సృష్టికి మూలం గమనం!
(‘తపన రచయితల గ్రూప్’ కవితల పోటీలో ‘ప్రథమ బహుమతి’ పొందిన కవిత)
-రాయపురెడ్డి సత్యనారాయణ
జనన మరణాల నడుమ సాగే ఈ ‘జీవన ప్రస్థానం’లో……
గమ్యాన్ని చేరేందుకు నిత్యం నువు వేసే ప్రతి అడుగూ, తీసే పరుగూ ఓ ‘గమన’మే కదా!
‘అమ్మ’ ప్రేగును త్రెంచుకొని అమాంతం భూమమ్మీద పడాలని….
‘పసిగృడ్డు’ చేసే పోరాటంలో ‘గమనం‘ కనలేదా?
‘మట్టి’ని చీల్చుకొని మొలకెత్తాలని ‘విత్తు’ పడే ఆరాటంలో ‘గమనం‘ కనరాదా?
చీకటి గుండెల్ని చీల్చుకొని పొడిచే వేకువ పొద్దులో ‘గమనం‘!
గాలి అలలపై తేలిపోతూ కొమ్మకొమ్మకు దూకే ‘పక్షి’ పరుగులోను ‘గమనం‘!
నీటి అలలపై ఈదులాడే ‘చేప’ పిల్లలో ‘గమనం‘!
వీచే ‘గాలి’లో ‘గమనం‘! విరిసే ‘పువ్వు’లో ‘గమనం‘!
కురిసే ‘మబ్బు’లోనూ ‘గమనం‘!
సకల చరాచర ‘సృష్టి‘కి మూలం ‘గమనం‘!
****
గమనము ను గూర్చి చక్కని భావ వ్యక్తీకరణ.నిజమే పుట్టుకనుండి గిట్టుట వరకు ప్రతి మనిషి అలుపెరుగని గమనం చేస్తుంటాడు.అవన్నీ సవ్యమై మార్పుకు శ్రీకారాలైతే ఇంకెంత బాగుంటుందో కదా.మంచి కవిత చదివించారు.అభినందనలు సర్