ఒక భార్గవి – కొన్ని రాగాలు -14
హాయిగా మెత్తగా మత్తును గొలిపే రాగం – హమీర్ కల్యాణి
-భార్గవి
మండు వేసవి కాలం ,రాత్రి తొలిజాములో ,వెలిగే నక్షత్రాల కింద మేనువాల్చిన సమయంలో, హాయిగా తాకి సేదతీర్చే చల్లనిగాలిలా,
పట్టుమెత్తని గులాబీ రేకులు తలపై నుండీ జలజలా రాలి తనువంతా సుగంధ భరితం చేసినట్లూ
సుతిమెత్తని ముఖమల్ పరుపుపై ఒత్తిగిలినంత సుఖంగానూ అనిపించే రాగం హమీర్ కల్యాణి
ఇది ఉత్తర భారతంలో పుట్టిన రాగం అంటే హిందుస్థానీ సంప్రదాయానికి చెందినది .ఈ రాగంలో త్యాగరాజు,ముత్తుస్వామి దీక్షితర్ ,స్వాతి తిరునాళ్ మొదలయిన వారు కృతులను రచించి ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చారు.హిందుస్థానీ సంగీతంలో దీనికి దగ్గరగా వుండే రాగం రాగ్ కేదార్ ,అంటే హమీర్ కల్యాణికీ,కేదార్ కీ స్వరాలుఉపయోగించడం లోనూ పాడటంలోనూ కొద్ది తేడాలుంటాయి.
హమీర్ కల్యాణి 65వ మేళకర్త అయిన మేచకల్యాణి నుండీ జన్యము.ప్రతి మధ్యమ ప్రధానమైన రాగం,అంటే ఇందులో వినిపించే “మ” అనే స్వరాన్ని ప్రతిమధ్యమం అంటారు,అయితే శుధ్ధ మధ్యమం కూడా పక్కనే వస్తే ఆరాగం అందం ఇనుమడిస్తుందంటారు.రాగ్ కేదార్ లో రెండు రకాల నిషాదాలనీ కూడా వినియోగిస్తూ వుంటారు.
మనసుకి ప్రశాంతతనీ,హాయినీ కలగజేస్తుంది కాబట్టి మ్యూజిక్ థెరపీలో ఆందోళననీ,రక్తపోటునీ తగ్గిస్తుందంటున్నారు.రాత్రి తొలిజాములో పాడదగిన రాగంగా పరిగణిస్తారు.
ఈ రాగంలో త్యాగరాజ కీర్తనలు “మానములేదా,ముత్యాల చవికెలో “అనే రెండు కీర్తనలు బాగా ప్రాచుర్యంలో వున్నాయి.
ముత్తుస్వామి దీక్షతర్ “పరిమళ రంగనాధం” అనేది “హమీర్ కల్యాణి”కి ఒక చిరునామా.
స్వాతి తిరునాళ్ చేసిన “గాంగేయ వసనధర పద్మనాభ” అనేది కూడా బాగా పేరొందినది.
ఇక సుబ్బరాయశాస్త్రి గారి “వెంకటశైల విహార” అనే కృతి మల్లాది బ్రదర్స్ పాడింది చాలా బాగుంటుంది.
సినిమాలలో ఈ రాగాన్ని విస్త్రుతంగా కాకపోయినా అప్పుడప్పుడూ అందంగా వినిపిస్తూనే వున్నారు.
హిందీ సినిమాలలో నౌషాద్ ,వసంత్ దేశాయ్ ల నేతృత్వంలో వచ్చిన రెండు పాటలు చాలా అద్భుతంగా వుంటాయి.
అవి “మొగలె ఆజమ్ “లో లతా అతి తీయగా పాడిన”బేకస్ పె కరమ్ కీజియె ” అనే పాట,”గుడ్డి” లో వాణీ జయరామ్ పాడిన “హమ్ కో మన్ కీ శక్తి దేన” అనే పాటా.
ఇంకా “కోహినూర్”అనే సినిమాలో మహ్మద్ రఫీ పాడిన “మధువన్ మే రాధికా నాచేరే” అనేదీ, “సంగ్రామ్ “అనే సినిమా లో మహ్మద్ రఫీనే పాడిన “మైతో తెరే హసీన్ ఖయాలో మే ఖోగయా” పాటా కూడా వున్నది ఈ రాగంలోనే.
ఇంకో విశేషం “ప్యాసా” అనే గురుదత్ సినిమాలో వెనక యే వాద్య విశేషమూ లేకుండా మహ్మద్ రఫీ పాడిన కవిత “తంగ్ ఆ చుకే హై” అనేది కూడా ఇదే రాగంలో వుంది. (అంటే రాగ్ కేదార్ అని గుర్తు పెట్టుకోవాలి మరి హిందుస్థానీ పధ్ధతిలో పాడటంలో కొంత తేడా వుంటుంది అని చెప్పుకున్నాం కదా)
సంగీత దర్శకుడు యస్ .రాజేశ్వరరావుకి హిందుస్థానీ సంగీతంలో మంచి ప్రవేశం వుంది,ఆయన పాటలలో ఆపోకడలు చాలా వుంటాయి , హమీర్ కల్యాణిని ఆయన వుపయోగించిన తీరు చూస్తే ,ఆయనకి ఈ రాగమంటే చాలా అభిమానమేమో అనిపిస్తుంది.
“రాణీ రత్న ప్రభ “అనే సినిమాలో పి.బి.శ్రీనివాస్ ,పి.సుశీల ల గళాలలో పలికిన “అనురాగము ఒలికే ఈ రేయి”అనే యుగళ గీతం వింటుంటేనే అర్థమవుతుంది రాజేశ్వరరావుగారికి ఈ రాగమంటే యెంత అనురాగమో
అలాగే “భక్త జయదేవ” లో ఘంటసాల పాడిన “నీ మధు మురళీ గాన లీల “వింటుంటే ఆ అభిప్రాయం బలపడుతుంది.
ఇంక “భీష్మ “లో పి.సుశీల పాడిన “జో జో జోల గారాల బాల “అనే పాటలో పల్లవీ,మొదటి చరణమూ వింటుంటే ఆ అభిప్రాయం మరింత స్థిరపడుతుంది(మిగతా చరణాలు వేర్వేరు రాగాలలో వుంటాయి),”అలలమీద తామరలే అందమైన ఉయ్యాల” అనే చోట మనసును ఉయ్యాలలూపే సంగతులుంటాయి,మరి రాజేశ్వరరావా మజాకా!
రాజేశ్వరరావు గారిలాగే హిందుస్థానీ సంగీతం మీద మంచి పట్టు వున్న సంగీత దర్శకుడు పి.ఆదినారాయణ రావు ,ఆయన”స్వర్ణమంజరి” అనే సినిమాలో,ఘంటసాల ,సుశీలచేత పాడించిన “ఝణన ఝణన ఝణ నాదమే నాట్యం ,నాట్యమే జీవితం” అనే పాట హమీర్ కల్యాణి రూపాన్ని మన ముందు ఆవిష్కరిస్తుంది,నట్టువాంగం నెరపింది ఆ చిత్ర దర్శకుడు వేదాంతం రాఘవయ్య అనుకుంటున్నా ,అన్నట్టు ఈ పాటలో వినపడే నాదస్వరం ఎంత కర్ణపేయంగా వుందో చెప్పలేను ,ఈ మధ్య సినిమా పాటల్లో నాదస్వరం వినపడడమే కరువయి పోయింది.
ఇక ఇప్పుటి సంగీత దర్శకులలో ఇళయ రాజా ,ఎ.ఆర్ రహ్మాన్ లు కూడా హమీర్ కల్యాణిని ప్రతిభా వంతంగా ఉపయోగిస్తున్నారు,ముఖ్యంగా రహ్మాన్ కి హమీర్ కల్యాణి అంటే అభిమాన మట.”ఇందిర “సినిమాలో “లాలీ లాలీ యను రాగం సాగుతుంటే యెవరూ నిదుర పోరే” అనే పాటకి ఆధారం ఈ రాగమే ,ఇంకా” తెనాలి” అనే సినిమాలోని “ప్రాణమా “అనే పాటకి కూడాఇదే ఆధారం అయితే అన్య రాగ ఛాయలు కూడా వినపడతాయని గుర్తించాలి.
ఈ ఉదాహరణలతో హమీర్ కల్యాణి రాగ లక్షణాలు కొంత వరకూ బోధ పడటంతో బాటు ఈ రాగం మాధుర్యానికి రాణి లాంటిది అని గ్రహించే వుంటారని భావిస్తూ
*****