మా కథ 

రచన: దొమితిలా చుంగారా 

అనువాదం: ఎన్. వేణుగోపాల్ 

బొలీవియాలో చేగువేరా

బొలీవియాలో చే గెరిల్లా చర్యలు 1967లో జరిగాయి.

జనం ఒక ప్రత్యేక పరిస్థితిలో ఉన్న సమయాన గెరిల్లాలు వచ్చారు. ప్రభుత్వం 1965 నుంచి కత్తిరించిన మా సగం జీతాలు మాకు బాకీపడి ఉంది. కొమిబొల్ ఆర్థికంగా పటిష్టం కాగానే ఆ డబ్బు ఇచ్చేస్తానని బారియెంటోస్ వాగ్దానం చేశాడు. ఏళ్ళు గడిచిపోయాయిగాని ఆ వాగ్దానం అమల్లోకొచ్చే జాడలు కనబడలేదు. మిలిటరీ లోంచి ఓ కొత్త బూర్జువా వర్గం పుట్టుకొచ్చింది. వాళ్ళు మెర్సిడిస్ – బెంజ్ కార్లు, పెద్ద పెద్ద గృహాలు కొనడం మొదలు పెట్టారు. మేం ఒకవైపు ఆకలికి మాడి చస్తుంటే వాళ్ళు సుఖ సంతోషాలతో తులతూగారు. వాళ్ళు డిఐసి అనబడే ఒక కొత్త పోలీసు సంస్థని కూడా తయారు చేశారు.

అప్పుడు మేం ఎడతెగని డిమాండ్ల మధ్య ఎప్పుడూ సమస్యల పరిష్కారాలాలోచిస్తూ గడిపాం. కాని ప్రభుత్వం ప్రతిసారీ మా డిమాండ్లకు ఒకే జవాబిచ్చింది. కాల్పులు, అరెస్టులు, జైళ్ళు.

ఈ స్థితిలో అకస్మాత్తుగా మాకు గెరిల్లాల గురించి తెలియవచ్చింది. వాళ్ళమీద, వాళ్ళను సమర్థించే వాళ్ళమీద ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోబోతున్నదని కూడా మాకు తెలిసింది.

మొదటి రోజుల్లో ఈ వార్తల్ని మేం అంతగా పట్టించుకోలేదు. “గెరిల్లాలు మీ ఊహల్లోనే బతుకుతున్నారు” అని మేం అనే వాళ్ళం. మళ్ళీ హత్యాకాండలకు పూనుకోవడానికే ప్రభుత్వం ఈ సాకు తెస్తున్నదని మేమనుకున్నాం. చాల ఎక్కువమంది కార్మికులను పనినుంచి తొలగించి వీధుల్లోకి వెళ్ళగొట్టడాన్ని మేం “తెల్ల హత్యాకాండ” అని పిలుస్తాం. బారియెంటోస్ అధికారానికొచ్చినప్పటి నుండి ఎన్నో తెల్ల హత్యాకాండలు జరిగాయి. ఫిర్యాదుచేసిన ప్రతి కార్మికుడూ కం పెనీ నుంచి తన్ని తరిమేయబడ్డాడు. సైగ్లో-20లో ఐదువందల మందికన్న ఎక్కువ కార్మికులకు ప్రస్తుతం ఏ హక్కులూ లేవు. వాళ్ళ పనిచేసే హక్కు రద్దు చేయబడింది. కనుకనే ఈ గెరిల్లాల గురించిన వార్తలన్నిటినీ మేం నిర్బంధ కాండను మరింత పెచ్చరిల్లజేసే ఒక సాకుగానే తీసుకున్నాం.

ఐతే కొన్నాళ్ళకే గెరిల్లా దళం పంపిన ఉత్తరం ఒకటి మాకందింది. దాని మీద మొయి సెస్ గువేరా, సైమన్ క్యూబా, జూలియో వెలాస్కో, రావుల్ క్విస్పాయా, మరి కొందరు సంతకాలు చేశారు. దానిమీద సంతకాలు చేసిన వాళ్ళందరూ గనిలో అందరికీ చిరపరిచితులే. ప్రభుత్వానికి తన అధికారాన్ని పరిరక్షించుకోవడానికి ఒక సైన్యం ఉన్నదనీ, అలాగే కార్మిక వర్గానికి కూడా తనను తాను రక్షించుకోవడానికి ఒక సాయుధ దళం ఉండాలనీ వాళ్లు తమ ప్రణాళికలో రాశారు. ఎంతో మంది జనం బిడ్డలు నియంతృత్వానికి స్వస్తి చెప్పడానికీ, ప్రజానీకాన్ని రక్తపుటేర్లలో ముంచుతున్న ఫాసిజాన్ని కూలదోయడానికి కొండల్లోకి వెళ్ళారని కూడా వాళ్ళు రాశారు. కొండలలోంచి వాళ్ళు తమ పోరాటం సాగిస్తారని కూడా రాశారు. ఈ దోపిడీ వ్యవస్థను కూల్చేయాలనీ, కార్మిక వర్గం రాజ్యాధికారానికి రావాలనీ వాళ్ళు స్పష్టంగా ప్రకటించారు. కార్మికవర్గ రాజ్యాధికారం ద్వారానే, సోషలిజం ద్వారానే ప్రపంచం మరింత న్యాయమైన, మరింత మానవత నిండిన సమాజంగా మారుతుందని వాళ్ళు .రాశారు. ఆ సమాజంలో ఆకలి, రోగం, దుఃఖం, దారిద్ర్యం, అన్యాయం ఉండవనీ, కంపెనీలు లే-ఆఫీలు విధించవనీ వాళ్లు రాశారు.

ఆ ప్రణాళిక రెండు పేజీలుండింది. ఆ ప్రణాళికలో మా జీవన స్థితిగతుల పట్ల నిశితమైన పరిశీలన ఉండింది. ఆ స్థితిగతుల్లో మా కర్తవ్యం ఏమిటో దాంట్లో రాయబడింది. మాకు వాళతో కొంతవరకు సంబంధాలుండడం వల్ల మేం ఆ సంతకాల్ని గుర్తించాం. ఈ కరపత్రం విడుదల తర్వాత మేమిక గెరిల్లాల ఉనికిని ‘ గురించిన వార్తలను

అనుమానించలేదు. ఈ ప్రణాళికకు ఎంతో ప్రచారం లభించింది. మేమైతే ప్రణాళికను మా • రేడియోలో కూడా చదివి వినిపించాం. బహుశా మేం ఇలా చేయడం తప్పే కావచ్చు.

ఆ రోజుల్లో సైగ్లో-20లో ఉన్న ప్రధాన కార్యదర్శులందరితో సమావేశాన్ని ఏర్పాటు చేయాలనీ, ప్రభుత్వం బాకీ పడిన జీతాలు వెంటనే తిరిగి ఇమ్మని డిమాండ్ చేయాలనీ గని కార్మికుల ఫెడరేషన్ ఆలోచించింది. కొందరు కార్మికులు కూడ ఇక తమ ‘జీతాలు తిరిగి రాకపోతే బహిరంగంగా గెరిల్లాలను సమర్థిస్తామని అన్నారు. ఎడతెగకుండా సాగే తెల్ల హత్యాకాండల్లో పని పోగొట్టుకొని బతుకుతెరువు లేకుండా ఆకలికి చచ్చిపోయే కన్న అడవుల్లో చావడం మిన్న కాదా అని వాళ్ళడిగారు. అనుకోకుండానే గెరిల్లాలను సమర్థిస్తూ కొన్ని ప్రదర్శనలు కూడ జరిగాయి.

ప్రధాన కార్యదర్శుల సమావేశం 1967 జూన్ 25న జరగవలసి ఉండింది. కాని ఇంతకు ముందు రోజు, అంటే జూన్ 24న, సాన్ జువాన్ పండుగ రోజున సైన్యం సైగ్లో-20లో మరొక దారుణ మారణ కాండ జరిపింది. ఈ పండగ రోజున మేం పొరుగిళ్లకు వెళ్ళి విందులు చేసుకొని, టపాకాయలు కాల్చుకొని, ఆటపాటలతో గడిపే ఆచారం ఉంది.

గెరిల్లాలను సమర్థించామనే కారణం మీద సైన్యం మా అందరినీ అరెస్టు చేసింది. వాళ్ళు మమ్మల్ని కొట్టారు. మా పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఎంతో మందిని మట్టుబెట్టారు. నన్ను కడుపు మీద తన్నిన ఫలితంగా నా గర్భస్త శిశువు జైల్లో చనిపోయాడు. నేను గెరిల్లాలకు, జనానికి మధ్య సమాచార సంబంధాలు నడుపుతున్నానని వాళ్ళు నన్ను చిత్రహింసల పాలు జేశారు. ఈ అణచివేతను తట్టుకోలేక చాల మంది మా కామ్రేడ్లు, మా పిల్లలు కొంత మంది చేతో వెళ్ళిపోయారు. చే గెరిల్లా దళం కోసం మేం మాకు అత్యంత ప్రియమైన వాళ్ళెందరినో శత్రువుకు బలి పెట్టవలసి వచ్చింది.

చే తనకే మోసం జరిగిందని అనుకుంటున్నట్టున్నాడు. లేదా, డైరీలోనైతే అలా రాశాడు కదూ?! బొలీవియాను అతను మరొక రకంగా ఊహించాడు. మరొక రకమైన అవకాశాలు ఆశించాడతను. కాని నా ఉద్దేశ్యంలో చే కొన్ని పొరపాట్లు చేశాడు. ఆయన ఒక్క రాజకీయ పార్టీనే అతి ఎక్కువగా నమ్మాడు. మరోవైపు నిజమైన ప్రజా సంస్థలతో, కార్మిక వర్గ సంస్థలతో సంధాలు పెట్టుకోనే లేదు. ఆయన ఆ పని గనుక చేసి ఉంటే ఈ సంస్థలు నిజాయితీతో తమ అభిప్రాయాలు స్పష్టంగా చెప్పి ఉండేవి. అంతేగాక, ఆయన పోరాటంలో చేరిన వాళ్ళలో కొందరు ఆ తర్వాత బయటి కొచ్చేశారు. ఈ విషయాలన్నీ చే డైరీలో ఉన్నాయి కదూ? ఇవి నేను కలిపించినవేమీ కాదు. సరే ఏదేమైనా నాకా సంగతులు స్పష్టంగా తెలియవు. తెలుసుకోదలచిన వాళ్లు ఆయన డైరీ చదవవచ్చు. ఆయన డైరీలో ఈ సంగతీ, ఇతర సంగతులూ కూడ ఆయన ప్రస్తావించాడు.

చే చనిపోయిందాకా మా గనిలో వాళ్లెవరికీ ఆయన బొలీవియాలో ఉన్నాడనే తెలియదు. అంతకుముందు కొన్ని వార్తలు వచ్చాయిగాని పత్రికలో అతని శవం ఫోటో అచ్చయినాకనే చే గెరిల్లాలతో కలిసి ఉన్నాడని మా కర్థమైంది. ఇంకా చెప్పాలంటే అప్పుడే మాకు కొందరు గని కార్మికులకు గెరిల్లాలతో సంబంధాలుండిన సంగతి తెలిసింది. మా వాళ్లు గెరిల్లాల కిచ్చిన మద్దతువల్ల మాలో చాల మంది కామ్రేడ్స్ ఎన్నో కష్టాలనుభవించారు. ప్రాణాలు బలి పెట్టారు.

ఇదంతా తెలుసు కనుకనే, మెక్సికో అంతర్జాతీయ మహిళా సమావేశంలో నేను మాట్లాడడం ముగించగానే ఒక వ్యక్తి నాతో అన్న మాటకు నేనెంతో గాయపడ్డాను.

“మీరు బొలీవియనా?”

“ఔను”

“ఓహో! మహాయోధుడు కమాండర్ చేగువేరాను చంపిన వాళ్ళను కూడా శిక్షించని పిరికి పందలు కదూ మీరు!” అన్నాడతను.

నాకెంతో బాధేసింది. నీకు దేని గురించైనా ఎక్కువ తెలియనప్పుడు, అభిప్రాయం ప్రకటించే ముందు నువ్వోసారి వాస్తవాలు తెలుసుకోవాలి. పరిశోధించాలి, కాదు” సైగ్లో-20లో సాన్జువాన్ హత్యాకాండ సందర్భంగా, ఆ తర్వాత జరిగిన దారుణాలన్నీ చే గెరిల్లాల ఉనికి వల్లనేనని నాకు తెలుసు. అలాంటప్పుడు బొలీవియా ప్రజలు పిరికి పందలనీ, చే కు ద్రోహం చేశారనీ అనడం ఎంత అన్యాయం!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.