జ్ఞాపకాల సందడి-22

-డి.కామేశ్వరి 

నాలుగు రోజుల  క్రితం మనవడి పెళ్ళికుదిరి  దసరా శుభదినాన ముత్తయిదువులు  పసుపు దంచి శుభారంభం చేసారు అన్న నా పోస్టుకి “ముత్తయిదువులంటే ఎవరు?”  అని సత్యవతి వ్యంగమో, ఎత్తిపొడవడమో  నాకు తెలియదు అన్నారు.

పండగ రోజులు ,ఇంట్లో బంధువులు ,మనవరాలు వచ్చివెళ్లే హడాడావిడీ శుభకార్యం అని అన్నప్పుడు చేసిన విమర్శకి నొచ్చుకున్నా. ముత్తయిదువంటే ఆవిడకి తెలియదనుకునేటంత వెర్రిదాన్ని కాదు. గంటలకొద్దీ టైపు చేసే తీరిక లేక ఊరుకున్నా.

ఆమె నా స్వవిషయాన్ని విమర్శించకుండా వైధవ్యం గురించిరాసిన పోస్ట్ పెట్టి ఉంటే హర్షించేదాన్ని .ఆమె కంటే వయసులో చాల పెద్దగ ఇలాటి వన్నీ ఎన్నోచూసినదాన్ని.

మా ఇళ్లలోనే బాల వితంతువులు కాపురం చేయకుండానే పోయిన భర్త ..బోడిగుండు చేయించి రవిక కూడాలేకుండా తెల్లచీర కట్టించి జీవితమంతా చాకిరికి అంకితమైన వితంతువులని అమ్మమ్మ కాలంలో చూసినదాన్ని.

ప్రతి ఇంట ముఖ్యంగా బ్రాహ్మణా కుటుంబాలలో ఇంటికొకరైనా ఉండేవారు. అలాటి నాకు అన్ని తెలుసు. ఆ స్థితి నించి ఈ నూరేళ్లల్లో  తెల్లచీరనించి రంగుచీరలు,బొట్టుబిళ్లలు , చదువులు,ఉద్యోగాలు స్టేజీవరకు రావడానికి  వందేళ్ల క్రమంలో ఎన్నెన్నో చూసినదాన్ని.

అలాటిస్థితిలోని  స్త్రీలపట్ల  సానుభూతి  ఎందుకుండదు?

ఇంతకీ రాసిన ఆవిడా ముత్తయిదుకాదుకదా అయినా  ‘ప్రముఖరచయిత్రి’ అయినంత మాత్రాన  ఆ పదం వాడకూడదని ఏముంది ? పెళ్లికాని అమ్మాయిని కన్య, పెళ్లయినవారిని ముత్తయిదువ ,సుమంగళి ,భర్తలేనివారిని వితంతువు ,పెళ్లికాని మగాడిని బ్రహ్మచారి ,పెళ్లి అయినవాడికి గృహస్తు  అని వాడుతారు.

వృత్తులనిబట్టి పేర్లుఉన్నట్టే  maritial స్టేటస్ బట్టి వాడడంలో తప్పేముంది? పెళ్లిళ్లు సాంప్రదాయకంగా  చేస్తున్నప్పుడు , ముహుర్తాలు ,పురోహితులు , మంత్రాలూ ,అగ్నిహోత్రాలు ,తాళిబొట్టు ,అన్ని ఆచార ప్రకారం  జరుగుతున్నప్పుడు  పసుపుదంచడం, నేను ఆపదం వాడడంలో ఆవిడకి తప్పేమీ కనిపించిందో!

ఎంతగా కాలం మారినా ఇంకా శుభకార్యాలలో ఇంకా పాటిస్తూన్నారు. ఎంత చదువుకుని గొప్ప ఉద్యోగాలు చేస్తున్న ఆ తేడా చూపుతున్నారు అందరు ఇంకా. ఒక మార్పు రావడానికి కొన్నితరాలు పడుతుంది ఎంత ఆదర్శాలు వల్లించినా  జనం ఆలోచనలో  మార్పు రావడం అన్నది ఒక కాలమే చేయగలదు.

రాబోయే ఒకటి రెండు తరాలలో ఆశించే మార్పురావచ్చు. నేను ఇంత కుంకం బొట్టుపెట్టుకుని కూర్చున్నంత మాత్రాన శుభకార్యాలలో చేసే తంతులలో పాల్గొనమని పిలుస్తారా? అమ్మా పెద్దదానివి  వచ్చి ఒక చెయ్యివేయి ,అత్తయ్యగారు రండి అమ్మాయికి పసుపుపారాణి పెట్టండి ,వదిన గాజులు తొడుగు ,అని ఒక కూతురు ,కోడలు ,మరదలు పిలిచే రోజులు రాబోయే తరాల్లో రావచ్చు. ఈవిడేమిటి అన్నిటికి ముందుతయారవుతుంది ,పెద్ద ముత్తయిదువులా తయారయిపోయింది  ,వదినకాస్త వెనక్కిరా,అమ్మ వంటింట్లో పనిచూడవెళ్లి,అత్తయ్యగారుకుర్చీలో కూర్చోండి అలావెళ్లి అనిపించుకునే  అవమానం తప్పించుకోడానికి చాలామంది ముందుకు రారు.

ఇవన్నీ అరిచి,ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రాన ఒక రోజులో వచ్చే  మార్పులు  కావు . కాలమే మారుస్తుంది ఏమో ,ఇదివరకు కంటే నమ్మకాలూ ,భక్తి, విశ్వాసాలు ,ఆచారాలు ఎక్కువ పాటిస్తున్నారు గదా మారకపోనూ వచ్చు .ఈ ఆంతర్యం గత ఏభయి ఏళ్లలో మారలేదుగదా . నేనయితే  స్వచ్ఛందం గానే కుంకుమ వదులుకున్నా . బొట్టుబిళ్లల పుణ్యమా అని  చిన్నప్పటినించి పెట్టుకునే అలవాటు వాటి ద్వారా వదులుకోలేదు,భర్తతో  వచ్చిన తాళి నల్లపూసలు ,కుంకం తీసేసాను. నన్నెవరూ తీయమనలేదు.

ఒకటే అనిపించింది-  తల్లి తండ్రలు ఇరవయి ఏళ్ళు (పోనీ ,పాతిక) మంచి,చెడు,పోషణ చూస్తారు మిగతా జీవితాంతం  కలిసి బతికి  బాధ్యత తీసుకుని ఒక ఇల్లు ,సంసారం, సమాజంలో  ఒకహోదా కలిగించి ,పోయాక కూడా ఎవరిముందు చెయ్యిచాపకుండా  హాయిగా బతికే ఏర్పాట్లు  చేసిన మనిషికోసం  చిటికెడు  కుంకం  త్యాగం చెయ్యచ్చు అనిపించింది.

అయినా నేనుపెట్టుకున్నా  అవతలివారు పెడతారని లేదు.  ఆడది మాత్రం ఎంత చేస్తుంది ఇంటికి,సంసారానికి , మగాడెం వదులుతున్నాడు పెళ్ళాంకోసం అనే వాదం  ఏం వదులుతాడు , ఓ తాళి  స్త్రీ చేత కట్టించాల్సింది వేదకాలంలోనే  అపుడు మొగుడు తీసేవాడు గదా, ఈ వాదాల వల్ల జరిగేదేంలేదు . 

సో ,ఇంతకీ చెప్పేది ఏమంటే  ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు చెయ్యచ్చు ఏమనేరోజులు  , అనుకునేరోజులు పోయాయి. స్వంత విషయాలని విమర్శించే అధికారం  లేదు ఎవరికీ.

ఇప్పటికి ఆ పదం వాడి నేను తప్పు చేసానని అనుకోడంలేదు ,అలా అని స్త్రీ పట్ల సానుభూతి లేదని అనుకోను. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.