కథాకాహళి- 19
దళిత మహిళల ‘రాణిరికాన్ని’ డిమాండ్ చేసిన జూపాక సుభద్ర కథలు
– ప్రొ|| కె.శ్రీదేవి
జూపాక సుభద్ర వరంగల్ జిల్లా, రేగొండ మండలం, దామరంచపల్లె లో 18/6/1961న జన్మించారు. ఎం.ఏ. వరకు చదువుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సచివాలయం, హైదరాబాద్ లో అదనపు కార్యదర్శిగా పనిచేసి, పదవీ విరమణ చేశారు. ఈమె రచనలు ‘పంచాయితీరాజ్ లో దళిత మహిళల పాలన”, “అయ్యయ్యో దమ్మక్కా” కవితా సంకలనం –2009. “రాయక్క మాన్యం” కథాసంకలనం-2014. ఇంకా కథలు, కవితలు, సాహిత్య, సామాజిక, రాజకీయ వ్యాసాలు, పుస్తక సమీక్షలు, ఇంటర్వ్యూలు, నివేదికలు, పాటలు, దిన, వార, మాస, పత్రికల్లో అచ్చయినాయి. “భూమిక” స్త్రీవాద మాస పత్రికలో 2007 నుంచి ‘మాక్క ముక్కు పుల్ల గీన్నే పొయింది‘ శీర్షికన అణగారిన సామాజిక వర్గాల స్త్రీల సమస్యలపై కాలిక వ్యాసాలు రాస్తున్నారు.
“చంద్రశ్రీ యాదిలో”(2013). రచనల సంకలనానికి సంపాదకత్వం వహించారు. “నల్ల రేగడి సాల్లు” మాదిగ, ఉపకులాల స్త్రీల కథల సంపుటి – 2006, 2. “కైతునకల దండెం” మాదిగ కవిత్వ సంకలనం – 2008. 3. “కమ్యూనిజమా కోస్తా వాదమా?” – 2008, వ్యాస సంకలనాలకు సహ సంపాదకత్వం వహించారు. ఉద్యోగ క్రాంతి, దళిత్ వాయిస్ మాస పత్రికల్లో సంపాదకవర్గ సభ్యురాలిగా పనిచేశారు. తమిళ రచయిత్రి బామ నవల “సంగది” ని ఇంగ్లీషు నుంచి తెలుగులోకి “సంగతి” గా అనువదించారు. 2006లో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. పత్ర సమర్పణ : విశ్వ విద్యాలయాల యు.జి.సి. జాతీయ సెమినార్లలో సాహిత్య, సామాజిక అంశాలపై అనేక పరిశోధక పత్రాలు సమర్పించారు. ఈమె అందుకున్న పురస్కారాలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ సాహిత్య పురస్కారం – 2017. తెలుగు యూనివర్సిటీ సాహిత్య ప్రతిభా పురస్కారం – 2016, లాడ్లీ మీడియా స్పెషల్ అవార్డు – 2016. డాక్టర్ కవిత స్మారక పురస్కారం, కడప – 2015. తెలంగాణ మహిళా శక్తి పురస్కారం – 2015, అమృతలత – అపురూప అవార్డు – 2015, రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం – 2015. సామాన్య కిరణ్ ట్రస్ట్ వారి డాక్టర్ బోయ జంగయ్య చేతనా పురస్కారం –2014 9. సోమనాథ కళా పీఠం వారి సామాజిక శోధనా పురస్కారం – 2014,నందివాడ శ్యామల సహృదయ సాహితీ పురస్కారం – 2014, సమాజ్ భూషణ్ పురస్కారం (మహారాష్ట్ర) – 2013, దామోదరం సంజీవయ్య సాహితీ పురస్కారం-2013. నోముల కథా పురస్కారం – 2013. తెలుగు విశ్వ విద్యాలయం ఉత్తమ కవయిత్రి పురస్కారం – 2011, డా.సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు అవార్డు – 2009, వంశీ+ఆంధ్రప్రభ కవితల పోటీ ప్రథమ బహుమతి-2007. జి.వి.ఆర్. కల్చరల్ ఫౌండేషన్ కథ అవార్డు – 2007, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం పురస్కారం – 2007, రంజని కుందుర్తి వారి ఉత్తమ వక్త అవార్డ్, మైత్రేయ కళా సమితి, కథ అవార్డు, సంగారెడ్డి 2006., వి.ఆర్.సాహిత్య ట్రస్టు కథ అవార్డు., సచివాలయ చేతన కవితల పోటీ ప్రథమ బహుమతి మొత్తం ౨౨ అవార్డులు అందుకున్నారు.
సచివాలయ మహిళా సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు (1991) తెలంగాణ సచివాలయ మహిళా ఉద్యోగుల యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు “మట్టిపూలు” (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ) రచయిత్రుల వేదిక (2008) వ్యవస్థాపక నాయకురాలుగా వున్నారు. దేశవ్యాప్తంగా వివిధ సభలకు. ప్రతినిధిగా, పత్ర సమర్పకురాలిగా ఆహ్వానించబడ్డారు.
డెబ్భైమూడవ రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయితీరాజ్ వ్యవస్థలో షెడ్యూల్ పరంగా మహిళలకు కల్పించబడిన రిజర్వేషన్ లో భాగంగా దళిత మహిళలు సర్పంచులుగా ఎన్నికయ్యారు. దళిత అభ్యర్థిత్వంలో జరిగిన అవకతవకలను మించిన అవమానాలను, అవహేళనలను దళిత మహిళా సర్పంచులు ఎదుర్కొన్న సంధర్భాన్ని, వాటిని మాదిగ మహిళా సర్పంచులు అధిగమించిన క్రమాన్ని“రాణిర్కం”, ‘షా నిలబడాలి‘ కథలోనే కాదు “ఓ సర్పంచ్ వల(స) పోత”, కథల్లో జూపాక సుభద్ర కథనం చేశారు.
“సర్పంచా! యాడ దొర్కుతది మీకు సర్పంచి, మాకే దొర్కది …. గీ కూల్నాలి గాల్లకు, అమాంతం సరిపంచిని జేత్తే ఏం జేత్తరు! ‘సరిపంచి‘ అని అనరాని వాల్ల గూడ గౌరుమెంటు సర్పంచులనేంది, జడ్.పి.టి.సి.లను జేసె, ఎంపి టి సిలను జేసె. అంత జేసినా, గీల్లేం నిలబెట్టుకుంటండ్రు.. గదే మాదిగిర్కెమ్”
“మనూల్లె గా యెల్కటి పోసి కోడల్ను సర్పంచిని జేత్తిమి. సేత్తేమైంది రోజు కూలి నాలి కురుకుడే సరిపోతంది. నీతల్లి… గీల్లను సర్పంచులను జేత్తే సర్పంచి గిరిని యిజ్జద్దీస్తుండ్రు. గాల్లు రాజిర్కమేంజేత్తరు” ఒక మాదిగ స్త్రీ తమకు సర్పంచ్ గా రావడమేందన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేని ఆధిపత్య కులాలు, వాళ్ళతో తందానా తానా అనే వెనుకబడిన కులాల పురుషులు మొదలుకొని తోటి కులస్తులనుండి కూడా అదే ఎగతాళి మాటల్ని భరిస్తున్న దళితస్త్రీలు తాము సర్పంచులుగా ఎన్నికైనా, పరిపాలనా భాధ్యతల్ని నిర్వహించాల్సి వచ్చినా తప్పని ఇంటిచాకిరిని,” రాణిర్కం” వచ్చినా తప్పకపోయిన అవమాన భారాన్ని ఈక్రింది మాటల్లో వాళ్ళ కంఠస్వరాన్ని జూపాక చిత్రించిన తీరును ఈకథలో చిత్రించారు.
‘మరి బువ్వకెట్లెల్లాలె, ఇంట్ల పొయి మీదికి, పొయి కిందికి నేనే జూసుకోవాలె” అంటూ తన అవస్థను వెళ్ళబోసుకున్న సర్పంచ్, అయినా పంచాయితాఫీసులు, ఊల్లె రాజిర్కం తర్వాతనే ఏ కూలి నాలైనా! ఇంత జేసినా ఊల్లె మనుషులు హేళనజేస్తనే ఉంటరు. పని లేనప్పుడే ఆ కూలి, ఈ కూలి జేస్త. ఎట్ల బత్కాలె యెన్కముందటేమి లేనోల్లమైతిమి‘ అని చెప్పిన ఆమె ఆత్మ విశ్వాసానికి చైతన్యానికి ఆశ్చర్యపోయింది అమృత. మాదిగ మహిళా సర్పంచులుగా ఎన్నికైన వీళ్ళు చేయబోయేది “రాజిర్కం గాదు రాణిర్కమ్‘ అని భావించడంలో బోయి భీమన్న కలలుగన్న కూలిరాజ్యానికి, దళిత రాజ్యాధికారానికి అసలు సిసలైన నమూనాగా ఈకథను చిత్రించారు.
రాణిరికాన్ని నిలబెట్టుకునేది కాయాకష్టం చేసిన శ్రామిక మహిళలు, తమహక్కుల్ని, బాధ్యతల్ని గుర్తించినంతగా భర్తల చాటు భార్యలుగా పితృస్వామిక పాతివ్రత్యాల కుహనా విలువలకు బానిసలుగా మసిలే ఆధిపత్య కులాల స్తీల కంటే దళిత మహిళలు మెరుగైన సేవలందించగలరన్న భరోసా నందిస్తుంది ఈకథ.
ఎమ్.ఎల్. ఏ., ఎమ్. పి. ల కున్నట్లుగానే మాహిళా సర్పంచులకు కూడా జీతబత్యాలు కల్పించా లన్న డిమాండ్ అంతర్లీనంగా ఈకథాలక్ష్యంగా ప్రవహింపజేసారు జూపాక సుభద్ర.
‘షా నిలబడేలె’కథలో కుల న్యూనతాభావం దళితుల్నిఎంతగా వెనక్కు లాగుతుందో తెలిపేందుకు ఈ కథలోని సాంబలక్ష్మి పాత్రే నిదర్శనం. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఏదో ఉపదేశమిస్తున్నట్లే సూటిపోటీ మాటలతో ఆమెను హేళనకు గురి చేశారు. చదువులేని దళితస్త్రీని ప్రెసిడెంటును చేస్తారు. చేసిన తరువాత తన కట్టుబొట్టును, తన నడవడికను మార్చుకోమని చాలా విధాలుగా ఎవరికి వాళ్ళు హితవు చెప్నున్నట్లే చెప్తూ ఆమెను న్యూనతా భావానికి గురి చేస్తారు. వాళ్ళ మాటలతో బాధపడుతున్న సాంబను “యికనుంచి సింగులిరబోసి సదువుకున్నామె లెక్కవాలి ప్రెసిడెంటా మజాకా….”అని ప్రోత్సహిస్తాడు సాంబలక్ష్మి భర్త. అసలు చదువేరాని సాంబలక్ష్మీని ఆ ఊరందరూ కలిసి ప్రెసిండెంటును చేస్తారు. ఆ వూర్లో చదువుకున్న వాళ్ళున్నప్పటికీ సాంబలక్ష్మికి ఆ పదవి ఇవ్వడంలోని అంతర్యం చదువురాని స్త్రీ అయితే తాము చెప్పినట్టు చేస్తుందనే భరోసా వుంటుందన్నది వాళ్ళ ఉద్దేశ్యం. నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకోని ఆమెపై అజమాయిషీ చేస్తారు. పేరు మాత్రం దళితులది పెత్తనం మాత్రం వీళ్ళది. అందరి దృష్టిలో దళితులకు కూడా అధికారం ఇచ్చి సమానంగా చూసేవాళ్ళలాగ భైటికి కనిపిస్తారు. ఆదర్శవంతులన్న అభినందనలు కూడా ఆధిపత్యకులాల వాళ్ళకే దక్కుతాయి.
అయినా అధికారం ఇవ్వడానికి వాళ్ళెవ్వరు?. వాళ్ళకేమధికారముంది అని గుర్తించలేని, ప్రశ్నించలేని అమాయకులను పేరుకు అందలమెక్కించి తమ రాచకార్యాలు చక్కబెట్టుకోవడంలోని రాజకీయకుట్రను పంచాయతీరాజ్ వ్యవస్థ నేపథ్యంలో చిత్రించిన బలమైన కథ ఇది. శిక్షలు మాత్రం అమాయకులకు, స్వార్థపరుల రాజకీయ కుట్రకు బలైపోయిన ఇతివృత్తంతో దళితుల పేర జరుగుతున్న మోసపూరిత చర్యలను ఇంతకుముందే దళిత, దళితేతర రచయితలు రాశారు. మళ్ళీ జూపాక సుభద్ర వాటిని రెండు మూడు కథల్లో పునశ్చరణ చేయడంలోని ఉద్దేశ్యం దళితస్త్రీల రెక్కాడితే కానీ డొక్కాడని ఆర్థిక దుస్థితిని, వారి శ్రామిక సంస్కారం ఒక అజెండాగా మారాలన్న ఆశయం. ఈ ఆశయం ‘షా నిలబడాలి‘ కథలోనే కాదు “ఓ సర్పంచ్ వల(స) పోత”, “రాణిర్కం” కథల్లో కూడా చూడగలం.
“శుద్ధి చెయ్యాలె” కథలో దళితుల పట్ల ఆధిపత్య కులాల ఈసడింపులను కళ్ళకు కట్టినట్లు, ప్రదర్శించారు. ఉన్నత చదువులు చదువుకొని ఉన్నతోద్యోగాలు, చేస్తున్న దళితులను కులం పేరుతో అవమానించే అమానుష చర్యలను ఈకథలో గమనించవచ్చు.
కాలేజీ లెక్చరర్లుగా వచ్చిన ఇద్దరు దళిత మహిళలకు ఒక బ్రాహ్మణుల ఇంటిలో అద్దెకు దొరకడం, తర్వాత వారి కులం వివరాలు తెలుసుకొని వారిని అవమానించడం ఈ కథలోని వస్తువు. కాలేజీ చప్రాసీతో బ్రాహ్మణ కుటుంబ సభ్యులు మాట్లాడిన మాటల్లోని అలసత్వం, నిమ్నజాతులు తరతరాలుగా అనుభవించాల్సివచ్చిన అనివార్యతను సుభద్ర ఈకథలో ప్రస్థావించారు.
“వాళ్ళు కడ జాతోంట గదరా మొకాలు జూసిచ్చినం కులమడగకుండ. ముందు ఆ సామాను తీసికెళ్లమని చెప్పుపో. యిల్లు శుద్ధి చేయించాలన్నారు.” అని చెప్రాసీ నొచ్చుకుంటూ. జరిగిన విషయం చెప్పడంలో తమ తాతల తరాలలోవున్నట్లు మేము లేము కదా మమ్మల్నెందుకిలా ఇంకా కించపరుస్తునేవున్నారన్న మనోవేదనను వ్యక్తంచేస్తాడు. దళిత నాయకులు చేసిన పోరాటాల ఫలాలు తమకు దక్కడంలేదన్న వాస్తవికతను ఈకథ వ్యక్తంచేస్తుంది.
ఎన్నో ఉద్యమాలు చేసి చదువుకొని యీ స్థితికొచ్చిన తరువాత కూడ దళితుల నుదుటి మీద అంటరాని గీతలు చెరిగిపోవడం లేదు. వాళ్ళు చేసిన అవమానం తిరిగి చెవుల్లో సీసం నింపుతున్నట్లు, నాలిక చీరుతున్నట్లు, వేళ్ళు నరుకుతున్నట్లుగానే వుందని భావించడంలో అనౌచిత్య మేముందనిపి స్తుంది.
“ఎప్పుడో ఎన్నో పోరాటాలు చేసి మేం పగలకొట్టిన మెల్లో ముంత మళ్ళీ మూతికి కడుతున్నట్లుగా, జారి పోయిన తాటాకు -రుష మళ్ళీ మొలకు ముడేస్తున్నట్లే అన్పించింది” అన్న మాటల్లోని వేదన పాఠకుల మనసుల్ని ఛిద్రం చేస్తుంది.
‘రాయక్కమాన్యం‘ కథలో రాయక్క మాదిగ ఆశ్రిత కులమైన డక్కలి కులంలో జన్మించింది. తనను ప్రేమించినవాణ్ణి కులాంతర వివాహం చేసుకుని వెలికి గురవుతుంది. కానీ రాయక్క తండ్రి వాళ్ళను ఆదరించి, “నాకున్న నలభై వూళ్ళళ్ళ సగం పంచిత్తా, సల్లాగ బతుకుండ్రి అని యిస్సాగా” (హక్కుగా వచ్చె భాగం) పంచిస్తాడు. ఇద్దరి కులాలు వేరని కూతురు క్షేమం కోరి తమ కుటుంబ వారసత్వంగా వచ్చిన వూళ్ళను పంచిస్తాడు రాయక్క తండ్రి. కులం పేరుతో జరిగే ఆగడాలను ముందుగానే పసిగట్టగల అనుభవంలోనుంచి, తనకూతురు భర్త మీద ఆధారపడకుండా భర్తకే తిండి పెట్టగలిగే స్థితిని కూతురికి కల్పించాడు.
కులాంతర వివాహాలు చేసుకున్న కారణంగా వెలేసిన కుటుంబాలలోని భీబత్సం నేటికి చూస్తున్నాం. కానీ ఈ కథలో అల్లున్ని స్వాగతించి కూతురే తన భర్తను పోషించగలిగేంతటి స్థితిని కల్పించిన తండ్రి పాత్ర ఉదాత్తమైంది.
ఈ కథలో స్త్రీకి అధికారం ఇవ్వడం అది కూడా తమకన్నా తక్కువ కులానికి చెందిన స్త్రీ తమ పై కులానికి తీర్పు చెప్పడం గమనిస్తే, రచయితకున్న బలమైన దళిత అస్తిత్వ స్పృహను ఈఅంశం పట్టిస్తుంది.
‘ఆదర్శ విధ్వంసం‘ కథలో కులమత భేదాలులేవని ఆదర్శాల ముసుగులో ప్రేమించి పెళ్ళి చేసుకొని, చెప్పాపెట్టకుండా అర్ధాంతరంగా జ్యోతిని వదిలేసి పోయిన వాన్ని తోడేలుతో పోల్చి, కథ చెప్పుకొస్తుంది కథకురాలు. కులాంతర వివాహాలు చేసుకొని కులాలను రూపుమాపాలని కులాలన్ని కలిసిపోయి మాసిపోవాలన్నది కులాంతర వివాహల వల్ల మనం ఆశించే ప్రతిఫలనం. కానీ కులాంతర వివాహాలు అగ్రకులానికి చెందిన వాళ్ళు ఆదర్శవంతులమని చెప్పుకోవడానికే మాత్రమే కానీ ఆచరణకు సాధ్యంకాని ఆవేశాలుగానే మిగిలి పోయాయనడానికి, కులాంతర వివాహాల వల్ల నష్టపోయిన వాళ్ళు (కడజాతాడోళ్ళు)దళిత స్త్రీలే అనడానికి మరో ఉదాహరణ ఈ కథ.
ఈ కథలో జ్యోతిరాణి దళిత స్త్రీ. ఆధిపత్య కులానికి చెందినవాన్ని కులాంతర వివాహం చేసుకొని మోసపోతుంది. తనకు జరిగిన మోసాన్ని కులపెద్దల దృష్టికి తీసుకుపోతుంది. న్యాయం జరుగుతుందన్న ఆశతో, కానీ జ్యోతిరాణికి అక్కడ కూడా మరో ఎదురు దెబ్బ ఎదురైంది. “నువ్వు పెద్ద కులపోన్ని చేసుకొని పెద్ద కులందానివైనావు మమ్ములనడిగే చేసుకున్నావా” అని అన్నారంటే స్త్రీ ఎప్పుడూ మగవాడి అడ్రస్సుగానే వుండాలన్న విషయంలో కులపెద్దల దృష్టికోణాన్ని రచయిత్రి ఇక్కడ వ్యక్తంచేశారు. అలాగే మోసం చేసినవాన్ని “ఏమడగమంటావ్, మనకులపోడా, తలపోడా కుల పంచాదిల నిలెయ్యనీకి. అంత సమాసత్వం మనకింకా చేరలేదు” అనడంలో ఆధిపత్య కులం వాళ్ళని ఇప్పటికీ ప్రశ్నించలేని స్థితిని తెలియజేస్తున్నట్లుగానే వుంటుంది. అంటరాని ఆడోళ్లు కులాంతర వివాహాలవల్ల ప్రాణాలు వదిలేయడానికి, పోగొట్టుకోవడానికి ఆధిపత్యకులాల పితృస్వామ్య వ్యవస్థీకృత భావజాలమే కారణమని రచయిత ఈకథలో స్పష్టం చేశారు.
ఇప్పటికీ ఆధిపత్య కులం వాళ్ళను ఎదురించలేక, ప్రశ్నించలేకపోతున్నారు. కారణం తక్కువ కులం వాళ్ళమన్న నూన్యత మనస్తత్వంలోనే దళితులు కూరుకుపోవడం అత్యంత విషాధం. వాళ్ళను వాళ్ళే ప్రశ్నించుకోలేకపోవడానికి,వాళ్ళను చైతన్యపరచుకోలేని వాళ్ళకు కులసంఘాలు, అవసరమా? అన్నప్రశ్న తప్పనిసరిగా పాఠకులకు అందుతుంది.
అభ్యుదయ వాదులందరి సామాజిక లక్ష్యం సమానత్వం. ఇంత పెద్ద ఆశయాన్ని ఒంటరిగా సాధించలేం కాబట్టి గుంపును ఏర్పాటు చేసుకున్నాం. ఆ గుంపులో ఒకరికి అన్యాయం జరిగితే ఆ అన్యాయం ఆ గుంపులో వాళ్ళు చేస్తేనే ప్రశ్నిస్తాం. ఇతరులైతే ఆపని చెయ్యలేమన్నపుడు గుంపుగా వుండటం అవసరమా? అన్న ప్రశ్న రచయిత్రిది.ఈప్రశ్న చైతన్యరాహిత్యం నుంచి బయటపడలేని దళితుల నుద్దేశించి సంధిస్తుంది.
‘ఏమడగమంటావ్ మనకులపోడా కులపొందాదీలజయ్యానికి అంత సమానత్వం మనకింకా చేరలేదు‘ అనడంలోని అంతర్యాన్ని గమనిస్తే వాళ్ళ కులానికి చెందిన వాళ్ళను తప్ప మరొకర్ని నిలదియ్యలేనితనం ఇంకా దళితవర్గాన్ని పీడిస్తూనేవుంది. వాళ్ళనెదిరించేంత సమానత్వం(శక్తి) రాలేదని అనగలిగారంటే సమానత్వం అన్నది సాధించుకునేది కాదు, స్వతహాగా దానంతట అదే వచ్చేదన్న అమాయక అభిప్రాయంలోనే వున్నారన్న వాస్తవ స్థితిగతులను జూపాక సుభద్ర ఈకథలో రికార్డ్ చేశారు. ఏ ప్రయత్నం చేయకుండా ఎవరో సాధించి తమకోసం సమర్పించే ప్రసాదం లాంటిది సమానత్వం అన్న భావనలు దండోరా ఉద్యమం మొదలైన తరువాత కూడా అలాంటి వారిలో లోపించిన భావచైతన్యాన్ని చెప్పడం వలన మాదిగలను అర్థం చేసుకొనే క్రమంలో దళితేతరులలో పెరగాల్సిన అవగాహనను ఈకథ గుర్తుచేస్తుంది.
మనుష్యుల మనోభావాల్లో జరగాల్సిన సంస్కరణ, అది సామాజిక సంస్కరణలంత సులభమైనదేం కాదు. నిరంతరం దాని కోసం పాటుపడటం మానేసి ఒక మాటతో తప్పించుకు తిరుగుతున్న కులగుంపులలో అంతర్లీనంగా వున్న లోపాలను కూడా రచయిత ఈకథలో చూపించారు. కుల సంఘాలు ఏర్పడటంలోగల లక్ష్యం ఏంటన్న ప్రశ్నని అత్యంత సున్నితంగా ఈకథలో రచయిత్రి వేయగలిగారు. వీటన్నింటి పర్యవసానం కులాంతర వివాహం చేసుకున్న కారణంగా తనవాళ్ళు. తమ వాళ్ళందరికి దూరమై, నమ్మిన కులసంఘాల నిర్లక్ష్యానికి గురై, ఆరోగ్యం క్షీణించి ఇంకెవ్వరూ తనను, తన బాధను అర్థం చేసుకొనే వాళ్ళే లేరని, సమాజ నిర్లక్ష్య వైఖరికి విసిగిపోయి మరణం తనను కబలించేలోపే తానే మరణాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతోంది జ్యోతి.
కులాధిపత్యానికి, దళిత పురుషాధిపత్యం తోడుకాగా ఇరువైపుల నుండి దళితస్త్రీని సమస్యల్లోకి నెట్టేస్తున్న స్థితిని జూపాక సుభద్ర ఈకథలో వ్యక్తంచేశారు. కులాంతర వివాహాల లక్ష్యం కులరహిత సామాజిక పరిణామం. అయితే, ఆచరణలో ఆలక్ష్యం నెరవేరకపోగా, వీటివల్ల దళితస్త్రీల(మరీ ముఖ్యంగా మాదిగస్త్రీల) జీవితాలు అడుగంటిపోతున్న క్రమాన్ని రచయిత జ్యోతిలాంటి బాధిత మహిళల పక్షంలో నిలబడటమే కాకుండా కులపెద్దల్ని కఠినంగా నిలదీస్తుంది. రచయిత్రిలోని ఈ భావావేశాన్ని చూసినపుడు నాగప్పగారి సుందర్రాజు మద్దికెర మార్తమ్మ పై జరిగిన అత్యాచారాన్ని దళిత నాయకుల స్వార్థపర, అసమర్థతను నిలదీసిన వైనమే గుర్తుకొస్తుంది.
ప్రభుత్వం నడుపుతున్న సంక్షేమ హాస్టళ్ళలో చదువుకోవాలన్న కోరికతో దళిత విద్యార్థులు పడుతున్న అవమానాలకు, అవహేళనలను నాలుగు కథల్లో సుభద్ర చర్చకు పెట్టారు. “షెవ్వానెత్తురు” కథలో సాంఘిక సంక్షేమ వసతి గృహం సక్రమంగా విధులను నిర్వర్తించకపోగా పిల్లలపై నిందలు వేస్తూ అవమానాలకు గురిచేస్తూ వుంటుంది. హాస్టల్ బాత్రూమ్ లోపడిన రక్తాన్ని చూసి ఎట్లా వచ్చిందని ఆరాతీయలేకపోగా ఎవరో కడుపు తీయించుకున్నారని పిల్లలందరినీ ఆసుపత్రికి తీసుకెళ్ళి టెస్ట్ చేయించింది వార్డన్. ఎదురు తిరిగితే ఎక్కడ నింద భరించాల్సి వస్తుందోనని అందరూ మౌనంగా టెస్టెకు సిద్ధమయ్యారు. ఒక అమ్మాయి మాత్రం టెస్ట్ చేయించుకోనని, ఏం చేస్తారో చేసుకోండని ఖచ్చితంగా తెల్చి చెప్తుంది. చేయించుకోకపోతే, రేపు హాస్టల్లో ఎలా వుంటావో చూస్తానని బెదిరించి వెళ్ళిపోతుంది వార్డెన్. ఆ పని కుక్క చేసిందని, కుక్క వల్ల పిల్లలందరు ఇబ్బంది పడ్డారని వర్కర్ల ద్వారా వార్డెన్ కు తెలుస్తుంది. అది వేరే విషయం. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో ముఖ్యంగా ఎస్. సి. ఎస్. టి. హాస్టల్స్ లో జరుగుతున్న అకృత్యాలు అన్నీ ఇన్ని కావు. ఆఖాతాలో దళిత అమ్మాయిలు ఎదుర్కొంటున్న అవమానాలను నమోదు చేయడం మాత్రమే ఈకథాలక్ష్యం. ఎదురు తిరిగిన అమ్మాయి ఇక తనను హాస్టల్ నుండి పంపించరని తెలిసి, కుదుటపడిందని చెప్పటంలోనే దళిత బాలికల దీనత్వం కూడా కథాలక్ష్యంలో భాగమైంది.
సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పరిస్థితిని తెలిపిన ఈకథ, విధ్య రాజ్యాంగ హక్కుగా మారినా కూడా దళిత విద్యార్థులు తమ ప్రాధమికహక్కును కాపాడుకోలేకపోతున్నారు. అధికారుల వికృత చేష్టలకు, దళిత పిల్లలు బలైపోతున్నారు… ప్రశ్నించిన వారికి ఎదురయ్యే బెదిరింపుల కారణంగా విద్యార్థినులు మానసిక క్షోభకు గురవుతున్నారు.ఈవేదింపులను భరించలేని వాళ్ళు చదువుకు దూరంగా నెట్టివేయబడు తున్నా రు.
ఈ కథలో దళిత బాలిక ఇంటర్మిడియట్ చదివే అమ్మాయి. అబార్షన్ టెస్ట్ చేయించుకోనని ఖచ్చితంగా చెప్తుంది. అలా చెప్పడానికి ముందుగా తనకంటే పెద్దవాళ్ళందర్నీ “మీరు పెద్దోళ్లు, సీనియర్స్ కదక్కా ప్లీజ్.. మేడమ్ తో మాట్లాడి ఈ దావఖానా టెస్ట్లు ఆపుచేయండక్కా” అని తనకంటే పెద్దవాళ్ళందరిలో చైతన్యం కల్పించేలా మాట్లాడుతుంది. ఎదురు తిరిగితే ఎక్కడ నింద భరించాల్సి వస్తుందోనని ఎవ్వరూ నోరు మెదపకుండా టెస్ట్ కు రెడీ అవుతారు. పరిస్థితులు ఆఅమ్మాయికి అనుకూలించక పోవడంతో, ఆఅమ్మాయి వెనకడుగు వేయలేదు. ఒకతే ఒక సైన్యంగా నిలబడుతుంది. టెస్ట్ చేయించుకోనని తేల్చి చెప్పినందుకు హాస్టల్ వార్డెన్ నీ సంగతి రేపు చెప్తా నువ్వేట్లా హాస్టల్లుంటావో చూస్తా” అన్న బెదిరింపులను భరించాల్సి వస్తుంది.
ఎదిరించి మాట్లాడిన, అమ్మాయితో వార్డెన్ వెటకారంగా “ఓ తమరా! చూడ్డానికి నంగనాసితీరే వుండి చేసేవి. యింత కార్యాలన్న మాట” అని తన ఆధికారిక అహంకారాన్నంతా వెళ్లగక్కింది. ఆమెను మానసిక క్షోభకు గురిచేసైనాసరే తన మాటను నెగ్గించుకోవడానికి ప్రయత్నించే వార్దన్ ల దురహంకార ప్రవర్తనకు ఆపాత్ర ప్రతినిధిగా తెలుస్తుంది. చదువుకొనే ప్రదేశంలో కూడా దళిత అమ్మాయిలు అవమానాల పాలవుతున్నారు. మానసిక వేదనకు గురవుతున్నారన్న విషయాన్ని రచయిత అనుభవపూర్వకంగా తెలిపారనిపిస్తుంది.
సుభద్ర రాసిన ‘రోట్లోబడ్డ తల్కాయలు‘ కథలో బక్కన్న, సారక్క బతకడం కోసం చేసిన అప్పు తీర్చకపోవడంతో తమ కూతురు కమలను రెండు సంవత్సరాలు మల్ రెడ్డి కూతురి ఇంటికి పనికి పంపాల్సివస్తుంది. లేకపోతే అప్పు జమ చేయమన్న మల్రెడ్డికి ఎదురు చెప్పలేకపోతారు.
మరోచోట ఎక్కడా అప్పు దొరక్కపోవడంతో ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో చేసిన అప్పు నుండి బైటపడటానికి కమలను చదువు మాన్పించి రెండేళ్ళు పనికి కుదుర్చుకోవడం ద్వారానే సమస్య నుండి బైటపడొచ్చని ఆలోచించి కమలను పనికి పంపిస్తారు. కమల చదువుకోవడానికి పోతుందని తెలిసి తన పనులు జరుగవనే దుర్బుద్దితో బాగా చదువుకొనే కమలను చదువు మాన్పించింది తన కూతురి ఇంటికి పనికి పోవాలనే వుద్దేశ్యంతోనే, అట్టడుగు కులాల అభివృద్ధిపైన దెబ్బకొట్టడమే కాక పైగా “మీ జాతికి గింత నీతి లేదుర, అందుకే అన్నరు బుద్ధితీరు బువ్వ, యిటు బాకీ గట్టపు అక్కెర యెల్లదియ్యవు” అని చివరికి మానసిక క్షోభకు కూడా గురిచేసి తమ అవసరాలను తీర్చుకొనే వైనం, ఆధిపత్య కులాల మనస్తత్వాన్ని అర్ధం చేయస్తుందీ కథ. చేసిన అప్పును తీర్చలేని, బలహీనతలకు లొంగిపోయి తమకి తాము సర్దిచెప్పుకునే వాస్తవికతను సారక్క పాత్రచిత్రణలో చూడొచ్చు.
ఇచ్చిన అప్పుకు వడ్డీ, చక్రవడ్డీలు వేసి మరింత లోతుల్లోకి కూరుకుపోయేలా చేస్తారే కానీ బైటికి రానివ్వరన్న విషయాన్ని దళితస్రీ దృక్కోణం నుండి తెలియజేసిన కథ “రొట్లెబడ్డ తల్కాయలు” ఈ శీర్షికను రచయిత ఎంచుకోవడంలోనే రచయిత దళిత స్త్రీల స్థితిని తెలియజేసింది. ఆధిపత్యం, అణచివేత కులవివక్ష మెదలైన సామాజిక రుగ్మతలకు బలైపోవలసిందే, కానీ ప్రశ్నించేలోపే మరింత లోతుల్లోకి కూరుకపోతారన్న సామాజిక వివక్ష రోకలిపోటు లాంటిదని రచయిత స్పష్టంగా తెలియజేశారు. వీటితోపాటు “రాజీపడ్డరాత”, “బల్లెనే దొస్తు వూలెగాదు”, “షవ్వానెత్తురు” మొదలైన కథల్లో దళితపిల్లల సమస్యలను చిత్రించారు రచయిత్రి.
‘మామాట గిట్లనే‘ కథలో భాష కారణంగా అవమానాలకు గురికావడం అన్నది ప్రధాన ఇతివృత్తం. మనిషి మనస్తత్వాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి, తెగనుబట్టి భాష, మారుతూ వుంటుంది. ఎవరికి వాళ్ళకు వాళ్ళు మాట్లాడేదే వ్యవహారిక భాష., ప్రామాణిక భాష. ఈ కథలో అటెండర్ తనదైన మాండలికంలో పైఉద్యోగితో ఏకవచనంతో మాట్లాడిన కారణంగా మెమో ఇస్తాడు. దాన్ని ఆచిరుద్యోగి ప్రశ్నించిన తీరులో తెలంగాణా ప్రాంతీయ వుద్యమ మూలాలు దాగున్నాయి.
“ఎందుకిస్తారు, మా ప్రాంతానికి వచ్చినాక మా భాష మీరు నేర్చుకోవాలిగాని మీ భాష మేము నేర్చుకోవడమేంది” అని ప్రశ్నిస్తాడు. అటెండర్ మాటలో “మనదిక్కు వచ్చినోళ్లు మన బర్తి, మన మాట నేర్చుకోవాలే అట్లాగాకుండ వేరే ఏరియాల్నుంచి వచ్చినోల్లమాట, మర్యాద మనమెందుకు నేర్చుకోవాల్నే అని తన సంగపోళ్ళను తీసుకుని తనకు జరిగినది అన్యాయమని మాట్లాడుండ్రంటాడు” ప్రాంతీయ మాండలికాన్ని మాట్లాడలేని కారణంగా అవమానానికి గురైన బాధితుడి బాధను తన భాష తెలుగే అయిన, తెలుగులో ప్రామాణికభాషగా చెలామణి అవలేకపోతున్న సంధర్భాన్ని ఈ కథలో ప్రశ్నార్థకం చేస్తుంది రచయిత్రి.
వర్తమాన దళిత స్త్రీవాదాన్ని కథా సాహిత్యంలో చాల బలంగా వినిపిస్తున్న జూపాక సుభద్ర మాదిగ స్త్రీల హక్కుల సాధనలో తన రచనలను ఒక శక్తివంతమైన ఆయుధంగా మలుచుకొన్న సైనికురాలిగా అభివర్ణింపబడుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.
*****
కె.శ్రీదేవి ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పంలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. స్వస్థలం కడప. 12 పుస్తకాలు రాశారు. మూడు పుస్తకాలు ఎడిట్ చేశారు. ఆరు అవార్డులు అందుకున్నారు. 112 ఆర్టికల్స్ రాశారు.