బతుకు చిత్రం-5

– రావుల కిరణ్మయి

అమ్మా..!ఈ ఉప్మా తినమన్నడు అయ్యగారు.అని రెండు పేపెర్ ప్లేట్లలో వేడి వేడి ఉప్మా తెచ్చిపెట్టిండు.ఆ ఇంట్ల పన్జేసే సితాలయ్య.

ఇద్దరికీ…..నిన్న పొద్దట్నుంచి ఏమీ లేక పోవడం తో బాగా ఆకలి గానే ఉన్నప్పటికీ,అట్నే గూసుంటే సీతాలయ్యన్నడు,

పోద్దువోయింది.ఆయ్యచ్చేదాంక అమాసాగుతదాన్నట్టు ఏదెట్లయినా ఆకలైతే ఆగదు కదా!తినుండ్రి.అని మంచినీళ్ళు సుత ఇచ్చిండు.

ఇక ఆగలేక ఊదుకుంటూ తినడం మొదలు పెట్టారు.తింటాంటే …తింటాంటే జాజులమ్మకు కుత్తిక వడ్డది.మంచినీళ్ళు తాగుదామనుకొని అందుకోబోతాంటే గ్లాసు బోర్లవడి నీళ్ళన్ని వోయినయ్.

సైదులు చూసి తన దగ్గరున్న నీళ్ళ గ్లాస్ తో జాజులమ్మను చేరి తలమీద కొడుతూ నీళ్ళు తాగించాడు.ఇలా వారిద్దరిని చూసి అక్కడే ఉన్న జానయ్య,వరయ్య తో,

అగొ …!జూడున్డ్రి…జూడున్డ్రి..జూసినారుల్ల….,మా మధ్యల ఏమ్లేద్..నాకు ఈమె ఎరుకలేదు.అన్న మనిషి ,అగో జూడున్డ్రి….గింతాంత కుత్తుకలవడితేనే ఎంత హైరానా పడుకుంట లేశి పోయి నీల్దాగిత్తాండో…ఎందుకయ్యా?జనాలను మసి పూసి మారేడు గాయ జేసుడు గాకుంటే.ఇంకా వీళ్ళను సోచాయిన్చుడే లేదు.అనుకుంట జానయ్య,వరయ్య తోటి ఏదో…ఏదో…వదురుతాంటే….

వరయ్య,

జానయ్యా!పచ్చకామెర్లోనికి లోకమంతా పచ్చగానే కనబడుతదన్నట్టు నీకు అట్లా కనబడుతాంది…

అంటే…,

అది గాదయ్యా..!కుత్తుకల వడ్డంతనే పాణం ఎన్కకువోతదిలే.అన్ని కథలు గాకుంటే.మనకు సీన్మ జూపిచ్చుడు గాకుంటే,అన్నాడు మళ్ళీ జానయ్య.

ఇది విన్న సైదులు జప్పన వచ్చి తన ఉప్మా తిందామని చేతిలోకి తీసుకోబోతుంటే అంతా నెల పాలైంది.ఇందాకా తొందరగా లేవబోతూ ప్లేటుకు కాలు తగిలి అది బోర్లా పడిందని తెలుసుకొని కింద పడిందంతా ప్లేటు లోకి ఎత్తి పక్కకు పెట్టి కూచున్నాడు.

జాజులమ్మకు నోటి కాడి బుక్క తన వల్లే జారిపోయిందని జాలి గా అనిపించింది.అందుకే తన ప్లేటు లోని ఉప్మాను ఒక పక్క నుండి తీసి ప్లేటును శుభ్రం చేసీ అందులో పెట్టి ఇచ్చింది.నిండా మునిగాక చలెక్కడిదని మనసు లోపల అనుకోని,ఎలాగూ దొంగల్లా చూస్తున్నారు.ఇంకా భయపడుతూ ఆకలి తో మాడ్చటమెందుకని అతనికి పెట్టగా,సైదులు మారు మాట్లాడకుండా తినేసాడు.  

జానయ్య నోరు తెరుస్తుండగా వరయ్య…చెయ్యెత్తి ఇంకా మాట్లాడకుమని సైగ చేయగా ఆగిపోయాడు.

ఇంతలో సీతాలయ్య చాకేతిరి లో చాయ్ పట్టుకచ్చి అక్కడున్న వారికి గ్లాసులలో పోసి ఇచ్చాడు.

అందరూ తాగిన తరువాత అందరి గ్లాసులు,ఉప్మా తెచ్చిన గిన్నెలు దగ్గర్లో ఉన్న బావి దగ్గర నీళ్ళు చేది శుభ్రంగా కడిగి సీతాలయ్యకు ఇచ్చింది.

మునేశ్వరయ్య వస్తూ..వస్తూనే ,

ఎందుకు తల్లీ?నువ్వే కడిగావ్?తిన్న చెయ్యే కడిగిత్తే పెట్టిన చేతికి పుణ్యం దక్కదు అంటారు.అన్నాడు.

పోన్లే..అయ్యా ..!ఎన్కట సెప్పినట్టే కదా !నేన్సుత పున్నెం జెయ్య బోతే ఇగో గిట్ల పాపమయి ఇఇడ చిక్కువడ్డ.మాయ్య ఎట్లున్నడో ఏందో?అన్నది కళ్ళనీళ్ళు తీసుకొని.

అట్లనకమ్మా…!నీ పున్నెం ఊరికే పోదు.దిగులు పడకు.అయినా,నువ్వేదో తప్పు జేసినవని ఈడున్చినమా..?ఏ సంగతయింది ఈయనోల్లు వత్తే బైతవడ్తది కదా!

తల్లీ..!నువ్వు రామాయణం చదివినవో లేదో,ఇన్నవో ఇన్లేదో గని రాములవారు సీతమ్మను అనుమానించి అవమానించడానికే అగ్ని ప్రవేశం చేయించలేదమ్మా!ఆ తల్లి పవిత్రతను లోకానికి చాటి చెప్పడానికే ఆ విధంగా చేసాడు.ఇది కూడా అంతే.

మీరు ఇద్దరు పవిత్రులని తేటతెల్లం చెయ్యబడితే మిమ్మల్నెవరూ వేలెత్తి చూపరు.ఏదో ఉంది,ఏదో జరిగిందనే అపోహ మిగిలి ఎప్పటికీ మిమ్మల్ని దొంగల్లాగే చూస్తారు.బాధ పడకమ్మా..!అంతా మంచే జరుగుతుంది.అన్నాడు.

మునిశ్వరయ్య ఇట్లా మాట్లాడ్తున్డంగానే ఈర్లచ్చిమి,రాజయ్య అక్కడికి చేరుకున్నారు.నుదుటన పడ్డ కుంకుం బొట్టు,పెద్ద సిగ,చేతి నిండా చేయి తిరగకుండా గాజులు,భుజాల మీదుగా నిండుగా కప్పుకున్న కొంగు,సిగ లో పెట్టుకున్న ముద్దబంతి పువ్వులాగే సంస్కృతిని,సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తున్నట్టుగా ఉన్న ఈర్లచ్చిమి అక్కడికి చేరగానే,అయ్యగారికి చేతులు జోడించింది.

అయ్యా..!పంతులు గారికి మల్లే ఉన్నారు.ఈల్లంతా ఎవలెవలో నాకు తెలియదు.ఈనె మాత్రం మా ఆయన రాజయ్య,అని చూపించి రాజయ్యను ఆయనకు దండం బెట్టమన్నట్టుగా చిన్నగా తట్టింది.మెల్ల మెల్లగా జనం మళ్ళీ చేరసాగారు.

రాజయ్యకు అర్థమై అలాగే చేసాడు.

మునీశ్వరయ్య ఇద్దరికి ప్రతి నమస్కారం చేసి,

 అమ్మా..!ఈయన వరయ్య గారు.ఈ ఊరు పెద్దమనిషి.అంటూ ఒక్కొక్కరిని పరిచయం చేశాడు.జానయ్యను చూడగానే..,

అయ్యా..నిన్న మేము వీళ్ళ పొళ్ళను చూడటానికే ఈ ఊరు వచ్చాము.అగో..ఆడ నిల్సున్నోడు మా పోరడే సైదులు.నేను ఈ ఊర్లె అడుగు పెట్టె వరకే మమ్ములను గురించి మా పోరని గురించి నలుగురు నాలుగు తీర్ల మాట్లాడుడు వినుకుంటనే వచ్చినం.అని సైదులు దగ్గరగా పోయి కొడుకు తల పై చెయ్యి వేసి కళ్ళలో నీరు తిరుగుతుండగా..

వీడు…తాగుబోతే తప్ప తిరుగుబోతు గాదు.వీడికున్న బలహీనతే తాగుడు.తాగినా..వదరకుండా ఓ మూలకు పంటడు తప్పితే,ఎవ్వరి జోలికి పోడు.ఆసొంటోడు గీ పొళ్ళను తెచ్చుకున్నడు అంటే అది ఒల్లెక్కలే.తప్ప నిజం గాదు.వంది ఆ బుద్ధి గాదు.కాకి పిల్ల కాకి కి ముద్దని నా కొడుకు గురించి నేను ఈ ముచ్చట చెప్తలేను.మా ఊళ్ళెకు వచ్చి ఎవర్నీ అడిగినా చెప్తరు.ఈ ముచ్చట ఇమానం జేసి చెప్పమన్నా చెప్పుత అని అన్నది.

సైదులు తల్లి చెప్తున్నది అంతా విని తల్లిని సూయిగా చూడలేక సిగ్గుతో తలవంచుకున్నాడు.

రాజయ్య ఏమీ మాట్లాడలేదు.

జానయ్య ముందుకు వచ్చి…

మీ వాన్ని గురించి ఊళ్లె కనుక్కునేదేమున్నది?నువ్వే చెప్పవడ్తివి.తాగి ఓ మూలకు పంటాడు తప్పితే ఎవల జోలికి పోడని.గిసొంటోనికి పెల్లెందుకు?చేసుకున్నోళ్ళు ఏడవటానికి గాకుంటే?అంటూ..మాట్లాడుతుండగా…

వరయ్య అడ్డుకొని..

జానయ్యా…!నువ్వు ఎక్కువగా మాట్లాడి ఆ తల్లిని బాధ పెట్టకు.ఉన్న విషయం దాయకుండా చెప్పిన ఆతల్లి మంచితనం నీకు నచ్చితే నీ బిడ్డ నియ్యి.లేకుంటే లేదు.అయినా,అది ఆలోచించవలసింది కూడా ఇక్కడ కాదు.నువ్వూరుకో..!అని చెప్పి..

మునీశ్వరయ్యగారూ..!ఏం చేద్దామిప్పుడు?అని అడిగాడు.

చేసేదేముందండీ?వదిలివేయడమే.అంటుండగానే..,

చంద్రం అందుకొని,పొద్దటి సంది జరిగిందంతా సూసి ఉత్తగనే ఇడ్సిపెడ్తే ఎట్లా?రేపు ఇంకొగరు ఇట్లనే ఈడచ్చి జేరి,ఈ గద్దె పవిత్రత జెడగొట్టకుండా వెయ్యి రూపాయలు జరిమానా కట్టమనుండ్రి.అన్నడు.

చంద్రం నువ్వు మల్లీ తప్పుగానే మాట్లాడుతున్నావ్.ఇతని ప్రాణం కాపాడటానికే ఆమె అలా చేసిందని,వారికి ఎటువంటి పరిచయం లేదని ఆ పెద్దమ్మ చెప్తున్నదికదా?

కావచ్చు,కానీ ఇక ముందు ఎవరూ ఈ సంగతిని తప్పుగా చెప్పుకొని ఈ గద్దె ను చులకనగా చూడకూడదంటే,అందరిలోనూ భయం ,భక్తి ఉండాలంటే జరిమానా కట్టించాల్సిందే.అన్నాడు.

మునేశ్వరయ్య మాట్లాడాలని అనుకుంటుండగా,

రాజయ్య,వెయ్యి రూపాయలా?ఇదెక్కడి న్యాయం?తెలిసో తెలియకో ఆ పిల్ల మావోన్ని ఈడికి తెచ్చి బతికించింది.అందుకు శిక్షనా?ఇది ?అన్నడు ఆశ్చర్యంగా.

శిక్ష కాదు నీ కొడుకును బతికించింది అని నువ్వే అంటున్నావు కాబట్టి భక్తితోనే ఇయ్యి అన్నాడు.అది కూడా చేరి ఐదువందలు ఇస్తే సరిపోతుంది ?ఏమంటారు ?పెద్దమనుషులూ ?అన్నాడు.

చాలా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్న చంద్రం ను చూసి వరయ్య ,నువ్వు ఎంత తొందరగా ఇక్కడి నుండి వెళితే అంత మంచిది.లేదంటే మేమే నిన్ను పంపించాల్సి ఉంటుంది.నీకంతా వేళాకోళంగా తోస్తున్నట్టుంది.అన్నాడు కోపంగా.

జానయ్య,అందుకొని చంద్రనం అన్నదాంట్లో తప్పేమీ లేదు.ఈ కళ్యాణ గద్దె పవిత్రత అందరికి తెలుసు.డిని మీద అడుగు పెట్టాలంటేనే ఎంతో మంది ఎంతో ఆలోచిస్తారు.మీకూ తెలియనిది కాదు.,ఒకప్పుడు రాములోరి కళ్యాణం మహా వైభోగంగా జరిగిన వేదిక ఇది.

పెండ్లిళ్ళు కానోళ్ళు,ఆలస్యమవుతున్నవాళ్ళు ఇక్కడ కళ్యాణాలు జరిపించిన రోజులు కూడా ఉన్నాయ్.ఇప్పుడు కూలిపోయి పాడు వడుతున్న స్థితికి చేరుతున్న ఈ గద్దెను బాగు చేయించుకోవాలని పైసలు కూడా జమ చేయవడితిమి.అందువల్ల….,

అందువల్ల…చంద్రం చెప్పినట్టుగా చేస్తే తప్పులేదంటావ్!అంతేనా?జానయ్యా! అడిగాడు మునీ శ్వరయ్య.

అవునయ్యా!అన్నాడు తలదించుకుంటూ.

మన ఊరివారం ఈ గుడి మరమత్తు కోసం పైసలు కూడబెడ్తున్నది నిజమే.కానీ,ఈ ఊరు వారు కాదు.పైగా పేద వారు.వీళ్ళ నుండి డబ్బులు తీసుకోవడం అంత మంచిది కాదని నా అభిప్రాయం.అన్నాడు.

జాజులమ్మ చెయ్యెత్తి మొక్కుతూ,నా తాన 5౦౦ రూలు కాదు గదా!5 పైసలు కూడా లేవు.నన్ను వదిలిపెట్టున్ద్రి అన్నది దీనంగా.

ఈర్లచ్చిమి,జాజులమ్మను చూసి జాలి పడింది.ఆమె మంచితనానికి వెలకట్టలేనని,రాత్రి ఈమే గనుక నా కొడుక్కి సాయం జెయ్యకుంటే వాడు బతికేటోడు కాదు.ఆ ఆడపిల్ల కు నేనే పైసలు ఇత్త.పుణ్యకార్యంలగూడ  మా పాలు వడనియ్యుండ్రి. అన్నది.

రాజయ్య ఆగలేక,ఏందే ?5౦౦లు అంటే ఏమనుకుంటానవ్?ఏడికెల్లి దెస్తవ్?మన పోరనికి గట్టడానికే లెవ్వు.ఆ పొల్ల సంగతి నీకెందుకే?అన్నాడు గట్టిగనే.పాణం కాపాడినందుకు పదో పరకో ఇస్తే సాలు అన్నట్టు మాట్లాడిండు.

ఈర్లచ్చిమి ,రాజయ్య తోని,

నువ్వన్నట్టు 5౦౦లు కట్టి మన పొలగాన్ని తీస్కోని పోతం.పాపం…!ఈ పొల్ల పైసల్లేక ఈడనే చిక్కువడ్తది.పైగా ఆడపిల్ల ఇయ్యాల ఇట్ల మందిల వడుడే పెద్ద ముచ్చట.పెండ్లి గావలసిన పొల్ల.నడిబజార్ల వడ్డది.ఈ మాత్రం సాయం జెయ్యకుంటే మనం మనుషులమే గాదు.అన్నది.

ఏందే ?నీ వాలకం జూత్తే మనోడు ఒప్పుకుంటే పెండ్లైనా జేత్త అనేటట్టున్నవే ? అన్నడు.

రాజయ్య నోటి వెంట ఆ మాట రావడం ఆలస్యం..,సైదులు మెల్లగ నోరు తెరిచి నా మూలం గానే ఈమె మీ అందరి దృష్టిల తప్పులవడ్డది.అందుకనే ఆమె ఒప్పుకుంటే ఆమెను పెళ్ళిచేసుకుంట అని అననే అన్నడు.

ఈ మాట అంటుండగానే ఒకరచ్చి సర్పంచ్ గారు ఊరు నుండి ఇటే వస్తున్నారు,అంటూ చెప్పి వెళ్ళిపోయాడు.

అందరూ సదురుకొని ఒక పద్ధతి గా నిలబడ్డారు.

సర్పంచ్ గారు రానే వచ్చారు.వస్తూనే ఈ సంగతంతా నాకు ఫోన్ లోనే ఎప్పటికప్పుడు తెలిసింది.అన్ని ఈర్లచ్చిమి వైపు తిరిగి,

అమ్మా..!మ్మిరు డబ్బులు కట్టి వెళ్ళిపోండి.అన్నాడు.ఈ అమ్మాయిని మేమే పంపిస్తాం అన్నాడు.

మునేశ్వరయ్య కల్పించుకొని,

అయ్యా..!ఇంతవరకు జరిగిందదే కానీ ,ఇప్పుడే కొత్తగా ఈ సైదులు ఈ అమ్మాయి ఇష్ట పడితే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. తమరు వచ్చారు.అని జరిగిన విషయం చెప్పాడు.

అలాగా…!అయితే మంచిదే కదా…!అని ఈర్లచ్చిమి,రాజయ్యల వైపు తిరిగి మీ అభిప్రాయం ఏమిటన్నట్టు అడిగాడు.

అయ్యా..!చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం.అన్నట్టుగా ఈ తాగుబోతు గానికి ఇదే మంచి సైమమై ఆ పిల్లను జేస్కున్నడు.అని మమ్ముల నాదాను చెయ్యకుండా ఈ పొళ్ళను,వాళ్ళ నాయనను మంచిగ అర్సుకొండ్రి.వాళ్ళ కిట్టమైతే కాణి కట్నం అడగకుండా కట్టుబట్టలతోని నా ఇంటి కోడలి గా తోల్క పోత అన్నది.

జాజులమ్మ కు ఏమీ అర్థం కావడం లేదు.తాగుబోతని ఎవరూ ఇష్ట పడటం లేదు.కాబట్టి గతి లేక నన్ను చేసుకుంటున్నాడేమో..!ఏమని చెప్పడం?ఇది కూడా దొరకని పరిస్థితి దాపురించే కదా!నేను చావాలని బైల్దేరాను.ఇప్పుడు ఏమని చెప్పాలి?అవుననాలా ?కాదు అనాలా ?అని పరి పరి విధాలా లోలోన ఆలోచిస్తుండగానే సర్పంచ్ గారు అడగనే అడిగిండు.          

*****

ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి

Please follow and like us:

One thought on “బతుకు చిత్రం నవల (భాగం-5)”

  1. navala chaala baaga raasthunnaru. ilage kothaga manchi twists tho mee navala saagaalani korukuntunnanu.

Leave a Reply

Your email address will not be published.