నడక దారిలో-5
-శీలా సుభద్రా దేవి
కోటబొమ్మాళిలో ఒకసారి స్నేహితులతోఅన్నయ్య ఊరి పొలిమేరలో సరదాగా వెళ్ళినప్పుడు ఒక ఎలుగుబంటిని దగ్గర లో చూసి అందరూ పుంతల్లోంచి పరిగెత్తటం లో ఒళ్ళంతా ముళ్ళు గీరుకున్నాయి .దాంతో కోటబొమ్మాళి లో నచ్చకపోవడంతో అన్నయ్య బదిలీకి ప్రయత్నాలు చేయటంతో విజయనగరం కి తిరిగి వచ్చేసాం.కానీ వేరే ఇల్లు తీసుకోకుండా ఒక మేనమామ ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది.వాళ్ళు పదే పదే అన్నయ్య తో బాధ్యతలన్నీ మోయాల్సివచ్చిందని అనటంతో అతను మా మీద ద్వేషం పెంచుకున్నాడు.ఫలితం అమ్మ,చిన్నక్క ఆ ఇంట్లో జీతం బత్తెం లేని పనిమనుషులు అయ్యారు.రోజురోజు కీ దాష్టికం భరించలేక అమ్మ చిన్నక్క నీ , నన్ను తీసుకుని రోడ్డున పడింది.
చిన్నన్నయ్య అందరి దయాదాక్షిణ్యాలతో మాటలు పడుతూ యూనివర్సిటీ చదువు చదవటం ఇష్టం లేక వదిలిపెట్టి ఎవరికీ చెప్పకుండా శ్రీకాకుళం లో టీచర్ ట్రైనింగ్ లో జాయిన్ అయిపోయాడు.అతని దగ్గర కు మేము వెళ్తే మమ్మల్ని ఏలూరు దగ్గర గోపన్న పాలెం లో ఉన్న పెద్దక్కదగ్గరకు చేర్చాడు.ఆ విధంగా ఆ ఏడాది మళ్ళా చదువు ఆగిపోయి అక్క ఇంటికి చేరాను.
మా పెద్దక్కయ్య పి.సరళాదేవి .ఆమె డా. పి.శ్రీదేవి స్నేహప్రభావంతో 1955 నుండీ తెలుగు స్వతంత్ర లో విస్తృతంగా కథలు రాసేది.వాళ్ళు పుంగనూరు లో ఉన్నప్పటి నుండి ఎమ్.రాజేంద్ర( జర్నలిస్టు),మధురాంతకం రాజారాం గార్లు కుటుంబ స్నేహితులు.అక్కయ్యవి మూడు కథల సంపుటాలు,రెండు నవలికలు, తెలుగు వారి సామెతలు పై విశ్లేషణాత్మక గ్రంథం ‘ సామెత’ ప్రచురింపబడ్డాయి.1975 తర్వాత రచనలు చేయటం మానేసింది.
నాకు ఊహ తెలియక ముందే అక్కకి పెళ్ళి ఐపోయింది.ఆమె ఎప్పుడు విజయనగరం వచ్చినా నాకోసం బొమ్మలో మిఠాయి లో కాకుండా చిన్న చిన్న రష్యన్ బొమ్మల పుస్తకాలు తెచ్చేది.అందువలన కూడబలుక్కుని చదివే దాన్ని . సోవియట్ లేండ్ వాళ్ళ పిల్లల బొమ్మల పుస్తకాల తెలుగు అనువాదాలు ఇచ్చేది.ఆ విధంగా చాలా చిన్నతనం నుండి కథలపుస్తకాలు చదవటం అలవాటైంది.
అక్క భర్త మా చిన్నమామయ్యే. వాళ్ళు ఉద్యోగరీత్యా ఏ వూరు వెళ్ళినా అక్కడ పిల్లలందరినీ చేర్చి బాలానందం నడిపేది.వాళ్ళకి పాటలు, డేన్స్ లే కాకుండా కథలు చదివించే ది.సెలవుల్లో వెళ్ళినప్పుడు నేను కూడా వాళ్ళ జత చేరేదాన్ని.
1963_64లో ఈ విధంగా బడిచదువు ఆగిపోవటంతో అక్కయ్య ఇంట్లో ఉండక తప్పలేదు.
మామయ్య సహఉద్యోగుల పిల్లలు లత,సుభ నా వయసు వాళ్ళు.వాళ్ళతో నాకు స్నేహం కలిసింది.మా కన్నా చిన్నపిల్ల షహనాజ్ మాతో చేరేది.వాళ్ళు స్కూలు నుంచి వచ్చాక సాయంత్రం కలిసి కబుర్లు చెప్పుకునే వాళ్ళం. లతతో నా స్నేహం నేను హైదరాబాద్ వచ్చేక కూడా చాలా కాలం కొనసాగింది.లత నాన్నగారు రిటైర్మెంట్ అయ్యాక హైదరాబాద్ వారాసిగుడాలో సెటిల్ అయ్యారు.కానీ ఇప్పుడు లత ఎక్కడుందో తెలియదు.
పగలంతా అక్కయ్య వాళ్ళింట్లో లైబ్రరీ లోనివే కాక దగ్గర లోని లైబ్రరీ కి వెళ్ళి కొంతసేపు చదువుకొని మరి రెండు పుస్తకాలు తెచ్చుకునేదాన్ని.అలా ఒక్క ఏడాది లో ఎంతోమంది ప్రముఖరచయితల రచనలే కాక శరత్ అనువాదగ్రంథాలు కూడా చదివాను.బడికి వెళ్ళి చదువుకునే అవకాశం కోల్పోయిన బాధని పుస్తకాలు చదవటం లో మర్చిపోయేదాన్ని. అప్పటినుండీ నాకు ప్రాణ మిత్రులు పుస్తకాలే.
ఒకసారి ఏలూరులో ఆవంత్స సోమసుందర్ గారికి పెద్ద ఎత్తున ఘనసన్మానం జరుగుతుంటే నన్ను అక్క ఆ సభకు తీసుకెళ్ళింది.సభానంతరం ఒక సాహిత్య మిత్రుని ఇంటిడాబా మీద రాత్రివెన్నెల్లో కవితా గోష్ఠి జరిగింది.ఎంతమందో కవులు కావ్యగానం చేస్తుంటే అద్భుతంగా అనిపించింది.అంతవరకూ కథలూ నవల్లే చదివే దాన్ని.మర్నాడు అక్కని కవిత్వం పుస్తకాలు అడుగుతే వైతాళికులు, మహాప్రస్థానం, కృష్ణపక్షం, ముత్యాల సరాలు ఇచ్చింది.అందులోని నాకు నచ్చిన వన్నీ ఒక పాతడైరీలో రాసుకున్నాను.అది ఇప్పటికీ నా దగ్గరే ఉంది.అప్పటి నుండి కృష్ణశాస్త్రి కవితలోని లాలిత్యం ఎంత ఇష్టమో, శ్రీ శ్రీ కవిత్వం లోని లయ, పదును అంతే ఇష్టం.
పుస్తకపఠనమే కాకుండా అక్క ఎంబ్రైయిడరీ,పూసల బొమ్మలు తయారు చేయటం, లలిత సంగీతం నేర్పించేది.నేను బొమ్మలు బాగా వేస్తున్నానని నా చేత మంచి చిత్రం వేయించీ ఢిల్లీ శంకర్స్ వీక్లీ వారు కండక్ట్ చేసే బాలల చిత్రలేఖనం పోటీ కి పంపింది.బహుమతి రాలేదు కానీ సర్టిఫికెట్ వచ్చింది.
గోపన్న పాలెంలో మామయ్య వాళ్ళ ఇన్స్టిట్యూట్ లో ఒకసారి యువజనోత్సవాలు జరిగాయి.అందులో చిన్నక్క కూడా పాల్గొంది.ఒక గ్రూపువాళ్ళు గురజాడ కన్యక గేయ కథని నాటకం గా ప్రదర్శించారు.అందులో కన్యక పాత్ర షహనాజ్ వేసింది.ఆ మేకప్ లో షహనాజ్ ఎంత బాగుందో!కానీ కొన్ని ఏళ్ళకు ఆ అమ్మాయి కాల్చుకుని చనిపోయిందని లత ద్వారా విని చాలా బాధ పడ్డాను.నేను టీచర్ గా పని చేస్తున్న సమయంలో నా తరగతి పిల్లలతో కన్యక నాటకం వేయించాను.అందులో కన్యక గా వేసిన అమ్మాయి వివాహం అయ్యాక కాల్చుకుని చనిపోయింది.ఈ రెండు సంఘటనలూ కాకతాళీయం కావచ్చు కానీ గురజాడ కన్యక లో ఆత్మాహుతి చేసుకున్నట్లు రాయటం ఆ పాత్ర వేసిన వాళ్ళ మనసు పై ప్రభావం చూపిందేమో అని నా భావన.
1964 మే 24 న జవహర్ లాల్ నెహ్రూ దివంగతులు ఐతే సంతాపం సభ కూడా పెట్టారు. సోవియట్ యూనియన్‌తో స్నేహం, ఆపత్కాలంలో అమెరికా వైఖరితో కుంగిపోయిన నెహ్రూ ఆ దిగులుతోనే మంచానపడ్డారని చెప్పారు.యుద్ధం తర్వాతి కాలంలో శత్రువు శత్రువు మిత్రులంటూ పాక్, చైనా మధ్య మైత్రి నెహ్రూను కలవరపెట్టింది. ఫలితంగా యుద్ధం ముగిసిన రెండేళ్లకే అకాలం మరణం పాలయ్యారని వక్తలు మాట్లాడారు.మర్నాడు వార్తా పత్రికలో వచ్చిన బాల్యం నుండి నెహ్రూ ఫొటోలన్నిటినీ కత్తిరించి ఆల్బం లా తయారు చేసాను.
కొన్నిరోజుల కి అనుకోకుండా నాన్న ఆఫీసునుండి డబ్బు లేవో వస్తాయని ఉత్తరం వస్తే అమ్మ, అక్కయ్య వెళ్ళారు.ఆ డబ్బు తో చిన్నక్కకు రెండో మూడో చీరలు,నాకు ఒక మూడు వోణీలు కొని తెచ్చారు.అక్కయ్య తన దగ్గరి ఒక చీర కత్తిరించి పరికిణీలు కుట్టింది.విజయనగరం వెళ్ళినప్పుడు అన్నయ్య తో మాట్లాడి కుటుంబ పరిస్థితులు చక్కబరచి అక్కయ్య వాళ్ళు వచ్చారు.మామయ్యకి యూఎస్ లో ఒక ఏడాది పరిశోధన కు వెళ్ళవలసి రావటం వలన అందరం విజయనగరం బయలుదేరాం.అప్పుడు మొట్టమొదటిసారిగా లంగా వోణి వేసుకొని బయలుదేరాను.కొత్త లంగా వోణీలో నన్ను చూసుకొని నాలో నేను ఎంత మురిసి పోయానో.అక్కడితో అక్కయ్యతో కలిసి నా ఏడాది జీవనప్రయాణమైతే ముగిసింది.కాని నేను ఈనాడు రచయిత్రిగా, కవయిత్రి గా ఎదగటానికి గల కారణం అక్క దగ్గర ఉన్న ఏడాది కాలమే అని నా అభిప్రాయం.
అందుకే సాహిత్యం_బాల్యం-ప్రేరణ అంటూ ఇంటర్వ్యూ లలో ఎవరు ప్రశ్నించినా ఆ ఏడాది జీవితాన్ని తడుముకోకుండా ఉండలేను.నా రచనల్లో అక్కయ్యను చూసుకుంటూనే ఉంటాను. సాహిత్య పరంగా నేను రాసిన రచనలకి అక్కయ్య స్పందించి ఉత్తరం రాసేది.
ఎలక్షన్స్ బేనర్ల పై రాసిన ‘ వానా వానా కన్నీరు’ కథ చదివి అక్కయ్య పెద్ద ఉత్తరం రాసింది.”కుటుంబ పరిథి లోనే రాయకుండా సమాజం లోని ఇతర సమస్యలతో రాయటం బాగుంది.ఆలోచనా పరిధి విస్తృతంచేసుకుంటున్నావు.ఇలానే రాస్తుండు”అన్న తర్వాత నా రచనా పరిథి పెంచుకున్నాను.
1996 లో కేవలం స్త్రీ చైతన్యంతో రాసిన కవితా సంపుటి” ఆవిష్కారం” అక్కయ్యకి అంకితం ఇచ్చాను.
కేంద్ర సాహిత్య అకాడమీ వారు డా.శ్రీదేవి గురించి మోనోగ్రాఫ్ రాయమన్నప్పుడు పాత తెలుగు స్వతంత్రలు వెతుకు తుంటే అక్కరాసిన సంపుటీకరింపబడని కథలు కొన్ని దొరుకుతే వాటిని నేను అక్కయ్యకి ప్రేమ పూర్వక నివాళి గా పుస్తకరూపంలో తెచ్చాను.
అందుకే నేను అక్కయ్య కి సాహితీ వారసురాలినని ఎప్పుడూ చెప్తునే ఉంటాను. మొదటినుంచీ నన్ను సాహిత్యం వైపు మళ్ళించిన మా పెద్దక్కయ్య పి.సరళాదేవి నాకు సాహిత్యస్పూర్తిని ఇచ్చిన వ్యక్తిగా భావిస్తాను.
*****
జన్మస్థలం విజయనగరం.రచయిత,కవి, చిత్ర కారుడు ఐనా శీలా వీర్రాజు గారి తో వివాహానంతరం హైదరాబాద్ లో నివాసం.1970 లో కథారచన తో సాహిత్య రంగంలో అడుగు పెట్టి తొమ్మిది కవితా సంపుటాలు, మూడు కథా సంపుటాలు,ఒక నవలిక వెలువరించారు. వంద మంది కవయిత్రుల కవితల సంకలనం ” ముద్ర” కు డా.పి.భార్గవీరావు తో కలిసి సహసంపాదకత్వం వహించారు.ప్రధానోపాధ్యాయినిగా పదవీవిరమణ చేసారు.
సుభద్రా దేవి గారు,
మీరు రచయిత్రిగా, కవయిత్రిగా ఎదగడానికి మీ అక్కయ్య గారి ప్రభావంతో పాటు మీ చుట్టూ ఉన్న ఆనాటి సాహిత్య వాతావరణం ఎలా తోడ్పడిందో చెప్పారు. మీ జీవన ప్రయాణాన్ని అక్షరీకరించడం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని ఇస్తుంది.
ధన్యవాదాలండీ
ఇప్పుడే చూసేను సుభద్రాదేవిగారూ, బాగుంది ముఖ్యంగా మీ అక్కయ్య పి. సరళాదేవిగారిగురించి తెలుసుకోడం. ఆమెకథలు నాకు తెలుగుస్వతంత్రకాలం నుండి పరిచయమే కానీ ఈరోజుల్లో ఎవరికీ ఆమెగురించి తెలీదు. మంచి రచయిత్రులని ఈవిధంగా మళ్లీ పరిచయం చేయడం, సరళాదేవిగారి కథలు సంకలనంగా ప్రచురించడం నాకు చాలా నచ్చింది. ధన్యవాదాలు.
మీ స్పందన కు ధన్యవాదాలు మాలతి గారూ
ధన్యవాదాలండీ మాలతి గారూ
రచయిత్రి, కవయిత్రి, శ్రీమతి శీలా సుభద్రాదేవి గారి ఆత్మ కథ లో,వారు రచయిత్రి కావడానికి
అక్క య్య గారి ప్రభావం వుంది అని చెప్పారు.
మరి, వీర్రాజు గారి ప్రభావం, ఎలా ఉపయోగ పడిందో,త్వరలో చదువు తామను కున్టాను.
రచయిత్రి కి కృతజ్ఞతలు.
ధన్యవాదాలు ప్రసాద్ గారు
మీ సాహితీ ప్రస్థానానికి నాంది మీ అక్కయ్య సరళా దేవి గారు కారణమైతే, మీ సాహిత్య ప్రస్థానం నిరంతరాయంగా ముందుకు వెళ్ళడానికి కారణం మీరు జీవితం లోని ఎదుర్కున్న సంఘటనలు, మీ fighting spirit.