‘’ఎందుకే అంత నవ్వు?’’ అంటూ నాన్నగారు,
‘’మాకెవరికీ నవ్వురాదేం? ఏంటా జోకు? చెబితే మేము కూడా నవ్వుతాం కదా. కారణం లేకుండా అయిన దానికి, కాని దానికి అలా నవ్వుతుంటే నిన్ను పిచ్చిదానివి ఉంటారు. జాగ్రత్త.’’ అంటూ అన్నయ్య,
‘’ఏంటో దీని నవ్వు ఇదీను. ముందు ముందు ఎన్ని అపార్థాలూ, కలతలు తెచ్చి పెడుతుందో’’ అని అమ్మ నా నవ్వు గురించి వాళ్ల భయాలు, బెంగలు చెబుతుండేవారు. కానీ నాకు మాత్రం ఎప్పుడూ నవ్వే.
అలనాడు మయసభలో దుర్యోధనుని చూసి ద్రౌపది నవ్వకపోతే కురుక్షేత్ర యుద్ధం జరిగేదే కాదు. అదీగాక నవ్వు నాలుగు విధాల చేటు అంటారు అంటూ అమ్మ, నాన్న, బామ్మ అందరూ అనడం నా చిన్నతనం నుంచి వింటున్నాను. నవ్వితే చాలు నవ్వు తగ్గించు అంటూ శతపోరే వారు.
‘’ఏంటిది? హాయిగా నవ్వుకోవాలి కదా నవ్వద్దంటూ ఈ గోల ఏంటి?’’ అంటూ నేను, నా స్నేహితులు అనుకునేవాళ్లం. మా నవ్వు మేము నవ్వుకుంటే వాళ్ళకి ఏం బాధ? పైగా అపార్థం చేసుకోవడం ఎందుకో అని అనుకునే వాళ్ళం. ఏదేమైనా, ఎవరేమన్నా నేను మా స్నేహితులు మాత్రమే హాయిగా నవ్వుకుంటూ తుళ్లుకుంటూ మా స్కూలు, కాలేజీ రోజులు గడిపేసాం.
ఈ రోజుల్లోలా లాఫింగ్ థెరపీలు లేని రోజుల్లో సహజంగా వచ్చే నవ్వుని ఆపమని, అనర్థమని చెప్పేవారు. ఇప్పుడేమో ప్రత్యేకించి లాఫింగ్ థెరపీలు, లాఫింగ్ క్లబ్బులూ అంటూ తెచ్చిపెట్టుకున్న నవ్వులు! ఏమిటో ఈ అవస్థలు?! నా ఆలోచనల్లో నేను కొట్టుకు పోతుంటే,
‘’ఏంటి శ్యామా, అంత ఆలోచన? ముఖంలో ఆ దిగులెందుకు?’’ అంటూ నా కొలీగ్ ప్రమీల వచ్చింది. ‘’నాకు చెప్పచ్చు కదా విషయం. కాస్త నవ్వితే హాయిగా ఉంటుంది’’ అంటున్న ప్రమీల వైపు ప్రయత్నపూర్వకంగా నవ్వుతూ చూశాను. ఇద్దరం ఎవరి పనుల్లో వాళ్ళు పడ్డాం.
నా వర్రీస్ ప్రమీల కి ఎలా చెప్పను. మా ఆయన, నేను ఇద్దరం సంపాదిస్తున్నాఇంటి ఖర్చులు పిల్లల స్కూలు ఫీజులు అయ్యేసరికి చేతిలో ఏమీ మిగలదు. అతనికి బాధ్యతలున్నాయి. సేవింగ్స్ ఏమీ లేవు. జీతం రావాలంటే ఇంకా 15 రోజులు ఆగాల్సిందే .
నెలంతా గడవాలంటే కష్టమే. ఈ ఆర్థిక సమస్యలు, ఆఫీస్ బాధ్యతలు వీటి మధ్య నలిగిపోయే నేను నవ్వమంటే మాత్రం ఎలా నవ్వుతాను? నాతోటి ఉద్యోగులకు ఇలాంటి బాధలు ఏమీ లేవు కాబోలు, హాయిగా నవ్వుతూ కులాసాగా ఉంటారు .
మధ్యాహ్నం లంచ్ సమయంలో ఈ విషయమే ప్రమీలని అడిగాను. నా మాటలు విని ప్రమీల మౌనంగా ఉండిపోయింది కాసేపు.
‘’ఈరోజు ఆఫీస్ అయిపోయాక మా ఇంటికి వస్తావా? అక్కడ నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.’’ అంది. సాయంత్రం వరకు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నాం.
అనుకున్నట్టుగానే ఆ సాయంత్రం ప్రమీల తో వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అది ఇల్లు అనేకంటే ఒక గది అంటే సరిపోతుంది. ఆ గదిలో ఒక పక్కగా వాళ్ళ అమ్మగారు మంచం మీద పడుకొని ఉన్నారు. ఒంట్లో బాగోలేదు కాబోలు. ప్రమీల తమ్ముడు, చెల్లెలు చాప మీద కూర్చుని తమ కంటే చిన్న పిల్లలకు చదువు చెబుతున్నారు. గది పొందిగ్గా సర్ది ఉంది. ఆ వాతావరణం కాస్త ఇరుకుగా కనిపించినా ప్రశాంతంగా, శుభ్రంగా ఉంది. నన్ను కూర్చోమని చెప్పి, ప్రమీల అందరికీ టీ తీసుకొచ్చింది. కాసేపు కబుర్లు చెప్పుకుని నేను లేచాను. నన్ను సాగనంపటానికి బయటికి వచ్చిన ప్రమీల,
‘’ఇప్పుడు చెప్పు నా జీవితంలో సమస్యలు లేవా? ఆడుతూ, పాడుతూ హాయిగా చదువుకున్నాను. బ్యాంకు పరీక్షలు పాస్ అయ్యాను. ఉద్యోగం వచ్చిందన్న సంతోషంలో ఉండగానే నాన్నగారు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అమ్మ బెంగతో మంచం పట్టింది. నా తర్వాత చాలా కాలానికి పుట్టిన చెల్లెలు, తమ్ముడు ఇంకా చాలా చిన్నవాళ్లు. అమ్మ నన్ను పెళ్లి చేసుకోమంటుంది. నేను పెళ్లి చేసుకు వెళ్లిపోతే, వీళ్ళందరూ ఏమవుతారు? అందుకే ఆ విషయాన్ని ఆలోచించను. కొన్ని అప్పులున్నాయి. నా జీతానికి తోడు చెల్లెలు, తమ్ముడు ప్రైవేట్లు చెబుతున్నారు. ఇదేమి కష్టంగా అనిపించట్లేదు శ్యామా. చుట్టుపక్కల వాళ్ళకి, మనతో పనిచేసే కొలీగ్స్ కీ అందరికీ సమస్యలు ఉన్నాయి. అలా అని అదే తలుచుకుంటూ దిగులు పడితే ఎలా? అయినా ఇవి సమస్యలు కావనిపిస్తుంది. దిగులు పడుతూ కూర్చుంటే అది మనల్ని ఇంకా భయపెడుతుంది. ఉన్న పరిస్థితినేమీ మర్చిపోను గానీ, మర్చిపోయినట్టు నటిస్తూ నవ్వుతూ బతికేందుకు ప్రయత్నిస్తాను’’ నవ్వుతూ చెబుతున్న తన ముఖంలో ఒక నిర్లిప్తత. తన ఆలోచనా తీరు గొప్పగా అనిపించింది. అది జీవితాన్ని ధైర్యంగా నడుపుకుందుకు అవసరమైనదని తోచింది.
ప్రమీల ఇంటి పరిస్థితి, ఆమె మాటలు గురించి ఆలోచిస్తూ ఇంటికి చేరాను. సమస్యలు లేని చిన్న వయసులో హాయిగా నవ్వుకుంటూ ఉంటే నవ్వెందుకు అంటూ ఆంక్షలు! సమస్యలతో సతమవుతూంటే ఇప్పుడు తెచ్చిపెట్టుకున్న నవ్వులు! ఎప్పుడైనా మనసారా నవ్వడం అంటేనే అదే పెద్ద బంగారం కాబోలు! ఒక జీవిత సత్యాన్ని తెలుసుకున్నాననుకుంటూ పనిలో పడ్డాను.
కధనం చాల బాగున్నది
కథ చాలా ఉత్సాహంగా గడిచింది. అన్నీ సంభాషణలు ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి . జీవితం లో ఏది జరుగుతున్న చిరునవ్వును వదలకూడదు . హా సత్యాన్ని చాలా అందం గా వర్ణించారు అండి ధన్యవాదాలు .
ధన్యవాదాలు శ్రేయాగారు మి అమూల్యమైన అభిప్రాయము తెలిపినందుకు. కథను మెచ్చకునందుకు.
నవ్వు వెనుకనున్న జీవిత సత్యాన్ని క్లుప్తంగా, సూటిగా తెలియచేశారు. ఈ కరోనా సమయంలో సంతోషంగా, ధైర్యంగా ఉండటానికి అవసరమైన కథ.
Thank you, soudaamini garu, నవ్వే bangaaramayena’ nechelli కి పంపుస్తునప్పుడు సందేహం ఉండేది. కథ వస్తువు పాతది అని రిజెక్ట్ చేస్తారేమోనని. కానీ nechelli ie kath ni accept చేసి నందుకు, ప్రస్తుత పరిస్థతుల్లో suitable ga ఉన్నది అని గుర్తించి నందుకు కృతగ్యలు తెలుపుతూ
నవ్వు వెనుకనున్న జీవిత సత్యాన్ని తెలియ చేశారు. సమస్యల వలయాలు చుట్టుముట్టి ఉన్నా సంతోషం మన వెన్నంటి ఉండాలి అని క్లుప్తంగా వివరించారు. ఈ కరోనా సమయంలో మనని మనం సంతోషంగా, ధైర్యంగా ఉంచుకోవటానికి అవసరమైన కథ.
కథా వస్తువుని పాతది అయినా ప్రస్తుత కాలమాన పరస్థితుల్లో అవసరం ఐనదిగా గుర్తించి నందుకు ఎన్నో కృతగ్యతలు రాజ మోహనగారు. అయితే నేను కథలో చెప్పినట్టు ఎలాంటి పరిస్థతుల్లోనైనా నవ్వుతూ ఉన్దటం అందరివల్లా అయ్యేది కాదు .చెప్పటం తేలికే కానీ అనుసరించటం చాలా కష్టం.అయిన చిన్న ప్రయత్నం చేశాను. మి విలువైన అభిప్రాయము తెలిపినందుకు ధన్యవాదాలు తెలుపుతూ,