యాత్రాగీతం

నా కళ్లతో అమెరికా

అలాస్కా

-డా||కె.గీత

భాగం-10

మా అలాస్కా ప్రయాణంలో అతి ముఖ్యమైన ఘట్టం రానే వచ్చింది. భూమి మీద అత్యద్భుతాల్లో ఒకటైన  హిమానీ నదమ్మీద స్వయంగా అడుగుపెట్టే విమాన ప్రయాణం మొదలయ్యింది.  టేకాఫ్ సాఫీగానే జరిగినా ఊహించుకున్న దానికంటే భయంకరంగా శబ్దం చేస్తూ ఆరుగురు మాత్రమే పట్టే ఆ చిన్న ఫ్లైట్ గాల్లోకి లేచింది. 

అతి చిన్న విమానమేమో గాలికి సముద్రంలో పడవలా ఊగసాగింది. దాదాపు అయిదు నిమిషాల పాటు గొప్ప భయం వేసింది. అయితే విమానం విహంగంలా రయ్యిన ఆకాశంలో వెళుతూ కనుచూపుమేర సుందర దృశ్యాలు ఆవిష్కరించేసరికి అప్పటివరకు కాస్తో కూస్తో ఉన్న బెరుకు పోయింది. తక్కువ ఎత్తులో ఎగురుతుండడం వల్ల కిందంతా అద్భుతంగా కనిపించసాగింది. తల్కిట్నా ఊరు సుశిత్నా (Susitna), చులిత్నా (Chulitna), తల్కిట్నా (Talkeetna) నదుల సంగమంలో ఉండడం వల్ల  ఊరికి చుట్టూ ఎటు చూసినా నదుల ప్రవాహాలు పాయలుపాయలుగా అల్లుకుంటూ కనువిందు చేస్తూ ఉన్నాయి. 

చిన్న లక్కపిడతలుగా మారిపోయిన  ఇళ్లని దాటి, చిన్న తల్కిట్నా (Talkeetna) ఊరిని దాటి, ఏర్లు  దాటి, కోనని దాటి ఊరికి ఉత్తరం దిక్కుగా ఉన్న మంచు కొండల వైపు ప్రయాణించసాగేము. పర్వతం దగ్గిరికి చేరేసరికి ఒక పక్క దూరంగా జరుగుతూ కనుమరుగవుతున్న ఊరికి, పర్వతానికి మధ్య బద్ధకంగా పరుచుకున్న పల్చటి అడవి, మధ్య బురద రంగులో ప్రవాహం ఘనీభవించినట్టున్న మెలికల పాములాంటి నది. చుట్టూ అంతా చిత్రపటంలా మారిపోయింది. 

బయలుదేరిన సరిగ్గా పదినిమిషాల్లో మంచు పర్వతపు కోన మీంచి ఎగరసాగేము. అప్పుడర్థమైంది అది ఒక్క పర్వతం కాదు. పర్వత శ్రేణి. ఒళ్ళు గగుర్పొడిచే సూదంటు కొనలున్న పర్వత  శ్రేణి. వేసవి కావడంతో తెల్లని మంచు అక్కడక్కడా కరిగి మధ్య మధ్య నల్లని రాళ్లు పైకి తలెత్తి చూస్తూన్నాయి. అంతలోనే లోపల్లోపల భయాన్ని తొలగిస్తూ అభయమిస్తున్నట్టు పర్వత శ్రేణుల మధ్య వెల్లువలా పరుచుకున్న అందమైన హిమానీ నదం ఆనందంగా ఆహ్వానించింది. అటూ ఇటూ మంచు పర్వతాలు ఘనీభవన ప్రవాహమై త్రోవ చూపిస్తూ మాతో వెనక్కి పరుగెడుతున్న  హిమానీ నదం. ఒక్క క్షణం కూడా రెప్పవెయ్యనివ్వని  అద్భుతమైన క్షణాలవి. 

హెడ్ ఫోన్స్ పెట్టుకున్నా గట్టిగా రొద చేస్తూ ప్రయాణిస్తున్న విమానం, గాల్లో ఊగిసలాడుతూ చెమటలు పట్టిస్తున్న ప్రయాణాన్ని అలవోకగా మరిచి,  కిటికీ లోంచి బయటికే చూస్తూ అతుక్కుపోయిన నాకు కంటి ముందు కనిపిస్తున్న సుందర దృశ్యాలు తప్ప మరో లోకం గుర్తు రాలేదు.

మా విమానం దిగుతున్న సమయానికి అప్పటికే అక్కడ ఆగిఉన్న మరొక విమానం గాల్లోకి లేచింది.  

ఇక విమానం హిమానీ నదపు నడిబొడ్డున దిగి ఒక్కొక్కరూ అడుగుపెడుతున్న క్షణాన నా కోసమే, ఆక్షణం కోసమే యుగాలుగా ఆ మంచుప్రవాహం అలా  ఎదురుచూస్తూ ఉందనిపించింది. అప్పటివరకు గాల్లో ప్రయాణం చేసి రెండు కళ్ల సాక్షిగా చూసేం కాబట్టి గానీ నిజానికి దిగేక చుట్టూ మంచుతో కప్పబడిఉన్న ఏదో ప్రదేశానికి వచ్చినట్టే ఉంది కానీ అదొక హిమానీ నదమని తెలియరాకుంది. అటూ ఇటూ గంభీరంగా నిల్చున్న కొండల మధ్య విస్తృతంగా పరుచుకున్న అతి పెద్ద లోయలా మాత్రమే ఉంది అక్కడ. 

ఆ ఉదయానో, ఆ ముందు రోజో మంచు కురిసినట్లు మెత్తటి మంచులో బూటు కాలు దిగబడుతూ ఉంది.  ఎక్కడైనా మంచు పెళ్లలుగా విరిగి లోపలికి వెళ్లిపోతుందేమో అని లోపల్లోపల చిన్న భయం వేస్తూ. అదే అడిగాను. అలాంటి భయం అవసరం లేదని ఎన్నో వేల ఏళ్లుగా మంచు అలా పేరుకుని పేరుకుని గట్టిపడిన గ్లేసియర్స్ అవి అని, కానీ దాదాపు మైలు కిందెక్కడో అవి బద్ధకపు తాబేళ్లలా మేమక్కడ ఉన్న క్షణంలో కూడా కనిపెట్టలేనంత అతి మెల్లగా కదులుతూ ఉంటాయని వివరించేడు. అంతేకాకుండా అక్కడ విమానాలు దిగడానికి ముందే తగిన పరిశీలనలు జరుపుతారని చిరునవ్వుతో చెప్పేడు. 

మా అందర్నీ సరిగ్గా అరగంట లో విమానం దగ్గిరికి తిరిగి వచ్చెయ్యమని, వంద మీటర్ల కంటే దూరం వెళ్లొద్దని మా పైలట్ హెచ్చరించేడు. అందుకు కారణాలు ఏవైనా మేమైతే కనీసం 50 మీటర్ల దూరం కూడా వెళ్లకుండా అక్కడక్కడే ఆడుకుంటూ, ఫోటోలు తీసుకుంటూ గడిపేం. దారంతా నిద్రపోయిన సిరి మంచు చూసేసరికి హుషారుగా ఆడడం మొదలుపెట్టింది. వరు, సత్య  సరేసరి. ఇద్దరికీ  సాహసాలంటే బాగా ఇష్టం. పైలట్ చెప్పిన మాట వినకుండా దూరానికి వెళ్ళిపోతారేమో అని అక్కడున్నంత సేపు వాళ్లని కనిపెట్టుకుని ఉన్నాను.  నిజానికి అరగంట అయిదు నిమిషాల్లా అయిపోయింది. 

మేమక్కడ ఉండగానే మాకు కనుచూపుమేర దూరంలో మరొక ఫ్లైట్ ఆగింది. అది దిగగానే మా ఫ్లైట్ బయలుదేరడానికి సిద్ధమైంది. ఇలా అరగంటకొకటి చొప్పున అదే నిర్దేశిత స్థలంలో వెళ్లొస్తున్నాయని అర్థమైంది. విమానంలోకి తిరిగి అడుగుపెడ్తున్నపుడు అదో విధమైన బాధగా అనిపించినా ఎందుకో వెనక్కి వెళ్లిపోవడానికి సంతోషం వేసింది. బహుశా: హిమనీనదమంటే కదిలేదని ఏదో తెలీని భయం చుట్టముట్టడం వల్లనేమో. 

తిరిగి పర్వత శ్రేణుల్ని దాటి, కోనల్ని దాటి, నదిని దాటి, ఊరు కనిపించగానే గొప్ప సంతోషం కలిగింది. చాలా తమాషాగా గాల్లో ఉన్నప్పుడంతా ఊగిసలాడిన విమానం నేలమీద దిగినప్పుడు అతి సాఫీగా దిగింది. అంత స్మూత్ లాండింగ్ చేసి మమ్మల్ని క్షేమంగా వెనక్కి తీసుకొచ్చిన పైలట్ కి పదే పదే కృతజ్ఞతలు చెప్పేను. టిక్కెట్టు బాగా ఖరీదైనా జీవితంలో చేసి తీరదగ్గ అద్భుతమైన ప్రయాణాల్లో ఇది ఎన్నదగినది. నా వరకూ నాకు చాలా చాలా నచ్చిన ప్రయాణమది.  

****

(ఇంకా ఉంది)

ఫోటోస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Please follow and like us:

3 thoughts on “యాత్రాగీతం-22 (అలాస్కా-10)”

  1. వాహ్ అద్భుతం. అలాస్కా ఫోటోస్ చూస్తేనే ఇంత బావుంది, ఇక స్వయంగా వెళ్తే….

  2. హిమానీ నదంపై అడుగిడిన అనుభూతి కలిగింది. ధన్యవాదాలు గీత గారు.

    1. మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది రత్నమాల గారూ!

Leave a Reply

Your email address will not be published.