తిలక్ కథలు – చెహోవ్ ప్రభావం
-ఆచార్య యస్. రాజేశ్వరి
కన్నీటి జడులలో తడిసిన దయాపారావతాల వంటి- వెన్నెల్లో ఆడుకునే అందమైన అమ్మాయిల వంటి నిశిత పరిశీలనతో నిలిచిన మణి దీపాల వంటి- తిలక్ కథలు 20 సేకరించి 1967లో ప్రచురించారు ప్రకాశకులు. వాటికి మరి 9 కథలు కలిపి 1983 ద్వితీయ ముద్రణ వెలువరించారు.
1921లో పుట్టిన తిలక్ 11వ ఏటనే కథలు రాయడం మొదలుపెట్టాడు. తాను 1966 లో తనువు చాలించే వరకు కథలు, నాటికలు, పద్యాలు, గేయాలు ఎన్నో రచించాడు. అతను రాసిన కథలపై ‘చెహోవ్‘ ప్రభావం ఉందని విమర్శకుల అభిప్రాయం.
వల్లంపాటి వెంకటసుబ్బయ్య తెలిపిన మంచి కథాలక్షణాల ‘క్లుప్తత, అనుభూతి ఐక్యత, సంఘర్షణ, నిర్మాణ సౌష్ఠవం తిలక్ కథల్లో పుష్కలంగా ఉన్నాయి. వానిలో ‘నిర్మాణ సౌష్ఠవం‘లో చెహోవ్ తెలిపిన అభిప్రాయాలు తిలక్ కథల్లో కనిపిస్తాయి.
వాటిలో రెండింటిని ఇక్కడ విశ్లేషిస్తాను.
- కథ ‘లేసు‘లాగా ఉండాలి.
- కథ ‘తాబేలు‘ లాగా ఉండాలి.
అన్నవి ‘చెహోవ్‘ అభిప్రాయాలు. చెహోవ్ కథలు అదేవిధంగా ఉంటాయి. ‘లేసులాగా‘ అన్నమాట అర్థవంతమైనది. దారంతో అల్లిన లేసులో అల్లిన భాగం కంటే అల్లకుండా వదిలేసిన భాగం వల్లనే లేసు డిజైను ఏమిటో తెలుస్తుంది. లేసులో లాగా కథలో కూడా చెప్పిన విషయాల కంటే చెప్పకుండా సూచించి వదిలి పెట్టిన విషయాలకే ప్రాధాన్యత ఎక్కువ ‘కథలో చెప్పవలసిన దానికంటే తక్కువ చెప్పడం మంచిది‘ అంటాడు చెహోవ్.
ఈ పద్ధతిని తిలక్ ‘హోటల్లో‘ అన్న కథలో అనుసరించాడు. ఐదు రోజుల దిన చర్య ఈ కథ. 22.5. 1941 నుండి 26. 5. 1941 వరకు జరిగిన కథ. 10 జూలై 1941లో ‘వాణి‘ సచిత్ర పక్షపత్రికలో ప్రచురించబడింది. మొదటి రోజు, ఆఖరి రోజు కథ గురించి, ఉండదు. ఉత్తమ పురుషలో రాయబడిన కథ. పాత్రలకు పేర్లు ఉండవు. ఒక వ్యక్తి బందరుకు వచ్చి హోటల్లో దిగాడు. అతన్ని ఒక ఆగంతుకుడు 5 రూపాయల దానంగా ఇవ్వమని అడుగుతాడు. కాని ఈ వ్యక్తి ఇవ్వడు. తన పక్కగదిలో ఒక స్త్రీ ముగ్గురు పురుషులతో కలిసి ఉండడం చూసి అసహ్యించుకుంటాడు. తనను బిచ్చమెత్తిన ఆగంతుకుడే ఆ స్త్రీని బాకుతో పొడిచి చంపుతాడు. చంపాక తన గదిలోకి వచ్చి ఆమె తన భార్య అనీ, తన బాకీ తీర్చడానికి ఆ ముగ్గురి దగ్గర వ్యభిచరించిందని చెపుతాడు. ఆ బాధ తట్టుకోలేకే ఆమె తనను చంపమని ప్రార్థిస్తే చంపానంటాడు. ఆ బాకీ తీర్చడానికే మీ లాంటి దయగల వారి దగ్గర బిచ్చమెత్తానని, ఆ డబ్బే ఉంటే తమకీ గతి పట్టేది కాదని ఏడుస్తాడు. ఆగంతకుడిని పోలీసులు పట్టుకుపోతారు. కథనంతా మూడు సంఘటనలుగా రాసి రచయిత ఆఖర్లో అంతా కలుపుతూ వివరిస్తాడు. కథ మొత్తం ఒకే అల్లిక లాగా ఉంటుంది. కథా సంవిధానం ఉంటుంది. ఇటువంటి కథే రావిశాస్త్రి రాసిన ‘లక్ష్మి‘ కథ కూడా.
నిర్మాణ సౌష్ఠవంలో చెహోవ్ రెండవ పద్ధతి – ‘కథ రాయడం పూర్తయ్యాక, ప్రారంభాన్ని ముగింపుని తీసేయాలి‘ రాసిన తరువాత తీయడం అంటే కథలో వాటిని అదృశ్యంగా ఉంచాలనీ, వాటిని పాఠకుల ఊహాశక్తి వారికే వదలాలని అర్థం.
కొందరి కథల్లో ఆది, మధ్యాంతాలు స్పష్టంగా ఉంటాయి. కొందరి కథల్లో ఆద్యంతాలు మసక మసకగా ఉంటాయి. ఇలాంటి కథలో మధ్యభాగమే ఉన్నట్లు కనిపిస్తాయి. చెహావ్ కథలో ఆద్యంతాలు ఉండవనీ, అవి తాబేళ్ళలాగా ఉంటాయని గాల్సి వర్గీ అనే రచయిత అంటాడు. చెహోవ్ కథలు ఒక సంఘటనల వరసను కాకుండా ఒక ‘స్థితి‘ వర్ణిస్తాయి. ఆ కథలో ఆద్యంతాలు కాగితం మీద కనిపించవు. రచయిత మనసులో ఉంటాయి. పాఠకుని ఊహల్లో రూపుదిద్దుకుంటాయి.
ఈ పద్ధతినే తిలక్ ‘ఊరిచివరి ఇల్లు‘ కథలో అనుసరించాడు. ఈ కథ ఆంధ్ర పత్రిక శార్వరి సంవత్సరాది సంచికలో ప్రచురించబడింది. అంటే ఇప్పటికి 60 సంవత్సరాల క్రితం 1960లో ముద్రించబడింది. ఈ కథ సాయంత్రం మొదలై రాత్రంతా నడిచి తెల్లారేసరికి ముగుస్తుంది. ఒక యువతి జీవితంలో ఒక రాత్రి తెచ్చిన మార్పు ఈ కథ. సాయంత్రం వర్షాన్ని చూస్తూ కూర్చున్న రమ ఒక బాటసారి వానలో తడుస్తూ అతి కష్టంమీద పోతూ ఉండటం చూసి పిలుస్తుంది. తానీ ఊరికి కొత్తవాడిననీ, స్నేహితుడి కోసం వస్తే అతడు చనిపోయాడని, ఆ దుఃఖంతో తిరిగి వెళ్ళిపోతున్నానని చెప్పుకున్నాడు ఆ వ్యక్తి. జాలితో ఆమె అతనికి పొడిగుడ్డలిచ్చి భోజనం పెట్టి ఈ రాత్రికి అక్కడే విశ్రమించ మంటుంది. ఆమె దయార్ద్ర హృదయానికి అతను పొంగి పోతాడు. తన పేరు జగన్నాధమని మిలటరీలో పనిచేస్తున్నానని చెపితే, ఆమె ఆశ్చర్యపోయి తన చిన్ననాటి స్నేహితుడు విజయుడు కూడా మిలటరీలో చేరాడని చెపుతుంది. తన స్నేహితుడిని అతనిలో వెతుక్కుంటుంది. రమ అనాధ అనీ, ఏ దిక్కూ లేక వేశ్యావృత్తి లో ఉందని తెలిసిన జగన్నాథం ఆమెను వివాహం చేసుకుంటానంటాడు. రమను ఆశ్రయించుకుని జీవిస్తున్న ముసలిది రమ వెళ్ళిపోతే తనకు జరుగుబాటు ఉండదని, జగన్నాధంతో రమపై లేనిపోని కలిపించి డబ్బు కోసం నాటకాలు ఆడుతుందని నిందలు వేస్తుంది. మనసు విరిగిన జగన్నాథం తన దగ్గర ఉన్న వెయ్యి నిద్రపోతున్న రమ దగ్గర పెట్టి బాధలో వెళ్ళిపోతాడు. తెల్లవారగానే నిజం తెలిసిన రమ, రైల్వేస్టేషన్‌కు పరుగెత్తికెళ్లి కదులుతున్న రైలు పెట్టెల్లో ఉన్న జగన్నాథానికి ఆ పర్సు ఇచ్చి కింద పడిపోతుంది. రైలు ముందుకు కదలి వెళుతుంది. నిజమేమిటో జగన్నాథానికి తెలుస్తుంది. స్థూలంగా కథ మధ్యభాగం ఇది. కథలో ముందు చెప్పవలసిన విషయాలు, పాత్రల పరిచయం కథ మధ్యలో అస్పష్టంగా ఉంటాయి. ముగింపు పాఠకుల ఊహకే వదిలేసాడు రచయిత. కానీ కొన్ని సూచనల ద్వారా వారిద్దరూ కలుసుకుంటారని చెపుతారు. పర్సులో ఉన్న జగన్నాధం ఫోటో రమ దగ్గరే ఉండడం డబ్బుకోసం రమ అబద్ధాలు చెప్పలేదనీ వాస్తవం తేలడం. మొదలైన సూచనల ద్వారా ముగింపు పాఠకుల ఊహకు వదిలేశాడు రచయిత. ఆద్యంతాలు రచయిత మనసులో ఉంటాయి. పాఠకుల ఆలోచనల్లో రూపుదిద్దుకుంటాయి. అన్నదానికి ఈ కథ నిదర్శనంగా నిలుస్తుంది.
తిలక్ నిర్మాణ సౌష్ఠవంలో చెహోవ్ ను అనుసరించారు. క్లుప్తత, అనుభూతి ఐక్యత, ఘర్షణలను కథలో సాధిస్తూనే నిర్మాణానికి తన కథల్లో పెద్ద పీటవేసాడు.
అందుకే 60 సంవత్సరాల తరువాత కూడా ఆ కథలు సజీవంగా నిలిచిపోయాయి.