బతుకు చిత్రం-6

– రావుల కిరణ్మయి

జాజులమ్మ చాలా భయంగా ఏ విషయమూ …మా అయ్యనే అడుగుండ్రి.మా అయ్య ఎట్లంటే అట్లనే.అన్నది.

ఇంకేం?సర్పంచ్ గారూ…ఇక వాళ్ళూ వాళ్ళూ చూసుకుంటారు.ఇక మన పని అయిపోయినట్టే అన్నాడు.

మునేశ్వరయ్య కల్పించుకొని,

వరయ్య గారూ ..!అయిపోవడం కాదండీ.మొదలయింది.

              వివాహోర్దశ్చ మరణ మన్నం జనన మేవచ 

              కన్ట్టే బద్వా దృఢం సూత్రం యత్రస్థం తత్ర నీయతే 

వివాహమూ ,ధనమూ,మరణమూ,అన్నమూ,జననం ఇవి ఎవరికి  ఎక్కడ ప్రాప్తి ఉంటే అక్కడికి వారు కంఠానికి త్రాడు వేసి లాగినట్టుగా వెడతాడు.అని శాస్రోక్తి.ఆ విధంగానే ఈ ఇద్దరూ ఇక్కడికి రప్పించబడ్డారేమో!మన ఊరికి ఎంతో ప్రాచుర్యాన్ని తెస్తున్న ఈ కళ్యాణ గద్దె మహిమ కూడా మరోసారి ఋజువు కాబోతున్నది.జాజులమ్మ తండ్రి ఒప్పుకుంటే మనమే తలా ఒక చెయ్యి వేసి పేదింటి ఆడబిడ్డ అయిన ఈ అమ్మాయి పెళ్లి జరిపిస్తే మంచిదని నా ఆలోచన.అన్నాడు.

గుంపు లో నుండి పోలయ్య బయిటికి వచ్చి,

మీరంతా పెద్ద మనసు చేసుకొని ఈ పొల్ల  లగ్గం జేత్తనంటే మా పీరిగాడు ఎగిరి గంతేస్తడు.అస్సలు కాదనడు.రొట్టె ఇరిగి నెయ్యిల వడ్డట్టయితది వాని పని.వీళ్ళను తోల్కపోయి నేను అర్సుకుంట.మా గుడిసెలల్ల పొల్ల అంటే మా అందరిండ్లళ్ళ పెళ్ళి లెక్క.అన్నాడు.

ఇంకేం?ఈర్లచ్చమ్మా…!నీ మంచితనానికి మా ఊరి తరుపున మెచ్చుకుంటూ,పూజారయ్య సెప్పినట్టు  పెళ్ళి మాత్రం ఈ గద్దె మీద ఈన్నే జరిపిద్దాం.ఏమంటారు?అన్నాడు.

కళ్యాణ మచ్చినా కక్కచ్చినా ఆగదంటారు.మా ఓనికి లగ్గబలం ఇప్పుడే వచ్చిన్దనుకుంట.మీ అందరి దీవెనలు సుత పెట్టుండ్రి.అని దండం బెట్టింది.

అలా అందరూ..మన ఊర్ల పెళ్ళికి కళ్యాణ గద్దె మన ఊర్లె ఉండడం మనం జేస్కున్న పుణ్యమేనని సంబరపడ్డారు.

మీరు సరే అనుకుంటే ముహూర్థం అవీఇవీ చూసి దగ్గరుండి నేనే పెళ్లి జరిపిస్తానని చెప్పడం తో ఎక్కడి వారక్కడకు బయల్దేరారు.

పోలయ్య ఎంబడి వడి ముగ్గురూ జాజులమ్మ గుడిసె కు చేరారు.  

****

ఎగిలివారంగ పొయిన పొల్ల ఇంత పొద్దెక్కినా రాకపాయే.  భగవంతుడా !ముగ్గురు మగ పోరాగాన్డ్లను ఇచ్చి ఒక్క ఆడపిల్లనిత్తే పెండ్లిజెయ్యక దాని రెక్కల కట్టము తినుకుంట నేను బతుకవడితి.గిసోంటి బతుకు పగోనికి సుత రానియకయ్యా.అని తనలో తనే గొణుక్కొంటూ మంచంల పడుకొని ఏడుస్తున్న పీరయ్యను చేరింది జాజులమ్మ.వెనకాలే రాయలచ్చిమి,పోలయ్య.సైదులు,రాజయ్యను బైటనే చెక్కబల్ల పై కూర్చోబెట్టి వీళ్ళు మాత్రమే లోపలికచ్చారు.

రాయలచ్చిమికి గుండె తరుక్కుపోయింది.ఆ పరిస్థితిని చూసి.జాజులమ్మ తండ్రి దగ్గరకు వెళ్ళి,

బాపూ..!గావరైతానాదే?ఉండు.ఇప్పుడే బువ్వ పెడుత అని గిన్నెలు చూసింది.రాత్రి తాను తినకుండా ఉండడం వలన మిగిలిన అన్నం లోకి ఉట్టి మీదున్న పెరుగు బుడ్డిలోనుండి కొంత పెరుగు పోసి జావ  జావ లాగ బాగా పిసికి నిమ్మళంగా లేపి కూర్చోబెట్టి చేతికిచ్చింది.

ఇదంతా నిలబడి చూస్తున్న రాయలచ్చిమిని కూర్చోమనటానికి ఏమీ లేక పెద్దది ఖాళీ గిన్నె బోర్లిచ్చి కూర్చోమన్నది.

వద్దులేమ్మా!అని అక్కడున్న చిరుగులు పట్టిన చాప పరుచుకొని కూర్చుంది.

పోలయ్య పొయ్యి రాజేసి తను తెచ్చిన పాల పాకెట్ గిన్నెలో పోసి వేడి చేయ సాగాడు.

పీరయ్య గట గటా    జజులమ్మ ఇచ్చిన జావాను తాగి నిమ్మలపడి,కింద చాపల కూర్చున్న రాయలచ్చిమిని చూసి,

బిడ్డా !వీళ్ళు ఎవలు? అన్నాడు లేవడానికి ప్రయత్నిస్తూ.

వాళ్ళు,మనోల్లేనే.నేనే ఏమ్బడి వెట్టుకచ్చిన.నిమ్మతంగా అన్ని జెప్త.నువ్వు కూసో.అని కూర్చోబెట్టాడు.

పోలిగా !ఎట్లట్లచ్చినవ్ రా?ఎన్నొద్దులాయే కనపడక ?అన్నాడు.

అవునే,నా  పనులు నాకుంటున్నయాయే.ఇప్పుడు సుతం ఓ..ముఖ్యమైన పని వెట్టుకొనే వచ్చిన.అని జాజులమ్మ ఇచ్చిన ఛాయ్ లు దీస్కొని రాయలచ్చిమికి ఇచ్చి రాజయ్య,సైదులు కు ఇచ్చి వచ్చాడు.

బిడ్డా..!జాజులూ..!బైటంత బురద బురద ఉన్నది.వాళ్ళను గూడ లోపలికే రమ్మంట.అని ఆ బల్ల తెచ్చి లోపలేసి సైదులును,రాజయ్యను కూడా లోపలి పిలిచి కూర్చోబెట్టాడు.పీరయ్య పరేషాన్ గా చూస్తుండగా,

పీరిగా..!ఈళ్ళంతా మనోళ్ళే.నాకు బాగా తెలిసినోల్లే.ఈ పోలగాని పేరు సైదులు.ఈళ్ళిద్దరు అవ్వయ్యలు.ఈళ్ళకు మన జాజులును ఇచ్చి లగ్గం చేత్తే మంచిగుంటదని సోచాయించి తీస్కచ్చిన.అన్నాడు అందరినీ పరిచయం చేస్తూ.

   సైదులు చేతులెత్తి దండం పెట్టాడు.

పీరయ్య రాజయ్య కు గిన అందరికీ దండం పెట్టి,

అయ్యా..!మీరు నా పొళ్ళను చూడటానికి  పెద్ద మనసు చేసుకొని నా గుడిసె కచ్చిండ్రు. ఆ తల్లిని జూత్తే దేవతోల్గనే ఉన్నది.నా పొల్ల నచ్చితే దానద్రుష్టమని మురిసి పోత.నన్ను జూత్తుంటిరిగదా !రెండో ద్దులనుండి పాణం బాలేకుంటున్నది.ఇట్లున్నప్పుడల్లా ఒకటే గుబులు.నా పొల్ల ఆగమయితదా ?ఏమ్దని?ఇయ్యాల్టికి దేవుడు దయ చూసి మిమ్ముల తోలిచ్చిండు.నా పొల్ల కు బుక్కెడు బువ్వ వెట్టి సాదుకునేటోల్లయితే సాలు.అన్నాడు,ఆనందం,ఆవేదన అన్నీ కలగలిపి.

పోలయ్య అందుకొని,

నువ్వేం ఫికరు వడకు.నీ బిడ్డకు బట్టకు,పొట్టకు ఏం లోటుండది.పోలగాడు నచ్చిండా?నీ బిడ్డను ఇచ్చుడు ఇట్టమేనా?గివ్వయితే చెప్పు.అన్నాడు.

నాబిడ్డ ఇట్టమే నా ఇట్టం అన్నాడు పీరయ్య.

బిడ్డా!జాజులు !ఏమంటవ్ బిడ్డా ..!అన్నాడు పీరయ్య బిడ్డనుద్దేశించి.

నీ బిడ్డ మా అయ్యా ఎట్లంటే గట్లనే అని అంటేనే ఈల్లను ఈడి దాక తీస్కచ్చిన.వాళ్ళు సుత సరేనంటాండ్రు.నువ్వే సోచాయించి చెప్పు.అన్నాడు పోలయ్య.

పీరయ్య ముఖం సంతోషం తో వెలిగి పోయింది.ఆనందంతో కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా 

నా బిడ్డను కోరి నా గుడిసె ఎతుక్కుంట నా కాడికచ్చిన ఈల్లను నేనెట్లా కాలదన్నుకుంట.ఎసొంటో ళ్ళయినా మంచిదే గని నేనుండగా ఒకయ్య చేతిల వెట్టి బరువు దించుకోవాల్ననుకున్టాన.నాకు ఇంత కంటే మంచి సంబంధం యేడ దొరుకుతది?ఎవలు దెత్తరు?పేరుకు ముగ్గురు కొడుకులున్నట్టే గని ఎన్నడు చెల్లె పెళ్లి చెయ్యాలని అనుకోలే.నీ కడుపు సల్లగుండ.నా బిడ్డకు లగ్గం జెయ్య ముందట పడుతున్న నీ మంచితనానికి దండాలురా పోలిగా!అని, 

రాయలచ్చిమి తోని,

తల్లీ..!నా బిడ్డను నీ బిడ్డ లెక్క బుక్కేదంతా బువ్వ వెట్టి సూసుకుంటే సాలు తల్లీ ..!అని 

సైదులు తోని,

కొడుకా ..!నీ భార్యనే ఇలువిచ్చి సమాజం ల దానికి ఇంకింత గోరవం ఇత్తున్న నీకు నేనేమియ్యగలను?అని 

రాజయ్య తోని,

అయ్యా ..!ఇంత మంచి కొడుకును గన్న నీ జన్మ ధన్యమయిందయ్యా.నువ్వు ఎట్ల చెప్తే అట్లా ఇనే కొడుకుంటే వెయ్యేనుగుల బలమున్తదని నిన్ను జూత్తెనే తెలుస్తాందని ఇట్లా అప్పగింతలు పెడుతుంటే  రాయలచ్చిమి ,

అన్నా..!నువ్వనుకునేంత గోప్పోళ్ళమేం గాదు.కాకుంటే ఇంత ఇల్లున్నది.ఇంత జాగున్నది.ఇగ నా కొడుకు మంచి పనోడు.అంతకు మించి మంచి తాగుబోతు కూడా.అయినా తిట్టుడు ,కొట్టుడు వదురుడు గిట్ల ఏమీ లేకుండా సక్కగ పంటడు. గీ తాగుడు వల్లనే ఇవ్వార్దాక పిల్లనెవ్వలియ్యలే .ఉన్నదున్నట్టు చెప్పిన.ఇంకోటి మా ఓడు మాత్రం మీ పొళ్ళను చూడంగనే చేస్కుంటనని వాడే అంటే దారెతుక్కుంట వచ్చినం.అటెంక తెలిసి నువ్వు నీ బిడ్డను అగ్గిల వారేసుకున్న అని బాధ పడద్దు.కానీ,నేను అత్తలా కాకుంట అమ్మలా కాపాడుకుంటానని,ఏ లోటూ రానియ్యక సూస్కుంటా నని ప్రమాణమయితే చేత్త.అన్ని ఆలోచించుకొని తిరిపారిగనే చెప్పుండ్రి.యాది మర్సిన.మేం మీ కులపోళ్ళం సుత గాదు.ఇగివాన్ని మతిల వెట్టుకొని ఏదయింది చెప్పుండ్రి.అన్నది.

రాజయ్యుండి,లగ్గానికి పోలగానికి వరదచ్చిణ ఎంతిత్తవో గూడ అనుకోని చెప్పు అంటే,

దచ్చిణ అని తండ్లాడకుండా,నీ తుర్తికి నువ్వు ఏమియ్యదలుచుకున్నవో ఇయ్యి.అంతే.అయినా,ఇప్పుడు ఇచ్చుడు పుచ్చుకునుడు కాదు ముక్కెం.మా వోడు నచ్చిండా?లేదా అన్నదే మొదాలు.అని చెప్పి గుడిసె నుండి బయటికి వచ్చి ఇక వెళ్తున్నామన్నట్టుగా కొద్ది దూరం నడిచారు ముగ్గురూ.

దారి లో జానయ్య ఎదురయి,

అమ్మా..!మీది ఇంత మంచి మనసని ఎరుగక నోటికచ్చినట్టు మాట్లాడిన.మనసుల వెట్టుకోక నా బిడ్డను జేసుకొండ్రి.ఇట్లిట్ల సంగతని తెలిసి నా బిడ్డ ఎంత పని జేసినవ్ నాయ్నా?అని ఒకటే ఏ డుత్తాంది.ఫోన్ జేసి మాట్లాడుదామని అనుకున్న కని ,వెదకబోయిన తీగ కాలికే తగిలినట్టు మీరే ఎదురయిండ్రు.తల్లీ అని చేతులు జోడించాడు.

రాజయ్య గొంతు పెంచి,

అంత మీ ఇట్టమేనానయ్య?మీరెట్లంటే మేమట్లనాల్నా?అంటుండే సరికి రాయలచ్చిమి అడ్డుపడి,

ఈ బజాట్ల ఏంది ముచ్చట?అని ఆపింది.

ఇంటికి వోయి మత్లావు జేత్తమని అక్కడ్నుండి కదిలి ఊరు చేరుకున్నారు.

        ****   

సైదులు..!నీకు లగ్గ  బలం గట్టిగచ్చినట్టున్నదిరా.లేకుంటే ముందుగాల ఇయ్యనని పేర్నాలు పెట్టి తీకనాలు తీసినోడు ఇప్పుడు ఆయనే అడుగుడు ,ఒకటనుకుంటే రెండు సంబంధాలు దొరుకుడు అంతా చిత్రమేరా.అందుకే కక్కచ్చినా కళ్యాణమచ్చినా ఆగదంటారు. ఇప్పుడు నిజంగా నచ్చినోల్లెవలో చెప్పు.అడిగింది రాయలచ్చిమి.

రాజయ్య కల్పించుకొని,

రెండెక్కడియి?జాజులమ్మ సంబంధం గూడ ఓ సంబంధమేనా?పందుల కొట్టమన్నా కొంచెం పెద్ధగుంటది ఆ గుడిసె కంటే.ఎటు చూసినా,బురద,బురద .మురిక్కుంతల గూసున్నట్టు ముక్కు మూతి మూసుకొని కూసుండి వత్తిమి.కయ్యానికయినా వియ్యానికయినా సమఉజ్జీ ఉండాలంటారు.పైకెళ్ళి కులం గానోళ్ళను చేసుకొని కులం ల నాదానవుదామా?వాన్నడిగేదేంది?ఆ జానయ్యకు ఫోన్ జేసి మంచిరోజు చూసుకోమ్మంటా.అన్నాడు స్థిరంగా.

బాపూ..!అంతా నీ ఇట్టమేనా?అమ్మన్నట్టు నాకు బాగ ఇట్టమయినోల్లను జేస్కుంట.కులం కానిదయినా జాజులమ్మే నాకు బాగ నచ్చింది.ఆమె నా పరిస్థితిని చూసి అమ్మ లెక్కనే ఆరాటవడ్డది.అందరి లెక్కన రోడ్డు మీద వదిలెయ్యలే.ఆమెకు ఆస్తి లేక పోవచ్చు గాక!మనసు మంచిది అన్నాడు ధైర్యంగా.

మనసేమ్జేసుకుంటవ్?కుడు బెడ్తదా?గుడ్డకత్తదా ?ఇసోంటి సొల్లు ముచ్చట్లు జెప్పకుండ్రి.జానయ్య అయితే కులపోడు,అంతో ఇంతో ఇచ్చెటట్టున్నాడు.గౌరవంగా ఉంటది.అనుకచ్చాడు.

పైసలెందుకయ్యా ?గుణం మంచిగలేంది?ఏమిట్లకేంగాలే వాడు ఆరోజు నన్ను అన్ని మాటలు వెట్టిండు.వానికి నచ్చిందంటున్న జాజులమ్మకే ముడి వెడితే ఒక్క చిత్తం అన్నది.

ఆడపెత్తనం పంబల దొరతనమని నీ పెత్తనం బాగయితాన్దేందే?ఏడ మాట్లాడనిత్తలేవు?అని అరుస్తుండగా,

సైదులు కల్పించుకొని ,

నాయ్నా!అవ్వనేమనకు.నీకు నచ్చకుంటే వదిలేయ్.కానీ నేనా జానయ్య బిడ్డను మాత్రం జేసుకోను.నా తల్లిని అవమానించినోళ్ళు అటెంక పావురంగా జూత్తరని ఏమున్నది? నేను ఎవర్నీ చేసుకోకుండా ఇట్లనే ఉంటాగని,మీరు గూడ సంబంధాలు జూసుడు మానేయుండ్రి అన్నాడు.

*****

ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.