట్ చేసాం కోవిడ్ పాజిటివ్ కేసు ‘ హెచ్ బీ తక్కువుంది , ఓ నెగటివ్ రేర్ గ్రూప్ ‘ అని చెప్తూ కేసు షీట్ నాకు ఇచ్చింది . గంగ అని పేరు చూసి  ఉలిక్కిపడ్డాను . ‘ మేడం ఈమె తాగుబోతు హస్బెండ్ మాటిమాటికి ‘ఒక యాభైవేలు దొరికినై ఎట్టాగైనా నా యావిడ్ని బతికించండి ‘ అని బతిమాలుతున్నాడు .

ఇంతలో గంగ మొగుడు ఇంకో వ్యక్తితో  లోపలికొచ్చి రక్తం కానీ ఏమైనా కానీ అన్నీ మీరే చూసుకోండి తల్లీపిల్లా బాగుండాలి ఈ యాభై ఉంచండి  అని అక్కడ డబ్బు కట్ట  పెట్టి వెళ్లిపోయారు .

ఆ పీజీ డాక్టర్ ‘బాబూ ఇది ప్రజల కోసం పెట్టిన ప్రభుత్వఆస్పత్రి ఇక్కడ డబ్బులు ఎవరూ తీసుకోరు అని చెప్తున్నా వినకుండా  వెళ్లిపోయారు .

దీప తన  కాన్పు అప్పుడు భర్త ప్రసాద్ ఆస్పత్రికి రాను కూడా రాలేదు అని గుర్తు చేసుకుంటూ, పీజీకి గంగ తో తనకున్న అనుబంధం చెప్పి ‘ఆ యాభై వేలు గంగ పేరుమీద బ్యాంకు లో వేద్దాం జాగ్రత్తగా ఉంచు ఆపరేషన్ కి రెడీ చెయ్యండి నేను వస్తాను’ అని చెప్పింది.

పీజీ డాక్టర్ మేడం ‘గంగకి  బ్లడ్ చాలా తక్కువుంది ఓ నెగటివ్ బ్లడ్ మన బ్లడ్ బ్యాంకు లో లేదట మరి ఇప్పుడు ఎలా చెయ్యడం ? అంది. 

నీకు తెలుసా నాది ఓ నెగటివ్ బ్లడ్ గ్రూప్ నేను బ్లడ్ ఇస్తాను అంటూ  పీజీ తో కల్సి వెళ్లి బ్లడ్  బ్యాంకులో బ్లడ్ డొనేట్ చేసి వచ్చి’పీపీఈ’ కిట్లు వేసుకొని ఆపరేషన్  చేసింది .

గంగ అనడం గుర్తొచ్చింది డాక్టర్ దీపకి ‘ అమ్మా నా పెనిమిటి తాగుబోతైనా నేనంటే ప్రేమపడతాడమ్మా ఒసేయ్ ఒక మగ నలుసుని కని వంశం నిలబెట్టవే అంటాడమ్మా నీ చేతులమీదగా మగబిడ్డని తీసివ్వమ్మా ‘ అని

నిజంగానే మగబిడ్డ పుట్టాడు ‘గంగా నువ్వు అనుకున్నట్లుగానే బంగారం లాటి మగబిడ్డ పుట్టాడు’ అని ఉద్వేగంగా చెప్పింది .

‘అమ్మగారు మీరేనా నాకు కాన్పు చేసింది మీ ఋణం యెట్లా తీర్చుకోవాలో తెలీట్లేదమ్మా’  అంది భావోద్వేగంతో గంగ .

‘చిన్నాపరేషన్ కూడా చేసేస్తున్నాం ‘అని చెప్పి బిడ్డలు పుట్టకుండా ట్యూబెక్టమీ  కూడా చేసేసారు .  డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయింది గంగ. వెళ్లేప్పుడు జరిగిందంతా చెప్పి తన బ్యాంకు అకౌంట్ లో ఆ డబ్బు వేసేసారు .

తన భర్త ప్రసాద్ తో అబ్బాయి కి ఐదేళ్లు వస్తున్నాయి వీడికి తోడు ఒక ఆడపిల్లఉంటే బాగుంటుంది అని తన కోరిక బైటపెట్టింది .’ వీడే నాకు పుట్టాడో లేదో తెలీలేదు మళ్ళీ ఇంకొకళ్ళా’ అంటూ అప్పటినుండి డీఎన్ ఏ టెస్టుకు పట్టుపట్టడం గుర్తొచ్చి కళ్ళనీళ్ళను చీరకొంగుతో తుడుచుకొంది.ఇక ఆ రోజే నిర్ణయించుకొంది ఉన్నవాడిని మంచిగా పెంచి ప్రయోజకుడ్ని చేస్తే చాలుఅని.

అలాగే ఆ రోజునుంచి పెళ్లయినా సంసార సుఖంలేని స్త్రీగా మిగిలిపోయింది .

ట్రాన్స్ఫర్ వల్ల సంసారం కూడా చిన్నాభిన్నమైపోయింది.

తెలివితేటలూ ,టాలెంట్ ,మంచితనం ఇన్ని ఉన్నాకూడా తన జీవితం ఇలాంటి వాడి పాలబడటం వలన నాశనం అయిపోయిందని దిగులుపడుతూ ఉంటుంది. ఈ బాధలుపడలేకనే ఎంతో మంది స్త్రీలు విడాకులు  కోరుకుంటున్నారు, సింగిల్ గా ఉంటూఅదొక స్టేటస్ సింబల్ గా చేసుకొని గర్వంగా  కూడా ఫీల్ అవుతున్నారు.

గంగ ప్రసవం అయిపోయి నెల దాటి పోయింది. మధ్యలో రెండు సార్లు చెకప్ కి వచ్చింది. పిల్లాడు ఆరోగ్యం గానే పెరుగుతున్నాడు. గంగకి మళ్ళీ కరోనా టెస్ట్ చేస్తే నెగటివ్ వచ్చింది. ఒక నెల తర్వాత మళ్ళీ వస్తాను అని సెల్ నంబర్ ఇచ్చి వెళ్ళిపోయింది.

కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీప కరోనా పోసిటివ్ డెలివరీలు చెయ్యక తప్పడం లేదు .

ఈ నేపథ్యంలో దీపకి కరోనా వచ్చి ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. వెంటిలేటర్ మీద పెట్టారు. పిల్లాడ్ని ఒక పీజీ విద్యార్థి చూసుకుంటున్నాడు. కాకినాడ నుంచి ఎవరూ వచ్చే పరిస్థితి కనిపించలేదు లాక్ డౌన్  వలన. అన్ని మందులు ట్రై చేశారు ప్లాస్మా ఇస్తే బాగుంటుంది అని నిర్ణయించారు. ఓ నెగటివ్ గ్రూప్ అనగానే గంగ గుర్తొచ్చి ఫోన్ చేశారు.

గంగ తనకు డాక్టరమ్మగారి ఋణం తీర్చుకునే అవకాశం వచ్చింది అనిచీర కొంగు వత్తుకుంది .

‘అమ్మా  నేను తక్కువ కులందాన్ని అమ్మ గారు పెద్దకులంలో పుట్టిన పెద్ద డాకటేరు నా రకతం  తీసుకుంటారా ? అని   పెద్దగా ఏడ్చేసింది గంగ.

 కరోనాకి అందరూ సమానమే అంటూ నచ్చ చెప్పారు పీజీలు, మిగతా డాక్టర్లు . వెంటనే ప్లాస్మా డొనేట్ చేసింది.

రెండుమూడు రోజులతర్వాత వెంటిలేటర్ తీసేసి వారం తర్వాత ఐసీయూ నుంచి రూమ్ కి మార్చారు. డిశ్చార్జ్ అయి ఇంటికెళ్ళినతర్వాత కరోనా టెస్ట్ చేస్తే నెగటివ్ వచ్చింది. అప్పుడు కానీ పిల్లవాడ్ని దగ్గరకు తీసుకోలేక పోయింది . మళ్ళీ గంగ పనికి వస్తోంది. మాస్కు పెట్టుకునే పనిచేసి వెళ్తోంది.

చెట్టు నీడ అనుకోకుండా ఇద్దరి  ప్రాణాలు కాపాడింది. కరోనా పాజిటివ్ కాన్పు చేయడం అంటే అంత  సులువు కాదు. రూపాయి ఖర్చులేకుండా జరగడం కూడా అదృష్టమే. అలాగే డాక్టర్ దీపకి ఓ నెగటివ్ ప్లాస్మాదొరకడం కూడా అంతసులువుకాదు. రెండూ జరిగిపోయాయి. ఇద్దరూ బతికి పోయారు. వారిద్దరూ కులం, మతం, అంతస్తు తేడాలు మరిచి ఒకరికొకరు సాయం చేసుకొని బయటపడ్డారు.

ఇదే కరోనా చెప్పే పాఠం. ఒకరికొకరు సాయం చేసుకుంటూ, పచ్చదనాన్ని పెంచుతూ భూతాపాన్ని తగ్గిస్తూ జీవ వైవిధ్యం కాపాడుకుంటూ పోతే ఇలాంటి ఎన్ని కరోనాలు వచ్చినా మానవాళి మనుగడ సాగించకలుగుతుంది .

చెట్టు నీడలోప్రాణ దీపమై నిలిచిన దీప  మరెందరో జీవితాల్లో వెలుగులు  నింపాలని మళ్ళీ తెల్లకోటు తగిలించుకొని వైద్య  యోధురాలుగా కరోనా కదనరంగంలోకి అడుగుపెట్టింది.

*****

 

Please follow and like us:

2 thoughts on “చెట్టునీడలో ప్రాణదీపం (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)”

  1. కథ లో సామాజిక బాధ్యత కళ్ళకు కట్టినట్టు చూపించారు. కథలో మాధ్యలో దీప ప్రథమ పురుషలోకి మారిపోయింది. నా అత్తగారికి …. చెప్పాను అని ఉంది. కథ పాత్రలో లీనమై పోవటం వల్ల చిన్న పొరబాటు దొర్లి ఉండవచ్చు.

  2. “చెట్టు నీడలో ప్రాణ దీపం” కథ రక్టిగా ఉంది. ఒక మంచి అనుభవం ఉన్న డాక్టర్ కథలో కనిపిస్తున్నారు. అయితే నాకు అర్థం కానిది ఒక విషయం. దీప దేనికి అక్కరకు రాని ఆ భర్తను ఎందుకు భరిస్తోంది? అంత చదువు ఉద్యోగం ధైర్యం అన్నీ ఉన్నాయ్ తనకి. తన సంతానానికి తండ్రి అనా ? నా మనసుకి తోచింది రాశాను. తప్పు అయితే మన్నించాలి

Leave a Reply

Your email address will not be published.