అనీడ కవితా సంపుటి పై సమీక్ష

   -గిరి ప్రసాద్ చెలమల్లు

నీడ కవితలోని అనీడయే సంకలనం పేరై కవితా సంకలనం గా పాఠకుల ముందుకు తెచ్చిన గార్ల బయ్యారం పుత్రిక రూప రుక్మిణి గారు కవితల్లో సామాజిక అంశాలను సమకాలీన సమాజంలో మానసిక రాజకీయ అంశాల ను వస్తువులుగా తీసుకున్నారు. ” తన స్నేహం వెలుతురున్నంత వరకే! అది తెలిసి నీడ అనీడ గా ” అంటూ పసిప్రాయంలో గుర్తించిన నీడ తన తో పాటుగా తనను వీడక తన నడకలో నడతలో వెన్నంటి ఉండే నీడగా అభివర్ణించారు.
అగ్ని శిఖ కవిత లో “నిశీధిలో కలిసి పోయిన చిరునవ్వునా ? ఏమివ్వగలవు”అంటూ ప్రశ్నని సంధిస్తూ “నిన్ను ఎడబాయలేక ఎన్నిసార్లు తనని తాను వంచించుకున్నదో కదా! ” అని ఆమె ఆమె గా పడే ఘర్షణ లోని సంఘర్షణను చెమ్మగిల్లే కళ్ళ తో ఆవిష్కరించారు. ఇంకేం మిగిలిందనే విధంగా “గాయాల గుండె గదుల్లో ఘనీభవించిన ప్రేమనా!! “అని ఆవేదన వ్యక్తంచేసారు. రంగుల గాయం కవిత లో “నీ మౌనం చేసిన గాయం ఇంకా సలుపుతుంది కత్తి చేసిన గాయం కన్నా” లో మానసిక గాయంలోని బాధ శారీరక గాయం కన్నా ఎక్కువని చెప్పటంలో వాడిన విధం శ్లాఘనీయం. “మౌనం మాటైన వేళ గాయాలు గాలివాటు గా తేలిపోతాయని” మౌనం ఎంత భయానక వాతావరణం ను సృష్టిస్తుందో సెలవిచ్చారు. మాటలు ఉప శమనాన్ని కల్గించగల ఔషధమని తేల్చేసారు.
అమ్మతనం కవిత లో “అమ్మ్మతనాన్నే ప్రశ్నిస్తుంటే రుధిరాగ్నిలో స్నానమాడుతున్న మాతృ మూర్తి ని” అని అమ్మ గా పడే లోలోన మథనాన్ని బహిర్గతం చేసారు. ‘చెక్కిన శిల్పం లాంటి తన పై నిశిలో..రాలిన పూల వాన కు చిత్రం వర్ణం మారిందన్నారు” చిత్ర వర్ణం కవిత లో.
 పసిడి పువ్వు కవిత లో “నా మమతల లోగిలిలో ఏ పూల మంటలు తాకకుండా ఏ రాక్షసుల నీడ పైన పడకుండా పసిడి పువ్వంటి చిన్నారి ని కావలిపక్షిలా కాపాడుకోవాలని ఓ తల్లిగా నా ఆకాంక్ష” అని పురుషాధిక్య సమాజంలో చిదమబడుతున్న పసి శరీరాలను రక్షించుకోవాలనే పరితపించే హృదయం కనబడింది. ఉనికి కవిత లో “వెర్రి వెకిలి చూపుల పరిహాసాల మధ్య నాగలి సాగులో చిగురించిన మొక్కలా కొత్త చిగురులు అల్లుకుంటూనే” తీగ తో  ఆమె ఉనికిని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయడం ఆవశ్యమని ఎలుగెత్తి చాటారు.
 భవిష్యత్తు తరాలకు దారి చూపలేని నిస్సహాయత ను సిగ్గు తో రేపటి రోజు కనుమరుగయి పోయిందని వెలివాడల అంటరానితనాన్ని చెళ్ళున చరిచారు. గాయం లో “ఆమెలో తడిచిన నీవు ఒక్కసారైనా మూర్తీభవించిన ఆమె ప్రేమ పల్లకీ ని ఎక్కి చూడు! నిశీధిలో నీ గుండె స్రవించక తప్పదు” అని ప్రేమ కోసం పరితపించే ఆమె అంతరంగాన్ని గుర్తించాలని ఆదేశించారు.
 నిశ్శబ్దపు నవ్వులో ” ఆ నవ్వులన్నీ గోడలకి వ్రేలాడ దీసి ఎంత కాలమయ్యిందో అది గులాబీ నవ్వుల్లా గుచ్చుకుంటుంది” కను దోయల సరస్సు లో తూగుతున్న నావలా గతాన్ని వదిలిన నేనంటూ ముళ్ళ బాట లు ఆమె పయనంలో సహజమని వాటిని దాటుకుంటూ గతాన్ని వదిలి వర్తమానం లో జీవించాలనే తర్కాన్ని ఎత్తుకున్నారు. 
 ఇంకా చాలా కవితలున్నాయి. కొన్ని కవితలు పాఠకులను ఆద్యంతం చదివించ లేకపోవచ్చు. ఇప్పుడిప్పుడే  వ్రాస్తున్న కవయిత్రి గా ఇంకా కవిత్వంలో తనకంటూ ఒక శైలి ని సృష్టించుకోవాల్సిన అవసరం వుంది. కవితా వస్తువుల ఎంపిక లో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఖమ్మం జిల్లా లో మరో ఆణిముత్యం దొరికినట్లే. 
ప్రతులకు
కె. రూప రుక్మిణి 9441133071
15-9-283 రోడ్ నెంబర్ 9
కవిరాజ నగర్ ఖమ్మం 507002

****

Please follow and like us:

2 thoughts on “అనీడ కవితా సంపుటి పై సమీక్ష”

  1. అనీడ ని ఇంత చక్కగా ఆవిష్కరించిన మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు సర్😊🙏
    Thank you geeta maam 😊🙏

Leave a Reply

Your email address will not be published.