జ్ఞాపకాల ఊయలలో-5

-చాగంటి కృష్ణకుమారి

పల్లె లో మాయిల్లు తాటాకుతో నేసిన  పెనక ఇళ్లు . గోడలన్నీ  మట్టి గోడలే  , లోపల ఇంట్లోని మొత్తం  నేలంతా మట్టి నేలే ! గోడలని  ఎర్ర బంక మట్టిలో  రాగిఅంబలి కలిపి  ఏక మందం లో  చదునుగా వుండేలా అలికి వాటి అందాన్నీ,  తాజాతనాన్నీ కాపాడేవారట!  ఇది నేను తరువాత తెలుసుకొన్న  విషయం . గోడలు 10 అంగుళాల మందం లో  అక్కడక్కడ  అవసరానికి ఏవైనా సామానులు పెట్టుకొనేలా  వాడుకోగలిగిన గూళ్ళతో వుండేవి.  రాత్రి పూట  కిరసనాయలు నింపిన లాంతర్లు , దీపపు బుడ్డీలు మా గదులను   వెలుగుతో నింపేవి . బొగ్గుకుంపటిలో వచ్చిన  తెల్లని మెత్తని బూడిదతో  వాటి   గాజు చిమ్నీ లకు అంటిన పొగ చారలను  మెత్తని తెల్లని పాత బట్టతో పొద్దుగుంకక ముందే  చాలా ఓపికగా తుడిచి, కిరసనాయలు దీపాలను      మాబామ్మ సిద్దంగా వుంచేది.  

 అరుగులనూ ,గదులలో నేలను మేమే అలికే వాళ్లం .అలికే వాళ్లం అని ఎందుకంటున్నానంటె నేనూ ఆపనిలో  ఓ చేయ వేసేదాన్ని!  అదెలా చేసే వారమంటే ముందు నేలంతా  ఎక్కడా  ఒగ్గులు లేకుండా ఏక మందంలో నీరూ,  ఎర్రమట్టీ ,ఆవుపేడా మిశ్రమం తో అలికేవారం. దానిని ఆరనిచ్చేవారం. పూర్తిగా పొడారిపోకుండా ఇంకా కాస్త తేమ వుండగా ఒక నున్నని  రాయితో   నేలమీద  గుండ్రంగా తిప్పుతూ రుద్దేవారం . రాయి అడు గుభాగం చాలానున్నగా  ఏకరీతిని  వుండేది. అలా రుద్దుతూ   నేలను  చదునుగా నున్నగా చేసేవారం.  మట్టికున్న ఎరుపు లేతా భ్రౌన్  రంగు తో పేడ లేత ఆకుపచ్చరంగు కలసి నేల  ఓమాదిరి  ముదురు ఆలీవ్ ఆకుపచ్చరంగును  పొందేది.  

మా ఇల్లు  ఎలా వుండేదంటే—

వీధి గుమ్మంతొ కలసి  ముందు ఒకవాస–   తరువాత కొంత  మట్టిజాగా , దీనిని ముందుపెరడు అనేవారం .తరువాత మళ్లీ మరో వాస దాని తరువాత మళ్లీ   పెరడు. అక్కడ నుయ్యి  , పెద్దపెద్ద చెట్లుండేవి. ఇది వెనక పెరడు. వీధి గుమ్మానికి రెండు వైపులా ఎత్తైన అరుగులుండేవి.  వీధి అరుగుల మధ్యనున్న మెట్లెక్కి ముఖద్వారం గడపదాటి  ఇంటి లోపలికి   వెళ్లాలన్నమాట.  అలాగే ముందు  వాసలోని ముందు పెరడు వైపుకి  సావిడి, గదులను ఆనుకొని   ఇరువైపులా ఎత్తు  అరుగులుండేవి. అరుగులమధ్యనున్న మెట్లు దిగి  ముందు  పెరడు దాటి వెనక వాసకు వెళ్లాలి.  వెనక వాసకూడా ఇదేవిధంగావుండేది. అక్కడ వంటిల్లు   భోజనాలగది,  దేముడు వుండేవి.వర్షం పడుతున్నప్పుడు ఒక వాసలో వున్నవారం  మరో వాసలోకి వెళ్ళాలంటే తాటాకు గొడుగును   వాడేవారం. 

ఒక రోజు జోరుగా వానపడుతోంది. నేనూ నాన్నా ముందుపెరట్లో  అరుగు మీద నిలుచుని వానను చూస్తున్నాం.తాటాకు చూరు నుండి  జారుతున్న వాన నీరు నేలమీద చిన్నచిన్న గోతులను చేస్తోంది. ఆగోతుల్లో  చిన్నిచిన్ని తెల్లని గులకరాళ్లు మట్టి లోనుండి బయటకొచ్చి పోగవుతున్నాయి. వాననీరు కాలవకట్టి ఎర్రమట్టిని  తోసుకొంటూ పెరట్లో పల్లం వైపుకి  ప్రవహిస్తోంది. ఆ ప్రావాహంలో నీటి బుడగలు—చిన్నవి, మరీ చిన్నవీ; పెద్దవి, మరీపెద్దవీ … కొన్ని పుట్టినవెంటనే “టప్”మంటున్నాయి. కొన్ని ప్రవాహంలో కొట్టుకుపోతు న్నాయి. కొన్ని కొంచం దూరందాకా వెళ్లి  పగిలిపోతుంటే , మరికొన్ని కాస్త ఎక్కువ దూరందాకా వెళ్లి  మాయమవుతున్నాయి.  నేను వాటిని నాన్న కి చూపిస్తూ   ఏదో మాట్లాడుతున్నాను.  నాన్న బుడగని చూస్తూ  దానిని “బుద్బుదం ” అంటారని చెప్పాడు. వెంటనే నేను-

చక్రి చింత లేని జన్మంబు జన్మమే

తరల సలిల బుద్బుదంబు కాక 

– లో బుద్బుదము  ఇదీ ఒకటేనా?”   అని అడిగా.

“అవును, అదేఇది, అంటే నీటి బుడగ . చూస్తున్నావుగా దాని బతుకు క్షణికం  అంటే , ఎక్కువ సేపు వుండదు.” అన్నాడు. 

అలా బుద్బుదము అనే పదాన్ని నాన్న చెప్పగా నేర్చుకొన్నా.దాని అర్ధం ఏదో చాలా తెలిసిపోయినట్టుగా ఆరోజు నాకనిపించింది. డిగ్రీ క్లాసులో  ఫిసిక్స్ లో సబ్బు బుడగ- తలతన్యత(surface tension and soup bubbles) పాఠాన్ని చదువుకొన్నప్పుడు,కెమిస్ట్రి క్లాసుల్లో ‘babbled through’ అనే పదాన్ని వాడిన ప్రతీసారీ  ఆనాటి, ఆ బుద్బుదాలు నాకళ్ల ముందు నిలిచేవి. లేక్చరర్ ని అయి కెమిస్ట్రి పాఠాలు తెలుగులో కూడా చెప్పాల్సి వచ్చినప్పుడు  ఇంగ్లీషులో ‘bubbled through ‘  అనే పదాన్ని వాడిన అనేక సందర్భాలలో   బుద్బుదీకరించి’, ‘బుద్బుదీకరిస్తే’, ‘ బుద్బుదీకరించగావంటి  క్రియాపదాలను  వాడుతూ నేను పొందిన ఆనందంలో ఆనాటి ఆనీటి బుడగలున్నాయి.   నాన్న  పాఠం చెప్పేతీరు అలావుండేది. ఈసందర్భంలో  ఆరుద్ర గారు  చాసో మీద రాసిన వ్యాసాలలో “  తెలుగును మరిచి పోయినప్పుడే చాసోని మర్చి పోవడం”   “చాసో ముద్ర చెరిగిపోదు “  అన్న వాక్యాలు  కూడా జ్ఞప్తికి  వస్తున్నాయి. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.