మదర్ తెరీసా అసాధారణ వ్యక్తిత్వం
-ఎన్.ఇన్నయ్య
భారతదేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించి, నాయకులను నిర్బంధించిన సంవత్సరంలో, 1975 మదర్ తెరీసా హైదరాబాద్ పర్యటించారు. పబ్లిక్ గార్డెన్స్లో పిల్లల కార్యక్రమానికి వచ్చిన ఆమెను, ఆంధ్రజ్యోతి ఛీఫ్ రిపోర్టర్ గా కలసి ఇంటర్వ్యూ చేశాను. ఏది అడిగినా అంతా దైవేచ్ఛ అని సమాధానం యిచ్చిన ఆమె నుండి, ఎలాంటి ఉపయోగకర విషయం సేకరించలేక, నిరుత్సాహపడ్డాను. కనీసం ఫోటో తీసుకోలేదని తరువాత అనుకున్నాను.
మెసిడోనియా దేశానికి చెందిన తెరీసా, అల్బేనియా దంపతుల కుమార్తె. ఇంగ్లీషు మాట్లాడని ప్రాంతం అది. అయితే ఆమెను కేథలిక్ దేశమైన ఐర్లండ్ కు పంపగా, అక్కడే ఇంగ్లీషుకు అలవాటు పడి, రోమన్ కేథలిక్ అమ్మగారుగా జీవితం ఆరంభించింది.
ఐర్లండ్ నుండి ఆమెను ఇండియాలోని కలకత్తా పంపారు. అక్కడే ఆమె నిలదొక్కుకున్నది. ముందుగా డార్జిలింగ్ వెళ్ళగా అక్కడ మదర్ తెరీసా అని తన పేరు మార్చుకున్నది. ఆ పేరే ఆమెకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిపెట్టింది. తరువాత కలకత్తాలో కుదురుకొని, పాట్నా వెళ్ళి కొద్దిగా వైద్యం నేర్చుకున్నది.
అప్పటి నుండీ అనాథలకు, పిల్లలకు శరణాలయాలు మొదలు పెట్టింది. ఆమెకు కేథలిక్ సంస్థ అండ వుండడంతో రోగులు, పిల్లలు, విపరీతంగా చేరడం మొదలు పెట్టారు. వెను వెంటనే కుష్ఠు రోగులకు, వికలాంగులకు, ఆశ్రమాలు పెట్టింది. అవి కలకత్తా దాటి వివిధ నగరాలలో, అనేక దేశాలలో వెలిశాయి. నిర్మల కాన్వెంట్స్ పేరిట అవి దేశదేశాలలో మొదలయ్యాయి. డబ్బుకు కొదవ లేదు. పోప్ మద్దత్తు వుంది. ఇండియాలో మదర్ తెరీసాకు అన్ని గౌరవాలు లభించాయి. భారతరత్నగా గుర్తించారు. ఇందిరాగాంధీ పూర్తి సహకారం వున్నది. ఇండియా నలుమూలలా మదర్ తెరీసా వసతి గృహాలు వెలిశాయి.
వరుసగా ప్రపంచ దేశాలు తెరీసాను పిలిచాయి. కమ్యూనిస్టు దేశాలైన చైనా, రష్యాలు సైతం వెళ్ళినా వారేమీ ఆమెకు స్థలం ఏర్పాటు చెయ్యలేదు. ఇస్లాం దేశాలు ఆమెను దూరం పెట్టాయి. అమెరికాలో పర్యటించింది. అక్కడ సంపన్నులు ఆమెకు బాగా డబ్బులిచ్చారు. అందులో అందరూ నీతిపరులు కాదు. అలాంటి వారు ఉదారంగా ఆమెకు నిధులు సమకూర్చినప్పుడు, మదర్ తెరీసా తీవ్రవిమర్శలకు గురికావలసి వచ్చింది.
అన్నిటికీ మించి, మదర్ తెరీసాకు పోప్ అండవుండేది. కేథలిక్ వ్యవస్థలో పోప్ చాలా శక్తివంతమైన శాఖకు అధిపతి.
పోప్ కు ప్రత్యేక వాటికన్ దేశం వున్నది. ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వంతో వారు చాలా శక్తివంతంగా పరిణమించారు. అలాంటి పోప్ కు, తాను వసూలు చేసిన నిధుల నుండి డబ్బు ఉదారంగా దానం చేసింది. అంతటితో పోప్ ఆమెకు బాగా అండగా నిలిచారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు, సంస్థలు ప్రజలు యిచ్చిన డబ్బు, పోప్ కు కట్టబెట్టడం పట్ల విమర్శలు వచ్చాయి. ఆమె పట్టించుకోలేదు. ఇటలీలో వాటికన్ లో విపరీతంగా నిధులు పెట్టిన మదర్ తెరీసాపై కొంత ఈసడింపు వచ్చింది.
మరోవైపు మదర్ తెరీసా గృహాలలో రోగులను శ్రద్ధగా చూడలేదనే విమర్శలు వచ్చాయి. లాన్ సెట్ మాగజైన్ ఎడిటర్ రాబిన్ ఫాక్స్ వచ్చినప్పుడు చన్నీళ్ళతో సిరంజీలు కడగడం వంటివి చూసి, విమర్శించాడు.
క్రిస్టోఫర్ హిచిన్స్ చూసి, దోషాలను ఎత్తి చూపాడు. కానీ ఆమె ఖాతరు చేయలేదు.
నిధులు మాత్రం కుప్పలుతెప్పలుగా వచ్చిపడ్డాయి. అదంతా రోగులకు ఖర్చు చేయలేదనే విమర్శను ఆమె పక్కన బెట్టింది.
మదర్ తెరీసా ఒకసారి భోపాల్ వెళ్ళింది. అక్కడ గాస్ లీక్ వలన ఎందరో చనిపోయారు. అమెరికా యాజమాన్యానికి చెందిన కంపెనీ వారికి అండగా మదర్ తెరీసా స్వయంగా వెళ్ళి, జరిగిన దానికి క్షమించమని కోరింది. అందరూ ఆశ్చర్యపడ్డారు.
చివరి దశలో మదర్ తెరీసాను సెయింట్ చెయ్యాలని పోప్ ప్రయత్నంచి సఫలుడయ్యాడు. మదర్ పేరిట రెండు అద్భుతాలు చూపాలి. బెంగాల్ లో ఒక కొండ జాతి స్త్రీకి పొత్తికడుపులో వ్రణాలు ఆమె పేరిట నయం అయినట్లు చూపారు. అదంతా బోగస్ అని హిచిన్స్ చూపాడు.
అయినా పట్టించుకోకుండా మదర్ తెరీసా మరణానంతరం, ఆమెను సెయింట్ అని పోప్ ముద్ర వేశాడు. సెయింట్ అనేది చాలా పెద్ద మత వ్యాపారం. అందులో ఆమెను పోప్ చేర్చాడు.
మతాన్ని అడ్డం పెట్టుకొని మదర్ తెరీసా జయప్రదంగా యాత్ర సాగించింది. ఇది అనన్య సామాన్యం.
*****
నరిసెట్టి ఇన్నయ్య ఎం. ఏ, పి. హెచ్. డి చేసి కొన్నాళ్ళు ఉస్మానియావిశ్వవిద్యాలయంలో పనిచేసి, ఆంధ్రజ్యోతి హైదరాబాద్ బ్యూరో చీఫ్ గా నార్ల వెంకటేశ్వరరావు సంపాదకత్వాన పనిచేసారు. ఎం.ఎన్.రాయ్ ప్రధాన రచనలన్నీ అనువదించారు. రిచర్డ్ డాకిన్స్ , శాం హారిశ్ రచనలు అనువదించారు. ప్రసారిత త్రైమాస పత్రికను పోలు సత్యనారాయణతో కలసి ఎడిట్ చేసారు. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తూ , రచనలు సాగిస్తూ వున్నారు.